Site icon Sanchika

జ్ఞాపకాల తరంగిణి-16

[box type=’note’ fontsize=’16’] జీవితంలోని వివిధ దశలలో తనకు కలిగిన విశేష అనుభవాలను సంచిక పాఠకులతో పంచుకుంటున్నారు డా॥ కాళిదాసు పురుషోత్తం. [/box]

[dropcap]మా[/dropcap] తల్లిగారు 1992 జూన్ మాసంలో 84వ యేట చనిపోయారు. నేను కర్మకాండ ఏమీ చేయలేదు. నా ఆత్మీయ మిత్రులే శవవాహకులు. పదవరోజు నెల్లూరు మదర్ థెరిసా హోంలో భోజనాలు ఏర్పాటు చేశాము.

మా అక్కయ్యలు కనీసం ఆమె అస్థికలు ప్రయాగలో కలిపి రమ్మని కోరారు. వాళ్ళ మాటను గౌరవించి 13వ రోజే ప్రయాగకు బయలుదేరాను. నా శ్రీమతి నేను ఒంటరిగా వెళ్ళడానికి ఆంగీకరించక, తాను కూడా నాతో బయలుదేరింది. ఆడవాళ్లు ఇటువంటి కార్యాలకు వెళ్ళకూడదని ఆమె తల్లిగారు వారించబోయారు, కాని తను వినలేదు. ఆ రైల్లో మావంటి వారు మరికొందరు విషాద వదనాలతో. బెజవాడలో ఒకాయన ఇద్దరు భార్యలతో కాశీయాత్ర చేస్తున్నాడు. వారూ కొంచం పరిచయం అయ్యారు. మరుసటిరోజు సాయంత్రం అలహాబాద్‌లో రైలు దిగాము. ఒక కుర్రాడు మంచి తెలుగులో మమ్మల్ని పలకరించి తనవెంట రమ్మన్నాడు. ఏదో పొరపాటని అనుకొని అతనిమాట వినిపించుకోకుండా, రైల్వే విశ్రాంతి గృహంలో గదికోసం ప్రయత్నిస్తే ఖాళీలు లేవని సమాధానం వచ్చింది. హోటల్ కోసం ప్రయత్నించడానికి స్టేషన్ వెలుపలికి వస్తే విజయవాడ ప్రయాణీకులు, ఆ కొత్తవ్యక్తి మమ్మల్ని సాదరంగా పిలిచి తమతో రమ్మన్నారు. ఆ యువకుడు పురోహితుడట. ఇంట్లోనే యాత్రికులకు గదులు ఏర్పాటు చేస్తారట. ఆటోలో వాళ్ళ వెంట వెళ్ళాము. యమునా తీరానికి సమీపంలోనే ఆ పురోహితుల కుటుంబం నివాసం. చెరొకగది, లోపల చెక్క మంచం. విడిగా స్నానాల గదులు వగైరా. చీకటి పడగానే, మా స్నానాలు పూర్తయ్యాక సమీపంలో హోటల్‌కు మావెంట మనిషిని పంపించారు. ప్రయాణంలో అలసిపోయి వున్నాము కనక ఏదో తిని గదికి వచ్చిపడ్డాము. ఆ బ్రాహ్మణ కుటుంబం మర్యాదస్థులే.

