జ్ఞాపకాల తరంగిణి-29

0
2

[box type=’note’ fontsize=’16’] జీవితంలోని వివిధ దశలలో తనకు కలిగిన విశేష అనుభవాలను సంచిక పాఠకులతో పంచుకుంటున్నారు డాకాళిదాసు పురుషోత్తం. [/box]

[dropcap]త[/dropcap]మ జ్ఞాపకాలలో భాగంగా – తాను శ్రీ బెజవాడ గోపాలరెడ్డి గారితో జరిపిన ముఖాముఖిని పాఠకులకు అందిస్తున్నారు శ్రీ పురుషోత్తం కాళిదాసు.

***

బెజవాడ గోపాలరెడ్డి గారితో ముఖాముఖి (6-1-1990)

ప్రశ్న: జాతీయోద్యమంలో పాల్గొనడానికి మిమ్మల్ని ప్రేరేపించిన పరిస్థితులేమిటి?

సమాధానం: మా తండ్రిగారు, అన్నగారు కాంగ్రెస్‌లో ఉన్నారు. మా తండ్రిగారు కొన్ని అఖిల భారత కాంగ్రెస్ సభలకు కూడా హాజరయ్యారు. 1920 నాగపూరు కాంగ్రెస్ తర్వాత మా అన్నగారు, నేను బారకాసు రెడ్డి హాస్టల్లో ఉండి చదువుతున్నపుడు, గాంధీగారు విద్యార్థులను పాఠశాలలను, ప్రభుత్వోద్యోగులను ఉద్యోగాలను విడిచిపెట్టమన్నారు. మేమూ కాంగ్రెస్ వాళ్లమే. నాన్-కోఆపరేషన్ జరుగుతున్న సమయంలో “మీరు చిన్నవాళ్లు” అని నన్ను, నా తమ్ముణ్ణి తిక్కవరపు రామిరెడ్డి రేపటికల్లా నిర్ణయం చెప్పమన్నారు. మేము కాంగ్రెస్‌లో లేకపోవడమేమిటి? అని జనవరి, 28 నాడు స్కూలు మానుకున్నాము. ఆరోజుల్లో నేను థర్డ్ ఫారంలో ఉన్నాను. యీ మాదిరిగా మేము ఉద్యమంలో చేరాము. తర్వాత నాలుగు దినాలకు మమ్మల్ని బందరు తీసుకొనిపోయి ఆంధ్ర జాతీయ కళాశాలలో చేర్చినారు. ఇదే నా జీవితంలో మలుపు, మార్పు.

జాతీయ కళాశాలలో మూడున్నర సంవత్సరాలున్నాను. అక్కడే టాగోర్ గురించి విన్నాను. టాగోర్ రాసిన కథల గురించి కూడా విన్నాను. శాంతినికేతన్ నుంచి ఒక మిత్రుడు ఉత్తరం రాశాడు. 1924 జులై నెలలో విశ్వభారతిలో చేరి, నాలుగేళ్లు అక్కడ చదివాను. మా తమ్ముడు బందరులోనే చదువు కొనసాగించాడు. అప్పుడే భారతదేశం చూడాలని, నానా దెసల సంస్కృతిని తెలుసుకోవాలని, నా దేశంలో భాషలు నేర్చుకోవాలని ఆసక్తి పెరిగింది. శాంతినికేతన్‌లో చేరిన కొద్దికాలానికే, బెంగాలీ నేర్చుకోడం మొదలుపెట్టాను. నెల్లూరులో ఉండగానే ఒక హిందీ పండితుల వద్ద హిందీ నేర్చుకున్నాను. కొద్దికాలంలోనే సంస్కృతం, బెంగాలీ అభ్యాసం అయింది. రెండు మూడు నెలలలోనే టాగోర్ పుస్తకాలూ చదవడం ఆరంభించా.

