Site icon Sanchika

జ్ఞాపకాల తరంగిణి-1

[box type=’note’ fontsize=’16’] జీవితంలోని వివిధ దశలలో తనకు కలిగిన విశేష అనుభవాలను సంచిక పాఠకులతో పంచుకుంటున్నారు డా॥ కాళిదాసు పురుషోత్తం. [/box]

[dropcap]నే[/dropcap]ను జీవితంలో ఎంతమందికో రుణపడ్డాను. సమాజం నాకిచ్చిన దాన్లో శతాంశం నేను సమాజానికి తిరిగి ఇచ్చినా అంతే చాలు! అదే తృప్తి.  అంతా నా గొప్పే అని ఏనాడు అనుకోలేదు. నా వ్యక్తిత్వాన్ని, జీవితాన్ని తీర్చిదిద్ది నడిపించిన మహనీయులకు వినమ్రంగా నమస్కరిస్తూ కొన్ని సంఘటనలు రాస్తున్నా!

***

“మీదేవూరు?”

“మాది నెల్లూరు?”

“మీ ఇంటి పేరు?

“మా నాయన కాళిదాసు వెంకట సుబ్బాశాస్త్రి గారు”

“మీదే శాఖ?”

“మేము ములికినాటివారం”

“ములికినాడు ఎక్కడో నీకు తెలుసా?”

“తెలియదండీ! రామప్ప గుడి ప్రాంతంలో ములుగు గ్రామం ఉందట! బహుశా అక్కడ్నించి వలస వెళ్లి వుంటాము.”

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు ఎం.ఏ. చదువుతూ సుప్రసిద్ధ శాసన పరిశోధకులు, చరిత్రకారులూ డాక్టర్  నేలటూరి వెంకటరమణయ్య గారిని తొలిసారి కలిసినపుడు మా మధ్య జరిగిన సంభాషణ ఇది. కడప జిల్లాలో సిద్ధవటం ప్రాంతం, పుష్పగిరి ప్రాంతాన్ని ములికినాడు అంటారని వారు వివరించే వరకు మా మూలాలు కడప జిల్లాలో ఉన్నాయని తెలియదు.

“మీ శాఖలో గొప్పవారి పేర్లు చెప్పగలవా?”

వారడిన ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు. మౌనంగా వారి ఎదుట నిలబడి వున్నాను.

“మానవల్లి రామకృష్ణ కవి గారి పేరు చెప్పు. త్యాగయ్య మావాడని చెప్పు” వారన్నారు.

ఉద్యోగ విరమణ చేసిన తర్వాత గానీ ఈ శాఖాభేదాల చరిత్ర గురించి నేనేప్పుడూ పట్టించుకోలేదు.

ములికినాటి వారి మీద కన్నడ భాషలో గొప్ప పరిశోధన జరిగింది. డాక్టర్ టి. వి. వెంకటాచల శాస్త్రి గారి థీసిస్ ప్రతి తెప్పించి, కన్నడ వచ్చిన మిత్రుల సహకారంతో చదివాను. 7 – 8 శతాబ్దాలకే కడప జిల్లా శాసనాల్లో ‘ముళికినాడు’ ప్రస్తావన వుంది. మా పూర్వులు అక్కడి నుంచి వచ్చి వుంటారు కాబోలు. ములికినాటి ‘మాలలు, మాదిగలు’ కూడా వున్నారు. ఆ పదం ఒక దేశాన్ని గురించి చెప్తుంది, ఒక నాడును గూర్చి చెప్తుంది.

అసలు మా పూర్వులది తూమాడు అగ్రహారం. మా నాయన కాలం వరకు అక్కడే ఉన్నారు. తూమాడు ప్రకాశం జిల్లాలో ‘ముసి’ అనే నది ఒడ్డున వుంది. మా తాత చెంచురామయ్య గారు పెద్ద ఎత్తున వ్యవసాయం చేసి రుణగ్రస్తులై ఆ పొలాలన్నీ అమ్మవలసి వచ్చింది.

