జ్ఞాపకాల తరంగిణి-32

2
2

[box type=’note’ fontsize=’16’] జీవితంలోని వివిధ దశలలో తనకు కలిగిన విశేష అనుభవాలను సంచిక పాఠకులతో పంచుకుంటున్నారు డాకాళిదాసు పురుషోత్తం. [/box]

[dropcap]బం[/dropcap]గోరె పూర్తి పేరు బండి గోపాలరెడ్డి. మా నెల్లూరువాడే. నెల్లూరు నుంచి వెలువడే జమీన్ రైతు పత్రికలో 1964 నుంచి 71 చివరి వరకు పనిచేశాడు. ఆ పత్రికలో ‘కూనిరాగాలు’ అని  శీర్షిక పెట్టి వారం వారం కాలం రాసేవాడు.

స్థానిక వార్తల నుంచి ప్రపంచ వార్తల వరకు దేన్నయినా ఆ శీర్షికలో చర్చించేవాడు. 1963-64 లో జమీన్ రైతు పత్రికలో చేరి 1971 చివరిదాకా పనిచేసాడు. అతని ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం పాఠకుల్ని బాగా ఆకర్షించి మంచిపేరు తెచ్చుకొన్నాడు. ఆ రోజుల్లో జమీన్ రైతుకు నెల్లూరు టౌన్‌లో అతనే విలేకరి, ఉపసంపాదకుడు అన్నీ. టౌన్‌లో ఏ మీటింగ్ జరిగినా హాజరయ్యేవాడు. చాలా సాధారణమైన దుస్తులు, ఒక చేతిలో పుస్తకం, నోట్లో వెలిగే బర్కీలీ సిగరెట్, అతను చాలా విలక్షణంగా కనిపించేవాడు.

బంగోరెతో మొదటి పరిచయం నాకు గుర్తుంది. మా వి.ఆర్. కళాశాలలో శ్రీశ్రీ కాలేజీ ఆంధ్ర భాషాసంఘాన్ని ప్రారంభించారు. వి.ఆర్. కళాశాల ఈస్ట్ హల్లో చిన్న సభ జరిగింది. ఆ సంఘం కార్యదర్శిగా శ్రీశ్రీ గారి సభ ఏర్పాటు చేసాను, మా సంఘం అధ్యక్షులు, విఆర్ కళాశాల తెలుగు హెడ్ పోలూరి జానకీరామశర్మ గారి సహకారంతో. సాయంత్రం సభ జరిగింది. వారం రోజుల తర్వాత బంగోరె నన్ను వెదుక్కుంటూ కాలేజీకి వచ్చి శ్రీశ్రీ ఉపన్యాసం, సభ వివరాలు నాల్గు మాటలు రాయించుకొని జమీన్ రైతులలో వేసాడు. అదే మా తొలి పరిచయం.

ఆ రోజుల్లో నేలనూతల శ్రీకృష్ణమూర్తి గారు నెల్లూరు మండల సర్వస్వం సంపాదకులుగా స్థానిక రచయితలందరి చేత వ్యాసాలు రాయించారు. బంగోరె మండల సర్వస్వంలో నెల్లూరు వీధుల చరిత్ర, నెల్లూరు పాత సత్రాలు వంటి అనేక విషయాల మీద రాసాడు. జమీన్ రైతులో స్థానిక చరిత్ర మీద వందల వ్యాసాలు రాసాడు. తనకు స్థానిక చరిత్ర మీద గురి కలిగింది.

ఆంధ్రజ్యోతి సంపాదకులకు బంగోరె రాసిన లేఖ.

నేను 1966లో తెలుగు ఎం.ఏ. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఫస్ట్ వచ్చిన తరవాత, పిహెచ్.డి పరిశోధనకు పూనుకొన్నాను. నేలనూతల శ్రీకృష్ణమూర్తి గారు డాక్టర్ రామరాజు గారి ద్వారా వెంకటగిరి సంస్థానం చరిత్ర, సాహిత్యం మీద పరిశోధనకు పూనుకొనేట్లు చేసారు. అయిష్టంగానే  పరిశోధనకు దిగాను. నాకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆర్కైవ్స్ జాతీయ స్కాలర్‍షిప్ కూడా మంజూరవడంతో మూడేళ్లు వెంకటగిరి వారు ప్రచురించిన పుస్తకాల కోసం వెదుకుతూ తిరిగాను. ఆరు నెలలు వెంకటగిరిలో జమీందారు గారి గ్రంథాలయం సరస్వతీనిలయంలోనే పుస్తకాల కోసం, రాతప్రతుల కోసం పరిశోధిస్తూ గడిపాను. 1967లో బంగోరె కలిసినపుడు నా చేత వెంకటగిరి గ్రంథాలయం స్థితిగతులను గురించి పెద్ద వ్యాసం రాయించి దానికి ‘వెంకటగిరి గ్రంథాలయం సజీవసమాధి’ అని శీర్షిక పెట్టి జమీన్ రైతులో వేసాడు. ఆ వ్యాసం పాఠకుల్లో చాలా ఆసక్తిని రేకెత్తించింది గానీ రాజాగారు మరుసటిరోజు నన్ను గ్రంథాలయంలోకి రానివ్వలేదు. చాలావరకు నా పరిశోధన పూర్తయినా ఇంకా పరిశీలించవలసిన పుస్తకాలు మిగిలిఉన్నాయి. ఆ విధంగా నా వ్యాసానికి ఒక శీర్షిక పెట్టి నాకు చాలా ఇబ్బంది కలిగిగించిన మిత్రుడు బంగోరె.

