Site icon Sanchika

జ్ఞాపకాల తరంగిణి-45

[box type=’note’ fontsize=’16’] జీవితంలోని వివిధ దశలలో తనకు కలిగిన విశేష అనుభవాలను సంచిక పాఠకులతో పంచుకుంటున్నారు డాకాళిదాసు పురుషోత్తం. [/box]

[dropcap]ఈ[/dropcap]రోజు గత 50 సంవత్సరాలుగా నా సాహిత్య జీవితంలో కలిసి పనిచేసిన సాహితీ మిత్రులు, ఉత్తమ పరిశోధకులు డాక్టర్ మాచవోలు శివరామ ప్రసాద్ గారిని గురించి నాలుగు మాటలు రాస్తాను.

డాక్టర్ మాచవోలు శివరామ ప్రసాద్ అరవై ఏళ్ళుగా ఆంధ్ర సాహిత్య రంగంలో విశేష కృషిచేస్తున్న గొప్ప పండితుడు. చిన్న వయసులోనే విద్వాన్ డిగ్రీ పుచ్చుకొని ఉపాధ్యాయుడై అంచెలంచెలుగా బి.కాం. ఎం.ఏ. ఎం.ఫిల్. డాక్టరేట్ పట్టాలు పుచ్చుకొన్నారు; పోలూరు హనుమజ్డానకీరామ శర్మ వంటి ప్రముఖ పండితుల సాహచర్యంలో తమ విద్యను వృద్ధి చేసుకొన్నారు.

1947లో నెల్లూరులో జన్మించిన వీరి తల్లిదండ్రులు మాచవోలు శ్రీ రాములు, రత్నమ్మ దంపతులు.

శ్రీ రాములుగారు ప్రసిద్ధ హిందీ పండితులు. వీరు రంగనాయకుల పేట సెయింట్ పీటర్స్ హైస్కూలులో హిందీ పండితులుగా 30 సంవత్సరాలు పనిచేసి సంస్కృతం, ఇంగ్లీషు, ఉర్దూ భాషలలో గూడా స్వయంకృషితో గొప్ప పాండిత్యం సంపాదించారు.

శ్రీరాములుగారు అనారతాధ్యాపన తత్పరులు. బహు గ్రంథాలు లోతుగా చదివిన వారు. ఎంతోమంది పిల్లలకు విద్యా దానం చేశారు.

ఆ వాతావరణంలో ప్రసాద్ చిన్న వయసు నుండే చదువులో ఉత్సాహం చూపారు. 14 ఏళ్ళు గూడా నిండకుండా 1960లో ఎస్.ఎస్.ఎల్.సి. మంచి మార్కులతో పాసైనా, పి.యు.సి. వంటి ఇంగ్లీషు చదువులకు 15 సంవత్సరాలు నిండాలనే నిబంధన ఉన్నందున వయో నిబంధనలు లేని మూలపేట సంస్కృత పాఠశాలలో 1960లో విద్వాన్(బి)లో చేరారు.

నాయనగారి దగ్గర నేర్చుకొన్న సంస్కృతం ఈ చదువుకు ఊతం ఇచ్చింది. పాఠశాలలో నేలభొట్ల కోటయ్య శాస్త్రి, తంగిరాల శ్రీరామ మూర్తి, చిలకపాటి శ్రీనివాసాచార్యులు, ఆకెళ్ల అచ్చెన్న శాస్త్రి వంటి మహా పండితుల దగ్గర చదువుకొని మంచి విద్యార్థిగా గురువుల మన్ననలు పొందారు.

ఆ రోజుల్లో నెల్లూరు పప్పుల వీధిలో శ్రీ నిత్యానంద స్వామివారి పాఠశాల ఉండేది. ఆ స్వాములవారు పూజ్యులు ముప్పిరాల వేంకట నారాయణ శాస్త్రి గారిని శాస్త్ర పాఠాలు చెప్పమని ఆదేశించారు. శాస్త్రులవారు ప్రస్థాన త్రయం చదువుకొని, జీవితంలో అనుష్ఠించిన జ్ఞాన వైరాగ్య సంపన్నులు. స్వామివారి ఆదేశం పాటించి విద్యార్థులకు పాణినీయ వ్యాకరణం సంస్కృత లక్షణ గ్రంథాలు సాయం సమయాలలో బోధించేవారు. ఎక్కువ మంది మూలపేట పాఠశాల విద్యార్థులు, కొంతమంది ప్రైవేటుగా చదువుకొనే వారు. భాషా ప్రవీణ, శిరోమణి పరీక్షలకు చదివే వాళ్ళు. అందరికీ ఉచితంగానే పాఠాలు బోధించేవారు. ప్రసాద్ ముప్పిరాలవారి శిష్యులుగా తెలుగు ప్రబంధాలు, ఛందస్సు, వ్యాకరణం, సాహిత్య దర్పణం వంటి అలంకార గ్రంథాలు, కొంత వరకు పాణినీయమూ చదువుకొన్నారు.

