Site icon Sanchika

జ్ఞాపకనాశిని

[dropcap]పొ[/dropcap]ద్దున్న నిద్ర లేస్తూ “ఈ రోజు నుండి నాకు కొత్త జీవితం.. మరణ మార్గం సుగమం చేసే జీవితం మొదలైంది” అనుకున్నాడు నికేత్. తేలిగ్గా నవ్వుకుంటూ, గది నుండి బైటకు వస్తూ కిందకి చూస్తే, అమ్మా-నాన్నలు ఏదో మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ మాటలు విన్న నికేత్ అడుగులు మెట్లపైనే ఆగిపోయాయి.

“ఈ ఇంట్లో మూడో మనిషి ఉండాలి అనిపిస్తోంది నాకు. మూడో మనిషేవరు అయినా? మనం ఇద్దరమేగా.. కానీ, నాకేమిటో ఇంకొకరు ఉన్నట్లు తోస్తోంది..”

“నాక్కూడా అంతే. రాత్రి నుంచే ఈ భావన కలుగుతోంది.”

“నాకు మనకు ఒక కొడుకు ఉన్నాడు అన్న ఊహ పదేపదే కలుగుతోంది. మళ్ళీ ఇంతలోపే – మనకి పిల్లలెక్కడ ఉన్నారు? అని సమాధాన పడుతున్నాను.”

“నిజమే, నిన్న రాత్రి నుంచి నాకు కూడా ఏమిటో అంతా అయోమయంగా ఉంది. మనం కాక ఇక్కడ మరో మనిషి లేడు అని తెలుసు.. కానీ, మనకి ఒక కొడుకు ఉన్నట్లు, వాడితో మనం గడిపిన రోజులు ఉన్నట్లు, ఏవో వింత అనుభూతులు, జ్ఞాపకాలు చుట్టుముడుతున్నాయి. అసలు లేని మనుషుల జ్ఞాపకాలు ఎక్కడ నుంచి వస్తున్నాయో అర్థం కావడం లేదు.”

“ఫాన్టం ఎంటిటీ..” అని గొణిగాడు తండ్రి.

“గాలి సోకడం అంటారు.. నేను ఎప్పుడూ నిజం అనుకోలేదు. ఇది అదే కాబోలు” స్పందనగా తల్లి గొణుగుడు.

“పైన ఎవరో ఉన్నట్లు అనిపించట్లేదా?”

“మీక్కూడా అనిపించిందా! మనకి నికేత్ అని ఒక కొడుకు, పై గది వాడిదే, అక్కడే పని చేసుకుంటూ, చదువుకుంటూ ఉంటాడు.. ఇలా ఏవేవో ఆలోచనలు కలుగుతున్నాయి నాకు. మెదడు ఒకటి చెబుతోంది, మనసు ఒకటి చెబుతోంది.”

“మనకిద్దరికీ ఏమౌతోందో! వార్ధక్య లక్షణాలు అంటావా? అప్పుడే అంత వయసు అయిపోయిందా? నిన్న మనం మన అబ్బాయితో కలిసి టీవీ చూడలేదూ పడుకునే ముందు? కానీ మనకి అబ్బాయే లేడే”

“నాకు భయంగా ఉంది. ఒకసారి ఎవరన్నా సైకియాట్రిస్టుని కలవాలి ఏమో”

ఈ సంభాషణ అంతా పైన్నుంచి వింటున్న నికేత్‌కు సన్నగా చెమట్లు పట్టడం మొదలైంది. “అసలు నేనేం చేసాను?” అని తలపట్టుకుని నిలబడ్డ చోటే కూర్చుండిపోయాడు. ఒకసారి నిన్న ఏం జరిగింది? అంతకు ముందు ఏమి జరిగింది? అన్నది గుర్తు తెచ్చుకున్నాడు.

