జ్ఞాపకాల తరంగిణి-71

1
2

నా ఆటోగ్రాఫ్ బుక్

[dropcap]“తా[/dropcap]తయ్యా! మీకో బహుమతి” అంటూ మా మనమడు పుస్తకం చేతుల్లో పెట్టి వెళ్ళాడు. కళ్ళద్దాలు సరిచేసుకొని పరామర్శించి చూస్తే, అది అరవై ఏళ్ళనాటి నా ఆటోగ్రాఫ్ పుస్తకం, నా ముఖం మాదిరే అదీ ముడతలు పడి పాతదై ముట్టుకుంటే పొడైపోయేట్లుంది. 1960లో అనుకొంటా ఎంతో ముచ్చటపడి కొన్న పుస్తకం! జాగ్రత్తగా ఒక్కొక్క పేజీ తిప్పి చూస్తున్నా. ఆనాటి విశేషాలు, ఒక్కో ఆటోగ్రాఫ్ తీసుకోవడం వెనక చరిత్ర, నా తపన అన్నీ గుర్తుకొస్తున్నాయి.

మొదటి సంతకం మహానటులు గుమ్మడి గారిది. సాంస్కృతికోత్సవాల సందర్భంగా ఆయన వి.ఆర్.కాలేజీలో ఉపన్యసించారు. ఆటోగ్రాఫ్ కోసం స్టేజి వద్దకు వెళ్ళటానికి పోలీసులు ఎవరినీ వెళ్లనివ్వలేదు. ప్రోగ్రామ్ ముగిసిన తర్వాత ఆయన వెళ్లిపోయారు. చాలా నిరాశ, ఇంతలో కళాశాల ఎదురుగా ఉన్న సినిమా హాల్లో, వారు నటించిన సినిమాకు వెళ్తారని విని, పట్టువదలని విక్రమార్కుడిలా భోజనం గీజనం ఏమీ లేకుండానే రెండో ఆటకు టికెట్టు కొని హాల్లో కూర్చుని, ఇంటర్‍వెల్‍లో ఆయన వద్దకు వెళ్ళి ఆటోగ్రాఫ్ పుస్తకం ముందు పెట్టాను. ఆయన చిరునవ్వుతో సంతకం చేసి నవ్వుతూ భుజం తట్టి పంపారు.

మా కళాశాలలో వావిలాల గోపాలకృష్ణయ్యగారు ఉపన్యసించారు సాంస్కృతికోత్సవాల సందర్భంగానే. కష్టపడి చదివిన విద్యార్థులకు ఎప్పుడూ ఫలితం ఉంటుందని ఒకటి రెండు చోట్ల బంధుప్రీతి తోనో, మరొక కారణం వల్లో మెరిట్ ఉన్న వ్యక్తికి ఉద్యోగం రాకపోయినా, ఎప్పుడూ అట్లాగే జరగదని, మెరిట్ ఉన్న విద్యార్థులు తప్పక విజయం సాధిస్తారని వావిలాల ఉపన్యాసంలో అన్నారు. ఆ మాటలు విద్యార్థులకు బాగా నచ్చాయి. కోరగానే వారు నా ఆటోగ్రాఫ్ పుస్తకంలో రాసిచ్చారు. అయ్యదేవర కాళేశ్వరరావు గారు (స్పీకరు) కూడా ‘Love India’ అని రాసి సంతకం పెట్టి ఇచ్చారు. ఆ రోజుల్లో మా కళాశాలకు ఇటువంటి మహనీయులను ఆహ్వానించడం పరిపాటి. మా కళాశాలకు జగ్గయ్య, ప్రత్యగాత్మ వంటి వారెందరో వచ్చారు. వారి ఆటోగ్రాఫ్‍లు నా పుస్తకంలో ఉన్నాయి.

