Site icon Sanchika

జ్ఞాపకాల తరంగిణి-59

[dropcap]తి[/dropcap]క్కవరపు పట్టాభిరామరెడ్డి పఠాభి కలం పేరుతో ప్రఖ్యాతులు. పఠాభి ‘ఫిడేలు రాగాల డజన్‌’తో పరిచయం బి.ఎ. చదువుతున్న రోజుల్లోనే. 1939లో అచ్చయిన ‘రాగాల డజన్’ అందుబాటులో ఉండేది కాదు. కురుగంటి సీతారామయ్య ఆధునికాంధ్ర సాహిత్య చరిత్రలో ఉదహరించిన పంక్తులూ, ఆయన ఏకపక్షంగా రాసిన విమర్శే మా గురువులకు, మాకు అందుబాటులో ఉండేది.

~

నా, ఈ వచన పద్యాలనే దుడ్డుకర్రల్తో
పద్యాల నడుముల్ విరుగదంతాను
చిన్నయసూరి బాల వ్యాకరణాన్ని
చాల దండిస్తాను…
~

తగిలింపబడి యున్నది జాబిల్లి
చయినా బజారు గగనములోన, పయిన;
అనవసరంగా ఘోరంగా!
~

‘బోగందానా!’ కవితలో
ఓ బోగందానా! నీవు
సంఘానికి వేస్టు పేపరు బాస్కెట్టువా!

వంటి చరణాలు చదవడానికి మా గురువులు ఇష్టపడని రోజుల్లో మా విద్యార్థులకు ఏదో ఆకర్షణ – ఆ చరణాల వెనుక విషాదం, వెటకారం, పరిహాసం మాకు అప్పుడు అర్థం కాకపోయినా.

పఠాభి 1939లో శ్రీశ్రీ ప్రోత్సాహంతో తను రాసిన 12 కవితలను ‘ఫిడేలు రాగాల డజన్’ పేరుతో ప్రచురించారు. చమత్కారం లేకుండా, అంత్యప్రాస లేకుండా పఠాభి ఒక్క చరణం కూడా ఉండదు. పఠాభి తమ కవన పుస్తకం ముఖపత్రం పైన ఫిడేల్ బొమ్మ, కింద ‘రాగాల డజన్’ అని వేశారు. ‘రాగాల డజన్’ను పఠాభి తనకు ఆత్మీయులైన ఇద్దరు యువతులకు అంకితం చేశారు.

చదవండి –

“అంకితం

ఫిడేలు రాగాల డజన్ 1939

మృణాళినికి

కాదు కళ్యాణికి

కాదు ఇరువురికి -“

మృణాళినే మృణాళిని సారాబాయ్ అని విన్నాము. ఆమె గొప్ప సామాజిక చైతన్యంతో పని చేసిన మహిళ. కళ్యాణి ఎవరో ఎవరికీ తెలిసినట్లు లేదు.

పఠాభి కుమార్తె నందనా ఇసబెలియా ద్వారా ఆయన జీవిత రేఖలు మాకు తెలిశాయి. మొదటిసారి కొంచెం సమగ్రంగా జీవిత వివరాలు మనసు ఫౌండేషన్ ప్రచురించిన ‘పఠాభి రచనలు’ సర్వలభ్య సంకలనంలో చేర్చగలిగాము.

పఠాభి తండ్రి తిక్కవరపు రామిరెడ్డి స్వగ్రామం నెల్లూరు సమీపంలోని పొట్టేపాలెం. ఆయనకు మైకా పరిశ్రమలో అదృష్టం కలిసి వచ్చింది. అది కాక, వంశపారంపర్యంగా వచ్చిన పెద్ద వ్యవసాయం. పఠాభి తాత తిక్కవరపు లక్ష్మీనారాయణ రెడ్ది.

