Site icon Sanchika

జ్ఞాపకాల తరంగిణి-31

[box type=’note’ fontsize=’16’] జీవితంలోని వివిధ దశలలో తనకు కలిగిన విశేష అనుభవాలను సంచిక పాఠకులతో పంచుకుంటున్నారు డాకాళిదాసు పురుషోత్తం. [/box]

70వ పడిలోనూ పర్యటిస్తూనే ఉన్నాను

[dropcap]మా[/dropcap]కు డిగ్రీలో ట్రావెలింగ్ కంపానియన్ అని ఒక వ్యాసం పాఠ్యాంశంగా ఉండేది. 1900 ప్రాంతాల్లో రాసింది. గుర్తున్న విషయాలు ఏవంటే ఆర్థిక పరిస్థితి, ఆరోగ్యం, అభిరుచులు, సద్దుకుపోయే గుణం వగైరా లలో సారూప్యత కొంతైనా ఉండాలని ఆ రచయిత అంటారు.

2003 నవంబరులో మా దంపతులం, మా కళాశాలలో నాకంటే నాలుగేళ్ళ ముందు రిటైరైన సహ అధ్యాపకుడు, కలిసి కలకత్తా, ఆపైన ఏడుగురు అక్కచెల్లెళ్ళు రాష్ట్రాలు తిరిగి రావాలని అనుకొన్నాము. మాకు కలకత్తా వరకు రిజర్వేషన్ దొరికింది. అనుకొన్న ప్రకారం నా మిత్రులు నెల్లూరులో రైలెక్కలేదు. టిక్కెట్ చెకింగ్ చేసేసమయంలో మా ముఖాలు చూసి సీనియర్ సిటిజన్సు కనుక ముగ్గురం ఉన్నట్లు రాసేసుకున్నాడు టి.సి. అతను విశాఖపట్నంలో రైలెక్కాడు. అంతవరకు అతని బెర్తు కాపాడడం చాలా కష్టమైంది. ఒకమాట చెప్పొచ్చు కదా.

కలకత్తాలో తనకు ఏవీ ఆసక్తి కలిగించలేదు. మఠాలు, గుళ్ళూ, హౌరాబ్రిడ్జి ఏవీ. గుళ్ళల్లోకి రాడు. డార్జీలింగ్‌లో ఎక్కి దిగాలి తరచు. సమతలం ఉండదు. తరచు ఆగిపోయేవాడు. సిక్కిం కూడా తనకు ఆసక్తి కలిగించలేదు. అసోం, మేఘాలయ చూశాము. అవీ తనకు ఏమీ అనిపించలేదు. మేము మిగతా రాష్ట్రాలు చూడాలని అనుకొన్నా తనకు ఆసక్తి లేక సిలిగురి వచ్చాము. భూటాన్ చూడాలి. తనకు ఆసక్తి లేదనడంతో తిరుగు ప్రయాణమయ్యాము. ప్రతిరోజు నేను ఖర్చు పెట్టిన మొత్తం మూడు భాగాలు చేసి లెక్క రాసి తనకు చూపి తన వద్ద ఖర్చయిన మొత్తం తీసుకొనేవాణ్ణి. చివరి రోజు తనవద్ద అధికంగా వసూలు చేసినట్లు అభియోగం మోపాడు. నేను ఏ రోజు ఖర్చు ఆ రోజు చీటీ మీద రాసి తనకు చూపించి పారేసేవాణ్ణి. అందువల్ల తనకు ఆధారం ఏం చూపాలి?

అయితే నా శ్రీమతి నేను రాసిన చీటీలన్నీ తీసిపెట్టిన సంగతి నాకు తెలియదు. ఆమె లెక్క కాగితాలు చూపడంతో తను సైలెంట్ అయ్యాడు. తను ప్రొటెస్టెంటు క్రైస్తవుడు. ఆ మతాభినివేశంవల్ల తనకు ఆలయాలు, గంగ, వేటితో కనెక్ట్ కాలేకపోయాడు. అందరు క్రైస్తవులు అట్లా ఉండకపోవచ్చు. కొన్ని సార్లు ఒకే గదిలో మూడు మంచాలు వేసినా మా దంపతులం సద్దుకున్నాము. ఇదొక అనుభవం.

