ఊరు విడిచిపెట్టి వచ్చినా …!!
[dropcap]మీ[/dropcap]ది ఏవూరు? అని ఎవరైనా ప్రశ్నిస్తే, టక్కున పుట్టి పెరిగిన జన్మస్థలమే గుర్తుకు వస్తుంది గానీ వలస వచ్చి స్థిరపడిన వూరు గుర్తుకురాదు! కారణం పుట్టి పెరిగిన వూరు మీద వుండే మమకారం, ఆ వూరితో ఏర్పడిన అనుబంధం. ఆ వూరు అందించిన బాల్యం, జీవితానుభవం. ఉమ్మడి కుటుంబాల కాలంలో, ఉద్యోగాల అవసరం అంతగా లేకపోవడం యావత్ కుటుంబ సభ్యుల జీవితాలు వ్యవసాయ రంగం తోనే ముడిపడి వుండడం వల్ల వూరు విడిచివెళ్లి మరోచోట స్థిరపడవలసిన అవసరం వచ్చేది కాదు.
అప్పట్లో నిరక్షరాస్యతా శాతం కూడా ఎక్కువగా ఉండడం, స్త్రీలకు అసలు చదువుకునే అవకాశమే లేకపోవడం వంటి కారణాలు కూడా ఒకేచోట అంటే స్వగ్రామంలోనే స్థిరపడి ఉండవలసిన పరిస్థితులు ఏర్పడి ఉండవచ్చు. తర్వాతి కాలంలో చదువుకునే వారి సంఖ్య ఎక్కువ కావడం, ఉద్యోగం చేయవలసిన పరిస్థితులు రావడం, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కనుమరుగు కావడం మూలాన తప్పని పరిస్థితిలో వూరు విడిచి వెళ్ళవలసిన అవసరం ఏర్పడింది.
ఎక్కువ కాలం ఎక్కడ ఉంటే అక్కడ పరిచయాలు, స్నేహాలు, దగ్గరితనం ఎక్కువ కావడంతో, అక్కడే స్థిరపడిపోయేవారు ఎక్కువయ్యారు. పైగా కొన్ని ఉద్యోగాలు స్వంత వూరిలో లభించే అవకాశం లేదు. వ్యాపారం చేయడమో, స్వంతంగా విద్యాసంస్థలు నెలకొల్పుకోవడం వల్లనో, స్వంత వూరిలో వుండే అవకాశాలు రావచ్చుకానీ, మిగతా ఎవరైనా కడుపు చేతపట్టుకుని బయటకు పోవలసిందే, వేరేచోట స్థిరపడవలసిందే! ఏ కొద్దిమందికో తిరిగి స్వంత వూరికి తిరిగివచ్చి స్థిరపడే అవకాశాలు ఉంటాయి, అది కూడా తప్పని పరిస్థితి అయితేనే. ఇక పట్టణాలకు, నగరాలకూ, మహానగరాలకూ అలవాటు పడ్డవాళ్ళు ఎట్టి పరిస్థితిలోనూ స్వంత గ్రామాలకు, ముఖ్యంగా స్థిరపడడానికి రారు. ఈ నేపథ్యంలో ఎక్కువశాతం మంది తమ స్వంత ఊళ్లకు దూరమైపోయి, కొంతకాలానికి అక్కడ వారిని గుర్తుపట్టేవారే లేకుండా పోతారు. కొంతమంది అయితే తాము ఎంతటి మహా నగరంలో నివసిస్తున్నా తాము పుట్టి పెరిగిన జన్మ స్థలాన్ని తరచుగా దర్శిస్తూ, అక్కడి బంధువులతో, ఆత్మీయులతో, శ్రేయోభిలాషులతో సత్సంబంధాలను కలిగి వుంటారు. ఆ అదృష్టం ఏ కొద్దీ మందికో దక్కుతుంది. అయితే తరచుగా పుట్టిపెరిగిన వూరికి పోకుంటే అక్కడి బంధుత్వాలు సైతం క్రమంగా మాసిపోతాయి. ఒకరికోరు గుర్తుపట్టలేని పరిస్థితులు ఏర్పడతాయి. దీనివల్ల విద్యాధికులు అంతా గ్రామాలు వదిలి వెళ్లి పోవడం వల్ల రాజకీయంగా అభివృద్ధిపరంగా గ్రామాలు వెనకబడిపోవటం, నిరక్షరాస్యతా శాతం పడిపోవడం వంటి అనర్థాలు కూడా జరుగుతున్నాయి. కాస్త సెంటిమెంటు ఉన్నవాళ్ళకి కొంచెం ఇది బాధ పెట్టే విషయం. కొంతమంది వున్న కాస్త ఆస్తి అమ్ముకుని ఊరితో శాశ్వతంగా తెగతెంపులు చేసుకుంటున్న వాళ్ళు కూడా లేకపోలేదు. సమాజంలో బహుశః వీళ్ళ శాతమే ఎక్కువగా వుండి ఉండవచ్చు.
