Site icon Sanchika

జ్ఞాపకాల తరంగిణి-42

[box type=’note’ fontsize=’16’] జీవితంలోని వివిధ దశలలో తనకు కలిగిన విశేష అనుభవాలను సంచిక పాఠకులతో పంచుకుంటున్నారు డాకాళిదాసు పురుషోత్తం. [/box]

[dropcap]ఎన్.[/dropcap]ఎస్.కె అనే మూడు అక్షరాలు వినని విద్వాంసులు, విశ్వవిద్యాలయాచార్యులు, రచయితలు, కళాకారులు తెలుగు దేశంలో ఉండరు. అర్థశతాబ్దం పాటు నేలనూతల శ్రీకృష్ణమూర్తి నెల్లూరులో జ్ఞానజ్యోతిగా వెలిగారు. ఆయన పుస్తక ప్రేమికులు. జ్ఞానతృష్ణ, సహృదయత, ఆయన సహజ అలంకారాలు. ఆయన రూపం ఎంత ప్రసన్నమో, వ్యక్తిత్వం అంత ఉన్నతమైనది. కొండంత ఓర్పుతో, చెరగని చిరునవ్వుతో వారి ధర్మపత్ని, విదుషీమణి పార్వతమ్మ ఇంటికివచ్చే అతిథులకు మర్యాదలు చేయడంలో తలమునకలై ఉండడం నిత్యం వారింట్లో కనిపించే సాధారణ దృశ్యమే. నెల్లూరు మూలాపేటలో వారిల్లు అతిథులకు, పండితులకు, కళాకారులకు సేదతీర్చే చలువపందిరి.

శ్రీ ఎన్.ఎస్.కె గారు

నేలనూతల శ్రీకృష్ణమూర్తిగారి తల్లి జానకమ్మ, తండ్రి శ్రీ రాములు. బాల్యంలో హరికథలు, పురాణశ్రవణం, కూచిపూడి భాగవతాలు చూడడం, తల్లి ద్వారా భాగవతం వినడం వంటి వాటితో ఆయన ప్రభావితులయ్యారు. శ్రీ కృష్ణమూర్తి గారు 1933లో అన్నామలై విశ్వవిద్యాలయంలో ఆర్థికశాస్త్రం ప్రథానాంశంగా బి.ఎ. చదివే సమయంలో ఆయన వ్యక్తిత్వాన్ని అన్నామలై ఆచార్యులు తీర్చిదిద్దడంలో ప్రధాన పాత్ర పోషించారు. ఎన్ఎస్.కె 1936లో మద్రాసు విశ్వవిద్యాలయంలో ఎం.ఏ.బి.ఎల్. పట్టా పుచ్చుకుని, నెల్లూరు కోర్టులో ప్రాక్టీసు చేసే సమయంలోనే సీనియర్ న్యాయవాది ఒంగోలు వెంకటరంగయ్య సహకారంతో సంస్కృత నాట్యశాస్త్ర గ్రంథాలు అధ్యయనం చేశారు. వెంకటరంగయ్య గారిద్వారా సుప్రసిద్ధ ఇండాలజిస్టు ఆనంద కుమారస్వామి రచనలతో ఎన్ఎస్.కె గారికి పరిచయం కలిగింది. వారు చాలా సంవత్సరాలు మూలాపేటలోని స్వంత ఇంట్లోనే ఆనంద కుమారస్వామి జయంతి జరిపేవారు. కుమారస్వామి భార్య శ్రీమతి Doña Luisa Runstein తో ఎన్.ఎస్. కె కుమారస్వామి కృషిని గురించి తరచు ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపారు. శ్రీమతి Doña మనదేశానికి వచ్చినప్పుడు, ప్రత్యేకంగా నెల్లూరు వచ్చి ఎన్.ఎస్.కృష్ణమూర్తి గారిని కలుసుకొని ఒకరోజు వారింట్లో ఉండి వారి పూజలో పాల్గొని భోజనం చేసి వెళ్ళారు. భారతీయ ప్రచురణకర్తలు కాపీరైటు నియమాలను ఉల్లంఘించి ఆనంద కుమారస్వామి రచనలను ప్రచురించినపుడల్లా ఎన్ఎస్.కె. గారా విషయం అమెరికాలో ఉన్న శ్రీమతి డోనాకు తెలియజేసి ఆమె చట్టరీత్యా చర్యలు తీసుకోడంలో సహకారాన్ని అందించారు కోర్టు పనులమీద ఆమె మనదేశానికి వచ్చినపుడే నెల్లూరులో ఎన్ఎస్.కె గారిని చూడడానికి వచ్చారు. ఇటీవలే డోనా ఎన్ఎస్.కెకు రాసిన ఉత్తరాలు పుస్తకరూపంలో వెలువడ్డాయి.

