[box type=’note’ fontsize=’16’] “కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే…!!” అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్. [/box]
మామయ్యనే చేసుకుంటా…!!
[dropcap]అ[/dropcap]మ్మాయిలైనా, అబ్బాయిలైనా, యవ్వన ప్రాంగణం లోనికి అడుగుపెట్టాక శరీరం వాళ్ళని ఓ పట్టాన నిలువనీయదు. శరీరంలో వయసుతోపాటు అనేక మార్పులు వెంటనడిచి వస్తాయి. అలాంటి వయసు మనిషిని కుదురుగా నిలువనీయదు. ఆడపిల్లల విషయంలో పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. ఎందుచేతనంటే, వాళ్ళ శరీరంలో కలిగే మార్పులు కొన్ని ఇబ్బందులను తెచ్చిపెట్టినప్పటికీ, వాళ్ళల్లో వయసుతోపాటు వచ్చే సహజమైన ఆకర్షణ మగపిల్లల దృష్టిని వారివైపు మరలుస్తాయి. మంచి మాటలతో దగ్గర కాలేని వారు, ఏదో రూపంలో అల్లరి చేయడం, పేర్లు పెట్టి పిలవడం, వారివైపు ఆడపిల్లలు ఆకర్షింపబడేలా యేవో కోతి చేష్టలు చేసి ఆడపిల్లలను మానసికంగా ఇబ్బంది పెడుతుంటారు. ఇలా.. పెరుగుతున్న, వయసొచ్చిన ఆడపిల్ల రెండురకాల ఇబ్బందులకు గురి అయ్యే ప్రమాదం వుంది. ఇలాంటి అల్లరి మూకలపైన ఎంత నిఘా ఉంచినా, ఎక్కడో ఒకచోట, ఏదో ఒక రూపంలో అమాయకులైన ఆడపిల్లలపైనా నిత్యం ఘోరాలు జరుగుతూనే ఉంటాయి. ఆడపిల్లలను కన్న తల్లిదండ్రులకు ఇదొక పెద్ద సవాల్!
ఎవరో విశాల హృదయం వున్నతల్లిదండ్రులు తప్ప, వేరే వాళ్ళు ఎవరూ ఇలాంటి ప్రేమలూ -పెళ్ళిళ్ళను ప్రోత్సహించరు, వెనకేసుకు రారు. ఇక్కడే చిక్కులు ఏర్పడుతున్నాయి. సాహసించినవాళ్లు గువ్వల్లా ఎక్కడికో ఎగిరి పోవడం, గుండెధైర్యం లేనివాళ్లు క్షణికావేశంలో ఊహించని నిర్ణయాలు తీసుకోవడం నిత్యం మనం వింటున్న విషయాలే! అయితే, ఈ ప్రేమ పిచ్చిలో కుటుంబ నేపథ్యాలు అర్థం చేసుకోకుండా, తెలుసుకోకుండా, పరిగణనలోకి తీసుకోకుండా సాహసించినవాళ్లు, తర్వాత అనేక ఆర్థిక సామాజిక ఇబ్బందుల్లో ఇరుక్కోవడమో, వదలలేక, కదలలేక, అడకత్తెరలో పోక చెక్క మాదిరిగా తయారుకావడమో, ఏమీ చేయలేని పరిస్థితిలో ఏదో అఘాయిత్యానికి పాల్పడడమో, లేదా ఏ దిక్కూ తోచక తిరిగి అయిన వారిని చేరడమో జరుగుతుంటాయి.
ఇలాంటి సంఘటనలు మన జీవితంలో చోటు చేసుకున్నప్పుడు మనం ఏమి చేస్తాం?ఎవరి గురించో ఎందుకు -నా అనుభవమే మీ ముందు వుంచుతున్నాను చూడండి.
ఇంటర్‌మీడియేట్ వరకు అమ్మాయిలతో మాట్లాడింది అతితక్కువ! ఏదో సందర్భాన్ని బట్టి మాట్లాడడం తప్ప, అంతకు మించి ఏమీ ఉండేది కాదు. ఆడపిల్లల గురించి ప్రత్యేకమైన ఆలోచనలూ ఉండేవి కాదు. కడకు బి.ఎస్.సి మొదటి సంవత్సరంలో కూడా ఆ వాతావరణం ఎక్కడా కనిపించలేదు. కానీ 1975 లో బి.డి.ఎస్.లో చేరిన తరువాత తప్పని సరిగా ఆడపిల్లలతో కూడా మాటా మంతి, కలిసి తిరగడం, కలిసి చదవడం వంటివి ప్రారంభమైనాయి. స్నేహభావమే తప్ప ఎలాంటి ఇతర ఆలోచనలు ఉండేవి కాదు. ఆడపిల్లలు నా వెంటపడేటంత సీను, నా దగ్గర లేకపోయినప్పటికీ, ఒకరిద్దరి ప్రయత్నాలను సున్నితంగా తిరస్కరించవలసి వచ్చింది. దానికి కారణాలు అనేకం, ఇక్కడ అప్రస్తుతం కూడా!