పఠాభి తల్లి సుదర్శనమ్మ గొప్పసాహిత్య వారసత్వం కలిగిన కుటుంబానికి చెందినవారు. ఆమె తండ్రిది – బెజవాడ పట్టాభిరామరెడ్డిది నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం. ఆయన విద్యావంతుడు. 1894 ప్రాంతంలోనే మిత్రులతో కలిసి బుచ్చిరెడ్డిపాలెం నుంచి శ్రీ వర్తమాన తరంగిణి, శారద పత్రికలను వెలువరించారు. జిల్లా నుంచి కాంగ్రెసు సభలకు హాజరైన పెద్దలలో ఒకరు.

పట్టాభి తండ్రి రామిరెడ్డికి కవి పండిత పోషకుడుగా మంచి పేరుంది. ఒక పండితుడి ద్వారా భారతం, భాగవతం వంటి గ్రంథాలన్నీ సమగ్రంగా చదివించుకుని విన్నారు. కందుకూరు కాలేజి, కావలి జవహర్ భారతి రామిరెడ్డి చేతి చలవ వల్లే నెలకొన్నాయి. విద్యా వైద్యరంగానికి చాలా సేవలు చేశారు.

పఠాభికి ఒక అక్క శ్యామలాదేవి, ముగ్గురు చెల్లెళ్ళు, తమ్ముడు శివకుమార్ రెడ్డి. పఠాభి చిన్నాన్న వెంకట్రామ రెడ్డి. అక్కచెల్లెళ్ళు కొంత కాలం శాంతినికేతన్‌కి వెళ్ళి చదివారు. శ్యామలాదేవి, చిన్నాన్న మీద ‘దీప్తతార’ స్మృతికావ్యం రాశారు. చెల్లెలు లక్ష్మీకాంతమ్మ ‘ఆనందమయి’ పేరుతో సంస్కృతంలో కొన్ని శ్లోకాలు రాశారు. పఠాభి తమ్ముడు అమెచ్యూర్ ఫొటోగ్రాఫర్‍గా పేరు తెచ్చుకొన్నారు.

పఠాభి తండ్రి రామిరెడ్డి నెల్లూరు టౌన్‌కు పడమరగా, ఊరి చివర, చెరువుకు కూతవేటు దూరంలో విశాలమైన ప్రాంగణంలో ‘సుదర్శన్ మహల్’ నిర్మించారు. 1921లో మహాత్మాగాంధీ నెల్లూరు వచ్చినప్పుడు, ఆ భవనానికి వచ్చారని, ఆ భవనానికి ‘శాంతినికేతన్’ అని పేరు పెట్టినట్లు పఠాభి రాశారు. తన చేతులలో గాంధీజీ ఒక అరటిపండు పెట్టినట్లుగా కూడా పఠాభి పేర్కొన్నారు. గాంధీజీ ప్రభావంతో రామిరెడ్డి కుటుంబం మొత్తం శాకాహారులుగా మారారు. రామిరెడ్ది 1921 సహాయ నిరాకరణ సందర్భంగా జైలు కెళ్ళారు. ఆయన శ్రీమతి సుదర్శనమ్మ ఉద్యమంలో పాల్గొని నెల్లురు నగర వీధుల్లో ఖద్దరు బట్టలు అమ్మారు.

మామగారి భవనం ముందు బెజవాడ గోపాలరెడ్డిగారు

పఠాభిది బాల్యం నుంచి సుకుమార హృదయం. పువ్వులు, ఆకులు తెంపడం, క్రిమి కీటకాదులకు బాధ కలిగించడం సహించలేని ప్రవృత్తి. తండ్రి రామిరెడ్డి కోపిష్టి, మాట కరుకని పేరు పడ్డారు. దాంతో పఠాభి తల్లి చాటు బిడ్డగా పెరిగాడు. చిన్నాయన వెంకట్రామరెడ్డి వద్ద తనకు చనువు. ఆయన వద్దే పఠాభి బాల్యం గడిచింది.