బందరులో ఉన్నప్పుడే, 1921లో బెజవాడలో అఖిల భారత సభలు జరిగాయి. యెక్కడెక్కడి జనం వచ్చారు. తిలక్ సహాయనిధికి కోటిమంది సభ్యలు, కోటి సంతకాలు. ఈ సభలు ఆంధ్రదేశంలో జాతీయోద్యమానికి పెద్ద ప్రోత్సాహమైనాయి. కొండా వెంకటప్పయ్య వంటి పెద్దలు వచ్చారు. నెల్లూరు నుండి మేనకూరు శ్రీదేవమ్మ (బలరామిరెడ్డి గారి భార్య?) గాంధీ గారిని చూడడానికి వచ్చారు. బొమ్మారెడ్డి శేషురెడ్డి స్కూల్ ఫైనల్ చదువుతూ మానుకొన్నాడు. మరుపూరు కోదండరామరెడ్డి ఆ ఏడు నవంబర్ నాటికే స్కూలు మానుకొన్నాడు. పొణకా కనకమ్మ, కోదండరామరెడ్డి, నాగపూరు కాంగ్రెస్‌కు వెళ్లారు.

బెజవాడ తర్వాత నెల్లూరు వి.ఆర్.సి. కాంపౌండ్‌లో మీటింగ్ జరిగింది! (1921 ఏప్రిల్ 7 సాయంకాలం) చెరుకువాడ నరసింహారావు గాంధీగారి ఉపన్యాసాన్ని అనువదించారు. ఆంధ్రదేశంలోనే సంచలనం కలిగించిన సభ అది. గాంధీ గారు తిక్కవరపు రామిరెడ్డి గారి అతిథిగా ఉన్నారు. రామిరెడ్డిగారి ఇంటికి గాంధీ గారు శాంతినికేతన్ అని పేరుపెట్టారు. 1921లో నెల్లూరులో ఓరుగంటి వెంకటసుబ్బయ్య, వేమూరు లక్ష్మయ్య, పేరు గుర్తు రాలేదు మరొక సాయిబు జైలుకు వెళ్లారు (22nd Feb 24th అని తేదీ కూడా గుర్తుగా చెప్పారు) ఆ రోజుల్లో ఓరుగంటి వెంకటసుబ్బయ్య గారు నెల్లూరు జిల్లాలో ఉద్యమంలో చాల ప్రముఖంగా ఉన్నారు.

నేను మొట్టమొదటిసారి కరాచీ కాంగ్రెస్ సభలకు (1931) హాజరయ్యాను. 1914లో మా నాయన మమ్మల్ని తొలిసారి మద్రాసు కాంగ్రెస్ సభలకు తీసుకొనివెళ్ళారు. అయన సభలకు, మేము పట్టణం చూడడానికి వెళ్ళాము. మా తండ్రిగారి ప్రభావం పరోక్షంగా నా మీద ఉంది. నాకు తెలిసే సమయానికి తూములూరు పద్మనాభయ్య, రాళ్ళపల్లి రామసుబ్బయ్య, పాటూరు సుబ్బరామయ్య, బాలసరస్వతమ్మ దంపతులు, దొరస్వామయ్య ఉద్యమంలో ప్రముఖంగా ఉన్నారు. తూములూరు శివరామయ్య, అన్నా.., కరాచారి ఉద్యమానికి పరోక్షంగా సహాయపడేవారు. రామిరెడ్డి గారికన్నా ముందు బాయికాట్ అఫ్ కౌన్సిల్ అని ఒక కార్యక్రమం జరిగింది. బెజవాడ సుందరరామరెడ్డి కౌన్సిల్‌కు నిలవాలని ప్రయత్నం చేస్తున్నాడు. దర్శి నుండి సూళ్లూరుపేట వరకు విస్తరించి వున్న నియోజకవర్గంలో ఇద్దరు సభ్యులు నిలబడి గెలుస్తారు. మావాళ్లు కొందరు ప్రచారం చేసారు. మా అన్న చంద్రశేఖరరెడ్డిగారు పోలింగ్ స్టేషన్‌కు వెళ్ళద్దు, ఎన్నికలు బాయికాట్ చేయండి అని ప్రచారం చేశారు, మాంటెగు, ఛేంస్ఫర్డ్ సంస్కరణలకు వ్యతిరేకంగా. మా యింట్లోనే, మా కుటుంబసభ్యులు మేనకూకురు సీతారామరెడ్డి, వరదారెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రెండుమూడు నెలల తర్వాత అసలు పోటీదారులు యెన్నికల నుండి ఉపసంహరించుకున్నారు. జస్టిస్ పార్టీ అభ్యర్థి కాటంరెడ్డి ఆదినారాయణరెడ్డి, స్వతంత్ర అభ్యర్థి సుబ్బుకృష్ణారావు గెలుపొందారు. ఎల్లారెడ్డి సుబ్బరామిరెడ్డి, కె.నారాయణస్వామిరెడ్డి(ఎ. సి. సుబ్బారెడ్డి బావమరిది) సూరం శ్రీరాములు ఓడిపోయారు.