నా అనారోగ్య పరిస్థితి రీత్యానూ, ఆ తర్వాత నా చదువు మూలంగానూ, బాల్యం లోనే నేను నా జన్మస్థలం (దిండి గ్రామం, మల్కీపురం మండలం, కోనసీమ జిల్లా – పాత తూ. గో. జి) వదిలి పెట్టక తప్పలేదు. అప్పటికే నాకంటే పెద్దవాళ్ళు (ఇద్దరు అన్నలు, ఇద్దరు అక్కలు) ఉద్యోగ రీత్యానూ, చదువుల రీత్యానూ, గ్రామం వదిలి వెళ్ళక తప్పలేదు. నా పరిస్థితిని బట్టి నేను ఎనిమిదవ తరగతి లోనే వూరు వదలి హైదరాబాద్‌లో వున్న పెద్దన్నయ్య(కె కె మీనన్) దగ్గరకి వెళ్ళవలసి వచ్చింది. దానితో నా తల్లిదండ్రులు గ్రామంలో వంటరి వారైపోయారు.
నేను ఎక్కడవున్నా నా జన్మస్థలం మీద వున్న మక్కువ ఎక్కువైంది గానీ తక్కువ కాలేదు. మా తల్లిదండ్రులు మా అభివృద్ధిని చూడగలిగారు గానీ, మాతో కలసి అనుభవించ లేకపోయారు. అది ఇప్పటికీ నన్ను బాధపెడుతూనే ఉంటుంది. అయితే మా అమ్మ కానేటి వెంకమ్మ, ఎప్పుడూ ఒకమాట గుర్తు చేస్తూ ఉండేది. మా వూళ్ళో వున్న ఆ కొద్దీ ఆస్తికీ అవసరమైతే లేదా వీలుకలిగితే మరికొంత కలపాలి తప్ప అమ్ముకోకూడదని చెబుతుండేది.
ఆ మాటలు నా మెదడులో బలంగా నాటుకున్నాయి. నా తల్లిదండ్రులు మమ్మల్ని వదలి వెళ్ళిపోయినా నేను నా గ్రామాన్ని వదలలేదు. అప్పుడప్పుడూ వూరికి వెళుతుండేవాడిని. వూళ్ళో నన్ను గుర్తు పెట్టేవాళ్ళు క్రమంగా తగ్గిపోయారు. మా ఇంటిపేరు గల కుటుంబాలు మూడేమూడు మిగిలాయి.
మా అమ్మ తరపు కుటుంబాలు (రామరాజులంకలో) బహుకొద్ది మిగిలాయి. అందులో నన్ను ఇష్టపడేవాళ్లు, అతి సన్నిహితంగా వుండేవాళ్ళు కూడా కొద్ది మంది మాత్రమే ఉన్నారు. మా తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత వరుసగా మూడు సంవత్సరాలు వారి జ్ఞాపకార్ధం మెడికల్ + డెంటల్ క్యాంపు నిర్వహించాము. పెద్దన్నయ్య కె కె మీనన్ ఈ విషయంలో పూర్తి సహకారం అందించేవాడు. ఈ పేరు మీద ప్రతి సంవత్సరము వూరికి వెళ్ళవచ్చునన్నది కూడా మా ఆలోచన. కొన్ని అవాంతరాల వల్ల తర్వాతి కాలంలో అది కొనసాగలేదు.
