జ్ఞాపకాల పందిరి-10

143
1

[box type=’note’ fontsize=’16’] “కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే…!!” అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్. [/box]

నాన్నా… మీతోటే వుంటాను!!

[dropcap]జీ[/dropcap]వితంలో అనుకున్నవన్నీ లిస్టు ప్రకారం జరిగిపోవు. అలా జరగకుండా అనుకున్నవన్నీ జరిగితే అంతకు మించిన జీవితం మరోటి వుండదనుకుంటా! అదే స్వర్గం అనుకోవడంలో తప్పులేదు. అంతకుమించిన జీవితం మనిషికి మరేమీ అక్కరలేదు. అయితే మనిషిది సంతృప్తి లేని బ్రతుకు!

ఎన్ని వున్నా ఇంకా ఏదో కావాలనుకునే అసంతృప్తి జీవితం మనిషిది. ఒకవేళ సమాజంలో అలాంటి మనిషి ఎవరైనా ఉంటే అంతకు మించిన ఆదర్శమూర్తి మనకు వుండరు. ఇలాంటివి ఊహాలోకంలో పంచరంగుల వర్ణ చిత్రంలా కనిపించవచ్చుగానీ, నిజ జీవితంలో బహు అరుదు! అనుకున్నవన్నీ కాకపోయినా, అనుకున్నవి కొన్నైనా జరగాలంటే ఎంతో శ్రమించాలి. మనిషికి ఒక ధ్యేయం అంటూ ఉండాలి. కష్టపడడంతో పాటు ఓర్పు, సహనం పుష్కలంగా ఉండాలి, ముఖ్యంగా తాను చేసే పనిమీద తనకు నమ్మకం ఉండాలి. ఇన్ని చేసినా… అనుకున్నవన్నీ సాధించడం బహు కష్టమైన పనే మరి!

అనుకున్నవన్నీ జరగనప్పుడు, జరగనందుకు బాధపడాలా? బెంగ పెట్టుకోవాలా? అనవసరమైన ఆలోచనలతో క్రుంగి కృశించి పోయి, వున్న జీవితాన్ని పాడుచేసుకోవాలా? లేక అనుకున్న లక్ష్యాల్లో అందిన వాటితో సంతృప్తి పడి, సుఖమయ జీవితానికి పునాదులు వేసుకోవాలా? అని ఆలోచించినప్పుడు, ఒక స్థాయిలో మనిషికి సంతృప్తి అవసరం. దేనికైనా తృప్తి అనేది మనిషికి మానసిక ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. ఇందులో ఎలాంటి సందేహమూ లేదు. అయితే ఎక్కడో ఒకచోట తృప్తిపడి అవకాశమున్న భవితను దూరం చేసుకోమని చెప్పడం నా ఉద్దేశం కాదు.

ప్రయత్నం ఎప్పుడూ ఆహ్వానించదగ్గదే, కానీ విఫలమైన ప్రయత్నాల గురించి, ఆలోచిస్తూ మన పరిధిలోవున్న ఆనందాన్నీ, సుఖాన్నీ ఆస్వాదించ లేకపోతే అది పొరపాటు అవుతుంది. జరగనిదాని గురించి వ్యథ చెందుతూ, వున్న జీవితాన్ని ఆనందమయం చేసుకోవడంలో జాగ్రత్త పడక పోవడం ఎక్కువ శాతం అనుసరిస్తున్న పొరపాటు పని. ప్రతి స్థాయిలోను తృప్తిని ఆభరణంగా చేసుకున్నవాడే అనుకున్నవి కొన్నైనా సాధించగలుగుతాడు. ప్రతి వాళ్ళ జీవితంలోనూ కష్టసుఖాలు, గోతులు, గొప్పులు తప్పక ఉంటాయి. వాటిని ఛేదించుకుని నిలకడగా, ధైర్యంగా ముందుకు పోయేవాడు, చక్కని తృప్తికరమైన జీవితాన్ని ఆస్వాదించగలుగుతాడు. ఈ నేపథ్యంలో, నా జీవితంలోనించే ఒక అంశాన్ని తీసుకుని విపులీకరించడం సబబు అని నా భావన. “మీ స్వంత గొడవ మాకెందుకు?” అన్న ప్రశ్న కూడా కొంతమంది మనస్సులో తలెత్తవచ్చు! కానీ… కొందరి అనుభవాలు చాలా మందికి, జీవితం తీర్చిదిద్దుకునే గుణపాఠాలుగా ఉంటాయి. అందుచేత ప్రతి వాళ్ళ జీవితంలోని ఒక్కో అనుభవం కొందరికి, వారి భవిష్యత్ జీవితాన్ని తీర్చిదిద్దుకునే అవకాశం కలగవచ్చు.