ఎన్.ఎస్.కె నెల్లూరు వర్ధమాన సమాజ గ్రంథాలయం గౌరవ గ్రంథాలయాధికారి పదవిలో ఉంటూ గ్రంథాలయానికి వచ్చిన పండిత, పరిశోధకులకు అపూర్వమైన సహకారాన్ని అందించడంతో ఆంధ్రదేశంలోని గొప్ప గొప్ప కవి పండితులు వారికి ఆత్మీయ మిత్రులయ్యారు. ఎన్.ఎస్.కె బ్రిటిష్ కాన్సలేట్, యుయస్.ఐఎస్ గ్రంథాలయాలనుంచి, ఇంకా ఎక్కడెక్కడి గ్రంథాలయాలను సంప్రదించి పుస్తకాలు తెప్పించి, మంచి పుస్తకాలు మిత్రులకిచ్చి చదవమని ప్రోత్సహించేవారు. వారికి ఇష్టమైన విషయాల్లో మిత్రులచేత మంచి మంచి పుస్తకాలు చదివించే శ్రద్ధ ఒకటి. పుస్తకం వారి ప్రాణం, మనం చినిగిన, నలిగిన పుస్తకాన్ని ఇచ్చినా దాన్ని బైండ్ చేయించేవారు.

1964లో ఎన్ఎస్.కె సంపాదకత్వంలో ఆంధ్రప్రదేశ్ లోనే మొట్టమొదటి మండల సర్వస్వం, విక్రమసింహపురి మండల సర్వస్వం 1500 పుటల గ్రంథం వెలువడింది. నెల్లూరు జిల్లాకు సంబంధించి ఈరోజుకు కూడా ఇదే గొప్ప పరామర్శ గ్రంథం. ఈ సమయంలోనే Indexing విధానాన్ని ఎన్.ఎస్.కె నిశితంగా అధ్యయనం చేసి, ఆ పరిజ్ఞానాన్ని వినియోగించుకొని దాదాపు 30 సంవత్సరాలు ఒక్క చేతి మీద పనిచేసి సుమారు 90 తెలుగు పత్రికల ‘వ్యాసరచనల సూచి’ తయారు చేశారు. ఆ తర్వాత పత్రికలో వ్యాసాలు రచించిన రచయితల ‘తెలుగు రచయితల రచనలు’ అనే సూచిని కూడా తయారుచేశారు. విశ్వవిద్యాలయాలు, అకాడమీలు చేయలేని పనిని వారు ఒంటరిగా ఎటువంటి ఆర్థికసహాయం, ప్రోత్సాహకాలు లేకుండా 30 సంవత్సరాలు శ్రమించి సాధించారు. ఇండెక్స్ చేయడానికి కార్డులు కొనలేక ఆయన మిత్రులవద్ద, పరిచయస్థులవద్ద వారి ఇళ్ళలో నిరుపయోగంగా పడివున్న పెళ్లి పత్రికలు, కొత్త సంవత్సరం గ్రీటింగ్ కార్డులు సేకరించి, వాటిని ఒకే సైజులో కత్తిరించి ఖాళీగా ఉన్న వైపు వ్యాసాల వివరాలు రాసిపెట్టేవారు. ఈ రెండు బృహద్గ్రంథాలను ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ప్రచురించింది. ఈ సంప్రదింపు గ్రంథాలు లేకుండా ఇప్పుడు తెలుగులో పరిశోధన ఒక్క అడుగుకూడా ముందుకు సాగదు.

ఎన్.ఎస్.కె తయారు చేసిన మరొక రెఫరెన్సు గ్రంథం Andhra Dance Sculpture. ఈ సచిత్ర గ్రంథాన్ని ఆంధ్రప్రదేశ్ లలితకళా అకాడమీ1975లో ప్రచురించింది.

