జ్ఞాపకాల తరంగిణి-30

1
2

[box type=’note’ fontsize=’16’] జీవితంలోని వివిధ దశలలో తనకు కలిగిన విశేష అనుభవాలను సంచిక పాఠకులతో పంచుకుంటున్నారు డాకాళిదాసు పురుషోత్తం. [/box]

[dropcap]త[/dropcap]మ జ్ఞాపకాలలో భాగంగా – తాను శ్రీ బెజవాడ గోపాలరెడ్డి గారితో జరిపిన ముఖాముఖిని పాఠకులకు అందిస్తున్నారు శ్రీ పురుషోత్తం కాళిదాసు.

***

ప్రశ్న: నెల్లూరులో జరిగిన ఉద్యమాలను గురించి చెప్పండి.

సమాధానం: 1932 నవంబర్ 17న పల్లిపాడు ఆశ్రమాన్ని పోలీసులు సోదా చేసారు. గాంధీ గారిని అరెస్ట్ చెయ్యడంతో నాయకత్వలోపం ఏర్పడింది. 18న పొణకా కనకమ్మ, నేను నెల్లూరులో విదేశీ వస్త్రాలు అమ్మే అంగళ్ల ముందు పికెటింగ్ చేసి అరెస్టయ్యాము. మే 26న మా ఇద్దరికీ 18 మాసాల కఠినశిక్ష, నాకు 500 రూపాయల జుల్మానా కూడా విధించారు. కనకమ్మ గారికి జుల్మానా లేదు. మరుసటి సంవత్సరం జూన్ 30న మమ్మల్నిద్దరిని విడిచిపెట్టారు. ఆమె వెల్లూరు స్త్రీల జైల్లో, నేను పురుషుల జైల్లో ఉన్నాము.

ప్రశ్న: రంగా గారిని గురించి ఏమైనా చెప్పండి.

సమాధానం: అయన గాంధీ గారు రౌండ్ టేబుల్‌కు వెళ్ళినపుడు తాను కూడా లండన్ వెళ్లి ఆంధ్రపత్రిక విలేకరిగా కాంగ్రెస్‌కు అనుకూలంగా వార్తలు పంపుతూ వచ్చారు. రంగా గారు resettlement కు వ్యతిరేకంగా ఉద్యమం చేసి మాకన్నా ముందుగా జైలుకు వెళ్లారు. రైతు ఉద్యమ నాయకుడుగా ప్రసిద్ధికివచ్చారు.

ప్రశ్న: 1933లో గాంధీ గారు నెల్లూరు జిల్లాలో పర్యటించిన వివరాలు చెప్తారా?

సమాధానం: 1932లో గాంధీ గారు జైల్లో ఉండగా బ్రిటిష్ ప్రధానమంత్రి మెక్ డోనాల్డ్ ఒక అవార్డు ఇచ్చాడు. సాధారణ ఎన్నికల్లో హరిజనులు వోటుచేస్తారు. అదనంగా తమ నాయకులను తాము ఎన్నుకొంటారు. 32 సెప్టెంబర్లో గాంధీ గారు ఈ అవార్డుకు వ్యతిరేకంగా ప్రచారం చేసి, దీన్ని సవరించకపోతే, ఆమరణ పర్యంతం నిరశన వ్రతం చేస్తానని చెప్పారు. నెల్లూరు జిల్లాలో గాంధీ గారు ఇందుకోసం పర్యటించినపుడు నేను వారి పర్యటనకు బాధ్యుణ్ణిగా వ్యవహరించాను. అంబేడ్కర్ ఈ అవార్డును ఆహ్వానించారు.

ప్రశ్న: మద్రాసు కుట్రకేసులో నెల్లూరు వాళ్లకు ఎవరికైనా సంబంధం ఉందా?

