జ్ఞాపకాల తరంగిణి-57

0
2

[dropcap]మా[/dropcap] బృందం సభ్యులు హుండర్, పేంగోంగ్ త్సో –  సరస్సు తదితర ప్రదేశాలు దర్శించి వచ్చిన తర్వాత, అందరం కలిసి లే నగరంలో దర్శనీయ ప్రదేశాలన్నీ చూచాము. హిందీ సినిమా నటులు అమీర్ ఖాన్ ‘త్రీ ఇడియట్స్’ సినిమాలో కొంత భాగం లే నగరంలోని డ్రెక్ పద్మా స్కూల్లో ఘాటింగ్ చేసిన తర్వాత ఆ విద్యా సంస్థ కూడా పర్యాటకుల దర్శనీయ ప్రదేశాల జాబితాలో చేరిపోయింది. ఈ స్కూలు లే నగరంలో షే అనే ప్రాంతంలో అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థల సహకారంతో దాదాపు పదేళ్లకు 2014లో పూర్తయ్యింది. టిబెట్ భాషా సంస్కృతులను రక్షించుకొంటూ ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకు ఇక్కడ లదాక్ భాషలో బోధిస్తారు.

డ్రెక్ పద్మా స్కూల్

పై తరగతుల విద్యార్థులకు ఇంగ్లీషు బోధనా మాధ్యమం. టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా, ఇతర బౌద్ధ మఠాధిపతుల అండదండలతో ఈ విద్యాలయం కొనసాగుతోంది. క్లాసులు జరుగుతున్నా, పర్యాటకుల వల్ల ఎటువంటి అసౌకర్యం కలగని విధంగా ఏర్పాట్లు చేశారు. ‘త్రీ ఇడియట్స్’ సినిమా ఘాటింగుకు గుర్తుగా స్కూల్లో ఒక చోట ‘త్రీ ఇడియట్స్’ వాల్ ఏర్పాటు చేశారు. స్కూలు అంతా చూచి, అక్కడి  Rancho’s cafe కాఫీ సేవించి, ‘త్రీ ఇడియట్స్’ వాల్ వద్ద ఫోటోలు తీసుకొన్నాము.

డ్రెక్ పద్మా స్కూల్లో 4 ఏళ్ల నుంచి 16 సంవత్సరాల వరకు వయస్సున్న లదాకీ పిల్లలు విద్యాభ్యాసం చేస్తున్నారు. లదాకీ బాలల సమగ్ర వ్యక్తిత్వ వికాసం, పర్యవరణ సమస్యల పట్ల ప్రత్యేక శ్రద్ధ మొదలైన లక్ష్యాలతో స్కూలు నిర్వహించబడుతోంది. అమీర్ ఖాన్, ఇతర ప్రముఖులు విద్యాలయం అభివృద్ధికి దోహదం చేస్తున్నారు. లదాక్‌లో సెక్‌మోల్ స్కూల్ తర్వాత మేము సందర్శించిన గొప్ప సరస్వతి మందిరం ఇది.

లే నగరంలో మా హోటల్‌కు కిలోమీటరు దూరంలోనే, ‘లే పేలెస్’ ఒక గుట్ట  మీద కనిపిస్తుంది. లే పాతనగరం సన్నని వీధుల గుండా కాలనడకనే లే పేలెస్ చూడడానికి వెళ్లాము. ఆ గుట్టమీదికి మెట్లున్నాయి. 1700 ప్రాంతంలో లదాక్ రాజు నమ్‌గ్యాల్ నిర్మించాడట. జమ్ము రాజు డోగ్రా లే ను స్వాధీనం చేసుకొన్నపుడు నమ్‌గ్యాల్ ఈ భవనాన్ని వదిలి స్టోక్ రాజభవనానికి మారాడట. లే పేలెస్ 9 అంతస్తుల భవనం. పై అంతస్తుల్లో రాజకుంటుంబాలు, కింది అంతస్తుల్లో అశ్వశాలలుగా ఇతర కార్యాలకు ఉపయోగించేవారట. ఇప్పుడు లే పేలెస్‌లో మ్యూజియం నిర్వహిస్తున్నారు. రాజుల వస్త్రాలు, నగలు, పట్టాభిషేకం వంటి విశేష సందర్భాల్లో ధరించే హారాలు, బట్టలు, కిరీటాలు వంటి ఆసక్తికరమైన వస్తువులన్నీ ఇక్కడ భద్రపరిచారు. రాజభవనం కుడ్యాల మీద చిత్రించిన వర్ణచిత్రాలు 400 సంవత్సరాల నాటివట. లదాకీల జీవనంలో కుడ్య చిత్రాలు ఒక భాగం. ఏ బౌద్ధమఠానికి వెళ్లినా కుడ్య చిత్రాలు, బుద్ధుని గాథల చిత్రాలు కనిపిస్తాయి.

