Site icon Sanchika

జ్ఞాపకాల తరంగిణి-20

[box type=’note’ fontsize=’16’] జీవితంలోని వివిధ దశలలో తనకు కలిగిన విశేష అనుభవాలను సంచిక పాఠకులతో పంచుకుంటున్నారు డా॥ కాళిదాసు పురుషోత్తం. [/box]

ఎమర్జెన్సీ సమయంలోనో, కొంచెం ముందుగానో ‘ది కీ’ అనే జెక్ దేశపు సినిమా, ‘అమెండ్‌మెంట్ టు స్టేట్ డిఫెన్స్ యాక్ట్’ అనే రుమేనియా దేశపు సినిమాలను ప్రదర్శించాము. రెండు ప్రదర్శనలకూ జిల్లా అధికారులంతా హాజరయ్యారు. రెండు చిత్రాలు రెండో ప్రపంచ యుద్ధానికి కొంత ముందుగా జర్మని అనుకూల ప్రభుత్వాలలో పౌరహక్కులు ఎంత దారుణంగా అణచబడినదీ చిత్రించచారు. జెకోస్లొవేకియాలో 30 వేల జనాభా కలిగిన చిన్న టౌన్. నాజీ సైన్యం కమ్యూనిస్టు పార్టీ ఆఫీసును చుట్టుముట్టుతున్న సమయంలోనే అందులోఉన్న పార్టీ ప్రముఖుల్ని పెరటిదోవలో తరలించి క్షేమంగా తప్పిస్తారు కార్యకర్తలు. పార్టీ కార్యదర్శి నాజీ సైన్యం కాల్పుల్లో చనిపోతాడు. అతని జేబులో ఒక తాళం లభిస్తుంది నాజీలకు. అటువంటి 30వేల తాళాలను తయారు చేయించి ఇల్లిల్లూ సోదా చేస్తుంది సైన్యం. పార్టీ కార్యకర్తలు చాకచక్యంగా పార్టీ ఆఫీసు ఖాళీ చేస్తారు ఆధారాలు పోలీసులకు చిక్కకుండా. పార్టీ కార్యదర్శి భౌతిక కాయాన్ని ఆ టౌన్లో ప్రతి పౌరుడికీ చూపించి అతనెవరో చెప్పమని నాజీలు ప్రజలను ఆజ్ఞాపిస్తారు. అతనెవరో ప్రజలందరికీ తెలిసినా ఎవరూ అతనెవరో తెలియదంటారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో కమ్యూనిస్టులు ప్రజలవైపు నిలబడి చేసిన పోరాటాన్ని అద్భుతంగా ‘కీ’ సినిమా చిత్రించింది.

‘అమెండ్‌మెంట్ టు స్టేట్ డిఫెన్స్ యాక్ట్’ కూడా ఇదే ఇతివృత్తంగా తీసిన సినిమా. రుమేనియాలో హిట్లర్ అనుకూల నాజీ భావాలకు దగ్గరగా ఉండే పార్టీ అధికారంలోకి వస్తుంది. దేశ రక్షణ చట్టానికి ప్రభుత్వం సవరణలు తెచ్చి, పౌరహక్కులను హరించి వేస్తుంది. రెండో ప్రపంచ యుద్ధం ఆరంభం కాబోతున్న సమయం. రుమేనియాలో అధికారులు కొత్త చట్టం ప్రకారం ప్రజాస్వామ్యవాదుల జాబితాల, ప్రతిపక్ష నాయకుల జాబితాలు తయారు చేసి అరెస్టులకు రంగం సిద్ధం చేస్తుంది. టైపు మిషనులో అరెస్టు చేయవలసిన వ్యక్తుల జాబితాలు తయారవుతుంటాయి. అధ్యాపకులు, న్యాయవాదులు, పత్రికలవాళ్ళు, వాళ్ళువీళ్ళు అని లేదు, అందరినీ ప్రభుత్వ వ్యతిరేకుల జాబితాలోకి ఎక్కిస్తారు. అనూహ్యంగా మిలటరీ పాలన ఆరంభమవుతుంది. సినిమా మధ్య విరామ సమయంలో (intervel) జిల్లా జడ్జి, జిల్లాపోలీసు అధికారి, కలెక్టర్ గార్లకు టీ ఇవ్వడానికి వెళ్ళాను. వాళ్ళు ఈ సినిమా నేపథ్యంలో భారతదేశ పరిస్థితిని చర్చిస్తున్నారు. ఎమర్జెన్సీలో నెల్లూరు టౌన్‌లో జరిగిన అరెస్టుల్లో నేనూ అరెస్టయి 21 నెలలు జైలు నిర్బంధంలో గడపవలసినవాణ్ణే, నెల్లూరు కలెక్టరుగా అర్జునరావు గారు లేకపోతే. నన్ను అరెస్టు చేయకుండా తాము కాపాడామని ఎమర్జెన్సీ ఎత్తివేసిన కొత్తల్లో వారిని కలిసినపుడు, వారే చెప్పారు.

