Site icon Sanchika

జ్ఞాపకాల తరంగిణి-54

లదాక్ పర్యటనలో మొదటి మజిలీ ఆర్యుల లోయ

[dropcap]ము[/dropcap]ల్‌బెక్ పల్లె సమీపంలో పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో దా, హను, బేమా, దార్బిన్, గార్కొన్ అనే అయిదు ఆర్యుల గ్రామాలున్నాయి. ఈ ప్రదేశాన్ని Aryan Valley అంటారు. మిలటరీ దా, హను రెండు గ్రామాలకు మాత్రమే పర్యాటకులను అనుమతిస్తుంది. మా గైడ్ ముందుగానే అనుమతి పత్రాలు సంపాదించింది. మేము ఆ పల్లెల పొలిమేరలో కారు దిగగానే అక్కడి మిలటరీ చెక్‍పోస్టులో పత్రాలు చూపించినా, ఒక సైనికుడు మా వద్దకు వచ్చి మాట్లాడిన తర్వాతే మమ్మల్ని అనుమతించారు. ఈ పల్లెలు సింధూనది తీరంలోనే ఉన్నాయి.

ఆర్యన్ గ్రామంలో చిన్న పొలం
ఆర్యన్ గ్రామం

ఆర్యుల లోయలో ప్రజలు లదాకీలకన్నా విశిష్టమైనం రూపం కలిగి ఉంటారు. అలెగ్డాండరు దండయాత్రలో మన దేశంలోకి వచ్చిన గ్రీకు సైనికులు కొందరు ఈ గ్రామాల్లో స్థిరపడ్డారని, తాము వారి సంతతికి చెందిన వారమని ఈ పల్లీయులు విశ్వసిస్తారు. లదాకీలు వీళ్ళను ‘బ్రోక్పా’లని అంటారు. అంటే స్థానికేతరులని అర్థం. లదాకీలు టిబెట్ భాషకు దగ్గరగా ఉండే మాండలికం బోథ్ భాషను మాట్లాడుతారు. ఈ ఆర్యులు లిపి లేని మీర్ మో భాషలో మాట్లాడుతారు.

ఆర్యన్ గ్రామంలో ఒక యువతి ఇల్లు

బ్రోక్పాలనే ఈ పార్వతేయులు వేల ఏళ్లుగా జన్‌స్కర్, సింధూనదుల పరీవాహక ప్రాంతంలో ప్రకృతి మాత ఒడిలో నిశ్శబ్దంగా జీవిస్తున్నారు. లదాకీలకంటే వీరు స్ఫురద్రూపులు. తెల్లని దేహవర్ణం, నీలికళ్లు, బంగారు రంగు కురులు, లదాకీలకన్నా బాగా ఎత్తుగా ఉంటారు.

లడాకీలు సాంప్రదాయ దుస్తుల్లో. జన్‌స్కర్. ఫోటో అంతర్జాలం నుంచి

వీటితో పాటుగా కొన్ని టిబెటియన్, మంగోలియన్ లక్షణాలు కూడా వీళ్లలో కనిపిస్తాయి. 19వ శతాబ్ది చివర, 20వ శతాబ్ది మొదట్లో అప్పటికీ ప్రచారంలో ఉన్న ఆర్యజాతి సిద్ధాంతం ప్రభావంలో పాశ్చాత్య పండితులు వీళ్లను ఆర్యజాతి ప్రజలని తీర్మానించారు. వీళ్లను దర్దు జాతి ప్రజలని కూడా వ్యవహరిస్తారు. పాకిస్తాన్‌లో భాగమైన గిల్జిత్‌లో దర్దిస్థాన్ ఉంది. ఎవరు ఏ విధంగా పిలిచినా, వాళ్లు తమను మినారోలని అభివర్ణించుకుంటారు. ఈ మధ్య యువతకు ఆర్యపదం బాగా తలకెక్కి పేరు చివర ఆర్యన్ అని చేర్చుకొంటున్నారు. మొత్తం మీద జన్యుపరీక్షల్లో యూరప్ వాసులతో వీరికి కొన్ని పోలికలున్నట్లు మాత్రం తేలింది.