***

నికేత్ ఒక పాతిక ముప్ఫయి సంవత్సరాల మధ్య వయసు ఉన్న యువకుడు. మనిషి చూడ్డానికి ఉత్సాహంగానే ఉంటాడు. ఇంకా ఉన్నాడు కూడా. కానీ, కొన్ని నెలల బట్టీ తన మృత్యువు కోసం వ్యూహాలు రచించుకుంటూ, ఆచరణకు వచ్చేసరికి వెనుకాడుతూ గడుపుతున్నాడని ఎవరికీ తెలీదు. అసలతని సమస్య ఏమిటో, ఎందుకు చచ్చిపోవాలి అనుకుంటున్నాడో, అన్నది కొంచెం క్లిష్టమైన ప్రశ్న. ఆ వివరం మనకి అక్కర్లేదు. అదేమిటో తెలుసుకుని, అది సబబా కాదా నిర్ణయిస్తూ మనం న్యాయమూర్తుల అవతారం ఎత్తక్కర్లేదు. ఎందుకు? అన్న ప్రశ్నని అటు పెడదాం. కారణం ఏదైనా అతనికి మరణించాలన్న కోరిక మాత్రం బలంగా ఉంది. కానీ, తన తల్లిదండ్రులు, స్నేహితులు, వీళ్లంతా ఎలా స్పందిస్తారు? ఎంత బాధపడతారు? అన్న ఆలోచనలు అంతకంటే బలంగా తన్నుకొస్తాయి ఆ కోరిక ప్రబలమైన ప్రతిసారీ. కొన్ని నెలల క్రితం చిన్ననాటి స్నేహితుడు, ప్రస్తుతం కంప్యూటర్ సైన్సు పీహెచ్డీ చేస్తున్న సునీల్‌తో జరిగిన సంభాషణ అతనికి ఒక పరిష్కారం చూపించింది.

***

“దేని గురించి రిసర్చి చేస్తున్నావు?”

“సెమాంటిక్ నెట్వర్క్స్ మీద చేస్తున్నాను.”

“అంటే ఏమిటి?”

“ఇప్పుడు నువ్వున్నావు. నీ మెదడుంది. ఇందులో ఉండే వివిధ విషయాల్లో – ఉదాహరణకు నీకు సంబంధం ఉన్న వ్యక్తులను తీసుకుందాం. ఇప్పుడు ఈ వ్యక్తులంతా ఒక పెద్ద నెట్వర్క్ లో ఉండే నోడ్ పాయింట్లు అనుకో. అప్పుడు ఆయా వ్యక్తుల మధ్య, ఆ వ్యక్తులకి నీతో ఉండే సంబంధాలు – ఇందులో ఈ నోడ్ పాయింట్ల మధ్య గల సంబంధాలే అవుతాయి కదా?”

“అవును”

“అంటే, ఒక స్థాయిలో, నువ్వు నీకు మనుష్యుల్తో ఉన్న సంబంధాలని ఒక నెట్వర్క్ లాగా చూపించగలుగుతున్నట్లే కదా?”

“అవును”

“అదొక సెమాంటిక్ నెట్వర్క్.. అంటే ఇలాగే ప్రపంచంలోని వివిధ అంశాల మధ్య సంబంధాలని క్రోడీకరించి ఒక నాలెడ్జి బేస్ లాగ తయారు చేయడం. దీని వల్ల మనం అనేకరకాల కృత్రిమ మేధ గల అప్లికేషన్లు తయారు చేయవచ్చు భవిష్యత్తులో. “

“ఓహో, అంటే, ఏదన్నా ఒక విషయం తీసుకుని, దానికి సంబంధించిన అన్ని వస్తువులూ, వాటి మధ్య సంబంధాలూ – ఇవి చూపించడం, అంతే కదా?”

“అలాగే అనుకోవచ్చు మామూలు అర్థంలో.”

ఇట్లా కాసేపు మాట్లాడుకున్నారు అతని పరిశోధనలపై.

