Site icon Sanchika

జ్ఞాపకాల తరంగిణి-55

[dropcap]మే[/dropcap]మింకా 13 వేల అడుగుల ఎత్తు ప్రదేశంలోనే ఉన్నాము. శ్రీనగర్ నుంచి వచ్చిన టాక్సీని పంపించి, లదాక్ టూర్ మొత్తానికి మరో టాక్సీని మా గైడ్ పిలిపించింది. శ్రీనగర్ నుంచి వచ్చే టాక్సీలు టూరిస్టులను ఏదో ఒక చోట దింపవచ్చు గానీ, లదాక్ అంతా తిప్పి చూపించేందుకు పర్మిషన్ లేదట. కొత్త టాక్సీవాలా కూడా యువకుడు, చాలా సరదా మనిషి. తక్‌మాచిక్ లమయూరు మధ్యలో చాలా ఎత్తైన నమిక లా కనుమ, ఫొటు లా కనుమ వస్తాయి. లదాకీ భాషలో ‘లా’ అంటే కనుమ. ఈ కనుమల మార్గం గుండా వెళ్తే తప్ప లమయూరుకు వెళ్ళలేము. రెండూ హిమాలయాల్లో జన్‌స్కర్ నదీ పరివాహక ప్రాంతంలోనే ఉన్నాయి. నమిక 12,139 అడుగుల ఎత్తులో, ఫొటు లా 13,478 అడుగుల ఎత్తులో ఉన్నాయి. ఫొటు లా జోజిలా పాస్ కన్నా ఎత్తైన కనుమ. నేనేతై బాగా ఆందోళన పడ్డాను. అప్పటికే కాస్త భారంగా శ్వాస పీల్చవలసి వస్తోంది. జ్వరం వదలలేదు. ఎవరికైనా ఈ కనుమ మార్గాలలో ప్రయాణం అపూర్వమైన అనుభవం. రెండు వైపులా పర్వతాలు, వాటి నడుమ రోడ్డు, దారిలో సెలయేళ్ళ మీద వంతెనలు.

లమయూరు మఠం ముదురు ఎరుపురంగు (పింక్) వస్త్రాలు ధరించే టిబెట్ బౌద్ధ లామాలకు, Drikung Kagyu బౌద్ధ మత శాఖకు సంబంధించినది. లదాక్‌లో ఈ శాఖను అనుసరించే ప్రజలే అధిక సంఖ్యాకులు. లమయూరు మఠంలో అతి పురాతనమైన భవనం, పదవ శతాబ్దం నాటిదని అంటారు. ఇది కాక సుమారు 150 అంది బౌద్ధ భిక్షువులుండటానికి విశాలమైన ప్రార్థనా మందిరాలు, సన్యాసులకు విడి విడి గదులు ఉన్నాయి. ఈ మఠంలో కుడ్యచిత్రాలను చూడడానికి దేశదేశాల పర్యాటకులు వస్తారు. లమయూరులో ప్రతి సంవత్సరం సన్యాసులు ముఖాలకు కొయ్యతో చెక్కిన ముఖాలను తగిలించుకొని మఠం ముందున్న ఆవరణలో లదాకీ వాయిద్యాలకు, సంగీతానికి అనుగుణంగా నృత్యం చేస్తారు. వైభవంగా జరిగే పండుగను యూరు కబ్‌గ్యాత్ అని అంటారట! ఈ పండుగ సందర్భంలో లదాకీ బౌద్ధమత సంప్రదాయాలను, సిద్ధాంతాలను తెలుసుకోవడానికి అవకాశం. చుట్టుపట్ల మఠాల భిక్షువులంతా ఆ సమయంలో ఇక్కడే ఉంటారు.