ఆర్యుల గ్రామాలు కాస్త సుఖంగా ఉంటే వాతావరణంలో ఉండే ప్రదేశాలు, వీళ్లు సింధు నది జలాలతో బార్లి, గోదుమ కొద్దిగా పండించుకొంటారు. వీళ్ల గ్రామాల్లో ఆప్రికాట్ వృక్షాలు సమృద్ధిగా పెరుగుతాయి. వైదిక ఆర్యులకు గోవు అత్యంత ప్రధానమైనది. గోమాంసం దేవుడెరుగు, ఆవు పాలు, వెన్న, గోవుకు సంబంధించిన దేన్నీ వీళ్లు ముట్టరు. లదాకీలు శీతకాలంలో ఆవు పేడతో కుంపట్లు వెలిగించి గదిని వెచ్చగా ఉంచుకొంటారు. వీరు ఆవు పేడను వినియోగించరు.

ఆర్యుల పల్లెలో ఒక ఇల్లు

1980 ప్రాంతాల్లో కొందరు జర్మనీ దేశ యువతులు సృచ్ఛమైన ఆర్య జాతి సంతానం కోసం ఇక్కడి యువకులతో స్నేహం చేసి, గర్భధారణ తర్వాత, ఆ యువతులు జర్మనీ వెళ్లిపోయారట. ఈ కథనాలు పత్రికల్లో రావడంతో ఈ గ్రామాల పేర్లు బయట ప్రపంచానికి తెలిసాయట. ఈ పల్లెలకు పర్యాటకుల తాకిడి, ప్రెగ్నెన్సీ టూర్లు మొదలయ్యాయట!

ఊరి వెలుపలే కారు దిగి మట్టి రోడ్లులో నడిచివెళ్లాం. దారికి ఒక వైపు లోయ. మరొక వైపు బండరాళ్లతో మట్టికట్టబడి ఇళ్లు, కొన్ని రెండతస్తుల ఇళ్లు. ఇళ్లు వెనక సింధూనది నుంచి మళ్లించిన పిల్ల కాలువ పారుతోంది. కాలువ ఆవల చిన్న చిన్న కయ్యల్లో ఏవో పైర్లు. కొందరు గృహిణులు కాలువలో బట్టలుతుకుతున్నారు. ఇళ్ల మధ్య, పెరళ్లలో ఫలవృక్షాలు, ఎండకు ఆరబోసిన ఆప్రికాట్ పళ్లు. కొన్ని ఇళ్ల మందు పూలకుండీల్లో రోజాలు పూచి ఉన్నాయి. ఊరి మధ్యలో హైస్కూలు, హాస్టలు, చెల్లాచెదురుగా అక్కడక్కడా విసిరేసినట్లు ఇళ్లు. బౌద్ధ సన్యాసుల మఠం, స్జేజి వెనక ప్రకృతి దృశ్యాన్ని చిత్రించిన తెరదించినట్లు ఊరి చివర, దూరంగా ఎత్తైన పర్వతాలు, అగాధమైన లోయలు. ఆ ఊళ్లో వంద కుంటుంబాల బ్రొక్పాలు ఉన్నట్లు స్కూలు టీచరు మాతో అన్నది.

సంప్రాదయ దుస్తుల్లో ఆర్యన్ యువకుడు. టోపీతో యెర్రని మాంతి పువ్వులు

అప్పుడే స్కూలు విడిచిపెట్టినట్లుంది, విద్యార్థులను తీసుకొని వెళ్లడానికి మిలటరీ ట్రక్ వచ్చింది.

ఈ ఆర్యుల భాష, మీర్ భాష. మా గైడ్‌కు ఆ భాష రాదుగానీ వీళ్లకు లదాకీ భాష వచ్చు. ఇంటి ముందు ఆంగట్లో కూర్చుని ఉన్న 17 సంవత్సరాల యువతి మమ్మల్ని పలకరించి లోపలికి రమ్మని ఆహ్వానించింది. ఆమె జమ్ములోని కాలేజిలో చదువుతోందట. వేసవి సెలవులకు వచ్చి ఉంది. తన పేరు సోనమ్ ఆర్యన్ (పేరు మార్చాము) అని పరిచయం చేసుకొన్నది. ఆమె తండ్రి సైన్యంలో పని చేస్తాడట. 26 సంవత్సరాల అన్నయ్య వ్యవసాయం పనులు చూసుకొంటాడు. సోనమ్ పెరటితోటలో పని చేసుకొంటున్న తల్లిని వెంటపెట్టుకొని వచ్చింది. మమ్మల్ని చూడటానికి క్షణాల్లో ఇరుగుపొరుగు యువతులు అక్కడ చేరారు.

