[box type=’note’ fontsize=’16’] జీవితంలోని వివిధ దశలలో తనకు కలిగిన విశేష అనుభవాలను సంచిక పాఠకులతో పంచుకుంటున్నారు డా॥ కాళిదాసు పురుషోత్తం. [/box]
[dropcap]మా[/dropcap] కళాశాలలో పరీక్షలు జరిగిన తీరు చెప్పకుండా దూరవిద్యా కేంద్రాల పరీక్షల తీరు మాత్రం చెప్పడం సమంజసం కాదు. కాలేజీ 120 మంది విద్యార్థులతో ప్రారంభమై రెండేళ్ళలో బాగా ఎదిగింది. మూడో ఏటికి బికాం మూడు సెక్షన్లు, బి.ఎ., బిఎస్‍సి, ఇంటర్మీడియట్ సెక్షన్‍లతో కళకళాడిపోతోంది. కళాశాల ప్రారంభించిన రెండో సంవత్సరమే కళాశాలకు ఎదళం, ఇప్పుడున్న ఆర్‌టిసి బస్ డిపో సముఖంలో సుమారు 8 ఎకరాలు కొని, షెడ్‍లు వేసి క్లాసులు జరిపింది యాజమాన్యం. ఈ ఎనిమిదెకరాల స్థలానికి ప్రహరీ లేదు. పరీక్షలు మాత్రం అన్ని గదుల్లో నడిపేవాళ్ళం ఎట్లాగో తంటాలు పడి.
శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో స్పాట్ వాల్యూయేషన్ జరుగుతోంది. నేను కూడా డిగ్రీ రెండో సంవత్సరం పేపర్ల మూల్యాంకనానికి వెళ్లాను. ప్రశ్నాపత్రంలో ఇంగ్లీషు నుంచి తెలుగులోకి అనువాదం చేసే పేరాగ్రాఫ్ పాఠ్యాంశం లోనిది కాదు, unknown passage. కొందరు విద్యార్థుల సమాధాన పత్రాలలో సమాధానం ఒకే విధంగా ఉంది. నేను కూడా అటువంటి తప్పును గమనించి మా చీఫ్ దృష్టికి తెచ్చాను. వాళ్ళు కడప జిల్లా విద్యార్థులు. ఆ రోజుల్లో ఒకే జిల్లా విద్యార్థుల పత్రాలు ఆ జిల్లా అధ్యాపకులకివ్వరు.
వేసవి శెలవుల తర్వాత, విశ్వవిద్యాలయం వారు ప్రిన్సిపాల్‍కి ఒక తాకీదు పంపుతూ, తెలుగు రెండో సంవత్సం పేపర్లో అనువాదం పది మంది విద్యార్థులు సమాధాన పత్రాలలో ఒకేలాగా ఉందని, కాపీ కొడితే తప్ప అట్లా జరగదని దాని సారాంశం. అప్పుడు చీఫ్ సూపర్నెంటుగా వ్యవహరించింది నేనే కాబట్టి, నా మెడకు చుట్టుకుంది. మా కాలేజీ కేంపస్ ట్రంకు రోడ్డుకు ఇరువైపులా వుంది. ఇరువైపులా మొత్తం మూడు గదుల్లో పదిమంది ఇటువంటి కాపీ వ్యవహారానికి ఒడిగట్టారు. వాస్తవం ఏమిటో ఎవరికీ తెలియదు. ఇన్విజిలేటర్ల ప్రమేయం కూడా ఉన్నట్టు లేదు. విద్యార్థులకు కూడా యూనివర్సిటీ నోటీసు పంపింది. వాళ్లు పదిమంది ఎవరి సలహా మీదో రోడ్డు మీద మైకు పెట్టి మైకులో సమాధానం చెప్తుంటే తాము రాసుకున్నట్టు విశ్వవిద్యాలయానికి సమాధానం రాసి పంపించారు.