శ్రీ కొంగర జగ్గయ్య సంతకం

స్థానం నరసింహారావుగారి సంతకం నా ఆటోగ్రాఫ్ పుస్తకంలో ఉంది. 1963 అక్టోబరు 6న నెల్లూరు టౌన్ హాల్లో స్థానం వారికి సన్మానం జరిగింది, సందర్భం ఏమిటో గుర్తు లేకపోయినా. ఆ రోజు ఆయన అయిదు నిమిషాలు పురుష వేషంలోనే రంగస్థలంపై అభినయించారు. సత్యభామ కులుకు నడక, అందంగా, హుందాగా రంగస్థలంపై అటూ ఇటూ నడవడం గుర్తుండిపోయింది. ఆ సందర్భంగా వారు ఆటోగ్రాఫ్ ఇచ్చారు.

స్థానం నరసింహారావు గారి సంతకం

స్థానం వారికి నెల్లూరుతో సంబంధం ఈనాటిది కాదు. పొణకా కనకమ్మ కస్తూరిదేవి బాలికా విద్యాలయం నెలకొల్పి, విద్యాలయం సహాయార్థం ఆంధ్ర దేశంలోనూ, ఇతర ప్రదేశాలలో ఏర్పాటు చేసిన నాటకాలలో స్థానం వారు స్వచ్ఛందంగా నటించి కనకమ్మకు సహాయపడ్డారు. 1956లో విద్యాలయం సహాయార్థం ‘సారంగధర’ టౌన్ హాలులో నాటకం ప్రదర్శించబడింది. స్థానం వారికి ఆ ఏడే ‘పద్మశ్రీ’ పురస్కారం లభించింది. వారికి కనకమ్మ చాలా ఘనంగా సన్మానం జరిపించారు. సన్మానానికి సమాధానం చెబుతూ తన వద్ద ‘పద్మ ఉంది కానీ ‘శ్రీ లేద’ని చమత్కారంగా మాట్లాడారు. ఎస్.ఎస్.ఎల్.సి. చదివే విద్యార్థులం చాలామంది ఆ సభకు వెళ్ళాము. ఆ రోజుల్లో నెల్లూరు టౌన్ హాల్‍లో జరిగే సభలకు విద్యార్థులు హాజరయ్యే వాళ్లు. సినిమా తర్వాత, మాకు టౌన్ హాల్ సభలు, నాటకాలే వినోదాలు.

వి.ఆర్. కాలేజీలో చదువుతున్నాము. 1962లో చైనా దురాక్రమణ, యుద్ధం వల్ల, కళాశాలల్లో యువతీయువకులందరికీ NCC తప్పనిసరి చేశారు. శని, ఆదివారాలు కళాశాల మైదానంలో NCC విద్యార్థుల కవాతులతో కోలాహలంగా ఉండేది. మధ్య మధ్య విరామ సమయంలో విద్యార్థులు, అధ్యాపకులు, ఆఫీసర్లు ట్రాన్సిస్టర్ల వద్ద మూగి వార్తలు నిశ్శబ్దంగా వినేది. మాకు బుధ్‌సింగ్ అనే ఏభై ఏళ్ళ జూనియర్ కమీషన్డ్ ఆఫీసరు కవాతు నేర్పించేవారు శ్రద్ధగా. ఒకరోజు విరామ సమయంలో అందరం ఫలహారం చేస్తూ మౌనంగా వార్తలు వింటున్నాం. బుధ్‌సింగ్ గారు కూడా మా వద్ద నిలబడి వార్తలు వింటున్నారు. లదాక్ లోనో, నీఫా లోనో చైనా సైనికులు క్రొత్తగా ఆక్రమించుకున్న కీలక ప్రదేశాల పేర్లను వార్తల్లో చెబుతున్నారు. బుధ్‌సింగ్ చలించిపోయారు. ఆయన కళ్ళల్లో ధారగా కన్నీళ్ళు. ఆయన చాలా కాలం పనిచేసిన సైనిక స్థావరం శత్రువుల చేతికి చిక్కిందట! ఆయనని విద్యార్థులం ఎంతో గౌరవించేవాళ్ళం. అటువంటి అకళంక దేశభక్తుల ఆటోగ్రాఫ్ కూడా నా పుస్తకంలో ఉంది.