సోనమ్ ఆర్యన్ యువతి కాలేజీ విద్యార్థిని

సోనమ్ మా అందరికి టీ తయారు చేసి ఇచ్చింది మేక పాలతో. ఆవు పాలు, వెన్న, చివరకు ఆవు పేడ కూడా ఉపయోగించరు. సోనమ్ ఇంట్లో వంటగదికాక, చిన్నవి మూడు గదులున్నాయి. ఒక గదిని ‘హోం స్టే’ కోసం కాస్త అలంకరించి, శుభ్రంగా ఉంచారు. ఇంట్లో టి.వి దీపాలు సౌరవిద్యుత్తుతో పని చేస్తాయి.

హోమ్ స్టే లలో ప్రతిచోటా భోజనాల గది ఇలా

సోనమ్ కాస్త సిగ్గరి, మితంగా మాట్లాడుతుంది. మా వాళ్లడిగిన ప్రశ్నలన్నింటికి ఇంగ్లీషులో సమాధాలు చెప్పింది. మా బృందంలో ఇద్దరు మహిళలు సోనమ్ మిత్ర బృందంతో కలిసిపోయి పాత స్నేహితుల్లాగా మాట్లాడుకొన్నాకు. సోనమ్ దుబాసిగా పని చేసింది. సోనమ్ ఇరుగు పొరుగున ఉన్న మరొక యువతి తన ఇంటికి తీసుకొనిపోయి ఇల్లంతా చూపించింది. ఆమె భర్తతో పాటు ఢిల్లీలో తీసుకొన్న ఫోటోలు గోడను వేలాడుతున్నాయి. ఆమె పెనిమిటి సైన్యంలో ఉన్నాడట. ఆర్యన్‌లు ఇళ్లకు కొంచెం దూరంగా మరుగు దొడ్లు కట్టుకొన్నారు. లదాక్ అంతా ఇదే పద్ధతి.

ఈ మినారోలు బౌద్ధధర్మాన్ని, స్వీకరించక ముందు బాన్ (BON) మతాన్ని అనుసరించేవాళ్లు, ప్రకృతి శక్తులను, లాహ్ (LAH) అనే దేవుణ్ణి ఆరాధించేవాళ్లు. ఇప్పుడు కూడా లాహ్ దేవుడి కొలువు జరిపి, ఆ జాతరలో మేకలను బలి ఇస్తారు. వీళ్లు శుద్ధ శాఖాహారులు, గుడ్లు, చేపలు కూడా తినరు. పండుగ పబ్బాల సందర్భంలో మాత్రం మేక మాంసం భుజిస్తారు.

సాంప్రదాయ దుస్తుల్లో ఆర్యన్ తల్లి, కుమారుడితో

ఈ ఆర్యన్‌ల వంటిళ్లలో అటక మీద ధగధగ మెరిసేట్లు చక్కగా తోమిన రాగి చరవలు, వంట పాత్రలు, బిందెలు అందంగా పేర్చి ఉన్నాయి. వీళ్లకు వంటిళ్లు అతి పవిత్రమైన ప్రదేశాలు. దుష్ట శక్తులను ఇళ్లల్లోకి జొరబడనివ్వకుండా లోహాలు అడ్డుకొంటాయని వీరి విశ్వాసం. పాటలన్నా, పువ్వులన్నా వీళ్లకు చాలా ఇష్టం. వాతావరణం కొంచెం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఇళ్లల్లో రకరకాల పూల చెట్లు పెంచుతున్నారు. స్త్రీ పురుషులనే తేడా లేకుండా అందరూ టోపీలను రకరకాల పూలతో అలంకరించుకొంటారు. బెర్రి జాతికి చెందిన షాక్లో (దీన్నే మాంతి పువ్వులని కూడా అంటారు.) పూలతో టోపీలను అలంకరించుకొంటారు. టోపికి ఈ పువ్వుల అలంకరణ లేకపోతే ఏదో అశుభం జరిగినట్లు ఎదుటివారు అనుకొంటారుట! ముత్తయిదువులు ఎర్రని గాజు పూసల దండలు కంఠానికి ధరిస్తారు.

మినారోల సమాజంలో మంత్రగాడికి, వైద్యుడికి, పూజారికి జ్యోతిష్యుడికి చాలా ప్రాధాన్యం ఉంది. జ్యోతిష్యుడే సౌరమానం ప్రకారం మంచి రోజులు చెప్తాడు.