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో సీఆర్ రెడ్డి ప్రాజెక్టు లో పనిచేస్తున్న సమయంలో సాహితీమిత్రులతో బంగోరె

1964 నుంచి తాను నాకు చాలా ఆత్మీయ మిత్రుడయ్యాడు. స్థానిక చరిత్ర మీద విషయం సేకరణకు ఎక్కడెక్కడో తిరిగేవాళ్ళం. ఒకసారి నెల్లూరు బిషప్ గారిని కలిసి నెల్లూరు జిల్లాలో క్రైస్తవ వ్యాప్తిని గురించిన పుస్తకాలు తెచ్చుకొని చదివాము. ఒక పర్యాయం నెల్లూరు కూరగాయల మార్కెట్‌కు తూర్పుగా ఉన్న లూథరన్ చర్చ్ పైకి ఎక్కి పెద్ద గంట మీది రాత చదివాము. సోమశిల ప్రాజెక్ట్‌ను కలలో కూడా తలపెట్టని రోజుల్లో సోమశిల మీద బంగోరె వ్యాసం రాసాడు.

బంగోరె అంటే అందరికి మైపాడు సముద్రతీరంలో చంద్రికారాణి, కళారాణి అనే ఇద్దరు విద్యార్థినులపై అత్యాచారం చేసి, హత్య చేయడం గుర్తొస్తుంది. ఇది జరిగింది 1970 వేసవిలో అనుకుంటాను. అందరిలాగే పాపం సముద్రతీరానికి వెళ్లారు. డబ్బుమదం, అధికారమదం, దన్ను ఉన్నవారెవరో ఇద్దరినీ పాడు చేసి, చంపి సముద్రతీరంలో పాతిపెట్టారు. మర్యాదస్తుల బిడ్డలు, అమ్మాయిల తల్లిదండ్రులు వెదుక్కుంటున్నారు గుట్టుచప్పడు కాకుండా. ఒక విద్యార్ధి నాకు అమ్మాయిలు తప్పిపోయిన విషయం చెప్పగానే బంగోరెకు వెళ్లి చెప్పాను. తొలి వార్త ధైర్యం చేసి తానే జమీన్ రైతులో వేసాడు. ఇక ఆరు నెలలు తాను అదే విషయం మీద వారం వారం రాస్తూ వచ్చాడు. డ్యూటీ సరిగా చేయనందుకు, మనోహర్ అనే సబ్ ఇన్‌స్పెక్టరుకు, పూర్ణచంద్రరావు అనే ఛోటా కాంట్రాక్టరుకు ఈ కేసులో 4సంవత్సరాల జైలు శిక్ష వేశారు గానీ అసలు నేరస్థులు తప్పించుకున్నారు. ఆ రోజుల్లో ఈ కేసు జాతీయ పత్రికల్లో వచ్చింది. ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ అఫ్ ఇండియా పత్రిక ప్రతినిధి కేసు మొత్తం రాసి కేసును తవ్వితీయడంలో బంగోరె పాత్రను ప్రతేకంగా పేర్కొని అభినందించాడు.