కుడివైపు నుంచి మూడవవ్యక్తి పఠాభి తండ్రి రామిరెడ్డి గారు – నెల్లూరు జిల్లా కలెక్టర్ శ్రీ ఎం.రాజగోపాల్ తదితర నెల్లూరు ప్రముఖులతో

పఠాభి ప్రాథమిక విద్య నెల్లూరు మూలాపేటలోని పాఠశాలలో సాగింది. తనకు చిన్నప్పటి నుంచి పదాలతో ఆట! వినోదం! గది కిటికీలోంచి దూరంగా కనిపించే చింతమానుని చూస్త్తూ, ‘చింతా!… తంతా! యంతా!’ అంటూ పదాలతో సరదాగా ఆట!

మలబారు, చీమలబారు

ఇంజనీరు, గంజినీరు

అనుకొంటూ శబ్దాలంకారాలకు సమ్మోహనమయ్యేవారు.

నెల్లూరు వి.ఆర్. హైస్కూల్లో చదువుతూ, స్కూలు పక్కన టౌన్ హాలు ఆవరణ లోని వర్ధమాన సమాజం గ్రంథాలయం మెట్ల మీద కూర్చుని ఎన్నో పుస్తకాలు చదివినట్లు పఠాభి రాసుకొన్నారు. కౌమార దశలోనే పోతన, ప్రబంధ కవులు, భట్టుమూర్తి, చేమకూర వారి పద్యాలంటే తనకు మోజు. భారతమన్నా, షేక్‌స్పియర్ అన్నా విముఖత. కళాపూర్ణోదయంలో దేశి ఛందస్సు రగడ పాదం –

‘ఓ హంసి నీ చేత నున్నయది నా బ్రదుకు

నా హృదయ మింతి డెందము నేకముగ నదుకు’

ఎప్పుడూ తన నాలుక మీదే ఆడుతూండేది. చిన్నప్పుడే అంత్యప్రాసల మీదా, శబ్దాలంకారాల మీద విపరీతమైన మోజు కలిగింది.

మేనమామ బెజవాడ గోపాలరెడ్డి పఠాభికి టాగోర్ సాహిత్యాన్ని పరిచయం చేశారు. జాతీయోద్యమ స్ఫూర్తితో బాల్యంలోనే పఠాభి హిందీ నేర్చుకున్నారు. 14 సంవత్సరాల వయసులోనే కథలు, కవితలు రాయడం మొదలుపెట్టారు.  తన తొలి రచనలు నెల్లూరు సజీవ వారపత్రిక జమీన్‍రైతులోనూ, కృష్ణా పత్రికలోనూ ప్రచురింపబడినట్లు పఠాభి పేర్కొన్నారు. పఠాభి తొలి కథ ‘ప్రతిధ్వనులు’ చిత్రగుప్తలో అచ్చయినట్టు తెలుస్తోంది. ఆనాటికి పఠాభికి పట్టుమని 15 ఏళ్ళు కూడా లేవు. బాల రచయితగా పఠాభి కథలు కొన్ని జమీన్‍రైతులో అందుబాటులో ఉన్నాయి.

పఠాభి కథలు 1935-40 మధ్య తెలుగు పత్రికల్లో అచ్చచ్చాయి.

పఠాభి మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో ఇంటర్‍మీడియట్‍లో చేరారు. తోడుగా తల్లి వెంట వుంది. 1937లో పఠాభి శాంతినికేతన్‍లో చదవడానికి వెళ్ళారు. విద్యార్థి ప్రతినిధిగా టాగోర్‍కి సన్నిహితంగా మెలిగే అవకాశం తనకు లభించింది. ఆ స్వేచ్ఛా వాతావరణంలో పఠాభిలో కవిత పల్లవించింది. గురుదేవుణ్ణి అనుకరిస్తూ పఠాభి రాసిందంతా భావకవిత్వమే. శాంతినికేతన్‍లో ఉండగానే తల్లి హృద్రోగంతో మరణించింది. గంగలో నిమజ్జనం చెయ్యమని ఆమె అస్థికలను మనిషి చేత ఇచ్చి పంపారు తండ్రి.