అప్పటికి ఒంగోలు ప్రాంతంలో పొగాకు పైరు ప్రవేశించలేదు. 1951లో మా అమ్మా నాయనల వెంట తూరుడు వెళ్ళి మా 8 దూలాల పట్టె పెంకుటిల్లు చూశాను. ముసికి చాలా దగ్గరలో. ఆ ఇంట్లో అమ్మ, నాయన పెద్దక్క పెళ్ళి నిర్వహించారు.

మా నాయన గారిని గురించి మరొకసారి రాస్తాను. ఆయన గొప్ప పండితులుగా, విద్వాంసులుగా పేరు తెచ్చుకొని 1937 కల్లా నెల్లూరులో స్థలం కొని ఇల్లు కట్టారు. పూర్వం అక్కడ పొగాకు తోటలుండేవట. తోటలు పోయినా, మా ఇల్లున్న ప్రాంతం, ఐదారు వీధులు పొగతోటగా, నగరానికి గుండెకాయగా మారింది. ఇప్పుడు దాదాపు ఆ ఇళ్ళన్నీ పోయి నర్సింగ్ హోమ్‍లు పుట్టుకొచ్చాయి. నేను 1942లో ఆ ఇంట్లోనే మా తండ్రిగారికి ఆఖరి సంతానంగా జన్మించాను. నాయన నెల్లూరుకు 7 మైళ్ళ దూరంలో గొలగమూడిలో పొలాలు కొని సొంత సేద్యం చేసుకొంటూ స్థిరపడ్డారు.

నా 13వ ఏట 1953 సెప్టెంబరు 30వ తారీఖున నాయనగారు కొంత కాలం మంచం పట్టి కాలం చేశారు. ఆ తారీఖు ఇప్పటికీ నా జ్ఞాపకాల్లో నిలిచిపోయింది. నాయన పార్థివ దేహాన్ని చూడడానికి వచ్చిన వారి శిష్యులు “శాస్తుర్లు గారు ఆంధ్ర రాష్ట్రం చూడకుండానే పోయారే!” అని విచారం ప్రకటించడం విన్నాను. తెల్లవారితే పొట్టి శ్రీరాముల వారి త్యాగఫలం ‘ఆంధ్ర రాష్ట్రం’ ఉనికిలోకి వస్తుంది. నెల్లూరు టౌన్‍ను రాష్ట్రావతరణ కోసం ముస్తాబు చేస్తున్నారు! అలంకరిస్తున్నారు! మేనత్త ఆదెమ్మ రిక్షాలో నన్ను తన ఒడిలో కూర్చోపెట్టుకొని శవం ముందు పెన్నా నదికి తీసుకొని వెళ్ళింది. ఆమే నా చేయి పట్టుకొని నా చేత కొరివి పెట్టించింది ఆ సాయంత్రం ముసురుతున్న చీకట్లలో.

అన్ని కష్టాలను, ఒడిదుడుకులను ఎదుర్కొని సహించే అనుభవాన్ని జీవితం నేర్పింది. మా సొంత సేద్యాన్ని పర్యవేక్షించడానికి అమ్మ నా మేనత్తకు అండగా గొలగమూడి వెళ్ళిపోయింది. అక్కడ పొలమంతా నాయన స్వయంశక్తితో సంపాదించినదే! ఆయన పదేళ్ళు సాగించిన వ్యవసాయ భారాన్ని అమ్మ అందుకొని మోసింది. అప్పుడు అమ్మకు సుమారు 45-46 ఏళ్ళ వయస్సు.

ఆ ఏడే నేను థర్డ్ ఫాంలో చేరాను. మా ఇంట్లో ఒక భాగంలో దంపతులు బాడుగకుండేవాళ్ళు. వాళ్ళే నాకు తోడు, సహాయం.