లమయూరులో విగ్రహం

లమయూరు మఠం సుమారు 11,250 అడుగుల ఎత్తులో ఒక గుట్ట మీద నిర్మించబడింది. కారు మఠంలోని వనాల వరకు వెళ్తుంది. మఠం ముందు నిలబడి చూస్తే ఒకవైపు సిమెంటు వర్ణంలో ఎత్తైన పర్వతాలు, మఠం ముందు లోయలో పచ్చని పొలాలు, చెట్లు కనిపిస్తాయి. మఠం వెనుక, పక్కన ఉన్న పర్వతంలో కొంతభాగం లేత పసుపురంగులో, వెన్నెల లాగా ధవళవర్ణంలో కనిపిస్తుంది. ప్రత్యేకంగా కనిపించే ఈ రంగును బట్టి ఈ ప్రదేశాన్ని ‘మూన్‌ల్యాండ్’ అని పిలుస్తారు. లమయూరు నుంచి, వెళ్ళే దారిలో మొదట్లోనే ఈ వింత రంగు ప్రకృతి దృశ్యం మూన్‍ల్యాండ్ కనిపిస్తుంది.

లమయూరు మఠంలో బాలసన్యాసులతో రచయిత

మూన్‍ల్యాండ్ దాటగానే మాగ్నటిక్ హిల్ వస్తుంది. అక్కడి భౌగోళిక పరిస్థితిని బట్టి మన వాహనం సహజంగానే ముందుకు సాగుతున్నా, ఏదో అయస్కాంత శక్తి వాహనాన్ని ఆకర్షించి పైపైకి లాగుతున్నట్లు భ్రమ కలుగుతుంది. ఈ ప్రదేశాన్నే మాగ్నటిక్ హిల్ అంటారు. వాస్తవంగా అయస్కాంత శక్తి ఏమీ లేదు. లమయూరు మఠం, మూన్‌ల్యాండ్, మాగ్నటిక్ హిల్ చూచి, మధ్యాహ్నం 2 గంటలకు, Khaltse అనే చిన్న పల్లెలో రోడ్డు పక్క హోటల్లో చపాతీలు తిని బయలుదేరాము. ఇక్కడే నెల్లూరు నుంచి ఒక కుటుంబం సొంతంగా కారు నడుపుకుంటూ లదాక్ చూచి వెళ్తూ కన్పించింది. ఆ బృందంలో ఆడవాళ్ళు, చిన్నపిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళ సాహసాన్ని అభినందించకుండా ఉండలేకపోయాను. అక్కడ్నించి మా గైడ్ డోల్మా వాళ్ళు ఊరు Skindiang కు బయలుదేరాము. ఈ ఊరికే మరో పేరు Shimolianga. Khaltse లోనే రాత్రి భోజనానికి అవసరమైన పదార్థాలు, అటుకులు కొన్నాము. అటుకులు ఆంధ్రా నుంచి తెప్పించినట్లు తెలిసింది. మా డోల్మా ఇల్లు చిన్న గుట్టపైన, ఆమె ఇంటి పక్కన రెండో మూడో ఇళ్లున్నాయి.

గైడ్ డోల్మా ఇల్లు గుట్టపైన

గుట్ట మీదకి వెళ్ళే దారి లేదు. డోల్మో బండల మీద దబదబ అడుగులు వేసుకుంటూ పైకి వెళ్తోంది. నేను ఆయాసంతో అడుగు వెయ్యలేకపోయాను. డోల్మా 22 సంవత్సరాల చెల్లి నా చేతిని పట్టుకొని పైకి ఈడ్చుకుని వెళ్ళింది, నా ప్రయత్నం లేకుండా. నా శ్రీమతి క్రింద ఆగిపోయింది. కారు డ్రైవరు ఆమెను బొమ్మను పట్టుకొన్నట్లు రెండు చేతులతో ఎత్తి పట్టుకొని ఇంటి ముంగట దించాడు. ఈ పర్వతీయులకు అసాధరణమైన శరీర దారుఢ్యం, శక్తి ఉంటుంది. వారి జీవితమే ప్రకృతి శక్తులతో పోరాటం.

