Site icon Sanchika

జ్ఞాపకాల పందిరి-109

నిరక్షరాస్యురాలు అక్షరాస్యులను తయారు చేసింది..!!

[dropcap]తె[/dropcap]లివితేటలకు, అక్షరాస్యతకు సంబంధం లేదనిపిస్తుంది ఒకోసారి. అక్షరాస్యతకు పదవులకు కూడా సంబంధం ఉండదని కొన్ని ఉదంతాలు గుర్తుచేస్తాయి. అయితే ఇది అందరికీ సాధ్యమా? అంటే సాధ్యం కాకపోవచ్చు. ఉద్యోగాలకైతే తప్పనిసరి. రాజకీయ రంగంలో చదువులతో పని లేదు. రాజకీయ చదరంగం ఆడడం వస్తే చాలు, ఎలాంటి చదువు సంధ్యలు లేకపోయినా అలా.. అలా పైకి ఎదిగిపోవచ్చు. పైవాడికి విధేయత కలిగిఉంటే చాలు, కాలం కలిసి వస్తే అందలం ఎక్కేయవచ్చు!

అక్షరజ్ఞానం లేనివాళ్ల చేత మనం పరిపాలింప బడవచ్చు. అలాగే బహుకొద్ది చదువుతో అనేక రంగాలలో బహుముఖ పాత్ర వహించి చరిత్రను సృష్టించవచ్చు.

ఒకప్పుడు మద్రాసు (ఇప్పుడు తమిళనాడు) రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసి విద్యారంగానికి గొప్ప సేవలు అందించిన కామరాజ్ నాడార్ పెద్ద గొప్పగా చదువుకోలేదు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోవడంతో హైస్కూల్ స్థాయిలోనే ఆయన చదువుకు స్వస్తి పలక వచ్చింది. రాజకీయంగా ఎదిగి నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీని ఆ పదవిలో కూర్చోబెట్టడానికి చక్రం తిప్పింది ఈ రాజకీయ మేధావే! ఇక్కడ ఈయనకు పెద్ద చదువులు పెద్దగా అవసరం రాలేదు.

అలాగే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏడవ ముఖ్యమంత్రిగా పని చేసిన స్వర్గీయ టంగుటూరి అంజయ్యగారు చదువుకున్నది చాలా తక్కువ. ఆయన పేదరికంతో హైదరాబాద్ ఆల్విన్ కంపెనీలో ఆరణాల (24 పైసలు) కూలీగా పనిచేసి రాజకీయ రంగంలో ఎదిగి, ముఖ్యమంత్రి పదవిని పొందినవాడు. ఈయనకు కూడా పెద్ద పెద్ద పదవులు పొందడానికి చదువుకోకపోవడం అనే అంశం అడ్డు రాలేదు.

వీరు మాత్రమే కాకుండా, మనదేశంలోను ఇతర దేశాలలోనూ తక్కువ చదువుతో అత్యున్నత స్థానాలకు చేరుకొని కీర్తి ప్రతిష్ఠలు పొందినవారు, పొందుతున్నవారు వున్నారు. అలంటి వారిలో ప్రస్తుత కేంద్ర మంత్రివర్గంలో మంత్రిణిగా వున్న శ్రీమతి స్మృతి ఇరానీ, ఒకప్పటి మిస్ వరల్డ్ కిరీటాన్ని కైవసం చేసుకున్న ఐశ్వర్య రాయ్ (అమితాబ్ బచ్చన్ కోడలు), ప్రముఖ శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, వ్యాపారవేత్త అజీమ్ ప్రేమ్‌జీ, ప్రపంచ ప్రసిద్ధి పొందిన క్రికెట్ క్రీడాకారుడు సచిన్ టెండూల్కర్, రిలయన్స్ అధినేత స్వర్గీయ ధీరుభాయి అంబానీ, బాక్సర్ మేరీ కోమ్, గౌతమ్ అదానీ, ప్రపంచ క్రికెట్ కప్ సాధించిన నాటి కపిల్ దేవ్ వంటివారు పెద్దగా చదువుకోకుండానే కీర్తిప్రతిష్ఠలు సంపాదించారు. ఇలాంటి వారు ఇంకా ఉండవచ్చు, అది వేరే విషయం.

ఒకప్పుడు అంటే నా చిన్నప్పుడు మా గ్రామంలోనూ చుట్టుప్రక్కల గ్రామాలలోనూ చదువుకున్న కుటుంబాలు, పిల్లలకు చదువు చెప్పించిన కుటుంబాలు బహుతక్కువగా ఉండేవి. అతి స్థితిమంతులు, అతి పేదవారు తమ పిల్లలను చదివించేవారు కాదు, బడికి పంపించేవారు కాదు.

కాస్త మధ్యతరగతి అనుకున్న కుటుంబాలు తాము నిరక్షరాస్యులైనా తమ పిల్లలను అక్షరాస్యులను చేయడానికి తహతహ లాడేవారు. ప్రభుత్వ రాయితీలను సద్వినియోగం చేసుకుని పిల్లలు బాగా చదువుకునేవారు. అలాంటి మధ్యతరగతి లేదా దిగువ మధ్య తరగతి కుటుంబం మాది.

రచయిత తల్లిదండ్రులు స్వర్గీయ కానేటి తాతయ్య, స్వర్గీయ కానేటి వెంకమ్మ.