సింధు తీరంలో రచయిత బృందం విడిది చేసిన గృహం

12 వేల అడుగుల పై చిలుకు ఎత్తులో ఉన్న దా, హను గ్రామాల్లో బార్లీ, గోధుమ కాక ‘ఛ’ అనే పైరు సాగుచేస్తారు. కూరగాయలు పండిస్తారు. మేకలు, గొర్రెలు పెంచుతారు. శుభాశుభాల్లో బార్లీతో తయారు చేసిన ‘చాంగ్’ అనే మద్యం సేవిస్తారు. ప్రపంచీకరణతో పాత అలవాట్లు, సంప్రదాయాలు తుడిచిపెట్టకొని పోతున్న ప్రస్తుత తరుణంలో కూడా ఏటికి ఎదురీదుతూ వీళ్లు తమన జీవన వైవిధ్యాన్ని కాపాడుకోడానికి ప్రయత్నం చేస్తున్నారు. తరతరాలుగా కాపాడుకొంటూ వస్తున్న జాతి స్వచ్ఛతను నిలబెట్టుకోడానికి, తమ సమాజంలో తప్ప వెలుపలి వారితో వివాహా బంధాలు పెట్టుకోరు. దంపతులు విడిపోవడం, పునర్వివాహాలు తప్పుకాదు. పురుషులు ఇద్దరు ముగ్గురు స్త్రీలను పెళ్లాడడం, స్త్రీ తన పెనిమిటి సోదరులను కూడా భర్తలుగా అంగీకరించడం (Polyandry) ఉంది. అయితే ఈ పద్దతులు క్రమంగా కనుమరుగవుతున్నట్లు విన్నాను. 1980 దశాబ్దిలో ఢిల్లీ విశ్వవిద్యాలయం ఆంత్రోపాలజి ప్రొఫెసర్ వీణా బాసిన్ ఈ ‘ఆర్యుల’ మీద పరిశోధనలు చేశారు. సంజీవ్ శివన్ ‘Achtung Baby’, ‘In Search of Purity’ అనే రెండు డాక్యుమెంటరీలు వీళ్ల మీద తీశారు.

‘జూలె, జూలె’ మా గైడ్ సమావేశం ముగిసినట్లు వీడ్కోలు చెప్పింది. సోనమ్ అంగట్లో బిస్కెట్లు, కొకొకోలా బాటిళ్లు కొన్నాం, మాకు పెద్దగా అవసరం లేకపోయినా. సోనమ్ ఆర్యన్ తల్లి మాకందరికి ఎండిన ఆప్రికాట్ పళ్లు బహుకరించింది. సోనమ్ నేస్తాలు కూడా జూలె జూలె చెప్పారు. వీడ్కోలు తీసుకొని బయర్దేరుతూ సోనమ్ స్నేహితురాలు – ఒక యువతి చేతిల్లో వేయి రూపాయలు పెట్టాము. చివరి క్షణంలో ఏమైనా ఇస్తే బాగుంటుందని మేము మాట్లాడుకొని చేసిన పనది.

ఆర్యన్ యువతి. ‘మిర్రర్ ఆర్యన్’ సంస్థ ఫొటో

చీకట్లు ముసురుకుంటున్న సమయంలో మా గైడ్ డోల్మా అక్కయ్య గారి పల్లె తక్‌మాచిక్‌కు బయల్దేరాము. మేము రాత్రి విడిది విశ్రాంతికి దిగిన ఇల్లు సింధూనదికి వంద మీటర్ల దూరంలో ఉంది. ఇంటి మందు నిలబడితే నది కనిపిస్తూ ఉంటుంది. తక్‌మాచిక్ ప్లలె మా విడది గృహానికి అరకిలో మీటరు దూరంలో ఉంది.

విపరీతమైన ప్రయాణ బడలికతో అందరం ఒళ్లు తెలీకుండా నిద్రపోయాము. రాత్రి పది గంటల ప్రాంతంలో భోజనం వడ్డించారు. భోజనం అంటే సూపు, రొట్టెలు, కూర, కాఫీ. నా శ్రీమతి తప్ప అందరం భోజనం చేశాము. ఆమె గాఢ నిద్రలో ఉంటే ఆతిథ్యమిచ్చిన గృహిణి 16 సంవత్సరాల కుమారుడు నా శ్రీమతిని బతిమాలి నిద్ర లేపి భోజనం తినిపించాడు. వంట గదిలో 1½ అడుగు ఎత్తు పొడవాటి బల్ల మీద పళ్లాలు పెడతారు. తివాచి మీద కూర్చుని భోజనాలు చెయ్యడమే. ఇదే పద్ధతి దాదాపు ఈశాన్య భారతంలోనూ, మలేషియా, కొరియా వరకూ.

