Site icon Sanchika

జ్ఞాపకాల తరంగిణి-17

[box type=’note’ fontsize=’16’] జీవితంలోని వివిధ దశలలో తనకు కలిగిన విశేష అనుభవాలను సంచిక పాఠకులతో పంచుకుంటున్నారు డా॥ కాళిదాసు పురుషోత్తం. [/box]

నెల్లూరులో నా ఉద్యోగం, జీవితం:

[dropcap]1[/dropcap]972 మార్చ్ నెలలో శ్రీ వాకాటి సంజీవిశెట్టిగారు, మరికొందరు వైశ్యప్రముఖులు కలిసి నెల్లూరులో కొత్తగా డిగ్రీ కళాశాల నెలకొల్పారు. కరెస్పాండెంట్ శ్రీ సి.సి. సుబ్బారాయుడు గారి నేతృత్వంలో ఏర్పాట్లు జరిగాయి. తొలి ఏడు బి.ఏ, బి.కాం, ఇంటర్ కామర్సు క్లాసులు ప్రారంభించారు.

ఎస్.వి. విశ్వవిద్యాలయం ప్రతినిధిగా, ప్రొఫెసర్ జి.యన్. రెడ్డిగారు, ఈశ్వరరెడ్డి గారు, కమిటీ సభ్యలు కొందరు ఇంటర్వ్యూ చేశారు. జి.యన్. రెడ్డి గారు నా పీహెచ్‌డి వైవాకు కూడా వచ్చారు. ఎప్పుడు కలిసినా పురుషోత్తం అని ప్రేమగా పలకరించేవారు. అంతకు ముందు ఎస్.వి. తెలుగు శాఖలో ఒక పోస్టుకు జరిగిన ఇంటర్వ్యూకు వెళ్ళి వున్నా. వారు “పురుషోత్తం, నీకు పీజీ సెంటర్లో అవకాశం ఇస్తా, తిరుపతిలో మాత్రం నా విద్యార్థులకు ప్రాధాన్యం ఉంటుంది” అన్నారు. సర్వోదయలో మా అందరికి ఇంటర్వ్యూలు చాలావరకు నామకార్థమే. మా మామగారు చాలామంది కళాశాల కమిటీ సభ్యులకు ఆడిటరు కనక నాకు ఉద్యోగం ఇవ్వడం తప్పనిసరి అయింది. నాతో పాటుగా మార్కాపురం కాలేజీలో పనిచేస్తున్న మేడం సుబ్బరామయ్య కామర్స్ శాఖకు; జి, నరసింహం ఇంగ్లీష్ శాఖకు ఎంపిక అయ్యారు. అందరినీ కమిటీవారే ఎంచుకొని తెచ్చుకొన్నారు. ఇంటర్వ్యూలు నామకార్థమే! అప్పటికి మా కళాశాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న శ్రీ వి. మాధవరావు గారు నరసారావుపేట కాలేజీలో పొలిటికల్ సైన్స్ డిపార్ట్‌మెంట్ హెడ్డుగా పనిచేశారు. వారు కాలేజీ స్థాపనలో కమిటీకి చేదోడు వాదోడుగా వుంటూ సలహాలు ఇస్తున్నారు.

1972 ఆగస్టు 14న ప్రశాంతి నిలయం విశాలమయిన భవనంలో కళాశాల ప్రారంభమైనది. గేటునుంచి లోపలి వెళ్లేప్పుడు దారికి ఇరువైపులా ఏపుగా ఎదిగిన టెంకాయచెట్లు, పూలమొక్కలు, వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఉదయం 10గంటలకు నా మిత్రుడు సుబ్బరామయ్య ఇంటర్ క్లాస్, నేను బి.కామ్ క్లాసు తీసుకున్నాము. ఇంగ్లీష్, ఎకనామిక్స్ అధ్యాపకులు వచ్చి చేరను నెలపైగా ఆలస్యమైంది. కనక నేను, సుబ్బరామయ్య మార్చి మార్చి క్లాసులు తీసుకొనేవాళ్ళం. రోజూ నాలుగు గంటలు పైగా క్లాసులు. కళాశాల అధ్యక్షులు సంజీవిశెట్టి గారు కళాశాల కోసం సొంత భవనాన్ని, ఆ భవనం వున్నచోటు అరయకరం స్థలాన్ని విరాళంగా ఇచ్చారు. ఇదికాక నరసాపూరనే పల్లెలో కొన్నెకరాల పొలం కూడా ఇచ్చారు. వారు కాలేజీకి తమ పేరు పెట్టమని కోరకుండా శ్రీ సర్వోదయ కాలేజీ అని నామకరణం చేశారు. కళాశాల నెల్లూరు ఆర్.టి.సి. బస్ డిపోకు సమీపంలోనే ట్రంకురోడ్డు మీదనే.