***

ఆ ప్రభావంతో నికేత్ మనసులో ఒక ఆలోచన నెమ్మదిగా రూపుదిద్దుకోవడం మొదలైంది. రాత్రనకా, పగలనకా కష్టపడి తన ఆలోచనకు ఒక రూపం ఇచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. దీని కోసం రోజూ ఆఫీసు పని అవగానే, మిగతా వ్యాపకాలన్నీ వదులుకుని బోలెడంత సమయం చదువుకోడంలో గడపడం మొదలుపెట్టాడు. ఇంట్లో వాళ్ళు ఆశ్చర్యపోయినా కూడా, ఏదో కొత్త ప్రాజెక్టులో పని నేర్చుకోవాలి కాబోలు అనుకుని ఊరుకున్నారు. అలా, కొంత కాలానికి అతను అనుకున్న పరికరం తొలి నమూనా సిద్ధమైంది. వృత్తిరీత్యా ప్రోగ్రామర్ కావడం అతనికి లాభించింది అనే చెప్పాలి.

నికేత్ రూపొందించిన పరికరంలో ప్రధాన భాగం అతను రాసిన కంప్యూటర్ ప్రోగ్రాం. అది మెటా కంపెనీ లోని పరిశోధకులు రూపొందించిన రిస్ట్ వాచ్ పరిమాణంలో ఉన్న ఆగుమెన్టేడ్ రియాలిటీ కంట్రోలర్‌ని ఆధారంగా తీసుకుని అందులో ఒక అదనపు ఫీచర్ లాగ పనిచేస్తుంది. ఎవరైనా దాన్ని తొడుక్కుంటే ఆ పరికరం లోని సాంకేతికత మెదడు లోని విద్యుత్ తరంగాలతో అనుసంధానమవుతుంది. తరువాత నికేత్ రాసిన ప్రోగ్రాము యాక్టివేట్ అయ్యి, ఆ వ్యక్తి మెదడులోని నెట్వర్కుని స్కాన్ చేసి దాని నమూనాని ఈ పరికరానికి అనుసంధానిస్తుంది. అంతే కాదు, ఏదన్నా ఒక విషయం గురించి మన మెదడులో వివరాలు తొలగించాలి అనుకుంటే, ఈ పరికరాన్ని కంప్యూటర్‌కి అనుసంధానించి, మన మెదడు నెట్వర్క్‌ని కంప్యూటరు తెరపై చూసుకుని, అవసరమైన వివరం క్లిక్ చేసి తొలగించడమే. అప్పుడు దానికి ఇతర విషయాలతో ఉన్న సంబంధాలు వాటంతట అవే తెగిపోయేలా రూపొందించాడు అతని ప్రోగ్రాంని. ఇలా మార్చుకున్నాక తిరిగి ఈ కొత్త నెట్వర్క్‌ని మళ్ళీ చేతి పరికరం ద్వారా మెదడు లోకి పంపించవచ్చు. అపుడు మన మెదడులోని నెట్వర్క్ ఈ కొత్త వివరాలతో అప్డేట్ అవుతుంది.

ఈ పద్ధతి ద్వారా, ఒక మనిషి నుంచి దూరం అయ్యేముందు అతనిలో నుంచి మన జ్ఞాపకాలను తొలగించవచ్చు అన్నది నికేత్ ఆలోచన. ఆ మనిషి ఈ పరికరం చేతికి తొడుక్కునే లాగ చేస్తే చాలు. తరవాత న్యాయాన్యాయ విచక్షణ పక్కన పెడితే, అవతలి మనిషి అనుమతించినా, అనుమతించకపోయినా, అతని మెదడు మొత్తాన్నీ స్కాన్ చేసి, అతని మెదడు లోని నెట్వర్క్‌ని సంపాదించి, దాని కంప్యూటర్లో చూడవచ్చు. కనుక, ఒక మనిషికి సంబంధించిన జ్ఞాపకాలని అతని సన్నిహితుల మెదళ్ల నుండి తొలగించవచ్చు. ప్రపంచంలో వ్యక్తుల ఆత్మహత్యల వల్ల సన్నిహితులకు కలిగే వేదనలను తొలగించగలిగే పరికరం ఇది అని నికేత్ అనుకున్నాడు. ఇన్నాల్టికి, ఒక పనికొచ్చే పని చేసాను అని తృప్తి పడి దీనికి ‘జ్ఞాపకనాశిని’ అన్న పేరు కూడా పెట్టుకున్నాడు.