అనాటి జాతీయ, అంతర్జాతీయ రాజకీయ వాతావరణంలో రష్యన్ కవి నెక్రసోవ్ ఉప్పు పాటను అనువదించారు. కలకత్తా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. చదువుతూ చిత్‌పూర్ లోని పేదలు నివసించే ప్రాంతానికి మారారు. ఏదో అశాంతితో ఎం.ఏ. పూర్తి చేయకుండానే తిరిగివచ్చారు. కలకత్తాలో ఉన్న సమయంలోనే ఆ ఒంటరితనంలోంచి, అశాంతి లోంచి ‘వమనం’ చేసుకొన్నట్లు హృదయంలోంచి ‘రాగాల డజన్’ పద్యాలు పెళ్ళగించుకొని వచ్చాయట. డజన్ పద్యాలు నాలుగు రోజుల్లో రాసేశారు. శ్రీశ్రీ ప్రోత్సాహంతో 1939లో ‘రాగాల డజన్’ ముద్రించారు.

వ్యాపారం పని మీద తండ్రి పఠాభిని అమెరికా పంపితే, ఆయన న్యూయార్కు కొలంబియా విశ్వవిద్యాలయంలో ఇంగ్లీషు సాహిత్యంలో ఎం.ఏ.; సినిమాకు సంబంధించిన కోర్సులో చేరారు. 1942లో ప్రపంచ యుద్ధంలో పఠాభి నిర్బంధంగా సైన్యంలో చేరవలసి వచ్చింది. సైన్యంలో చేరితే శాకాహార నియమానికి భంగమవుతుందని, ల్యాటిన్ అమెరికా, యూరప్ మీదుగా ఆరు నెలలు నౌకాయానం చేసి ఇల్లు చేరారు. వక్ర మార్గంలో ప్రయాణం తనకు ఇష్టం అంటారు పఠాభి.

మద్రాసులో ఉన్నపుడు భిన్న మతాలకు, సంస్కృతులకు వారసురాలైన స్నేహలతతో పరిచయం అయింది. 1947లో ఆమెతో ప్రేమ వివాహం జరగడంతో పఠాభి తండ్రికి దూరమయ్యారు. పఠాభి స్నేహలత విరహంలో రాసిన గీతాలను ‘నీలగిరి నీలిమలు’ పేరుతో 1951లో పుస్తక రూపంలో ప్రచురించారు. పెళ్ళి తరువాత, స్నేహలతతో కలిసి మద్రాసు నుంచి 36 వారాలు ‘ఫోకస్’ ఇంగ్లీషు వారపత్రిక నడిపారు.

పఠాభి దంపతులు సిలోన్‍కు హనీమూన్‍ వెళ్ళి  – అక్కడ్నించి ఇంగ్లండ్, స్పెయిన్ పర్యటించి, పది నెలల తర్వాత ఓడలో మద్రాసు వచ్చి కాపురం పెట్టారు. ఈ పర్యటనలో రాసిన కవితలు ‘యాత్రాఛందస్సులు’ శీర్షికతో ప్రచురించారు. సెవిల్ కు మరోపేరు ఇషిబెలియా కనక, స్నేహలత అక్కడ గర్భం ధరించినందున 1952లో ఈ దంపతులకు కలిగిన శిశువుకు – బాలికకు ‘నందనా ఇషిబెలియ’ అని పేరు పెట్టారు. ఆ ఏడు నందన నామ సంవత్సరం. 1955లో వీరికి కలిగిన కుమారుడికి కోణార్క్ అని పేరు పెట్టారు.

పఠాభి మిత్రులు పింగళి నాగేంద్రరావుతో కలిసి జయంతి సంస్థను నెలకొల్పి కె.వి.రెడ్డి దర్శకత్వంలో – పెళ్ళినాటి ప్రమాణాలు, కృష్ణార్జున యుద్ధం, భాగ్యచక్రం – తీశారు. భాగ్యచక్రం సినిమాకి ప్రేక్షకుల ఆదరణ లేక జయంతి సంస్థ అప్పులపాలైంది.