మరురోజు ఉదయం స్నానాలు పూర్తయ్యాక ఏఏ పూజలు చేసుకోవాలో వివరాలు చెప్పారు. మేము పూజలు చేయమన్నాము. ఇద్దరు భార్యలతో వచ్చిన వ్యక్తి ఏవో హోమాలు చేయించుకొని వేయి రూపాయలు దక్షిణ ఇచ్చారు. ఉదయం 8 గంటలకే పడవమనిషి వచ్చి మా అయిదుగురినీ వెంటపెట్టుకొని నదివడ్డుకు నడిపించుకొని వెళ్ళాడు. అక్కడ ఆతని చిన్న పడవ మీద ఎక్కించుకుని నది వాలువెంట గంగాయమునా సంగమానికి తీసుకుని వెళ్ళాడు. నావలో అడుగు పెట్టేటప్పుడు, నావ దిగేప్పుడు అందరిచేతా జైబోలో గంగామాయీకీ అని అనిపించాడు. అలహాబాద్‌లో పౌరోహిత బ్రాహ్మణులు అసాధ్యులని, నిమజ్జనానికి వచ్చేవారిని సతాయించి చాలా డబ్బులు గుంజుతారనీ అతను దారిలో జాగ్రత్తలు చెప్పాడు. అతని నావలో స్థానికులు కొందరు. మా దంపతులమే నిమజ్జనం చేయను వచ్చిన తెలుగు వారం. అన్నట్లుగానే చిన్న చిన్న పడవలమీద వచ్చిన పౌరోహితులు మావద్ద అస్థికలున్న పాత్ర వుందేమోనని పరిశీలించి వదిలారు. నా శ్రీమతి ఆ చిన్న మట్టి పాత్రను తన హ్యాండ్ బేగ్ లోపల దాచింది. అరగంటలో సంగమానికి చేరాము. నావలను లోతు లేని చోట ఆపుకునే ఏర్పాట్లు ఉన్నాయి. అక్కడే స్నానం చేశాము. పొడిబట్టలు ధరించి మళ్ళీ నావ బయలుదేరేముందు నా శ్రీమతి అస్థికలున్న పాత్రను వెలికి తీసిపెట్టుకుని సంగమంలో కలిపింది. మా బోట్‌మాన్ కూడా శుభ్రంగా స్నానం చేసి పొడి బట్టలు కట్టుకుని తిరుగు ప్రయాణానికి తయారయ్యాడు. అందరిచేతా మళ్ళీ గంగామాయీకీ జై చెప్పించాడు. తిరుగు ప్రయాణం సుమారు గంట పట్టి ఉంటుంది. అలహాబాద్ నగరం దృశ్యాలు కనిపిస్తున్నాయి దారిపొడగునా. తన ఊరు యమునకు ఆవలి వైపు ఉందనీ, తన పేరు యోహాను అనీ చెప్పాడు అతను. బోటు దిగిన తర్వాత కూడా యోహాను మా నలుగురి సంచులను తానే తీసుకుని పౌరోహితుల ఇంట దింపివెళ్ళాడు. అలహాబాద్ దర్శనానికి పౌరోహితులే పెద్ద ఆటోను పిలిపించారు. అన్ని ఏర్పాట్లు చేసినా పూజలు చేయడానికి తప్ప వేరుగా ఇవ్వబోతే ఏమీ స్వీకరించలేదు.

సాయంత్రం ఆరుగంటలకు అలహాబాద్ స్టేషన్‌లో బెనారస్ వెళ్ళే రైలు పట్టుకుని ఉదయానికల్లా బెనారస్‌లో ఉన్నాము. ఆ రాత్రి అలహాబాద్‌లో ఎండబెట్ట కొట్టి వొళ్ళు తెలీకుండా నిద్ర పోయాను. ఆంధ్రా ఆశ్రమంలో దిగి కాశీ చూశాము. అప్పుడు యుపిలో బిజెపి ప్రభుత్వం. కాశీ చాలా బాగా ఉంటుందని ఊహించుకున్నాము. విశ్వనాథుని గుడి సమీపంలోని ఘాట్‌లో స్నానం చేయడానికి నా శ్రీమతి నిరాకరించింది. ఒడ్డు మీది టాయిలెట్ల నీరుకుడా బహిరంగంగా అక్కడే నదిలో కలుస్తోంది. వస్తాదులు వళ్ళంతా నూనె వంటికి పట్టించుకొని ఆ ఘాట్లో మునుగుతున్నారు. నీటిమీద నూనె పొరలాగా ఏర్పడి ఉంది. మా సంకట పరిస్థితిని చూచి ఒక చిన్న నావ మనిషి అందులో ఎక్కించుకొని గంగానది మధ్య ఏర్పడిన ఇసుక దిబ్బవద్దకు తీసుకుని వెళ్ళాడు. ఏకాంతంగా ఇద్దరం స్నానాలు చేసి బయలుదేరాము. పడవమనిషి నది వాలువెంట తీసుకుని వెళ్లి ఘాట్‌లన్నీ చూపించి, మొదట బయలుదేరినచోటే విడిచిపెట్టాడు. రెండు గంటలు మమ్మల్ని తిప్పి చూపినందుకు అరవై రూపాయలు మాత్రం తీసుకొన్నాడు. పైగా మేము కోరకుండానే మా కెమెరాతో ఫొటోలు తీసిపెట్టాడు.

ప్రపంచంలో మానవ నాగరికత అవిచ్ఛిన్నంగా కొనసాగుతున్న నగరాలలో బెనారస్ రెండోదట! మొదటిది డమాస్కస్ నగరమట. బెనారస్ సందులూ గొందులూ కాఫీ కోసం నేనూ నా సహచరి తిరిగి నిరాశపడి, బ్రూ పొట్లాలు కొని పాలు తెప్పించుకొని కలుపుకొని తాగాము.