డోల్మా ఇల్లు ఒక హాలు, వెనుక వంటగది. ఆ రోజు నా శ్రీమతి, మాతో వచ్చిన శ్రీమతి లక్ష్మి వంట చేశారు. అటుకులతో పులుసన్నం, సూపు వగైరా. ఆ గుట్ట మీద నుంచి చూస్తే, క్రింద పరుచుకొని ఉన్న ఊరు, దూరంగా మైదానం లాగా ఉన్న ప్రదేశంలో పచ్చగా పైర్లు, ఇంకా దూరంగా మంచుకొండలు – స్విట్జర్లాండులోనో, మరో దేశంలోనో ఉన్నట్లు అనిపించింది. జూన్ మొదటి వారం, అయినా చలి దంచేస్తోంది. ఒక వైపు ఎండ, మరొక వైపు చలి. విచిత్రమైన వాతావరణం. శ్రీనగర్‍లో బయలుదేరినప్పుడు తొడిగిన వార్మర్‍లు, మేజోళ్ళు, స్వెటర్లు తొడిగినవి తొడిగినట్లే ఉన్నాయి. శ్రీనగర్ లోనే మాస్కులు కొని ధరించాము. చలి గాలి ముక్కుకి సోకితే ప్రమాదమట! రోజంతా మాస్కులు ధరించే తిరిగాము. ఈ యాత్రతో పోలిస్తే, అమెరికా ప్రయాణం చాలా సులభమనిపించింది. మేము ఏ టూరిస్టు కంపెనీకో డబ్బు చెల్లించి, కాస్త సుఖంగా యాత్రకు వెళ్ళి ఉండవచ్చు. లదాకీ ప్రజల జీవితం, ఇళ్లు, తిండ్లు అన్నీ తెలుసుకోవాలనే తపనతో ఇట్లా సొంతంగా ప్రయాణం.

ఆల్చి గుంఫ (మఠం)

మరు రోజు (4వ రోజు) మధ్యాహ్నం ఆల్చి మఠం చూద్దామని బయలుదేరాం. పర్యాటకుల తాకిడి అంతగా ఉండనిదైనా, గొప్ప చరిత్ర, కళాఖండాలు కలిగిన మఠం ఇది. ఆల్చి నాలుగు కుగ్రామాల సముదాయం. అందులో అత్యంత ప్రాచీనమైన గ్రామంలో ఈ మఠం నెలకొల్పబడింది. సుమారు వేయి సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ మఠానికి దగ్గరలోనే సింధూ నది ప్రవహిస్తోంది.

ఆల్చి

ఆల్చి మఠం నాలుగు కట్టడాల సముదాయంగా చెప్పుకోవచ్చు. వీటిలో ప్రార్థన మందిరం లేక సమావేశా మందిరం (దుఖాంగ్) లోకి ప్రవేశించే దారిలో టిబెట్ రీతిలో కుడ్యాల మీద అద్భుతమైన వర్ణచిత్రాలు కనిపిస్తాయి. లోపల పెద్ద బుద్ధ విగ్రహం, తారాదేవి విగ్రహం, దారు, మృణ్మయ శిల్పాలు ద్వారాల మీద, దూలాల మీద అద్భుతమైన నగిషీలు, చెక్కడం పనులు, బొమ్మలు ప్రత్యేకంగా పేర్కొనదగినవి. ఈ నగిషీ పనిలో కాశ్మీరీ శైలి స్ఫుటంగా కన్పిస్తున్నట్లు విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.