సమాధానం: అప్పుడే రేబాల దశరథరామిరెడ్డి నెల్లూరులో ప్రాక్టీస్ మొదలుపెట్టారు. దంపూరు బాలయ్యవాళ్ళు ఆయన ఇంట్లో బాంబులు పెట్టారు. ఆ కేసులో బాలయ్యను, రేబాల కాపురస్తులు పట్టాభిరామిరెడ్డికి, ఇద్దరికీ రెండేళ్ల కఠినశిక్ష పడింది. ఈ కేసులో మద్రాసువాళ్ళు ఉన్నారేమో గుర్తులేదు.

ప్రశ్న: 1935లో కాంగ్రెసు స్వర్ణోత్సవాలు మన జిల్లాలో చేశారుకదా?

సమాధానం: కాంగ్రెస్ గోల్డెన్ జూబిలీ నెల్లూరులో జరిపాము. బుచ్చిలో, పల్లిపాడులో చేశాము.

ప్రశ్న: 1937 ఎన్నికలను గురించి చెప్పండి.

సమాధానం: ఈసారి ఆరు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 1937 జులై 14న మంత్రివర్గం ఏర్పడింది. నేను కూడా మంత్రిగా నియమించబడ్డాను. మధ్యలో కె.వి రెడ్డి మధ్యంతర ప్రభుత్వం ఏర్పడి ఆరుగురు మంత్రులతో కె.వి.రెడ్డిని కౌన్సిల్‌కు నామినేట్ చేసారు. ఆ మంత్రి వర్గం మూడు నెలలు పనిచేసి, 37 అక్టోబర్లో రాజీనామా చేసింది.

ప్రశ్న: యుద్ధకాలన్ని గురించి మీ స్మృతులేవైనా..

సమాధానం: 1940 నవంబర్ 26న నేను బుచ్చిలో యుద్ధవ్యతిరేక నినాదాలు-నాలుగు పర్యాయాలు చేశాను. అరెస్టుచేసి, ఒక సంవత్సరం కఠినశిక్ష, 1000/- జుల్మానా వేశారు. 1941లో మరొకసారి యుద్ధ వ్యతిరేకంగా సత్యాగ్రహం చేశాను. 3 నెలల శిక్షవేసి వెల్లూరు జైల్లో ఉంచారు. రేబాల దశరథరామిరెడ్డి, పొన్నలూరు వీరరాఘవరెడ్డి తదితరులు కూడా వెల్లూరు జైలుకు వచ్చారు. మమ్మల్ని వెల్లూరు నుంచి తిరుచినాపల్లి జైలుకు పంపించారు. రాజగోపాలాచారి, మాగంటి బాపినీడు, నేను ఒక బ్లాకులో ఉండేవాళ్ళం. ప్రకాశం, గిరిగారు మరొక బ్లాకులో ఉండేవారు. రాజగోపాలాచారి గారిని సపోర్ట్ చేస్తానని ప్రకాశం గారికి నామీద కోపంగా ఉండేది. ఆంధ్రుడుగా ఉండి తమను సపోర్ట్ చేయలేదని కోపం. ఆ రోజుల్లోనే రాజగోపాలాచారి గారి ఒక అన్నగారు చనిపోయారు. ప్రకాశం గారు, రాజగోపాలాచారి, నేను ఒకేరోజు విడుదలయ్యాము. రాజగోపాలాచారికి అదనంగా నాలుగు రోజులు రెమిషన్ ఇప్పించాను. తిరుచినాపల్లి జైలు ఒక విశ్వవిద్యాలయం లాగా ఉండేది. రాజగోపాలాచారి మాకు క్లాసులు తీసుకొనేవారు. నేను బెంగాలీ నేర్పించేవాణ్ణి. కల్కి, సంతానం నాదగ్గర బెంగాలీ నేర్చుకొన్నారు. బందరునుండి వచ్చిన మల్లికార్జునుడివద్ద రంగాగారు రామాయణం చెప్పించుకొన్నారు. అప్పుడే టాగోర్ చనిపోయారు. మేము సమావేశమై రంగాగారిని మాట్లాడమన్నాము. వారు నన్ను మాట్లాడమన్నారు. నేను మాట్లాడిన తర్వాత శ్రద్ధాంజలి ఘటించాము.