బెనారస్ విశ్వవిద్యాలయంలో మా మేనత్త మనుమడు ఫిజిక్స్ డిపార్ట్మెంటులో ప్రొఫెసరు. తను విశ్వవిద్యాలయం అంతా తిప్పి చూపించి, మధ్యాహ్నం భోజనానికి ఇంటికి తీసుకుని వెళ్ళాడు, మా రాక కారణం తెలిసినా. తను ఫిజిక్స్ శాఖ అధిపతి ప్రొఫెసర్ రామచంద్రరావు గారిని పరిచయం చేశాడు. స్పేస్‌లోకి మనవాళ్ళు వెళ్ళినపుడు మెటలర్జికి సంబంధించిన ప్రయోగాలు వారే డివైస్ చేశారు. చాలా సరదా మనిషి. దాదాపు 30 ఏళ్ళయింది వారు బెనారస్‌లో స్థిరపడి. తన భాషను బట్టి తను ఏ ప్రాంతంవారో చెప్పమన్నారు. నేను ఎంతో సంకోచంతో మీరు కృష్ణకు ఆవలితీరంలో వారన్నా. వారిది విజయవాడేనట! ఇంట్లో అందరూ తెలుగే మాట్లాడుతారట. ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంటుగారిని కూడా నేరుగా వెళ్ళి కలవ్వొచ్చట. అంత ప్రసిద్ధులు నాబోటి తెలుగు అధ్యాపకుడితో, నా శ్రీమతితో మామూలుగా మాట్లాడారు. కోట్ల రూపాయలు పెట్టి దిగుమతి చేసిన ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్(?) ను మాకు చూపించమన్నారు. లోహాలలోని అంతర్భాగాలను పరీక్షిస్తారట దాని సహాయంతో.

ఆ మధ్యాహ్నం బెనారస్ అంతా తిరిగి చూశాము. బుద్ధుడు సారనాథ్‌లో మెదటిది పర్యాయం శిష్యులనుద్దేశించి బోధన చేశారు. ఆ పవిత్ర ప్రదేశం చూడడం గొప్ప అదృష్టంగా భావించాము.

మేము తిరుగు ప్రయాణానికి సిద్ధమైతే మాకు కాశీక్షేత్రంలో ఉండడానికి సౌకర్యం కలిగించిన ఆంధ్రా ఆశ్రమం వారు గయ వెళ్ళిరమ్మన్నారు. మా డబ్బు, విలువైన వస్తువులు అక్కడే ఉంచమన్నారు. గయావళులు చాలా అసాధ్యులని జాగ్రత్తగా వెళ్ళిరమ్మన్నారు. గయలో రాత్రి ఒంటిగంటకు దిగి ఆ రాత్రి ఫస్ట్ క్లాస్ వెయిటింగ్ రూంలో విశ్రాంతి తీసుకుని, ఉదయం స్నానాదులు ముగించి స్టేషన్ వెలుపలకు వచ్చి గయక్షేత్రానికి తీసుకుని వెళ్ళమన్నాము. రిక్షా అతను పదిహేను నిమిషాల తర్వాత ఒక హౌసింగ్ కాంప్లెక్సులోకి తీసుకుని వెళ్ళాడు. ఇరవై ముప్ఫైమంది పురోహితులు మమ్మల్ని చుట్టుముట్టి నానా ప్రశ్నలు వేస్తూ మాచేత బలవంతపు పూజలకు ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంతలో వెలుపల మనుషులు గుంపుగా వెళుతూంటే ఒక్క ఉదుటున ఇద్దరం పరుగెత్తి వాళ్ళలో కలిశాము. ఆవిధంగా ఆ పురోహితుల గుంపులో నుంచి తప్పించుకొని స్థానికుల సహకారంతో ఫల్గుణీ నదీ తీరానికి రిక్షాలో వెళ్ళాము. ఉదయం ఎనిమిది లోపలే నదివడ్డున పెద్ద రావివృక్షం లేదా అక్షయవృక్షం కింద కొందరు కర్మక్రతువులు, పిండప్రదానం చేస్తున్నారు. విషాదంగా ఆ వాతావరణం. ఫల్గుణి నదిలో మోకాలిబంటి నీరు కూడా లేదు కానీ నీటి అడుగున నిమజ్జనం చేయబడ్డ అస్థికల శకలాలు స్పష్టంగా సన్నని గులకరాళ్ళతో పాటుగ కనిపిస్తున్నాయి. ఎందుకో అక్కడ ఎక్కువ సేపు ఉండలేక పోయాము. ఉదయం వేళ సూర్య కాంతికి ఇరుదరుల దృశ్యాలు ఆనందించదగినవే అయినా మా మానసిక స్థితి అందుకు దోహదం చేయలేదు. ఘాట్ వడ్డున విష్ణుపాద్ ఆలయం చూశాము. చిన్న గుడి. గయాసురుణ్ణి విష్ణువు ఇక్కడ వధించాడని పౌరాణిక కథలు. గుడి మండపంలో విష్ణువు పాదాలు చెక్కి ఉన్నారు. పూజారులు సాత్వికులు. విష్ణుపాదాలను బౌద్ధులు కూడా దర్శిస్తారు. దశావతారాల్లో బుద్ధుడూ ఉన్నారు కదా!