ఆల్చి
ఆల్చి మఠంలో కుడ్యచిత్రాలు గూగుల్ నుంచి సేకరించింది

ఆల్చి మఠం ఆవరణలో Sumstek పేరుతో మూడంతస్తుల నిర్మాణం ఉంది. ఏ ఉద్దేశంతో కట్టారో తెలియదు. టిబెట్ శిల్పకళ, కొయ్యల మీద చెక్కిన చెక్కడం పనులతో కనిపిస్తుంది. లోపల కుడ్యాల మీద వర్ణ చిత్రాలు చిత్రించబడ్డాయి. మరొక ముఖ్యమైన నిర్మాణం మంజునాథ ఆలయం. దాదాపు పదడుగుల కంటే పెద్ద మంజునాథ విగ్రహం, కూర్చుని ఉన్న తారాదేవి విగ్రహం ప్రధాన ఆకర్షణ. ఈ మఠం ఆవరణలో చిన్న చిన్న చైత్యాలు (ఛోర్టన్లు) చాలా ఉన్నాయి. ఈ చైత్యాల లోపలి కుడ్యాల మీద, గోడల మీద బుద్ధుని జాతక కథలు చిత్రించబడ్డాయి. కళా ప్రియులు తప్పక చూడవలసినది ఆల్చి మఠం.

sumstek alchi
తక్‌మాచిక్ పర్యావరణ నమూనా గ్రామం

ఆల్చి మఠం నుంచి లే సిటీకి సుమారు 65 కిలోమీటర్ల దూరం ఉంటుంది. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో చెక్ పోస్టులు, మిలిటరీ స్థావరం, విమానాశ్రయం మొదలైనవన్నీ దాటుకొని నగరం వెలుపల నిర్జన ప్రదేశంలో ‘సంబా’ అనే వ్యక్తి ఇంటికి చేరాము. మా లదాక్ పర్యటన ఏర్పాటు చేసిన నార్గే అక్కడికి వచ్చి పలకరించి, నన్ను వెంటబెట్టుకుని లే ప్రభుత్వ వైద్యశాలకు తీసుకొనిపోయారు. ఒక లేడీ డాక్టరు, ఒక మగ డాక్టరు అత్యవసర కేసులు చూస్తున్నారు. అప్పటికే చిన్నా పెద్దా పాతిక మంది వరకు క్యూలో ఉన్నా, టూరిస్టని వెంటనే చూశారు. మీటరు పెట్టి చూస్తే ప్రాణవాయువు 95% ఉంది. యాంటీబయొటిక్స్, డైమాక్సు బిళ్ళలు రాసిచ్చారు. నార్గే దారిలో 2000/- రూపాయలు అడ్వాన్సు చెల్లించి యాత్రలో నాకు ఏదైనా ఇబ్బందవుతుందని ఆక్సీజన్ సిలిండర్ తీసుకుని టాక్సీలో పెట్టించి సెలవు తీసుకున్నారు. తెల్లవారి మా బృందం నాలుగు రోజులు – 16 వేల అడుగుల ఎత్తున ఉన్న చాంగ్‌తాంగ్ సరస్సు దర్శనానికి బయలుదేరుతుంది. నేను లోలోపల గుంజాటన పడుతున్నాను, మా వాళ్ళతో వెళ్ళాలా, ఆగిపోవాలా అని. మా టాక్సీ డ్రైవరు నేనేమీ అడగకుండానే, “సార్, మీరు లే లో ఉండిపొండి. నాలుగు రోజులే కదా, అక్కడ ఏదైనా ఇబ్బందైతే కష్టం” అన్నాడు. చాంగ్‌తాంగ్ తరస్సు సమీపంలో పర్యాటకుల కోసం అత్యవసర వైద్యశాల ఉందని తెలుసు. డ్రైవరు సలహాతో నేను లే టౌన్‍లోనే ఉండిపోవాలని నిశ్చయించుకున్నాను.

