Site icon Sanchika

జ్ఞాపకాల తరంగిణి-66

[dropcap]మ[/dropcap]హాకవి గురజాడ వెంకట అప్పారావు 160వ జయంతి తెలుగు ప్రజలు ఘనంగానే జరుపుకొన్నారు. తిరుపతి ఎం.ఎల్.ఎ., సాహిత్యాభిమాని శ్రీ భూమన కరుణాకరెడ్డి ‘కన్యాశుల్యం’ నాలుగువేల ప్రతులు ముద్రించి, మన ముఖ్యమంత్రి గారిచేత ఆవిష్కరింపజేశారు. విజయనగరంలో గురజాడ మనుమడు శ్రీ వెంకటేశ్వర ప్రసాద్ గారికి, ఆయన శ్రీమతి ఇందిర గార్లకు బహుకరించి, ఆ కాపీలను గురజాడ స్మృత్యంకితంగా, నేటికీ మన ప్రభుత్వం నిర్వహిస్తున్న గురజాడ నివసించిన భవనాన్ని సందర్శించడానికి వచ్చిన వారికి ‘కన్యాశుల్యం’ నాటకం ప్రతిని బహుకరించే ఏర్పాటు చేశారు. భూమన ప్రచురించిన ‘కన్యాశుల్యం’ పుస్తకం వెనుక వైపు ‘ఇది ఆధునిక తెలుగు సాహిత్య భగవద్గీత’ అని ముద్రించారు.

ఇతర జిల్లాలలో కూడా గురజాడ జయంతి సందర్భంగా సభలు, గోష్ఠులు, సమావేశాలు జరిగే ఉంటాయి. నెల్లూరు దొడ్ల కౌసల్యమ్మ మహిళా కళాశాల గురజాడ జయంతిని చక్కగా జరిపింది. విద్యార్థినులు కళాశాల అధ్యాపికల ఉపన్యాసాలను శ్రద్ధగా విన్నారు. గురజాడ స్త్రీల సమస్యలను ప్రజల దృష్టికి తెచ్చేందుకే, అన్ని సాహిత్య ప్రక్రియలను వాడుకొన్నారని, సాహిత్య మాధ్యమం ద్వారా వారు సంఘ సంస్కరణకు పూనుకొన్నారని నేను (డాక్టర్ కాళిదాసు పురుషోత్తం) నా ఉపన్యాసంలో వివరంగా చర్చించాను.

నెల్లూరులో శ్రీ సర్వోదయ కళాశాల పూర్వ అధ్యాపకులు, ఆ కళాశాల భవనంలోనే గురజాడ జయంతి సభ నిర్వహించారు. నెల్లూరు ప్రముఖులు, గురజాడ సాహిత్య ప్రేమికులు దాదాపు అరవై మంది దాకా సమావేశంలో పాల్గొన్నారు. నెల్లూరులో ‘కుట్టి’ విద్యాసంస్థల అధిపతి లతీఫ్ కుట్టి – గురజాడ సాహిత్యాన్ని చదవడం మాత్రమే కాక, వారు ప్రతిపాదించిన సంస్కరణ భావాలను, విలువలను మనం అంతో ఇంతో ఆచరించపుడే గురజాడ సాహిత్య అధ్యయనానికి ప్రయోజనం ఉంటుందని అన్నారు.

వెంకటగిరి ప్రభుత్వ కళాశాలలో పనిచేసిన సింగుగారు గురజాడ కవిత్వం గొప్పతనాన్ని గురించి వివరించారు.

2014 సెప్టెంబరు 21, గురజాడ 152వ జయంతి సందర్భంగా విజయనగరం నుంచి శ్రీ కిశోర్ బృందం నెల్లూరు వచ్చి ‘కన్యాశుల్యం’ పూర్తి నాటకాన్ని 8 గంటల ప్రదర్శన ఇచ్చారు. ఆ నాటక ప్రదర్శన కమిటీ సభ్యులు చిరసారి భాస్కర రెడ్డి, నేను (డా. కాళిదాసు పురుషోత్తం), చలంచర్ల భాస్కరరెడ్డి, రమణయ్య నాయుడు మొదలైనవారు ఆ నాటక ప్రదర్శన ఎంత విజయవంతమైందీ వివరిస్తూ, ‘కన్యాశుల్యం’ నాటక ప్రదర్శనను ప్రజలు ఎంతో ఇష్టంగా చూచి విజయవంతం చేశారని, ఈ ప్రదర్శనకు సుమారు నాలుగున్నర లక్షల రూపాయలు విరాళంగా వచ్చాయని తెలిపాము. ఖర్చుపోను మిగిలిన డబ్బు నుంచి ‘వెంకటేశం’ వేషం వేసిన బాలుడు విజయనగరం అనాథాశ్రమంలో ఉంటూ చదువుకొంటున్నట్లు తెలిసి, నాటక నిర్వాహకులు ఆ బాలుడికి ఐదువేలు బహుకరించారు. ఖర్చులు పోను మిగిలిన 40,000 రూపాయలను కూడా నాటకం ప్రదర్శించిన సంఘానికే బహుకరించడం జరిగింది.

