Site icon Sanchika

జ్ఞాపకాల పందిరి-100

[box type=’note’ fontsize=’16’]”కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే…!!”అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్. [/box]

కూతురైనా.. కోడలైనా..!!

[dropcap]స్త్రీ[/dropcap]మూర్తి జీవితంలో ముఖ్యంగా మూడు ముఖ్యమైన అవతారాలుంటాయి. అవి ఏమిటంటే, కూతురు, కోడలు, అత్త. ఇందులో అత్త పాత్ర ప్రత్యేకమైనది. కూతురు -కోడలు పాత్రలు ప్రధానమైనవిగా చెప్పుకోవచ్చు. సమాజంలో అత్తా-కోడళ్ల పాత్ర నిన్నమొన్నటి వరకూ శత్రువులుగా చిత్రింపబడింది. దానికి కారణం ఒకప్పుడు ఎక్కువశాతం అత్తలు కోడళ్ళమీద పెత్తనం చెలాయించే ఆనవాయితీ ఉండడం వల్ల కావచ్చు. నాటకాలలో, సినిమాలలో కథలలో, నవలల్లో, అత్త పాత్రను ఒక కఠినాత్మురాలుగా, రాక్షసిలా చిత్రించడం జరిగింది. ఏ పాత్రలైనా ఆయా కాలాలలో అనుభవాలనుంచి వచ్చిన సన్నివేశాలే, చరిత్రకెక్కడం సహజం. గత కాలం నాటి పాత తెలుగు సినిమాలలో ‘సూర్యకాంతం’ పాత్ర సృష్టి అలాంటిదేనేమో! ప్రజలలో ఆ పాత్ర,ఆ పాత్రను నటించి ఆ పాత్రకు జీవం పోసిన సూర్యకాంతం పేరు వింటేనే, ఒక గడుసు గయ్యాళి గంప అత్త మదిలో మెదులుతుంది. అంతమాత్రమే కాదు అదే అత్త,కూతురిని ఒకలా, కోడలిని మరోలా చూడడం వంటి సన్నివేశాలు నిజ జీవితంలో సైతం చూస్తుంటాం. అయితే అదే కూతురు మరొక ఇంటి కోడలిగా వెళ్ళడమూ సహజమే కదా! అయినా ఆ.. అత్త, కూతురిని ఒకలా, కోడలిని ఇంకోలా చూడడం మనం గమనిస్తూనే ఉంటాం.

పెళ్లి కూతురుగా నిహార. కానేటి

మానవ సమాజంలో మంచి-చెడు వున్నట్టే, ఈ అత్త – కోడళ్ల పాత్రలు అన్నీ ఒకేలా వుండవు. కొందరు అత్తాకోడళ్లు, తల్లీ కూతుళ్లు మాదిరిగా తమ ప్రేమలను పంచుకుంటారు. లేదంటే ఇలాంటి వారు తక్కువగా వుంటారు. మన కూతురు కూడా ఒకనాటికి మరొక ఇంటి కోడలు కాక తప్పదు కనుక కోడలు అంటే చులకనగా చూడకూడదని, స్వంత కూతురిని ప్రేమించినట్టుగా ప్రేమించాలని ప్రతి అత్తా అనుకుంటే అసలు సమస్యలే వుండవు కదా!

పెళ్లి కాకముందు నిహార. కానేటి

ఒక బ్యాంకు మేనేజర్ మిత్రుడు ఒకసారి తన ఛాంబర్ లో నేను కూర్చున్నప్పుడు ఆయన ఒక సందర్భంలో అన్నమాట ఏమిటంటే, “నేను క్లర్కుగా పని చేసి నప్పుడు, మా మేనేజరు బోలెడు పని చేయించి ఏడిపించేవాడు, ఇప్పుడు ఆ కసి నేను మా వాళ్ళ మీద తీర్చుకుంటున్నాను” అన్నాడు.