బి.ఎన్.రెడ్డి, కె.వి. రెడ్డి గార్ల సినిమాలంటే మోజు చిన్నప్పటి నుంచి. వారి సినిమాలు ఎన్నిసార్లు చూశానో! 1965లో బి.ఎన్.రెడ్డి గారు నెల్లూరులో ఏదో సభలో పాల్గొన్న సందర్భంలో వారి ఆటోగ్రాఫ్ తీసుకున్నాను. ఆయనను 1961లో నెల్లూరు కోఆపరేటివ్ బ్యాంకు మేడ మీది సభాభవనంలో కె.వి.ఆర్. ‘కవికోకిల’ ఆవిష్కరణ సభలో మొదటిసారి చూశాను. దువ్వూరు రామిరెడ్డి గారు తన వద్దకు (మద్రాసు) వచ్చినప్పుడల్లా ఒక నేయి దబరకు చిక్కం కట్టి తెచ్చేవారని గుర్తు చేసుకొన్నారు. ఆ సందర్భంలోనే దమయంతి సినిమాకు కవికోకిల స్క్రిప్టు రాసిన సంగతి ప్రస్తావిస్తూ, తల్పం మీద కనిపించిన నల్లటి నిడుపాటి తల వెంట్రుకను చూసి ఆ సుందరి ఎంత అందంగా ఉంటుందో స్ఫురింపజేసే ఒక దృశ్యం స్క్రిప్ట్ రాశారట! సినిమాలలో అలా నిడుపైన కేశాన్ని చూపించలేమని (సినిమా మీడియంలో సాధ్యం కాదని) దాన్ని మార్పించినట్లు సరదాగా అన్నారు బి.ఎన్. గారు.

చాలా సంవత్సరాల తర్వాత నేదురుమల్లి జనార్దన రెడ్డి గారు అమెరికా వెళ్తున్నప్పుడు వీడ్కోలు ఇవ్వడానికి (1971?) మరుపూరు కోదండరామరెడ్ది, పెన్నేపల్లి గోపాలకృష్ణ, మరికొందరు మిత్రులతో కలిసి మద్రాసు వెళ్ళాను. విమానాశ్రయం వద్ద కలిసిన బి.ఎన్.రెడ్డి గారు మమ్మల్ని తమ కారులోనే మా హోటల్ వద్ద దింపుతామని వెంట తీసుకొని వెళ్ళారు. మొదట తమ ఇంటికి తీసుకుని వెళ్ళి కాసేపు మాట్లాడి, హోటల్లో దిగబెట్టమని కారు పంపించారు. ఆ రోజే వారింట్లో వారికి లభించిన పురస్కారాలు, అవార్డులు, బహుమతులు వివరంగా చూచే అవకాశం లభించింది.

యవ్వనంలో ఏకాంత ప్రదేశంలో కూర్చుని కృష్ణపక్ష గీతాలు చదివి మౌనంగా నిట్టూర్పులు విడవడం మరచిపోలేదు. 1976 ప్రాంతాల్లో కాబోలు నెల్లూరులో వర్ధమాన సమాజం నిర్వహించిన కవిత్రయ జయంతుల్లో పాల్గొనడానికి దేవులపల్లి కృష్ణశాస్త్రి దంపతులు వచ్చారు. తిక్కవరఫు రామిరెడ్డి గారి అల్లుడు బెజవాడ గోపాలరెడ్డిగారు తమ బంగళా సుదర్శన మహల్ లో కృష్ణశాస్త్రి దంపతులకు ఆతిథ్యం ఇచ్చినట్లు ఉంది. వారు రాసుకొచ్చిన ఉపన్యాసం ఎవరు చదివి వినిపించారో నాకు గుర్తు లేదు. ఆ దంపతులను సభ అయిన తరువాత సుదర్శనమహల్‍లో విడిచిపెట్టి రావడం నా బాధ్యత. సెలవు తీసుకుంటూ ఆటోగ్రాఫ్ పుస్తకం వారి ముందుంచాను. “నేను లేకపోయినా నన్ను మరిచిపోవు గదూ!” అని రాశారు.

శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి సంతకం

1966-76 నెల్లూరులో కర్నాటక సంగీతానికి గొప్ప రోజులు. ఒక వైపు పండితారాధ్యుల సాంబమూర్తి గారు ఏటా త్యాగరాజ ఆరాధనోత్సవాలు పెద్ద ఎత్తున జరిపేవారు. బాలమురళి, శ్రీరంగం గోపాలరత్నం వంటి ఎందరెందరో మహా కళాకారుల గానం వినే అదృష్టం నెల్లూరీయులకు దక్కింది. ఆ రోజుల్లోనే కొందరు కళాభిమానులు నెల్లూరులో ఒక సాంస్కృతిక సంస్థ నెలకొల్పి ఆ వేదిక మీద సాంస్కృతిక కార్యక్రమాలు, చిట్టిబాబు వంటి వైణికుల కచ్చేరీలు ఏర్పాటు చేశారు. ఈ సందడిలోనే నెల్లూరు మూలపేటలోని వేణుగోపాలస్వామి దేవాలయం ఉత్సవాలను పురస్కరించుకుని వారం రోజులు గొప్ప సంగీత విద్వాంసుల కచేరీలు, భరతనాట్యం ప్రదర్శనలు నిర్వాహకులు జరిపారు! ఓహో! ఎంత గొప్ప రోజులు!

వేణుగోపాల స్వామి ఆలయంలో ఒక సాయంత్రం బాలచందర్ గారి వీణ కచేరి జరిగింది. ఆయన వీణావాదనలో గొప్ప ప్రయోగాలు చేశారని సంగీతంతో పరిచయమున్న శ్రోతలందంరూ ఆ రోజు తెగ మెచ్చుకొన్నారు. బాలచందర్‍ కొంచెం ముక్కోపి అని అనిపించింది. ఎవరో కచ్చేరిని రికార్డు చేస్తున్నట్లు తెలిసి అర్థాంతరంగా కచేరి ఆపేశారు. నిర్వాహకులు క్షమాపణలు చెప్పుకున్న తర్వాతే ఆయన కచ్చేరి కొనసాగించారు. అభిమానులకు మాత్రం సంతోషంగా ఆయన ఆటోగ్రాఫులు ఇచ్చారు. వీణ ఆకృతిలో చేసిన చేవ్రాలు ఎంత ముచ్చటగా ఉందో!

నా ఆటోగ్రాఫ్ పుస్తకంలో చాలా గొప్ప, ప్రసిద్ధుల చేవ్రాళ్ళున్నాయి, వాటన్నిటిని గురించి ఇక్కడ చెప్పడం లేదు. వి.వి.గిరిగారు ఉపాధ్యాక్షుల హోదాలో నెల్లూరు వస్తున్నారని, ఆ కార్యక్రమాన్ని ఆయన వియ్యంకులు పద్మభూషణ్ వెన్నెలకంటి రాఘవయ్య ఏర్పాటు చేస్తున్నారని విని, మా ‘మదన మోహన మాళవీయ మండలి’ విశేష సంచికను వారిచేత సభలో ఆవిష్కరించుకోవాలని అనుకొన్నాము. మా మండలి అధ్యక్షులు, వి.ఆర్. కళాశాల తెలుగు హెడ్ పోలూరి హనుమజ్జానకీరామశర్మ గారు. రాఘవయ్య గారు ఇప్పుడు వీలు పడదని, నెల్లూరులో జరిగే మరో సభలోనే మా సంచికను గిరి గారి చేత ఆవిష్కరింప జేసుకోమని చెప్పి పంపించి వేశారు. అప్పుడు మాలో ఒకరు ఏ. సి. సుబ్బారెడ్డి గారి సహాయం తీసుకొందామని సూచించగానే, మేము వారింటికి వెళ్ళి విషయం చెప్పగానే వారు ఫోన్ చేసి గిరిగారితో మాట్లాడి మా కార్యక్రమానికి గిరిగారు వచ్చేట్లు చేశారు. ఇది జరిగింది 1963లో (?)  కావచ్చు. టౌన్ హాల్లోనే మా ఆవిష్కరణ సభ జరిగింది. బాలు (సినీ పాటల బాలసుబ్రహ్మణ్యం) మా ఫంక్షన్‍కు ఫొటోగ్రాఫర్. ఎవరినో అడిగి కెమెరా తెచ్చాడు. సభ వైభవంగా జరిగింది. సభ చివరిలో నేను (కార్యదర్శిని) గిరిగారి ఆటోగ్రాఫ్ కోసం సమీపిస్తుంటే ఆయన బాడీగార్డు వెళ్ళనివ్వలేదు. “He is a boy”, అతన్ని వదలండని ఆటోగ్రాఫ్ చేసి పంపారు.