ప్రశ్న: జిల్లాలో జాతీయోద్యమంలో పాల్గొన్న, మీకు గుర్తున్న వ్యక్తులను గురించి చెప్పండి?

సమాధానం: లేబూరు సుబ్బరామరెడ్డి గారి భార్య లక్ష్మమ్మ ఖద్దరు ధరించేవారు, కాంగ్రెస్ ఉద్యమాలలో పాల్గొని జైలుకు కూడా వెళ్లారు. నేషనల్ స్కూల్స్ కూడా ఆ రోజుల్లోనే వెలిశాయి. ఇప్పుడు కస్తూరిదేవి విద్యాలయం స్థలంలోని ఇంటిలో ఆరోజుల్లో డిఎమ్.ఓ. ఉండేవారు. ఈ స్థలం రేబాల పట్టాభిరామరెడ్డిది. దీన్ని ఇచ్చి, కస్తూరిదేవి విద్యాలయం కోసం పొగతోట సమీపంలో కనకమ్మ కొన్న స్థలాన్ని పట్టాభిరామారెడ్డి స్థలమార్పిడి చేసుకొన్నారు.

1917లో మద్రాసు ప్రెసిడెన్సీ పొలిటికల్ కాన్ఫరెన్స్ అని ఒక సభ నెల్లూరులో జరిగింది. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర తీర్మానానికి కాటంరెడ్డి ఆదినారాయణరెడ్డి ప్రచారం చేశారు, రేబాల లక్ష్మీనరసారెడ్డి, రేబాల పట్టాభి రామరెడ్డి ఈ తీర్మానాన్ని బలపరచారు. తీర్మానం పాసయింది.

1920 నాటికే జస్టిస్ పార్టీ మంత్రివర్గం ఏర్పడింది. జిల్లాలో పెద్దరెడ్లందరూ జస్టిస్ పార్టీ. బెజవాడ కుటుంబం, బ్రాహ్మల్లో వకీళ్లు కాంగ్రెస్ సానుభూతిపరులుగా ఉంటూ వచ్చారు. కావలిలో దేశిభట్ల రంగయ్య గారు కాంగ్రెస్ పక్షం. నాగసూరి వీరరాఘవులు 1930 సత్యాగ్రహంలో పాల్గొన్నారు. ఆయన 1920 నాటికి జాతీయోద్యమంలో లేరు. వీరి కుమార్తె కూడా జైలుశిక్ష అనుభవించారు. గూడూరు శేషురెడ్డి 1921లో జైలుకువెళ్లారు, తను మాస్ ఆరెటర్.. మా అన్న గారు చంద్రశేఖరరెడ్డి సంవత్సరం, full one year కారాగారంలో ఉన్నారు. విద్యార్థిగా ఉన్నపుడే ఆయన అరవిందుని ప్రభావంలోకి వచ్ఛారు. వారు 1947లో కాలంచేశారు.

ప్రశ్న: పల్లిపాడు ఆశ్రమాన్ని గురించి ఏమైనా చెప్తారా?

సమాధానం: పొణకా కనకమ్మగారు ఆశ్రమస్థాపనకు ఎక్కువ ఉత్సాహం చూపించారు.

ప్రశ్న: ప్రిన్స్ అఫ్ వేల్స్ (వేల్సు రాకుమారుడు) రాక సందర్భంగా బాయికాట్‌కు పిలుపిచ్చారుగదా?

సమాధానం: నాకా విషయాలు గుర్తులేవు.

ప్రశ్న: 1921 అహమ్మదాబాదు కాంగ్రెస్ సభలకు పొణకా కనకమ్మ గారు తదితరులు హాజరయ్యారుగదా?

సమాధానం: నాకు గుర్తులేదు. 1922 గయ కాంగ్రెసుకు జిల్లానుండి బెజవాడ సుందరరామిరెడ్డి, తదితరులు వెళ్లివచ్చారు. ఓరుగంటి మహాలక్షమ్మ, కనకమ్మ, బాలసరస్వతమ్మ, నెల్లూరు టౌన్లో ఉత్సాహంగా పనిచేసేవారు. ఈ ఉద్యమ సందర్భంగా బుచ్చిరెడ్డిపాలెంలో చాలా ఇళ్లలో రాట్నాలు తిరిగాయి. అస్పృశ్యతా నిర్మూలనలో కురుగంటి రాఘవరెడ్డి చురుకుగా పాల్గొన్న గాంధేయవాది. చతుర్వేదుల రాఘవయ్య గారి కుమారుడు కృష్ణయ్య అస్పృశ్యతా నిర్మూలనలో పనిచేశారు.

