[dropcap]జ[/dropcap]మ్మూలోని రామకృష్ణమఠ్‌లో ప్రతిదీ క్రమశిక్షణతో జరుగుతాయి. మఠాధిపతిగారి గది ఎదురుగా డైనింగ్ హాల్. మధ్యాహ్నం ఖచ్చితంగా 12 గంటలకు స్వామీజీ, అతిథులు భోజనానికి కూర్చుంటారు. మా దంపతులం సిద్ధంగా ఉన్నా, మా మిత్రులు కొత్త సిమ్ కార్డులు వేయించుకోను టౌన్‌లోకి వెళ్ళి రాలేదు. స్వామీజీని భోజనం చెయ్యమని కోరినా, మా మిత్రులు వచ్చేదాకా ఆగుదామని ఇతర అతిథులను భోజనం చెయ్యమని కోరి, వారు మాతో పాటు మా మిత్రుల కోసం ఆగారు. పదిహేను నిముషాల తర్వాత మా మిత్రులు రావడంతో వారితో కలిసి మేము భోజనం చేశాము. బెంగాలీల భోజనం, రొట్టెలు, అన్నం ఉంటుంది కాబట్టి ఏమీ ఇబ్బంది అనిపించలేదు.
మధ్యాహ్నం ఒంటిగంట దాటిన తర్వాత, ఢిల్లీలో రిజర్వేషన్ లేక ఆగిపోయిన మా బృందంలోని జంట ప్రైవేటు స్లీపర్ బస్‍లో 24 గంటలు ప్రయాణం చేసి, ఆశ్రమానికి వచ్చారు. వారి భోజనాలు కాగానే మా నగర దర్శనానికి టాక్సీ పిలిపించారు. మే 28వ తారీఖు. ఎండ బాగానే కాస్తోంది. మా బృందం ఏడుగురం టాక్సీలో నగర దర్శనానికి బయల్దేరాము. జమ్మూ చాలా పెద్ద నగరం, చాలా పార్కులు, ఉద్యానవనాలు ఉన్నాయి. మెదట రఘునాథ ఆలయం చూచాము. తరువాత తావీ నదీతీరంలోని హరిసింగ్ ప్యాలస్ చూచాము. దాన్ని ఇప్పుడు మ్యూజియంగా మార్చారు.
రాజవంశస్థుల విలాస జీవితాన్ని ప్రతిబింబించే అనేక వస్తువులు, వారి వస్త్రాలు అన్నీ ప్రదర్శనలో ఉంచారు. హరిసింగ్ కాబోలు చివరి స్వదేశీ సంస్థానాధిపతి. సంస్థానాన్ని ప్రభుత్వానికి అప్పగించిన తర్వాత కట్టుబట్టులతో వెళ్ళిపోయారు. హరిసింగ్ డోగ్రా వంశీయులు. స్థానికులు వారిని ఇప్పటికీ చాలా అభిమానిస్తారు. హరిసింగ్ ప్యాలస్ ముందు నిలబడి చూస్తే తావీ నది అవతలి తీరంలో జమ్మూ నగరం విస్తరించి బహళ అంతస్తుల మేడలతో కన్పిస్తుంది. సాయంత్రం చీకటి పడేవరకు నగరం అంతా టాక్సీలో తిరిగి చూశాము.
జమ్మూ నగరం హిమాలయ పర్వతాల ఒడిలో, ఎగుడుదిగుడుగా ఉంటుంది. రోడ్లన్నీ తిరుమల కొండ మీదికి పోతున్నట్లు ఎగుడుదిగుడుగా ఉన్నాయి. జమ్మూ స్టేషనులో – వందల సంఖ్యలో రైళ్ళ కోసం వేచి ఉన్నవారు, సెలవలు అయిన తర్వాత ఉద్యోగాల్లో చేరే కుటుంబాలు చాలా కనిపిస్తాయి.