అనంతశయనం మొదలైన వాళ్ళు మరొక బ్లాకులో ఉండేవాళ్ళు. అనంతశయనం గారు క్లాసులు చెప్పేది. గిరి గారు రోజు సగటున 10గంటలు రాట్నం వడికేవారు. సాయంత్రం నాలుగు అవగానే గిరిగారు, నారాయణస్వామి గారు రెండుమూడు మైళ్లు నడిచేవారు. మా జైలుకే సత్యమూర్తి గారు వచ్చారు. వారానికి, పదిహేనురోజులకు ఒకసారి ఆయన భార్య, కుమార్తె వచ్చి ఇంటర్వ్యూ చేసి పోయేవాళ్లు. ఆయనకు వాళ్ళ రాక పరమ సంతోషం కలిగించేది. మేమంతా ఏ క్లాస్ వాళ్ళం. అదే కట్టకడపటి కారాగారవాసం.

క్విట్ ఇండియా ఉద్యమం

బొంబాయిలో క్విట్ ఇండియా తీర్మానానికి అనుకూలంగా ఓటు చేశాము. సంజీవరెడ్డిని, ప్రకాశాన్ని సత్యమూర్తిని, అరెస్టు చేసి తీసుకొనివెళ్ళారు. నేను, వంగల్లు కోదండరామిరెడ్డి గారు నెమ్మదిగా రేణిగుంటలో రైలుదిగి నెల్లూరు చేరాము. అప్పడు అక్టోబరులో వంగల్లు కొదండ రామిరెడ్డి, నేను కలిసి పంచాయితీలకు, మునిసిపాలిటీలకు, యుద్ధానికి సహాయం చేయవద్దని జాబులు రాశాము. మమ్మల్నిద్దరిని అరెస్టుచేసి, ఆరునెలల శిక్షవేసి బళ్లారి అలీపూరు జైలుకు పంపించారు. మార్చిలో విడుదల చేస్తే, జైలుగేట్ల వద్దనే మళ్ళీ అరెస్టుచేసి, ఇద్దరినీ డిటెన్యూలుగా వెల్లూరు తీసుకొనివెళ్ళారు. సెంట్రల్ ప్రావిన్సెస్ నాయకులను కూడా వెల్లూరుకు తీసుకొనివచ్చారు. మన దక్షిణాది వాళ్ళను అహమద్‌నగర్ జైలులో ఉంచారు. 1943లో మమ్మల్ని తంజావూరు జైలుకు మార్చారు. 43డిసెంబరులో అమ్మకు బాగాలేదని పెరోలుమీద విడుదలై నెల్లూరుకు వచ్చాను. తిరిగి జైలుకు వెల్లేటప్పటికి విడుదలకు ఆర్డరు వచ్చినది.

1946 ఎన్నికలు

నా మీద హనుమారెడ్డిని పోటీపెట్టి బొమ్మా శేషురెడ్డి తదితరులు నాకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. హనుమరెడ్డికి డిపాజిటు పోయింది. నెల్లూరీయుడు, ఆత్మకూరుకు వంగల్లు కోదండరామిరెడ్డిని నేను ప్రొపోజు చేస్తే, పైవాళ్ళు ఆ నియోజకవర్గంలో వెన్నెలకంటి రాఘవయ్యకు ఇచ్చారు.

1948న పి.రామస్వామి మంత్రివర్గంలో సభ్యుణ్ణిగా ప్రమాణస్వీకారం చేశాము. నేను ఆర్ధిక, రవాణా మంత్రినయినాను.

వెంకటగిరి జమీందారీ రైతు పోరాటం

కాంగ్రెస్ అధికారికంగా ఈ పోరాటంలో ఆసక్తి చూపలేదు. Intellectual ఇంట్రెస్టుతో నేను రామనాయుడుతో కలిసి దర్శి తాలూకాలో కొన్ని మీటింగులలో మాట్లాడాను.

