[box type=’note’ fontsize=’16’] జీవితంలోని వివిధ దశలలో తనకు కలిగిన విశేష అనుభవాలను సంచిక పాఠకులతో పంచుకుంటున్నారు డా॥ కాళిదాసు పురుషోత్తం. [/box]
అట్లతదియ ఉయ్యాలలు
[dropcap]నె[/dropcap]ల్లూరులో ఏ. సి. సుబ్బారెడ్డి గారి విగ్రహం వున్న వీధిని ఆర్. ఆర్. స్ట్రీట్ అంటారు. ఆ వీధికి స్వాతంత్ర్య సమర యోధులు రాళ్లపల్లి రామసుబ్బయ్యగారి పేరు పెట్టారు. రామసుబ్బయ్య త్యాగధనులు. పొణకా కనకమ్మ నెలకొల్పిన శ్రీ కస్తూరిదేవి విద్యాలయంలో ప్రధాన అధ్యాపకులుగా చేశారు. ఆర్. ఆర్ స్ట్రీట్‌ను ఆనుకొని ఉయ్యాల కాలువ అనే పంట కాలువ ప్రవహించేది. నగరం విస్తరించి విస్తరించి పంట పొలాలను కాంక్రీట్ జంగిల్‌గా మార్చివేసింది. 1850 ప్రాంతాలలో ఈ ఉయ్యాల కాలువ గట్టున మహావృక్షాలుండేవి. అట్లతద్దె రోజున ఆడపిల్లలు ఇక్కడ చెట్లకు వుయ్యాలలు, కట్టి వూగే సంప్రదాయం వల్ల కాలువకు ‘ఉయ్యాల కాలువ’ అనే పేరు వచ్చింది. మహిళా జనాన్ని చూడడానికి అసాంఘిక శక్తులు అక్కడ గుమిగూడి అల్లర్లు చేయడంతో బ్రిటిష్ ప్రభుత్వం ఈ కాలువ వద్ద ఉయ్యాలలూగే వినోదాన్ని నిషేధించింది కానీ కాలువకీపేరు మాత్రం నిలిచిపోయింది. ‘వయాలి’ అనే ముస్లిం పేరుతో వుయ్యాల కాలువ వాడుకలోకి వచ్చిందని పొరపాటు అభిప్రాయం ప్రచారంలో వుంది.
నెల్లూరులో వైద్యం
మా చిన్నతనంలో ఈ కాలువ దక్షిణం గట్టు వైపు చక్కిరాలవారి ఇల్లు, ఇంట్లోనే మందులు షాపు వుండేది. ఇదిగాక ట్రంకు రోడ్డులో ‘రవి’ మందులషాపు ఈ రెండే ఇంగ్లీషు మందులమ్మే షాపులు. ఎప్పుడూ కొంచెం రద్దీగా ఉండేవి. నేను 12 సంవత్సరాల వయసులో రవి మందుల షాపులో మందులు కొన్నా. చిల్లర ఇవ్వలేదని, వేచివుండి అడిగా. చిల్లర ఇచ్చారు. చిల్లర చేతిలో పెట్టుకున్నా. దారిలో చూస్తే జోబీలో కూడా వారిచ్చిన చిల్లర నాణాలు వున్నాయి. పొరపాటుగా రెండో మారు చిల్లర తీసుకున్నానని రోడ్డు పక్కన దిక్కులు చూస్తూ ఏమి చెయ్యాలో తోచక నిలబడి వున్నా. కొత్తగా మా చిన్నక్క పెళ్లయింది. బావగారికి నెల్లూరు పోస్టాఫీసులో వుద్యోగం, ఆ దారిన పోతూ నా వద్దకు వచ్చి విచారించారు. ఆయన “ఇంటికి వెళ్లు, ఏమీ కాదు ఇక మీద జాగ్రత్తగా వుండు” అని నచ్చ చెప్పారు. జీవితంలో అదొక పాఠం.