లే పట్టణంలో కోట

పేలెస్ కింది భాగంలో చిన్న స్థూపం ఉంది. పేలెస్‌కు వెళ్లే మెట్లు దారి మీద నిలబడితే లే నగరం అంతా కనిపిస్తూ ఉంటుంది. లే పేలెస్ నుంచి కాలినడకనే వెళ్లి నమ్‌గ్యాల్ త్సిమో గొంపాను చూడవచ్చు. ఈ మఠం లే నగరంలో అన్నిటికన్నా ఎత్తైన కొండ శిఖరం మీద నిర్మించారు. దూరానికి కోటలాగా కనిపించేలా ఈ మఠాన్ని నిర్మించారు.

లే నగరం నుంచి హెమిస్ మఠానికి 45 కి.లా దూరం ఉంటుంది. హెమిస్ మఠానికి వేయి సంవత్సరాల కంటే ఎక్కువగానే చరిత్ర ఉంది. హెమిస్ మఠం కుడ్య చిత్రాలకు, హెమిస్ ఉత్సవానికి ప్రసిద్ధి. చిన్న గుట్టపైన విసిరేసినట్లు ఉంటుంది ఈ మఠం. ఈ మఠం సన్యాసులు వజ్రయాన బౌద్ధానికి చెందిన తాంత్రిక సంప్రదాయాలను అనుసరిస్తారు. మఠం ప్రధాన ఆరాధనాలయంలో నీలవర్ణం దుస్తులు ధరించి, పద్మాసనంలో ఉన్న పద్మసంభవుని దర్శించుకొన్నాము. ఏ రణగొణ ధ్వనులు లేకండా ఆ వాతావరణం పరమ ప్రశాంతంగా ఉంది.

హెమిస్ మఠం

ఈ పురాతన మఠాన్ని క్రీ.శ. 1672లో లదాకీ పాలకుడు Sengge Namgyal పునః స్థాపన చేసినట్లు చేప్తారు. మఠం మందు భాగంలో చాలా ఛోర్టన్లు – చైత్యాలున్నాయి. కొండ పైనుంచి కిందికి చూస్తే కొద్ది ఇళ్లు – హెమిస్ కుగ్రామం కనిపిస్తుంది.

థిక్సే మఠం

హెమిస్‌లో మఠంలో 12 సంవత్సరాలకొక పర్యాయం పెద్ద ఎత్తున హెమిస్ ఉత్సవం నిర్వహిస్తారు. వైభవంగా జరిపే ఈ ఉత్సవం పద్మసంభవునికి అంకితం. మఠం ముందున్న దీర్గచతురస్రాకార ప్రదేశంలో ముఖాలకు కొయ్య మాస్కులు పెట్టుకొని సన్యాసులు లదాకీ సంప్రదాయ వాయిద్యాలు, సంగీతానికి అనుగుణంగా అడుగులు వేస్తూ నృత్యం చేస్తారు. దేశదేశాల నుంచి ఈ ఉత్సవాన్ని చూడడానికి ప్రత్యేకంగా హెమిస్‌కు తరలి వస్తారు. లదాకీలకు కూడా ఈ ఉత్సవం గొప్ప ఆకర్షణ. ఇది కాక ఏటా రెండు రోజులు ఇక్కడ ఒక ఉత్సవం, ఆ సందర్భంగా కూడా సన్యాసులు మాస్కులు ధరించి నృత్యం చేస్తారని విన్నాము. ఈ మఠంలో సుమారు 150 మంది సన్యాసులుంటారని విన్నాము. అందరికి నివాసానికి గదులు, అతిథి గృహం  ఏర్పాట్లు ఉన్నాయి. హెమిస్ మీద దర్శనానికి సొంత ఏర్పాట్లు చేసుకొని రావాలే తప్ప, మఠ దర్శనానికి మరో మార్గం లేదు. వందల సంవత్సరాలుగా బౌద్ధ సన్యాసులు నిర్జన, ఏకాంత ప్రదేశంలో ఎంత ప్రతేకంగా తపస్సు చేసుకొంటూ గడిపారో? అని ఆశ్చర్యం వేస్తుంది. మాకు హెమిస్ గుంఫ దర్శనానికి సగం రోజు పట్టింది. మధ్యాహ్న భోజనం మఠంలోనే చేశాము.