సతీమణి సత్యవతి గారితో రచయిత

మా పల్లెలో వీధి బడి (Pial School):

నాయన నన్ను ఎప్పుడూ బడికి పంపలేదు. ఊహ వచ్చిన నాటి నుంచీ తన వెంట తిప్పుకుంటూ, వీలు చిక్కినప్పుడల్లా చదువు చెప్పేవారు. ఆ విధంగానే రాయడం, చదవడం నేర్చుకొన్నాను. వనౌషాధి సర్గ తప్ప అమరకోశం నోటికి వచ్చింది. శబ్దమంజరి కంఠోపాఠం పట్టాను. రఘువంశంలో రెండు సర్గలు చదివించారు. పెద్ద బాలశిక్ష – బల్లి శకున శాస్త్రంతో సహా నోటికి వచ్చు. నా ఎనిమిదవ ఏట కాబోలు కొద్ది నెలలు మా నాయనగారు నన్ను మా గొలగమూడి  వీధి అరుగు బడి (పయాల్ స్కూల్)‍కు పంపించారు. అక్కడ పెద్ద బాలశిక్ష ఒక్కటే పాఠ్య పుస్తకం. శతకాల్లో పద్యాలు, భాగవతంలో పద్యాలు నేర్పించారు. ఆ వీధి బడి ఉదయం 7.30 లోపల ఆరంభమయ్యేది. అన్ని వయసుల వాళ్ళు కలిపి 30 మంది విద్యార్థులుండేవారు. మా వూరు గొలగమూడిలో నూటికి 95% యాదవులే. ఐదేళ్ళ నుంచి 15 సంవత్సరాల వరకు వయసున్న పిల్లలు. కొద్దిమంది కమ్మలు, బలిజలు, వడ్డెరలు, పల్లెకాపులు. దొమ్మరుల ఇల్లు వేరుగా ఉండేవి. ఊరికి దూరంగా ‘మాలవాడ’, ‘మాదిగవాడ’. ఒకటి రెండు ఇళ్ళు దూదేకుల సాయిబులవి. మేము కాక, రెండిళ్ళు బ్రాహ్మణులవి.

మా వీధి బడిలో ఉదయం 9.30 వరకు చదువు, తర్వాత చద్దన్నాలకు వెళ్ళేది. తిరిగి వచ్చి దాదాపు 1.30 వరకు ఉండేవాళ్ళం. భోజన విరామం తర్వాత, మళ్ళీ బడి. ‘పయిటాల కూడు’ విరామం 4 గంటలకు. తిరిగి వచ్చి సందె చీకటి దాకా అక్కడే వుండేవాళ్లం. బళ్ళో నల్లబల్ల లేదు గాని, అయ్యవారి చేతిలో బెత్తం వున్నట్టు జ్ఞాపకం. పెద్దయ్యవారు చెబుతుంటే శ్లోకాలు, పద్యాలు – అన్ని వయసుల వాళ్ళూ పలికేవాళ్లు. కొందరు ‘మంద’ బుద్ధిమంతులని వాళ్ల చేత గుంట ఓనమాలు దిద్దించడం గుర్తుంది.

గొలగమూడి కొలను

పెద్దయ్యవారు ఉదయం 11 గంటల వేళ ఊరి కోనేటిలో స్నానం చేసి మడినీళ్ళ బిందె, బిందెపైన తామరాకులూ, పువ్వులూ పెట్టుకుని వచ్చేవారు. ఆయన వచ్చేవరకు పిల్లలు పులి జూదం, చీపురు పుల్లకు ముల్లు గుచ్చి వేప పుల్ల విల్లు సంధించి ఈగలను వేటాడడం వంటి క్రీడల్లో పొద్దుపుచ్చేవారు. మళ్ళీ వారు బడిలో ఒక వైపు కట్టిన బట్ట మాటున కట్టెల పొయ్యిలో వంట చేస్తూ అక్కడ్నించే ఏదో పాఠం చెప్పేది. మరొక దృశ్యం బడికి రాని మొండి పిల్లల్ని పెద్ద బాలురు పట్టుకుని ఈడ్చుకుంటూ బడికి తీసుకొని రావడం, ఆ పిల్లల ఏడుపులు, పొలికేకలు, పందిని బంధించి తీసుకుపోవడాన్ని గుర్తుకు తెచ్చేది.

