Site icon Sanchika

జ్ఞాపకాల తరంగిణి-10

[box type=’note’ fontsize=’16’] జీవితంలోని వివిధ దశలలో తనకు కలిగిన విశేష అనుభవాలను సంచిక పాఠకులతో పంచుకుంటున్నారు డా॥ కాళిదాసు పురుషోత్తం. [/box]

నా పిహెచ్. డి పరిశోధన కోసం

[dropcap]‘‘గో[/dropcap]పినాథుని వెంకయ్యశాస్త్రి, వెంకటగిరి సంస్థానం ఇతర కవులు’’ అని నా పరిశోధన శీర్షిక నిశ్చయమై వెంకటగిరిలో అడుగు పెట్టినప్పుడే కె. ఎల్. నారాయణరావు అనే న్యాయవాది, స్వాతంత్ర్య సమర యోధులు గోపినాథ రామాయణం నాకు బహూకరించారు. అవధానం శంకరయ్యగారనే విశ్రాంత తెలుగు ఉపాధ్యాయులు వెంకయ్యశాస్త్రి ‘‘కృష్ణజన్మ ఖండం (1887 ప్రతి) బహూకరించి ఆశీర్వదించారు. ఇట్లా వెంకటగిరి పౌరులే చాలా పుస్తకాలు ఇచ్చారు. కె. వి. ఆర్. A Family History of Venkatagiri Rajas ఇచ్చారు. సంస్థాన  గ్రంథాలయంలో పరిశోధిస్తున్న రోజుల్లో వెంకయ్యశాస్త్రి అముద్రిత రచన మారుతీశతకం లభించింది.

దానిని కాపి చేసి దివాకర్ల వెంకటావధాని గారికి ఇచ్చాను. ఆ రోజుల్లో వెంకయ్యశాస్త్రి మునిమనుమడు శ్రీనివాసమూర్తి విద్యుత్ శాఖలో ఇంజనీరుగా పని చేస్తున్నారు. వారిచేత అవధానిగారు మారుతీ శతకాన్ని ప్రచురింపజేశారు.

వెంకటగిరి రాజాగార్లు ఏ కవి పుస్తకమైనా అచ్చు వేయిస్తే కొన్ని ప్రతులు తమ గ్రంథాలయంలో ఉంచేవారు. కవిపండితులు ఒక ప్రతి దయిచేయమని ఉత్తరం – విజ్ఞాపన పంపుకుంటే పంపించమని దాని మీద ఆజ్ఞ వేసేవారు. వీరేశలింగం పంతులు తాను కవుల చరిత్ర మార్పులు, చేర్పులు చేసి మరొక ముద్రణ తలపెట్టామని, వెంకటగిరి సంస్థానంవారు ముద్రించిన గ్రంథాలను తనకు దయచేయమని, ధర చెల్లించైనా తీసుకుంటాననీ రాశారు. దానిమీద ‘పంపనవసరం లేదని ఆజ్ఞ’ వంటి నోట్ వుంది. ఆ కార్టును డాక్టర్ అక్కిరాజు రమాపతిరావుగారికి కాబోలు పంపించాను. నా పరిశోధనలో నెల్లూరు న్యాయవాది ఒంగోలు వెంకట రంగయ్య గారికి వీరేశలింగంపంతులు గారు రాసిన పోస్టు కార్డు కూడా లభించింది. రమాపతిరావుగారు ప్రచురించిన లేఖల్లో ఇవి చేరి వుంటాయి.