Tsemo Monastery

లే నగరంలో ప్రధాన ఆకర్షణ శాంతి స్థూపం. నగరానికి 5 కి.మీ దూరంలో కొండ పైన, సముద్ర మట్టానికి సుమారు పన్నెండు వేల అడుగుల ఎత్తులో దీన్ని నిర్మించారు. 1991లో బుద్ధ భగవానుని 2500 జన్మదినం సందర్భంగా జపాన్ ప్రభుత్వ ఆర్ధిక సహకారం అందించగా, లదాకీ బౌద్ధుల కాయకష్టం, భారతప్రభుత్వం అండదండలతో రెండంతస్తులుగా ఈ స్థూపం నిర్మించబడింది. బుద్ధుని ధాతువు నిక్షిప్తమైన శాంతి స్థూపం అత్యంత పవిత్రమైనదిగా భక్తులు భావిస్తారు. పూర్వప్రధాని ఇందిరాగాంధీ కార్లు, వాహానాలు కొండపైకి, స్థూపం వద్దకు వెళ్లడానికి అవసరమైన రోడ్డు సాంక్షన్ చేయించారు.

శాంతి స్థూపం నుంచి నగరం

శాంతి స్థూప నిర్మాణం 1983లో ఆరంభమై 1991లో పూర్తయి, దలైలామా చేత ఆవిష్కరించబడింది. స్థూపం వద్ద నిలబడి చూస్తే, లే నగరం, నగరం పొలిమేరల్లో ఏపుగా పొడవుగా ఏదిగిన పచ్చగా పాప్లాల్ వృక్షాలు, బంగారు రంగు శిలామయమైన గుట్టపైన తెల్లగా శాంతి స్థూపం, దూరంగా మంచు కప్పుకొన్న పర్వతాలు – దృశ్యం అద్భుతంగా ఉంటుంది. రాత్రి వేళ శాంతి స్థూపాన్ని రంగురుంగుల విద్యుత్ దీపాలతో అలంకరిస్తారు. నగరంలో ఎక్కడ ఉన్నా దీపాల వెలుగులో స్థూపం కనిపిస్తూంటుంది. ఈ స్థూప కుడ్యం మీద దలైలామా చిత్రాన్ని అలంకరించారు.

రచయిత ఒంటరిగా ఒక యువతి హోమ్ స్టే లో ఉన్న వీధిలో బాలలు

లదాక్‌లో వార్ మెమోరియల్ మేము చూడలేక పోయాయి, అది కూడా దర్శనీయ ప్రదేశమే. లే నగరంలోని ప్రవేశిస్తున్న దారిలో ఇండియా పాక్ యుద్ధాల్లో అరమ వీరులైన సైనికులకు సంబంధించిన స్మారక మందిరం ఇది.

