జ్ఞాపకాల తరంగిణి-23

0
2

[box type=’note’ fontsize=’16’] జీవితంలోని వివిధ దశలలో తనకు కలిగిన విశేష అనుభవాలను సంచిక పాఠకులతో పంచుకుంటున్నారు డా॥ కాళిదాసు పురుషోత్తం. [/box]

[dropcap]డి[/dropcap]గ్రీ చదివే రోజుల్లోనే గురజాడ వెంకట అప్పారావు గారి రచనలతో పరిచయం అయింది. స్పెషల్ తెలుగు బి.ఏ. కనక గురజాడ గేయాలు పాఠ్యాంశాలుగా చదివాను. ‘ముత్యాలసరాల’ మీద కాలేజి మ్యాగజైన్‌లో వ్యాసం కూడా రాశాను. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఎ తెలుగులో ఫస్ట్ క్లాస్లో, యూనివర్సిటీ ఫస్ట్‌గా వచ్చినందుకు గురజాడ అప్పారావు స్వర్ణపతకం అందుకున్నాను. గురజాడ మీద పరిశోధించాలని ఎంత ఉబలాటపడినా, ఆచార్య దివాకర్ల వెంకటావధానిగారి ఆమోదం పొందలేక పోయాను. ఆ రోజుల్లో గురజాడ విశ్వవిద్యాలయాల ఆచార్యుల గదుల్లోకి ప్రవేశించలేదు. అట్లా గురజాడ నా మనసులో మాత్రం ఎప్పుడూ ఉన్నారు. తెలుగులో 2012 సెప్టెంబర్లో గురజాడ లభ్య సమగ్ర రచనల సంపుటాన్ని ‘గురుజాడలు’ను మనసు ఫౌండేషన్ గురజాడ 150వ జయంతి రోజున, విజయనగరం మహారాజా కాలేజీ హాలులో నా మిత్రులు స్వర్గీయ పెన్నేపల్లి గోపాలకృష్ణ శ్రీమతి ఉమాగోపాలకృష్ణ చేత ఆవిష్కరింపజేశారు.

గోపాలకృష్ణ ఆ సంపుటానికి సంపాదకులుగా వ్యవహరిస్తూ అనారోగ్యంతో ఆకస్మికంగా 2011 మే 27న మరణించినపుడు, మనసు ఫౌండేషన్ అధిపతి డాక్టర్ మన్నం రాయడుగారు గోపాలకృష్ణ అర్ధాంతరంగా వదలిపెట్టిన పనిని నన్ను కొనసాగించమని కోరారు. నాతోబాటు రాయుడు గారు సంపాదకులుగా ఉండటానికి అంగీకరిస్తేనే నేను ఆ పని కొనసాగిస్తానని అన్నాను. అప్పటికి రాయుడు గారితో నాకు పరిచయం లేదు. రాయుడు గారు, నేను పని మొదలుపెట్టాము. ఒకవైపు రాయుడు గారు గురజాడ తెలుగు రచనలు ముద్రణకు సిద్ధం చేస్తూ వుంటే నేను, నా మిత్రులు డాక్టర్ మాచవోలు శివరామప్రసాద్ గారు కలిసి గురజాడ ఇంగ్లీష్ దినచర్యలు, కరెస్పాండెన్స్, డిసెంట్ నోట్‌ను ముద్రణకు సిద్ధం చేశాము.

పోయినవిపోగా మిగిలిన గురజాడ రాతప్రతులు హైద్రాబాదులోని ఏపీ స్టేట్ ఆర్కైవ్స్‌లో భద్రపరచబడి ఉన్నాయి. వాటన్నిటినీ స్కాన్ చేయించి డిజిటల్ కాపీలు తెచ్చుకొని కంప్యూటర్ తెరపైన ఆ పత్రాలను శ్రద్ధగా, ఓర్పుతో పరిశీలించాము. గురజాడ జిలుగురాత, అదీ నూరేళ్లనాటి కాగితాలు కావడంవల్ల, ప్రతిరోజు 8/9 గంటలు ఆ రాతప్రతులను కంప్యూటర్ తెరమీద చదవవలసివచ్చేది, చాలా శ్రమతో కూడిన పని. మొదట గురజాడ లేఖలు, దినచర్యలు, నోట్స్ చదివి ఎత్తిరాశాము. 1914లో గురజాడ డిసెంట్ నోట్ తప్పులు తడకలుగా, గుజలీ ప్రతిగా వావిళ్ళవారి ముద్రాక్షరశాలలో అచ్చయింది.