***

లదాక్ యాత్ర పెట్టకుని మా బృందానికి ఢిల్లీకి, అక్కణ్ణించి జమ్మూకు రైల్లో రిజర్వేషన్లు చేశాను. ఇద్దరు దంపతులు ఆలస్యంగా మా బృందంతోపాటు వస్తామన్నారు. రిజర్వేషన్లు చేసుకోమని చెప్పాను. ఢిల్లీ నుంచి జమ్మూకు వెళ్ళే రైలులో వారికి వెయిటింగ్ లిస్టులో 1, 2 వచ్చాయి. అది వారానికి ఒకసారి మాత్రమే వెళ్ళే వైష్ణోదేవి యాత్రికుల కోసం వేసిన ప్రత్యేక రైలు. ఎవరూ కేన్సిల్ చేసుకోరని వేరే రైలుకు చేసుకోమని చెబితే మా మాట వినలేదు. ఢిల్లీలో దిగగానే వారికి జమ్మూకు రిజర్వేషన్ కాలేదని తెలిసింది. విచారిస్తే ఎక్కడినుంచో జమ్మూకు బస్సులు ఉన్నాయని తెలిసి వెంటనే పంపించాము. చెప్పిన మాట విని ఢిల్లీ నుంచి మరొక ట్రయిన్‌కు చేసుకుని ఉంటే మా వెనక కాస్త ఆలస్యంగా చేరేవాళ్ళు. మా రైలు వేకువన 3 గంటలకు జమ్ముచేరింది. కానీ మధ్యాహ్నం ఒంటిగంటవరకు అందరం వారికోసం వేచివుండవలసి వచ్చింది. అందరికీ అసౌకర్యం కలిగించామనే బాధను వారు వ్యక్తం చెయ్యలేదు.

కేదార్ యాత్ర డోలీలలో గుర్రాలమీద
కేదార్ ఆలయంముందు రచయిత శ్రీ మతి, రచయిత

ఈ యాత్రలో కార్గిల్‌లో -4 డిగ్రీలుంది. మా హోటల్లో గీజర్ ఉంది. వేడి నీళ్ళ స్నానం చేద్దామని షవర్ తిప్పాను, పొరపాటున చన్నీళ్ళ వైపు తిప్పాను. ఇంకేముంది ఒక్కసారిగా గడ్డకట్టే శీతలజలం తలమీద జలపాతంలా పడింది. క్షణంలో పొరపాటు గ్రహించి వేణ్ణీళ్ళవైపు తిప్పాను. ఏమైనా చలికి గడగడ వణికి పోయా. అరగంటలో పెద్దగా తలనొప్పి, జ్వరం. తెల్లారినుంచి లదాక్ యాత్ర ఆరంభం. అలాగే నాలుగు రోజులు తిరిగాను. జ్వరం ఎక్కువ అయింది. లే ప్రభుత్వ హాస్పిటల్‌లో చూపించుకొంటే మందులు రాసిచ్చారు. తెల్లవారి ఉదయం పేంగోంగ్ లేక్ దర్శనానికి వెళ్ళాలి. నాలుగు రోజులయాత్ర. నా కోసం 2000 రూపాయల కట్టి ఆక్సిజన్ సిలండరు తెప్పించి కారులో పెట్టించారు.

ఛాంగో సరస్సు చూసి అనంతపూరు ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులతో రచయిత శ్రీమతి నీలం కేప్ తో