భరతశాస్త్రంలో నిర్దేశించిన లక్షణాలను ఆంధ్రదేశ ఆలయాల శిల్పాలలలో నృత్యభంగిమలకు సమన్వయం చేసి ఈ రచన చేశారు. ఈ పుస్తకం ముద్రణ వెనక విషాదగాథను చెప్పుకోవాలి. చక్కగా టైపు చేసి, అనేక అపురూపమైన ఫొటోలతో పుస్తకాన్ని ప్రచురణార్థం ఆంధ్రప్రదేశ్ లలితకళా అకాడమీకి పంపిస్తే, అకాడమీ అశ్రద్ధ వల్ల ఈ రాతప్రతి కనుపించకుండా పోయింది. శ్రీకృష్ణమూర్తి గారు రెడ్డొచ్చె మొదలలెత్తుకోమన్నట్టు రెండో పర్యాయం పుస్తకం టైపు చేయవలసి వచ్చింది. టైపైతే చేశారు గానీ ఎక్కడెక్కడినుంచో సేకరించుకొన్న అపురూపమైన ఫొటోలు మళ్ళీ సేకరించడం సామాన్యమైన పనికాదు. వారి తోడల్లుడి తమ్మడు ప్రొఫెసర్ రావిప్రోలు సుబ్రహ్మణ్యం గారి సహాయంతో ఎలాగో ఫొటోలు సేకరించారు. వివరించబడిన నాట్యలక్షణాలను ఆంధ్రప్రదేశ్ ఆలయశిల్పాలలో నృత్య భంగిమలకు అన్వయిస్తూ ఎన్.ఎస్.కె ఈ గ్రంథాన్ని తయారు చేశారు. ఈ పుస్తక ప్రచురణకు ఆయన భగీరథ ప్రయత్నం చేయవలసివచ్చింది. ఎంఎస్.కె గారి వద్ద చిన్న portable Remington typewriter ఉండేది. రెండుచేతులు చూపుడువేళ్ళతోనే చాలా వేగంగా, నిర్దుష్టంగా వారు తమ పుస్తకాలన్నీ టైపు చేసారు. ఉత్తరాలు కూడా టైపు చేసి పంపేవారు. వారివద్ద గొప్ప గ్రంథాలయం ఉండేది. విదేశాలనుంచి గూడా పుస్తకాలు తెప్పించుకొనేవారు.

వర్ధమాన సమాజ అధ్వర్యంలో నేలనూతల శ్రీ కృష్ణమూర్తి గారు 1958 జనవరి, ఫిబ్రవరి మాసాల్లో ‘భారతవీలు’ అనే శీర్షికతో 18 రోజులు, నిర్వహించిన, ఉపన్యాసాలకు నెల్లూరు టవున్‌లో విద్యావంతులు విపరీతంగా హాజరయ్యారు. ఆ సభలు టౌన్లో సాహితీప్రియులకొక తిరనాళ్ళ. ఆ సభల్లో ఆవేశకావేశాలను రగిలించిన కొన్ని ఉపన్యాసాలలో మరుపూరు కోదండరామరెడ్డి కర్ణునిమీద చేసిన ఉపన్యాసం ఒకటి. పోలూరు హనుమజ్జానకిరామశర్మ శ్రీకృష్ణునిమీద, కోట సుబ్రహ్మణ్య శాస్త్రి అర్జునుని మీద, మరుపూరు కోదండరారెడ్డి కర్ణుడిమీద చేసిన ఉపన్యాసాలు పుస్తకాలుగా అచ్చయ్యాయి.

ఎన్.ఎస్.కె కొద్ది కాలం నెల్లూరు వి.ఆర్. కళాశాల చరిత్రశాఖలో అధ్యాపకులుగా పనిచేసినతర్వాత, వారి ఆత్మీయ మిత్రులు ప్రొఫెసర్ బిరుదురాజు రామరాజు గారి చొరవవల్ల ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఆయనను హైదరాబాదు పిలిపించి, వారి పర్యవేక్షణలో విజ్ఞాన సర్వస్వాలను తయారుచేయించింది.

ఎన్.ఎస్.కె సహధర్మచారిణి, విదుషీమణి శ్రీమతి పార్వతమ్మ గారు తులసీదాసు రామాయణం, జాయిసీ పద్మావత్ లను ఆంధ్రీకరించారు. ఈ దంపతులకు ఆంధ్రదేశంలో కవిపండితులందరూ ఆత్మీయులే. డాక్టర్ మారేమండ రామారావు. కె.వి.ఆర్, పుట్టపర్తి నారాయణాచార్యులు, ఆచార్య రావిప్రోలు సుబ్రహ్మణ్యం, సంజీవదేవ్, ఆచార్య రామకోటిశాస్త్రి, ఆచార్య బిరుదురాజు రామరాజు వంటి ఎందరితోనో వారికిఆత్మీయమైన మైత్రి ఏర్పడింది. నేను బి.ఏ. విద్యార్థిగా ఉండగానే పుట్టపర్తివారు యెన్.ఎస్.కె గారి అతిథిగా ఉండి, మూలపేట శివాలయం మండపంలో శివతాండవం పాడగా విన్నాను.