పిల్లలకు చిట్టీ లెవరందించారో తెలియదని, మా అధ్యాపకులు, చీఫ్ సూపర్నెంటుగా నేను మా విధులు సక్రమంగా నిర్వహించామని, మైకు ద్వారా సమాధానం వినిపించారనడం అసత్యమని నేను సమాధానం ఇచ్చాను. విశ్వవిద్యాలయం ఆ గదుల్లో ఇన్విజిలేషన్ డ్యూటీ చేసిన అధ్యాపకులను, చీఫ్ సూపర్నెంటుగా వ్యవహరించిన నన్ను శాశ్వతంగా విశ్వవిద్యాలయం పరీక్షలకు సంబంధించిన అన్ని డ్యూటీల నుంచి నిషేధించింది. “ఇది మా అందరి ప్రతిష్ఠకు సంబంధించిన విషయం, నేను కోర్టుకెళ్తాను” అని అంటే, మా ప్రిన్సిపాల్ “ఈ ఏడాది మాట్లాడకుండా ఉండు, పై విద్యా సంవత్సరంలో నేను ప్రయత్నం చేస్తా” అన్నారు. వారి ప్రయత్నం చేశారు, కానీ ఫలితం లేకపోయింది. విధి లేక నేను హైకోర్టుకు వెళితే, “ఏడాది పాటు కాలయాపన ఎందుకు చేశారు?” అంటూ నా విజ్ఞాపనను తోసివేసింది.
ఆ రోజుల్లో మాది అన్‌ఎయిడెడ్ కాలేజీ. కమిటీ వారు నెల నెల సక్రమంగా, ఆ తక్కువ జీతాలు కూడా చెల్లించేవారు కాదు. అధ్యాపకులం డబ్బుకు కటకట పడేవాళ్లం. ACTA నాయకులు మాణిక్యాలరావు గారు, మరికొందరు రాజకీయ నాయకుల సహాయంతో, నాలుగైదేళ్ళ తరువాత విశ్వవిద్యాలయం ఆదేశాన్ని రద్దు చేయించుకోగలిగాము. ఇందుకు మా అధ్యాపక బృందం ఎంత పోరాటం చేసిందో!
మా ప్రిన్సిపాల్ గారికి, వారి తర్వాత సీనియర్ అయిన మిత్రుడికి కాస్తా ఎదిగిన పిల్లలు. వాళ్లు పరీక్షలు రాస్తారు. కనుక కాలేజీ నెలకొల్పిన మరు సంవత్సరం నుంచి ఇంటర్, డిగ్రీ పరీక్షలకు నేనే చీఫ్‌గా వ్యవహరించాను. నిషేధం ఎత్తివేశాక కూడా మళ్లీ ఏదో కారణంతో ప్రిన్సిపాల్ గారు నా మీద పెట్టేశారు బాధ్యతలను.
మా అధ్యాపకుల్లో పూర్తి శ్రద్ధతో ఇన్విజిలేషన్ చేసేవారు, పిల్లలంటే భయపడి ఏదో రకంగా ఆ బాధ్యత ముగించుకొనేవారు, ఏమైనా తమ రూమ్‌లో కాపీ కొట్టడానికి వీల్లేదని గట్టిగా వుండేవారు. రకరకాల మనస్తత్వాలున్న వారుండేవారు. ఈ పబ్లిక్ పరీక్షలు కాక ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, మెడిసిన్ ప్రవేశ పరీక్షలు కూడా ఉండేవి.