1956-68 మధ్య పఠాభి దంపతులు మద్రాసు, బెంగుళూరు మధ్య తరచూ కాపురం మారేవారు. చివరకు బెంగుళూరులో స్థిరపడ్డారు. మద్రాసులో ఉన్న కాలంలోనే ఈ దంపతులకు రామ్ మనోహర్ లోహియాతో పరిచయం, యు.ఆర్. అనంతమూర్తి నవల మీద చర్చ జరిగి, ‘సంస్కార’ సినిమాగా తీయాలని పఠాభి నిర్ణయించుకొన్నారు. సినిమా విడుదలకు సెన్సార్ నిబంధనలు అడ్డు రావడంతో సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత 1970లో నిషేధాన్ని తొలగించారు. ‘సంస్కార’కు లొకార్నొ ఫిల్మ్ ఫెస్టివల్‍లో కాంస్యపతకం, భారతదేశంలో అత్యుత్తమ చిత్రంగా జాతీయ స్థాయిలో పురస్కారం లభించాయి.

పఠాభి, స్నేహలత దంపతుల తనయ నందన దంపతులు.

1973 జనవరిలో నెల్లూరు వర్ధమాన సమాజం గ్రంథాలయం ‘ఫిడేల్ రాగాల డజన్’ను పునర్ముద్రణ చేసింది. ఈ ప్రచురణకు పఠాభి ‘Thirty-four years ago’ అనే పేరుతో రాసిన పరిచయంలోనే తన కవితల నేపథ్యాన్ని వివరించడంతో విమర్శకులకు తొలిసారి పఠాభి బోధపడ్డారు. 1975లో డాక్టర్ ఆర్.వి.ఎస్. సుందరం ‘ఫిడేల్ రాగాల డజన్’ను కన్నడంలోకి అనువదించడమే కాక, పఠాభి పంచాగాన్ని సేకరించి పుస్తక రూపంలో తెచ్చారు. అత్యవసర పరిస్థితిలో పఠాభి కుటుంబ సభ్యులు అరెస్టయ్యారు. DIR, MISA చట్టాల క్రింద స్నేహలతను ప్రభుత్వం నిర్బంధించింది. 1977 జనవరిలో స్నేహలత అమరురాలు కావడం, పఠాభి ‘చండమారుత’ నిషేధానికి బలవడం ఒకేమారు జరిగాయి.

పఠాభి ఎప్పుడూ ఏ సత్కారాలకూ, సన్మానాలకూ అంగీకరించలేదు. 1979 ఫిబ్రవరి 12 తారీఖు వారి తండ్రి నెలకొల్పిన కవిత్రయ జయంతుల సందర్భంగా పఠాభి షష్టిపూర్తి ఉత్సవం చాలా వేడుకగా నెల్లూరులో నిర్వహించబడింది. ఆ సభలో ఆరుద్ర ప్రధాన వక్త.

1986లో పఠాభి కుమార్తె నందన పరిణయం జరిగింది. మరుసటి సంవత్సరం కుమారుడు కోణార్క్ కీర్తనల వివాహం జరిగింది. ఆ తరువాత పఠాభి అరబిందో ‘సావిత్రి’ని సినిమాగా తీయాలని ప్రయత్నం చేశారు కానీ కుదరలేదు.

రావెల సోమయ్యగారు మిత్రులతో కలిసి పఠాభి 75వ జన్మదినాన్ని అమృతోత్సవంగా చాలా ఘనంగా జరిపి ‘Hats off Pattabhi’ విశేష సంచికను వెలువరించారు. పఠాభిలో అణగి ఉన్న సినిమా కాంక్ష – సభలో తాను ‘సావిత్రి’ సినిమా తీస్తున్నట్లు ప్రకటించడంతో వ్యక్తమయింది. తరువాత పఠాభి నందన దంపతులతో జర్మనీ పర్యటించి వచ్చారు.