నేలనూతల శ్రీకృష్ణమూర్తి నెల్లూరు జిల్లాలో యువరచయితలను, పరిశోధకులను, కళాకారులను ప్రోత్సహించి, వారిచేత ఏదో ఒక మంచిపని చేయించారు. వారి ప్రోత్సాహం, గైడెన్సులో ఎందరో డాక్టరేట్లు సాధించారు, పుస్తక రచనకు పూనుకొన్నారు. నాచేత వెంకటగిరి సంస్థాన సాహిత్యం మీద పరిశోధన చేయించి, అనధికార పర్యవేక్షకులుగా నాకు సలహాలు,సూచనలు ఇచ్చి, నా పరిశోధనకు అవసరమైన గోపీనాథుని రామాయణాన్ని ఇచ్చి ప్రోత్సహహించారు. ఎన్.ఎస్.కె గారికి పరిచయంలేని లలిత కళలు గానీ, శాస్త్ర విషయాలు కాని లేవు. 1950లో కాబోలు నెల్లూరు ఆంధ్రసభలో బాలికలకువారు నిర్వహించిన వయోలిన్ పోటీలో మా చిన్నక్కయ్య పాల్గొన్నది. తర్వాత వారు అక్కడే విద్యార్థులకు భగవద్గీత శ్లోకపఠన పోటీ జరిపితే నేను కూడా పాల్గొన్నాను. న్యాయవాది వృత్తి చేసే రోజుల్లో వారి ఆఫీసు నెల్లూరు రాజవీధిలో ఒక మేడ పైన ఉండేది. నెల్లూరు సర్వోదయ కళాశాలో జరిగిన ఆంధ్రప్రదేశ్ 14వ చరిత్ర సభావేదికమీద కళాశాల కమిటీ అధ్యక్షులు ఎడ్లపల్లి గోవిందుసెట్టి ఎన్.ఎస్.కెను ఘనంగా సన్మానించారు. చివరిరోజులలో వారు తమ వద్ద ఉన్న గ్రంథాలన్నీ మిత్రులకు, సాహితీపరులకు ఉచితంగా బహుకరించడం ఎన్ ఎస్ కె గారి సహృదయతకు ఒక నిదర్శమం.

సత్కారము

ఎన్.ఎస్.కె స్థానిక పత్రికల్లో, విశేష సంచికలలోరాసిన వ్యాసాలన్నీ సేకరించవల్సి ఉంది. చతుర్వేదుల రామచంద్రయ్య దంపతులను వెంటపెట్టుకొని ఎంఎస్.కె ఉత్తరభారత యాత్రచేసి, ఆ యాత్రాచరిత్రను జమీన్ రైతు పత్రికలో ధారావాహికగా రాశారు. 1985లో వారి అభిమానులు ‘సప్తస్వర’ పేరుతో వారు ఆంగ్లంలో లలితకళలమీద రాసిన ఏడు వ్యాసాలను చిరుపుస్తకంగా ప్రకటించి, టౌన్ హాల్లో సభచేసి ఒక పర్సు ఇచ్చి సత్కరించారు. వర్ధమాన సమాజం ఆధ్వర్యంలో 1978 ప్రాంతంలో అభిమానులు టౌన్ హాలులోనే సభచేసి చిన్నమొత్తం ఇచ్చి సత్కారం చేశారు.

1949లో నెల్లూరు న్యాయవాదుల బృందం త్యాగరాజు నాటకాన్ని నెల్లూరు లో ప్రదర్శించారు. ఆ బృదం తిరువాయూరు వెళ్లి బెంగుళూరు నాగరత్నమ్మ ను కలుసుకున్న సందర్భంలో. ఎడమ చిరవర NSK, చేతిలో కర్రతో జి.ఎన్.కేసరి

ఎన్.ఎస్.కె జననం 1910 ఏప్రిల్ 16, శ్రీ రామనవమి రోజు, అస్తమయం 1996 నవెంబరు 23 కార్తీక పౌర్ణమి రోజు.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version