నేను అతిసాధారణ దిగువ మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన వాడిని, చదువే జీవనాధార అంశంగా ఎంచుకుని, కష్టపడి చదువుకుని, ఎన్నో ఆరోగ్యపరమైన అవాంతరాలు అడ్డుపడినా, వాటిని దైర్యంగా ఎదుర్కొని, సామాజికపరంగా, మహోన్నత మనీషి డా. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగపరంగా అందించిన అవకాశాలను అందిపుచ్చుకుని మా ఇంట్లోనే మొదటి ‘గజిటెడ్ అధికారి’ని (డెంటల్ సర్జన్) అయినాను.

అదే విధంగా, నా పిల్లలని కూడా అతి సాధారణంగా, అత్యాశలు కోరుకొని పిల్లలుగా పెంచడానికే విశ్వ ప్రయత్నం చేసాను. ఈ సూత్రాన్ని పిల్లలు కూడా అవగాహన చేసుకుని నాకు అన్నివిధాలా సహకరించడం నా అదృష్టం గానే భావిస్తాను.

ఇక అసలు విషయానికొస్తే, మా అమ్మాయి నాకు రెండవ సంతానం. మెహిదీపట్నం సెయింట్ ఆన్స్ డిగ్రీ కళాశాలలో, ‘జెనెటిక్స్’ (జన్యు శాస్త్రం) ప్రధాన అంశంగా డిగ్రీ చేస్తున్న కాలంలో, ఒక రోజున నా దగ్గరికి వచ్చి “డాడీ… నేను పి.జి. చేసిన తర్వాత అమెరికాలో రీసెర్చ్ చేస్తాను” అంది. ఆ మాట విన్న నాకు గుండె ఝల్లుమంది. కారణం అప్పటికే నా కొడుకు ఎం.ఎస్. చేయడానికి అమెరికా వెళ్ళిపోయాడు. అబ్బాయి వెళ్ళడం, నాకు అసలు ఇష్టం లేదని ఆమెకు బాగా తెలుసు. నా పుత్ర రత్నం అమెరికా వెళ్ళడానికి విమానం ఎక్కేముందు, అంటే విమానాశ్రయం లోనికి ప్రవేశించే ముందు బేగంపేటలో నేను వెక్కి… వెక్కి… ఏడ్చిన సన్నివేశం అంత త్వరగా మరచిపోతుందని నేను అనుకోను. అంటే అమ్మాయి మానసికంగా దేనికైనా గట్టిగా సిద్దపడిపోయినట్టుగా నేను గ్రహించాను. ఇద్దరు పిల్లలు నాకు చాలా ఇష్టం. వాళ్లెప్పుడూ నా కనుసన్నల్లోనే ఉండాలనేది నా ప్రగాఢ కోరిక. ఇది స్వార్థము, పిల్లల అభివృద్ధికి ఆటంకం పరిచే ఆలోచనే కావచ్చు, కానీ తండ్రిగా అది నా పేరాశ!

అందుకే… క్షణం సేపు మాటరాక, ఆ తర్వాత –

“అదేంటమ్మా… అన్న అక్కడికి వెళ్లిన బాధ ఇంకా నా మనసు నుండి చెదరనే లేదు, ఇప్పుడు మళ్ళీ… నువ్వు అమెరికా వెళతానంటావా? మరి, నువ్వు కూడా వెళ్ళిపోతే మా పరిస్థితి ఏమిటి?” అన్నాను ఎంత గానో బాధపడుతూ.