ప్రశ్న: స్వరాజ్యపార్టీ స్థాపనను గురించి ఏమైనా జ్ఙాపకాలు..?

సమాధానం: గాంధీగారు జైల్లో ఉండగా, 1922లో ఈ ప్రస్తావన వచ్చింది. అహమ్మదాబాదు కాంగ్రెస్ సమావేశాల తర్వాత ఒక అంగీకారానికి వచ్చారు. కాంగ్రెస్ అని పేరు పెట్టుకోకుండా స్వరాజ్య పార్టీ పేరుతో పొటీ చేయవచ్చన్నారు. 1924లో గాంధీ గారు బెల్గాం కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించారు. స్వరాజ్య పార్టీకి రాజగోపాలాచారి వ్యతిరేకం, no changer. మోతిలాల్ నెహ్రు, సి.ఆర్. దాస్ pro changers. మా బావగారు ఆ పార్టీలోకి వెళ్లారు. దాస్ వాళ్ళ ప్రయత్నాలు సఫలం కాలేదు.

మన జిల్లాలో పొణకా గోవిందరెడ్డికి బెజవాడ రామచెంద్రారెడ్డితో తగాదా, దాంతో జస్టిస్ పార్టీ నుండి కాంగ్రెస్ లోకి వచ్చాడు. 1923లో ప్రో ఛేంజర్ అయిన ఆదినారాయణరెడ్డి చనిపోవడంతో బెజవాడ రామచెంద్రారెడ్డి మొదటి పర్యాయం ఎన్నికల్లో పోటీచేసి గెలిచాడు. ఏ.ఎస్. కృష్ణారావు స్వరాజ్య పార్టీ తరపున పోటీచేసి గెలిచి జిల్లా బోర్డు అధ్యక్షుడయ్యాడు. వెంకటగిరి జమీందారు కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేసి, అత్యధిక ఓట్లతో మొదటి స్థానంలో నిలిచాడు. తర్వాత బెజవాడ రామచంద్రారెడ్డి వచ్చాడు. అప్పుడు 10 రూపాయాలకు మించి శిస్తు కట్టేవారికి, ఇల్లు ఉన్నవాళ్లకు మాత్రమే ఓటుండేది. ఎన్నికల ప్రచారంలో సభలు ఉండేవి కాదు. ఊళ్ళకు వెళ్లి గ్రామ పెద్దలను, నాయకులను కలిసేది. వాళ్ళు చెప్పడమే. పెద్ద భూస్వాములను పట్టుకొని తిప్పుకొనేది. పెద్ద భూస్వాములంతా జస్టిస్ పార్టీ తరఫునే పనిచేశారు. మన జిల్లాలో స్వరాజ్యపార్టీ ప్రభావంలేదు.

ప్రశ్న: అల్లూరి సీతారామరాజు విప్లవాన్ని గూర్చి మీ జ్ఞాపకాలు..

సమాధానం: నేను బందరులో చదువుకుంటున్న రోజుల్లోనే అల్లూరి సీతారామరాజు తిరుగుబాటు జరిగింది. సీతారామరాజు పోరాటంలో అమరులైనపుడు పట్టాభి సీతారామయ్య గారు జన్మభూమి పత్రికలో చాల ప్రశ్నలు లేవనెత్తుతూ రాశారు. ఆంధ్రపత్రిక, కృష్ణాపత్రిక, ఇంగ్లీషులో జన్మభూమి వార్తలు ప్రచురించాయి.

ప్రశ్న: వి.ఆర్.హైస్కూల్ జ్ఞాపకాలు ఏవైనా చెప్పండి.