ఆయుర్వేద వైద్యం
మా నాయన ఆయుర్వేద వైద్యం చేసేవారు. స్వయంగా మందులు కూడా తయారు చేసేవారు కాని వైద్యాన్ని వృత్తిగా స్వీకరించలేదు. నాకు ఊహ తెలిసే నాటికి నెల్లూరులో జిల్లాబోర్డు వారిదో, మునిసిపాలిటీ వారదో ఆయుర్వేద వైద్యశాల, చింతలూరు, పెరిదేపి మందుల షాపులు ఉన్నాయి. 1894 ప్రాంతంలో పళ్లె చెంచలరావు ఆహ్వానం మీద చక్రవర్తుల శ్రీనివాసయ్యంగారనే వైద్యులు బెంగుళూరు నుంచి నెల్లూరు వచ్చి ‘కర్ణాటక ఆయుర్వేద వైద్యశాల’ ప్రారంభించారు. శ్యామయ్యంగారు కూడా ఆరోజుల్లో ప్రసిద్ధులు. వేదం వెంకటరాయశాస్త్రి వీరివద్ద మందులు తెచ్చుకొన్నారు. వీరు నెలకొల్పిన వైద్యశాల మునిసిపాలిటి వారి పోషణలో శ్యామయ్యంగారి వైద్యశాల పేరుతో నెల్లూరు మూలపేటలో చాలాకాలం కొనసాగింది. డాక్టర్ పులుగుండ్ల మధుసూదనశాస్త్రి M.S గారి తండ్రి నరసింహశాస్త్రి గారు రాజవీధిలో సొంత ఇంట్లో చాలాకాలం ఆయుర్వేద వైద్యశాల సాగించారు. వీరు మా తండ్రిగారికి మిత్రులు కూడా. నరసింహశాస్ర్తి వద్ద రామస్వామి అనే తుమ్మగుంట బ్రాహ్మణులు మందులు పొట్లాలు కట్టి ఇవ్వడం ఆసవాలు, అరిష్టాలు సీసాల్లో పోసి ఇవ్వడం వంటి పనులు చేస్తూ కాంపౌండరుగా మంచిపేరు తెచ్చుకున్నారు. రామస్వామి హస్తవాసి మంచిదని, అందువల్ల అతని చేతుల మీదుగా మందులు ఇప్పించేవారని ఆ రోజుల్లో అనుకునేవారు. నరసింహశాస్త్రిగారు ‘స్వస్థవృత్తము’ శీర్షికతో ఆరోగ్య సూత్రాలనూ, రోగాలూ, నివారణమీద వారంవారం జమీన్ రైతు పత్రికలో పద్యాలు రాశారు. ఆ పద్యాలన్నీ ఎత్తిరాసి ఇచ్చాను. వారి కుమారులు మధుసుదనశాస్త్రిగారు తండ్రిగారి రచనను పుస్తకరూపంలో తెచ్చారు. మధుసూదనశాస్త్రిగారు గుంటూరు వైద్యకళాశాలలో, ఎం, ఎస్ పాసై నెల్లూరులో గొప్ప సర్జన్‌గా పేరు తెచ్చుకున్నారు. వీరి ఇద్దరబ్బాయిలు, కుమార్తె కూడా మంచి వైద్యులుగా పేరు తెచ్చుకున్నారు. ఆ రోజుల్లో ఏటూరి శ్రీనివాసాచార్యులు, నేలనూతల బలరామయ్య కూడా ఆయుర్వేద వైద్యులుగా సేవలందించారు. 1950 నాటికి నెల్లూరులో కేసరి గురుమూర్తిశాస్త్రి అనే ఆయుర్వేద వైద్యులు ప్రసిద్ధులు. వీరు వడ్డీ వ్యాపారం కూడా చేసేవారు. వీరిల్లు తిప్పరాజు సత్రం వద్ద, గోడ పత్రిక ‘నగర జ్యోతి’ ఎదురు సందులో వుండేది.