11 సంవత్సరాల వయసులో నా మేనత్త కుమారులు, ఆయుర్వేద వైద్యులు కోడూరు వెంకటరమణయ్య గారి వద్ద గుడ్లదొన గ్రామంలో రెండు నెలలున్నా. ఆయన ఒక వేదపండితుల వద్ద నాకు పురుషసూక్తం, మంత్రపుష్పం కొన్ని మంత్రాలు చెప్పించారు. 18 సంవత్సరాల బ్రహ్మచారి ఒకరు మా బావగారి ఇంట్లో ఉండి   వైద్యం నేర్చుకొనేవాడు. ఒకనాడు అతను మా బావగారి పుస్తకాల్లోంచి ఏదో పుస్తకం తీసుకుని వస్తే ఇద్దరం కుతూహలం కొద్దీ తిరగ వేశాము. అందులో ‘శష్పవిజయం’ వంటి పద్యాలతో పాటు గోపినాథుని వెంకయ్యశాస్త్రి పేరుతో వున్న బ్రహ్మానందశతకం కూడా వుంది. మేమా పుస్తకాన్ని పరామర్శిస్తున్న సమయంలోనే మా బావగారి భార్య దాన్ని మా చేతుల్లోంచి లాక్కుని మండుతున్న పొయ్యిలో వేశారు. మేం బిత్తర పోయాము గాని, ఆమె మమ్మల్నేమీ అనలేదు. మళ్లీ పదిహేనేళ్ల తర్వాత నేను అదే గోపినాథుని వెంకయ్యశాస్త్రి తిరుగాడిన లక్ష్మీపురం, గుడ్లదొన వంటి ప్రదేశాలన్నీ మౌఖికచరిత్ర సేకరిస్తూ సంచరిస్తానని  ఊహించానా? ఆ శతకం మీద పరిశోధిస్తానని కలగన్నానా?

శ్రీ గోపీనాథుని వెంకయ్య శాస్త్రి

శతక చరిత్రకారులందరూ గోపినాథుని వెంకయ్యశాస్త్రిని బూతు పద్యాల కవుల లెక్కలో వేశారు. ఆ శతకం ఉపోద్ఘాతంలోనే వెంకయ్యశాస్త్రి వెంకటగిరి జమీన్ దారు సర్వజ్ఞ కుమార యాచమ నాయుడి  (27వ తరం) ఆజ్ఞ ప్రకారమే శతకాన్ని రాసినట్లు పేర్కొన్నా, ఆ విషయాన్ని విమర్శకులు పరిగణించలేదు. అంతటి మహారాజు ఇటువంటి శతకం రాయించరని, దోషం కవి నెత్తికే అంటగట్టారు.

వెంకటగిరి జమిందారుల గ్రంథాలయంలో వెంకయ్యశాస్త్రి తన ‘ఏలినవారికి’ పంపుకున్న మూడు జాబులు లభించాయి. అవికాక రాజాగారు స్వహస్తాలతో శృంగారానుభవాలను రాసిపెట్టిన కొన్ని కాగితాలు కూడా లభించాయి. ఈ పద్యాల “నమూనా కాగితాల” సహాయంతోనే బ్రహ్మానంద శతక కర్తృత్వాన్ని నిర్ణియించి, అది హార్డు పోర్నో రచన అని నిరూపించి, అందులో కవిగారి పాత్ర ఎంతమాత్రమో నిర్ధారించాను.

1971 సెప్టెంబర్ 3వ తారీకున ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వైవా జరిగి డాక్టరేట్ పట్టా అవార్డయినా, నా థీసిస్.ను ముద్రించడానికి  పూనుకోలేదు. నా థీసిస్ టైపు ప్రతిని కె. వి. ఆర్, త్రిపురనేని మధుసుదనరావు వంటి పెద్దలు చదివి కొన్ని సూచనలు చేశారు. కె. వి. ఆర్. నాకేమీ చెప్పకుండానే మిత్రులు పెన్నేపల్లి గోపాలకృష్ణకు రాసిన ఉత్తరంలో సామాజికాంశాలు లేకపోవడం పెద్ద లోపమన్నారు. గత నలభై ఏళ్ల అనుభవం వల్ల  చిన్నచిన్న వివరాలు కూడా రాసి పెట్టుకుంటూ  2013లో ఒక ప్రతిని ముద్రణకు సిద్ధం చేసి ప్రొఫెసర్ వకుళాభరణం రామకృష్ణకు పంపించాను. వారు అక్షరం అక్షరం చదివి 500 పుటలకు మించిన పుస్తకాన్ని నిర్దాక్షిణ్యంగా 300 పుటలకు తగ్గించమని సలహఇచ్చారు. మళ్లీ నేనే సంపాదకపాత్ర వహించి కొంతభాగం తొలగించాను. నా పరిశోధనలో చాలామంది ఊరు పేరూలేని కవులే. మొదటి సారి వాళ్ల పుస్తకాలను గురించి  నా పుస్తకంలో గ్రంథస్థం చేశాను. అందువల్ల కొన్ని భాగాలు తొలగించడానికి మనసు రాలేదు. నా ‘‘ వెంకటగిరి సంస్థానం చరిత్ర, సాహిత్యం’’ పుస్తకాన్ని ప్రొఫెసర్ రామకృష్ణ పరిచయం చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సతీర్థులైన ఆచార్య రవ్వా శ్రీహరి అభినందన పూర్వకంగా నాలుగు మాటలు రాయడమే కాక, పుస్తకావిష్కరణ సభలో పాల్గొన్నారు.

