[box type=’note’ fontsize=’16’] జీవితంలోని వివిధ దశలలో తనకు కలిగిన విశేష అనుభవాలను సంచిక పాఠకులతో పంచుకుంటున్నారు డా॥ కాళిదాసు పురుషోత్తం. [/box]
[dropcap]మా[/dropcap] అబ్బాయి చిరంజీవి వంశీధర్ 2005 లోను, 2010 లోను రెండు పర్యాయాలు లడాక్ వెళ్ళి అక్కడ SECMoL (Students’ Economic Cultural Movement of Ladakh) స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న పాఠశాలలో పాఠాలు చెప్పాడు. ఆ తర్వాత లడాక్ నుంచి యువతీ యువకులు రావడం, మా అబ్బాయి వాళ్ళకు హైదరాబాదులో నివాస సౌకర్యం, భోజన సౌకర్యం ఏర్పాటు చేసి వెనక్కి పంపడం తరచూ జరుగుతూ వచ్చింది. తను స్వచ్ఛ భారత్ ఉద్యమంలో భాగంగా కారులో భారతదేశమంతా తిరిగి వచ్చాడు కూడా.
2016 మార్చి నెలలో సోనమ్, డోల్మా అనే ఇద్దరు యువతులు, నూబ్రో అనే యువకుడు పాండిచ్చేరిలో వేసవిలో స్పోకెన్ ఇంగ్లీషు, స్పోకెన్ ఫ్రెంచి భాషల్లో శిక్షణ పొంది వెనక్కి వెళ్తూ మా బాబు రికమెండేషన్‌తో నెల్లూరులో దిగి నాలుగు రోజులు మా అతిథులుగా ఉన్నారు. వారిని వెంటపెట్టుకుని నెల్లూరు చుట్టుపట్ల ప్రదేశాలు, గ్రామీణ ప్రాంతాలు తిప్పి పంపించాను. టూరిస్టు గైళ్ళుగా పని చేస్తూ కొంత డబ్బు సంపాదించుకుని తమ చదువులు కొనసాగిస్తామని మాతో అన్నారు. లడాక్ మన దేశంలో భాగమైనా ఆ ప్రజలు, వాళ్ళ సంస్కృతి, జీవన విధానం మనకు పరిచయం లేకపోవడం, అట్లాగే ఈ ప్రాంతం జీవన విధానం వారికి తెలియకపోవడం మన జాతీయ సమైక్యతను బలపరిచే అంశాలు కావు.
మా అబ్బాయి “మీరే లడాక్ వెళ్ళి వాళ్ళను ప్రోత్సహించకూడదా” అని మమ్మల్ని ఉత్సాహపరిచాడు. నాకు 74 సంవత్సరాలు, నా శ్రీమతికి 68 సంవత్సరాలు. ఆ వాతావరణం, దాదాపు 14-16 వేల అడుగుల ఎత్తులో అతి శీతల వాతావరణానికి తట్టుకోగలమా అని కాస్త భయం వేసింది. ఇంత కఠినమైన, శ్రమతో కుడిన పర్యటనకు పూనుకోవడం సాహసమేనని తోచి, ఎందుకైనా మంచిదని మా కార్డియాలజిస్టు సలహా తీసుకొంటే మంచిదనిపించింది. “ఈ వయసులో లడాక్ యాత్ర వెళ్ళడం అవసరమా?” అని ఆయన నిరుత్సాహపరిచారు. “వెళ్ళాలనుకొంటే భూమార్గంలో వెళ్ళి తిరుగు ప్రయాణంలో విమానంలో రండి” అని డాక్టరు గారు సూచించారు. ఒక్కసారిగా విమానంలో 11,000 అడుగుల ఎత్తులో ఉన్న లే టౌన్‌లో దిగితే శరీరం ఆ వాతావరణానికి అలవాటు పడడానికి కష్టమని, క్రమక్రమంగా భూమార్గంలో పైపైకి వెళ్తూ పోతే, మన దేహాలు ఆ నూతన వాతావారణానికి అలవాటు పడతాయని వారు వివరించారు.