రాత్రి పెందరాడే భోజనం చేసి పడుకున్నాము. నాకు జ్వరంగానే ఉంది. తెల్లవారి 8 కల్లా పలహారాలు కానిచ్చి సామాన్లు కారు పైకి ఎక్కిస్తున్నారు. నేను రావడం లేదని, ఇక్కడే హోం స్టే లో ఉంటానని నా శ్రీమతితో అన్నాను. తను కూడా వెళ్ళకుండా నాతో ఉండిపోతానని అన్నది. ఆమెకు ఎంతో ధైర్యం చెప్పి, నచ్చజెప్పి వాళ్ళతో పంపించేశాను. ఇక్కడి నుంచి సోనమ్ అనే యువతి మా బృందం వెంట గైడ్‌గా వెళ్ళింది. ఆమెది చాంగ్‌తాంగ్ సరస్సు వద్ద షచుకుల్ అనే పల్లె.

నేనున్న ఇల్లు హోం స్టే విశాలంగా, అక్కడికి దూరంగా ఉంది. దూరంగా కొండలు తప్ప ఇళ్ళు కూడా లేవు. నాలుగు రోజులు హాయిగా ఇక్కడ ఎల్లాగో గడిపేయొచ్చని అనుకుంటున్న సమయంలో మాకు ఆతిథ్యం ఇచ్చిన యువతి తాము బంధువుల ఇంటిలో ఫంక్షన్‌కు వెళ్తున్నామని చెప్పి, నన్ను లే నగరంలో ఇరుకు సందులో తన స్నేహితురాలికి అప్పగించింది.

చిన్న ఇల్లు. నాలుగైదేళ్ళ బిడ్డ. భర్త ఎక్కడో ఉద్యోగం. నాకిచ్చిన గదిలో మంచం, పరుపు, రజాయిలు సౌకర్యం బాగానే ఉంది. అయితే రెండు రోజులు నేనేమి తిన్నానో, ఏం చేశానో కూడా తెలియదు. హైదరాబాదు నుంచి మా అబ్బాయి వంశీధర్ నార్గేతో మాట్లాడేవాడట నా ఆరోగ్యం గురించి. మూడో రోజు ఉదయం ముఖం కడుక్కుంటుంటే ముక్కులోంచి ధారగా రక్తం స్రవించడం మొదలుపెట్టింది. ఆతిథ్యం ఇచ్చిన యువతి టవల్ అందిస్తే, దాంతో ముక్కు గట్టిగా పట్టుకుని చాలా సేపు నిలబడ్డాను. రక్తస్రావం ఆగింది గాని, చాలా భయం వేసి, నెల్లూరులో డాక్టరు మిత్రులకు ఫోన్ చేస్తే, స్థానిక వైద్యులు రాసిచ్చిన మందులే కొనసాగించమన్నారు.

ఈ యువతి ఇంట్లో రెండు రోజులు రచయిత ఒక్కరే హోం స్టే

మా అబ్బాయి ఒత్తిడి వల్ల మళ్ళీ నన్ను లే కు 19 కిలోమీటర్ల దూరంలో ఉన్న సెక్‌మోల్ విద్యాసంస్థకు మార్చారు. వేసవి సెలవులు. పదవ తరగతి ఫెయిల్ అయిన డజను మంది విద్యార్థులు మాత్రమే ట్యూషన్‍ల కోసం హాస్టల్లో ఉన్నారు. సెక్‌మోల్ సంస్థ డైరక్టర్ నార్గే గారు పిల్లలను నా వద్దకు పంపి సహాయంగా ఉండమన్నట్లుంది. ఆ యువతీయువకులు నా చుట్టూ కూర్చుని మాట్లాడేవారు. వారి సమస్యంతా ఇంగ్లీషులో ధారాళంగా మాట్లాడడం నేర్చుకోవాలని. చారిత్రక కారణాల వల్ల లదాకీ పిల్లలౌ ఇంగ్లీషు, గణితంలో చాలా వెనుకబడ్డారు. తప్పులు పోతాయని భయపడి మాట్లాడకుండా ఉండడం కన్నా తప్పులో, ఒప్పులో మీ భావాలను వచ్చినంత ఇంగ్లీషులోనే వ్యక్తం చేయమని చెప్పడంతో ఆ పిల్లలకు ఏనుగంత బలం ఇచ్చినట్లయింది. హాస్టల్ గదికి టైం ప్రకారం భోజనం, పలహారం, టీ వచ్చేవి. జ్వరం వల్ల గది వెలుపలికి రావడం అంటే బహిర్భూమికి వెళ్ళడానికి మాత్రమే.