ఆ ప్రదర్శన రోజు ఊహించని విధంగా నెల్లూరు కస్తూర్బా కళాక్షేత్ర ప్రేక్షకులతో నిండిపోతే, నాటకశాల ప్రాంగణంలో పెద్ద టివి స్క్రీన్లు ఏర్పాటు చేసి 300 కుర్చీలు వేయించారు మా వాళ్ళు. నాటక నిర్వాహకులు స్టేజి ముందు, నేల మీద, మెట్ల మీద కూర్చుని ప్రదర్శన చూడవలసి వచ్చింది. నాటక ప్రదర్శనకు మద్రాసు, బెంగుళూరు వంటి దూర ప్రాంతాల నుంచి కూడా ప్రేక్షకులు హాజరయ్యారు. మొదలి నాగభూషణశర్మ కంటి ఆపరేషన్ చేయించుకున్న 15వ రోజు బెంగుళూరు నుంచి వచ్చి నాటకం చూశారు. నాటక ప్రదర్శనకు నెల్లూరు జిల్లా కలెక్టర్ శ్రీకాంత్ దంపతులు హాజరై చూడడమే కాక, ప్రదర్శన తరువాత నటీనటులతో కలిసి ఫొటోలు తీసుకొన్నారు. ఆనాటి ప్రదర్శన విషయాలన్నీ ఈ సభలో గుర్తు చేసుకొన్నాము.

ఈ ప్రదర్శన జరిగిన రెండు మూడు నెలల లోపు ఒక విశ్వవిద్యాలయం ఆచార్యులు ‘కన్యాశుల్యం’ నాటకం ప్రదర్శన యోగ్యం కాదని, ఆ నాటకం మీద తీవ్రమైన ఆక్షేపణలు, విమర్శలు కుమ్మరిస్తే, మా ‘కన్యాశుల్యం’ నాటక ప్రదర్శన కమిటీ కార్యదర్శి చలంచెర్ల భాస్కరరెడ్డి నెల్లూరులో నాటక ప్రదర్శన ఏర్పాటు చేశామని, వేయి మందికి పైగా ప్రేక్షకులు నాటకాన్ని ఆసాంతం తిలకించారని, వివరంగా సమాధానం రాస్తే ‘మిసిమి’ పత్రిక ఆ వ్యాసాన్ని కూడా ప్రచురించింది.

కొంతమందికి తెలియకపోవచ్చు – లండన్ నగరంలో ఇప్పుడు కూడా సంవత్సరాల తరబడి షేక్‍స్పియర్, బెర్నాడ్ షా నాటకాలు అనునిత్యం ప్రదర్శిస్తారని, చాలా ముందుగానే టికెట్లు రిజర్వు చేసుకోవలసి ఉంటుందని.

మనసు ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ మన్నం రాయుడు గురజాడ సమగ్ర రచనల సంపుటాన్ని 2012 గురజాడ జయంతి రోజు విడుదల చెయ్యాలనే సంకల్పంతో ఆ పనిని సీనియర్ జర్నలిస్ట్ పెన్నేపల్లి గోపాలకృష్ణకు అప్పగించారు. గోపాలకృష్ణకు విద్యార్థి దశనుంచి ‘కన్యాశుల్యం’ పిచ్చి. నాటకం నోటికి వచ్చు.

విశాలాంధ్ర ప్రచురణ సంస్థ గురజాడ ఇంగ్లీషులో రాసిన లేఖలను, దినచర్యలను, నోట్సును అవసరాల సూర్యారావుచేత తెలుగులోకి అనువదింపజేసి, అనేక ముద్రణలు తెచ్చింది. అదెంతో హర్షణీయమే గాని, ఒక రచయిత మొదట ఏ భాషలో రాస్తారో, ఆ రచనను ముందు ఆ భాషలో ముద్రించడం న్యాయం, సమంజసం. ఆ తరువాత అనువాదాలు చేయించవచ్చు, ఇది లోకంలో సాధారణంగా జరిగే పద్ధతి. గోపాలకృష్ణకు మొదటి నుంచి గురజాడ ఇంగ్లీషులో రాసిన దినచర్యలు, లేఖలు ఇంగ్లీషులోనే అచ్చు వేయించాలని అభిలాష. విశాలాంధ్ర ప్రచురణ సంస్థ 1976 ప్రాంతంలో తమ వద్ద ఉన్న గురజాడ రికార్డును కె.వి.ఆర్., పురాణం సుబ్రహ్మణ్యశర్మ, గొల్లపూడి మారుతీరావు మరికొందరు పరిశీలించడానికి అవకాశం కల్పించింది. ఈ పెద్దల పర్యవేక్షణలోనే ఆ రికార్డునంతా టైపు చేయించారు కూడా.