మేము నెల్లూరులో ప్రొఫిల్మ్‌ను స్థాపించినపుడు రోటరీ క్లబ్ గవర్నర్‌గా చేసిన ఉన్నత విద్యావంతులయిన జె.వి.రెడ్డిగారు “భోజనం బాగుందని చెప్పడానికి వంట నేర్చుకోవాలా?” అని కొంచం హాస్యం, వ్యగ్యం మేళవించి వ్యాఖ్యానించారు. వారు పెద్దవారు కనుక వారికి సమాధానం చెప్పకుండా వచ్చేశాను. కాని ఫిల్మ్ సొసైటీ నెలకొల్పి కళాత్మక సినిమాలు చూడడం అలవాటయ్యాక, మా అందరి సినిమా చైతన్యం చాలా అభివృద్ధి చెందింది.

1978లో ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ సొసైటీస్ ఆఫ్ ఇండియా దక్షిణాది విభాగం మద్రాసు అడయార్ Film Instituteలో ఫిల్మ్ క్లబ్బుల సభ్యులకు, ఫిల్మ్ Institute విద్యార్ధులకు కలిపి 15 రోజుల పాటు ఫిల్మ్ అప్రీసియేషన్ కోర్సు నిర్వహించారు. నెల్లూరు ప్రొఫిల్ము ప్రతినిధిగా ఆ కోర్సుకు హాజరయ్యాను. సినిమాటోగ్రాఫర్, సినిమా దర్శకుడు బాలుమహేంద్ర కోర్సు డైరెక్టర్‌గా వ్యవహరించారు. మద్రాసు Film Institute అధ్యాపకులు, రేండర్ గై, కె.యస్. శ్రీనివాసన్ వంటి ప్రముఖులు తరగతులు తీసుకున్నారు. ఉదయం 9 గంటలకు క్లాసులు మొదలై రాత్రి 9 గంటలకు ముగిసేవి. బాగా అలసిపోయి హొటల్ రూంకి తిరిగి వచ్చేవాణ్ణి. అధ్యాపక వృత్తిలో మాకు సెలవులుంటాయి గాని సొంతానికి సెలవులు తక్కువ. నేను మిగుల్చుకున్న సెలవులన్నిటినీ వెచ్చించి ఈ కోర్సుకు హాజరు కావలసివచ్చింది. ఐతే సినిమాల గురించి నా చైతన్యం చాలా మెరుగు పడింది.

పూనే ఫిల్మ్ అండ్ టివి ఇన్‌స్టిట్యూట్‌లో

నెల్లూరులో కెయస్. శ్రీనివాసన్, రేండర్ గైల సహకారంతో వైల్డ్ స్ట్రాబెరీస్, రషోమన్ వంటి సినిమాల మీద రెండు రోజుల ఫిల్మ్ అప్రీసియేషన్ కోర్సు నిర్వహించాము. మా సభ్యులు ఎక్కువ మంది ఈ క్లాసులకు హాజరయ్యారు. కావలి ఒంగోలు వంటి ఫిల్మ్ సొసైటీలు కూడా రెండు రోజులు ఒకే సినిమామీద గోష్ఠులు నిర్వహించాయి. ఆరోజుల్లో మా ప్రొఫిల్ము సభ్యులందరం ఉత్సాహంగా వీటన్నింటిలో పాల్గొన్నాము.

1979లో విజయవాడ ఫిల్మ్ సొసైటీ (విఫిసొ) పూనా నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్సు, పూనా ఫిల్మ్ ఇన్‌స్టిస్ట్యూట్, FFSI సహకారంతో 10రోజుల ఫిల్మ్ అప్రీసియేషన్ కోర్సు నిర్వహించింది. ఆ స్ఫూర్తితో ప్రొఫిల్ము కూడా ఆ కోర్సు నిర్వహించాలని సంకల్పించింది. FFSI మా సామర్థ్యాన్ని పరీక్షించేందుకు నెల్లూరులో సౌత్ ఇండియన్ ఫిల్మ్ సొసైటీల కార్యవర్గ సభ్యుల సమావేశాన్ని ఏర్పాటు చేయమని కోరింది. వారూహించినదానికన్నా ఎంతో ఘనంగా నెల్లూరులో స్టార్ హోటల్లో ఆ సభ జయప్రదంగా జరిపించాము. FFSI వారికి మా నిర్వహణ సామర్ధ్యం మీద నమ్మకం కుదిరింది.

