జ్ఞాపకాల పందిరి-107

40
2

అలా.. జరిగివుంటే..!!

[dropcap]చి[/dropcap]న్నపిల్లలతో ఆడుకోవడం, వాళ్ళతో కాలక్షేపం చేయడం ప్రతి తల్లికి తండ్రికి వాళ్ల జీవితంలో అనుభవమే! అది పిల్లల పెంపకంతోనే ముడిపడి వున్నబంధం, ఎవరూ విడదీయలేని అనుబంధం. అది కష్టమైనా, సుఖమైనా, దానిలోని ఆనందం, తృప్తి అది అనుభవించినవాళ్లకే అర్థం అవుతుంది. పిల్లలు తెలిసీ తెలియక ఎన్ని ఇబ్బందులు సృష్టించినా, ఎన్ని సమస్యలకు కారణం అయినా, అది సంతోషంగానే భరిస్తారు. అందులోని మాధుర్యం ఆయా తల్లిదండ్రులకు మాత్రమే తెలుస్తుంది. రక్త సంబంధాలు అలా ముడివేసేస్తాయి, అంతే! అల్లరిని ఆనందంగా ఆస్వాదిస్తారు, ఏదైనా అనారోగ్య సమస్య ఎదురైతే ఆందోళనతో తల్లడిల్లిపోతారు. అందుకే పిల్లల పెంపకం అంటే మామూలు విషయం కాదు. పిల్లలను ప్రేమగా పెంచడం, వారి ఆరోగ్య పరిరక్షణలో అప్రమత్తంగా ఉండడం, తల్లిదండ్రులకే కాదు పిల్లలతో అనుబంధం వున్నబంధువులకు, రక్తసంబంధీకులకు కూడా కత్తి మీద సాము లాంటిదే మరి!

రచయిత మనవరాలు ఆన్షి. నల్లి

పిల్లలంటే ప్రేమ ఎవరికుండదు? పిల్లలను ప్రేమగా చూసుకోవాలని ఎవరికుండదు గనుక! అందుకే అంతటి ప్రేమను పిల్లలతో పంచుకునే తల్లిదండ్రులు వారికి చిన్న దెబ్బతగినా, చిన్న గాయం అయినా, చిన్న అనారోగ్య సమస్య ఏర్పడినా విపరీతమైన ఒత్తిడికి గురి అవుతారు. లేని అనారోగ్య సమస్యను తెచ్చుకుంటారు. పిల్లలు సమస్య నుండి బయట పడేవరకూ వారికి మనసులో మనసు ఉండదు. పిల్లల ఆరోగ్యం కోసం వాళ్ళ ఆనందం కోసం వేయి దేవుళ్ళకు మొక్కుతారు.

తల్లి నిహార. కానేటితో బేబి ఆన్షి.నల్లి

అంటే పుట్టిన పిల్లలకు, వారి తల్లిదండ్రులకు మధ్య అంతటి మధురాతి మధురమైన బంధం ఏర్పడి ఉంటుంది. అందుకే పిల్లలకు ఏదైనా జరగకూడనిది జరిగితే, వాళ్ళు అసలు తట్టుకోలేరు.

తల్లి నిహార, తాత డాక్టర్ ప్రసాద్ తో బేబి ఆన్షి.

ఒకప్పుడు పిల్లలకు కాస్త వయసు రాగానే వారి పెంపకం లేదా సంరక్షణ అమ్మమ్మ ఇంటికో, నానమ్మ ఇంటికో బదిలీ అయ్యేది. ముఖ్యంగా భార్యాభర్తలు ఉద్యోగస్తులు అయినప్పుడు (ఈ మధ్య కాలంలో ఇవి సాధ్యం కావడంలేదనుకోండి) ఇది తప్పనిసరి అయ్యేది. ఈ నేపథ్యంలో అక్కడ పిల్లల పెంపకం మరింత కష్టతరంగా ఉంటుంది. సాధారణంగా, గారాబం ఇలాంటి చోట్ల అగ్రస్థానంలో వుంటుంది. పిల్లలు అల్లరి చేసినా భయం చెప్పే సాహసం వారు చేయరు. పిల్లలు చెప్పిన మాట వినరు, వద్దన్న పని చేయడానికే మొండిపట్టు పడతారు. అలా పిల్లలకు దెబ్బలు తగిలినా, ప్రమాదం వాటిల్లినా, పిల్లల అల్లరి గురించి అసలు ఆలోచించక పెంచుతున్న పెద్దల మీదనే అభియోగాలు రకరకాలుగా అల్లుకుంటాయి. వాళ్ళు పిల్లలను ఎంత ప్రేమగా చూసినా అది అంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. ఇలాంటి సమయాల్లో తాతలు, అమ్మమ్మలు, నానమ్మలు పడే టెన్షన్, మానసిక వ్యథ అంతా ఇంతా కాదు. అసలు కంటే, వడ్డీ మధురం అన్నట్టు, పెద్దవాళ్ళు తమకు పుట్టిన పిల్లల కంటే, మనుమలు -మనుమరాళ్ళ మీదనే ప్రేమను అధికంగా పెంచుకోవడం వల్ల కొన్ని సాంకేతికపరమైన చిక్కు సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది.