లడాక్ వెళ్ళడానికి రెండు రోడ్డు మార్గాలున్నాయి. ఏప్రిల్ మధ్య నుంచి రెండు భూమార్గాలు వాహనాలకు తెరుస్తారు. హిమాచల్ ప్రదేశ్ లోని కులూ, మనాలి నుంచి వెళ్ళే రోడ్డు ఒకటి; శ్రీనగర్ నుంచి జోజీలా పాస్ మీదుగా, కార్గిల్ మీదుగా వెళ్ళే మార్గం ఒకటి – రెండింటిలో శ్రీనగర్ నుండి వెళ్ళే మార్గాన్ని ఎంచుకొన్నాము. శ్రీనగర్ సముద్ర మట్టం నుంచి సుమారు 6000 అడుగుల ఎత్తులో ఉంది. అక్కడ్నించి మెల్లమెల్లగా, పైకి ఎక్కుతూ వాహనాలు వెళ్తాయి. కులూ మనాలీ మార్గంలో ప్రయాణం మొదట్లోనే 13,000 అడుగుల పై చిలుకు ఎత్తుకు వెళ్ళాల్సి ఉంటుంది.
లడాక్ పర్యటనకు మే చివరి నుంచి సెప్టెంబరు వరకు వాతావరణం అనుకూలంగా ఉంటుందని, జూన్ మాసంలో చాలా బాగా ఉంటుందని తెలిసింది. శ్రీనగర్ నుంచి జోజీలా పాస్ దాటుకుని కార్గిల్ చేరాలి. జోజీలా పాస్‍ను నవంబరులో మూసివేసి, ఏప్రిల్ మధ్యలో ఎప్పుడో తెరుస్తారు. తెరిచినా వాహనాలు బాగా తిరిగి దారి కాస్త సుగమంగా తయారవడానికి నెల రోజులు పడుతుందని మా ప్రయాణం మే మాసం చివర పెట్టుకొన్నాము.
మాతో పాటు మా కళశాల సహ అధ్యాపకులు ఇద్దరు, గూడూరు కాలేజీ విశ్రాంత ప్రిన్సిపాల్ లక్ష్మీ నారాయణ, మరొక గృహిణి లడాక్ ప్రయాణానికి సంసిద్ధత ప్రకటించారు. లడాక్‍లో మా ఇంట అతిథులుగా ఉండిన ముగ్గురు విద్యార్థులను సంప్రదించాము. ఎందుకైనా మంచిదని లే టౌన్ కు సమీపంలో సెల్‌మోల్ సంస్థ డైరక్టర్ నార్గే ను కూడా సంప్రదించాము. నార్గే మా అబ్బాయికి మిత్రుడు కూడా. దాదాపు నెల రోజులకు ముందే ఢిల్లీకి వెళ్ళే ఎక్స్‌ప్రెస్‌లో, ఢిల్లీ నుంచి జమ్మూ వెళ్ళే ఎక్స్‌ప్రెస్‍లో సీట్లు రిజర్వు చేయించుకొన్నాము. రిజర్వేషన్లు ఎప్పుడైనా దొరుకుతాయనే ధైర్యంతో మా బృందంలోని ఒక జంట మాత్రం ఢిల్లీ నుంచి జమ్మూకు వెళ్ళే రైల్లో ముందుగా రిజర్వేషన్ చేయించుకోలేదు.