మా ప్రొఫిల్ము కార్యవర్గ సమావేశంలో 10 రోజుల ఫిల్మ్ అప్రీసియేషన్ కోర్సు నిర్వహించడానికి సభ్యులందరం ఏకగ్రీవంగా తీర్మానం చేయవలసివుంది. ఇంతభారం మనం మోయగలమా అని మా సభ్యుల సందేహం. చివరకు మనం కోర్సు జరిపినా జరపకపోయినా ఒక కార్యవర్గ తీర్మానం చేద్దామని మా సభ్యులను అంగీకరింపజేశాను. అప్పుడు APSEBలో SE వద్ద స్టెనోగా వున్న కె.పెంచలయ్య మా కమిటి ఫైనాన్స్ సెక్రటరీగా, నేను ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్నాము. మా తీర్మానాన్ని FFSI, నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్సు కు పంపించాము. తర్వాత FFSI ఒక బృందాన్ని నెల్లూరుకు పంపించింది. వారు సానుకూలంగా రిపోర్ట్ పంపారు.

పది రోజుల ఫిల్మ్ అప్రీసియేషన్ కోర్సు… మొదటి రోజు… ప్రొఫెసర్ సతీష్ బహాదుర్, డా. శ్యామలా వనార్సి, ఎఫ్.ఎఫ్.ఎస్.ఐ. సౌత్ జోన్ ఆఫీస్ బేరర్లు

పదిరోజుల ఫుల్ టైం కోర్సు అది. మేము ప్రకటన ఇవ్వగానే మొత్తం దక్షిణ భారతదేశంనుంచి సుమారు అరవైమంది కోర్సులో పాల్గొనడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. మా కార్యవర్గ సభ్యులు, సాధారణ సభ్యులు కలిపి కోర్సులో పాల్గొనేందకు నూరుమంది తయారయారు. 1980 డిసెంబర్ 6వతేది ఉదయం పదిగంటలకు నెల్లూరు విజయమహల్లో ప్రొఫిల్ము సభ్యులు, ఆహూతుల సమక్షంలో ప్రారంభసభ జరిగింది. మద్రాసు నుంచి ఫిల్మ్ ఫెడరేషన్ కార్యవర్గం కూడా హాజరైంది. ప్రొఫిల్ము కార్యవర్గ సభ్యులు, సీనియర్ డాక్టర్ సి.పి. శాస్త్రి సభాధ్యక్షులు. జిల్లా కలెక్టర్ టి. మునిరత్నం ముఖ్య అతిథి. మా మేనగోడలు, బిఇడి చదువుతున్న విద్యార్థిని కుమారి అపర్ణ, ఫిల్మ్ అప్రీసియేషన్ కోర్సుకు హాజరైంది. ఆ అమ్మాయి చేత దీపాలు వెలిగించి లాంఛనంగా కోర్సును ప్రారంభించారు. విద్యుత్ శాఖ ఎస్.ఇ శ్రీ వి.వి.రెడ్డి సావనీర్ విడుదల చేశారు. ఫెడరేషన్ ముఖ్యులు ప్రసిద్ధ సినిమాటోగ్రాఫర్ నిమయ్.ఘోష్ (నిమయ్ దా), ఎస్.వి.వెంకట్రామన్, వివి సుబ్రమణీయన్, ఐఎస్.కె. దేవరాయలు తదితరులు ప్రసంగించారు. “వేయి పుస్తకాలు వెలువరిస్తే పది పుస్తకాలు వాటిలో కలకాలం నిలిచిపోయేవి ఒకటో రెండో! సినిమాలు కూడా అంతే. వాణిజ్య చిత్రాలు రానివ్వండి. వాటిమధ్య ఎప్పడో ఒక గొప్ప కళాత్మక చిత్రం వస్తుంది. అది చిరకాలం నిలిచిపోతుంది” అన్నారు నిమయ్ దా. ఫిల్మ్ సొసైటీ లకు వినోదపుపన్ను మినహాయింపు ఇవ్వమని ఉపన్యాసకులందరూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. ప్రొఫెసర్ సతీష్ బహాదుర్ వంటీ పెద్దలు వేదికమీద ఆసీనులై ఉండగా కోర్సు ప్రారంభసభ జయప్రదంగా జరిగింది. డిసెంబర్ 6 నుంచి 15 వరకు, మొత్తం పదిరోజుల కోర్సు ఫీజు పార్టిసిపెంటుకు వందరూపాయలు. కోర్సు సందర్భంగా ఒక ప్రత్యేక సంచిక తెచ్చాము. సంచిక ముద్రణ ఖర్చు పోను ప్రకటనల ద్వారా కొంత డబ్బు సమకూడింది. కోర్సులో పథేర్ పాంచాలి, వైల్డ్ స్ట్రాబెరీస్ ప్రత్యేక అధ్యయనానికి ఎంపికయ్యాయి. ఈ సినిమాల సంభాషణలు, ఫిల్మ్ చరిత్రకు సంబంధించిన పాఠ్యాంశాలు అన్నీకలిపి సైక్లోస్టైల్ చేసిన పుస్తకం, ఫైలు ప్రతి విద్యార్థికి అందజేశాము. కోర్సుకు హాజరైన వారికి ఉండడానికి ఏర్పాట్లు చేశాము. పూనా ఫిల్మ్ Institute ప్రొఫెసర్ సతీష బహదూర్ నేతృత్వంలో మొత్తం కోర్సు జరిగింది. వారికి సహాయంగా పూనాలో సైకియాట్రిస్టు వృత్తిలో ఉంటూ Film Instituteలో గౌరవ ఉపన్యాసకురాలుగా ఉన్న శ్రీమతి డాక్టర్ శ్యామలా వనార్సి అయిదు రోజులు అధ్యాపికగా పనిచేశారు. మిగతా ఐదురోజులు పూనా నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్సు క్యూరేటర్ పి.కె.నాయర్ తరగతులు తీసుకొన్నారు.

