Site icon Sanchika

జ్ఞాపకాల పందిరి-111

మగ పిల్లాడైనా.. ఆడ పిల్లైనా..!!

[dropcap]కూ[/dropcap]తురైనా, కోడలైనా మొదటిసారి గర్భం ధరించినప్పుడు, అందరూ కోరుకునేది మొదట మగపిల్లవాడు పుట్టాలని. అంటే వంశోద్ధారకుడు పుట్టాలని కోరుకుంటారు, లేదా గతంలో కోరుకునేవారు. చివరికి ప్రసవించే తల్లులు సైతం ఇలాగే కోరుకునేవారు. ఇప్పటికీ అలా కోరుకునేవారు లేకపోలేదు. మొదటి సంతానం మగ పిల్లవాడినే కోరుకునే వారి సంఖ్య మన సమాజంలో ఎక్కువగా ఉంటుంది. ఆడపిల్ల పుట్టగానే పెదవి విరిచే మహానుభావులెంతమందో! విచిత్రం ఏమిటంటే అందులో మళ్ళీ అలాంటివారు స్త్రీమూర్తులే! అందుకే కొందరు అనుభవజ్ఞులైన పెద్దలు చెబుతుంటారు, అదేమిటంటే, స్త్రీలకు స్త్రీలే శత్రువులు అని. ఇది వినేవారికి కాస్త వింతగానే ఉంటుంది. రేపటి సమాజ నిర్మాణానికి ఆడపిల్ల లేదా మహిళ యెంత అవసరమో ఆలోచించారా? అన్న భావన కూడా కలుగుతుంది. ప్రభుత్వాలు ఎన్ని రకాల చట్టాలు తీసుకువచ్చినా ఆడపిల్ల అని శాస్త్రీయంగానే తెలుసుకున్న తరువాత, ఆమె తల్లి గర్భంలో ఉండగానే బయట ప్రపంచం చూడకముందే అదృశ్యం అయిపోతున్నారు. అయితే ఒకటి మాత్రం వాస్తవం. సాధారణ కుటుంబాలలో ఆడపిల్లను సురక్షితంగా పెంచి పెద్ద చేయడం కత్తి మీద సాము వంటిదే. పుట్టినప్పటి నుండి ఆడపిల్ల వృద్ధాప్యం వచ్చి చనిపోయేవరకూ వివిధ స్థాయిల్లో ఏదో రూపంలో మానసికంగానూ, శారీరకంగానూ హింసకు గురి అవుతునే వుంది. ఆడపిల్ల అంటే ఒక ఆటవస్తువు అయిపొయింది, అంగడి బొమ్మగా మార్చబడింది. సన్నిహితుల నుండే కాదు, సమాజం నుండి కూడా స్త్రీమూర్తికి రక్షణ లేకుండా పోయింది.

ఇలాంటి విషయాలే సాధారణ కుటుంబాలు ఆడపిల్లలను వద్దనుకోవడానికి ప్రధాన కారణం కావచ్చు. అందుకే ఉన్నవారికీ లేనివారికి కూడా ఆడపిల్లను పెంచి పెద్దచేసుకుని రక్షించుకోవడం పెద్ద సవాలుగా మారింది. అలాగే మగపిల్లలను ప్రత్యేకంగా తీసుకుని, వారిని ప్రత్యేకంగా పెంచుతూ, అతిగా గారాబాన్ని పంచుతూ, చివరికి ఏమి చెప్పినా వినిపించుకొని పరిస్థితికి తీసుకు వచ్చేదీ తల్లిదండ్రులే! ప్రతీదానికి ‘వాడికేంటి మగపిల్లాడు’ అని వెనకేసుకొచ్చే తల్లిదండ్రులు కూడా కోకొల్లలు. ఇలా తమ సంతానంలో ఒకరిని ఒకలా, మరొకరిని మరోలా పెంచడం వల్లనే అనేక సాంకేతిక సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయనేది పెద్దల మాట! పిల్లలను పెంచే విధానంలో, ఆడపిల్లలను ఒకలా, మగ పిల్లలను మరోలా పెంచే తల్లిదందండ్రుల అవగాహనా లోపమే దీనికంతటికి కారణం అని చెప్పక తప్పదు.