మా లే పర్యాటనలో పశ్మీనా శాలవల కుటీర పరిశ్రమను దర్శించడం ఒక అంశం, లదాక్‌లో అత్యంత శీతల ప్రదేశాల్లో పశ్మీనా జాతి మేకలను పెంచుతారు. అర్ధ సంచార జాతులవారు పర్వత పాదాల వద్ద గుడారాలు వేసుకొని మేకల, గొర్రెల మందలను పోషిస్తారు. పేంగోంగ్ త్సో సరస్సు వద్ద నా శ్రీమతి పశ్మీనా మేకలను పెట్టుకొని జీవననం గడిపే అర్ధ సంచార జాతుల వారి ఇంట్లో నాలుగు రాత్రులు ఉన్నది. పశ్మీనా మేకల దేహం మీది  ఊలు అత్యత మృదువుగా ఉంటుంది. వాటి దేహాల మీద నుంచి, కాశ్మీర్‍లో, లదాక్‍లో మగ్గాలపై తయారైన పశ్మీనా శాలువలు ప్రపంచ సుందరీమణుల వక్షస్థలాలకు వింత సౌందర్యాన్నిస్తూ ప్రకాశిస్తాయి. ఆరేడుగురు స్త్రీలు శాలువల కుటీర పరిశ్రమలో పని చేస్తున్నారు. దారం తీయడం నుంచి, నేత, ఎంబ్రయిడరీ వరకు అక్కడే పని పూర్తి చేస్తున్నారు.

పశ్మీనా షాల్స్ నేత

లే నగరంలో లదాకీల ఆహారం రుచులు కుడా చూశాము. హోమ్ స్టే లలో తరచూ మోమోలు ఫలహారం పెట్టేవాళ్లు. లదాకీల అతి సాధారణ ఆహరం మోమోలు. మన ఇడ్లీల వంటి మోమోలు తేలికగా జీర్ణం అయ్యే పదార్ధం. మోమో లోపల ఉర్లగడ్డ కూర పెట్టి ఆవిరి మీద ఉడకపెడతారు. మాంసం కూర కూరిన మోమోలు స్థానికులు తింటారు. మేము సిక్కింలో కూడా వీధుల్లో మోమోలు అమ్మే స్త్రీల వద్ద మోమోలు తిన్నాము. ‘తుక్పా’ వంటకాన్ని లదాకీలు నిత్యం ఆహారంగా భుజిస్తారు. నూడుల్సుతో, రకరకాల కూర ముక్కలు, మాంసంతో తుక్పా తయారు చేస్తారు. అక్కడి అతిశీతల వాతావరణానికి మాసాలా దినుసులతో వండిన వేడి వేడి తుక్పా ఆరగించడానికి చాలా బాగుంటుంది. మా ఇంట్లో రెండు వారాలు ఇద్దరు లదాకీ యువకులు అతిథులుగా ఉన్నారు. వాళ్లకు టీ చాలా  ఇష్టం. టీ పెట్టమన్నా, తుక్పా చెయ్యమన్నా ముఖాలు చేటంత చేసుకొని తయరు చేసేవారు. లదాక్‌లో గృహిణులే నూడుల్సు తయారు చేసుకొంటారు. ఇప్పుడు రెడీమేడ్ సూప్ ప్యాకెట్లు లడాక్‍లో కుగ్రామంలో కూడా లభిస్తున్నాయి. ఎక్కడికి వెళ్లినా క్షణాల్లో ఆ పొట్లంతో తయారు చేసిన సూపు వడ్డించేవారు. మాకు మాత్రం వాళ్లు ఇంట్లో చేసిన సూపులే రుచి చూడాలనిపించేది.

లదాక్ యువతి

లదాకీలు వెన్నతో టీ తయారు చేసుకుంటారు. వెన్న, పాలు, టీ పొడి కలిపి ఉడకబెట్టి, తయారైన ద్రావంలో కొంచెం ఉప్పు కూడా కలుపుతారట. వాళ్లు పండగ పబ్బాలతో ఈ రకం టీ ఇస్తారు.

