Site icon Sanchika

జ్ఞాపకాల తరంగిణి-13

[box type=’note’ fontsize=’16’] జీవితంలోని వివిధ దశలలో తనకు కలిగిన విశేష అనుభవాలను సంచిక పాఠకులతో పంచుకుంటున్నారు డా॥ కాళిదాసు పురుషోత్తం. [/box]

[dropcap]ది[/dropcap]వాకర్ల వెంకటావధాని గారు నా గురువు గారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వారు 1964లో ప్రొఫెసర్‌గా పదోన్నతి పొందారు. ఆ యేడే ఆ యూనివర్సిటీలో నేను ఎంఏ తెలుగులో చేరాను.

నేను ఉస్మానియాకు వెళ్లడం వెనుక పెద్ద కథ ఉంది. నా జీవితాన్ని అనేక యాదృచ్ఛిక సంఘటనలు ముందుకు నడిపించాయి.

నిన్న రాత్రి నా బ్యాచ్ విద్యార్థులను గుర్తు చేసుకొంటే ఎంవీయల్, సముద్రాల గోపాలకృష్ణమూర్తి, టీ.ప్రభాకరరెడ్డి, గాజుల వీరయ్య, ఓగేటి ఇందిర, సుధ, ఫణికుమారి, పేర్లు మాత్రమే గుర్తొచ్చాయి. మిగతా పేర్లు జ్ఞాపకం రాలేదు. రాత్రి పది దాటింది. మిత్రులు ఆచార్య నిత్యానందరావు (ఉస్మానియా) గారికి ఫోన్ చేశాను. చాలా కాలం క్రితం మా ఎం.ఎ. బ్యాచ్ గ్రూప్ ఫోటో అడిగి తీసుకొని ఉన్నారు. వారు వెంటనే రాసుకోండి అంటూ పేర్లు, మార్కులు, మా క్లాస్ హాజరు పట్టికలో నెంబర్ కూడా చెప్పారు. నాకు ఇంకా గుర్తుంది, నా నంబర్ 1057. మనుషులకు కొన్ని ఆసక్తులు ఉంటాయి. ఆచార్య నిత్యానందరావుగారు నిరంతర పరిశోధకులు. పరిశోధన వా‌రికొక Passion. లేకపోతే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ చదివిన విద్యార్థుల జాబితాలన్నీ సేకరించి భద్రపరచడమేమిటి?

ఎంఏలో నా ముగ్గురు సహాధ్యాయులు సముద్రాల గోపాలకృష్ణమూర్తి, ఎం.వి.ఎల్, టి.ప్రభాకరెడ్డి
ఓగేటి ఇందిరాదేవి, ఎం.ఎ.లో రచయిత క్లాస్‌మేట్

ఎం.ఎ.లో నాతో కలిసి చదువుకొన్న వారిలో ఓగేటి ఇందిరాదేవి మంచి విదుషీమణి, ఆమె మా తరగతి విద్యార్థినులలో ప్రథమ స్థానంలో నిలిచినందుకు మాడభూషి హనుమంతరావు స్మృత్యంకితంగా ఆమెకు స్వర్ణపతకం బహూకరించారు. ఆమె మంచి రచయిత్రి. కథలూ, నవలలూ వ్యాసాలు రాశారు. ఆమె ఇప్పుడు లేరు. వీరయ్య 1975లో నాకు హంపి యాత్రలో కనిపించి తాను బళ్లారిలో లెక్చరర్‌గా చేస్తున్నట్లు చెప్పాడు. సుధ ఇల్లు దేవల్టన్ రోడ్డు, సికింద్రాబాదులో అన్న సంగతి కూడా గుర్తుకొచ్చింది. 20 ఏళ్ల క్రితం అనుకోకుండా తను సిటీ బస్‌లో కన్పించి, బస్సు దిగుతూ ‘జీవితం చాలా సంతృప్తినిచ్చింద’ని అన్నది. తను ఏదో హైస్కూలులో పనిచేస్తోంది. డాక్టర్ టి. ప్రభాకరరెడ్డి ఏ.వీ. కాలేజీలో తెలుగు శాఖాధిపతిగా చేసి ఇటీవల వెళ్లిపోయాడు. చాలా మంచి మిత్రుడు. సముద్రాల గోపాలకృష్ణమూర్తి క్షేత్ర ప్రచార శాఖలో పనిచేస్తూ ఢిల్లీలో రోడ్డు ప్రమాదంలో పోయారు, ఆయన మా అందరికన్నా పెద్దవారు. యమ్వీయల్ నూజివీడు ధర్మా అప్పారావు గారి కళాశాలలో ఒక దివ్యతార లాగా వెలిగిపోతూ 46 ఏళ్ళవయసులో స్టేషన్ రాకముందే తొందరపడి దిగిపోయాడు. అతను బాపు, రమణలతో కలిసి నిర్మించిన ముత్యాల ముగ్గు గొప్ప విజయాన్ని సాధించింది. జర్నలిస్ట్, కాలమిస్టు, గొప్ప వక్త, కవి, కథలు, నవలలు రాశాడు.