ఐతే అన్ని రంగాల్లోనూ తమ ప్రతిభ చూపిస్తూ, సవాళ్ళను సైతం ఎదుర్కోగలిగే, శక్తి సామర్థ్యాలు కలిగిన అమ్మాయిలూ ఈ రోజున అకుంఠిత ఆత్మస్థైర్యంతో దైర్యంగా ముందుకు సాగిపోతున్నారు. ఇది చూసి తల్లిదండ్రులు సైతం హాయిగా ఊపిరి పీల్చుకోగలుగుతున్నారు.

సాధారణంగా తండ్రులు ఆడపిల్లల పట్ల ఎంతో ప్రేమను కలిగి వుంటారు (ఎక్కడో కొద్దిమంది దీనికి భిన్నంగా వుంటారు – అది వేరే విషయం). అలాగే ఆడపిల్లలు కూడా. కేవలం ప్రేమగా ఉండడమే కాదు, మగపిల్లలను మించి పని చేయడానికి, బాధ్యతలను స్వీకరించి సక్రమంగా వాటిని నెరవేర్చడానికి ఏమాత్రం వెనకాడడం లేదు. తల్లిదండ్రులను అసలు కష్టపడనివ్వడం లేదు. తల్లిదండ్రులకు ఒక రక్షణ కవచం లా తయారయ్యారు ఆడపిల్లలు. నేను చెబితే పొగుడుతున్నాను అనుకుంటారు గానీ, మా అమ్మాయి నీహార. కూడా అలాంటివారిలో ఒకరు.

ఆకాశవాణి-నిజామాబాద్ లో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ గా (మొదటి పోస్టింగ్) శ్రీమతి నిహార కానేటి
మొదటి సంతానం (ఆన్షి)తో రచయిత కూతురు… నిహార, అల్లుడు….వినోద్ కుమార్ జోషి

నాకు నా పిల్లలిద్దరు నా కళ్ల యెదుట వుండాలని అనిపిస్తుంది. కానీ పిల్లల ఆలోచనలు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. ఉద్యోగం వేటలో అమెరికా వరకూ వెళ్లి అక్కడ స్థిరపడ్డాడు మా అబ్బాయి రాహుల్ కానేటి. నేను దానికి ఒప్పుకోక తప్పలేదు. అందుకే మా అమ్మాయి మా బాధ్యతలు తీసుకుంది.

మొదటి సంతానం (ఆన్షి)తో రచయిత కూతురు… నిహార, అల్లుడు….వినోద్ కుమార్ జోషి

అది కూడా ఎక్కువకాలం సాగలేదు. పెళ్లి చేసి అమ్మాయిని అత్తగారింటికి పంపక తప్పలేదు. ఆ తర్వాత ఆమె ఆకాశవాణి -నిజామాద్ కేంద్రంలో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌గా చేరక తప్పలేదు. సంవత్సరం తర్వాత దేవుడు మా పట్ల దయ చూపించాడు, మా అమ్మాయికి ఆకాశవాణి-వరంగల్ కేంద్రానికి బదిలీ అయింది. అంత మాత్రమే కాదు వాళ్ళు ప్లాన్ చేసుకున్న ప్రకారం ఇక్కడే మొదటి సంతానానికి జన్మనిచ్చింది. ప్రసవం హైదరాబాద్‌లో జరిగినా, మరుసటి రోజు నుండి నా దగ్గరే హన్మకొండలో వుంది. ఆమె మొదటి సంతానం ఆడపిల్లనే కోరుకుంది, భర్త కూడా కూతురే పుట్టాలని కోరుకున్నాడు. వారి కోరిక ప్రకారమే దేవుడు కరుణించి ఆడపిల్లను (ఆన్షి) వాళ్లకు ప్రసాదించాడు. నా ముద్దుల మనవరాలితో ఏకధాటిగా ఐదు సంవత్సరాలు, ఆనందంగా ఆదుకునే అవకాశం చిక్కింది. అనుకోని విధంగా ఇది నాకు దక్కిన అమూల్యమైన సమయం.

మనవరాలు (ఆన్షి. నల్లి)తో రచయిత.