తల్లిదండ్రులతో…ఆన్షి

అలాంటప్పుడు ఎడా పెడా ఇబ్బందులకు గురి అయ్యేది పెద్దలే! కష్టపడి ప్రేమగా పెంచిన మనుమలు-మనుమరాళ్ళ విషయంలో, ఎలాంటి చిన్న సమస్య వచ్చినా, క్రమంగా అవగాహనా లోపంతో చిన్నారులతో పెంచుకున్న అనుబంధాన్ని దూరం చేసుకోవడమేకాక మనసుల మధ్య అంతరాలు పెరిగే అవకాశాలు ఎక్కువ. ఇలా కాకుండా, తాతల లేదా తాతమ్మల దగ్గర పెరిగిన పిల్లలు, ఒక వయసు వచ్చాక తప్పనిసరిగా తల్లిదండ్రులు నివసిస్తున్న చోటికి వెళ్ళక తప్పదు. అదే వారి స్వంత ఇల్లు అవుతుంది కదా! అందుకే ఎప్పటికైనా అక్కడికి చేరక తప్పదు. ఆ సమయంలో మనవలికి దూరం అవుతున్న తాతల/అమ్మమ్మల/నానమ్మల వ్యథ వర్ణించలేనిది. అది అనుభవించిన వారికి మాత్రమే అర్థం అవుతుంది.

తాత, అమ్మమ్మ, తల్లిదండ్రులతో బేబి. ఆన్షి.

ఇలాంటి సన్నివేశాలు చాలా కుటుంబాలలో చూస్తాం, దీనికి నా కుటుంబం అతీతం కాదు.

ఆడపిల్లలకు పెళ్ళైన తర్వాత, అత్తారింటికో లేదా ఉద్యోగరీత్యా వేరో చోటికో వెళ్లిపోవడం సహజం. తల్లిదండ్రులను కలిసే అవకాశం అప్పుడప్పుడు మాత్రమే వస్తుంటుంది. అలా నా కూతురికి కూడా పెళ్లి అయిన తర్వాత అత్తారింటికి వెళ్ళిపోయింది. అత్తారిల్లు సికింద్రాబాద్ కనుక కొంతలో కొంత దేవుడు నాకు మేలు చేశాడని దుఃఖంలో కూడా ఆనందపడ్డాను. తర్వాత అమ్మాయికి ఆకాశవాణిలో ఆఫీసరుగా (పెక్స్) ఉద్యోగం రావడం, నిజామాబాద్‍లో పోస్ట్ చేయడం కూడా జరిగాయి. మరీ దూరంగా కాకుండా మాకు దగ్గరలోనే అమ్మాయికి పోస్టింగ్ రావడం కొంత తృప్తిని కలిగించింది. తర్వాత అదృష్టం నావైపే వుండి మా అమ్మాయికి అక్కడినుండి బదిలీ అయి, నేను నివసిస్తున్న వరంగల్ జిల్లాకు వచ్చింది. అప్పుడు నా ఆనందానికి అంతులేకుండా పోయింది. అంతమాత్రమే కాదు నా మనమరాలు చిరంజీవి ఆన్షి ఇక్కడే పుట్టింది. అయిదు సంవత్సరాలు వచ్చేవరకూ నా దగ్గరే పెరిగింది. ఎక్కువగా నాతోనే ఉండేది. నన్ను ఎత్తుకోమనేది. రాత్రిళ్ళు ఆమెను నిద్రపుచ్చే పని కూడా నాకే పడేది. నేను ఎక్కడికెళ్లినా తానూ వస్తానని మారాము చేసేది. చాలాసార్లు బయటకు వెళ్ళేటప్పుడు యేవో మాయమాటలు చెప్పి తప్పించుకునేవాడిని. అది కూడా అంత సులభంగా అయ్యేదికాదు. ఒకసారి మాత్రం నా మాయమాటలు ఏమాత్రం పని చేయలేదు.