నా పరిశోధన గ్రంథం ఆవిష్కరణ

మా అబ్బాయిలు పుస్తకావిష్కరణ సభ వెంకటగిరిలో ఏర్పాటు చేద్దామన్నారు. అప్పుడే  డాక్టర్ వెలుగోటి భాస్కర సాయికృష్ణ యాచేంద్ర మా యింటికి వచ్చారు. పుస్తకావిష్కరణ సభ సంగతి చెప్పగానే వెంటనే  అంగీకరించారు. వారు తమ పూర్వులైన రాజా సర్వజ్ఞ కుమార యాచమనాయుడు (1849- 1877 పరిపాలనాకాలం) సమగ్ర రచనల సంపుటాన్ని తయారు చేసే పనిలో నా సహకారం కోరారు. అట్లా 2014 జనవరి 12న వెంకటగిరి ఆర్. వి. ఎం. హైస్కూల్లో వెంకటగిరి సంస్థాన చరిత్ర, సాహిత్యం పుస్తకావిష్కరణ సభ జరిగింది.

గ్రంథావిష్కరణ

వెంకటగిరి వాసులు, 85 ఏళ్ల వయోవృద్ధులు  మా బావగారు శ్రీ యస్.యల్. నరసింహం గారు కూడా వేదిక మీదకు వచ్చి సభలో పాల్గొన్నారు. వారు వెంకటగిరి పోస్టు మాస్టరుగా పదవీ విరమణ చేసిన తర్వాత, సాయికృష్ణ యాచేంద్ర తండ్రిగారి కోరికను మన్నించి కలిచేడులోని వారి మైకాగని మేనేజరుగా కొంత కాలం పనిచేశారు, వెంకటగిరిలో మా బావగారి మిత్రులు, పురప్రముఖులు దాదాపు వంద మంది సభకు హాజరయ్యారు. సాయికృష్ణ చేతులమీదుగా పుస్తకావిష్కరణ వైభవంగా జరిగింది.

గ్రంథావిష్కరణ

ఆచార్య రవ్వా శ్రీహరి అభినందన తర్వాత, మా బావగారు నేను వెంకటగిరిలో  పరిశోధన చేసిన రోజులను స్మరిస్తూ ‘‘ఈ రోజు ఈ సంస్థాన చరిత్ర, సాహిత్య పోషణ మీద మావాడు ఇంత మంచి పుస్తకం తెచ్చాడు. మా వాడు రెండు మూడేళ్లు ఎన్నెన్నో గ్రంథాలయాల్లో పరిశోధించాడు. మావాడి మీద రాజాగారి గ్రంథాలయంలో పుస్తకాలన్నీ తీసుకెళ్లాడని ఆ రోజుల్లో అభాండం వేసి ప్రచారం చేశారు. “ఏదీ మీ గ్రంథాలయం, ఆ వ్రాత ప్రతులు, పుస్తకాలు ఏం చేశారు?’’ అంటూ ఆయన వెంకటగిరి పౌరులకు విన్నవించవలసిన విషయాలన్నీ  విన్నవించారు. మా బావగారంటే వెంకటగిరిలో చాలా గౌరవ ప్రదమైన వ్యక్తి. పౌరులందరికీ తెలిసిన సీనియర్ సిటిజన్. మా బావగారి మనస్సులో ఎన్నాళ్లనుంచో దాగివున్న అక్కసంతా, మౌనంగా భరించిన వేదనంతా వారి ఉపన్యాసంలో వెలికి వచ్చింది. ఆ రోజుల్లో సాయికృష్ణ యాచేంద్ర ‘రాగరాగిణి’ సంగీత పూర్వక అవధానం ప్రతి సభలోను బావగారు ఆ ప్రక్రియను గూర్చి పరిచయం చేయాల్సిందే. బావగారిని ఢిల్లీలో జరిగిన అవధానసభకు కూడా రాజాగారు వెంటపెట్టుకొని వెళ్లారు.