బాల్యంలో నిహార. కానేటి

అదే విధంగా కోడలు పాత్రధారి, అత్త పెట్టిన ఆరళ్ళను గుర్తు పెట్టుకుని తర్వాత అత్త పాత్రలో కోడలిని సాధించి పీడించేదన్నమాట! అయితే అందరూ ఇలాంటి ఆలోచన గలవారై ఉంటారని అనే వీలులేదు. సయోధ్యతో చక్కగా తల్లీ -కూతుళ్లు మాదిరిగా ఆనందమయ జీవితం గడిపిన వాళ్ళూ లేకపోలేదు. నాటి నటి బహుముఖ ప్రజ్ఞాశాలి (నటి, గాయని, దర్శకురాలు, రచయిత్రి) అయిన స్వర్గీయ భానుమతి రామకృష్ణ రచయిత్రి కూడా కావడం మూలాన, ‘అత్తగారి కథలు’ కొత్తకోణంలో హాస్యప్రధానంగా పాఠకులకు అందించారు.

ఇది ఇలావుంటే, టెలివిజన్ వంటి మాధ్యమాలు హనుమంతుడి తోకలాంటి సీరియళ్లను సృష్టించి అందులో అత్తాకోడళ్ళను శత్రువులుగా సృష్టించి ప్రేక్షకుల బుర్రలు చెడగొడుతున్నాయి. సినిమాలు, టివి సీరియళ్లు ప్రేక్షకులపై ఎంతటి ప్రభావం చూపిస్తాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే రోజులు ఎప్పుడూ ఒకేలా వుండవు. అత్త పాత్ర తిరగబడి, కోడలి పాత్ర పైకి రావచ్చు. రావచ్చు కాదు, ఆ తరుణం ఇప్పటికే వచ్చింది కూడా. వృద్ధులైన అత్తమామలను, హింసకు గురిచేసే కోడళ్లు కూడా లేకపోలేదు.

విద్యార్ధినిగా నిహార. కానేటి

అయితే, ఈ రెండు లక్షణాలు మంచివికావు. ఆరోగ్య ప్రదమైన, ఆనందమయ జీవితానికి, అత్తలూ – కోడళ్ళూ సామరస్యంగా తల్లి – కూతుళ్లు మాదిరిగా మెలగవలసిందే. కొత్తగా కోడలు పాత్రలో ప్రవేశించిన కూతురులాంటి అమ్మాయిని, ప్రేమించి, అనురాగాన్ని పంచి, అత్త మార్గదర్శనం చేయవలసిన అవసరం వుంది. అదే విధంగా వృద్ధాప్యంలో వున్న అత్తను బ్రతికినంత కాలమూ కంటికి రెప్పలా కాపాడవలసిన బాధ్యత/అవసరం ఉండాలి. ఇలాంటి కథనాలను రచయితలు, పాఠకులకు/శ్రోతలకు అందించగలగాలి.

తల్లిదండ్రులతో-భర్త, వినోద్ కుమార్ జోషీతో నిహార కానేటి

ఇప్పుడైతే చదువుకున్న కుటుంబాలలో ఈ సమస్యలు తలెత్తే అవకాశం లేదు. పిల్లలు ఉన్నత చదువులు చదువుకోవడం, ఆ పైన ఉద్యోగం వేటలో విదేశాలకు వెళ్లిపోవడం, అక్కడి వాతావరణానికి రుచిమరిగి అక్కడే స్థిరనివాసం ఏర్పరచుకోవడం వల్ల, చివరికి మిగిలేది ఆ ఇద్దరే! తల్లి – తండ్రి లేదా అత్త -మామ. ఎందుచేతనో గానీ అత్తా -కోడళ్ళకు సృష్టించినంత శత్రుత్వం, మామ -కోడళ్ళకు, మామ – అల్లుళ్లకు (అతి కొద్దీ సందర్భాలలో తప్ప) సృష్టి జరగలేదు. ఆ విధంగా కొంతవరకూ మామలు అదృష్టవంతులే మరి!

తల్లిదండ్రులతో దివ్య

మా కుటుంబంలో ముఖ్యంగా నాకు ఈ సమస్య ఎదురుకాలేదు. మా అమ్మ తనకోడళ్ళను ఎప్పుడూ సూర్యకాంతం టైప్‌లో చూడలేదు, తన కూతుళ్లను చూసినట్టే చూసింది. నా శ్రీమతి మా అమ్మను తల్లికంటే ఎక్కువగా చూసింది. కానీ అది ఎక్కువ కాలం కొనసాగించే అవకాశం మా అమ్మ ఇవ్వలేదు. అందుచేత ఈ సమస్య ఇతరులనునుండి గమనించినదే – కానీ మా ఇంటినునుండి తీసుకున్నది కాదు. ఇక నా పిల్లల విషయం వచ్చేసరికి, అలాంటి సమస్యను నా దరికి రానియ్యలేదు. అది నా గొప్పతనమేమీ కాదు, పిల్లలు సహకరించడం వల్లనే అది నాకు సాధ్యం అయింది. ‘అత్త లేని కోడలుత్తమురాలు’  అన్న పాటలా మా అమ్మాయి పెళ్లి అయ్యేసరికి అత్త గారు లేదు. అందుచేత సమస్య అనేది ఉత్పన్నం కాలేదు.

