Site icon Sanchika

జ్ఞాపకాల తరంగిణి-68

డిజిటల్ యుగంలో అచ్చు పుస్తకాల భవిష్యత్తు

[dropcap]నే[/dropcap]ను వెంకటగిరి సంస్థాన చరిత్ర, సాహిత్యం మీద పరిశోధిస్తున్న సమయంలో వెంకటగిరి సంస్థానం గ్రంథాలయం ‘సరస్వతీ నిలయం’లో దాదాపు ఆరేడు నెలలున్నాను. తెలుగు పుస్తకాలు, పాత తెలుగు పత్రికలు, కవిపండితులు సంస్థానాధీశులకు రాసిన ఉత్తరాలు ఎన్నెన్నో అపూర్వమైన ఆకరాలు అక్కడ లభించాయి. రోజూ ఉదయం నుంచి సాయంత్రం చీకటిపడే వరకు ఆ గ్రంథాలయంలో కూర్చొని నోట్సు రాసుకోవడం, ముఖ్యమైన వాటికి నకలు రాసుకోవడం నా పని. అప్పటికి ఇంకా ఫొటోకాపీ (జెరాక్స్) యంత్రాలు రాలేదు.

The Life-Work of Hendrik Ibsen by G. A.Munsey గురజాడ చదివిన గ్రంథం

గోపినాథుని వెంకయ్యశాస్త్రి రాజా గారికి 1873లో రాసిన మూడు ఉత్తరాలను నా థీసిస్‍లో సాక్ష్యంగా చూపాలని, అట్లా ప్రదర్శిస్తే, నా వాదనకు బలం చేకూరుతుందని నా అభిప్రాయం. నెల్లూరు కెమెరా క్లబ్ మిత్రుల సలహాతో ఆ లేఖలను ఫొటో స్టూడియోలో ఎన్‍లార్జర్ సహాయంతో ముందు ఫొటో ప్రింట్ వేసే కాగితం మీదకి ప్రింటు వేసి, తర్వాత ఆ పేపర్ను నెగటివ్‍లాగా వాడుకొని దానికి contact ప్రింటు తయారు చేస్తే, మూడు ఉత్తరాలు స్పష్టంగా ప్రింటులో వచ్చాయి.

ఆ రోజుల్లోనే లెనాడ్ అనే అమెరికన్ పరిశోధకుడు వీరేశలింగం పంతులు గారి మీద పరిశోధన చేస్తూ, మా నెల్లూరు వర్ధమాన సమాజ గ్రంథాలయంలో నాలుగైదు రోజులున్నాడు. తనకు అవసరమైన పుస్తకాలలో పేజీలను 8 mm ఫిల్మ్ కెమెరాతో ఫొటో తీసుకుని వెళ్ళిపోయాడు. అతనితో పోల్చుకుంటే మనం ఆ రోజుల్లో ఎక్కడ ఉన్నామో అర్థమైంది.

అప్పటికి ఇంకా విదేశాల నుంచి యంత్రాలు, పరికరాలు దిగుమతులకు కేంద్ర ప్రభుత్వం నుంచి చాలా అనుజ్ఞలు, పత్రాలు అవసరం. నా పరిశోధన ముగిసిన తర్వాత A.P. State Archives లో కూడా లెనాడ్ వాడిన పరికరం నెలకొల్పారు, అది వేరే విషయం.