పురాణం సుబ్రహ్మణ్యశర్మ ‘గురజాడ రచనలు – అవసరాల ఫోర్జరీలు’ వంటి శీర్షిక పెట్టి ఆంధ్రజ్యోతి దినపత్రికలో దాదాపు 26 వారాలు దారుణంగా విమర్శ వ్యాసాలు రాశారు. సుబ్రహ్మణ్యశర్మ వాడిన భాష తీవ్రమైనదే కాని, విమర్శలో చాలా సత్యాలున్నాయి. చిన్న ఉదాహరణ – blackguard పదానికి అవసరాల ‘మాలా మాదిగా’ అని అనువాదం చేశాడు. ‘A man who behaves in a dishonorable or contemptible way’ అని నిఘంటువులో వుంది. గురజాడ son of Bhattiraju అని దినచర్యలో రాసిన ప్రతి పర్యాయం అవసరాల ‘భ గారబ్బాయి’ అని అనువాదం చేశాడు. ఇటువంటి అసంబద్ధ అనువాదాలనే అందరూ వాస్తవమనుకొనే ప్రమాదం ఉందని గోపాలకృష్ణ బాధ వ్యక్తం చేసేవాడు. పురాణం విమర్శల తర్వాత విశాలాంధ్ర ప్రచురణ సంస్థ మళ్ళీ సెట్టి ఈశ్వరరావు చేత గురజాడ రచనలను అనువాదం చేయించి ప్రచురించింది. అవసరాల పొరపాట్లు ఈమారు చాలా సవరించబడ్డాయి. అయితే పుస్తకాల పరిష్కారం, ఎడిట్ చెయ్యడం, అనువాదంలో పాటించవలసిన నియమాలు వీరెవరికీ తెలియకపోవడం చేత కొత్త తప్పులు ఈ సంపుటాల్లో దూరాయి.

బంగోరె స్ఫూర్తితో నేను మద్రాసు స్టేట్ ఆర్కైవ్స్ లోనూ, ఇతర ఆఫీసుల్లోను పరిశోధించి ‘దంపూరు నరసయ్య’ అనే గొప్ప జర్నలిస్టు, పత్రికా సంపాదకుడి మీద పుస్తకం రాశాను. అవసరాల గురజాడ లేఖకు చేసిన అనువాదంలో “వొక తెలుగు పుస్తకాన్ని ఎలా రెవ్యూ చెయ్యాలో తెలిసున్న వ్యక్తి నా ఎరికలో ఎవరూ లేడు. అన్నట్లు శ్రీ. డి. నరసయ్య అనే పండితుడు వొకాయన ‘పీపుల్స్ ఫ్రెండ్’ అనే వొక వారపత్రికను నడుపుతూ ఉండేవాడు. ఆ పత్రిక ఇప్పుడు వెలువడటం లేదు; ఆయన నెల్లూరు వాస్తవ్యుడు. ఇప్పుడు వున్నారూ? వుంటే ఆయన చిరునామా నాకు పంపించు. ఆంగ్ల భాషలో ఆయన గట్టివాడు. వొకసారి ఆయన్ని కలుసుకో” అన్న వాక్యాలు విశాలాంధ్ర ప్రచురణ సంస్థ ఈశ్వరరావు చేత చేయించిన అనువాదంలో లేవు. అవసరాల కరెక్టా? ఈశ్వరరావా? 1979-89 ప్రాంతాల్లో విశాలాంధ్ర వాళ్ళు తమ దగ్గర ఉన్న గురజాడ రికార్డును, పోయింది పోగా మిగిలింది ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఆర్కైవ్స్, హైదరాబాద్ సంస్థకు అప్పగించారు. హైదరాబాదు ఆర్కైవ్స్‌కు వెళ్ళి చూస్తే, గురజాడ వాక్యాలు ఇట్లా ఉన్నాయి:

“There was a scholar by name D. V. Narasaiah who used to edit a bright English weekly ‘The People’s Friend’ now defunct. He was a native of Nellore. Is he living? – if so give me his address. He has a wonderful command on English. Please see him.”