ఇంగ్లీషు వైద్యులు
1950కి బాగా ప్రసిద్ధులైన ఇంగ్లీషు వైద్యులు డాక్టర్ మాత్చ్యూస్, డాక్టర్ జి. నరసింహం, డాక్టర్ అల్లాడి అనంతనారాయణ, డాక్టర్ ప్రకాశరావు, డాక్టర్ అల్లాడి మహాదేవయ్య, డాక్టర్ లక్ష్మి, డాక్టర్ రఘునాథసింగ్, డాక్టర్ పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి(రాం) ప్రభృతులు.
1950 నాటికే డాక్టర్ జి. నరసింహం ప్రసిద్ధ వైద్యులు. నెల్లూరు కోఆపరేటివ్ బ్యాంకు ఎదురు సందులో వారు ప్రాక్టీసు చేసేవారు. ఆపరేషన్లు చేయడంతో పేరుపొందిన వారు. నెల్లూరు సుప్రసిద్ధ క్రిమినల్ ప్రాక్టీసు చేసిన వి అనంతరామయ్య గారు కూడా 1953 ప్రాంతాల్లో మధ్యతరగతి కుటుబాలకు అందుబాటులో ఉన్న డాక్టరు. మా అక్కయ్యలు గర్భిణిలైనా వారి వద్దే పరీక్షలు చేయించుకొని వైద్యం చేయించుకొనేవారు. చాలా సౌజన్యమూర్తి.
నెల్లూరు వి. ఆర్. కళాశాల ప్రిన్సిపాల్ గా తర్కశాస్ర్త అధ్యాపకులు రాఘవన్ పనిచేశారు. వీరి మేనల్లుడు సంపత్ I.A.S. అయి, నెల్లూరు జిల్లాకు కలెక్టరుగా వచ్చారు. రాఘవన్ గారి తర్వాత, కాకినాడ నుంచి సచ్చిదానంద పిళ్లెను ప్రిన్సిపాల్‌గా తెచ్చారు. వీరి అర్థాంగి డాక్టర్ లక్ష్మి దయామయిగా, గొప్ప వైద్యులుగా కీర్తిగడించారు. 1953 ప్రాంతాల్లో ఈ దంపతులు మా వీధిలో బాడుగ ఇంట్లో వున్నారు. లక్ష్మి డాక్టరు ఇళ్లకు వెళ్ళి కాన్పులు చేసేవారు. ఆమె శుభ్రమైన, ఉతికిన తెల్లని దుప్పట్లు మాత్రం మంచం మీద పరచమని చెప్పేవారు. ఆమె వెంట మేరి అనే నలభై ఏళ్ల నర్సు వుండేది. మేరి తర్వాత కాలంలో మంత్రసానిగా పేరుతెచ్చుకుంది. లక్ష్మీ డాక్టర్ చూడడానికి కవయిత్రి, జాతీయ నాయకురాలు సరోజినీనాయుడు లాగా అనిపించేది. ఆమె తర్వాత వి.ఆర్.కాలేజీకి దగ్గరగా చాకలి వీధిలో ఉంటూ, నర్సింగ్ హోం నిర్వహించారు. ఒక సాయంత్రం చీకటి పడిన తర్వాత చిన్న పిల్లవాణ్ణి అత్యవసరంగా వైద్య కోసం ఆమె ఇంటికి తీసుకుని వెళ్లాము. ఇంట్లో విద్యుత్తు పోతే, వీధిదీపం కింద నిలబెట్టి ఇంజక్షన్ చేశారు. డాక్టరమ్మకు ఒక్కడే కుమారుడు, ఒక ఆంగ్లో ఇండియన్ బాలుణ్ణి పెంచుకున్నారు. ఈ దంపతులు సత్యసాయి బాబా భక్తులై పుట్టపర్తిలో స్థిరపడి అక్కడే వైద్యసేవలందించారు.