శ్రీ వి.వి.గిరి సంతకం

ఆటోగ్రాఫ్ పుస్తకం పుటలు మెల్లగా తిప్పి చూస్తున్నా. ఒక పుటవద్ద ఆగిపోయాను. అది నా జీవితంలో చిరస్మరణీయమైన రోజు. 1971 సెప్టెంబరు 3వ తారీకున ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నా పి.హెచ్.డి. ‘వైవా’ జరిగింది. తెలుగుశాఖ అధిపతి గదిలో వైవా నిర్వహించారు. నా గైడ్ ప్రొఫెసర్ బిరుదురాజు రామరాజు గారు, ప్రొఫెసర్ జి.ఎన్.రెడ్డి గారు, ప్రొఫెసర్ ఎస్.వి.జోగారావు గారు వైవా నిర్వహించారు. ప్రశ్నలన్నీ ఎస్.వి. జోగారావు గారే అడిగారు. సమాధానాలు చెబుతున్నా. ఎంతో స్నేహపూరిత వాతావరణంలో వైవా జరుగుతోంది. ఇంతలో తలుపు తెరిచి తల లోపలికి పెట్టి “రావచ్చా?” అని ప్రొఫెసర్ గంటి జోగి సోమయాజి గారు అన్నారు. రామరాజు గారు లేచి వారిని ఆహ్వానించి సాదరంగా కూర్చోబెట్టారు. వైవా అరగంటలో పూర్తయింది. జి.ఎన్.రెడ్డి గారు “కంగ్రాట్సు” చెప్పారు. రామరాజు గారు నన్ను పక్కకి పిలిచి “టీ తెప్పించడం మరిచిపోయావా?” అన్నారు. హడావిడిగా గది వెలుపలకి వచ్చి డిపార్ట్‌మెంట్ అటెండర్ చేతిలో పది రూపాయలుంచి, టీ తెమ్మన్నా. టీ బిస్కెట్లు వచ్చాయి. అందరూ టీ సేవిస్తున్నప్పుడు ఆటోగ్రాఫ్ పుస్తకం తీసి మొదట జి.ఎన్.రెడ్డి గారిని అడిగాను. “పురుషోత్తం, నువ్విప్పుడు ఆటోగ్రాఫ్‍ల కోసం వెంటపడే విద్యార్థివి కావు” అని నవ్వుతూ ఆటోగ్రాఫ్ చేశారు. జోగారావు గారు, సోమయాజి గారు ఆటోగ్రాఫ్ ఇచ్చారు. జి.ఎన్.రెడ్డిగారు అనంతపురం పి.జి.సెంటర్‍లో చేరమని, సహాయం చేస్తానని అన్నారు కాని నేనే వెళ్ళలేదు. రామరాజు గారు కూడా నూతనంగా ఏర్పాటవుతున్న ఒక విశ్వవిద్యాలయంలో నాకు అవకాశం కల్పించారు గాని, నేను అందుకూ ఇష్టపడక స్వచ్ఛందంగా నెల్లూరు ఉద్యోగాన్నే వరించాను.

శ్రీ గంటి జోగి సోమయాజి సంతకం
శ్రీ ఎస్.వి. జోగారావు సంతకం

ఈ స్మృతులలో మరొకటి మాత్రం చెప్పి విరమిస్తాను. మదర్ థెరిస్సా ఊరు పేరు లేని సాధారణ సేవికగా నెల్లూరు వచ్చి అనాథాశ్రమం ‘నిర్మల హృదయ సదన్’ ఏర్పాటు చేశారు. స్థానిక బిషప్ తుమ్మ శౌరిగారు ఏడాదిలో భవనం నిర్మించి ఇచ్చారు. అప్పుడు (1976లో కాబోలు) నెల్లూరు జిల్లా కలెక్టరు అర్జునరావు గారు నెల్లూరు మునిసిపాలిటీ ఆఫీసు ప్రాంగణంలో ఆమెకు పౌరసన్మానం ఏర్పాటు చేశారు. ఆమె ముక్తసరిగా రెండు మాటలు మాత్రం సమాధానంగా చెప్పి విరమించారు. ఆనాటి ఇంగ్లీషు సన్మానపత్రం రాసింది మా మిత్రులు, వి.ఆర్. కళాశాల చరిత్ర అధ్యాపకులు డా. సి.వి. రామచంద్రరావు. ఇప్పటికీ నెల్లూరు నిర్మల హృదయ సదన్ ఆఫీసు గదిలో గోడకు ఆ సన్మాన పత్రం వ్రేలాడుతోంది.