నాకు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎ హాస్టల్లో ప్రవేశం లభించింది. హాస్టల్ విద్యార్థులు రాత్రి చాలా పొద్దుపోయేవరకు చదివేవారు. సోషలిస్టు పార్టీకి చెందిన స్వర్గీయ జైపాల్ రెడ్డి గారు కూడా ఎ హాస్టల్ లో ఉండేవారు. ఇప్పుడు టిఆర్‌యస్‌లో ప్రముఖులు శ్రీధర్ రెడ్డి గారు డిగ్రీ చదువుతూ మా హాస్టల్లో ఉండేవారు. ఆర్ట్స్ కాలేజీ బిల్డింగ్‌కు సమీపంలో చిన్న గుట్టమీద యూనివర్సిటీ లైబ్రరీ. ఉదయం 8 గంటలనుంచి రాత్రి 10వరకు చదువుకోవచ్చు. స్టూడెంట్స్ ఎక్కువ కాలం లైబ్రరీలో గడిపేవారు. రాత్రి పదిగంటలప్పుడు విద్యార్హులు పెద్దగా మాట్లాడుతూ భయం భయంగా హాస్టల్ రూంలకు వెళ్ళేవారు. గ్రంథాలయం భవనం ఎదురుగా రోడ్డు ఆవల Landscape Garden చాలా కళాత్మకంగా ఏర్పాటు చేశారు. వేసవి సమయంలో ఆ ఉద్యానవనంలో చెట్లనీడల్లో కూర్చొని విద్యార్థులు చదువుకొనేవారు. అభ్యుదయకవి శశాంక ఎం.ఎ.లో మాకు సీనియర్. వయసులో కూడా చాలా పెద్దవారు. మా హాస్టల్లోనే ఉండేవారు. చాలా మితభాషి. తెల్ల పైజామా, తెల్ల షర్ట్ , తల ఒక పక్కకు వంచి మాట్లాడేవారు. కాకినాడ నించి తన ‘నయా జమాన’ తదితర కవితాసంకలనాలు తెచ్చి ఇచ్చారు. వాటిని ఆబగా చూసి తీసుకున్న మరో మా మిత్రుడు కవితాపిపాసి {MVL}నరసింహారావు “పుస్తకం…స్వపరహస్తం గతంగతః” అన్నాడు చిలిపిగా.

PCN మాతోపాటు తెలుగు ఎంఏలో చేరి నెలలోపలే లింగ్విస్టిక్సుకు మారాడు. చాలా మితభాషి, స్నేహశీలి. ఆ రోజుల్లోనే శుక్తి పేరుతొ కవితా సంకలనాల ముఖపత్రాలకు బొమ్మలు వేసేవారు. నరసింహారెడ్డి పదవీ విరమణ చేసిన తర్వాతే తను ముఖపుస్తకం ద్వారా నాకు మంచి మిత్రులై, ఆకస్మికంగా నిష్క్రమించారు.