ఈ అక్టోబరు 2, 3 తారీకుల్లో మనసు ఫౌండేషన్ వ్యవస్థాపకులు డా. మన్నం రాయుడి గారి ఆహ్వానం మీద నెల్లూరుకు సుమారు 160 కిలోమీటర్ల దూరంలోని వరికుంటపాడు స్కానింగ్ సెంటర్‍కు వెళ్ళివచ్చాను. వరికుంటపాడు ఫామ్‍హౌస్‌లో మనసు ఫౌండేషన్ ఏర్పాటు చేసిన స్కానింగ్ సెంటర్‍లో రోజుకు 30 వేల పేజీలు స్కాన్ అవుతాయి. జపాన్ నుంచి దిగుమతి చేసిన అత్యాధునిక ఆటోమాటిక్ స్కానింగ్ మెషీన్లను సుశిక్షితులైన బాలికలు ఆపరేట్ చేస్తారు. స్కానింగ్ అంటే ఊరకే స్కానింగ్ కాదు, సెంటరుకు వచ్చిన పుస్తకం ఇంతకు ముందే స్కాన్ అయిందీ, లేనిదీ పరిశీలించడం నుంచి, పుస్తకం కుట్లు విప్పి, పేజీలు శుభ్రం చెయ్యడం, పుటలన్నీ ఉన్నాయా లేవా అని చూచుకోడం, స్కాన్ అయిన తర్వాత, ఏ పుటలైనా తప్పిపోయాయా అని పరిశీలించడం, ఫొటోషాప్ చెయ్యడం, పిడిఎఫ్ ప్రతిగా మార్చడం వరకు సుదీర్ఘ ప్రక్రియ ఉంటుంది. ఆయా రంగాల్లో నిష్ణాతులైన వారి సలహాలు, పనిచేసేవారికి శిక్షణ వంటివన్నీ జరిగిన తర్వాతే ఈ కార్యక్రమం కొనసాగుతోంది. దాదాపుగా ఐదేళ్ళుగా ఈ బృహత్ప్రణాళిక ఆచరణలో ఉంది. ఇప్పటికి కోటి పుటలు, పత్రికలు స్కాన్ చేసి భద్రపరిచారు. దాదాపు రెండు లక్షల తెలుగు పుస్తకాలు స్కాన్ అయ్యాయి. రాబోయే సంవత్సరం అంతా స్కాన్ చేయడానికి సరిపోయే పుస్తకాలు సెంటర్‍లో నిలవ ఉన్నాయి. మొదట్లో పుస్తకాలు సేకరించే దశ నుంచి, ఇప్పుడు సుప్రసిద్ధ రచయితలు, వ్యక్తులు వ్యక్తిగత గ్రంథాలయాల గ్రంథాలన్నీ ఈ కేంద్రానికి తరలించి స్కానింగ్ కార్యక్రమం కొనసాగిస్తున్నారు. స్వచ్ఛందంగా తెలుగు సరస్వతికి ఈ రీతిగా సేవలందిస్తున్న మనసు ఫౌండేషన్‌కు తెలుగు భాషాభిమానులు కృతజ్ఞతలు చెప్పుకోవాలి.

మనసు ఫౌండేషన్ నెలకొల్పిన స్కానింగ్ సెంటర్.లో పనిచేసే యువతులు, వారికి సలహాలివ్వడానికి వచ్చిన కాశ్యప్(వికీపీడియా, నీలిరంగుటిషర్టులో)

రచయిత మరణించిన అరవై సంవత్సరాల వరకూ పుస్తకాల మీద రచయితకు, వారి వారసులకు హక్కులుంటాయి. కనక అటువంటి పుస్తకాల సాఫ్ట్ కాపీలను ఇవ్వడం కుదరకపోవచ్చు. కానీ కాపీరైట్ లేని పుస్తకాల కాపీలను జెన్యూన్‍గా అవసరమైన పరిశోధకులకు, పండితులకు మనసు ఫౌండేషన్ అందిస్తుంది. ఈ స్కానింగ్ కార్యక్రమం చేపట్టకపోయి ఉంటే, అనేక అపురూపమైన, అరుదైన పుస్తకాలు మనకు దక్కకుండా పోయేవి.

స్కానింగ్ సెంటర్‍

ఇంత దూరం ఎందుకు వివరణ ఇవ్వవలసి వచ్చిందంటే, ఇంత సాంకేతిక విప్లవం వచ్చిన తరువాత కూడా పుస్తకాలు అచ్చు వెయ్యాలా, డిజిటల్ కాపీలతో సరిపెట్టుకోవచ్చు కదా? అనే సంశయాన్ని రాయుడి గారితో నేను చర్చించాను. ఈ ప్రశ్నతో బాటు 1990 తర్వాత తెలుగువాళ్ళలో నవలలు చదవడం క్రమంగా ఎందుకు తగ్గిపోతూ వచ్చింది? అనే సమస్య కూడా మా చర్చలో వచ్చింది.

1960 ప్రాంతాల నుంచి 1990 వరకు ఆంధ్ర ప్రదేశ్‍లో పుస్తకాలు అరువిచ్చే లెండింగ్ లైబ్రరీలు, బుక్ షాపులు విరివిగా ఉండేవని, మధ్య తరగతి, కింది వర్గాల వాళ్ళు కూడా పావలా, బేడా అద్దె చెల్లించి పుస్తకాలు, పత్రికలు అద్దెకు తెచ్చుకుని చదివేవారని, క్రమంగా ఆ లైబ్రరీలు మూతపడడం కూడా మనలో పుస్తకాల పట్ల ఆసక్తి తగ్గడానికి కారణం కావచ్చని ఒక సమాధానం.