1964 నుండి సెయింట్ పీటర్స్ హైస్కూలు తెలుగు పండితులుగా పనిచేస్తూ ప్రైవేటుగా పి.యు.సి. పాసై, వి.ఆర్. సాయం కళాశాలలో 1970లో బి.కాం. ఫస్ట్ క్లాసులో పాసై ప్రైవేటుగా వేంకటేశ్వర యూనివర్సిటీలో 1972 లో ఎం.ఏ. ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణత సాధించారు. 1973 నుండి 2005 వరకూ నెల్లూరు శ్రీ సర్వోదయ కాలేజీలో తెలుగు అధ్యాపకులుగా, తెలుగు డిపార్ట్‌మెంట్ అధిపతిగా మంచి పేరు తెచ్చుకొన్నారు.

ప్రసాద్ 1984లో యూ.జి.సి. స్కాలర్‌షిప్ మీద మద్రాసు యూనివర్సిటీలో ‘ఆంధ్ర మహాభారతంలో విదురుడు’ అంశం మీద ఎం.ఫిల్. చేసి, ప్రొ. గంధం అప్పారావు గారి అభినందనలు పొందారు. ఆ సంవత్సరం ఎం.ఫిల్. పరిశోధన చేస్తూ ఎం.ఏ. తెలుగు విద్యార్థులకు ప్రబంధాలు, ఛందస్సు, వ్యాకరణం పాఠం చెప్పారు.

పదవీవిరమణ తర్వాత 2 సంవత్సరాల పాటు డి.కె.డబ్ల్యూ కాలేజీలో ఎం.ఏ. తెలుగు విద్యార్థినులకు పాఠాలు చెప్పారు. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం నెల్లూరు కేంద్రంలో ఐదు సంవత్సరాలు ఎం.ఏ. విద్యార్థులకు పాఠాలు చెప్పారు. ఆంధ్రా యూనివర్శిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కో-ఆర్డినేటర్‌గా చాలా సంవత్సరాలు చక్కటి సేవలనందిస్తూ పరీక్షలు క్రమశిక్షణతో నడిపి ఆదర్శప్రాయంగా నిలిచారు.

ప్రసాద్ గారు డాక్టర్ కాళిదాసు పురుషోత్తం గారి పర్యవేక్షణలో ‘పూండ్ల రామకృష్ణయ్య సాహిత్య సేవ’ అనే అంశం మీద పరిశోధించి, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి 2000 సంవత్సరంలో డాక్టరేట్ డిగ్రీ పొందారు. అముద్రిత గ్రంథ చింతామణి, ఆంధ్ర భాషా సంజీవని, సూర్యాలోకము, వైజయంతి, శశిలేఖ, వాగ్వల్లి మొదలైన అరుదైన నాటి పత్రికలను పరిశీలించి చక్కటి సిద్ధాంత వ్యాసం వ్రాశారు. సాహిత్య చరిత్రలో 1885-1904 మధ్య అస్పష్టంగా ఉన్న వ్యవధానాన్ని వీరి పరిశోధన చక్కగా అవగాహనకు తెచ్చి పూరించింది.

గ్రంథ ప్రచురణలో సహకారం:

ప్రసాద్ గారు నవులూరు మాలెకొండయ్య గారి దగ్గర పద్య విద్యను అభ్యసించి, వారిద్వారా దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి పరిచయం సంపాదించుకొని పాఠ పరిశీలన, పుస్తక ప్రచురణ తెలుసుకొన్నారు. పుష్పగిరి తిమ్మన మూడు శతకాలు, తరిగొండ వెంగమాంబ కృష్ణమంజరి, కోవూరు పట్టాభిరామశర్మ ‘భగవద్గీతార్థ మంజరి’ కావ్యాల ప్రచురణలో నవులూరు వారికి సహకరించారు. తర్వాత పోలూరు హనుమజ్డానకీరామ శర్మ గారి రామాయణ తరంగిణి, వాసుదేవ కథా సుధ, నల చరిత్ర, ఆంధ్ర వాల్మీకి రామాయణాల శుద్ధ ప్రతి తయారుచేయడం లోనూ, ప్రచురణలోనూ సహకరించారు. చక్కగా ప్రూఫ్ కరెక్షన్ చేసి పెడుతూ, వారి చేత ‘విద్వాన్ దోషజ్ఞః’ అని ప్రశంసలు పొందారు.