ఇప్పుడు మా అమ్మాయి హైదరాబాద్‌కు వెళ్ళిపోయింది. సహజంగా మనవరాలు కూడా వెళ్లిపోతుంది కదా! మళ్ళీ జీవితంలో శూన్యం ఏర్పడడం మొదలైంది. చెప్పలేనంత దిగులు ప్రారంభం అయింది. హైదరాబాద్ నుండి మా యోగ క్షేమాలను మా అమ్మాయి పర్యవేక్షిస్తూనే వుంది. మేము చేసుకోలేని కొన్ని పనులు అక్కడినుండి తెలిసినవారికి పురమాయిస్తూ ఉంది.

అత్తారింటికి వెళ్లినా కూతురు బాధ్యతలు ఆమె ఇప్పటికీ మరచిపోలేదు. అన్న బాధ్యతలను కూడా తానే తీసుకుని నిర్విఘ్నంగా మాకు అన్నీ సమకూరుస్తున్నది. నా కొడుకు నాదగ్గర లేడే.. అన్న ఆలోచన మాకు రాకుండా చేస్తున్నది. ఇంతకు మించి ఆడపిల్ల ఏమి చేయాలి? ఏ విషయంలో ఆడపిల్ల తక్కువ? అందుకే.. నా దృష్టిలో ఇద్దరి విషయంలో నాకు ఎవరైనా ఒకటే అన్న భావం మొదటి నుండి మనస్సులో నాటుకు పోయింది. అది నా కూతురి ద్వారా నిరూపితమైంది.

రెండవ సంతానం కోసం సీమంతం వేడుకలో కూతురు నిహారకు మిఠాయి తినిపిస్తున్న రచయిత, డాక్టర్ కె.ఎల్.వి.ప్రసాద్.

ఇప్పుడు నా కూతురు రెండవసారి గర్భం దాల్చింది. కొద్దిరోజులు మాతో ఉండడానికి హన్మకొండ వచ్చింది. ప్రసుత పరిస్థితుల దృష్ట్యా ఆమెకు అతి తక్కువ స్థాయిలో సీమంతం జరిపించాం. ఈ సారికూడా ఆమె ఆడపిల్లనే కోరుకుంటున్నది. అది వాళ్ళ ఇష్టం. నేను మాత్రం ఈసారి మగ పిల్లవాడు పుడతాడనే ఆశాభావంతో ఉన్నాను, ఎందుకంటే ఒక ఆడపిల్ల వుంది కాబట్టి.

అమ్మమ్మ (పద్మావతి-విజయవాడ) ఆశీస్సులు అందుకున్న నిహార. కానేటి.

అయితే ఎవరు పుట్టినా సమానంగా ప్రేమించి పెద్దచేయగల నమ్మకం ఆత్మవిశ్వాసం, కన్న తల్లిదండ్రులకు ఉన్నప్పుడు ఈ సమస్య అసలు ఉత్పన్నం కాదని నా నమ్మకం.

సీమంతం…సంబరాలు భర్త, కూతురుతో నిహార. కానేటి.

భవిష్యత్ తరాలు ఇలా ఆడ, మగ అనే తేడా లేకుండా పెరగాలి. ఆడపిల్లకు మరింత ఆదరణ గౌరవం పెరగాలి. ముఖ్యంగా ఆడపిల్లల సంరక్షణ కోసం అన్ని వర్గాల ప్రజలు సహకరించాలి. ‘ఇంటికి దీపం ఇల్లాలు’ అన్నట్లుగా, ‘ఆడపిల్లలున్న ఇల్లు ఆనందాల హరివిల్లు’గా మారాలి.

అమ్మ-అమ్మమ్మ లతో నిహార కానేటి.

రాబోయే రోజుల్లో అన్ని రంగాలలోనూ (ఇప్పటికే ఇది చూస్తున్నాం) ఆడపిల్లలు, మగ పిల్లలను అధిగమిస్తారనీ, దేశాభివృద్ధిలో వీరి సేవలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారతాయనీ నమ్మేవాళ్ళల్లో నేనూ ఒకడిని. ఆరోజు కోసం ఎదురు చూడవలసిందే..!

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version