గ్రంథావిష్కరణ సందర్భంగా రచయితకు సత్కారం
రచయిత రాజావారిని సన్మానిస్తూ

నా పుస్తకావిష్కరణ సభరోజు, సాయంత్రం సకుటుంబంగా డాక్టర్ భాస్కర సాయికృష్ణ యాచేంద్రను ‘నగిరి’లో కలిశాను. వారు మమ్మల్నందరినీ సంతోషంగా రాజభవనాలన్నీ తిప్పి చూపించారు. అదే మొదటిసారి నేను ‘నగిరి’లోకి వెళ్లడం, నగరు చూడక పోయినా, ఆ భవనాలు, రాజ కాంతల గదుల కిటికీలకు అమర్చిన ‘సోరనగండ్లు’ (తలపెట్టి వీధిలో దృశ్యాలను చూచేందుకు అనువుగా ఏర్పరచిన మెష్ వంటి ఏర్పాటు), నగరు ప్రవేశ ద్వారాల ముందు నిలబడి వుండే  దర్వానులు అన్నీ ఎన్నో ఏళ్లనుంచీ చూస్తూనే వున్నాను.

వెంకటగిరి సంస్థాన చరిత్ర సాహిత్యం పుస్తకావిష్కరణ సందర్భంగా డా. వి. భాస్కర యాచేంద్ర, వారి అన్నగారి కుమారులు శ్రీ రామప్రసాద్ (నీలం రంగు టీ షర్ట్), ప్రొఫెసర్ రవ్వా శ్రీహరి, రచయిత కుటుంబ సభ్యులు – సంస్థానం వెలుపల

పరిశోధన చేస్తున్న సమయంలో వెంకటగిరి చుట్టూ దట్టంగా విస్తరించి వున్న కాసాతోట (ఖాస్) లంగర్ ఖాన తోట, వేణుగోపాలయ్య తోట, కైవల్య నది దక్షిణ తీరంలో రాజుల ప్రైవేటు రుద్రభూమి, అక్కడ వీరమాతల దేవాలయం అన్నీ తిరిగి చూశాను. వెంకటగిరిలో పోలేరమ్మ జాతర, చాలా ముఖ్మమైన పండుగ అక్కడివారికి. నా బాల్యంలో గొల్లపాలెం వంటి వీధుల్లో జాతర మరుసటి రోజు మాంసం తోరణాలుగా కట్టి ఎండబెట్టేవారు.  విపరీతంగా జాతరలో అమ్మవారికి జంతుబలి జరిగేది. పెద్ద దున్నను నరికి దాని తలను అమ్మవారి ముందు పెట్టి గండ దీపం వెలిగించేవారు. ఈ సంప్రదాయలన్నీ తెలుసుకుంటూ వచ్చాను. మొత్తం మీద నేననుకోని రీతిలో నా ‘‘వెంకటగిరి చరిత్ర, సాహిత్యం’’  పుస్తకావిష్కరణ సభజరిగింది. పుస్తకం నా సొంత డబ్బులతోనే ప్రచురించాను. వెంకటగిరిలో ఒక యువకుడికి కొన్ని పుస్తకాలు అమ్మేందుకు అప్పగించాను. అయితే మరుసటి రోజు సాయంత్రం డాక్టర్ సాయికృష్ణ యాచేంద్ర నుంచి ఫోన్ వచ్చింది. వారు చాలా ఆవేశంగా మాట్లాడారు. నాకు ముందే తెలుసు జమీందారి వారసులు నేను రాసిన కొన్ని విషయాలను హర్షించలేరు, సహించలేరని. మరుసటిరోజు ఉదయం సాయికృష్ణ యాచేంద్రతో మాట్లాడాలని ప్రయత్నించాను. వారి సమీప వర్తులే ఎవరో ఫోన్ తీసి మాట్లాడారు. ‘‘నేను సాహిత్య చరిత్రకారుణ్ణి. ఎవరిని సంతోషపెట్టడానికి నేనీ పుస్తకం రాయలేదు.” వంటి నాలుగు మాటలేవో చెప్పి ఫోను పెట్టేశాను. నాలుగోరోజు వెంకటగిరిలో అమ్ముతానని పుస్తకాలు తీసుకున్న యువకుడు ఆరోగ్య కారణాలతో పుస్తకాలబంగి తిప్పి పంపించాడు. అదే సమయంలో దాదాపు తెలుగు దినవార మాస పత్రికలన్నీ నా గ్రంథాన్ని సమీక్షించాయి. వరవరరావు మేనల్లుడు ఎన్. వేణుగోపాల్ అంతర్జాల పత్రికలో సమీక్షిస్తూ, జమిందారీ పోషణలో వెలువడిన మొత్తం సాహిత్యాన్నే నిరాకరించే ధోరణిలో రాశాడు. హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ వి. రాజగోపాల్, ఈ పరిశోధన గ్రంథం అనేక పరిశోధనలకు ఆకరం కావచ్చని శ్లాఘిస్తూ రాశాడు. ఈ సమీక్షలు రావడం మొదలయ్యాక అనూహ్యంగా పుస్తకాల కోసం ఫోన్.లు రావడం మొదలైంది.