సాయంత్రం స్నానాలు ముగించి అందరం భోజనాలకు తయారయ్యాము. గంట వినబడగానే స్వామీజీ పాటు భోజనానికి వెళ్ళాము. మాతో పాటు కొన్ని బెంగాలీ కుటుంబాలు కాశ్మీరు పర్యటన ముగించుకోని భోజనాల్లో కలిశారు. బెంగాలీ భక్తులు మమ్మల్ని పలకరించి, “మీరు ఏ మఠానికి (అంటే బ్రాంచికి) చెందిన వారు?” అని అడిగినప్పుడు, మేము హైదరాబాదు మఠం వారి పరిచయం వల్ల ఇక్కడ దిగామని చెప్పాము. స్వామీజీ మమ్మల్ని ఇతర అతిథులకు పరిచయం చేస్తూ “వీరు లడాక్ సంస్కృతిని అధ్యయనం చేయడానికి వెళ్తున్నారు” అని అన్నప్పుడు నాకు కాస్త సిగ్గనిపించింది. అయినా వారి మాటలతో స్ఫూర్తి పొంది లడాక్‍లో ఉన్నన్ని రోజులు అక్కడి ప్రజల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాము. అప్పటికే నేను హెలీనా నోర్‌బెర్గ్ లడాక్ మీద రాసిన ‘ఏన్షియంట్ ఫ్యూచర్స్’ పుస్తకం చదివి ఉన్నాను.
భోజనాలయ్యాక, మా గదులకు వచ్చి చర్చించుకున్నాము. మేము గుమాస్తాను సంప్రదిస్తే, మాకు గదులు, భోజనాలు ఉచితమనీ, ఏమీ చెల్లించనక్కర లేదని అన్నాడు. ఒక రోజు మొత్తం పలహారాలు, భోజనాలు, గదుల సౌకర్యం ఏర్పాటు చేశారని, మాలో మేం తర్కించుకుని ఏడుగురికి ఏడువేల రూపాయలు గుమాస్తా చేతికి ఇస్తే, “స్వామీజీకి ఇవ్వండి” అన్నాడు. అతిథులతో వారు మాట్లాడడం ముగించిన తర్వాత, వారి గదికి వెళ్ళి వినయంగా మా ప్రతిపాదన, డబ్బు వారి ముందుంచాము. వారు లేచి, బీరువా తెరిచి, రసీదు బుక్కులో నెల్లూరు కాలేజీ లెక్చరర్ అని రాసి, విరాళానికి రసీదు ఇస్తూ “రోజూ ఎంతోమంది ఇక్కడి సౌకర్యాలు వాడుకొని వెళ్తారు గాని, మీలాగా స్పందించే వాళ్లు అరుదుగా ఉంటారు” అని చిరునవ్వుతో అన్నారు.
రాత్రి భోజనం తర్వాత స్వామీజీతో కాసేపు మాట్లాడే అవకాశం లభించింది. స్వామీజీ బెంగాలీ, సిలిగురి ప్రాంతానికి చెందినవారు. 70 ఏళ్ళు పైబడినా వేకువజాము నుంచీ అవిశ్రాంతంగా ఆశ్రమ వ్యవహారాలు పర్యవేక్షిస్తున్నా, అలసిపోయినట్లు కన్పించలేదు. ప్రశాంతంగా, ఓపికగా మాతో సంభాషించారు. వారు గొప్ప విద్వాంసులని మాటల్లో స్ఫురించింది. మాకు ఒక యువ బ్రహ్మచారిని పరిచయం చేస్తూ “ఆయన ఆంధ్రులు, గోదావరి జిల్లా వారు” అన్నారు. అతనితో పాటు మరి ముగ్గురు గోదావరి జిల్లా బ్రహ్మచారులు ఆశ్రమంలో పని చేస్తున్నట్టు అన్నారు. తెల్లవారి శ్రీనగర్ ప్రయాణనికి టాక్సీ ఏర్పాటు చేసినట్లు, ఉదయం ఆరు గంటలకల్లా సిద్ధంగా ఉండమని స్వామీజీ చెప్పారు. మిషనరీ అనే మాటకు పూర్తి అర్థం స్వామీజీ విషయంలో సరిపోతుంది. అతిథుల సౌకర్యాలు, ఏర్పాట్లు అన్నీ స్వయంగా గమనించుకొంటారు. నిత్యం ఎందరో పర్యాటకులు వచ్చి పోతుంటారు. అందరి పట్ల వారి వర్తనం ఒకలాగే ఉంటుందని అనిపించింది.