ఆ రోజు రాత్రి – నడి రాత్రి వేళ – మూత్ర విసర్జనకు దూరంగా వెళ్ళాను. తర్వాత చూస్తే హాస్టలు గది ఎటువైపో గుర్తు రాలేదు. ఘోరమైన చలి. చాలా భయపడిపోయాను. స్కూలు ఆవరణలో ఎక్కడో ఒకటో రెండో దీపాలు మినుకు మినుకు మంటున్నాయి. యాదృచ్ఛికంగా తల ఎత్తి పైకి చూశాను. ఆశ్చర్యం. స్వచ్ఛమైన ఆకాశం, తారలు మామూలు కంటే పెద్దవిగా మెరిసిపోతూ కనిపించాయి. అంత స్వచ్ఛమైన ఆకాశంలో నక్షత్రాలు మిలమిల మెరిసిపోతూ… లదాక్‌లో రాత్రివేళ ఆకాశం అంత అద్భుతంగా ఉంటుందని. కాసేపటికి నక్షత్ర కాంతిలో దారంతా స్పష్టంగా కన్పించింది. నా గదికి సమీపంలొ పెట్టిన ప్లాస్టిక్ డ్రమ్ము కన్పించి, నా రూమ్‍కు సులభంగా చేరుకోగలిగాను. ఆ రాత్రి భయం, ఆనందం అనుభవాన్ని మరిచిపోలేను.

మందులు పని చేశాయో, లేక తనంతట జ్వరతీవ్రత ఉపశమించిందో తెల్లవారి కాస్త తెరిపిగా ఉన్నాను. యువ విద్యార్థులు నా చుట్టూ కూర్చుని కబుర్లు చెబుతున్నారు. వాళ్ళెవరూ లదాక్ దాటి బైటకు వెళ్ళినవాళ్ళు కాదు. నేను మాట్లాడుతుంటే శ్రద్ధగా వింటున్నారు. ఆ స్కూల్లో స్వచ్ఛందంగా బోధించడానికి వచ్చిన అమెరికన్ యువతి ఆ స్కూలు అధ్యాపకుణ్ణి పెళ్ళి చేసుకుని ఉండిపోయింది. మలేషియా నుంచో మరో దేశం నుంచో వచ్చిన యువతి కూడా అక్కడే స్థిరపడిపోయింది.

secmol బడి పిల్లలతో రచయిత శ్రీమతి

స్కూలు వంటశాలలో సౌర విద్యుత్తుతో వంటలు చేస్తారు. 12 తర్వాత అందరూ వంటసాలలో భోజనాలు చేస్తారు. ఆ రోజు నేను కూడా వంటశాలకు వెళ్ళి అందరితో కూర్చొని భోజనం చేశాను. స్కూలంతా తిరిగి చూశాం. ఫొటోలు తీసుకొన్నా. చాంగ్‌తాంగ్ సరస్సు చూడడానికి వెళ్ళినవారు తిరిగి వచ్చి స్కూల్లోనే దిగారు నా కోసం. మధ్యాహ్నం స్కూల్లో ఉన్న విద్యార్థులు లదాకీ సంగీతం వినిపించి, నృత్యాలు చేశారు. కొందరు విద్యార్థులు లదాకీ వాయిద్యాలు వాయించి చూపించారు. ఆ యువజనులతో ఆ రోజంతా చాలా సంతోషంగా గడిపాము.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version