సమాధానం: మాకు విశ్వేశ్వరరావు ఇంగ్లీష్ టీచరు. తిరువేంగడాచారి, ఏకాంబరయ్య కూడా ఇంగ్లీష్ చెప్పేవారు. ఆ స్కూల్ వాతావరణం వల్ల కొంతవరకు విద్యార్థుల్లో జాతీయభావాలుండేవి. ఈ స్కూలు మేనేజ్మెంట్ కాంగ్రెస్ అనుకూల బ్రాహ్మణ న్యాయవాదుల చేతుల్లో ఉండేది. మిషన్ స్కూల్ నడిపేవారు ప్రో గవర్నమెంట్.

ప్రశ్న: గాంధీ గారి నెల్లూరు పర్యటన గురించి చెప్పండి.

సమాధానం: 1929 పర్యటన నిర్వహణ బాధ్యులు బెజవాడ సుందరరామారెడ్డిగారు. ఈ పర్యటనలోనే రేబాల పట్టాభి గాంధీగారికి ఆతిథ్యమిచ్చారు. గాంధీ గారు మేనకూరు శ్రీదేవమ్మను చూచివెళ్లారు (బుచ్చిలోనా?) సుశీలానయ్యర్, జమనాలాల్ బజాజ్ గారి కుమార్తె కూడా గాంధీ గారి వెంట ఉన్నారు. 1933లో గాంధీ గారి హరిజన నిధి పర్యటనలో నెల్లూరు టౌన్‌లో ఏర్పాట్లు నేను చూచుకున్నాను. దొడ్ల రుక్మిణమ్మ బెజవాడ రామచంద్రారెడ్డి గారి కుటుంబానికి చెందిన వ్యక్తి. అయితే ఆమె మాత్రం కాంగ్రెస్, గాంధీ గారి అభిమాని. ఆమె యింట్లోనే బుచ్చిరెడ్డిపాలెలో స్త్రీల సభలో గాంధీ గారు ఉపన్యసించారు. నేను మా తల్లిగారి చేత ఖద్దరు కట్టించడానికి ప్రయత్నం చేశాను కానీ ఆమె మారలేదు. మా అమ్మ literate. నూకలపాటి రామమ్మ మా కుటుంబానికి కావలసినవారు. ఆమె కొంత సంస్కృతం చదువుకున్నది. పురాణాలు చదివి అర్థం చెప్పేవారు. కొరుటూరులో పట్నం వెంకటసుబ్బారెడ్డి మొదటినుండి జాతీయవాది. గండవరపు హనుమారెడ్డిది ఆ ఊరే, ఇద్దరు జైలుకు రాలేదు.

ప్రశ్న: నెల్లూరు అంటే మీకేం గుర్తొస్తుంది?

సమాధానం: Constituent assembly సభ్యుడిగా 1947లో సిమ్లాకు వెళ్ళాను. అక్కడ ఒక గదిముందు ‘Nellore rice sold here’ అని పెట్టి వున్న బోర్డు చూచి సంతోషించా. పెద్ద మెతుకు, రాత్రి వండి, ఉదయం చద్దన్నం తినడానికి లాయక్కైనది. Prince of paddy. కేసర్లు నాసిరకం, పేదలు తినేది. నెల్లూరు ఎద్దులు, నెల్లూరు బియ్యం.. నెల్లూరు తాలూకాలో కొద్దిభాగమే నీటి పారుదల సౌకర్యం ఉన్నది. కోవూరు తాలూకా వరిసాగులో బాగా ముందుంది. పెళ్లేటి, నల్లపురెడ్డి, వొరగలి రంగారెడ్డి వంటి వారివి గొప్ప కుటుంబాలు. పూర్వం పెద్దపెద్ద భూస్వాముల్లో చాలామంది ఇప్పుడు రుణగ్రస్థులయ్యారు. కుడితిపాలెం టంగుటూరు రామిరెడ్డి more enlightened. కూకటి కోదండరామిరెడ్డి టంగుటూరు కుటుంబం నుంచి పెద్ద లాభమే పొందారు. ఏనుగు రాఘవరెడ్డి గారు జిల్లాలో రెడ్డికుటుంబాల్లో తోలి graduate కావచ్చు. భూస్వాములు కాంట్రాక్టర్లను తక్కువగా చూసేవారు.

బెజవాడ గోపాలరెడ్డి గారితో ముఖాముఖి (7-1-1990)

ప్రశ్న: ఉప్పు సత్యాగ్రహం గురించి మీ అనుభవాలు తెలియజేయండి.