మరుసటిరోజు అందరు బయల్దేరుతున్నారు. నావల్ల మొత్తం బృందం ఇబ్బంది పడకూడదని నిర్ణయించుకొన్నా. నా శ్రీమతి నాకోసం ఆగిపోవడానికి నిర్ణయించుకొంది. అరుదైన అవకాశమనీ, వెళ్ళమని ప్రోత్సహించాను. ఉదయం వారు వెళ్తుంటే ఒక్కణ్ణే ముఖం తెలియని అజ్ఞాత యువతి ఇంట్లో పేయింగ్ గెస్టుగా ఉండిపోయా. తెల్లవారి బ్రష్ చేసుకుంటూ వుంటే ముక్కుల్లోంచి రక్తం ధారగా కారిపోతోంది. ఆతిథ్యం ఇచ్చిన యువతి సహాయంతో గదిలోకి చేరి నెల్లూరు డాక్టర్ మిత్రుడికి ఫోన్ చేశాను. హై ఆల్టిట్యూడ్‌లో ఇలా జరగవచ్చని లేలో వైద్యులు రాసిచ్చిన మందులు వాడమని చెప్పాడు. ఎత్తైన ప్రదేశాలకు వెళ్తే ముక్కుకు మాస్కు ధరించకపోతే కూడా ఇలా జరగవచ్చని చెప్పాడు. నాలుగు రోజులు ఆ యువతి ఇంట్లో విపరీతమైన జ్వరంతో వళ్ళు తెలీకుండా పడివున్నా. మూత్రానికి రాత్రివేళ ఆ చలిలో బహిరంగ ప్రదేశంలోకి వెళ్ళడం నరకం. ఎలా గడిచాయో రోజులు. ఐదవరోజు మా వాళ్ళు తిరిగివచ్చారు. జ్వరం తగ్గింది. తర్వాత టూర్‌లో వారితోటి వెళ్ళాను. నేను ధైర్యంగా ఉండిపోకపోతే మొత్తం బృందం సమయం వృథా అయ్యేది. కనుక టూర్‍లో ఊహించని అనేక ఇబ్బందులు ఎదురు కావచ్చు. అన్నిటికీ తయారుగా ఉండాలి, ముఖ్యంగా టూర్ ఏర్పాటు చేసిన వ్యక్తి.

***

నేపాల్ టూర్‌లో మా దంపతులం, మేనల్లుడు, తన భార్య, మా కళాశాల ఇద్దరు అధ్యాపకులు. చివరి క్షణంలో మా ఊరి రైతులు ఇద్దరు కూడా వస్తామని పట్టబట్టారు. మొత్తం ఎనిమిది మందిమయ్యాము. నేను ఎలాంటి ఏర్పాట్లు లేకుండా యాత్ర చేయ్యాలని. ఇంతమంది వస్తున్నారు సమస్యలు రావచ్చు, ఎవరైనా టూరిస్టు ఏజంటును మాట్లాడుకోండి అన్నది నాశ్రీమతి. ఆమె సలహా ప్రకారం నేపాల్లో ఒక ఏజంటును సంప్రదించాను. గోరఖ్‌పూర్ స్టేషన్లోనే అతని మనుషులు వచ్చి లగేజీ దింపుకొని కారులో సోనాలి వద్ద సరిహద్దు దాటించారు. అక్కడ అతనికి అనుకున్న ప్రకారం డబ్బులు చెల్లించాము. అతనిచ్చిన వ్యానులో బయల్దేరాము. ఇద్దరు తప్పనిసరిగా వేన్లో వెనుకవైపు కూర్చోవాలి. అందరూ మంచి సీట్లలోనే కూర్చోవాలంటారు. నియంతగా ప్రవర్తించవలసి వచ్చింది. మా మేనల్లుడు ఆరునెలలు వెన్నెముక నొప్పితో అప్పుడప్పుడే కోలుకొని ఉన్నాడు. అతనికి సౌఖ్యంగా ఏర్పాటు చెయ్యాలి. మా గ్రామీణులు ధనవంతులైనా మాట వింటారు. తరచు నేను నా శ్రీమతి కూడా వేన్ వెనుక కూర్చోడంతో ఇక ఎవరూ మాట్లాడలేదు.

గేంగ్‍టాక్‌లో బౌద్దుల ఆశ్రమం (మొనాస్టరి)

ఈ యాత్రలో మా గ్రామీణ మిత్రులు ముక్తినాథ్ నుండి వచ్చేసమయంలో మా బృందంలోంచి తప్పిపోయారు. ఆ రాత్రి వాళ్ళకోసం వెదకడం ఘోరమైన అనుభవం. వాళ్ళకు తెలుగు తప్ప మరొక భాషరాదు పైగా. మా బృందంలో అందరూ వాళ్ళను తిట్టిపోశారు. నేను మాత్రం ఒక్క మాట అనలేదు. రాత్రి చాలా పొద్దుపోయింది. గ్రామంలో మేము దిగిన హోటల్ యజమానురాలు మా కోసం ఆతృతగా వేచివుంది. ఊరు మాటుమణిగిపోయింది. అందరు మా కోసం తెరచివుంచిన రెస్టారెంట్‌లో విస్కీ సేవించి, భోజనాలు చేసి గదులకు వచ్చారు, ముక్తినాథ్ దర్శనం తర్వాత పవిత్రంగా ఉండాలని నిర్ణయం చేసుకొన్న పెద్ద మనుషులు. ఇదొక అనుభవం.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version