విశ్వవిద్యాలయం భవనానికి కూతవేటు దూరంలో రోడ్డుకు ఒకవైపు ఎ హాస్టల్, మరొకవైపు బి హాస్టల్. మా ఎ హాస్టల్ ముందు రోడ్ దాటగానే మెస్. హాస్టల్ ముందు నుంచి వెళ్ళే రోడ్ తార్నాకా లెక్చరర్స్ క్వార్టర్స్ దాటి ఆర్ ఆర్ ల్యాబ్స్‌కు వెళుతుంది. ఎ హాస్టల్ కు ఎదురుగా చిన్న గుట్ట మీద బి హాస్టల్ నిర్మించారు. ఆ భవనం త్రిభుజాకారంలో రెండతస్తులుగా వుంటుంది. ఎ హాస్టల్‌ను ఆనుకొనే సి హాస్టల్ ఉండేది రేకుల కప్పుతో. అందులో, సెప్టెంబర్ పరీక్షలు రాసే విద్యార్థులుండేవారేమో? దాని ఎదురుగా ఈత కొలను, ఆ దారులు రెండు వైపులా పచ్చని చెట్లతో చాలా అందంగా ఉండేవి. మా హాస్టలుకు సమీపంలో Non-residential Students’ rest house, అందులో చాలా సంగీత వాయిద్యాలు, మునిమాపువేళ కొందరు విద్యార్థులు సితార్ తదితర వాయిద్యాలు సాధన చేస్తూ ఉండేవారు. గాలి తరగలమీద ‘సారంగా తేరీ యాద్ మే’ అంటూ ఒక తీయని కంఠం రోజూ సంగీతం అభ్యాసం చేయడం స్మృతిపథంలో నిలిచిపోయింది. ఉర్దూ అభ్యుదయ కవి మగ్దూం మొహియుద్దీన్‌ను అక్కడే చూచినట్లు గుర్తు.

1964లో మా మెస్ ఛార్జ్, హాస్టల్ రూమ్ రెంట్ కలిపి నెలకు 90 రూపాయలకు మించి ఎప్పుడూ బిల్లు కాలేదు. చాలావరకు మధ్య తరగతి, ఆ క్రింది తరగతి విద్యార్థులే ఉండేవారు. విద్యార్థులే మెస్సులను నిర్వహించేవారు. ఏ హాస్టల్ సీనియర్ హవుస్ మానిటర్ మాణిక్యరావు సరదా మనిషి, హాస్యప్రియుడు. యూనివర్సిటీ కారిడార్లలో కొత్తగా చేరిన విద్యార్థినులను బెరుకు లేకుండా క్షణంలో పరిచయం చేసుకొనేవాడు. మా హాస్టల్లో జాన్, జెర్రీ అనే ఇద్దరు- ఒకరు అమెరికన్ ఇంకొకరు ఆస్ట్రేలియా దేశస్థుడు, వీరు కాక ఇరాన్, ఆఫ్గనిస్థాన్ నుంచి వచ్చిన విదేశీ విద్యార్థులుండేవారు. విదేశీ విద్యార్థులకు ప్రతేకంగా మెస్ ఉండేది.

మా రూంలో ముగ్గురు విద్యార్థులం, రాజేంద్రప్రసాద్, Economics MA final విద్యార్ధి. మహా మేధావి, చదువు తప్ప ఏమీ పట్టదని అనుకునేవారు. ఆర్థికంగా అంత వెసులుబాటు లేని కుటుంబ నేపథ్యం. అతనిది ఖమ్మం ప్రాతం. సమసమాజంకోసం కలలు కనేవాడు. అమెరికాలో స్థిరపడ్డారని విన్నా. రెండోవాడు నా మిత్రుడు సీతారామయ్యది మాచర్ల సొంత ఊరు. మూడో వాణ్ణి నేను. సీతారామయ్య నెల్లూరు విఆర్.సిలో బి.ఏ. ఇంగ్లీషు లిటరేచర్ చదివాడు. తను నా ఆత్మీయ మిత్రుడు. ఓయులో MA English literatureలో సీటు వచ్చినవిషయం అతనికి తెలియదు. ఆతని పేరు మొదటి లిస్టులోనే ఉంది. నా టెలిగ్రాం చూచుకొని వెంటనే హైదరాబాద్ వచ్చాడు. ఇంగ్లీషు శాఖ అధిపతి ప్రొఫెసర్ కుమార్ (1962లో గవర్నరు భీమ్‌సేన్ సచార్ మేనల్లుడని అనేవారు.) ను కలుసుకోగానే మావాడికి సీటిచ్చారు. యూనివర్సిటీవారు సెలక్టయిన విద్యార్థికి టెలిగ్రాం ద్వారా తెలిపినట్లయితే ఇన్ని తిప్పలు మాకు తప్పేవి. ఆనాటి విధానం అది. ఇంగ్లీషు శాఖ అధిపతి ప్రొఫెసర్ కుమార్ ఇంగ్లీషు కవితలు రేడియోలో చదివితే విన్నాను. అంత గొప్పగా కవితాపఠనం ఎప్పుడూ వినలేదు.