ఆఫీసులో (ఆకాశవాణి-వరంగల్) నిహార. కానేటి
మేనమామ (రాహుల్)తో ఆన్షి.
మేనత్త (దివ్య)తో బేబి ఆన్షి
స్కూల్ విద్యార్థిని (గీతాంజలి..బేగంపేట)గా ఆన్షి. నల్లి.

మనవరాలికి అప్పుడు మూడు సంవత్సరాల వయస్సు ఉండవచ్చు. ఆదివారం ఉదయం మార్కెట్‌కు బయలుదేరుతుండగా, పట్టువదలని విక్రమార్కుడిలా ‘నేనూవస్తా’నని గొడవ చేసింది. అప్పుడు ఇక తీసుకువెళ్లక తప్పలేదు. అప్పుడు నాకు ‘శాంత్రో కారు’ ఉండేది. అందులో మనవరాలిని తీసుకుని బాలసముద్రం (హన్మకొండ) మార్కెట్‌కు వెళ్లాను. పాపకు మార్కెట్ అంతా చూపించాను. అవసరమైన కూరగాయలు వగైరా తీసుకుని, కారు దగ్గరకు తీసుకు వెళ్లాను. అక్కడ జరిగిన సంఘటనకు ఒళ్లు ఝల్లుమంది. వళ్లంతా చెమటలు పట్టి నా చొక్కా తడిసిపోయింది. కాళ్ళు వణకడం మొదలుపెట్టాయి. మనవరాలితోపాటు నేనూ ఏడవడం మొదలుపెట్టాను. గుండె దడ మొదలైంది. నాకేదైనా అయిపోతుందేమోనని భయపడ్డాను కూడా. క్రమంగా పాప ఏడుపు తగ్గించడంతో నేను కూడా కాస్త కుదుట పడ్డాను.

అప్పుడు రచయిత మనవరాలిని మార్కెట్ కు తీసుకువెళ్లిన నాటి శాన్త్రో కారు

ఇంతకీ అక్కడ జరిగిందియేమిటంటే కూరగాయల సంచి, కారు డోర్ తెరిచి వెనుక సీట్లో ఉంచి డోర్ క్లోజ్ చేస్తున్న తరుణంలో డోర్ వెనుక భాగం తెరుచుకున్న ఖాళీలో మనవరాలు కుడి చెయ్యి పెట్టింది. నేను డోర్ మూసివేయడంతో పాప చెయ్యి అందులో చిక్కుకుని ఏడవడం మొదలుపెట్టింది. నిజానికి అప్పుడు ఆమె చేతివేళ్ళు చితికిపోవాలి, లేదా వేళ్ళు ముక్కలుగా విరిగిపోవాలి. కానీ పాపకు ఏమీ జరగలేదు. కొంత సమయం తర్వాత చేతి వేళ్ళు వాచాయి, అంతే! ఒకవేళ జరగకూడనిది జరిగివుంటే నేనేమై పోయివుండేవాడిని? నా కూతురికీ అల్లుడికీ ఏమి సమాధానం చెప్పాల్సి వచ్చేది? తలచుకుంటే ఇప్పటికీ భయం అనిపిస్తుంది. అల్లుడు కూతురు అర్థం చేసుకున్నారు కనుక సరిపోయింది, లేకుంటే నా పరిస్థితి ఏమిటీ? సరే.. అది గతం గతః. ఇప్పుడు నా మనమరాలు కూడా నా దగ్గర లేదు. హైదరాబాద్‌కు వాళ్ళింటికి చేరుకుంది. ఏ పిట్ట.. ఆ పిట్ట గూటికి చేరుకోవలసిందే కదా!నేను కూడా క్రమంగా అలవాటు పడుతున్నాను. ఎవరికైనా ఇది తప్పదు మరి, అందరిలానే నేనూనూ.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here