“అదేంటి డాడీ… అలా అంటారు? మీ కూతురు పి. హెచ్.డి. చేసి డాక్టర్ అని పిలిపించుకోవడం మీకు ఇష్టం లేదా?” అంది.

“ఎందుకు ఇష్టం వుండదమ్మా? తన కంటే… తన పిల్లలు మరింతగా ప్రయోజకులు కావాలని ప్రతి తండ్రి, ప్రతి తల్లి అనుకుంటారు. అందులో ఎలాంటి సందేహమూ లేదు… కానీ, నా పిల్లలు దూరంగా వెళ్ళిపోడం ఈ తండ్రి భరించగలడని నువ్వు అనుకుంటున్నావా” అన్నాను కాస్త బాధగా.

“అలా… ఎందుకు డాడీ? నా పరిశోధన పూర్తయ్యాక నాకు ఎట్లాగూ నాకు అక్కడే వుద్యోగం వస్తుంది. అప్పుడు మనమందరం ఒకే చోట ఉంటాం, ఎలాంటి ఇబ్బందీ ఉండదు” అని చాలా కూల్‌గా వెళ్లిపోయింది.

నేను కూడా ఆ విషయాన్ని మళ్ళీ… మళ్ళీ… ఎప్పుడూ ప్రస్తావించలేదు. అమ్మాయి కూడా దాని గురించి ఎప్పుడూ చర్చించే ప్రయత్నం చేయలేదు.

పిల్లల మనసులు ఎందుకు ఇలా మారిపోతున్నాయొకదా! అలా అని పిల్లలకు తల్లిదండ్రుల పైన ప్రేమ పోయిందని అనుకునేటట్లు లేదు. అలాగే పిల్లలను నిరాశపరిచి వాళ్ళ బంగారు భవిష్యత్తుకు అడ్డు పెట్టాలని  ఏ తల్లిదండ్రులూ అనుకోరు. నా మానసిక సున్నితత్వం నా పిల్లలిద్దరికీ బాగా తెలుసు. అందుచేత కావాలని వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడతారని కూడా మేము ఎప్పుడూ అనుకోలేదు. మా పిల్లల మీద నాకు అంత ప్రగాఢ విశ్వాసం.

అమ్మాయి హాస్టల్‌లో హైదరాబాద్‌లో వుండేది. మేము కోనసీమ వాళ్ళమైనప్పటికీ స్థిరపడింది హనంకొండలో (వరంగల్). ఉద్యోగ రీత్యా నేను వరంగల్, కరీంనగర్ జిల్లాలలో పనిచేయడం వల్ల, నా పిల్లలు పుట్టి పెరిగింది వరంగల్ జిల్లాలోనే. ఒక శుభోదయాన, అమ్మాయి ఫోన్ చేసింది.

తాను డిగ్రీ ఫస్టు క్లాస్‌లో పాస్ అయినట్టు చెప్పి, “నేను ఇంటికి వస్తున్నాను” అని, “ఇంటికి వచ్చాక, ఒక శుభవార్త చెబుతాను” అని చెప్పి ఫోన్ పెట్టేసింది.

అమ్మాయి శుభవార్త అని చెప్పినప్పటికీ, నా మనసెందుకో కీడు తలంచింది. ఎందుకంటే వయసొచ్చిన పిల్ల ఎవరినైనా ప్రేమించానని చెబుతుందేమోనని తండ్రిగా నా భయం! మరో ప్రక్క నా కూతురు నాకు ముందు చెప్పకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోదని గట్టి నమ్మకం!

ఇళ్ల రకరకాల ఆలోచనలతో సతమతమౌతున్న నేపథ్యంలో ఫోను చేసిన మర్నాడు ఇంటికి వచ్చిన అమ్మాయి బాగ్ సోఫాలో పడేసి, వెనక నుంచి వచ్చి వాటేసుకుని “డాడీ… నాకు కంగ్రాట్స్ చెప్పండి…” అంది.