ఆశ్చర్యం ఏమిటంటే  జమిందార్ల కుటుంబాల వారే నాలుగేసి కాపీలు కొన్నారు. పిఠాపురం రాజావారి నుంచి పుస్తకాల కోసం డబ్బు అందింది. రిజిస్టరు పోస్టులో పుస్తకాలు పంపితే door locked  అని బంగీ తిరిగి వచ్చింది. కాకినాడ పి. ఆర్. కళాశాలలో ఇంగ్లీషు ప్రొఫెసరుగా చేసిన శ్రీ జాన్ త్యాగరాజు గారు రిటైర్ అయి పిఠాపురంలో వున్నారు. వారికి ఫోన్ చేస్తే ‘‘అది కాదులే! గడి తలుపులు తెరిచేందుకు అక్కడ ఎవరూ వుండరులే! నేనే రాజావారికి స్వయంగా అందజేస్తాను.‘‘ అని బంగీ తమకు పంపమన్నారు. అట్లా షుమారు 400 పుస్తకాలు అమ్ముడయ్యాయి. ఆ తర్వాత 2017 లో సాహితి- ఎమెస్కో సోదరసంస్థ నా థీసిస్ ను పునర్ముద్రణ చేసింది. మొదటి దానిలో అచ్చు పొరబాట్లు చాలా వరకు ఇందులో సవరించుకోగలిగాను. శ్రీ. వి. ఏ. కె. రంగారావు గారు ఓపికగా అచ్చుతప్పులు, తెలియక చేసిన తప్పులూ అన్నీ సవరించారు. వెంకటగిరి వారి స్పందన వారి దృష్టికి వచ్చింది. పెద్ద వుత్తరం రాసి నన్ను మెచ్చుకున్నారు. “ఈ పుస్తకం అచ్చుకాకుండా వుంటే ఎంతో చరిత్ర, సాహిత్యకృషి కాలగర్భంలో కలిసి పోయేదని, రహస్య పేటికలు తెరిస్తే కొందరికి బాధకలగడం సహజం’’ అనే అర్థంలో రాశారు. వారి వాక్యాలను ఒకటో రెండో తెలుగులోకి అనువదించి రెండవ ముద్రణ ఉపోద్ఘాతంలో ‘‘ముందుగా రెండు మాటలు’’ అని చేర్చాను.

‘‘ఈ పుస్తకం వెలుగు చూసి మూడేళ్లు దాటింది. దీన్ని ప్రచురించి దూషణ భూషణ తిరస్కారాలు అన్నీ అందుకున్నాను. వెంకటగిరికి అమ్మకానికి పంపిన పుస్తకాలన్నీ వెనక్కి పంపించారు. మరొక వైపు నూజివీడు, పిఠాపురం, బొబ్బిలి, వరంగల్ మొదలైన ఊళ్లనుంచి పుస్తకాలకోసం ఆర్డర్లు వచ్చాయి. కొన్ని మాజీ జమిందార్ల కుటుంబాల వారు పుస్తకం చదివి అభినందిస్తూ ఉత్తరాలు రాశారు. దాదాపు తెలుగు దినవారపత్రికలన్నీ పుస్తకాన్ని విపులంగా సమీక్షించాయి. “మీరు గ్రంథస్థం చేయక పోయి ఉన్నట్లయితే ఆ చరిత్రంతా కాల గర్భంలో కలిసి పోయేదని, మీరు పక్షపాత దృష్టితో రాసినట్లు ఎక్కడా అన్పించలే”దని శ్రీ. వి. ఏ. కే. రంగారావుగారు ఉత్తరాలు రాసి అభినందించడమేగాక, పుస్తకంలో దొరలిన ముద్రా రాక్షసాలను కూడా నా దృష్టికి తెచ్చారు. వారికి నా ధన్యవాదాలు.