సంజీవిశెట్టిగారు, వారి శ్రీమతి పంకజమ్మగారు ఆ పాతభవనంలోనే రెండుగదుల్లో ఉండేవారు. శెట్టిగారు సత్యసాయి భక్తులు. మా జిల్లాలో సాయి గారిని సేవించి, ఆత్మీయ శిష్యులయినవారిలో శెట్టిగారు ప్రథముల్లో ఒకరు. మా కళాశాలకు శెట్టిగారిచ్చిన భవనం పేరు ప్రశాంతి నిలయం. కళాశాల భవనం లోకి ప్రవేశించగానే, పెద్ద హాలు అందులో బాబాగారి నిలువెత్తు పటం మొదట దర్శనమిస్తాయి. మేడమీద ఒక గదిలో ఎప్పుడో చాలా కాలంక్రితం బాబాగారు విశ్రమించారట. అక్కడ బాబాగారు వాడిన సోఫా, పడక, వస్తువులు అన్నీ ఆలాగే ఉంచేశారు శెట్టిగారు. కాలేజీ పెట్టాలన్న తలపు రాగానే వారు మొదట పుట్టపర్తి వెళ్లి బాబాగారిని దర్శించి అనుజ్ఞ కోరారు. బాబాగారు కళాశాలలు నిర్వహించడం తలనొప్పి పని అని, బాలలకు ఒక చిన్న పాఠశాల పెట్టమని సలహా యిచ్చారట. కానీ నెల్లూరు వైశ్యప్రముఖులతో సంప్రదించి వారు కళాశాలనే నెలకొల్పారు. సంజీవిశెట్టిగారి హస్తవాసి మంచిదని అందరూ అంటారు. 120 మంది పిల్లలతో ఆరంభమైన విద్యాలయంలో అయిదేళ్ళలో 5000 మంది బాలబాలికలయ్యారు. కళాశాల నిలదొక్కుకుందిగాని, మా శెట్టిగారు బాబాగారి దయకు శాశ్వతంగా దూరమయ్యారు. మళ్ళీ జీవితంలో ఎన్నడూ బాబాగారు శెట్టిగారికి పూర్వంలాగా దర్శనభాషణలు దయ చేయలేదట. శెట్టిగారు పుట్టపర్తి వెళ్లి సాధారణ భక్తులతోపాటు వరుసలో నిలబడి దర్శనం చేసుకునేవారట. బాబా గారు మాత్రం శెట్టిగారిని ఎరగనివారిలాగా ముందుకు సాగిపోయేవారట. బాగా వృద్ధులైన సంజీవిశెట్టి గారు చాలా దుఃఖించారు కానీ ఫలితం లేకపోయింది. శెట్టిగారు నాతో స్వయంగా చెప్పిన విషయం ఇది.

శెట్టిగారికి మా మామగారు బాలసుబ్రహ్మణ్యం గారు ఇన్‌కమ్ టాక్స్ సలహాదారు. ఒక అపీలు విషయమై మా మామగారిని హైద్రాబాదు తీసుకొని వెళ్లారు సంజీవిశెట్టిగారు. ఎవరో ఒక పెద్ద పార్టీ హోటల్ రూముకు పెద్ద స్కాచ్ బాటిల్‌తో వచ్చి పార్టీకి కూర్చున్నారట. మా శెట్టిగారు ఆ సీసాను మేడ మీది నుంచి కిందికి గిరవాటు వేశారు. ఆంతే మా మామగారు మళ్ళీ జీవితంలో తాము మద్యం సేవిచలేదని అన్నారు. సంజీవిశెట్టిగారి కబుర్లు మరొకసారి.

కాలేజీలో చేరినపుడు మాకు నెలకు 426 రూపాయల వేతనంతో ఆరంభించారు. ఏటా 25/- రూపాయలు ఇంక్రిమెంట్ ఇచ్చారు.

కాలేజీ పెట్టిన కొత్తల్లో తెలిసినవాళ్ళు ఎవరు ఎదురైనా అయ్యో! అక్కడ చేరారా? వాళ్ళు కాలేజీని ఎప్పుడో మూసేస్తారు అనేవాళ్లు. ఈ పుకార్లు ఇంటివరకు వ్యాపించి మా అందరిని ఒక అభద్రతాభావం పట్టి పీడించేది.