మా ఎదురు రూంలో గుల్బర్గా నుంచి వచ్చి కన్నడ MA చదివే కులకర్ణి రామారావు, మహారాష్ట్రనుచి Public Administration MA చదివే బంగ్ చేరారు. సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా చేసిన హరగోపాల్, IGNOU వీసీగా చేసిన ప్రొఫెసర్ శివలింగప్రసాద్ పబ్లిక్ ఆడ్మినిస్ట్రేషన్ MA చదివేవారు. ఇద్దరూ మా హాస్టల్ లోనే ఉండేవారు. హాస్టల్లో మా సీనియర్ వాసిరెడ్డి భాస్కరరావు కాకతీయ విశ్వవిద్యాలయంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ప్రొఫెసర్ అయ్యారు. చాలా సరదాగా స్నేహంగా ఉండేవారు. ఆదివారం రాత్రి మెస్‌కు సెలవు. విద్యార్థులు డెయిరీ ఫాం వద్ద టీషాపుల్లోనో, లేదా సికింద్రాబాదు వెళ్ళి సినిమా చూచి భోజనం చేసిగాని వచ్చేవారు. కొందరు సికిందరాబాదు స్టేషన్ ముందు ఆల్ఫా టీ షాపులో తినేవారు. ఆరోజుల్లో సిటీ బస్సులు రాత్రి 9 తర్వాత యూనివర్సిటీకి అందుబాటులో ఉండేవి కావు. సికింద్రాబాదు రైల్వే స్టేషన్ నుంచి మా హాస్టల్‌కు సైకిల్ రిక్షావాళ్ళు పదణాలు తీసుకుంటారు. అయితే కొందరు విద్యార్థులు, రిక్షా అతన్ని కూర్చోబెట్టి నలుగురో ఐదుగురో ఎక్కి తామే మార్చి మార్చి రిక్షా తొక్కి ఆ పదణాలే ఇచ్చేవారు. అట్లా తొక్కిన మిత్రుల్లో కె. ప్రసాదరావు ఐ.ఇ.ఎస్ అధికారి అయినారు. ఒకటి రెండు సార్లు కోఠి నుంచి గూడా అందరం హాస్టల్ కు నడచి వచ్చిన సందర్భాలున్నాయి.

మాకు ఆచార్య బిరుదురాజు రామరాజుగారు సరదాగా నవ్విస్తూ ఆంధ్రుల చరిత్ర పాఠం చెప్పారు. గోల్కొండ సుల్తానుల మతసహనం వంటి విషయాలు వారి క్లాసులోనే మొదటిసారి విన్నాను. పైఠాణి అనే మరాఠీ పదంలోనుంచే పవిట తెలుగులోకి వచ్చి తెలుగు వారికి అలవాటైందని, లేకపోతే తెలుగువారు పవిటలు వాడేవారు కాదని వారు హాస్యంగా అన్నపుడు అందరం నవ్వకుండా ఉండలేక పోయాము. రామరాజుగారు ఒకవిధమైన గ్రాంథిక స్పర్శ కలిగిన తెలుగు మాట్లాడేవారు. వారి భారీ విగ్రహం, తెల్లని ధోవతీ లాల్చీ, చక్కాగా మడత పెట్టిన పైపంచ, నుదిటిమీద నామం, చాలా ఆకర్షణీయంగా, గంభీరంగా ఉండేవారు. ఖండవల్లి రంజనం గారి వీడ్కోలు సభ కోఠి మహిళా కళాశాల ప్రాగణంలో జరిగింది. రామరాజుగారు కాస్త భయపెట్టినట్టు, కాస్త హాస్యంగా సభకు విద్యార్థులు తప్పక రావాలని ఆదేశించారు. ఆ సభలో రామరాజు గారు ఉపన్యసిస్తూ అందరూ ఇతరులకు టోపీ పెడతారు, రంజనం గారు తమకు తామే పెట్టుకుంటారని చమత్కరించారు. రంజనం గారు గాంధీ టోపీ పెట్టుకునేవారు.