ఇంజనీరింగ్, మెడిసిన్ పరీక్షలు అంటే కత్తి మీద సామే. ఒక ఏడాది ప్రవేశ పరీక్షకు చీఫ్‍గా ఉన్నాను. పరీక్షలు దిగ్విజయంగా జరిగాయి. నెల్లూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ నెల్లూరులో అన్ని సెంటర్లకు అధికారిగా వ్యవహరించారు. పరీక్షలు ముగిసిన రెండు రోజుల తరువాత ఆయన మా కళాశాలకు వచ్చి పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఇచ్చిన మొత్తంలో కొంత ఖర్చు కాకుండా మిగిలింది. ‘నొక్కణ్ణే దాన్ని ఎందుకు ఉంచుకోవాలి!’ అంటూ నా చేతికి కొంత డబ్బిచ్చి పోయారు. పరీక్ష నిర్వహణలో సాయపడిన ఆఫీస్ ఉద్యోగులకు కొంత మొత్తం పంచి, నేను కొంత తీసుకున్నాను. ఆ తర్వాత వారం రోజులకే నెల్లూరు కేంద్రంలో మెడిసిన్ పేపర్ ముందుగానే లీక్ చేశారని, ప్రథమ కృతంగా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ గారిని సస్పెండ్ చేశారు. ఆయన పేరు జ్ఞాపకం లేదు, ఆయన ముస్లిం అని మాత్రం గుర్తు. తర్వాత ఒక అధికార బృందం దిగింది నెల్లూరులో. చీఫ్ సూపర్నెంటుగా నన్ను పిలిచి పిచ్చి ప్రశ్నలన్నీ వేశారు, రికార్డులన్నీ పరిశీలించి, ప్రశ్నాపత్రాలు మా సెంటర్‌కి పంపిన ఫ్లైవుడ్ పెట్టెలు తెచ్చి చూపమన్నారు. మా కళాశాల వాచ్‌మన్ మరుసటి రోజే వాటిని అన్నం వండుకొను ఇంధనంగా వాడుకొన్నాడని సమాధానంగా రాసిచ్చాను. అందరం చచ్చే టెన్షన్‌తో బతికాము. చివరకు అతనెవరో ఒక ప్రభుత్వోద్యోగే కలకత్తాలో ప్రింటింగ్ ప్రెస్ నుంచే ప్రశ్నాపత్రాలు తెచ్చుకున్నట్లు విన్నాము.
***
1990 ప్రాంతం. ఒకరోజు చీఫ్ సూపర్నెంటుగా విధులు నిర్వహిస్తూ ఒక విద్యార్థి సమాధాన పత్రం కింద చిట్టీ వుంటే, అతని పేపరు తీసుకొని నా రూమ్‌కి వచ్చి, ఆ పేపరు టేబుల్ మీద పెట్టాడు. ఆ కుర్రాడు నా గదికి వచ్చి ప్రాధేయపడి, ఏడ్చి నా సానుభూతి కోసం ప్రయత్నించాడు. “నీకేమీ కాదు, ఈ పేపరు ఒక్కటే పోతుంది,” అని చెప్పి ‘పొజెషన్’ అని మాత్రమే రాస్తానని ఊరడించాను. ఇంతలో పరీక్ష సమయం ముగిసి, అధ్యాపకులు సమాధాన పత్రాలలో తిరిగి వచ్చారు. మేము ఆ లెక్కలు, పత్రాలు సరి చూచుకోవడం వంటి పనుల్లో నిమగ్నమై ఉన్నాము. అదే అదనుగా ఆ విద్యార్థి గదిలోకి జొరపడి తన సమాధానపత్రాన్ని (Answer Sheet) తీసుకుని పారిపోయాడు. అతని సమాధానపత్రం బదులు ఖాళీ పత్రాన్ని పంపమని కొందరు సలహా ఇచ్చారు. నాకు అటువంటి పనులు సమ్మతం కావు. సమాధాన పత్రాల బంగీకి సీల్ వేసి, పోస్టులో పంపించే ఏర్పాటు చేసి, అతని ఆచూకీ కోసం ప్రయత్నిస్తే తను ప్రభుత్వం నడిపే ఎస్.సి. హాస్టల్‍లో ఉంటాడని విని, నా సహచరులతో హాస్టల్‍కి వెళ్ళాను. దాదాపు మధ్యాహ్నం ఒంటిగంట అయి వుంటుంది. ఇద్దరు ముగ్గురు కలిసి గదుల బయట కట్టెల పొయ్యి పెట్టి అన్నం వండుతున్నారు! ప్రభుత్వం వారికివ్వవలసిన స్కాలర్‌షిప్ విడుదల చేయకపోవడంతో, హాస్టల్ నడిపే ఉద్యోగులు అన్నం పెట్టడం మానేసారట! ఆ పరిస్థితికి నాకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మధ్య తరగతి వాళ్లు పిల్లలకు ఎన్ని సహకారాలందిస్తారు! నిద్ర రాకుండా టీ కాఫీలు, ఉదయం నిద్ర లేవగానే బోర్నవీటాలు, పరీక్ష హాలు వద్ద స్కూటర్, కార్లతో వేచి వుండే తల్లిదండ్రులు! మెరిట్, మెరిట్ అని ఏడ్చేవారికి ఈ విషయాలు అర్థం కావు.