‘రహస్య పేటికలు’ (Unsavory facts tumbling out of the closet) తెరిస్తే కొందరికి బాధ కలగడం సహజమని నా ఆత్మీయులు సర్ది చెప్పారు.

పుస్తకం అచ్చయిన కొన్ని నెలలలోపలే ప్రతులన్నీ చెల్లిపోయాయి..’’ అని ముగించాను.

నా పుస్తకం చదివి వెంకటగిరి రాజకుమారుల్లో ఒకరి రాణీగారు, 80 సంవత్సరాలు పై బడిన వృద్ధవనిత వెంకటగిరి అంతఃపురంలో తమ అనుభవాలను చక్కని దస్తూరీలో, మంచి తెలుగులో రాసి వి. ఏ. కే. రంగారావుగారి ద్వారా  నాకు పంపించారు. రచయిత్రి అనుమతితో ఆ వ్యాసం మిసిమి పత్రిక ద్వారా అందరికీ అందుబాటులోకి వచ్చింది. తప్పులెన్నినవారు, మెచ్చుకొని భుజంతట్టినవారు అందరికీ కృతజ్ఞుణ్ణి.

నా హితైషులు ఆచార్య బిరుదురాజు రామరాజుగారు

నా పరిశోధనకు పర్యవేక్షకులు మాత్రమే కాక, జీవితాంతం నన్ను, నా కుటుంబ సభ్యులను ఎంతో ప్రేమతో ఆదరించిన ప్రొఫెసర్ బి. రామరాజుగారు జీవించి వుండగా ఈ పుస్తకం తీసుకొని రాలేక పోయానన్న చింత మాత్రం మిగిలిపోయింది. ప్రొఫెసర్ రామరాజుగారిని గురించి రెండు మాటలు చెప్పాలి. వారి వంటి పర్యవేక్షకులు అరుదుగ్గా ఉంటారు. విద్యార్థులను చాలా ప్రేమగా చూస్తారు. భోజనం వేలకు ఇంటికి వెళ్తే భోజనం చేయకపోతే వప్పుకోరు. వెంకటగిరి జరీ చీరలు బాగుంటాయని విని అమ్మగారికి ఒకటి తెమ్మన్నారు. వేంకటగిరి హ్యాండ్లూమ్ వీవర్స్  కో ఆపరేటివ్ సోసియేటిలో చీర కొని పోస్టులో పంపించాను. చీర లోపల ఉన్న స్లిప్, పోస్టల్ పార్సెల్ మీద స్టాంపులు చూచుకొని నాకు వెంకటగిరికి   money పంపించారు. అలాగే మరొకసారి టేకు మంచం తయారుచేయించి  పంపమన్నారు. వారు దాని ఖరీదు, రవాణా ఖరీదు పుచ్చుకొనే దాకా వదిలిపెట్టలేదు. విద్యార్థులకు వచ్చే UGC స్కాలర్షిప్ లో కూడా నెల నెల కొంతమొత్తం వసూలు చేసుకొనే దరిద్రులు కూడా ఉన్న కాలం యిది. 1970 వేసవిలో హైద్రాబాద్లో ఉండి  తీసిస్ శుద్ధప్రతి  తయారు చేసి వారం వారం వరంగల్లువెళ్లి వారికి చూపించి సరిచేయించుకొని వెనక్కి వచ్చేవాణ్ణి. మొదటిసారి హోటల్ లో దిగి వారి ఇంటికి వెళ్లాను. హోటల్లో దిగిన సంగతి తెలుసుకొని డ్రైవర్ ను  తోడిచ్చి  హోటల్ ఖాళీ చేయించి నా బాగ్ తీసుకొని రమ్మన్నారు. ఆరోజు నుంచి వారింట్లోనే ఉండేది.

వెంకటగిరి చరిత్ర సాహిత్యం ఆవిష్కరణ

నా సాహిత్య కృషిలో సగభాగం వేంకటగిరి చరిత్ర సాహిత్యం పుస్తకానికి సంబంధించినదే.  బాల్యంలోనే వెళ్లిపోయారు నాయనగారు, అమ్మ 84 ఏళ్ల పూర్ణజీవితం జీవించారు. నా గ్రంథాన్ని అమ్మకూ, నాయనకూ తప్ప ఎవరికి సమర్పించుకోగలను!