మా కళాశాల రాక ముందు, నెల్లూరులో వి.ఆర్. కాలేజీ మాత్రమే ఉండేది. చాలా పురాతనమైన కాలేజీ అది.1920లో ఇంటర్‌తో ఆరంభించి, 1948 ప్రాంతాల్లో డిగ్రీ కళాశాలగా వృద్ధికి తెచ్చారు. పేరు వెంకటగిరి రాజా కాలేజే కానీ రాజాగార్లు 1949లో కాబోలు కాలేజీ కమిటి అధికారాలన్నీ పూర్తిగా ఆనం చెంచుసుబ్బారెడ్డి గారి చేతుల్లో పెట్టి చేతులు కడుక్కున్నారు. 1965లో నెల్లూరులో దొడ్ల కౌసల్యమ్మ ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజ్ స్థాపించబడింది.

తొలి ఏడాది, 1972లో మా విద్యార్థుల్లో ఎక్కువమంది వర్తకుల పిల్లలే. ఆరోజుల్లో నెల్లూరులో మరొక ప్రైవేట్ కాలేజీ రావాలని నెల్లూరు వారపత్రిక జమీన్ రైతు బలంగా సమర్థించింది. మా ప్రిన్సిపాల్ మేజర్ వి. మాధవరావు గారు నరసారావుపేట కాలేజీలో రాజకీయశాస్త్రం అధిపతిగా పనిచేశారు. అంతకు ముందు ఐదారేళ్లు కేరళలో మేజర్ హోదాలో యన్.సి.సి. కమాండింగ్ ఆఫీసరుగా ఉన్నారు కనుక చాలా స్ట్రిక్ట్ అని పేరు. కాలేజీలో నిత్యం ఉదయం ప్రార్థన తప్ప్పనిసరి అన్నారు. నేను తెలుగు లెక్చరరును కనక ప్రార్థన కార్యక్రమం నిర్వహించడం నా బాధ్యత అయింది. నేను సర్వమతాలకు, అందరికి ఆమోదయోగ్యంగా కొన్ని శ్లోకాలు ఎంపికచేసి పెద్దగా పిల్లలతో చెప్పించేవాడిని.

ప్రశాంతి నిలయంలో ఉదయపు ప్రార్థన సమయంలో

కొత్తకాలేజీ కనుక ఐదారేళ్ళ ఈ కార్యక్రమం సజావుగా సాగింది. తెలుగు శాఖలో ఇతరులు చేరిన తర్వాత నాకా బాధ్యత తప్పింది. 1972 సెప్టెంబరు కల్లా ఇంగ్లీష్, ఎకనామిక్స్ అధ్యాపకులు వచ్చి చేరారు. రోజుకు మూడు క్లాసులు మాత్రం ఉండేవి. మా ప్రిన్సిపాల్ ఏ డిపార్ట్‌మెంట్ వాళ్ళు సెలవు పెట్టినా తెలుగు వాళ్ళను ఆ క్లాసు తీసుకోమని పురమాయించేది. ఒక్కోసారి రోజంతా అయిదు గంటలూ క్లాసులు తీసుకొనేవాళ్ళం.

జై ఆంధ్ర ఉద్యమం:

కాలేజీ ప్రారంభమైన రెండు నెలల లోపలే మొదలైనది. ఒకరోజు ఉదయం 9.30 కి సైకిలు మీద కాలేజీకి వస్తుంటే వి.ఆర్. కాలేజీ వద్ద అయిదారువందల విద్యార్థులు గుమిగూడి సమ్మెకు ఉపక్రమించారు. నేను గబగబా కాలేజీకి వచ్చి ప్రిన్సిపాలుగారితో “సర్, బయట పరిస్థితి బాగాలేదు, ఈరోజు మనం విద్యార్థుల్ని పంపించివేస్తాము” అన్నా. ఆయన ఉగ్రుడయి సుతరామూ అంగీకరించక, క్లాసులకు వెళ్లమన్నారు. కాలేజీ గేట్లు బంధించమన్నారు. అయితే కాసేపటికల్లా వి.ఆర్ కళాశాల విద్యార్థులు వేయిమంది పైగా ఊరేగింపుగా వచ్చి టౌన్లో అన్ని విద్యాసంస్థలను మూయించారు. ప్రిన్సిపాల్ గారికి నెల్లూరు కొత్త. తర్వాత వారం రోజులకే మా కాలేజీ కమిటీ సెక్రెటరీ సుబ్బారాయుడు గారు ఉద్యమంలో దూకారు. ఇంకేముంది, మా ప్రిన్సిపాల్ గారు ఉద్యమాన్ని సంపూర్ణంగా సమర్థించారు. అధ్యాపకులకు తరగతులు లేకపోతే పని ఉండదు. నాకు మాత్రం ఒక ప్రత్యేక డ్యూటీ వేశారు. నేను అంతో ఇంతో ఫోటోగ్రఫీ చేస్తానని అందరికీ తెలుసు. ఇక మా పెద్దాయన, అదే సెక్రటరీ గారు ఎక్కడ ఉద్యమంలో ఏ పని చేసినా, నేను ఫోటోలు తీసి, ప్రింట్లు వేయించి న్యూస్ రాసి సాయంత్రంలోపల పత్రికల వాళ్లకు చేర్చాలి. ఒక్కోసారి పాపం! దరిద్రులు కొందరు పత్రికలవాళ్ళు 5 రూపాయలు ఇమ్మని దీనంగా అడిగేవాళ్ళు. ఆ తలనొప్పులన్నీ భరించాల్సివచ్చేది. 1972 డిసెంబర్లో ఉద్యమం చాలా తీవ్రమయింది. రైళ్లను ఆపారు, కొంత హింస కూడా జరిగి కాల్పుల్లో నలుగురు చచ్చిపోయారు కూడా. మా సెక్రటరీగారు రైళ్లు ఆపిన గుంపులతో ఇంజన్ ముందు నిలబడి ఫోటో తీయమనేవారు. ప్రింట్లు ఆలస్యమవుతాయని ఒక్కోసారి నేనే మా ఇంట్లో ఏర్పాటు చేసిన కెమెరా క్లబ్ డార్కురూంలో ప్రింట్లు వేసి పత్రికల వాళ్లకు ఇచ్చివచ్చేవాణ్ణి. ఆ రోజుల్లోనే నాకు ఫెస్టివల్ అడ్వాన్స్ క్రింద కొంత డబ్బు కాలేజీ వారు ఇస్తే, ఫ్లాష్ గన్ కూడా కొన్నా. అదే నా కొంప ముంచింది. ఒకసారి మా ప్రిన్సిపాల్ గారు కమిటీ సభ్యని ఇంట్లో బాలిక పుష్పవతి అయిన సందర్భంగా జరిగే కార్యక్రమానికి వెళ్లి ఫోటోలు తీయమన్నారు. మొదటిసారి వినయంగానే నేను వెళ్లనని గట్టిగా చెప్పవలసి వచ్చింది. పెద్దలు ఆగ్రహించినా నా ఇష్టానికి వ్యతిరేకంగా చెయ్యలేదు.

జై ఆంధ్ర ఉద్యమంలో మా కాలేజీ కార్యదర్శి అరెస్టు అయి నాలుగయిదు రోజులు నిర్బంధంలో, జైల్లో ఉన్నారు. వారు కొత్తగా ఏర్పడబోయే రాష్ట్ర విద్యామంత్రి అని మా ప్రిన్సిపాల్, ఇతర కులపెద్దలు అనుకుంటున్నారు. ఉద్యోగధర్మం కనుక అధ్యాపకులం అందరం జైలుకువెళ్లి వారిని పరామర్శించి వచ్చాము. వారికి బెయిల్ ఏదోలా వచ్చిందనుకోండి. మా ప్రిన్సిపాల్ గారి అత్యుత్సాహాన్ని చూచి నవ్వు వచ్చేది.

నెల్లూరులో జమీన్ రైతు వారపత్రిక ఒక్కటే సమైక్యవాదిగా ఉద్యమకారుల దౌష్ట్యాన్నిఎదుర్కొని ధైర్యంగా నిలబడింది. ఆ పత్రికలో నా ఆత్మీయమిత్రులు పెన్నేపల్లి గోపాలకృష్ణ సహసంపాదకులు. వారు వ్యక్తిగతంగా కూడా సమైక్యవాదే. ఆ రోజుల్లో జమీన్ రైతు వార్తాపత్రికకు రాతగాడు, కూతగాడు (రిపోర్టర్) అన్నీ ఆయనే. నెల్లూరు శ్రీరామమూర్తి గారు సంపాదక బాధ్యతలు మాత్రం చూచేవారు. అన్ని బహిరంగ సభలకు నా మిత్రులు రిపోర్టరుగా హాజరవాల్సిందే. ఒక బహిరంగసభలో చిన్నపాటి ఝాన్సీ రాణి, ఉద్యమ గర్వంలో దురుసుగా వారిని చెంపమీద కొట్టింది కూడా. జన సమూహాలు జమీన్ రైతు ప్రెస్ మీద దాడిచేసి చాలా నష్టం చేశాయి. ఈ ఉద్యమంలోనే మాన్యశ్రీ వెంకయ్యనాయడుగారు గొప్ప వక్తగా పేరు తెచ్చుకున్నారు. కావలి జవహర్ భారతిలో గొప్ప ఆంగ్ల అధ్యాపకులనే ప్రసిద్ధి పొందిన మధురాంతకం మాధవరావు గారి 15 సంవత్సరాల కుమార్తె బహిరంగ సభల్లో ఉపన్యాసాల్లో నిప్పులు వర్షించేది. నేను హైద్రాబాదులో ఐదేళ్లు చదువుకోడం ఒక కారణం కావచ్చు, సమైక్యవాదిగా అనేక ఇబ్బందులు సహించవలసి వచ్చింది. మా ప్రిన్సిపాల్ గారు “ఇదుగో రాష్ట్రం వచ్చేస్తుం”దని అంటే, “సర్! రాదండీ” అన్నా. వారు కోపంగా “మేమంతా గొర్రెలమా?” అన్నారు. “ఏమో మీరు ఆలోచించుకోండి” అని సమాధానం చెప్పాను. వారు చాలా కృద్ధులయ్యారు. ఆ తర్వాత చరిత్ర అందరికీ తెలిసిందే.