1963లో శాస్త్రి గారు ప్రధాని కావడం గురించి. “If Indira is a candidate, I am not for it” అని లాల్‌బహదూర్ శాస్త్రి గారు అన్నారు.

ప్రశ్న: మీరు గవర్నర్ పదవి చేపట్టడం యెట్లా సంభవించింది?

సమాధానం: ఇందిర ప్రధాని అయినతర్వాత నేను రెండుపర్యాయాలు డిప్యూటీ లీడర్‌గా ఎన్నికయ్యాను. 1966లో ఒకసారి “Will you see me after the meeting?” అని చీటీ మీద రాసి పంపారు. పద్మజా నాయుడు ఎదురుపడి ఏడ్చేశారు. ఆమె ఆరోగ్యం కూడా అంత బాగాలేదు. “Are you interested in Governorship?” ఇందిరా గాంధీ అడిగారు. అప్పడు నాకు 59 ఏళ్ళు. ఒక నిమిషం ఆలోచించుకొని ‘ఎస్’ అన్నాను. ఇది 1966 Nov 23న జరిగింది. రాధాకృష్ణ (సర్వేపల్లి) నా విషయం చెప్పినట్లుంది. కాలం గడిచిపోతూవుంది. ఎన్నికలొస్తున్నాయి. కామరాజ్ లోక్‌సభకు నిలబడమన్నారు. నన్ను స్పీకర్ కావాలన్నారు. విజయవాడ నుండి ఢిల్లీ ఎక్స్‌ప్రెస్‌లో నాగపూరు వెళ్తూ నాగపూరులో పేపర్ కొంటే విషయం తెలిసింది. పాఠక్ కర్ణాటకకు, హుకుంసింగ్ రాజస్థాన్ కు, “గోపాల్’ యూపీకి అని. వెస్ట్ బెంగాల్‌కు అజయ్ ముఖర్జి చీఫ్ మినిస్టర్. కాంగ్రెస్ వ్యక్తిని తప్ప ఎవరినైనా మాకు గవర్నర్‌గా  పంపండి అని అజయ్ హోం మినిస్టరును చవాన్ గారిని అడిగారు. ఆ సూచనమేరకు పంజాబ్ గవర్నర్‌ను వెస్ట్ బెంగాలుకు బదిలీ చేసారు. విజయవాడలో మిత్రులు స్టేషన్లో కలిసి next time మిమ్మల్ని సెలోన్‌లో చూడాలని కోరిక అన్నారు. “షేవింగ్ సెలోన్ లోనా” అని జోక్ చేశాను. ఏప్రిల్ ఫస్టుకు నేను ఢిల్లీ చేరుకున్నాను.

చరణ్ సింగ్ 18 మందితో కాంగ్రెస్ నుండి డిఫెక్ట్ అయి కాంగ్రెస్‌ను ఓడించి బహుళ పార్టీలతో మంత్రివర్గాన్ని ఏర్పాటుచేశారు. ముఖ్యమంత్రిగా పదినెలల చిల్లర రోజులు ఉండి చరంసింగ్ పదవికి రాజీనామా చేశారు. ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఎవరయినా ఏర్పరుస్తారేమోనని నేను ప్రయత్నించాను. కుదర్లేదు. ప్రెసిడెంట్ పాలన విధించమని, అసెంబ్లీని సస్పెండెడ్ యానిమేషన్‌లో ఉంచమని కేంద్రాన్ని కోరాను. కేంద్రం నాకు సలహాదారులను ఇస్తామని సూచించలేదు, నేను కూడా సలహాదారులను నియమించమని కోరలేదు. ఒక సంవత్సరం, ఒక రోజు సలహాదారులు లేకుండా నేను గవర్నరుగా యుపి రాష్ట్రాన్ని పాలించాను. కార్యదర్శులందరినీ మంత్రుల బాధ్యత నెరవేర్చమని, నన్ను ముఖ్యమంత్రిగా భావించి పరిపాలన కొనసాగించమని కోరాను. బి.బి.లాల్ చీఫ్ సెక్రటరీ అప్పుడు. అతను, నేనూ కలిసి ఉత్తరప్రదేశ్ పాలనా బాధ్యత నిర్వర్తించాము. మధ్యలో అసెంబ్లీ ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేశాను, కానీ కుదరలేదు. “I gave a non-interfering government”. తర్వాత ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. సి.బి.గుప్త ముఖ్యమంత్రి అయ్యారు. కాంగ్రెస్లో విభేదాలు, చీలికలువచ్చి గుప్తా ప్రభుత్వం కూలిపోయింది.”