డాక్టర్ లక్ష్మిగారు వెళ్లిపోయాక ఆమె వద్ద పని చేసిన మంత్రసాని మేరి స్వతంత్రంగా కాన్పులు చేస్తూ, కొంతకాలం ఏ. బి. యం, కన్నికల ఆసుపత్రి వంటి చోట్ల పని చేశారు. ఈమె కుమార్తె ‘రాణి’ నా కంటే ఏడాది చిన్నది. మేరీ తల్లి ఏనాది (ఆదివాసి), తండ్రి ఆఫ్రికా దేశీయుడు. మేరీ ఎప్పుడూ తలపై తెల్లగుడ్డ కట్టుకుని తిరిగేది.
డాక్టర్ అల్లాడి మహా దేవయ్యగారు మద్రాసు వైద్యకళాశాలలో 1920లో ఎంబిబియస్ పట్టా సాధించి నెల్లూరు పెద్ద పోస్టాఫీసు సమీపంలో, ప్రాక్టీసు ప్రారంభించారు. సుబేదారు పేటలో, కనకమహాల్ ఎదురుగా సొంత ఇల్లు కట్టుకుని అందులో నలభై సంవత్సరాలు, చివరి శ్వాస విడిచే వరకు వైద్య సేవలు అందించారు. నెల్లూరులో ఆయా రంగాల్లో ప్రసిద్ధులైన వ్యక్తులు చాలా మంది వైద్యం కోసం వీరి దగ్గరికి వచ్చేవారు. వీరు పేదలనీ, ధనికులనీ, తేడా చూపించేవారు కాదు. అవసరం లేకుండా మందులు రాయరని ప్రజలు అనుకునేవారు. మద్రాసులో సుప్రసిద్ధ వైద్యులు ఏ. యల్. మొదలియర్ వద్ద స్త్రీలవైద్యంలో (Obstetrics) శిక్షణ పొందారు. నెల్లూరు సెయింట్ జోసెఫ్ స్త్రీల వైద్యశాలలో గౌరవ సూపర్నెంటుగా, వైద్యులుగా నలభై ఏళ్లు చేశారు. నెల్లూరు బిషప్‌కు, విదేశీ మిషనరీలకు, కన్యా గురుకుల వాసానికి (seminary) వీరే వైద్యులు. మిషనరీల సహకారంతో ఇంగ్లాండు నుంచి వెలువడే ‘‘The Practitioner’’ వైద్యపత్రికను తెప్పించుకొనేవారు జీవితాంతం ఆ పత్రిక చందాదారులు.
మహాదేవయ్య చాలా మిత భాషి, హుందాగా వ్యవహరించేవారని నెల్లూరీయులు చెప్పుకునేవారు. మహాదేవయ్య డాక్టరుగారి ధర్మపత్ని శ్రీమతి అన్నపూర్ణమ్మగారు జీవితాంతం నెల్లూరులో తిక్కవరపు రామిరెడ్డి వంటి ఉదారుల సహకారంతో ‘హరిజన’ బాలికల హాస్టలు నిర్వహించారు. డాక్టరుగారి కుటుంబం, వారి అన్నగారి కుటుంబం కలిసి ఉమ్మడి కుటుంబంగా జీవించాయి. పిల్లలంతా ప్రసిద్ధ వైద్యులు, ఇంజనీర్లు అయ్యారు. మహాదేవయ్యగారి కుమార్తె డాక్టర్ లక్ష్మి నెల్లూరు సెయింట్ జోసెఫ్ మహిళా వైద్యశాలలో డాక్టరుగా పనిచేశారు. క్రికెట్ అంటే మహాదేవయ్య గారికి పిచ్చిమోజు. నెల్లూరులో రేడియో పెట్టుకొన్న తొలి కుటుంబాలలో వీరిదొకటి. వృత్తిలో సమయపాలన, క్రమశిక్షణ, సున్నితంగా మెలగడం, నిత్య అధ్యయన శీలత వీరి లక్షణాలని వారి పిల్లలు చెప్తారు. సాయంత్రం అవగానే ఆయన గదిలో మిత్రులంతా చేరి ముచ్చట్లు చెప్పుకునేవారు. రాత్రి 8 కాగానే లేచి క్యాలెండర్‌లో తేదీ మార్చేవారు, ఇక అందరూ నిష్క్రమించడానికి సమయమయిందని సంకేతంగా.