సమాధానం: ఆ సమయంలో ఓరుగంటి వెంకటసుబ్బయ్య గారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు. ఆంధ్ర నాయకులు గుంటూరులో నడింపల్లి నరసింహారావు గారింట్లో సమావేశమయ్యారు. గాంధీగారు దండిలో ఉప్పుసత్యాగ్రహం చేస్తున్న సందర్భం. ఎవరి అనుకులాన్నిబట్టి 6-13 తేదీల మధ్య జిల్లాల్లో సత్యాగ్రహం చెయ్యమని తీర్మానించారు. గంజాం జిల్లా అప్పడు మనచేతుల్లో ఉంది. నౌపాడలో ఉప్పుకోటార్లున్నాయి. అక్కడ సత్యాగ్రహం చేస్తే, పోలీసులు దాడులు చేసి సత్యాగ్రహాన్ని రభస చేశారు. బందరు, గుంటూరు వాళ్ళు ఉప్పురాళ్లు తెప్పించుకొని గుంటూరులో వెంకటప్పయ్య గారింట్లో సత్యాగ్రహం చేశారు. నెల్లూరు జిల్లావాళ్ళం ఏప్రిల్ 11న మైపాడులో సత్యాగ్రహం చేయాలని నిశ్చయించుకొన్నాము. దువ్వూరు బలరామిరెడ్డి మైపాడు సత్యాగ్రహానికి ఏర్పాట్లు, సదుపాయాలుచేసి, దానికి కారణభూతులయ్యారు. 11వరకు జిల్లా కాంగ్రెస్ సత్యాగ్రహంలో పాల్గొనే వారి పేర్లు నమోదు చేసుకొన్నది. నేను(బెగోరె, కెప్టెన్‌గా) నలుగురు సభ్యులం సత్యాగ్రహం చేసాము. జమీన్ రైతులో వివరాలన్నీ ఉన్నాయి. ఉప్పుచేసి పొట్లాలు మైపాడులో, నెల్లూరులో అమ్మాము. వేలంలో 5 రూపాయలనుంచి, 50 దాక అమ్ముడుపోయింది. ఈ ఏప్రిల్ 11 నాటికి మైపాడు సత్యాగ్రహానికి, షష్టి పూర్తి అవుతుంది. ఆరోజు ‘మైపాడుతీరం’ అనే కవితను స్మరిస్తూ సత్యాగ్రహం చేశాను. పోలీసులు పేర్లు రాసుకున్నారు తప్ప ఏమీ చెయ్యలేదు. కొన్నవాళ్ళ పేర్లు కూడా పోలీసులు రాసుకున్నారు తప్ప మరేమి జోక్యం చేసుకోలేదు. ఆ సమయంలో నెల్లూరు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ సుబ్రమణ్య అయ్యరు. అయిదుగురు సభ్యులు ఒక బృందంగా 2,3,4 బృందాలు మైపాడువద్ద సత్యాగ్రహం చేశారు. సత్యాగ్రహాన్ని చూడడానికి రెండుమూడు వందలమంది ప్రేక్షకులు వచ్చారు. మా శిబిరాన్ని మైపాడులో తాలూకా బోర్డు విశ్రాంతిగృహంలో ఏర్పాటు చేశాము. నా సలహా మీద ఈ భవనాన్ని పడగొట్టకుండా స్మారక చిహ్నంగా ఉంచారు. పోలీసులు అరెస్టులు చెయ్యకపోవడంతో గోగులపల్లి వాళ్లు వచ్చి మమ్మల్ని ఆహ్వానించారు. మా క్యాంపు అక్కడికి మార్చుకొన్నాము.