సరే, ఎలా పనిచేస్తుందో చూడాలి కనుక, దానికి ఆ రాత్రికే ముహూర్తం పెట్టుకున్నాడు. తను చస్తే ఇలాంటి పరికరం వల్ల ఉపశమనం కలిగేది మొదట తన తల్లిదండ్రులకే కనుక, ఇది మొదట వారిపైనే ప్రయోగించాలి అని నిర్ణయించుకున్నాడు. చేరి కాసేపు ఇద్దరి చేతా ఆ రిస్ట్ బ్యాండ్ వేయించాడు ఆగమెంటెడ్ రియాలిటీ గేమ్స్ కలిసి ఆడదాం అంటూ ఏదో కథ చెప్పి. నెమ్మదిగా దాని సహాయంతో అమ్మా-నాన్నల మెదళ్ళు స్కాన్ చేసుకున్నాడు. కొడుకు ఏదో చేస్తున్నట్లు అనిపించినా, ఏం చేస్తున్నాడో తెలీదు కనుకా, ఈ మధ్య కాలంలో అసలు పెద్దగా మాట్లాడ్డం లేదు, ఇవ్వాళ ఇంతసేపు ఏదో చెబుతున్నాడు, అని వాళ్ళూ అతను చెప్పినది కాదనలేదు.

తరువాత నికేత్ తన గదికి వెళ్లి, ఆ స్కాన్ చేసిన మెదళ్లను తను రాసిన ప్రోగ్రాము ద్వారా కంప్యూటర్ లోకి కాపీ చేసుకున్నాడు. ఆ పై, ఒక్కో నెట్వర్క్‌లో జాగ్రత్తగా, తను, తల్లి, తండ్రి ముగ్గురి నోడ్స్ ఉన్న చోట మాత్రం దృష్టి సారించి, వారికి తనతో మధ్య ఉన్న లంకెలు మాత్రం తొలగించాడు. ఇప్పుడు, అతను అర్థం చేస్కున్నంతలో, తన జ్ఞాపకాలు వారి మెదళ్ల నుంచి తొలగినట్లే. దీని సేవ్ చేసి, సందర్భం చూసుకుని ఇద్దరికీ మళ్ళీ రిస్ట్ బ్యాండ్ పెట్టి మారిన నెట్వర్క్ లని వారి వారి మెదళ్ల లోకి ఎక్కించేసాడు. తానూ అనుకున్నది సాధించాను అన్న తృప్తిలో హాయిగా నిద్రపోయాడు. ఇదీ జరిగిన కథ.

***

తల్లిదండ్రుల సంభాషణ విని తలపట్టుకుని అక్కడే కూర్చుండిపోయిన నికేత్‌కి తాను చేసిందేమిటో కొంచెం కొంచెం అర్థమవడం మొదలైంది. చాలాసార్లు మనం చేసే పనుల పర్యవసానం గురించి ఆలోచించినంతగా మనం ఈ పనుల వల్ల కొత్తగా పుట్టిన శకలాల గురించి ఆలోచించము. అలాగే, తాను రచించిన సాఫ్ట్వేర్‌లో నెట్వర్క్ లోని లంకెలు తెంచడం వరకూ చేసాడు. కానీ ఆ తెగిపడిన లంకెలు ఎటు పోతున్నాయి? అన్నది మాత్రం అతను అప్పుడు పట్టించుకోలేదు. అవి అట్లాగే తుదిలేకుండా వేళ్ళాడుతూ ఉంటాయనీ, ఇలా తాను మార్చిన నెట్వర్క్ వల్ల వాళ్ళు అయోమయాలతో జీవించాల్సి వస్తుందని అతను ఊహించలేదు. దానితో అలా ఎంపిక చేసిన జ్ఞాపకాలను తొలగించడం ఎంత నిరర్థకమో అర్థమైంది. అసలు తన ఆలోచనలోనే ఎంత అసంబద్ధత, వైరుధ్యం ఉన్నాయో అర్థమైంది.