ఆ మరుసటి రోజు జమీన్ రైతు వారపత్రికలో పని చేస్తున్న పెన్నేపల్లి గోపాలకృష్ణ వెంట నిర్మల హృదయ సదన్‍కు వెళ్ళి ఆమెను కలుసుకున్నా. నా మిత్రుడు జమీన్ రైతు పత్రిక ద్వారా ఆ సంస్థకు కొంత ప్రచారం, విరాళాలు వచ్చేట్లు చేశాడు. ఆ రోజు ఆమెను దగ్గరగా చూచి వివశుణ్ణయిపోయాను. నా పరిస్థితి గమనించి నా మిత్రుడు నన్ను హెచ్చరించాడు, ఆమె చూడకుండా. వచ్చేప్పుడు ఆమెను ఆటోగ్రాఫ్ అడిగి తీసుకొన్నా. “God bless you, love others as he loves you. God bless you” అని రాసి సంతకం పెట్టారు.

మదర్ థెరెసా సంతకం

ఆ రాత్రి 10 గంటలప్పుడు నెల్లూరులో ఉషా స్టూడియో అధిపతి కె.కృష్ణమూర్తి కలిస్తే – మదర్‍ను దర్శించిన విషయం చెప్పాను. అతను వెంటనే రిక్షా మాట్లాడి ఎక్కమన్నాడు. రాత్రి పొద్దుపోయింది. కొనడానికి ఏమీ లేవు. ఒక బంకులో ఉన్న బిస్కట్లన్నీ కొని పొట్లం కట్టించాడు కృష్ణమూర్తి. దాదాపు నాలుగు మైళ్లు. నిర్మల హృదయ సదన్‍కు చేరే సరికి లోపల దీపాలన్నీ ఆర్పి ఉన్నాయి. వాచ్‌మాన్ తాళం తీశాడు. వరండాలో ఒక సేవిక మమ్మల్ని చూసి “అమ్మ విశ్రాంతి తీసుకొంటున్నారు. రేపు ఉదయం రండి” అంటున్నారు. అంతలోనే ఆమె గది తలుపులు తీసుకొని మా వద్దకు వచ్చారు. మిత్రుడు ఆ బిస్కట్ల పొట్లాం ఆమె చేతిలో పెట్టి నమస్కరించి, సెలవు తీసుకున్నాడు. అట్లా ఆ రోజే ఆమెను మరొక పర్యాయం దర్శించాను.

ఆమె – మదర్ రైలెక్కుతున్నప్పుడు నెల్లూరు జర్నలిస్టులు చాలామంది వీడ్కోలు పలకడానికి వెళ్ళారు. “దయచేసి నిర్మల హృదయ సదన్‍కు సహకరించండి” (Please take care of Nirmala Hridaya Sadan) అని మాత్రమే ఆమె సందేశం ఇచ్చారు!

1961లో వి.ఆర్. కళాశాలలో శ్రీలంక హీనయాన బౌద్ధ భిక్షువు ‘విశాలాక్ష’ ఉపన్యసించారు. సభ ముగిసిన తర్వాత వారిని ఆటోగ్రాఫ్ అడిగాను. “ఆటోగ్రాఫ్ ఎందుకోసం” అని ఆయన ఇంగ్లీషులో ప్రశ్నించినపుడు సమాధానం చెప్పకుండా మౌనంగా నిలబడ్డా. “Time is the destroyer of all compounded things, be diligent” అని రాసి ఆటోగ్రాఫ్ చేశారు.

విశాలాక్ష గారి సంతకం

వారి హెచ్చరికలో అంతరార్థం చాలా ఆలస్యంగా గ్రహించానేమో!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here