దసరాలో పెద్దయ్యవారి వెంట – పిల్లలు చేతుల్లో విల్లు బక్కలు పొడిపోసిన భాగాలతో, కొందరు కోతి బొమ్మలతో వెళ్ళడం, ‘అయ్యవారికి చాలు ఐదు వరహాలు’ పద్యాలు చదవడం కూడా గుర్తుంది. దసరాల్లో విద్యార్థులు కోమటి సుబ్బయ్య అంగడిలో ఒక అణా లేక అర్ధణానో పెట్టి అరటావు తెల్ల కాగితం కొని బడికి తీసుకొని వెళ్ళేవాళ్లు. పెద్దయ్యవారు ముచ్చటైన దస్తూరితో భాగవతంలో నుంచో, శతకాల నుంచో పద్యాలు రాసిచ్చేవారు. సెలవల తర్వాత ఆ పద్యాలు అప్పగించాలి. మా పిల్లలకు ఇది గొప్ప ఆకర్షణ. ఈ వీధి బడి వైభవం నాలుగు నెలలు కూడా సాగలేదు. మళ్ళీ నాయన వెంట వుంటూ చదువుకున్నాను.

మా వూరి గ్రామదేవత గొలగమూడయ్య:

మా వూరి గ్రామదేవత గొలగమూడయ్య పేరు మీదుగానే మా వూరి పేరు గొలగమూడి అయింది. నా బాల్యంలో కొందరు యాదవ వృద్ధులు గొలగమూడయ్య మీద పాడిన జానపద గీతం సారాంశం నాకు గుర్తుండిపోయింది. నెల్లూరు పాలకుడు మనుమసిద్ధికి, యాదవ రాజు కాటమరాజుకు కంచెపుల్లరి విషయంగా జరిగిన పోరులో గొలగమూడయ్య అనే యాదవ వీరుదు కాటమరాజు పక్షంలో పోరాడి అమరుడయ్యాడట! కనపర్తిపాడు వాళ్ళు, మా వూరి వాళ్ళు గొలగమూడయ్య మావాడంటే మావాడని తగాదా పడ్డారు. కనపర్తిపాడు వాళ్లు గొలగమూడయ్య పార్థివ దేహం శిరస్సుని తీసుకొని వెళ్ళారట!

ఇప్పుడు మా వూళ్లో గొలగమూడయ్య గుడిలో శిరసు లేని మొండెం రూపంలో ఒక శిలని ఆరాధిస్తున్నారు. ఈ గుడి ఊరికి తూర్పు పొలిమేరలో వుంది. పూర్తి కప్పున్న చిన్న గుడి, దాని సముఖంలో ఎత్తుగా అరుగు లేదా బలివితర్ది. ఆ అరుగు మధ్యలో మూడు కొయ్యలు పాతి వుంటాయి. మూడేళ్ళ కొకసారి కొలువు జేస్తారు. ఈ గుడి పూజార్లు నా బాల్యంలో జంగాలు, తర్వాత పల్లెకాపులు పూజారులుగా కుదిరారు. ఆ రోజుల్లో పూజారి ఒక వెదురు పేళ్ళ తట్టకు ఎర్ర మట్టి అలికి, ఇంటింటికీ ఉదయం వస్తే, గృహస్థులు పావుశేరు బియ్యం ఆ తట్టలో పోసేవారు. మాసూలప్పుడు పూజారి పెద్ద బుట్టతో కళ్ళాల వద్దకు వస్తాడు. మేలురాసి మీద బుట్టతో ఒక్కసారిగా ముంచి వడ్లు తీసుకొనేవారు. దాదాపు రెండు కుంచాల వడ్లు వచ్చేవి. అట్లా అందరి కళ్ళాల వద్దకూ వెళ్ళి వడ్లు తెచ్చుకోడం గ్రామంలో ఒక ఆనవాయితీగా, సంప్రదాయంగా కొనసాగుతోంది.

(ఇంకా ఉంది)

Exit mobile version