ఒక పుస్తకాన్ని ఎట్లా ఎడిట్ చేయాలో, పరిష్కరించాలో శాస్త్రీయ పద్ధతులు తెలియకపోవడం చేతే ఇటువంటి లోపాలు చోటు చేసుకొన్నాయి తప్ప, అవసరాల, ఈశ్వరరావు గార్ల కృషిని తక్కువ చేయడం గాని, కించపరచడం గాని నా ఉద్దేశం కాదు.

పెన్నేపల్లి గోపాలకృష్ణ, నేను  అవకాశం దొరికినప్పుడల్లా హైదరాబాదులో ఆర్కైవ్సుకు వెళ్ళి గురజాడ పత్రాలు చదివి నోట్సు తీసుకునేవాళ్ళం. ఏ స్కాలర్‍షిప్ తోనో, పూర్తి టైమ్ కొన్నేళ్ళు చేస్తే తప్ప ఆ రికార్డును చదవడం సాధ్యమయ్యే పని కాదు. ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు గారి మాట సహాయంతో, వారి ఆఫీసులోనే గురజాడ రికార్డంతా స్కాన్ చేసి సిడి మాకు అందించారు. దానికి తోడు 1970 ప్రాంతాల్లో గురజాడ రికార్డు టైపు ప్రతి వెలుగు రామినాయుడి ద్వారా గోపాలకృష్ణకు అందింది. 2008 ప్రాతంలో గోపాలకృష్ణ గురజాడ ఇంగ్లీషు దినచర్యలను ఇంగ్లీషులో ముద్రణకు సిద్ధం చేయగా A.P.Government Manuscripts Library and Research Institute, Hyd ప్రచురించింది. తర్వాత మనసు పౌండేషన్ రాయుడి గారి ప్రతిపాదన మీద గురజాడ సమగ్ర రచనల సంపుటానికి సంపాదకులుగా పెన్నేపల్లి గోపాలకృష్ణ, తనకు సహాయకులుగా ఉండడానికి నేను సమ్మతించాను. గోపాలకృష్ణ నిర్దుష్టంగా గురజాడ ఉత్తర ప్రత్యుత్తరాలకు ప్రెస్ కాపీ తయారు చేశాడు. నేను డిస్సెంట్ నోట్‍కు ప్రెస్ కాపీ తయారు చేశాను. డిస్సెంట్ నోట్‌ను గురజాడ వావిళ్ళ వారి ప్రెస్‍లో అచ్చు వేయించారు, ఆయన కాలం చేయడానికి ఏడాది ముందు. ఆ ప్రతిలో ముద్రణ దోషాలన్నీ తొలగించి, నోట్సు, వివరణలతో కాపీ తయారయింది. ఇంతలో 2011 మే నెలలో గోపాలకృష్ణ ఈ లోకం నుంచి వెళ్ళిపోయారు. డా. మన్నం రాయుడుగారి అభ్యర్థన మీద ఆ పని కొనసాగించే కార్యక్రమం చేపట్టాను – ఒక నిబంధనతో. రాయుడు గారు గురజాడ సమగ్ర రచనల సంపుటానికి సహ సంపాదకులుగా ఉండేందుకు అంగీకరించాలని. రాయుడు గారు గురజాడ తెలుగు రచనలన్నీ పరిశీలించి నిర్దుష్టమైన ప్రతి ముద్రణకు తయారు చేయించారు.

నేను గురజాడ దినచర్యలు, నోట్సుతో ఏడాది పైగా 2012 అక్టోబరు మొదటి వారం వరకు కుస్తీ పట్టాను. దాదాపు ఏడాదిన్నర పాటు రోజూ పది గంటలు కంప్యూటర్ స్క్రీన్ మీద గురజాడ దినచర్యలు చదివి, డిసైఫర్ చేశాను. ఈ శ్రమలో నా ఆత్మీయ మిత్రులు డా. ఎం. శివరామ ప్రసాద్ పాలుపంచుకొన్నారు. అతను చేతివ్రాత చదవడంలో నిపుణుడు. నాకు వాక్యంలో ఒకపదం తర్వాత సాధారణంగా ఏ పదం ఉంటుందో గ్రహించే శక్తి గ్రంథపఠనం వల్ల అలవాటయింది. దినచర్యలే కాక, పూర్వం ఎవరూ చదవలేక విడిచిన అనేక లేఖలను కూడా చదివి ‘గురజాడ లబ్ధ రచనల సమగ్ర సంపుటం’లో చేర్చాము. ఈ శ్రమలో అవసరాల, సెట్టి ఈశ్వరరావు గార్ల అనువాదాలు కూడా ఉపయోగపడ్డాయి. అవసరాల ఆంగ్ల భాషా జ్ఞానం పరిమితం, కానీ గురజాడ చేతిరాతను చదవడంలో నిపుణుడు. చాలాసార్లు అతని అనువాదం కొన్ని క్లూల నిచ్చింది. ఇంత చేసినా బోధపడని భాగాలను విడిచి పెట్టాల్సి వచ్చింది. ‘గురజాడ రచనల సమగ్ర సంపుటం’ అచ్చైన రెండేళ్ళ తర్వాత ఏరాడ కొండ మీద రాసిన వర్ణన ఒక్క ఉదుటున, గడగడ చదవగలిగాను. ఆ భాగాన్ని తర్వాత వెలుగు రామినాయుడు ప్రచురించిన ప్రత్యేక సంపుటంలో ముద్రించారు.