ఇక్కణ్ణించి రిక్షా కట్టించుకొని బుద్ధగయకు వెళ్ళాము. బుద్ధుడు తపస్సు చేసి enlightenment పొందిన పవిత్ర ప్రదేశాన్ని, బోధివృక్షాన్ని దర్శించుకున్నాము. అక్కడ కొద్ది మంది పర్యాటకులు, కొందరు జపాన్, శ్రీలంక దేశాల యాత్రికులను కలుసుకొన్నాము. బుద్ధగయలో విదేశీ ప్రభుత్వాలు ఆయా దేశాలకు సంబంధించిన యాత్రికులు, సన్యాసుల కోసం మొనాస్టరీలను ఆయాదేశాల శిల్పకళా రీతులలో నిర్మించారు. గయ, బుద్ధ గయ జీవితంలో ఒకసారి చూడవలసిన ప్రదేశాలు. మేము నేపాల్ లో లుంభినీ వనాన్ని 2012లో దర్శించాము.

బోధివృక్షం, గయ

గయ నుంచి సాయంత్రం విషయం తెలియక ఒక పేసింజర్ రైల్లో ఎక్కాము. గయ విడిచిన తర్వాత మా రైలు పెట్టె కోళ్ళబుట్ట కన్నా అధ్వాన్నంగా మారింది. పైనా కిందా అంతా జనమే. నా శ్రీమతి ఆ రద్దీని తట్టుకోలేక నలిగిపోయింది. రాత్రి ఒంటి గంటకు రద్దీ పోయి పెట్టెకంతా యిద్దరమే మిగిలాము. మొగల్ సరాయ్ స్టేషన్‌లో ఎక్కడో మానవసంచారం లేనిచోట వొంటరిగా బిక్కుబిక్కుమంటూ నాలుగు దాకా గడిపాము. రైలుకంతా ఇద్దరమే ప్రయాణీకులం. వేకువన 4 గంటల తర్వాత బెనారస్ స్టేషన్లో దిగి ఆంధ్రాశ్రమం చేరాము. ఆశ్రమం మేనేజరు మా ముఖాలు చూచి ఒక నవ్వు నవ్వి నేను చెప్పాను కదా అన్నట్లు ఒక చూపు చూశాడు. అప్పుడు ఆంధ్రాశ్రమంలో గదుల్లో చాపలు కూడా లేవు. న్యూస్ పేపర్లు పరచుకొని పైన దుప్పటి పరచుకొని పడుకొన్నాము. బెనారస్‌లో గంగాకావేరి ఎక్స్‌ప్రెస్ ఎక్కాము. రిజర్వేషన్లు లేవు. టీసీలు బెర్తులు ఇచ్చారు. రైలు నెల్లూరులో ఆగదు. ఏ కారణం చేతో ఉదయం 7 గంటలకు కోవూరు ఔటర్‌లో ఆపారు. సాహసం చేసి రైలుదిగి రైలు పట్టాల వరుసలు దాటుతూ నెల్లూరు రోడ్డువైపు బ‌యల్దేరాము. మమ్మల్ని చూసి ఫర్లాంగు దూరంగా రోడ్డు మీద వెళ్ళే టౌన్ బస్సు వారు బస్ అపి పది నిమిషాలు వేచివున్నారు. అక్కడ ఆ సమయంలో transport దొరకదని తెలుసు కాబోలు. ఈ మొత్తం ప్రయాణంలో గయావళుల బెడద, గయనుంచి బెనారస్ ప్రయాణం మాత్రమే బాధపడ్డవి. మనుషుల్లో నూటికి 90 శాతం మానవత్వం కలిగేవుంటారని గయ యాత్ర గుర్తుచేస్తుంది ఎప్పుడూ.

(ఇంకా ఉంది)

Exit mobile version