నా పుస్తకం అంతటా మౌఖిక చరిత్రను ఉదాహరిస్తూ రాసిన విషయాలున్నాయి. 1968 లో వెంకటగిరి దివాణం మేనేజరు కొట్టిడి విశ్వనాథం గారని ఒక పెద్దాయన వుండేవారు. అప్పుడప్పుడు నేను చేస్తున్న పని చూడడానికి వచ్చేవారు. ఒక రోజు చాలా అలసి పోయి దివాణం వెలుపల నిలబడే, సర్వజ్ఞ కుమార యాచేంద్ర (27) గురించి కొన్ని విషయాలు చెప్పారు. ‘‘లంజెబిడ్డను పల్లకీలో కూర్చొబెట్టుకొని వూరేగిన లజ్జలేని మనిషి’’ అని కొంచెం బాధగా అన్నారు. పుస్తకం అచ్చుకు వెళుతున్నప్పుడు నేను దినచర్యలో రాసుకున్న ఆ మాట కనిపించింది. బ్రహ్మనంద శతకకర్తృత్వం నిర్ధారించేందుకు, ఆమాటను యధాతథంగా ఉపయోగిచుకొన్నా. డాక్టర్ సాయికృష్ణ యాచేంద్ర సర్వజ్ఞ కుమార యాచేంద్ర ఆకస్మిక రాజ్యత్యాగానికి మరొక కారణం చెప్పారు. ‘‘ఆయన అభిమాన స్త్రీలలో ఒకరికి రవ్వలగాజులు చేయించారట! వారి తల్లి “నాయనా నీ భార్య (రాణిగారు)కు చేయించలేదే” అన్నదట కుమారుడితో. ఆయన కోపం పట్టలేక తల్లిని ఒక దెబ్బ వేశాడట! ఏమో, ఆ నిరంకుశ రాజు తల్లిగారి మందలింపు మాటను  కూడా సహించలేక పోయి వుంటాడు. అప్పుడు వారి కుమారులందరూ ఏకమై జమిందారు పదవిని విడిచి పెట్టాల్సిందే అని తండ్రిని బలవంత పెట్టారని, ఆవిధంగా ఆయన జమిందారు పదవిని త్యాగం చేశాడని సాయికృష్ణ యాచేంద్రగారు కుటుంబంలో అనూచానంగా వస్తున్న జ్ఞాపకాన్ని నాతో పంచుకున్నారు. నాపుస్తకం రాక ముందు ఈ సంగతి వినివుంటే దీన్నీ చేర్చేవాణ్ణే. అందుకే ప్రొఫెసర్ వకుళాభరణం రామకృష్ణగారు ఎత్తి చూపినట్లు షుమారు 500 పాద సూచికలు (footnotes)  వచ్చాయి.

నేను మార్క్సిజం చదువుకోలేదు. కాని అత్యధిక సంఖ్యాకుల పక్షం వహించానని ఉపోద్ఘాతంలో రాశాను. జమిందార్ల మీద వచ్చిన కొన్ని పరిశోధన గ్రంథాల్లో కనిపించే ఫలానా జమిందారు ఇన్ని తులాల రత్నాలహారం చేయించారని, గవర్నరు దంపతులకు విందులిచ్చారనీ- వగైరా వర్ణనల జోలికి నేను పోలేదు. రామరాజుగారు నా పరిశోధన ‘‘సాహిత్యానికి పరిమిత”మయితే చాలన్నారు. కాని, అంతకుమించి కృషి చేశాను.

డాక్టర్ భాస్కర సాయికృష్ణ యాచేంద్ర ఉత్తములు. రెండుమూడు మాసాల తర్వాత వారే స్వయంగా ఫోన్ చేసి నాతో మాట్లాడారు. వారితో నా పరిచయం, ఆత్మీయత వృద్ధి చెందాయి. నేను ఎవరిని పంపినా రాజ భవనాలన్నీ చూచేందుకు అనుమతించారు. వారివంటి నిగర్వి అరుదుగా ఉంటారు.

(ఇంకా ఉంది)

Exit mobile version