జ్ఙాపికలు అమ్మే అంగడి

ఇక్కడే లదాకీలను గురించి నాలుగు మాటలు చెప్పాలి. పరిచితులైనా, అపరిచితులైనా ఎదురు పడితే ‘జూలే జూలే’ అంటూ పలకరిస్తారు, మనం ‘బాగున్నారా కులాసానేగదా!’ అన్నట్లు. లదాకీలు సరళ స్వభావులు. ఎవరైనా వస్తువు పోగొట్టుకుంటే సొంతదారుకు చేరుస్తారు గానీ ఉంచుకోరు. లదాకీ యువతీ యువకుల్లో చాలా మంది వివాహాలు చేసుకోరు. వివాహం కాకపోయినా, సమాజంలో అదొక stigma లోపం కాదు. ఈమధ్య వరకు ప్రతి కుటంబంలో ఆఖరువాణ్ణి ఏదో ఒక మఠంలో చేర్చి సన్యాసదీక్ష ఇప్పిచేవాళ్లు. రంగుల దుస్తుల్లో బాల సన్యాసులాగ ఉండడానికి పిల్లలు కూడా ఇష్టపడతారు. ఈ మధ్య  మఠాలలో సన్యాసులు సంఖ్య తగ్గిపోతోందని భయం పట్టుకుంది మఠాధిపతులకు.

సన్యాసినులు మఠంలో ముద్రలు చేస్తూ

హిందూ ధర్మంలో మాదిరి సన్యాసం శాశ్వత వ్రత దీక్ష కాదు బౌద్ధంలో. ఎవరైనా దీక్ష వదిలి వివాహం చేసుకోవాలనుకొన్నా, మఠాలు, సమాజం అడ్డు చెప్పవు. స్త్రీ సన్యాసులైనా ఇంతే. ఏదో పొరపాటు వల్ల సన్యాసిని గర్భవతైనా, ఆమెను, ఆమె సంతానాన్ని సమాజం అంగీకరిస్తుంది. రాజ్యంగం ప్రకారం బహు భర్తలతో కాపురం చెయ్యడం తప్పైనా, లదాకీ సమాజంలో ఇంకా అటువంటి కుటుంబాలు కనిపిస్తాయి.

మంత్రాలు చెక్కిన పవిత్ర శిలలు. పవిత్ర శిలలను మణిశిలలంటారు

ప్రపంచం ఒక కుగ్రామంగా మారడంతో అనేక అవలక్షణాలు లదాక్ లోకి దిగుమతై, తరతరాలుగా లదాకీలు పాడుకొనే జానపదగీతాలు మరుగున పడిపోయి, హిందీ సినిమా పాటలే అందరూ పాడుకొంటున్నారు, హిందీ సినిమాలకే అలవాటు పడ్డారు. లదాకీ సమాజంలో స్త్రీలకు చాలా స్వేచ్ఛ. ఒంటరిగా ప్రయాణిస్తారు. మైళ్లు మైళ్లు నడిచిపోతారు. బీళ్లలో నెలల తరుబడి యువతులే పశువులను మేపుకొంటూ గుడారాలు వేసుకొని ఒంటరిగా ఉంటారు. అటువంటి పరిస్థితి మన ఊహకు అందదు.

లేహ్ నగరంలో అడవిపూలు

పాతికేళ్ల క్రితం వరకు లదాక్‌లో వ్యవసాయం పనులుగాని, ఇళ్లు కట్టుకోడం, వంటి పనులుగాని పల్లెల్లో ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా సహయం చేసేవాళ్లు కూలి తీసుకోకుండా. క్రమంగా ఆ విధానం నశించిపోయి కూలీలను పిలిపించుకోడం మొదలైంది. లదాక్ వాతావరణానికి సరిపోని కొత్త పంటలు, పళ్ల తోటలు పెంచడానికి బీహార్ నుంచి కూలీలను తెచ్చుకొంటున్నారు.

గైడ్ డోల్మా, రచయిత బృందాన్ని అనుసరించిన ఇద్దరు కాలేజీ యువతులు

పర్యటన వ్యాపారం పెరుగడంతో యువ జనాలు హోటళ్లు, లాడ్జీలు, యాత్రలు ఏర్పాటు చేయడం వంటి కొత్త కొత్త ఉపాధి మార్గాలు వెతుక్కుంటున్నారు.