నేను ఎంఏలో చేరిన కొద్ది రోజులకే quarterly సెలవులు ప్రకటించారు. హాస్టల్లో పింగాణి పళ్లేలలో భోజనం చేస్తున్నానని విని మా అమ్మ సెలవుల తర్వాత హైదరాబాదు వెళ్లేసమయంలో ఒక విస్తరాకులకట్ట కూడా ఇచ్చి పంపించింది. దాన్ని వాడలేనని ఆమెకు చెప్పలేకపోయాను. సెలవుల తర్వాత హైదరాబాద్ వెళ్లినవాణ్ణి పబ్లిక్ పరీక్షలు రాసిన తర్వాత గానీ ఇంటికి తిరిగి రాలేదు. ఆ రోజుల్లో విద్యార్థులందరూ చాలా కష్టపడేవారు. రాత్రి పదిగంటల తర్వాత ఏ గదుల్లో నైనా లైట్ వెలగక పొతే ఆ విద్యార్థులు ఊళ్ళోలేరని అర్థం, లేదా నిష్టదరిద్రులని అర్థం. నేను మొదటి రోజు నుంచి పరీక్షలు ముగిసేవరకు ఒకేరకంగా చదివాను. డెయిరీ ఫాం వద్ద టీతాగి తిరిగి రూంకు వస్తూ రాత్రి హాస్టల్ వరండాలో మెట్లకింద సుఖనిద్రలో ఉన్న పనివాళ్లను చూచి ఒకసారి ఏడ్చేశాను, జీవితంలో అట్లా పడుకొని హాయిగా నిద్రపోయే యోగం లేదేమో అనే దిగులు, నిరాశతో. ఒకరోజో రెండురోజులో చదువు జోలికి వెళ్లకుండా నిద్రపోయేది. కడుపులో భయంతో మళ్ళీ చదవడం. నాకు ప్రతిరోజూ అప్పకవీయంతో పోరాటం, పరీక్ష రాసేరోజు వరకు అనునిత్యం రెండు గంటలు చదివి, బట్టీపట్టి సాధించాను.