2007 ఫిబ్రవరిలో నా మొదటి పుస్తకం ‘ఇంగ్లీషు జర్నలిజంలో తొలి వెలుగు దంపూరు నరసయ్య’ పుస్తకం వేయి కాపీలు అచ్చు వేశాను. చాలా వరకు దేశంలోని జర్నలిస్టులు, కవులు, రచయితలకు పంచిపెట్టాను. బహుశా పదేళ్ళలో వంద కాపీలు మాత్రమే అమ్మగలిగాను. ఈ పుస్తకం మీద హిందూ, ఇండియా టుడే (తెలుగు) కూడా సమీక్షలు రాశాయి. అయినా పుస్తకాలు కొనేవాళ్ళు లేరు.

ఏడేళ్ళ తరువాత, నా పి.హెచ్.డి. థీసిస్ ‘వెంకటగిరి సంస్థాన చరిత్ర – సాహిత్యం’ పుస్తకం 300 కాపీలు అమ్మగలిగాను. అంటే పఠనాసక్తి, పుస్తకాల పట్ల అభిరుచి పెరిగిందేమోనని అనిపించింది. ఏమైనా నూరేళ్ళ క్రితం గురజాడ అన్నట్లు తెలుగు రచయిత తన పుస్తకాన్ని తానే ప్రచురించి అమ్ముకోవలసిన దుస్థితి మాత్రం మారలేదు.

ఇప్పుడు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యుట్యూబ్, ట్విటర్, వాట్సప్ వంటి అనేక రూపాల, మాధ్యమాల ద్వారా పత్రికలు, ఫొటోలు, పుస్తకాలు, వార్తలు భూగోళంలో ఎక్కడికైనా చేరిపోగలవు. టివిలో వార్తల కంటే ముందు వార్త అందరికీ చేరిపోయి ఉంటుంది. జూమ్ మీటింగ్‍లు, పాడ్‍కాస్ట్ వంటి సాధనాలు దీన్ని మరింత సులువు చేశాయి. 1990లో దూరప్రాంతాలకు ట్రంక్ కాల్ చేసి మాట్లాడడం ఎంత కష్టమైన పనో తలుచుకొంటే ఇప్పుడు నవ్వొస్తుంది. పదేళ్ళ క్రితం తీయబడ్డ ‘పొక్కిషం’లో ఈ కడగళ్ళన్నీ చక్కగా చూపించారు (సీతారామం సినిమాకి మూలం ఇదే).

అయితే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నా కొన్ని ఇబ్బందులు లేకపోలేదు. ఏ కారణం చేతైనా శాటిలైట్ నుంచి మన ఫోన్‍కో, గాడ్జెట్‌కు చేరే వరకు మధ్య అనేక దశలు మనకు తెలియనివి ఉంటాయి. 2005లో ఎయిర్ ఇండియా వారి వార్తా సాధనాలు ఏదో లోపం వల్ల భంగమై, మొత్తం విమాన ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడ్డారని ఎక్కడో చదివాను.

కరోనా వ్యాధి కాలంలో మొబైల్ ఫోన్లు, ఇతర ఆధునిక వార్తా ప్రసార సౌకర్యాలు లేకపోయి ఉంటే, జనాభాలో చాలామంది మానసిక వ్యాధుల బారిన పడేవారని అంటారు. సాంకేతిక విప్లవం, కొత్త కొత్త సాధనాలు అనివార్యం. అయితే వాటి కారణంగా పూర్వం ఉన్న అనేక సాధనలు, కళారూపాలు మాయమయిపోతాయా అనేది నా సదసత్సంశయం.

ఇంతకూ  రాయుడు గారు ‘నేను పుస్తకం అచ్చు వేయనా? లేక డిజిటల్ కాపీతో తృప్తి పడనా’ అని అడిగినప్పుడు స్పష్టమైన సమాధానం చెప్పలేదు.

బంగొరె (బండి గోపాలరెడ్డి) అనేవాడు, “అచ్చు పుస్తకం ఎప్పటికీ వాడుక లోంచి పోదు. దాని విలువ దానికి ఉంటుంది” అని. అప్పటికి ఈ సాంకేతిక విప్లవం ఇంకా రాలేదనుకోండి!

నా మటుకు (నేను 80 దాటిన వాణ్ణి) చక్కగా పుస్తకం చేతుల్లో పట్టుకుని ఏ చెట్టు మొదట్లోనో, పొలం గట్టుమీదో సహజ ప్రకృతి మధ్య ఏకాంతంగా పుస్తకం చదువుకోడానికి చాలా ఇష్టపడతాను. రచయిత సంతకం చేసి బహూకరించిన పుస్తకాలను అపురూపంగా, ఏదో ఒక అపూర్వ పురస్కారంగా దాచుకొని, దాన్ని చేతుల్లోకి తీసుకున్నపుడల్లా, ఆ విషయాలు గుర్తొచ్చి మురిసిపోతాను. డిజిటల్ కాపీల విషయంలో ఇటువంటి అనుభూతులు ఉండకపోవచ్చు. ఇది నా వ్యక్తిగత భావన.