మా గైడ్ చెల్లెలు శిరీంగ్ ట్రెక్కింగ్ వెళ్లే వారి వెంట బరువులు మోయడం, వారికి వంట చేసి పెట్టడం వంటి పనులు చేస్తూ వచ్చింది. కొంత కాలం హిమాచల్ ప్రదేశ్‌లో సూపర్ బజార్‌లో పని చేయంటం వల్ల హిందీ ధారాణంగా మాట్లాడుతుంది. తనకు సంగీతం బాగా నేర్చుకొని లదాక్ విడిచి ఎక్కడైనా స్థిరపడాలని కోరిక. తల్లిదండ్రుల పట్టుదల వల్ల చాలా అయిష్టంగా చాంగ్‌తాంగ్ సరస్సు ప్రాంతంలో పశువుల మంద యజమానిని పెళ్లి చేసుకోవలసి వచ్చింది. ఏం మాయ చేసిందో గాని రెండేళ్లల్లో లే నగరానికి వచ్చి పర్యటకులకు లదాకీ రుచుల భోజనశాల నిర్వహిస్తూ స్థిరపడ్డారు. నగరీకరణ, నగరాలకు వలసలు ఒక సాధారణ ధర్మం.

హెలీనా నోర్‌బెర్గ్ హెడ్జ్ స్వీడిష్ స్త్రీ. లదాకీల జీవనం పై ‘Ancient Futures’ అనే మంచి పుస్తకం రాయటమే కాక, ప్రతి సంవత్సరం ఆరు నెలలు లదాక్‌లో ఉంటూ ‘లదాక్ ప్రాజెక్టు’ పేరుతో స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తూ, లదాక్ పర్యవరణ రక్షణకు పూనుకొన్నారు. ఆమె లదాక్ భాష, ప్రజల జీవితం, సంస్కృతి మీద పరిశోధించారు. మనుష్యులు జీవిచడానికి ఏ మాత్రం అనుకూలంగా లేని అత్యంత ప్రతికూల వాతావరణంలో లదాకీలు సాపేక్షంగా ఎప్పుడూ సంతోషంగా, ప్రశాంతంగా ఆనందమయ జీవితం గడపడం ఆమెను అబ్బురపరచింది.

లదాకీల సంస్కృతి టిబెట్ ప్రజల సంస్కృతికి దగ్గరగా ఉంటుందని, లదాకీల జీవనాన్ని అక్కడి ఋతువులే నిర్ణయిస్తాయని, మండు వేసవి మూడు నెలలు గబ్బిలంలా మాడుతారని, తర్వాత మైనస్ 40 డిగ్రీలకు పడిపోయే అతి భయంకర శీతాకాలంలో, ఎడారుల వంటి బయళ్లలో చలిగాలుల్లో జీవిస్తారని, లదాక్‌లో వాన చాలా అరుదని, వాళ్ల జీవితాల్లో దాని ప్రస్తావనే రాదని అంటారు. పది వేలకు మంచిన ఎత్తైన ప్రదేశాల్లో నాలుగు నెలలు పంట, బార్లీ, గోధుమ పరిమితంగా పండిస్తారని, ఉర్లగడ్డలు, బఠాణీల వంటి పంటలు కొద్దిగా పండిస్తారని, తక్కువ ఎత్తు ప్రదేశాల్లో, లోయల్లో అప్రికాట్ వంటి ఫల వృక్షాలు పెంచుతారని అంటారు.

ఆవుకు యాక్‌కు పుట్టిన సంకర జంతువు dzo (జొ) మీదే పాడికి, పిడకలకు, వ్యవసాయ పనులకు అన్నింటికి ఆధారపడతారు. లదాకీల జీవితంలో ప్రతిది మతంతో ముడిపడి ఉంటుంది. జీవితంలో అన్ని సందర్భాల్లో పాటలు పాడతారు. మత విషయాలు బోధించే సన్యాసికి, గ్రామీణ వైద్యుడికి లదాకీ సమాజంలో అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. లదాకీలు మితంగా జీవిస్తారు. దేన్ని పనికిరాదని పడేయరు. మళ్లీ దాన్ని ఏదో విధంగా వాడుతారు. పరిమితమైన సహజ వనరులను మితంగా, పొదుపుగా వాడుకోవడం లదాకీల జీవన రహస్యం అంటారు హెలీనా. స్వాధీనత, స్వయం సహకారం లదాకీల జీవన సూత్రాలు, ఉప్పు, టీ పొడి, కొన్ని లోహ వస్తువుల కోసం వీళ్లు బయటి ప్రపంచం మీద ఆధారపడతారు.