హైస్కూల్ విద్యార్ధినిగా దివ్య. నామ

నిజానికి నాకు ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం. అందుకే నా కూతురు అంటే నాకు మహా ఇష్టం. ఇంత నిష్కర్షగా చెప్పడానికి కారణం నా ఇంటికి కోడలిగా వచ్చిన అమ్మాయిని కూడా అదే రీతిలో ఇష్టపడడం. నా కోడలుకూడా అత్తగారిని ఎంత గానో ప్రేమించడం, మామగారిని (నన్ను) తండ్రిని మించి గౌరవించడం ఇవన్నీ కలిసొచ్చిన అదృష్టాలు.

రచయిత కూతురు నిహార. కానేటి(ఎడమ), రచయిత కోడలు దివ్య. నామ(కుడి)

మా అమ్మాయి కూడా ఆమెను వదినలా కాకుండా ప్రాణ స్నేహితురాలిగా చూడడం, ప్రతివిషయం లోనూ కలిసి ఆనందించడం. ఇక్కడ ఆడపడుచు పెత్తనాలు అసలు వుండవు, అంతా ప్రేమగా మసులుకోవడమే ఉంటుంది. అదృష్టమో, దురదృష్టమో మేమంతా కరోనా భారిన పడినప్పుడు, మా బాబు, మా కోడలు చేసిన సేవ మా పట్ల చూపిన ప్రేమ అక్షరాలలో అందించలేనిది.

అత్తగారు (అరుణ), మేనకోడలు(ఆన్షి) తో దివ్య. నామ

ఫస్ట్ వేవ్/సెకండ్ వేవ్ కరోనా నుండి మా అమ్మాయి మమ్ములను రక్షించింది కానీ, థర్డ్ వేవ్‌లో మా అమ్మాయే ముందు కరోనా భారిన పడడంతో ఆ స్థానాన్ని కోడలు ఆనందంగా తీసుకుని, ఆ పాత్రకు న్యాయం చేసింది. ఇలాంటి వాతావరణం వున్నప్పుడు ఎలాంటి అరమరికలు వచ్చి శత్రువులుగా మారే అవకాశమే ఉండదు. కుటుంబ ఔన్నత్యాన్ని కాపాడుకోవాలన్న,సుఖ సంతోషాలతో గడపాలన్న అంతా మనచేతిలోనే ఉంటుంది.

రచయిత కొడుకు (రాహుల్), కోడలు (దివ్య)

అలాంటి కుటుంబాలు భావితరాలకు మాదిరిగా నిలుస్తాయి. అది తరతరాలకూ కొనసాగుతుంది. ఆ.. కుటుంబాలు ఆదర్శ కుటుంబాలుగా నిలుస్తాయి. కూతురిని కోడలిని, ఒకేమాదిరిగా చూసినప్పుడు, ఒకే మాదిరిగా ప్రేమించినప్పుడు, ప్రేమను పంచినప్పుడు అత్తా -కోడళ్ల సమస్య వచ్చే అవకాశమే లేదు. అత్తా ఒకింటి కోడలే..! అన్న విషయాన్ని అవగాహన చేసుకుంటే అనవసర అర్థరహిత సమస్యలు తలెత్తవు.

కూతురు నిహార కోడలు దివ్య తో… రచయిత

అందుకే అది మంచి అయినా, చెడ్డ అయినా, దానికి మనమే కారణం. అందుచేత మనల్ని మనం చక్కదిద్దు కోగలిగితే, అవగాహనా లోపం లేకుండా బ్రతకగలిగితే, అదే మార్గంలో పిల్లలని పెంచగలిగితే ఇక కావలిసింది ఏముంటుంది? అంతా ఆనందమయమే!

అపార్థాలకు ఆనకట్ట వేయగలిగితే అత్తాకోడళ్ళగురించి సరికొత్త నిర్వచనంతో చెప్పుకునే అవకాశం కలుగుతుంది.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version