1971 చివరలో కాబోలు అతను యు.ఎస్.ఐ.ఎస్ మద్రాసు కార్యాలయంలో అమెరికన్ రిపోర్టర్‌లో చేరేవరకు చాలా ఆత్మీయంగా మెలిగాము. బంగోరె నెల్లూరు వర్ధమాన సమాజం కార్యదర్శిగా దాదాపు ఐదారేళ్ళు వున్నాడు. ఆ రోజుల్లో వర్ధమాన సమాజం ఎందరో కవుల జయంతులు జరిపింది. 1969 ఫిబ్రవరిలో తిక్కన జయంతికి శ్రీశ్రీని మద్రాసు నుంచి తీసుకొని వచ్చే బాధ్యత నాకు పెట్టాడు. ఆ అనుభవాన్ని వ్యాసం రూపంలో రాసాను. ఆ రోజుల్లో వర్ధమాన సమాజం కార్యదర్శిగా బంగోరె ‘వేమన పాశ్చాత్యులు’, ‘సీఆర్ రెడ్డి ఉపోద్ఘాతాలు’, ‘కావలి రామస్వామి డెక్కన్ పోయెట్స్’ పుస్తకాలు ప్రచురించాడు. అతనికి పుస్తకాలంటే ప్రాణం. యు.ఎస్.ఐ.ఎస్ ఆఫీసులో పనిచేసే రోజుల్లో ఆదివారాలు పాత పుస్తకాల వేటలో మోర్ మార్కెట్, మెరీనా వద్ద అంగళ్లలో వెదికేవాళ్ళం.

బంగోరె జమీన్ రైతు విలేకరిగా టౌన్ హాల్‌లో జరిగే సభలలో చివరి బెంచిలో కూర్చొని నోట్స్ తీసుకునేవాడు.  సభల్లో వక్తల ఉపన్యాసాలను జమీన్ రైతు సంగ్రహంగా ప్రచురించేది. ఒక్కోసారి బంగోరె చాలా ఘాటుగా రాసేవాడు, తిట్టేవాడు. అయినా అతనంటే అందరికి ప్రేమే. ఏదో ఆకర్షణ తనలో. కొంచెం ఎప్పుడైనా నత్తి వచ్చేది మాట్లాడే సమయంలో.

నాకు 1971 సెప్టెంబరులో పి.హెచ్.డి డిగ్రీ అవార్డు చేశారు. బంగోరె నన్ను అభినందిస్తూ జమీన్ రైతులో పెద్ద వ్యాసమే రాసాడు. ఎవరో ఒకాయనకు డాక్టరేట్ వస్తే ఇంత హడావిడి చెయ్యాలా అని అధిక్షేపిస్తూ పత్రికకు ఒక పాఠకుడు ఉత్తరం రాసాడు. మరుసటి వారం కూడా బంగోరె స్థానిక చరిత్రకున్న ప్రాధాన్యాన్ని వివరిస్తూ జవాబుగా మరొక వ్యాసం రాసాడు. ఆ రోజుల్లో తాను వారం వారం రాసే ‘కూనిరాగాలు’ శీర్షికకు పెద్ద సంఖ్యలో పాఠకులుండేవారు. మరుపూరు కోదండరామరెడ్డి గారు కూనిరాగాలు కాదు కూనరాగాలు అని పెట్టు అని సలహా ఇచ్చారు. బంగోరె తిట్టినా రెడ్డిగారికి సంతోషమే.

నేను పిహెచ్.డి ముగించుకొని నెల్లూరు చేరేసరికి తాను తిరుపతి వెళ్లిపోయాడు. తర్వాత యేవో అపోహలు, ఇద్దరం మళ్లీ కలుసుకోలేదు. 1982లోనేమో కెవిఆర్ వెంట మా యింటికి వచ్చాడు, అదే చివరిసారి కలుసుకోడం. 1982 అక్టోబర్లో ఆతను అర్ధాంతరంగా జీవితాన్ని ముగించాడు. పరిశోధకుడు, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్, గురజాడమీద విశేష పరిశోధన చేసిన పండితుడు, నా మిత్రుడు బంగోరే మీద చిన్న పుస్తకం ‘బంగోరె జాబులు’ పేరుతో తెచ్చాను.

బంగోరె దంపూరు నరసయ్య మీద పరిశోధన చేసి పుస్తకం రాస్తానని అనేవాడు గాని రాయలేదు. నేనే ఆ పరిశోధనకు పూనుకొని ‘ఇంగ్లీషు జర్నలిజంలో తెలుగు వెలుగు దంపూరు నరసయ్య’ అనే పేరుతో పుస్తకం రాశాను. వికీపీడియాలో కూడా తనను గురించి రాశాను.

బంగోరె పై వెల్చేరు నారాయణరావు గారి కవిత

బంగోరె పరిశోధించి రాసిన వందల వ్యాసాలు జమీన్ రైతు పుటల్లో ఉన్నాయి. ఇప్పుడు జమీన్ రైతు సంపుటాలు అంతర్జాలంలో అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఏ విశ్వవిద్యాలయమో, విద్యాభిమానో బంగోరె వ్యాసాలను అచ్చువేసి పుణ్యం కట్టుకోవచ్చు.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here