గోగులపల్లి సత్యాగ్రహాన్ని దర్శించేందుకు ఊరు ఊరంతా వచ్చేది. సత్యాగ్రహంలో ఆడామగా పాల్గొన్నారు. తడ, నాయుడుపేట నుంచి కూడా గోగులపల్లికి వచ్చి సత్యాగ్రహంలో పాల్గొన్నారు. అక్కడ కూడా అరెస్టులు జరగలేదు. దాంతో మేము గ్రామాలకువెళ్లి సత్యాగ్రహం గూర్చి ప్రచారం చేయడం ప్రారంభించాము. నా తొలి రాజకీయ ఉపన్యాసం కావలి వీధుల్లో చేశాను. గోగులపల్లి క్యాంపు 10-15 దినాలు జరిగింది. కడపటికి, మోపూరు గ్రామంలో మే 26 సాయంత్రంవేళ ఒక రెడ్డి గారితో మాట్లాడుతూంటే గూడూరులో సబ్ కలెక్టర్ గారి ఎదుట హాజరుకమ్మని పోలీసులు నాకు నోటీసిచ్చారు. మొదటి బేచ్‌లో బొమ్మారెడ్డి శేషురెడ్డి, బత్తిన పెరుమాళ్లునాయుడు తదితరులను విచారించారు. “You have done your duty. I have done my duty” అని సబ్ కలెక్టరు అన్నాడు. 3 నెలల విడి ఖైదు విధించి, నాకు మాత్రం బి క్లాసు ఇచ్చాడు. నేను వెల్లూరు జైలుకు చేరేసరికి అక్కడ పట్టాభిసీతారామయ్య ఇత్యాదులున్నారు. నెల తర్వాత సింపుల్ బి క్లాసు ఖయిదీలను కడలూరుకు పంపారు. నేను 1930 ఆగష్టు 25న కడలూరు జైలునుండి విడుదలయ్యాను. బెజవాడ శివకోటారెడ్డి గారు నన్ను రిసీవ్ చేసుకొన్నారు. మద్రాసులో రెండునాళ్ళుండి 29న నెల్లూరు వచ్చాను. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ వారినందరినీ ఆరెస్టు చేశారని, మాలవ్య వాళ్లకోసం నెల్లూరు టౌన్‌లో హర్తాళ్ చేస్తున్నామని, వి.ఆర్.కాలేజి విద్యార్థులు నన్ను కలిసి ఆహ్వానించారు. మధ్యాహ్నం రెండు గంటలకో, మూడు గంటలకో నేనూ ఉరేగింపులో చేరాను. ఊరేగింపు కొంచెందూరం సాగిందో లేదో సి.ఐ మునిలాల్ “You are under arrest” అని అన్నాడు. వాడికి చాల దుర్మార్గుడని పేరు. రామనాయుణ్ణి కొట్టిచ్చాడు కూడా. నాకు గొప్ప అవకాశం వచ్చింది. విడుదలైన నాడే మళ్లీ అరెస్టు కావడం. ఇది నాకు అదృష్టమైంది. సబ్ మేజిస్ట్రేట్ మునుసబు కలెక్టర్ కోర్టులో విచారణను చూడడానికి కోర్టుకు మా బంధువులంతా వచ్చారు. నాకు ఆరునెలల కఠిన కారాగార శిక్ష విధించబడింది, సాధారణ ఖైదీగా ఏ క్లాసో చెప్పకుండా శిక్ష విధిస్తే సి క్లాసు అన్నమాట. వెల్లూరు క్వారంటైన్‌లో నన్నుంచారు. 21 రోజులు సాధారణ ఖయిదీల డ్రెస్సులో మాములు ఖైదీలతో ఉన్నాను. అప్పడు మెక్ డోనాల్డ్ గవర్నరు(?) ప్రభుత్వం. నాకు జైల్లో రాళ్ళు కొట్టడం వంటి పనులిచ్చారు. కొట్టినట్లు నటించాను తప్ప పనేమీ చేయలేదు. తర్వాత బి క్లాసిచ్చారు. వెల్లూరు జైల్లో పోలీసులు అతిగా ప్రవర్తించలేదు. జైలు సూపరిండెంట్ గిల్ మర్యాదగా వ్యవహరించేవాడు. రకరకాల భాషల వాళ్ళం, పంజాబీ, కన్నడ, తమిళం, అందరూ మొత్తం 400 ఖయిదీలం ఉండేవారం. ఏదో ఒక సత్రంలో మాదిరి జైలు జీవితం ఉండేదేగాని జైల్లో ఉన్నట్లు అనిపించేది కాదు. నేను అక్కడ నవారు నేత నేర్చుకున్నాను. కొంతమంది ప్రెస్‌లో పనిచేసేవాళ్ళు. అక్కడ మాకేమీ కష్టం అనిపించలేదు. వార్డెన్ల సహాయంతో కొంతమంది దొంగతనంగా జైల్లోకి పత్రికలు తెప్పిచుకొనేవారు. వార్తలు ఆ విధంగా అందరికి తెలిసేవి. జిల్లాలో అందరికంటే ముందు పెద్దతరం, భూస్వాములు అరెస్టయి వెల్లూరు జైలుకు వచ్చారు. పంచేడు బాలకృష్ణారెడ్డి, మేనకురు సీతారామిరెడ్డి, నూకలపాటి లక్ష్మీనరసారెడ్డి, నూకలపాటి వెంకటపతిరెడ్డి, ఇసనాక రంగారెడ్డి(ఎల్లాయపాలెం) మొదలైనవాళ్ళు. జైల్లో సాయంత్రాలు ప్రార్థనలుండేవి. తమిళులు భారతి పాటలు పాడేవారు. భారతికి సెప్టెంబర్లో శిక్షపడింది.(?)ఫిబ్రవరి 7న రెమిషన్ రావడంతో విడుదలైనాను.