తర్వాత రైల్వే లైన్ (బ్రిడ్జి) కారణంగా ఉన్న కొద్దీ భూమిలోనూ సగం పోయింది. మా అమ్మ కోరిక మాత్రం నెరవేర్చలేకపోయాం. గత రెండు సంవత్సరాలుగా కరోనా మహమ్మారి వికట ఆట్టహాసానికి భయపడి అసలు ఇల్లే కదలలేదు.
నేను గానీ, మేము గానీ మా వూరు వెళితే మాకు మొదట స్వాగతం చెప్పి, ఆత్మీయంగా పిలిచేవాడు మా చిన్నాన్న(సూర్యనారాయణ) మనుమడు, మా భగవాన్ దాస్ అన్నయ్య రెండవ కుమారుడు, శ్రీధర్ కానేటి. అతడి అభిమానం, ఆత్మీయత, ఆతిథ్యం గొప్పగా ఉంటాయి.
నాకున్న కొద్దీ ఇంటి స్థలం ప్రస్తుతం ఇతడి సంరక్షణ లోనే వుంది. ప్రాంతీయంగా నా ప్రయాణాలు, బంధువులను కలవడాలు శ్రీధర్ చూసుకుంటాడు. అతను స్వంతంగా ఎదిగి స్థిరపడినవాడు. వూళ్ళో మంచి పేరు తెచ్చుకున్నాడు అందుకే అతనంటే నాకు కూడా చాలా ఇష్టం. ప్రస్తుతం వూరికి నన్ను ఆత్మీయంగా ఆహ్వానించగల మా ఇంటి పేరుగల ఒకే ఒక వ్యక్తి శ్రీధర్ కానేటి. ‘నాన్నా’ అని ఆప్యాయంగా, ప్రేమగా పిలుస్తాడు. అతడివల్లనే అప్పుడప్పుడూ నేను పుట్టిపెరిగిన గ్రామానికి వెళ్లి కొద్దిరోజులు గడిపే అవకాశం కలుగుతున్నది.
అల్లాగే మల్కీపురంకి దగ్గరలో చింతలమోరి అనేగ్రామంలో నివాసం ఉంటున్న మా మేనమామ కూతురు (మార్తమ్మ) (ఈమె తమ్ముడు రాజబాబుని అల్లుడిగా చేసుకుంది. అతను ఇంటర్ స్థాయినుండి నా దగ్గర వుండి చదువుకుని ప్రయోజకుడైనాడు) తో కూడా సత్సంబంధాలు ఉండడం మూలాన,రాకపోకలు సజావుగానే సాగుతున్నాయి. వాళ్ళు ఉండడం వల్ల కూడా అప్పుడప్పుడూ స్వగ్రామం వెళ్లే వెసులుబాటు వుంది.
తర్వాత మా అమ్మ తరుపు తమ్ముడు వరస దేవదానం గారు కూడా రామరాజులంక (ఇప్పుడు లేరు) నివాసి కావడం వల్లనూ, వాళ్ళ చిన్నబ్బాయి చొప్పల రాజేశ్వరరావు రాజోలు హైస్కూల్‌లో నాకు సీనియర్ కావడము, అతని కూతురిని మా తమ్ముడు (కజిన్) కొడుకు వివాహం చేసుకోవడం వల్లనూ బంధుత్వం మరింత బలపడి, వాళ్ళుకూడా ఇప్పటివరకూ కూడా సత్సంబంధాలు కలిగివుండడం వల్ల,నేను వూరికి వెళితే పలకరించేవాళ్ళు కూడా ఉన్నారనే ధైర్యంతో బ్రతుకుతున్నాను. అలాగే ఎప్పుడు వూరికి వెళ్లినా, రాజోలులో వున్న నా చిన్ననాటి సహాధ్యాయి, సీనియర్ అడ్వకేట్ శ్రీ విన్నకోట లక్ష్మీపతిని కూడా తప్పకుండా కలుస్తాను. అప్పటినుండి ఆయన నాతో సంబంధాలు కలిగివున్నాడు. ఇంకా విశేషం ఏమిటంటే 2013లో మా అమ్మాయి నీహార పెళ్ళికి మరో ఇద్దరు స్నేహితుల్ని తీసుకుని హన్మకొండకు వచ్చారు.