నాకు జ్వరం తగ్గలేదు. ఏదో టాబ్లెట్లు వేసుకొని పడుకొన్నా. లదాక్‌లో మరుగుదొడ్డి ఇంటికి దూరంగా, ఎత్తుగా కట్టుకొంటారు. నాలుగైదు మెట్లెక్కి మరుగుదొడ్డిలోకి వెళ్లాలి. గడగడ వణికించే చలిలో, విపరీతమైన జ్వరంలో మూత్రశాలకు వెళ్లలేకపోయాను. నా మిత్రులు దశరథరామయ్య విసుక్కోకుండా రెండు మూడు పర్యాయాలు రెక్కగట్టుకొని నడిపించుకొని వెళ్లాడు. అటువంటి మిత్రులు అరుదుగా ఉంటారు.

తెల్లవారి (3వ తేది) ఫలహారం ముగించి ప్రయాణానికి సిద్ధమయ్యాము. తక్‌మాచిక్ పల్లెను ప్రభుత్వం పర్యావరణ అనుకూలమైన గ్రామంగా (Ecofriendly village) ప్రకటించింది. ఈ పల్లెల ప్రాంతంలో ప్రజల వంటలను లదాక్ వంటకాలకు ప్రమాణంగా (standard) పేర్కొంటారు. మేము బస చేసిన ఇల్లు గ్రామం పొలిమేరలో ఉంది. అర కిలోమీటరు దూరంలో గ్రామం, హైస్కూలు, ఆఫీసులు ఉన్నాయి. లదాక్‌లో ఇప్పుడు ప్రజలు చదువుల మీద శ్రద్ధ పెట్టారు. ఇల్లుగల వాళ్ల అబ్బాయి రాత్రి ట్యూషన్ నుంచి 9 గంటల పైన ఇంటికి వచ్చాడు. ఉదయం మేము నిద్ర లేచి చూస్తే పుస్తకాలు ముందు వేసుకొని కూర్చొని ఉన్నాడు. ఆ గృహస్థు సైన్యంలో ఎక్కడో పని చేస్తాడు. మా గైడ్ అక్కగారే కుటుంబాన్ని చూచుకొంటూ హోం స్టే నిర్వహిస్తోంది. తక్‌మాచిక్‌లో వృద్ధస్త్రీలు మమ్మల్ని కేవలం చూడడానికే మాకు ఆతిథ్యం ఇచ్చిన మహిళ ఇంటిముందు వచ్చి కూర్చొన్నారు. రెండు నిమిషాలు అందరం వారికి కన్పించి సంతోషపెట్టాము.

లామా కోసం భక్తులు

తక్‌మాచిక్ పల్లె సమీపంలో కొండ మీద బౌద్ధ సన్యాసుల మఠం ఉంది. ఈ రోజు ఉదయం లమయూరు లామా పీఠాధిపతి అక్కడికి వస్తారని, మా గైడ్ ఆ మఠానికి తీసుకొని వెళ్లింది. కొండ పైకి, మఠం వరకు రోడ్డు ఉంది. అప్పటికే కొందరు స్త్రీ పురుషులు లదాకీ సంప్రదాయ వస్త్రాలు ధరించి లామా గారి కోసం వేచి ఉన్నారు. నా శ్రీమతి, మా బృందంలో మరొక మహిళ అక్కడ స్వామివారికి స్వాగతం చెప్పడానికి నిలుచుకొన్న స్త్రీలతో కలిశారు. మా వాళ్ల మెడల్లో కూడా, లదాకీ సంప్రదాయ మాలలు, దండలు వేశారు ఆ భక్తులు.

మా వాళ్లను లామా స్వామి వారి ప్రక్కన కూర్చొబెట్టారు. అక్కడి సంప్రదాయం ప్రకారం మా వాళ్లు వేయి రూపాయలు పళ్లెంలో ఉంచి లామా స్వామికి సమర్పించారు. వారు వీరి మెడలో ‘కటక్’ శ్వేత వస్త్రాన్ని వేసి గౌరవించారు.

తక్ మా చిక్ మఠంలో లమయూరు లామా స్వామితో రచయిత శ్రీమతి

తర్వాత ఆ మఠం లోన చిన్న మ్యూజియం దర్శించాము. లామాలు, సన్యాసులు ఆరాధనలో వాడే పళ్లాలు, పూజాపాత్రలు వంటివి పురాతన కాలం నాటివి ప్రదర్శనలో చూచాము. ఇక్కడ నుంచి లమయూరు మఠాన్ని చూడడానికి బయల్దేరాము.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version