మహాదేవయ్యగారు 1968 మార్చి 5న సెయింట్ జోసెఫ్ హాస్పిటల్లో డ్యూటీ చేస్తూ ఆకస్మికంగా హృద్రోగం వచ్చి అస్వస్థులై ఆ సాయంత్రం వెళ్ళిపొయ్యారు, డాక్టరుగారి చిన్న కుమారుడు రాజేంద్ర నా సహ విద్యార్థి. ఢిల్లీ ప్రభుత్వంలో ఛీఫ్ ఇంజనీరుగా చేశారు. డాక్టర్ మహాదేవయ్యగారి భార్య శ్రీమతి అన్నపూర్ణమ్మ కూరల బుట్టలు రిక్షాలో పెట్టుకొని హరిజన హాస్టల్ కు వెళ్ళడం నెల్లూరీయులకు నిత్యం కనిపించే దృశ్యం. ఆమె తనకంటే పెద్దదైన తోడి కోడలుపైన ఇంటి బాధ్యతలన్నీ విడిచి సంఘసేవ చేశారు. ఆ తోడి కోడలుగారే గంపెడు పిల్లల పోషణ, చదువులు, గృహ నిర్వహణ బాధ్యతలు నెరవేర్చారు.
డాక్టర్ సర్వాభట్ల విశ్వనాధం తిప్పరాజు సత్రం సమీపంలో ఉండేవారు. వారి పెద్ద కుమారుడు డాక్టర్ సాయినాథ్ హైస్కూల్లో నాసహాధ్యాయి, మంచి మిత్రుడు. ఈ డాక్టర్ గారు ధనవంతులైన రోగులను మద్రాసు తీసుకొని పోయి స్పెషలిస్టు లవద్ద వైద్యం చేయించేవారు కూడా. డాక్టర్ సర్వేపల్లి వెంకటసుబ్బయ్య కంటివైద్యులు. అల్లాడి మహాదేవయ్య గారి ఇంటిప్రక్క ఇల్లు వీరిది. రోగుల ఇంటికివెళ్ళి కంటి పొరలు ఆపరేషన్ చేసి తొలగించేవారు. వీరికి కొంచం జూనియర్ డాక్టర్ హెబ్బారు. వీరి కుటుంబం ఇంట్లో తుళు మాట్లాడేవారు. హెబ్బార్ పెద్దకుమారుడు శ్రీధర్ హైస్కూలులో నా సహాధ్యాయి. నా బాల్యంలో ఒక చైనా పంటివైద్యులు డాక్టర్ షే సుబేదారుపేటలో ఇంట్లోనే వైద్యం చేసేది. వారు ఇంట్లో లేకపోతే వారి భార్య కూడా రోగులను చూస్తారు. సంప్రదాయంగా దంతవైద్యం చేసేకుటుంబం. డాక్టర్ కృష్ణారావు ట్రంకురోడ్డులో నివాసం, అక్కడే దంతవైద్యశాల నిర్వహించారు. డాక్టర్ రాజగోపాలాచారి పేరు స్మరించకపోతే ఈ జాబితా అసమగ్రం. వారు పొగతోటలో సొంత ఇంట్లోనే వైద్యం చేసేవారు. ఆజానుబాహులు, ప్రేమాస్పదులు, షిర్డీసాయి భక్తులు. నెల్లూరు రాజవీధిలో 1941లో సాయి మందిరం ప్రారంభించారు. వీరిచొరవతోనే ఇప్పుడు నెల్లూరు స్వతంత్ర పార్కు పక్కన సాయి బాబా ఆలయం కట్టారు. ఇప్పుడు లక్షల ఆదాయం ఈ గుడికి.
