Site icon Sanchika

జ్ఞానోదయం

[dropcap]క[/dropcap]టిక చీకటిని చీల్చుకుంటూ వచ్చేదే ఉషోదయం
స్ఫటిక జ్ఞానాన్ని నింపుకుంటూ తెచ్చేదే జ్ఞానోదయం

అ జ్ఞానపు అంధకారంలో అలమటించే మట్టిమనిషికి వెలుగులిస్తూ
ఆ నందపుటంచుల్లో విహరించే రాజహంసలా రాణింపచేస్తూ
ఇంటింటా దివ్యదీపమై విశ్వచక్రవర్తి వోలె విరాజిల్లుతూ
ఈ జగమంతా తేజోకాంతులు ప్రజ్వలింప చేయుచూ
ఉ న్నంత వరకు తనతో పాటు నలుగురికీ శాంతిని పంచుతూ
ఊ రూవాడా దిక్కుదిక్కులా సంతోష శంఖారావాల్ని పూరిస్తూ
ఋ ణగ్రస్తుల్ని జీవన్రుణాల హోరు నుంచి వెలికి లాగుతూ
ఎ డబాయక అనునిత్యమూ హృదిని రంజింప చేస్తూ
ఏ కదృష్టితో ముల్లోకాల్నీ మలినరహితంగా చూపుతూ
ఐ శ్వర్య విరాజితుడై ఉప్పొంగు సంద్ర సంబరాలు తెస్తూ
ఒంటరితనపు నీలి నీడల విషాద తెరల్ని ఛేదిస్తూ
ఓ టమి భయాల్ని ధైర్యపు వెలుగులతో నిర్విరామంగా నింపుతూ
ఔ దార్యపు విలువలతో జీవితాన్ని జీర్ణింప చేస్తూ
అం తరంగాన్ని నీతి న్యాయాలతో బహిర్గతం కావిస్తూ
క కావికములైన జీవన నౌకని అర్థవంత తీరాలకి చేరుస్తూ
ఖ రారుగా సుఖశాంతులు ఎల్లవేళలా అందిస్తూ
గ తి తప్పిన గమనానికి సరిదారి సమంగా చూపుతూ
ఘ నమైన కీర్తి శిఖరాలని అవలీలగా అధిరోహింప చేస్తూ
చండ ప్రచండ కోపాగ్నికి ఆహుతి కాకుండా కాపాడుతూ
ఛ వి రేఖల వెలుగులతో జీవితాంతం తేజోమయంగా ప్రకాశింప చేస్తూ
జ గతినెల్ల జంకుబొంకులు లేని నిర్మల స్థావరంగా స్థాపిస్తూ
ఝ ల్లికలని పోగొట్టి ప్రతి తనువునీ శుచిగా శుభ్రపరుస్తూ
ట క్కరి జిత్తులమారుల్ని సైతం ప్రయోజకులుగా తీర్చిదిద్దుతూ
ఠ లాయించే మనుజుల్ని ఠీవిగా తలెత్తి తిరిగే తీరుగా తయారుచేస్తూ
డ ప్పాలతో తిప్పలు పడే అల్పుల్ని మార్చి గొప్పలుగా గెలిపిస్తూ
ఢ మేలున జారిపడకుండా నిలబెట్టే ఆత్మవిశ్వాసం నింపుతూ
త గులుకొనెడు తప్పుడు తగవుల తాండవాలని తగలకుండా తప్పిస్తూ
దండగవు జన్మని చరితార్థంగా చరిత్రలో మలుస్తూ
ధ నమదంతో కన్నులు మూసుకుపోకుండా తెరిపిస్తూ
న రకమార్గం వైపు వెళ్ళకుండా అడుగుల గమనాన్ని స్థిరం చేస్తూ
ప గులువారు బ్రతుకుబండలని పగలకుండా ఘనీభవిస్తూ
ఫ ణివోలె విషము గ్రక్కు విషపుచ్చిని తేనెలూరేటట్లు తయారు చేస్తూ
బ లంతో బలిష్ఠంగా అయి అదే బలమని భ్రమించే భ్రమలని బండబారుస్తూ
భ గవంతుని దర్శించే సుగమమార్గాన్ని సులువుగా దర్శింప చేస్తూ
మ ధ్యనవచ్చు నడమంత్రపుసిరి అస్థిరమని బోధిస్తూ
య క్షప్రశ్నలకి తేలికైన జవాబులు తేలికగా చెప్తూ
ర త్ననిధి దొరికే చోటుని రమ్యంగా రంగరించి చూపిస్తూ
ల క్షణమైన జీవిత లక్ష్మణరేఖల్ని ఎప్పటికప్పుడు ఏర్పరుస్తూ
వ క్రమార్గాన పయనించు మనసుని సన్మార్గపు దారిలోనికి మళ్లిస్తూ
శ రణుచొచ్చువారి ఇలవేలుపుగా కొనియాడబడేటట్లు చేస్తూ
ష ట్చక్రవర్తుల సమఉజ్జీగా సింహాసనంపై కూర్చుండబెడుతూ
సం కటపడే సమయంలో ఆత్మస్థైర్యాన్ని అహర్నిశలూ నింపుతూ
హ రింపలేని సంపదతో తులతూగు తన్మయత్వాన్ని ప్రసాదిస్తూ
క్ష మాగుణంతో విలసిల్లే విరజాజి పరిమళాలతో గుబాళింపచేస్తూ
జ్ఞానజ్యోతి వెలిగించి మన అంతరంగాన్ని ఎల్లవేళలా
దేదీప్యమానంగా ప్రకాశవంతం కావించేదే జ్ఞానోదయం.

Exit mobile version