“నిన్నే కదమ్మా చెప్పాను… మళ్ళీ చెప్పనా…?” అన్నాను.

“ఇప్పుడు… ఇంకో దాని గురించి” అంది ముందుకు తిరిగి నుదుటిమీద ముద్దు పెట్టుకుంటూ.

“ముందు సంగతేమిటో చెప్పు!” అన్నాను మనసులో ఆందోళన పడుతూ.

“ఎందుకు డాడీ అంత టెన్షన్ పడతారు? నేను మిమ్మల్ని కాదని మీకు ఇష్టం లేని పని ఏమీ చేయనని మీకు తెలుసుకదా!” అంది నవ్వుతూ.

“అమ్మా… ఆ నమ్మకం నాకు వుంది. కానీ ఎలాగైనా ఆడపిల్ల తండ్రిని కదా తల్లీ!” అన్నాను.

“అయ్యో… మీరప్పుడే చాలా దూరం ఆలోచిస్తున్నారు, అలాంటిదేమీ లేదు కానీ, నేను ఒక నిర్ణయానికి వచ్చాను డాడీ…” అంది నా పక్కన ఇరుక్కుని కూర్చుంటూ.

“ఏంటమ్మా అది?” అది అన్నాను, నా కూతురు కళ్ళల్లోకి ఆదుర్ధాగా చూస్తూ.

“ఏమీ లేదు డాడీ… మీకు ఇంతకుముందు, నేను అమెరికా వెళతానని చెప్పాను కదా!”

“అవును!”

“నేను వెళ్లకూడదని నిర్ణయించుకున్నాను డాడీ!” అంది సీరియస్‌గా.

“అదేంటమ్మా… నా గురించా ఈ నిర్ణయం?” అన్నాను ఆశ్చర్యంగా.

“మీ గురించి కాదు డాడీ… మన గురించి! మీ ఇద్దరినీ వదిలి నేను ఎక్కడికీ పొదలచుకోలేదు. ఉద్యోగం చేసినా, మీరు పెళ్లి చేసి బయటికి పంపినా మీకు అందుబాటులో వుండేలా నా జీవితాన్ని మలుచుకుంటాను. ఇందులో ఇక రెండో ఆలోచన ఉండదు. మీరు నిశ్చింతగా వుండండి” అంది.

“అది కాదమ్మా… నా గురించి నీ భవిష్యత్తు…?” అన్నాను బాధగా.

“లేదు డాడీ… ఇక్కడే వుండి మంచి ఉద్యోగం సంపాదించుకుంటా. ఈ విషయంలో మిమ్మల్ని అసలు నిరాశ పరచను. ఇది నా నిర్ణయం అంతే” అంది.

తరువాత మా అమ్మాయి పి.జి. చేయడం, ఉద్యోగం సంపాదించుకోవడం, పెళ్లి చేసుకోవడం, వరంగల్ ఆకాశవాణికి బదిలీ అయి, నా దగ్గరే వుండే అవకాశం రావడం, అనుకూలుడైన అల్లుడు దొరకడం, తర్వాత మా మధ్యకి మనవరాలు ‘ఆన్షి’ రావడం వరసగా జరిగిపోయాయి.

నా కొడుకు మాకు దూరంగా అమెరికాలో ఉన్నప్పటికీ, ఆ అన్నా చెల్లెళ్లు మా సుఖమయ జీవితానికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ కరోనా – కల్లోలంలో గృహబందీ అయినప్పటికీ సర్వం తానై చూసుకుంటున్నది నా కూతురు. ఇంతకు మించిన జీవితం నాకు అవసరమా? అదే తృప్తి అంటే! నాకు దగ్గరగా వున్నానన్నదే, నా కూతురి తృప్తి. చెల్లెలు మాకు దగ్గరగా వున్నదన్న తృప్తి నా కొడుకుది.

తృప్తికర జీవితం ఏర్పాటు చేసుకునే సూత్రం మన చేతిలోనే ఉంటుంది. అది అనుభవించే అదృష్టం మనకుండాలి, అంతే…!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here