మే 29 వేకువనే లేచి, అందరం సుదీర్ఘ ప్రయణానికి తయారయ్యాము. టాక్సీ ఎక్కుతుంటే స్వామీజీ మాకు వీడ్కోలు చెప్పారు. నిన్నటి రోజు శ్రీనగర్ నుంచి జమ్మూకు టాక్సీలో రావడానికి 17 గంటలు పట్టిందని, శుభంగా వెళ్ళి రమ్మని స్వామీజీ చెప్తుంటే అందరం నమస్కరించి సెలవు తీసుకొన్నాము. జమ్మూ మఠంలో ఉన్నది ఒక్క రోజే అయినా, స్వామి వారి స్నేహపూర్వక ఆదరాన్ని మేమేవ్వరము మరచిపోలేకపోయాము. జమ్మూ ఆశ్రమం నగరం రణగొణధ్వనులకు దూరంగా, విశాలమైన స్థలంలో ఫలపుష్పతరుల మధ్య ఉంది. ఉదయం బ్రహ్మచారులే తోట పనులు చేస్తూ కనిపించారు.
నిన్న ఉదయం మఠం ఆవరణలో పూలమొక్కలు గొప్పులు తవ్వుతూ, నీళ్ళు పోస్తూ కొందరు బ్రహ్మచారులు కనిపించారు. బహుశా వారేనేమో తెలుగు దేశం నుంచి వచ్చిన బ్రహ్మచారులని అనుకున్నాము.
టాక్సీ కదిలిపోయే వరకూ స్వామీజీ చిరునవ్వుతో నిలబడే ఉన్నారు. మళ్ళీ జీవితంలో వారిని చూడలేమని తెలుసు. వారి శాంత రూపాన్ని కళ్ళ నిండా నింపుకొన్నాము. వీలుంటే మళ్ళీ వచ్చి ఆశ్రమంలో కొన్ని నెలలు ఉండమని, రచయితల కోసం ప్రత్యేకంగా కొన్ని గదులు ఏర్పాటు చేశామని, స్వామీజీ అన్న మాట మనసులో ఉండిపోయింది.
జమ్మూ నుంచి శ్రీనగర్ వెళ్ళే మార్గం 50 -60 కిలోమీటర్ల వరకూ చాలా బాగుంది. విశాలమైన రోడ్డు, నున్నగా సాగుతోంది. దారిలో అక్కడక్కడా కొండలు తొలిచి టనెల్ మార్గం ఏర్పాటు చేశారు. 1986లో నేను శ్రీనగర్ వెళ్ళినప్పుడు జవహర్ టనెల్ ఒక్కటే ఉండేది. ఇప్పుడు జమ్మూ వదిలిన రెండు గంటల్లోపలే కొత్తగా కొండలు తొలిచి గుహమార్గాలు ఏర్పాటయ్యాయి. సుమారు 60 కిలోమీటర్ల ప్రయాణం తర్వాత ఇరుగ్గా, కచ్చాగా ఉన్న సింగిల్ రోడ్డు మొదలైంది. వచ్చే పోయే వాహనాలకు ఒకటే దారి. ఎగువకు వెళ్ళే వాహనాలకు, కొండ దిగి వచ్చే వాహనాలు ఆగి దారి ఇస్తున్నాయి. తరచూ వాహనాలు వందల సంఖ్యలో బారుగా నిలిచిపోయి, ప్రయాణం చాలా ఆలస్యం అవుతోంది. ప్రకృతిని ఆనందించడం సరదాగానే ఉన్నా, కారు మాటిమాటికి ఆగుతుండడం వల్ల విసుగు, అసహనం కలుగుతోంది. మాటిమాటికి సైన్యం తాలూకు వాహనాలు ఎదురు రావడమో, మమ్మల్ని దాటిపోవడమో జరుగుతోంది.