ప్రకృతి, భూమి, పశుగుణంతో లదాకీల జీవనం పెనవేసుకొని పోయింది. శీతాకాలమంతా యాక్, మేక, జో మాంసం భుజించి జీవిస్తారు. లదాకీల ఇళ్లన్నీ తర్పు దిక్కుకు అభిముఖంగా, తెల్లగా వెల్ల వేసి ఉంటాయి. ఇంటి కింది భాగం పాత వస్తువులు భద్ర చేసేందుకు పైన వంటగది. మంట వద్దే పడుకొంటారు. పెళ్లిళ్లన్నీ విశ్రాంతిగా ఉండే శీతాకాలంలోనే. లదాకీల భోజనం మన లెక్కలో సమతుల్యమైనది కాదు. అంత కొవ్వు పదార్థాలు తినే లదాకీలకు హృద్రోగం రాదు. నిర్మలమైన శైలి, నీరు, కల్తీలేని ఆహారము లదాకీల ఆరోగ్య రహస్యం అని ఆమె భావిస్తారు.

లదాకీల భాషలో ‘కోపం’ అనే పదం బూతుతో సమానమట. గ్రామాల్లో పది పన్నెండు కుటుంబాలు పరస్పరం సహకరించుకుంటూ జీవిస్తారట.

పాశ్చాత్య పర్యాటకుల రాకతో వాళ్లతో తమను పోల్చుకొని తాము చాలా పేదలమనే ఆత్మన్యూనతా భావానికి లదాకీలు గురయ్యారని హెలినా అంటారు. శతాబ్దాలుగా లదాకీలలో నెలకొని ఉండిన sustainable economy స్థానంలో క్రమంగా లదాకీలను నిరంతరం ఆర్థిక వ్యవస్థలోకి ఆకర్షించే నూతన విధానం లే టౌన్‌కు గుంజుతోందని ఆమె భావించారు. సాంస్కృతిక కాలుష్యం చాప కింద నీరులా మారి లదాకీలు సహజ వ్యక్తిత్వాలను కోల్పోతున్నారని హెలినా వ్యాఖ్యానించారు. పంచదార, బియ్యం, ప్లాస్టిక్ వస్తువుల మోజులో లదాకీలు కూరుకొని పోయారని, ఈ అభివృద్ధి లదాకీలను కుటుంబాల నుంచి సమూహాల నుంచి దూరం చేస్తున్నాయని ఆమె భావించారు. లే నగరంలో పుట్టగొడుగుల మాదిరి కాంక్రీటు భవనాలు తెల్లవారేసరికి పుట్టుకొని రావడం ఒక నిదర్శనం అంటారు.

సోలార్ దీపాలు, గ్రామాస్థాయి జల విద్యుత్ కేంద్రాలు గ్రామీణుల జీవితాలను మెరుగుపరుస్తాయని హెలీనా అంటారుగాని, ప్రభుత్వాలు ఆ దృష్టితో ఆలోచించడం లేదు. ఆరోగ్యం, వైద్యం, శిశువుల ఆరోగ్యం అన్నింటిని పాశ్చత్య ప్రమాణాలతో కొలిచి లదాకీల పోషకాహారాన్ని నిర్ణయించడం హాస్యాస్పదం అని హెలీనా భావిస్తారు. సంక్షేమాన్ని జి.డి.పి సూచించదు. Gross National Happiness మాత్రమే సంక్షేమాన్ని సూచిస్తుందని భూటాన్ రాజు అభిప్రాయాన్ని హెలీనా నోర్‌బెర్గ్ సమర్థిస్తారు.

జమ్ములో రామకృష్ణ మిషన్ ఆశ్రమం పెద్ద స్వామిజీ బెంగాల్ అతిథులకు మమ్మల్ని పరిచయం చేస్తూ “ఈ బృందం లదాకీ జీవనాన్ని అధ్యయనం చెయ్యడానికి వెళ్తున్నారు” అని చెప్పినప్పుడు కాస్త సిగ్గనిపించినా, ఇంకా లదాక్‍ని గురించి ఆలోచించిస్తూనే ఉన్నానని ఒక తృప్తి మిగిలింది.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here