పుస్తకావిష్కరణ తర్వాత ‘గురజాడలు’ మళ్ళీ మళ్ళీ చదివినప్పుడు స్పెల్లింగ్ తప్పులు, విడిచి పెట్టిన పదాలు స్ఫురించడం వంటివి ఎన్నో.. ఆర్కైవ్సులో 6-7 గురజాడ రాసిన ఉత్తరాలు, గురజాడ ఇంగ్లీషులో ఏదో పత్రికకు రాసిన ఇంగ్లీషు వ్యాసం కూడా లభించింది. గురజాడ కళింగదేశ చరిత్రకు మద్రాసు ఓరియటల్ లైబ్రరీలో నోట్ చేసుకున్న పుస్తకాలు వగైరా కొత్త భోగట్టా తెలిసింది. గురజాడ మద్రాసు విశ్వవిద్యాలయం సెనేట్‍కు వాడుక భాషలో బోధన విషయమై వరుసగా అసమ్మతి పత్రాలు సమర్పించారు. ఇప్పుడు అచ్చులో ఉన్నది కాక రెండో మూడో డిస్సెంట్ పత్రాలు బంగోరె సంపాదించినవి మిత్రులు నాకు పంపించారు. బంగోరెనే గురజాడ జన్మదినాన్ని 1862 సెప్టెంబరు 21 అని తేల్చాడు. అంతకు ముందు 1861 అని ప్రచారంలో ఉండేది.

గురజాడ మరణం తర్వాత ఆయన గ్రంథాలయం చెదిరిపోయింది. పుస్తకాలు ఎవరెవరి చేతుల్లోకో వెళ్ళాయి. ఈ రోజుక్కూడా విజయనగరంలో ఎంతోమంది సొంత గ్రంథాలయాల్లో గురజాడ లైబ్రరీ పుస్తకాలు ఉన్నాయి. ఒక గృహస్థు ఇంట్లో ఏకంగా 300 పుస్తకాలు పైగా ఉన్నాయని విన్నా.

నిన్న ఒక మిత్రుడు ‘The Life – Work of Henrik Ibsen’ పుస్తకం నాకు బహుకరించారు. దాని మీద గురజాడ లైబ్రరీ స్టాంపు ఉంది. విజయనగరం వాళ్ళకు కాస్త ఓపిక ఉంటే, ఆ జిల్లా కలెక్టరాఫీసు రికార్డుల్లో బోలెడంత మెటీరియల్ దొరుకుతుంది. జిల్లా గజెట్ అని బ్రిటీష్ గవర్నమెంట్ నిర్వహించింది. దాన్లో చాలా విషయాలు దొరుకుతాయి. నెల్లూరు జిల్లా గెజిట్ – మద్రాసు ప్రెసిడెన్సీ గెజిట్ లోంచే దంపూరు నరసయ్యకు సంబంధించిన అనేక విషయాలు తెలిశాయి. విజయనగరం సంస్థానం రికార్డుల్లో కూడా ఏవో విషయాలు దొరక్కపోవు. గోపినాథుని వెంకయ్యశాస్త్రి వెంకటగరి రాజాగారికి 1873లో రాసిన 3 ఉత్తరాలు పట్టుకోగలిగాను. స్థానికులు పరిశోధిస్తే అనేక చిన్న చిన్న విషయాలు ఆ మహాకవి జీవితాన్ని మరింత పరిపుష్టంగా వివరించి రాయడానికి పనికొచ్చే విషయాలు లభించకపోవు.

(ఈ వ్యాసం మిగతా భాగం పై వారం)

Exit mobile version