మేము జమ్మూలో దిగిన ఆరేడు గంటల తర్వాత మా వద్ద ఉన్న పోస్టు పెయిడ్ మొబైల్ ఫోన్లు పని చేయడంతో సంతోషించాము. మిగతావాళ్ళు జమ్మూలో ఆధార్ కార్డులు చూపి కొత్త సిమ్ములు వేయించుకొన్నారు. అవి 24 గంటల తర్వాత గాని పని చెయ్యవు.
ఆశ్రమం వాళ్ళు కుదిర్చిన మా టాక్సీవాలా చాలా నెమ్మదస్థుడు. దారిలో కాఫీ, టిఫిన్, భోజనం, ఏదీ మా వద్ద తీసుకోడానికి అంగీకరించలేదు. కారు వేలీ లోకి ప్రవేశించిన తరువాత రోడ్డుకు ఇరువైపులా సుందర దృశ్యాలు చూస్తూ ఆనందించాము. మధ్యాహ్నం రోడ్డు పక్కన పంజాబీ ధాబాలో భోజనం. మా గైడ్ డోల్మా శ్రీనగర్‌లో హోటల్ బుక్ చేసి, మా కోసం వేచి ఉంది. టాక్సీ అతను సూటిగా మా లాడ్జి ముందు దిగబెట్టే సమయానికి రాత్రి ఏడయ్యింది. స్వామీజీ అన్నట్లుగానే 13 గంటల ప్రయాణం. జమ్మూ నుంచి RTC, ప్రైవేటు బస్సులలో వెళ్ళడం కన్నా టాక్సీలో వెళ్ళడం మేలు, చాలా ప్రయాస తప్పుతుంది. స్వామీజీ చెప్పిన ప్రకారం ఏడుగురికి 6500/- రూపాయలు తప్ప టాక్సీవాలా అదనంగా తీసుకోలేదు.
మా గైడ్ డోల్మా 26 సంవత్సరాల యువతి. ఒంటరిగా తను 24 గంటల ముందే శ్రీనగర్ వచ్చి హోటల్‌లో మా కోసం వేచి ఉంది. ఆ హోటల్ దాల్ లేక్ తీరానికి చాలా దగ్గరలో కొత్తగా నిర్మించినది. హోటల్ యజమాని కాశ్మీరీ ముస్లిం. 35 సంవత్సరాలు ఉంటాయి. డోల్మా వంటగదిలో స్వయంగా పర్యవేక్షిస్తూ హడావిడి చేసి, మాకు తగిన భోజనాలు తయారు చేయించిందని అతడు నవ్వుతూ అన్నాడు. శ్రీనగర్ పర్యాటకుల సీజన్ మొదలైనా మొత్తం హోటల్‍లో మా పార్టీ, మరొక యువ దంపతులు మాత్రమే ఉన్నారు. 2016లో టెర్రరిజం అంత తీవ్రంగా లేకపోయినా, పర్యాటకులు శ్రీనగర్‌కు మొగం చాటేస్తునట్లు అనిపించింది.
అందరం వేన్నీళ్ళ స్నానం చేసి డైనింగ్ హాల్‍కు తరలివెళ్ళాము. శ్రీనగర్‍లో మూడు రోజులుంటాము. ఏమేమి చూడాలో చర్చించుకొంటూ డిన్నర్ ముగించి నిద్రకుపక్రమించాము.
(మళ్ళీ కలుద్దాం)