ఆ ప్రతికోసం ఎంతో ప్రయత్నం చేయవలసివచ్చింది. చివరకు నా మిత్రులు, ఆంధ్రవిశ్వవిద్యాలయం విశ్రాంత చరిత్ర ఆచార్యులు కేశవనారాయణ గారు డిసెంట్ నోటు కాపీ సంపాదించి చేర్పించారు. దాన్ని కూడా పరిష్కరించి ముద్రణకు సిద్ధం చేశాము. గురజాడ రాతప్రతులు చదివి ఎత్తి రాసే ప్రక్రియ దాదాపు 2012 సెప్టెంబర్ పదవతేదీ వరకూ కొనసాగింది.

గురజాడ రచనల విషయంలో తొలిముద్రణను ప్రమాణంగా స్వీకరించాము. గురజాడ రచనల కోసం నేను 2010 వేసవిలో ఆంధ్రదేశంలోని గ్రంథాలయాలన్నీ చుట్టివచ్చాను. మద్రాసు కనమర లైబ్రరీ, గవర్నమెంట్ ఓరియంటల్ మాన్యుస్క్రిప్టు లైబ్రరీ, అడయార్ థియోసాఫికల్ లైబ్రరీ వగయిరా గ్రంథాలయాలన్నీ చుట్టివచ్చాను. గురజాడ కన్యాశుల్కం మొదటి ముద్రణ మదరాసు ప్రభుత్వ ఓరియెంటల్ మాన్యుస్క్రిప్టు లైబ్రరీలోనూ, హైద్రాబాదు స్టేట్ ఆర్కైవ్స్ లోను లభించిందిగానీ కన్యాశుల్కం రెండవ ముద్రణ మాత్రం దేశంలో ఎక్కడా లభించలేదు, యెంత ప్రయత్నం చేసినా. చివరకు రాయుడు గారి అబ్బాయి చిరంజీవి జెన్ ఇండియా హౌస్ లైబ్రరీ, ఇంగ్లాండు నుంచి కాపీ తెచ్చి యిచ్చాడు.

గురజాడ రచనలకోసం అన్వేషణ చివరివరకు కొనసాగిస్తూనే వచ్చాము. గురజాడ ఇంగ్లీషులో రాసిన కథ Stooping to raise మాత్రం దొరకనేలేదు.

ఒకవైపు రాయుడుగారు గురజాడ తెలుగు రచనలను టైపు చేయించి ముద్రణకు సిద్ధంచేస్తుంటే, మేము ఇంగ్లీషు రచనలు రాతప్రతలనుంచి కాపీచేసి, అచ్చుకు సిద్ధం చేశాము. గురజాడ ఉత్తరప్రత్యుత్తరాల రాతప్రతులు చదివి, అర్థం చేసుకోడం చాలా శ్రమతో కూడిన పనైంది. అలాగే ఆయన దినచర్యలు కూడా. గురజాడ జిలుగురాత బోధపరుచుకోడానికి ఎంతో శ్రమచేయవలసివచ్చింది. మా మిత్రులు పెన్నేపల్లి గోపాలకృష్ణ సాధనచేసి గురజాడ జిలుగురాత అర్థం చేసుకొని గురజాడ దినచర్యలు చదివి తయారుచేసిన దినచర్యలు ప్రతిని A.P. Government Manuscript Library and Research Institute, Hyd. 2008లో “Diaries of Gurajada” పేరుతో ముద్రించింది.

గోపాలకృష్ణ గురజాడ 140 పైచిలుకు లేఖలు చదివి ఎత్తిరాయగలిగారు. ఆ లేఖలనే మరొకమారు గురజాడ రాతప్రతులతో సరిపోల్చి శుద్ధ ప్రతిని తయారు చేస్తూ వారు స్వర్గస్థులయ్యారు. మిగిలిన ఉత్తరాలను మేము డిసైఫర్ చేసి కాపీ చేశాము. గురజాడ దినచర్యల పరిస్థితి కూడా ఇంతే. దినచర్యలతో పాటు గురజాడ నోట్సు కూడా డిసైఫర్ చేశాము. అవసరాల సూర్యారావు 1952 ప్రాంతాలలో గురజాడ ఇంగ్లీషు దినచర్యలు, లేఖలు, నోట్సు తనకు బోధపడినంత, దానికి తన కల్పన జోడించి అనువాదం చేస్తే విశాలాంధ్ర ప్రచురించింది. ఆ ఆనువాదమే గురజాడ పేరుతో నిన్నమొన్నటివరకు పాఠకులకు అందుబాటులో వుంది.

మొదటిసారి గురజాడ ఇంగ్లీషులో రాసిన రచనలు ఇంగ్లీషులో అచ్చువేయడానికి మేము ప్రయత్నం చేశాము. ఒకవైపు మేము గురజాడ రాతప్రతులు చదివి, కాపీ చేసి అచ్చుకు సిద్ధం చేస్తుంటే ఆ మెటీరియల్ బెజవాడలో టైపయ్యేది. ప్రూఫులు కూడా కంప్యూటర్ లోనే సరిచూచి మెయిల్ చేసేవాళ్ళం. కాలంతో పోటీపడి పనిచేసాము. 2012 సెప్టెంబరు 21న గురజాడ 150వ జయంతి రోజు విజయనగరం మహారాజా కాలేజీలో జరిగిన ఆవిష్కరణ సభకు నెల్లూరు, ఇతర ప్రదేశాలనుంచి చాలామందిమి గురజాడ అభిమానులం హాజరయ్యాము. ప్రొఫెసర్ కేతు విశ్వనాథ రెడ్డిగారు ప్రత్యేక అతిథిగా ఆ సభలో పాల్గొన్నారు.