“ఇద్దరు మనుషుల మధ్య జ్ఞాపకాలంటే ఆ ఇద్దరి మధ్య ఉండే లంకెలు మాత్రమే అని అర్థం చేస్కోవడం ఎంత మూర్ఖత్వం.. జ్ఞాపకాలంటే గత జీవితాలు కదా! ఒక జ్ఞాపకాన్ని చేరపగలం ఏమో కానీ, ఒక జీవితాన్ని, దానితో పెనవేసిన జ్ఞాపకాలని మొత్తంగా చెరపడం అసలు ఎంత భయానకమైన ఆలోచన!” నికేత్ మనసులో ఎన్నో ఆలోచనలు.

“ఈ పని చేస్తే, అమ్మా-నాన్నలు నన్ను మరిచిపోవడం మాట అటుంచితే, పిచ్చివాళ్ళు అయ్యేలా ఉన్నారు. ఇద్దరిపై చేసిన ప్రయోగం పర్యవసానాలే ఇంత భయంకరంగా ఉంటే, ఇదే ప్రయోగం నాతో సంబంధం ఉన్న స్నేహితులతో కూడా చేసి ఉంటే, ఎంత ప్రమాదం జరిగి ఉండేది! వెంటనే మళ్ళీ పాత నెట్వర్క్ పెట్టేయాలి వీళ్ళ మెదళ్ళలో” అనుకుంటూ గిరుక్కున వెనక్కి తిరిగాడు.

అక్కడ లాగిన్ అయి చూస్తే, పాత నెట్వర్కుకి బాకప్ లేదు. కొత్త నెట్వర్క్‌లో సగం తెగిపడిన లంకెలు అన్నీ తుదిలేకుండా వేళ్ళాడుతూ కొన్ని కోట్ల వూడలున్న మర్రిలాగా భయపెడుతున్నాయి. ఇపుడేం చేయాలి? అమ్మా, నాన్నా ఎదురుపడితే ఏమి చెప్పాలి? నికేత్‌కి అంతా అయోమయంగా ఉంది. భవిష్యత్తు భయంకరంగా అనిపించింది.

ఇంతలో తలుపు టపటపా బాదుతున్న చప్పుడు కావడంతో అప్పటికే “వాట్ దిడ్ ఐ డూ” అంటూ కలవరిస్తున్న నికేత్ ఉలిక్కిపడి లేచాడు. వెంటనే వెళ్లి తలుపు తీసాడు.

“ఏంట్రా ఇంతసేపు పడుకున్నావ్. ఎంతసేపు తట్టినా తలుపు తీయవేంటి?” ఎదురుగ్గా అమ్మా, నాన్న.

“అమ్మా.. నాన్నా..” అయోమయంగా చూసాడు.

“రాత్రి లేట్‌గా పడుకున్నావా?” నాన్న ప్రశ్న.

“ఆ.. అవును. ఏదో ప్రాజెక్ట్ పని చేస్కుంటూ..”

“అంత స్ట్రెయిన్ అవ్వకు. కాస్త రిలాక్స్ అవ్వు. మొహం చూడు ఎలా పీక్కుపోయిందో” అన్నది అమ్మ.

“రాత్రి లేట్ ఐంది.. దానికి తోడూ ఏదో పీడ కల.. సరే, మీరు వెళ్ళండి. నేను కాసేపట్లో కిందకి వచ్చేస్తాను”

వాళ్ళు వెళ్ళగానే, వెంటనే కంప్యూటర్ ఆన్ చేసాడు. నికేత్‌కి అంతా అయోమయంగా ఉంది. నిన్న రాత్రి తాను వాళ్ళ మెదళ్ళలో కొత్త నెట్వర్క్ పెట్టాడు కదా. మరి వాళ్ళు మామూలుగానే ఉన్నారేమిటి? అంటే తన ప్రయోగం పని చేయలేదా? ఇన్నాళ్ళ శ్రమా వృథాగా పోవల్సిందేనా? అన్న ఆలోచనలు ఒక పక్కా, పోనీలే, ఇదీ ఒకందుకు మంచిదే అన్న ఆనందం మరో పక్కా, ఇలా ఆనందం, బాధల మధ్య ఆ కొద్ది క్షణాల లోనే అతని మనసు ఊగిసలాడ్డం మొదలైంది.