MA ప్రీవియస్‌లో దివాకర్ల వెంకటావధానిగారు శృంగారనైషధంలో ఒక ఆశ్వాసం, బాలవ్యాకరణం బోధించారు. అంతటి గొప్ప బోధకులను మళ్ళీ జీవితంలో చూడలేదు. వారి క్లాస్ అంటే అందరం అత్యంత శ్రద్ధాభక్తులతో వినేవాళ్ళం. పాఠం చెబుతూ పరీక్షల దృష్టిలో ముఖ్యమైన సూత్రాలవద్ద ఆగిపోయేవారు. ఒక సూత్రాన్ని రెండు మూడు క్లాసుల్లో వివరించేవారు, ఒకరోజు శృంగారనైషధం పాఠం చెబుతున్నారు, మేము తన్మయత్వంలో మునిగిపోయి వింటున్నాము. పీరియడ్ ఎప్పుడో ముగిసి, లంచ్ టైం కూడా దాటిపోయింది. వారూ గమనించలేదు. మాకు తెలియలేదు. వారి పాఠం ఒకమారు వింటే మరచిపోలేము. ఎంవీయల్ తరచు మద్రాసు వెళ్లి క్లాసులకు డుమ్మా కొట్టేవాడు. పదిరోజుల తర్వాత క్లాసుకు వచ్చి కూర్చొన్నాడు. అవధానిగారు “నరసింహారావు గారూ! ఇప్పుడు జరుగుతున్నది 156 వ సూత్రం” అని అతనివైపు చూస్తూ అన్నారు. ఆ మాటకే అతనికి తలకొట్టేసినంత పనైపోయింది. వారు ఆజానుబాహులు. తరగతిలో విద్యార్థి వైపు తమ పొడవాటి చేయి జాపి “ఏమండీ మీరు చెప్పగలరా?” అని అనేవారు. ఆ విద్యార్థి సమాధానం చెప్పలేకపోతే అదే మాదిరి మరొకరిని అడిగేవారు. సమాధానం చెప్పలేక పోయినా ఏమీ వ్యాఖ్యానించేవారు కాదు. ‘నువ్వు’ అని ఎవరినీ అనరు. అవధానిగారు శకటరేఫలు, అరసున్నాలు పాటించి గ్రాంథిక భాషలో రాయాలని మా విద్యార్థులను నిర్దేశించారు. కొంతమందిమి సప్రయత్నంగా గ్రాంథిక శైలి అలవాటు చేసుకొన్నాము. నెల్లూరులో మా గురువుగారు జానకిరామశర్మగారు నా దస్తూరి బాగాలేదని తరచూ imposition రాయించి కొంత దారికి తెచ్చారు. అవధానిగారి శిక్షణలో గ్రాంథికంలో రాయడం బాగా అలవడింది. కొందరం మా వ్యాసాలను ధైర్యంగా వారికి ఇచ్చిసరిచేయించుకొన్నాము. అందువల్ల మాకు చాలా మేలు జరిగింది.

హైదరాబాదులో చదువుకోవడం వల్ల అనేక సాహిత్య దిగ్దంతులను కలిసే అవకాశం కలిగింది. యూనివర్సిటీలో ఒక పర్యాయం లోహియా ఉపన్యసించారు. ఆచార్య అమరేంద్ర గురజాడ కథానికల మీద ఉపన్యసించారు. దిద్దుబాటు కథలో కథాలక్షణాలన్నీ ఎలా కుదురుతాయో వివరంగా చెప్పారు. ఎంవీయల్ నార్ల చిరంజీవి గారిని పరిచయం చేశాడు. చిరంజీవి గారు చాలా సౌమ్యులు, కవి అంటే ఇట్లా ఉండాలి అని అనిపించింది. వారి వద్ద విజ్ఞాన సర్వస్వాలు తెచ్చుకొని చదివాను. వారి వెంటవెళ్లి సారధి స్టూడియోలో విడుదలకు సిద్ధంగా ఉన్న, భానుమతిగారు తీసిన సినిమా అంతస్తులు ప్రత్యేక ప్రదర్శన చూచే అవకాశం కలిగింది. చిరంజీవిగారు పుస్తకాన్ని పువ్వులాగా చూచుకొనేవారు. వారు చలం గీతాంజలిని ప్రచురించి ఉచితంగా పంచిపెట్టారనీ, రెండవ ప్రచురణ ద్వారా ఆ ఖర్చు రాబట్టుకోవాలని ఆనుకొన్నట్లు, అంతలోనే చలం ఎవరో పబ్లిషర్ కు హక్కులు ఇచ్చేశారనీ, దాంతో చిరంజీవిగారు చాలా నష్టపోయారని ఎంవీఎల్ అన్నాడు. ఆ రోజుల్లో చిరంజీవి గారు సినిమాలకు పనిచేస్తున్నారు.