అందుకే, ఒక మంచి ఆలోచన వచ్చి, ఉత్తరాలను ఆశ్రయించాను. అలా ప్రారంభమైన ఉత్తరాలు ప్రేమలేఖలుగా రూపాంతరం చెంది సంఖ్య వందకు మించిపోయింది. మనసులు అతి దగ్గరగా చేరిపోయాయి. కానీ అనేక ఆటంకాలు అడ్డుపడ్డాయి. మా ప్రేమ వ్యవహారం, నేను రాసిన ఉత్తరం పెద్ద వాళ్ళ చేతిలో పడడంతో బయటపడింది. వాళ్ళ ఇంట్లో, బంధువుల్లో పెద్ద సమస్య వచ్చిపడింది, చర్చనీయాంశం అయింది కూడా! కారణం వాళ్ళ దృష్టిలో నేను నాస్తికుడిని, అన్యుడిని. అందుచేత ఎట్టి పరిస్థితిలోను, వాళ్ళు నన్ను ఇష్టపడే పరిస్థితి లేదు! మావాళ్లు అమ్మాయిని ఇష్టపడ్డా క్రైస్తవంలో పెళ్లి చేయడానికి ఇష్టపడరు. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితిలో, పెద్ద సమస్య వచ్చిపడింది. నేను ఏదోలా మా వాళ్ళను ఒప్పించగలను గానీ, ఆ అమ్మాయికి అది సాధ్యం అయ్యే పరిస్థితి లేదు. కూతురిని అమితంగా ప్రేమించే కన్నతండ్రి కూడా మా పెళ్ళికి ఒప్పుకోవడం లేదు. ఆఖరిగా ఆ అమ్మాయి పదునైన అస్త్రాన్ని ప్రయోగించింది. “నేను మామయ్యనే చేసుకుంటాను. లేదంటే అసలు పెళ్లి చేసుకోను” అని భీష్మించుకుని కూర్చుంది.
అమ్మాయి తల్లి (మా అక్క) చాలా తెలివైనది. భవిష్యత్తును జాగ్రత్తగా అంచనా వేయగల వ్యక్తి. నా వల్ల కూతురు సుఖంగా బ్రతుకుతుందనే నమ్మకం ఆమె ఊహించింది. “ఎవరికి ఇష్టం లేకపోయినా, కూతురు ఇష్టపడ్డ అబ్బాయితోనే ఆమె పెళ్లి చేస్తా”నని, నిశ్చయంగా తేల్చి పారేసింది. మా అక్క క్రైస్తవ పెళ్ళికి ఇష్టపడక పోవడంతో, మా అన్న వదినలు కల్పించుకుని, విజయవాడలో ‘సువార్త వాణి’ భవనంలో ఘనంగా పెళ్లి జరిపించేసారు. కొసమెరుపు ఏమిటంటే పెళ్ళైన తర్వాత నన్ను అమితంగా ఇష్టపడ్డవాళ్లు/ఇష్టపడుతున్నవాళ్ళు, అప్పుడు నన్ను వద్దన్నవాళ్ళే!
నేను తొమ్మిదేళ్ల క్రితం (2011) సివిల్ సర్జన్‌గా, కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో పదవీ విరమణ చేశాను. నా శ్రీమతి అరుణ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (స్టేట్ బ్యాంకు ఆఫ్ హైదరాబాద్)లో స్వచ్ఛంద పదవీ విరమణ చేసింది. అరుణ నేను ఒకరి కొకరం విషయాలు అవగాహన చేసుకొని సర్దుబాటు మార్గంలో ఆనందంగా గడుపుతున్నాం. దేనికైనా పట్టువిడుపులు ఉండాలి, ఒకరినొకరు అర్థం చేసుకునే మనసులుండాలి, ముందుగా ప్రేమకు అర్థం తెలిసుండాలి. ఈ లక్షణాలున్న ప్రేమలు అపూర్వ జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. సమాజానికి ఒక మాదిరిగా నిలుస్తాయి.
(మళ్ళీ కలుద్దాం)