రాజగోపాలాచారి ఎదురు వరుసలో డాక్టర్ కొండూరు రామకృష్ణమూర్తి వైద్యశాల, వారు రిక్షాలో రోగుల ఇళ్ళకు వెళ్ళి వైద్యం చెయ్యడం నేనెరుగుదును.
స్థానిక చరిత్ర రచనకు ఆద్యులు
నెల్లూరులో ఒంగోలు వెంకటరంగయ్యగారనే న్యాయవాది వుండేవారు. ఆయన ‘సుబోధిని’ వంటి స్థానిక వార పత్రికల్లో నెల్లూరు జిల్లాలో ప్రసిద్ధ పురుషుల జీవిత గాథలను సేకరించి ధారావాహికగా ‘కొందరు నెల్లూరు గొప్పవారు’ అనే శీర్షిక పెట్టి ప్రచురించారు. బంగోరె మాటల్లో “దారిలో నడుస్తూ కాలికి తగిలిన రాయి” చరిత్రను కూడా సేకరించారు. వారి రచనలు ‘కొందరు నెల్లూరు గొప్పవారు’ అనే పేరుతో చిన్నచిన్న పుస్తకాలుగా అచ్చువేశారు. ఈ పుస్తకాలే నెల్లూరు స్థానిక చరిత్ర రచనకు స్ఫూర్తినిచ్చాయి. శ్రీ నేలనూతల శ్రీకృష్ణమూర్తిగారు న్యాయవాద వృత్తిలో వుంటూ వెంకటరంగయ్యగారి స్ఫూర్తితో అనేక విషయాలు అధ్యయనం చేశారు. వీరు నెల్లూరు వర్థమాన సమాజ గ్రంథాలయం గౌరవ గ్రంథాలయాధికారిగా వుంటూ ‘భారతి’ వంటి అనేక పత్రికల్లో వచ్చిన రచనలకు శాస్త్రీయమైన గ్రంథసూచి తయారు చేశారు. ‘కార్డు సిస్టం’ పెట్టి భోగట్టానంతా అకారాది క్రమంలో పోస్టుకార్డు సైజు కార్డులమీదికి ఎక్కించేవారు. ఎటువంటి సహాయమూ లేకుండా ఈ బృహత్ర్పణాళికను ఒంటిచేతి మీద పూర్తి చెయ్యగలిగారు. ఆ రోజుల్లో నెల్లూరు పౌరులు వారికోసం శుభలేఖలు, గ్రీటింగ్ కార్డులు తెచ్చిచ్చేవారు. వాటిని ఒక సైజుకు చేయించి అచ్చులేని ఖాళీవైపు వాడుకునేవారు. వారికృషి ఊరికే పోలేదు. డాక్టర్ బెజవాడ గోపాలరెడ్డి, ఆచార్య బిరుదురాజు రామరాజు గారి వంటి పెద్దల సహకారంతో రెండు సంపుటాలుగా సాహిత్య అకాడమి ముద్రించి, పండిత, పరిశోధకులకు మహోపకారం చేసింది. నెల్లూరు వచ్చిన ఏ కవి పండితులైనా నేలనూతలవారి ఇంటికి పోకుండా, వారి ఆతిథ్యం స్వీకరించకుండా వెళ్లడం అసాధ్యం.
శ్రీకృష్ణమూర్తి గారు అన్నామలై విశ్వవిద్యాలయం చిదంబరంలో చదువుతున్న రోజుల్లోనే ఆలయ శిల్పం మీద దృష్టి పెట్టారు. నెల్లూరు కోర్ట్ లో న్యాయవాదిగా కొనసాగుతూ సీనియర్ అడ్వకేట్ వంగోలు వెంకర రంగయ్య గారి వద్ద నాట్యశాస్త్రం చదివారు. తర్వాత చాలా పరిశోధించి ఆంధ్ర దేశంలో ఆలయ శిల్ప సంపదను భరతశాస్త్రంలోని అంశాలతో సమన్వయించి Andhra Dance Sculpture గ్రంథం రాశారు. వారిని ఇండాలజిస్ట్ అని నిరభ్యంతరంగా పేర్కొనవచ్చు. ఆంధ్రప్రదేశ్ లలితకళా అకాడమీ ఈ బృహత్ గ్రంథాన్ని ప్రచురించింది. మాతరం వారికి శ్రీ కృష్ణమూర్తిగారే స్ఫూర్తి, యెన్ ఎస్ కె ప్రోత్సాహం తోనే నావంటి ఎందరో పరిశోధకులు స్థానిక చరిత్రమీద కృషి చేశారు. వారొక సజీవ గ్రంథాలయం.