ఒక పదినిముషాలు హడావుడిగా తన ప్రోగ్రాం తాలూకా ఫైళ్ళూ, నిన్న సృష్టించిన గ్రాఫులూ అవీ చూసాక అతనికి అసలు విషయం అర్థమైంది. నిన్న అతను కొత్త నెట్వర్కుని వాళ్ళ మెదళ్ళలో పెడుతున్నాను అనుకుంటూ, మళ్ళీ పాత నెట్వర్కు పెట్టేసాడు. అపరిపక్వ ఆలోచనలతో చేసే ప్రయోగాల పరిణామాలు ఒక్కోసారి ఎంత తీవ్రంగా ఉండగలవో అర్థమై, తన పొరపాటు ఎంత పెద్ద ప్రమాదాన్ని తప్పించిందో గుర్తించి, గట్టిగా ఊపిరి పీల్చుకుని నిట్టూర్చి ఇక ఈ ప్రోగ్రాముతో పనిలేదు, వేరే మార్గాలు ఆలోచిద్దామనుకుంటూ దాని సోర్సు కోడ్‌ని తొలగించడానికి పూనుకున్నాడు. తన కంప్యూటర్‌లో కోడ్ మొత్తం తొలగించాక, తానూ కోడ్‌ని సేవ్ చేసుకునే హోస్టింగ్ సర్వీస్ గిట్హబ్ లోని కోడ్ కూడా డిలీట్ చేద్దామని లాగిన్ అయ్యాడు.

“నీ గిట్‌హబ్ ప్రొఫైల్‌ని మేము హ్యాక్ చేసాము. ఇది మీకు తిరిగి కావాలంటే బిట్ కాయిన్ నజరానా ఇవ్వాలి, వివరాలు ఇవిగో” అన్న మెసేజి కనిపించింది. నికేత్ నమ్మశక్యం కానట్లు చూసాడు. ఇలా అపరిచిత వ్యక్తుల గిట్హబ్ లు కూడా హ్యాక్ చేస్తున్నారా? లేకపోతే తాను తెలిసిన వాళ్ళు ఎవరైనా కావాలని చేసిన పనా? అన్న అనుమానం వచ్చింది. తనకి వచ్చిన మెసేజిని కాపీ పేస్ట్ చేసి గూగుల్ సర్చి చేస్తే అర్థమైంది అతనికి.. కొంతమందికి కోడ్ రిపాజిటరీలు కూడా ఇలా హ్యాక్ అవుతున్నాయి అని. దీనికి పరిష్కార మార్గాలు ఏవో కొన్ని కనబడ్డాయి ఆన్లైన్ ఫోరమ్ లలో. “ఏ కాఫీయో తాగొచ్చి ఈ చిట్కాలు ప్రయత్నించి చూడాలి, నా కోడ్ నేను తెచ్చుకుని దాన్ని డిలీట్ చేసేయాలి”, అనుకుంటూ, తన ప్రయోగం విఫలమైనందుకు నిట్టూర్చి, మరణానంతర ప్రభావాలని అరికట్టే మరో మార్గం వెదుక్కోవాలి అనుకుంటూ ల్యాప్టాప్ కట్టేసి అమ్మా నాన్నలతో మాట్లాడ్డానికి కిందకి వెళ్ళాడు నికేత్.

కానీ అప్పటికే ప్రపంచంలో ఏదో ఒక మూల ఒక నల్లటి స్క్రీను వెనుక ఒక ఆడమనిషి తాను హ్యాక్ చేసిన నికేత్ కోడ్‌ని చూస్తూ కళ్ళు పెద్దవి చేస్తూ, ఒక చిన్న విషపుటాలోచనకి బీజం వేసుకుందని అతనికీ, మరెవరికీ తెలిసే అవకాశం లేదు!

Exit mobile version