సరే, ఆ కుర్రాడు హాస్టల్‍కి రాలేదని విని, నేరుగా పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి విద్యార్థి అక్రమంగా సమాధాన పత్రాన్ని తీసుకొని వెళ్ళినట్లు రాసిచ్చి, ఇల్లు చేరాను. ఆ తర్వాత నెల రోజులకు ఇంటర్మీడియట్ ప్రశ్నాపత్రాలు పోలీస్ స్టేషన్లో జాగ్రత్త చెయ్యవలసిన పని మీద వెళ్లాను. “సర్, మీరు కంప్లయింట్ రాసిచ్చారు కదా! అతన్ని అరెస్ట్ చేసి, జుడిషియల్ కస్టడీకి అప్పగించాము. నెల రోజులు అతను నిర్బంధంలో వుండి, మేజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేస్తే బయటకొచ్చాడు” అని చెప్తే, ఏడుపొచ్చింది. ఈ విషయం నాకు తెలిసి వుంటే నేనైనా, నా విద్యార్థి కనుక బెయిల్ ఇప్పించేవాణ్ణే.
డిగ్రీ ఫైనల్ పబ్లిక్ పరీక్షలో ఒక విద్యార్థి కాపీ కొడ్తుంటే పట్టుకొన్నాను. ఆ విద్యార్థి అందరిలాగే నా గదికి వచ్చి ఎంతో ప్లీడ్ చేశాడు. వృత్తి ధర్మం ఉంది కదా! “బాబూ, ‘పొజెషన్’ అని మాత్రమే రాస్తాను. ఈ పరీక్ష మాత్రమే పోతుంది” అని నచ్చజెప్పాను. అసలు విషయం అదే. అచ్చు కాగితంలో విద్యార్థుల తప్పుల చిట్టా వుంటుంది. సాధారణంగా ‘పొజెషన్’ అని మాత్రమే రాస్తాము. ఆ కుర్రాడు “మీరు నా చేత ఇప్పుడు పరీక్ష రాయించకుంటే ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది” అని బెదిరింపుగా అన్నాడు, ఎంతో నచ్చచెప్పి, అతన్ని పంపించివేశాను.
కళాశాల తెరిచిన కొన్ని రోజుల తర్వాత ఒక విద్యార్థి నా గదికి వచ్చి, “సర్, ఆ కుర్రాడు అన్నట్లుగానే ఊరికి పోయి ఆత్మహత్య చేసుకున్నాడు” అని చెప్పి, “మీరు ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు, గొడవలవుతాయి” అని సలహా ఇచ్చాడు. నేను పశ్చాత్తాపమో, దుఃఖమో, వేదనో తెలియని ఒక భావనతో నలిగిపోయాను. అన్నం తినలేకపోయాను. మా రెండో అబ్బాయి నా పరిస్థితి గమనించి, “ఇందులో మీ తప్పేమీ లేదు. మీ విధిని మీరు నిర్వహించారు” అని ఓదార్చాడు.
చివరగా ఒక సంగతి చెప్పి ఈ కథ ముగిస్తాను. తెల్లవారితే దూరవిద్య పబ్లిక్ పరీక్షలు. మా కాలేజీ లోన పరీక్షకు కనుక ప్రిన్సిపాల్‌గా ఆ బాధ్యతలు కూడా నిర్వహించాలి. ముందురోజు మధ్యాహ్నమే ఏర్పాట్లు చేస్తున్నాం. ఒక ముప్ఫై ఏళ్ల పల్లెటూరి యువతి నా వద్దకు వచ్చి మాట్లాడాలని కోరింది. ఆమె సమస్య ఎట్లాగైనా పరీక్షలు పాసై కాళ్ల మీద నిలబడాలి. అందుకోసం ఏమివ్వడానికైనా…. ఇట్లాంటి వారి పరిస్థితికి జాలిపడతాం! జీవితం ఇంత కఠోరంగా వుంటుందా?
(మళ్ళీ కలుద్దాం)