ఆరోజుల్లో సమైక్యవాదిగా ఉండడం అంటే కష్టాలు కొని తెచ్చుకోడమే.

కొత్తగా కళాశాల ఏర్పాటు చేస్తున్నారు కనక ఎన్నెన్నో బాధ్యతలు పైనపడేవి. గ్రంథాలయం ఏర్పాట్లు చేయవలసివచ్చింది. ఎవరో పళ్ల రసాల కుటీర పరిశ్రమ నడిపి, నష్టాలతో మూసివేశారు. వాళ్ళవద్ద అల్యూమినియం రేకు తాపటం చేసిన పొడవాటి టేకు టేబుళ్ళు అమ్మకానికి వచ్చాయి. ప్రిన్సిపాలుగారు నాకు పూర్తి అధికారం యిచ్చి వాటిని కొని తెమ్మన్నారు. నేను నిర్మొహమాటంగా మాట్లాడుతాననే కానీ శ్రద్ధగా పనిచేస్తానని వారు త్వరలోనే గ్రహించారు. ప్రభుత్వ కళాశాలలో నమూనాలు తీసుకొని కాలేజీ ఆఫీసుకు, లైబ్రరీకి అవసరసమైన అన్ని రిజిస్టర్లనీ, ప్రామాణికమైన రూపంలో అచ్చు వేయించాను. మొత్తం నలుగురమే అధ్యాపకులం. కామర్స్ అధ్యాపకులు మేడం సుబ్బరామయ్య దృఢగాత్రుడు. వయసులో నాకన్నా చిన్న. అరుదైన గుండెధైర్యం ఉన్నవాడు. వైశ్యుల పిలగాండ్లలో యిటువంటి మనిషి అరుదు. పైగా రాయల సీమబిడ్డ. కళాశాలలో క్రమశిక్షణ అతని బాధ్యత. ఇంగ్లీష్ లెక్చరర్ నరసింహం స్వస్థలం పెరిదేపి. క్రీడలు అతనికి వప్పగించారు.

ఏమైనా ఏదో ఒక కారణంతో తరచూ ప్రిన్సిపాల్ గారితో, మేము నలుగురం సమావేశమై చర్చలు జరుపుతూ పొద్దుపోయేవరకు కాలేజీలో ఉండేవాళ్ళం. నేను కాలేజీలో చేరిన నాలుగయిదేళ్లవరకు పాఠాలు శ్రద్ధగా చదివి తయారై తరగతికి వెళ్ళేవాడిని. 5’ 2” అంగుళాల పొడవు తెలుగు అధ్యాపకుణ్ణి. మొదట్లో నా హ్రస్వ రూపాన్ని గురించి ఎప్పుడూ న్యూనతాభావం ఉండేది. అయితే పిల్లలకు ఏమిచేప్తే, ఎట్లా చెప్తే వింటారో తెలుసు. పాఠం మొదటి వాక్యంలోనే వాళ్ళ మనసును పట్టేసుకొనేవాణ్ణి. మంచి టీచరుకు విద్యార్థులు పాఠం విటున్నారా లేదా అని తెలిసిపోతుంది. తెలుగు అధ్యాపకులకు ఏదో సందర్భాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు వినోదం, విజ్ఞానం కలిగే విషయాలు ప్రస్తావించే అవకాశం ఉంటుందికదా!

(ఇంకా ఉంది)

Exit mobile version