ఎంవీఎల్ నరసింహారావు బయట ఎక్కడో రూంలో ఉండేవాడు. అప్పటికే తనకు సినిమాలపిచ్చి, ఆరుద్ర, బాపు, రమణలతొ పరిచయం, బోలెడన్ని సినిమా కబుర్లు, నగరంలోని కవిపండితులతో స్నేహాలు, కవిపండితుల సరదా ముచ్చటలు వినిపిస్తూ ఎప్పుడూ సంతోషంగా నవ్వుతూ, నవ్విస్తూ ఉండేవాడు. తను ‘నక్షత్రసప్తకం’లో ఒకడు. ఈ మిత్ర బృందం శ్రీశ్రీ సంపాదకులుగా ‘నవత’ త్రైమాసిక నిర్వహించారు. ఎంవిఎల్ ద్వారా అందులో శాండిల్య, శిష్ట్లా పరిచయమయ్యారు. మొత్తం నవత నాలుగు సంచికలు కాబోలు తెచ్చారు. నెల్లూరులో నవత కోసం చందాలు సేకరించిచాను. సంవత్సరం చందా Rs 4 మాత్రమే. ఒకటి రెండు పర్యాయాలు సికింద్రాబాద్ ఆంధ్రాభవన్‌లో కేశవరావు, మరికొంతమంది కవులను యంవిఎల్‌తో పాటు కలిశాను. కేశవరావు గారు (నగ్నముని) యేది సీరియస్‌గా మాట్లాడుతున్నారో, ఏది హస్యంగా మాట్లాడుతున్నారో నాకు తెలిసేది కాదు. ఆ మాట ఎంవీఎల్‌తో అంటే “నాకూ అంతే” అన్నాడు. మొదటి సారి ఎంవిఎల్ ద్వారానే తెలుగు శాఖలో నియోగి, వైదీకి అనే గ్రూపులు ఉంటాయని విన్నా, తనకు ఉస్మానియాలో ఫస్టుక్లాస్ ఇవ్వరని కూడా అన్నాడు. కానీ ఉస్మానియాలో అధ్యాపకులు ఆతన్ని ప్రతేకంగానే చూసారు. నారాయణరెడ్డి గారు తనను చాలా ప్రేమగా చూసారు. అతను ఫస్ట్ క్లాస్లోనే పాసయ్యాడు.

ఎం వియల్. నరసింహారావు, ఎంఏ.లో సహాధ్యాయి, ముత్యాలముగ్గు నిర్మాత

ఎప్పుడూ ఎంవీఎల్ పెదవుల మీద చెరగని చిరునవ్వు, కాంతివంతమైన మెరిసేనేత్రాలు, ముఖంమీద వంకీలు తిరిగిన నల్లటి వెంట్రుకలు, పొడవు పొట్టిగాని తెల్లటి స్వరూపం, కనపడగానే బోలెడన్ని కబుర్లతో మమ్మల్ని మురిపించే వాడు. ఫైనల్ ఇయర్లో చివరి ఒక్కనెల నా రూంలో ఉన్నాడు. కారణం నాకు గుర్తు లేదు. ఉన్నపళంగా నా రూంకు వచ్చేశాడు. ఆరోజుల్లో హాస్టల్లో అతిథుల్ని ఉంచుకోవచ్చు. మెస్లో భోజనానికి guest fee చెల్లిస్తే చాలు. నా రూంకు వచ్చేముందు సికింద్రాబాదులో ఎవరో చుట్టాల ఇంట్లో ఉన్నట్లు గుర్తు. తాను ఒక సాయంత్రం కోఠి తాజ్మహల్లో టిఫెన్ తినాలని ఉందని చిన్న కోరిక కోరాడు. కోఠిలో బస్సు దిగగానే జ్యోతి మాసపత్రిక కొనమన్నాడు. అంత డబ్బు తేలేదు అని చెప్పి హోటల్‌కు తీసుకొనివెళ్ళాను. హోటల్ వెలుపల దుమ్ము కొట్టుకుని ఉన్న నా బూట్లకు పాలీష్ వేయించుకొని అర్థ రూపాయ ఇచ్చాను. మరుక్షణంలో అతను అలిగి చివాలున వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. తనను పట్టుకొని ఆపి, జ్యోతి కొనిచ్చినా అలక తీరలేదు. పుస్తకాలు, సినిమాలు, స్నేహితులు అతనికి ప్రాణం. ప్రతివారిలోనూ సుగుణాలను మాత్రమే ఎన్నేవాడు, ఎవరిని విమర్శచెయ్యడు. అతనిలో గొప్పగుణం అది. మేము రోజూ ఫైనల్ పరీక్షలు రాసి రూంకు తిరిగి వచ్చాక హాస్టల్ పబ్లిక్ ఫోనుకు ఇద్దరు యువతులు ఫోన్ చేసి చాలా ఆత్రుతగా అతను పరీక్ష ఎలా రాశాడని నన్నడిగి తెలుసుకొనేవారు. ఒక యువతి తనకు చెల్లెలి వరస. మరో యువతికి అతనంటే చాలా ఇష్టం లాగా అనిపించింది. అతనికి నేను ఫోన్ల సంగతి చెప్పేదిలేదు.