కాళిదాసు పురుషోత్తం గారితో పాటు ఫిల్మ్ సొసైటీ ఉద్యమం వంటి సాంస్కృతిక సాహిత్య కార్యక్రమాలలోనూ పాలుపంచుకొన్నారు. కాళిదాసు పురుషోత్తం దంపూరు నరసయ్య మీద పరిశోధన చేస్తున్నపుడు తన వెంట దంపూరు, విలుకాని పల్లె, మద్రాసు వెళ్లి పరిశోధనలో తోడ్పడ్డారు.

ప్రొఫిల్మ్ ఫిల్మ్ సొసైటీ కార్య వర్గ సభ్యుడుగా 12 సంవత్సరాలు తన సేవలందించారు. మనసు ఫౌండేషన్ వారి గురుజాడలు, జాషువ రచనలు పరిష్కరణకు తన వంతు సేవ చేశారు.

జమీన్ రైతు, లాయర్, వాఙ్మయి, సంశోధన, విశాలాక్షి పత్రికలలో ప్రసాదుగారి వ్యాసాలు ప్రచురితమయ్యాయి.

ప్రాచీన సాహిత్యాన్ని విశేషంగా అభిమానించే ప్రసాదు గారి సభా ప్రసంగాలు పండితుల మన్ననలు పొందాయి. నెల్లూరు వర్ధమాన సమాజం, సరస్వతీ సమాజం, పద్యకళాపరిషత్తు, తిరుమల తిరుపతి ధర్మ ప్రచార పరిషత్ సభలలో భారత భాగవతాల మీద ప్రసంగించారు.

నెల్లూరి తొలి సాహిత్య పత్రిక ‘అముద్రిత గ్రంథ చింతామణి’ (1885-1904) పై ప్రసంగించి మరుపూరు కోదండరామరెడ్డి పత్రికా సంపాదక అవార్డు స్వీకరించారు.

శివరామప్రసాద్ పాఠ పరిష్కరణలో విశేష పరిశ్రమ చేశారు. భారతం, నరసభూపాలీయం మొదలైన కావ్యాల పాఠదోషాలు సరిచేశారు. అర్థ నిర్ధారణ చేశారు. కాళిదాసు శాకుంతలం మీద విశేష కృషి చేశారు.

వీరి వ్యాసాలనేకం నేడు కోరా ఆప్‌లో ప్రకటితమౌతున్నాయి.

ఉత్తమ ప్రమాణాలు, విమర్శాదర్శాలు గలిగిన వీరి వ్యాసాలు విజ్ఞాన దాయకాలుగా పండిత ప్రశంసలు పొందుతున్నాయి.

పుస్తక ప్రచురణ:

  1. 2008లో ఆంధ్ర ప్రదేశ్ ప్రాచ్య లిఖిత గ్రంథాలయం వారి ప్రచురణ ‘అలనాటి సాహిత్య విమర్శ’కు పురుషోత్తంతో పాటు సహ సంపాదకత్వం వహించారు. ఈ గ్రంథం అముద్రిత గ్రంథ చింతామణి నుండి ఎంపిక చేసిన వ్యాసాల సంకలనం.
  2. పూండ్ల రామకృష్ణయ్య వేదం వారికి 1891-1904ల మధ్య వ్రాసిన అరుదైన ‘సాహిత్య లేఖల’ను కాళిదాసు పురుషోత్తం గారి సహకారంతో ఇటీవల ప్రకటించారు. ఆ అపూర్వ లేఖలను వెలుగులోకి తెచ్చి వాటికి మంచి వివరణలు కూర్చారు. నాటి వాగ్వాదాలను, సాహిత్య స్థితిని అంచనా వేయడానికి ఆ లేఖలు సహకరిస్తాయి. అముద్రిత గ్రంథ చింతామణిని కృషిని, నాటి విమర్శల అసలు స్వరూపాన్ని తెలుసుకోడానికి ఆ లేఖలు, వివరణలు అవసరమౌతాయి..
  3. బంగోరె మిత్రులకు రాసిన లేఖలకు పురుషోత్తం గారితో పాటు సహ సంపాదకత్వం వహించారు.
  4. దుర్భా సుబ్రహ్మణ్య శర్మగారి రచనలు ‘కావ్యపంచమి’ సంకలనానికి సహ సంపాదకులు.

శివరామ ప్రసాద్ గారు విద్యా వినయ సంపన్నులు. పదవీ విరమణ చేసిన తర్వాత నెల్లూరు వర్ధమాన సమాజ గ్రంథాలయానికి ఎన్నో అరుదైన గ్రంథాలు బహూకరించి ప్రజల అభిమానాన్ని పొందారు.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version