ఆ రోజే విశాఖపట్నంలో వెలుగు రామానాయుడు బృందం కిశోర్ దర్శకత్వంలో కన్యాశుల్కనాటకం యథాతథంగా ఎనిమిది గంటలసేపు ప్రదర్శించింది. ఆ ప్రదర్శన చూడడానికి దూరప్రాంతాలనుంచికూడా కన్యాశుల్కం నాటకం అభిమానులు వచ్చారు. తెల్లవారి మాకు అలా వచ్చిన విరసం ముఖ్యులు కొందరు రైల్లో కనిపించి గురజాడ సమగ్ర రచనల సంపుటి ‘గురుజాడలు’ను గురించి ప్రస్తావిస్తూ అమాయకంగానో, casual గానో “విశాలాంధ్ర ప్రచురించిన అవసరాల రచనలన్నీ అట్లాగే వేసేసుకున్నారా?” అన్నారు. ఆ మాటకు చాలా బాధ కలిగింది. “ఏమండీ ఇటువంటి stupid question అడుగుతారా?” అన్నా.

కోపం పట్టలేక అన్నమాట అది. ఇప్పటికీ మనసు ఫౌండేషన్ ప్రచురించిన గురజాడ లభ్య సమగ్ర రచనల సంపుటంలో ఏముందో చూడని తెలుగు సాహితీపరులున్నారు. గురజాడ ఒక లేఖలో తాను అజ్ఞేయవాదినని, తనకు ఎటువంటి మత విశ్వాసాలు లేవని 1904లోనే విశదపరచారు. “గురుజాడలు” వెలువడిన ఆరేళ్ళ తరువాత కూడా గురజాడ మతభావాలను గురించి ఏమీ తెలియదని రాశారు కొందరు.

మనసు ఫౌండేషన్ గురజాడ సమగ్ర రచనల సంపుటి తయారుచేస్తున్న సమయంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురజాడ సమగ్ర రచనల సంపుటం తయారుచేయించి 150వ జయంతి రోజు హైదరాబాదులో విడుదల చేసింది. దానికి సంపాదకులుగా వ్యవహరించిన పండితులు ఇది గురజాడ రచనా, అవసరాల అనువాదమా అని చూచుకోకుండా అవసరాల సూర్యారావు తెలుగులోకి అనువదించిన గురజాడ దినచర్యలు, లేఖలు, నోట్స్ యథాతథంగా అందులో చేర్చారు. జిజ్ఞాసువులు రెండు పుస్తకాలూ దగ్గర పెట్టుకొని సమీక్షించుకోవచ్చు. ఇంతకూ మనసు ఫౌండేషన్ అధిపతి డాక్టర్ మన్నం రాయుడుగారు నాకు ఈ అవకాశం ఇవ్వకపోయి ఉంటే నా పేరు ‘గురుజాడలు’ సంపుటంలో ఉండి ఉండదు. 2000 పుటల ‘గురుజాడలు’ సంపుటాన్ని Emesco సంస్థ పునర్ముద్రణ చేసింది. రాయుడు గారు ‘గురుజాడలు‘ సంపుటాన్ని వికీ లింక్సులో ఎవరైనా ఉచితంగా చదువుకునేందుకు వీలుగా పెట్టించారు కూడా.

ఈ ప్రాజెక్ట్ తర్వాత నేను మనసు ఫౌండషన్‌తో కలిసి పనిచేశాను.

పఠాభి సమగ్ర రచనల సంపుటం విడుదల.2019 ఫిబ్రవరి19.నెల్లూరు టౌన్ హాల్లో. మనసు ఫౌండేషన్ ఎం.వి. రాయుడు, పఠాభి కుమారుడు కోణార్క, కోడలు కీర్తన తదితరులతో రచయిత.

జాషువ సమగ్ర రచనల సంపుటాన్ని తెస్తున్నపుడు జాషువ పుస్తకాల తొలిముద్రణల కోసం నేను మన రాష్ట్రంలో, ఇతర ప్రదేశాల్లోని అనేక గ్రంథాలయాలు వెదికాను. మనసు ఫౌండేషన్ రాయుడుగారు జాషువ సమగ్ర రచనల సంపుటం ఆవిష్కరణ సభ హైదరాబాదు తెలుగు విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసి, సభకు నన్ను అధ్యక్షత వహించమన్నారు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here