బంగోరె
1964 నుంచి 1982 చివరి వరకు బంగోరె అనేపేరుతో ప్రసిద్ధుడైన మిత్రుడు బండి గోపాలరెడ్డి నెల్లూరు ప్రజల హృదయాలను చూరగొని జమీన్ రైతు వార పత్రికలో పనిచేశారు. వారం వారం ఆ పత్రికలో బంగోరె అనే కలంపేరుతో ‘కూనిరాగాలు’ కాలం రాశాడు. లోకలిస్టు, బండి గోపాలరెడ్డి వంటి పేర్లతో కూడా రాశాడు. జిల్లాకు చెందిన విద్యాలయాలు, చర్చీలు, గుళ్లు, గోపురాలు, వ్యక్తులు, పుస్తకాలు, జిల్లాలో జరిగిన ఉద్యమాలు ఎన్నెన్నో విషయాలు మీద రాశాడు. అవేవి పుస్తకాల రూపంలోకి రాకుండానే తను ఈలోకం నుంచి నిష్ర్కమించాడు. ఎవరైనా పూనుకుని ఆ పని పూర్తిచేస్తే నెల్లూరు స్థానిక చరిత్ర మరింత సుసంపన్నమవుతుంది.
వెంకటగిరిలో నా పరిశోధన
1968లో నేను వెంకటగిరి రాజాగారి గ్రంథాలయం సరస్వతీ నిలయంలో పుస్తకాలదుమ్ము దులిపి ఆరేడు నెలలు నా పరిశోధనకవసరమైన విషయం సేకరించుకుంటున్నాను. బంగోరె నా వెంట పడి, వేధించి, విసిగించి ఆ గ్రంథాలయం మీద నా చేత పెద్ద వ్యాసం రాయించి ‘జమీన్ రైతులో’ ‘‘వెంకటగిరి సంస్థాన గ్రంథాలయం సరస్వతీ నిలయం సజీవ సమాధి’’ అని శీర్షిక తగిలించి మరీ ప్రచురించాడు. దాంతో వెంకటగిరి కుమార రాజాగారి కోపాగ్నికి నేను శలభమై వెంకటగిరి నుంచి తట్టాబుట్టా సద్దుకుని నెల్లూరు వచ్చేశాను. అంతకు ముందే నెల్లూరు జిల్లా కలెక్టరుగా పనిచేసిన IAS అధికారో మరొకరో కోరితే, పరిశోధకుడుగా హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆర్కెవ్స్ (Archives) డైరెక్టరుగారి ద్వారా సంస్థానం గ్రంథాలయం స్థితిగతుల మీద నేనొక రిపోర్టు పంపివున్నా. ఆ విధంగా నేను వెంకటగిరి గ్రంథాలయంలో పని చేసిన విషయం ప్రభుత్వదృష్టికి వచ్చేవుంది.
ఆ తర్వాత వెంకటగిరి గ్రంథాలయం నుంచి అనేక గ్రంథాలు ఎత్తుకొని పోయినట్లు నా మీద మౌఖికప్రచారం విస్తృతంగా జరిగింది. నెల్లూరులో కూడా ఆ మాటలను చాలామంది విశ్వసించారు. 28 సంవత్సరాల యువకుడుగా ఆ రోజుల్లో నేను చాలా చిత్తక్షోభ అనుభవించవలసివచ్చింది.