ఫిబ్రవరి 6న మోతీలాల్ నెహ్రు చనిపోయారని తెలిసింది. 7న నెల్లూరులో హర్తాళ్ జరిగింది. ఈలోపే జయకర్, సప్రూ రాయబారం నడిచింది. అప్పుడు నెహ్రు కాంగ్రెస్ ప్రెసిడెంట్. ఆయనతో సంప్రదించకుండా నేనేమీ చేయలేనని గాంధీ గారన్నారు. మోతీలాల్‌ను, నెహ్రును ఇద్దరినీ ఎరవాడ జైలుకు డిసంబరులో తీసుకొనివెళ్ళారు. అప్పడు వాళ్ళు వర్కింగ్ కమిటీ సమావేశం కావాలన్నారు. పట్టాభి, రాజగోపాలాచారి వెల్లూరు జైల్లో ఉన్నారు. ఇద్దరినీ విడుదల చేయమని ఆర్డరు వచ్చింది. అప్పుడు అందరూ విడుదలవుతామని రాత్రంతా గదుల్లోంచే కేకలు పెడుతూ సంతోషంగా ఉన్నాము. ముట్నూరు కృష్ణారావు కూడా వర్కింగ్ కమిటీలో ఉన్నాడని, అందరినీ రెండు విడతలుగా విడుదల చేసారు.

ఇర్విన్ వద్దకు గాంధిగారి రాయబారం తర్వాత గాంధీ ఇర్విన్ ఒప్పందంతో అందర్నీ విడుదలచేశారు. ప్రజలు స్వేచ్ఛగా ఉప్పు వండుకొనేలాగా గాంధీ గారు రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరుకావడానికి అంగీకరించారు.

1931 ఫిబ్రవరిలో ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ సమావేశం గుంటూరులో జరిగింది. ప్రకాశం పంతులు, పట్టాభి ఆ సమావేశానికి అధ్యక్షులుగా వ్యవహరించాలని పోటీపడ్డారు. కానీ గుంటూరు, కృష్ణ కమ్మవారు కొందరు చింతమనేని భావయ్య, మరికొందరు గంపలగూడెం కుమారరాజా గారిని ప్రతిపాదించారు. వారు బరంపురంలో ఉపన్యాసం చేసి ఏడాది శిక్ష అనుభవించారు. ఇది కాంగ్రెస్‌లో ఒకరకంగా నాన్ బ్రాహ్మిన్ ఉద్యమం అనండి, పట్టాభి ముందు విరమించుకున్నాడు. తర్వాత ప్రకాశాన్ని ఒప్పించి పోటీనుంచి విరమింపజేశారు. ఆయన అయిష్టంగానే విరమించుకున్నారు. ఆ సమావేశంలో నేను జాయింట్ సెక్రటరీగా ఎన్నికయ్యాను. పిసిసి.లో ఒక పదవంటూ రావడం దాంతోనే.

నేను కరాచీ కాంగ్రెస్‌కు హాజరయ్యాను. నాయకులను బొంబాయిలో కలుసుకొని, వారితో ఓడ మీద కరాచీ చేరుకున్నాను. ఓడలో ఉండగానే మార్చ్ 23న భగత్‌సింగ్‌ను ఉరితీసినట్లు తెలిసింది. కరాచీ కాంగ్రెసుకు ముందుగానే శిక్ష అమలుచేయమని గాంధీగారు కోరినట్లు, Plead చేసినట్లు తెలిసింది. ఈ సభల్లోనే మొదటిసారి మైకులు ఏర్పాటుచేశారు. సభలు వల్లభాయ్ పటేల్ అధ్యక్షతన జరిగాయి. ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here