లడాక్‌లో వేసవిలో పగలు 10 డిగ్రీలు, రాత్రి వేళ 0 నుంచి 4 డిగ్రీలు ఉంటుంది. పేం గాంగ్ లేక్ వద్ద సుమారు 14 వేల పై చిలుకు అడుగుల ఎత్తులో ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటుంది. అందరం థర్మల్ వార్మర్లు, స్వెటర్లు, ఉన్ని సాక్సు, గట్టి అడుగు ఉండే షూస్, గ్లోవ్స్, కోల్డు క్రీమ్ వంటి వస్తువులన్నీ సేకరించుకొన్నాము. శ్వాస తీసుకోవడం కష్టమైతే వాడవలసిన డైమాక్స్ వంటి మందులు కూడా దగ్గర పెట్టుకొన్నాము. మా పర్యటనకు సహకరిస్తున్న లడాకీ మిత్రులు కొన్ని జాగ్రత్తలు చెప్పారు. మొత్తం మీద అత్యంత తీవ్రమైన మండు వేసవిలో 2016 మే 25 రాత్రి మా బృందం నెల్లూరులో రైలెక్కి 27 ఉదయం న్యూ ఢిల్లీ స్టేషన్లో దిగి ఫస్ట్ క్లాస్ వెయింటింగ్ రూమ్‍లో తల దాచుకొన్నాము సాయంత్రం వరకు. సాయంత్రం 5 గంటలకు ఢిల్లీ కత్రా రైల్లో బయల్దేరి జమ్మూలో రాత్రి 3 గంటలకి దిగి, వేకువన 5 గంటల వరకు స్టేషన్‍లోనే ఆగాము. అంత నిండుగా ఉన్న జమ్ము స్టేషన్‍లో మేము తప్ప ఎవరూ దిగలేదు. మొత్తం ప్రయాణీకులందరూ కత్రాలో దిగి వైష్ణోదేవి యాత్ర వెళ్ళేవాళ్ళే.
జమ్మూలో ఒకరోజు ఉండడానికి మా అబ్బాయి రామకృష్ణ మిషన్‍లో ఏర్పాట్లు చేశాడు. తనకు హైదరాబాదు మఠం పెద్దలతో పరిచయం ఉంది. ఉదయం 5 గంటల దాకా స్టేషన్‍లో ఆగి, తర్వాత బయలుదేరమని మఠంవారు ముందుగానే సూచనలు చేశారు. అందరం 5 గంటలకు స్టేషన్ వెలుపలికి వచ్చి సంప్రదిస్తే టాక్సీవాలా 400/- రూపాయలు బాడుగ అన్నాడు. స్వామి వారు చెప్పిందీ అంతే.
జమ్మూ రావడానికి ముందుగానే మా అందరి ఫోన్లు మూగబోయాయి. నాదొకటే పోస్టు పెయిడ్ ఫోన్. మిగతా వారివి ప్రీ పెయిడ్ ఫోన్లు. సరిహద్దు ప్రాంతాల్లో ప్రీ పెయిడ్ ఫోన్లు పనిచెయ్యవట. టాక్సీ డ్రైవర్‍ని అడిగి ఫోన్ తీసుకొని స్వామీజీకి ఫోన్ చేశాను. “స్వామీజీ ఇప్పుడు ఎందుకు మేలుకొని ఉంటారు సాబ్!” అని అతను నవ్వుతూ అన్నాడు. అయితే అవతలి నుంచి స్వామీజీ గొంతు వినిపించింది. మా రాకను గురించి చెప్పాను. వారు డ్రైవర్‌కు కొన్ని సూచనలు చేశారు. దాదాపు 15 కిలోమీటర్ల దూరం ఉన్నట్లనిపించింది, రామకృష్ణ మఠం. మా కారు ఆగడమే తడవు, దర్వాను గేటు తీశాడు. కారు దిగగానే ఆశ్రమ ఉద్యోగులు మాకు గదులు చూపించారు.
ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ముందుగా రిజర్వ్ చేసుకోమని చెప్పినా పట్టించుకోని జంటకు ఢిల్లీ నుంచి జమ్మూకి రైల్లో ప్రయాణించే అవకాశం దొరకలేదు. రైల్వే ఉద్యోగులు మధ్యాహ్నం 12 గంటలకు జమ్మూ వెళ్ళే స్లీపర్ బస్ వివరాలు చెప్పి వాళ్ళని బస్ పట్టుకోమన్నారు. వాళ్ళిద్దరూ ఢిల్లీలో ఆ బస్ బయలుదేరే ప్రాంతానికి వెళ్ళిపోయరు. మేము ఐదుగురం మాత్రం ఆశ్రమంలో వాళ్ళ రాక కోసం ఎదురు చూస్తూ కూర్చొన్నాము.
(మళ్ళీ కలుద్దాం)