రాజాగార్లు ఎంతో మంది కవి పండితుల పుస్తకాలు అచ్చు వేయించి ఆదరించారు. దేశంలో వందల మంది కవి పండితులు ఉత్తరాలు రాసి, తమ పుస్తకాలను రాజా గారికి బహూకరించేవారు. రాజాగార్లు 1900 కు ముందు, ఆ తర్వాత 1916 వరకు ఎన్నెన్నో తెలుగు పత్రికలకు, ఇంగ్లీషు పత్రికలకు చందాలుకట్టి, విరాళాలిచ్చి పోషకులుగా ప్రసిద్ధి పొందారు. సూర్యాలోకం, శశిలేఖ, ఆంధ్రభాషా సంజీవని వంటి ఎన్నెన్నో పత్రికలు ఆ గ్రంథాలయం లో పడివుండేవి. ఇక కవి పండితుల లేఖలు చెప్పనక్కర లేదు. ఆ రోజుల్లో ఫోటో కాఫి మిషన్లు లేవు కనుక జెరాక్స్ చేసే అవకాశం లేదు. రోజు శ్రద్ధగా ఆ గ్రంథాలయం చీకటిగదిలో కూర్చొని అవసరమైన విషయాలు మాత్రం రాసుకుంటూ వచ్చాను.
మా చిన్నక్కను వెంకటగిరిలో ఇచ్చారు. ఆమె మామగారు శ్రీధర సుబ్బయ్యగారు రాజాగారి ఆలయాల మీద అములుదారు, చిన్న ఉద్యోగమే గానీ, వారిని రాజాగారు, కుమార రాజాగారు చాలా గౌరవించేవారు. వారిని చూసే కుమార రాజాగారు తమ గ్రంథాలయంలో నా పరిశోధనకు అవసరమైన విషయసేకరణకు అనుమతిస్తూ, ఒక అకౌంట్ బుక్ ఇచ్చి, అందులో ఆ గ్రంథాలయంలోని పుస్తకాల జాబితా రాసిపెట్టమన్నారు. నేను వెంకటగిరికి వెళ్లిన కొత్తల్లోనే మహేశ్వరం అనే చదువుకున్న వెలమ యువకుడు పరిచయం అయ్యాడు. అతను, మిత్రులు కలిసి ‘సత్యశోధన సంఘం’ వంటి ఒక గ్రూపును తయారు చేసి తీవ్రంగా మతవిషయ చర్చలు జరిపేవారు. ఈ బృందంలో సభ్యుడు పెంచలయ్య హైస్కూలు చదివే రోజుల్లోనే ఇంట్లో చెప్పకుండా రుషీకేశ్‌కు పారిపోయి స్వామి శివానంద ఆశ్రమంలో కొంతకాలం ఉండి తిరిగి వచ్చి చదువు కొనసాగించాడు. తనకు స్వామి శివానందతో పరిచయం అయింది. తను రోజూ దాదాపు రెండు గంటలు యోగా, కఠిన వ్యాయామం చేసేది. తర్వాత ఈయన వెంకటగిరి ప్రభుత్వ కళాశాలలో ఫిజికల్ ఎడ్యుకేషన్ అధ్యాపకులుగా పదవీవిరమణ చేశాడు. మహేశ్వరంనాయుడు తండ్రి ‘ఆర్నెల్ల’ వ్యాపారం చేసేది. అంటే తమిళనాడులో వెనకబడిన జిల్లాలలో వెంకటగిరి నేత చీరలు, ధోవతులు వంటివి అప్పుగా ఇచ్చి, అక్కడ మాసూళ్లైన తర్వాత డబ్బు తెచ్చుకునేవారు. మహేశ్వరం నిష్కామంగా ఆరు నెలలపైగా వెలుతురులేని ఆ పుస్తకాల గదిలో మగ్గుతూ నాకు అన్ని పనులలో సహకరించాడు.
(ఇంకా ఉంది)