***

వరసగా నాలుగురోజులు బెజవాడ గోపాలరెడ్డిగారితో మాట్లాడాను, తర్వాత ఏదో అంతరాయం వచ్చి కొనసాగలేదు.

తెలుగు విశ్వవిద్యాలయం తరఫున హైదరాబాదు నుంచి, ఆచార్య జయధీర్ తిరుమలరావు గారు తమ వీడియో రికార్డింగ్ యూనిట్‌తో నెల్లూరువచ్చి మరుపూరు కోదండరామారెడ్డి గారిని, గోపాలరెడ్డి గారిని నన్ను ఇంటర్వ్యూ చేయయమన్నారు. ఆ ఇంటర్వ్యూలో కూడా గోపాలరెడ్డి గారు తమ జీవితంలో ముఖ్య సంఘటనలను దాదాపు గంటపైగానే వివరించారు, చాలా స్నేహపూర్వకంగా. అప్పుడు వారి శ్రీమతి, కుమార్తె, మనమరాలితో ఉన్నారు. అందరిని పరిచయంచేసి మనమరాలిని దీవించమని కోరారు.

1975 ప్రాంతంలో గోపాలరెడ్డి గారు నన్ను తమ తండ్రిగారు పట్టాభిరామారెడ్డి గారిని గురించి, మామగారు తిక్కవరపు రామిరెడ్డిగారిని గురించి రెండు వ్యాసాలు రాసి ఇవ్వమని కోరారు. వారిని గురించి అప్పటికి నాకు ఏమీ తెలియదు. నెల్లూరు పాతపత్రికలు చదివి, పెద్దలనడిగి విషయాలు సేకరించుకోను చాలాసమయం పట్టింది. చివరకు వారు హైద్రాబాదుకు రైలెక్కుతుంటే స్టేషనుకు తీసుకొనివెళ్ళి వ్యాసాలు అందించాను. తెల్లవారి, హైదరాబాదులో సాహిత్య అకాడమి తిక్కవరపు రామిరెడ్డి, బెజవాడ గోపాలరెడ్డి గారి తండ్రి పట్టాభిరామరెడ్డి గార్ల స్మృత్యంకంగా రెండు memorial lectures ప్రారంభించనుంది. అందుకు అవసరమైన నిధిని కూడా గోపాలరెడ్డి గారు ఏర్పాటుచేశారు. ఆ సందర్భంలో వారి జీవిత విశేషాలను రాసి ఇవ్వమని గోపాలరెడ్దగారి కోరారు. కొంచం ఏడిపించినా, వారి సహనాన్ని పరీక్షించినా, చివరినిమిషంలో వారు రైలు ఎక్కుతున్న సమయంలో ఆ వ్యాసాలు అందించాను. అకాడమీ వాటిని చిన్న booklets గా అచ్చువేసి పంచి, తర్వాత సారస్వతోపన్యాసాలు పేరుతో ముద్రించిన పెద్ద సంపుటంలో వ్యాసాలను చేర్చింది.