ఫోటో ప్రదర్శన

కోర్సు రెండుభాగాలుగా ఉండేది. ఒకభాగంలో సినిమా ఆవిర్భావం, సాంకేతికంగా వచ్చిన అభివృద్ధి, వివిధ దేశాల సినిమా చరిత్ర చెప్పేవారు. సినిమా సమాహారకళ కనక ఎడిటింగ్, కాంపోజిషన్, ఫొటోగ్రఫి, లైటింగ్ వంటి విషయాలమీద ప్రాథమిక అంశాలను బోధించేవారు. Study material మొత్తం మేము సభ్యులకు సైక్లోస్టైల్ చేసి ఇచ్చాము. ఏ రోజు ప్రదర్శించే సినిమాల సినాప్సిస్ సభ్యులకు ఆరోజు ఠంచనుగా అందజేసేవారం. పథేర్ పాంచాలి, వైల్డ్ స్ట్రాబెరీస్ సినిమా సంభాషణలు మొత్తం టైపుచేసి అందరికీ అందజేశాము కనక క్లాసుల్లో సులభంగా ఉపన్యాసాలు బోధపరచుకోగలిగారు. కోర్సు మొత్తం నెల్లూరు ఫండాఫీసు హాల్లో నిర్వహించాము. సాయంత్రం 5గంటలకు క్లాసులు అయిపోయేవి. అరగంట విశ్రాంతి తర్వాత 16mm ఫిల్మ్ ప్రదర్శన, దానికి ముందు ప్రొఫెసర్ బహదూర్ లఘు పరిచయం. 8-30 కి సినిమా పూర్తి కాగానే పార్టిసిపెంట్లు తమ గదులకు వెళ్ళి స్నానభోజనాలు ముగించి మళ్ళీ ఠంచనుగా రాత్త్రి 9.30 షోకు తయారయ్యేవారు. ఆ విధంగా 20 అరుదైన కళాఖండాలను చూచే అవకాశం కలిగింది. ఇవి కాక, రెండు 35 ఎంఎం సినిమాలు సినిమా హాల్లోనే ప్రదర్శించాము. ఒక సినిమా నెల్లూరుకు గర్వ కారణమైన రాఘవ సినీ కాంప్లెక్స్‌లో ప్రదర్శించాము. నాయర్, బహదూర్ దేశంలో ఇటువంటి సినిమా హాలు చూడలేదని మెచ్చుకొన్నారు. కోర్సు మధ్యలో, పాఠంలో భాగంగా ఎన్నో జాతీయ అంతర్జాతీయ సినిమా లనుంచి కొన్ని భాగాలను ప్రదర్శించారు. కోర్సులో పాల్గొన్న ప్రొఫెసర్లతో పార్టిసిపెంట్లతో ఫొటో తీయించి అందరిపేర్లను ప్రింటు చేయించి చివరిరోజు అందరికి అందించగలిగాము. మా ప్రొఫిల్ము కార్యవర్గ సభ్యులు విడిగా పూనా ఆచార్యులతో కలిసి ఫొటో తీయించుకున్నాము. ఇదంతా మా సామూహిక శ్రమ. ప్రతి కమిటీ సభ్యుడు తమతమ విధులను శ్రద్ధతో నిర్వర్తించారు.

(ఇంకా ఉంది)

Exit mobile version