హైద్రాబాదులో రుతువులు వేరేగా ఉండేవి. ఆగస్టుకల్లా వానాకాలం అయిపోయి క్యాంపస్ అంతటా పచ్చగా గడ్డి మొలిచి కళకళలాడుతూ ఉండేది. డిసెంబర్లో మంచుకు, ఎండకు క్యాంపస్ అంతా బీడుభూమిలాగా అనిపించేది. నెల్లూరుతో పోల్చుకుంటే హైదరాబాద్‌లో చాలా చలిగా ఉండేది. నా గది కిటికీనుంచి రోడ్డు, విశాలమైన దృశ్యం కనిపించేది.

మొదటి సంవత్సరంలో ఆంధ్రులచరిత్ర, సంస్కృతి పేపర్ ఖండవల్లి లక్ష్మీరంజనం గారు, బిరుదురాజు రామరాజు గారు బోధించారు. ఖండవల్లి సోదరుల ఆంధ్రుల చరిత్ర సంస్కృతి గ్రంథం, సురవరంవారి సాంఘికచరిత్ర పాఠ్యపుస్తకాలు. శితాబుఖాన్ కైఫీయత్, తెలంగాణ శాసనాలు రంజనం గారు చెప్పేవారు. బిఏలో చరిత్ర చదివిన నాకు ఈ పాఠాలు చాలా ఆసక్తికరంగా, ఇష్టంగా ఉండేవి. ఆ ఏడే పదవీవిరమణ చేసిన ఖండవల్లి రంజనంగారు మహాభారతం సంశోధితప్రతి ప్రాజెక్ట్ అధిపతిగా ఉంటూ, ఎమిరిటస్ ప్రొఫెసర్ హోదాలో తరగతులకు వచ్చారు. వారి ప్రసన్నమైన గంభీరమైన ముఖం, తలమీద ఖద్దరుటోపి, నెమ్మదిగా శాసనాలు వివరించడం మాకు నచ్చాయి. క్లాసులో చాలా హుందాగా ఉండేవారు. ఒకరోజు ఎప్పటికీ మరచిపోలేని దృశ్యం చూచాను. ఆ రోజుల్లో తెలుగు డిపార్ట్మెంట్లో రంజనంగారికి తప్ప ఎవరికి కారు లేదు. అందరు సిటీ బస్ లోనే వచ్చేవారు. రంజనంగారు మధ్యాహ్నం రెండు గంటలవేళ ఆర్ట్స్ కాలేజీ భవనం ముందు వారి కారులో ఎక్కి కూర్చున్నారు. అప్పుడే వైస్ ఛాన్సులర్ డి ఎస్. రెడ్డిగారు కారు దిగారు. రెడ్డిగారు రంజనంగారి కారు వద్దకు వెళ్లి నిలబడే పది నిమిషాలు మాట్లాడారు. రంజనంగారు కారులో కూర్చొనే ఉన్నారు. రంజనంగారంటే యెంత గౌరవమో బోధపడింది. నాటి స్వేచ్ఛ యెంత గొప్పదో ఊహించుకోలేము. “రంజనంగారు తెలుగు డిపార్ట్మెంట్ హోదా పెంచారు” అనే ఒక ప్రశంస తరచుగా వినేవాళ్ళము. నాయని కృష్ణకుమారి, పల్లా దుర్గయ్య, చలంచర్ల రంగాచార్యులు, కేతవరపు రామకోటిశాస్త్రి గారు కూడా క్లాసులు తీసుకొన్నారు.

(ఇంకా ఉంది)

Exit mobile version