నేను ఈ ఉపన్యాసాలు రాసినందుకు కాబోలు వర్ధమాన సమాజంలో గోపాలరెడ్డిగారు ఒక అభినందన సభ ఏర్పాటు చేసి నన్ను సన్మానించారు. ఆరోజు సన్మానం డబ్బుతో నేను, నామిత్రులు వర్ధమాన సమాజ గ్రంథాలయంలో జీవిత సభ్యత్వం తీసుకున్నాము. గోపాలరెడ్డిగారు ప్రచురించిన కవితలు కాబోలు ఆమెపేరుతో పుస్తకం వెలువడగానే జమీన్ రైతు పత్రిక నన్ను సమీక్షించమని కోరింది. సమీక్షలో చాలా వరకూ వాడుక భాషనే ఉపయోగిస్తూ మధ్య మధ్య గ్రాంథికభాషలో రాయడాన్ని ఎత్తిచూపుతూ అటువంటి ప్రయోగాలను పరిహరించవచ్చని సూచనప్రాయంగా రాశాను.

గోపాలరెడ్డిగారు మరణించడానికి ఒక నెలరోజులముందు విడవలూరు కళాశాలలో దువ్వూరి రామిరెడ్డి గారిసాహిత్యం మీద జరిగిన సెమినార్‌లో ఉపన్యసిస్తూ తనకు జీవితం మీద మమకారం పోయిందనీ, మరంణంకోసం ఎదురు చూస్తున్నానని వైరాగ్యధోరణిలో ఉపన్యసించారు. అప్పుడు వారికి సుమారు 87సంవత్సరాలు. ఆంధ్రాయూనివర్సిటిలో జరిగిన రిఫ్రెషర్ కోర్సులో ఉన్నపుడు (1996 మార్చి 9) గోపాలరెడ్డిగారి మరణవార్త తెలిసింది. వెంటనే అక్కడి కక్కడే సంతాపసభ ఏర్పాటు చేశారు. సభలో నెల్లూరు వాణ్ణి కనుక నన్నే మొదట మాట్లాడమన్నారు. ఆసభలో వారు సాహిత్య అకాడమీ ద్వారా తెలుగు సాహిత్యానికి చేసిన దోహదాన్ని వివరిస్తూ మాట్లాడాను. గొప్ప పండితులను సంపాదకులుగా పెట్టి తెలుగు ప్రాచీన కావ్యాలను పునర్ముద్రణ చేయించడం, పండితులకు పుస్తకాలు అచ్చువేసుకోను ఆర్థికంగా సహాయం చేయడం వంటి ఎన్నో మంచిపనులు వారి అధ్వర్యంలో జరిగాయి. ఆయన బెంగాలి, హిందీ, తెలుగు బాగా చదువుకొన్నవారు. సంస్కృతభాషలోనూ ప్రవేశం వుంది.

గోపాలరెడ్డి గారు నెల్లూరు టౌన్ హాల్ వేదికమీదికి ఎక్కడానికి వేసిన కొయ్యమెట్లు మీదుగా వెళ్ళడానికి ఒక వ్యక్తి సహాయం తీసుకున్నారు. అతని భుజం మీద చేయివేసి మెట్లుఎక్కుతూ కిందపడి తుంటి విరగకొట్టుకున్నారు. ఆధారంగా తీసుకొన్న మనిషి అజాగ్రత్త కూడా ఉందేమో? మొత్తంమీద మూడువారాలు మద్రాసులో ఉండి, వైద్యం చేయిచుకొంటూ అక్కడే పోయారు. నెల్లూరులో కాస్త విజ్ఞానం, విద్య, సాహిత్యం, కవిత్వం వంటి సభలన్నింటికీ వారే ఆలంబనం.

ఎవరు పిలిచినా సభకు వెళ్లి ఓపికగా పాల్గొనేవారు.

గోపాలరెడ్డిగారి ఆత్మ కథను నెల్లూరు విదుషి డాక్టర్ వై. శైలజ హిందీలో కి అనువదించారు.

(ఈ ముఖాముఖి ఏదో కారణంవల్ల కొనసాగలేదు. తర్వాత వారు చెబితే రాసుకున్న స్వీయచరిత్ర ఒకటి ప్రచురించబడింది – కాళిదాసు పురుషోత్తం)

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here