తెలుగు ఉపాధ్యాయులు కె.వి. లక్ష్మణరావు రచించిన బాలల నీతి కథల సంపుటి “జ్ఞానోదయం”. 14 కథలున్న ఈ పుస్తకాన్ని బండారు పబ్లికేషన్స్ వారు ప్రచురించారు.
***
“బాలసాహిత్యం వ్రాయాలంటే బాలలస్థాయికి ఎ’దిగి’ వ్రాయాలంటారు సి. నారాయణరెడ్డి గారు. బాలసాహిత్యం ఉన్నంతకాలం తెలుగుభాషకు ఢోకాలేదంటారు శ్రీ వేదగిరి రాంబాబు గారు. చిన్ని కధలకు ప్రజాదరణ ఉందంటారు దార్ల బుజ్జిబాబు గారు.
వినదగు నెవ్వరు చెప్పిన అన్నట్లు ముందుకు దూసుకుపోతున్నారు మన కె.వి. లక్ష్మణరావు గారు. బాలలకు అర్ధమైయ్యే సులభ శైలిలో బుఱ్ఱకథలు వ్రాయడంలో ఈయన దిట్ట.
“జ్ఞానోదయం’ కథలో రూపురేఖలు చూసి భ్రమపడకూడదని గుణమే ప్రధానమని చెబుతారు.
బాలభారతంలో ప్రచురితమైన ‘చిలుక-సీతాకోకచిలుక’లో దృశ్యకావ్యాన్ని ఆవిష్కరింపజేసారు. “కష్టేఫలి”లో ఒక్క దెబ్బకి ఉలిక్కి పడినరాయి మెట్టుగా మారింది. వేలాదిదెబ్బలు తిని శిల్పంగా మారినరాయి పూజలందుకోబోతుంది అంటూ కష్టపడి (ఇష్టపడి) చదవాలని బోధిస్తారు.
“మేడిపండు చూడ మేలిమై ఉండు పొట్టవిప్పి చూడ పురుగులుండు” పద్యభావాన్ని “అందంకన్నా గుణమే మిన్న” కథలో చక్కగా వివరిస్తారు.
సాధన చెయ్యడం వలన మనకు స్వతహాగా తెలిసిన పని మెరుగుపడుతుందే తప్ప మనకు సాధ్యంకాని పని చెయ్యలేమంటూ, “పకృతిధర్మం”లో వివరిస్తారు.
“పనిచేయ(లే)నివాళ్ళు కొత్తకోణంలో చూపిస్తారు. “వేటాడే జంతువులలో ఆటాడరాదు” అంటూ ఆకతాయి పిల్లల్ని హెచ్చరిస్తారు.
“పెద్దలమాట – పెరుగన్నం మూట”లో సుద్దులు చెబుతారు “ప్రియనేస్తం”లో సహవాసం గొప్పతనాన్ని చూపిస్తారు.
ఈ కథలు చదివిన చిన్నారులకు ఎంతో కొంత “జ్ఞానోదయం” కలుగుతుందనడం అతిశయోక్తి కాదు.” అన్నారు బండారు చిన రామారావు తమ ముందుమాటలో.
***
జ్ఞానోదయం (బాలల నీతి కథలు)
రచన: కె.వి. లక్ష్మణరావు
ప్రచురణ: బండారు పబ్లికేషన్స్, లోగిస. బండారు చిన రామారావు, గజపతినగరం మండలం, విజయనగరం జిల్లా 535270
పుటలు: 32, వెల: రూ.15/-
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక విక్రయకేంద్రాలు, ప్రచురణకర్త,