మా నాయన స్వర్గీయ కానేటి తాతయ్య గారు, గ్రామపెద్దగా వ్యవహరించేవారు. ప్రధాన కమ్యూనిస్టు (విడిపోని కమ్యూనిస్టు పార్టీ) కార్యకర్తగా, రైతు కూలీల పక్షాన పనిచేసేవారు. ప్రభుత్వ బంజరు భూమిని తీసుకుని సాగు చేసేవారు. పిల్లల మొత్తం బాధ్యత మా అమ్మ స్వర్గీయ కానేటి వెంకమ్మ తీసుకునేది. మా నాయన కొద్దిగా చదువుకున్నారు. మేము బిగ్గరగా చదువుతున్నప్పుడు మా తప్పులు పట్టుకునేంత జ్ఞానం ఆయనకు ఉండేది. అయితే మా చదువుల విషయంలో అంత సీరియస్‌గా ఉండేవారు కాదు. రాత్రిపూట గుడ్డి దీపాలముందు పుస్తకాలు పెట్టుకుని కునికిపాట్లు పడుతుంటే “నిద్ర పోరాదా..!” అనేవారు. మా అమ్మ స్వర్గీయ కానేటి వెంకమ్మ మాత్రం బాగా చదువుకోవాలని ప్రోత్సహించేది. భయపెట్టి మాట్లాడేది కాదు, చాలా సున్నితంగా, ప్రేమగా చెప్పేది. మా నాయన ఏమి చెప్పినా, ఎలా చెప్పినా మాకు విపరీతమైన భయం వేసేది.

రచయిత తల్లిదండ్రులు స్వర్గీయ కానేటి తాతయ్య, స్వర్గీయ కానేటి వెంకమ్మ.

ఆయన నేర్పించిన క్రమశిక్షణ నా భావి జీవితానికి మార్గదర్శనం అయింది. అయితే ఇక్కడ మా అమ్మ ప్రత్యేకత ఏమిటంటే, ఆవిడ నూటికి నూరు శాతం నిరక్షరాస్యురాలు.

మా అమ్మ మా పక్క వూరు అయిన రామరాజులంకలో ‘చొప్పల’ వారి ఇంటి ఆడపడుచు. మా అమ్మకు ఒక అక్క (గొనమండ సత్తెమ్మ), ఇద్దరు చెల్లెళ్లు (చొప్పల మరియమ్మ, ఈద మార్తమ్మ), ఇద్దరు తమ్ముళ్లు (చొప్పల ఆనందరావు, చొప్పల సుందర్రావు), తల్లి (మహాలక్ష్మి), తండ్రి (వీరాస్వామి) వీరంతా నిరక్షరాస్యులే!

రచయిత అమ్మ(ఎడమ నుండి రెండవ వారు), పెద్దక్క(కుడి నుండి మొదటివారు), చిన్నక్క(కుడి నుండి మూడవ వారు)

వీళ్లందరిలోనూ మా అమ్మ పిల్లలే (అంటే మేము) విద్యారంగంలో చెప్పుకోదగ్గ విజయాలు సాధించిన వాళ్ళం. చదువులో మేము రాణించడానికి ప్రధాన కారణం మా అమ్మ ప్రోత్సాహం, మా నాయన క్రమశిక్షణ. మా నాయనకు పిల్లల పట్ల అమితమైన ప్రేమ ఉండేది. అందుకే చదువుల పేరిట మేము వారికి దూరం అవుతున్న సందర్భంలో ఆయన కళ్ళు జలపాతాలయ్యేయి. మా అమ్మ యెంత బాధ వున్నా దిగమింగుకుని దైర్యంగా ఉండేది, మాకు దైర్యం చెప్పేది. తన పిల్లలు విద్యావంతులు కావాలనీ, ప్రయోజకులు కావాలని మా అమ్మ కోరుకునేది. దానికోసం ఎన్ని త్యాగాలైనా చేసేది. మా వూర్లో మా అమ్మ, ఆమె పిల్లలు ఒక రికార్డు సృష్టించినట్లే! తనకు చదువు లేకపోయినా,తన పిల్లల చదువుకోసం ఆవిడపడ్డ ఆరాటం, శ్రమ, మామూలు విషయం కాదు!

రచయిత పిన్ని (ఈద మార్తమ్మ-సరిపల్లి), కొడుకు (కుడినుండి2), కోడలు(కుడి నుండి 3), మనుమలు-మనుమరాలు

చదువు విలువ తెలిసిన మా అమ్మ ధన్యురాలు. అనుకున్నది కష్టపడి ఆవిడ సాధించింది. పిల్లలందరూ చదువుకుని తమ జీవితాల్లో స్థిరపడేవరకూ వుంది, కానీ పిల్లల ప్రగతిలో ఆనందంలో, అనుభవాలను పంచుకోకుండానే వెళ్ళిపోయింది.

పిన్ని ఈద మార్తమ్మ (సరిపల్లి)తో, రచయిత

ఆ రకంగా మా అమ్మను సుఖపెట్టలేని దురదృష్టం మాది. ఆ అసంతృప్తి ఇప్పటికీ నన్ను బాధిస్తూనే ఉంటుంది. ప్రతిరోజూ ఏదో సమయంలో నా మనసును మెలిపెడుతూనే ఉంటుంది. ఆ తల్లి కని పెంచిన పిల్లలుగా మేము ఎప్పుడూ గర్వపడుతూనే ఉంటాం.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version