జ్ఞాపకాల దొంతర

2
3

[dropcap]మ[/dropcap]రచిపోయిన ఘటనలు
అకస్మాత్తుగా మది ముంగిట తలుపు తడితే…
ఆ ఉద్విగ్న క్షణాలు
వెలకట్టలేని అపురూపాలై,
కనుమరుగైనా వీడని
కలలుగా సాగిపోయే,
ఆణిముత్యాలే అవి!!

ఉబుసుపోక కాలక్షేప
నిమిత్తం వీక్షించే టివి-
నాటి సంఘటనలైన,
పాఠశాలనుంచి కళాశాల వరకు,
అనుభవించిన తీపి గురుతులను
చలన చిత్రం కనువిందుచేస్తూ,
ఆనందింపచేస్తుంటే
వెనక్కిమరలే మనసును
ఆపలేని ఆనంద స్థితి అది!!

మొక్కుబడిగా మొదలెట్టిన
వీక్షణలో సన్నివేశాలు
అంతరంగాన్ని తట్టిలేపుతూ
కడవరకు కదలనీయక
కనులముందు నిలిచి
గతాన్ని నెమరవేస్తుంటే
అనుభవించే ఆ అనుభూతిని
ఏ రూపంలో వర్ణించగలం!!

సాంప్రదాయాల నీడలో
పెరిగిన మధురమైన
ఆనాటి తెలిసీ తెలియని
అరుదైన జీవితం-
అనుభవించడమే తప్ప,
వ్రాసేందుకు పరిజ్ఞానం లేని,
అరుదైన కాలమది.
వయస్సూ, మనస్సూ
రెచ్చగొట్టినా, విలువల
వలువలు విసర్జించలేని
కట్టుబాట్లకు మైలురాయి
ఆనాటి జీవనశైలి!!

గడచిన ఆ మధురాతి
మధుర అనుభవాలను
తలచుకుంటూ విధి ఆడిన
వింతనాటకంలో శాశ్వతంగా
దూరమైన మిత్రుల ఎడబాటు
మనస్సును మెలితిప్పినా
ఏమీ చేయలేని నిస్సహాయులమై,
కాలచక్రానికి తలవంచి
చేసే వినమ్రప్రణామమే
మన మరో జీవితం!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here