స్వగ్రామం గుర్తుకొచ్చినప్పుడల్లా తట్టుకోలేనంత బాధ కలుగుతుంది. తెల్లవారుఝామున మెలుకువ వచ్చి ఇంటి గురించిన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చి మనసు వికలమైపోతుంది. ఇది ఒకరకమైన అనారోగ్య సమస్య అనుకుంటుంటాను అప్పుడప్పుడు. ఇలాంటి సమస్య నాకేనా? ఇతరులకు కూడా ఉంటుందా? అన్నది నా సందేహం.
మన అస్తిత్వం చాటుకునే మనవూరిని మరిచిపోకుండా అప్పుడప్పుడు ఆ నేలను తాకి, ఆ గాలిని పీల్చడం యెంత తృప్తిని ఇస్తుందో,అది అనుభవించే వాడికే తెలుస్తుందనుకుంటా. అందుకేనేమో –
‘జననీ జన్మభూమిశ్చ – స్వర్గాదపి గరీయసి!’ – అన్నదానిలో యెంత నిజముందో అర్థం అవుతుంది.
అందుకే వేరు కారణాల వల్ల వూరు విడిచి పెట్టివచ్చినా, పుట్టిపెరిగిన ఊరిని ఎన్నటికీ మరువరాదు. జన్మస్థలాన్ని, స్థిరపడిన ఊరిని సమానస్థాయిలో అనుభవించే అవకాశం వున్నవారు, నిజంగా యెంత అదృష్టవంతులో కదా!
***
పుణ్యభూమి
అక్కడ… నేలంతా,
పచ్చని తివాచీ పరిచినట్టు
నిత్యం నిగ నిగ లాడుతుంటుంది,
పొలాలన్నీ…
పచ్చని పైరుతో
ఉయ్యాల లూగుతుంటాయ్!
కార్మిక… కర్షకులతో,
కష్టించి పనిచేసే కూలీలతో,
కోడికూతతో పనిలేకుండానే,
తెల్లవారుతుందక్కడ!
మెట్టభూములన్నీ…
నారికేళ వృక్ష సముదాయంతో
జిరాఫీల్లా… తల పైకెత్తి,
ఆప్యాయంగా…
పలకరిస్తుంటాయ్.
జీవితాంతం…
జీవన భృతిని
అందిస్తుంటాయ్!
గోదావరి గట్టు…
గ్రామాలను… పొలాలను,
విడదీసే ఏటిగట్టుకు,
ఇరువైపులా…
గుబ్బ గొడుగుల్లాంటి చెట్లు,
బాడీ గార్డుల్లా… నిలబడి,
బాటసారులకు
మార్గదర్శనం చేస్తుంటాయ్!
కష్టపడడం ఎలాగో..
కష్టించి…
తృప్తిగా బ్రతకడం ఎలాగో,
క్రమశిక్షణగా జీవించటం ఎలాగో,
సహజంగా నేర్పుతుంది
ఈ ప్రదేశం!
ఇదే… నా ఊరు
నను గన్న ఊరు..
నను పెంచి… పోషించిన ఊరు,
‘దిండి’… దాని పేరు..!!
-డా.కె.ఎల్.వి.ప్రసాద్, హనంకొండ..4
(మళ్ళీ కలుద్దాం)