అండమాన్, రస్సెల్ ద్వీపంలో ఏకాంతంగా గ్రంథపఠనంలో నిమగ్నమైన మహిళ

పసి వయసులోనే పిల్లకు పుస్తకాలు చదవడం అలవాటు చేయాలి. తల్లిదండ్రులే పిల్లలు పాఠ్యపుస్తకాలు తప్ప మరే పుస్తకాలు చదివినా చదువు పాడైపోతుందని, చదవనీయని పరిస్థితి ఒకవైపు, కార్పొరేట్ స్కూళ్ళవాళ్ళు పూర్తిగా మాతృభాషను నిరాదరిస్తూ ఇంగ్లీషులో సంభాషించడం, రాయడం ప్రోత్సహించడం ఒకటి. ఇప్పటి తరాల పిల్లలకు అనేక వ్యాపకాలు, సినిమా, టివి, క్రీడలు, కంప్యూటర్ గేమ్సు, బరువైన పాఠ్య పుస్తకాలు, ట్యూషన్లు – వీటితో సతమతమవుతూ పుస్తకాలు చదివే అవకాశం, సమయం కుంచించుకొని పోయింది.

మరొక అంశం పబ్లిక్ లైబ్రరీలు నామావశిష్టమయ్యాయి. ప్రభుత్వాలు అమ్మ భాషపట్ల శ్రద్ధ చూపకపోవడం కూడా ఇందుకు  కారణంకావచ్చు. ఇంటర్‌మీడియెట్లో తెలుగు బదులు సంస్కృతం చదివే అవకాశం, వెసులుబాటు పిల్లలకు కల్పించడంతో ప్రతి విద్యార్థి తెలుగు బదులు సంస్కృతం పేపరు తీసుకొంటాడు, వాళ్ళకు తెలుగూరాదు, సంస్కృతమూ రాదు.

ఒక్క మన తెలుగు రాష్ట్రాలలో తప్ప మరే రాష్ట్రంలోను అంగళ్ళ పేర్లు, ఆఫీసుల పేర్లు ఇంగ్లీషులో ఉండవు, మాతృభాషలో తప్ప. ఆఫీసుల పేర్లు తెలుగు, ఇంగ్లీషు భాషల్లో ఉంటే ఇబ్బంది లేదు. ప్రభుత్వం మాతృభాషలో వీధుల పేర్లు, షాపుల పేర్లు, ఆఫీసుల పేర్లు ఉండాలని ఎందుకు పట్టుపట్టదు?

తమిళనాడు, కర్నాటక, కేరళ, మహారాష్ట్రల్లో బోర్డులు వారివారి భాషల్లో ఉండడం గమనించాను, ఒక్క మన రాష్ట్రంలో మినహాయించి.

కరోనా సాకుతో పత్రికల సర్క్యులేషన్ మరింత పడిపోయింది, హిందూ వంటి పత్రికలు డిజిటల్ కాపీలకు చందా కట్టించుకొంటున్నాయి. అమెరికాలో 2005 నాటికే వాషింగ్టన్ పోస్టు, న్యూయార్క్ టైమ్సు సర్క్యులేషన్ పడిపోయి, ఉదారులైన సంపన్నుల అండతో కొనసాగుతున్నాయి.

ఇప్పట్లో తెలుగు భాషకేమీ ప్రమాదం రాకపోవచ్చు, కాని ప్రొఫెసర్ పెగ్గిమోహన్ తన పుస్తకంలో పేర్కొన్నట్లు తెలుగు పరిస్థితి ఇట్లానే ఉంటే మృతభాషల జాబితాలోకి చేరిపోవచ్చు. ఒక్క తరం మాతృభాషలో వ్యవహరించడం మానేస్తే ఏభాషైనా వాడుకలోంచి తొలగిపోతుంది.

కటిక చీకట్లో కాంతిరేఖ సెల్‌ఫోనులు, వాట్సప్, ఫేస్‌బుక్ లలో తెలుగు వాడుక కొంచంకొంచంగా పెరుగుతున్నట్లు అంటారు, కాదు వృద్ధులు మాత్రమే పై సాధనాలలో తెలుగు వాడుతున్నారని కొందరు. ఏమైనా ఇట్లానైనా తెలుగులో టైపుచెయ్యడం, చదవడం సాగుతోందని సంతోషించవలసినదే.

Exit mobile version