1999 డిసెంబరులో కోణార్క్ కర్నాటక సాగర తీరంలో నిర్మించిన నూతన గృహంలో చేరి, పఠాభి నూతన శతాబ్దికి స్వాగతం పలికారు. 2001లో నందన, ఇతర మిత్రుల వెంట పఠాభి ఇటలీ పర్యటించి వచ్చి, బెంగుళూరులో కుటుంబ సభ్యులతో కలసి సహస్రచంద్ర సందర్శనోత్సవం  ఉత్సాహంగా జరుపుకున్నారు.

2004లో అరబిందో ‘సావిత్రి’ని దృశ్యరూపకం ప్రదర్శనకు పఠాభి హాజరయ్యారు. 2005 ఫిబ్రవరి 19న జన్మదినోత్సవాన్ని తలకావేరిలో జరుపుకున్నారు. తర్వాత కొద్ది రోజులకే, మూత్ర పిండాల వ్యాధికి గురై, కాస్త స్వస్థత పొంది ‘ప్రాహా’ నగరాన్ని చూచి వచ్చారు. 2006లో పుట్టినరోజు కోణార్క్, కీర్తన, మనుమరాలు ZUI లతో గోవాలో జరుపుకున్నారు.  తర్వాత తుంటి ఎముక విరగడం, ఆపరేషన్, పేస్ మేకర్ అమర్చడం వంటి బాధలతో వైద్యం చేయించుకుంటూ 2006 మే 6వ తారీఖున చివరి శ్వాస విడిచారు.

పఠాభి జీవిత వివరాలు ఆయన కుమార్తె నందన ద్వారా మాకు అందాయి. ఈ వివరాలన్నీ పొందుపరుస్తూ మనసు ఫౌండేషన్ పఠాభి శత జయంతిని నెల్లూరు టౌన్ హాల్లో ఘనంగా నిర్వహించి ‘పఠాభి లభ్య సమగ్ర రచనల’ సంపుటాన్ని విడుదల చేసింది. పఠాభి దేన్నీ దాచుకోలేదు, లెక్క చేయలేదు. ఆయన రచనలన్నీ డా. సుందరం, పారా అశోక్, నేను సంపాదక వర్గంగా ఏర్పడి సేకరించాము. ఎంతో పరిశోధన జరిపి పాత పత్రికల్లోంచి వారి కవితలు, కథలు, వ్యాసాలు సేకరించాము. కుటుంబం సహకారంతో వారి లేఖలు, దినచర్యలో కొన్ని పేజీలు, వారికి గణితశాస్త్రం మీద ఆసక్తితో సాధించిన గణిత శాస్త్ర సూత్రాల గురించి కూడా ఈ సంపుటిలో చేర్చాము.

నెల్లూరు టౌన్ హాల్ లో పఠాభి శతజయంతి నాడు 2019ఫిబ్రవరి 19 న జరిగిన సభలో పఠాభి సమగ్ర రచనల సంపుటం పఠాభి కుమారులు కోణార్క్ కోడలు కీర్తన దంపతులు విడుదలచేశారు. ఎడమ నుంచి కుడికి ఫొటోలో: తెల్ల షర్ట్, పక్కన నీలంచీర. పఠాభి చిన్న చెల్లి బావ. వారిపక్కన కీర్తన, కోణార్క్. తర్వాత డాక్టర్ ఆర్.వి.ఎస్. సుందరం, కాళిదాసు పురుషోత్తం, ప్రొఫెసర్ కేతు విశ్వనాథరెడ్డి, పారా అశోక్ కుమార్, మన్నం రాయుడు దంపతులు.

డాక్టర్ మన్నెం రాయుడు సహకారంతో ఈ పఠాభి సమగ్ర రచనల సంపుటిని తయారు చేయగలిగాము. ఎమెస్కో నాలుగు వందలా అరవై పైచిలుకు పుటల బౌండు పుస్తకాన్ని  200 రూపాయలకే విక్రయిస్తోంది. పఠాభి మీద ఇష్టం ఉన్నవారు ఆ పుస్తకంలో మా కృషిని గమనించగలరు.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version