Site icon Sanchika

జ్ఞాపకాల పందిరి-115

అప్పటి నేనెరిగిన రవాణా సౌకర్యాలు..!!

[dropcap]గ్రా[/dropcap]మాలలో ఎంత దూరం పోవాలన్నా సామాన్యుడికి కాలినడక మాత్రమే దిక్కు. పైగా గ్రామాలలో రిక్షాల సదుపాయం కూడా ఉండేది కాదు. వున్నా వాటిని వినియోగించుకునే శక్తి అందరికీ ఉండేది కాదు. అప్పట్లో సైకిల్ ఉంటే చాలా గొప్ప! వాళ్ళని ఉన్నత కుటుంబీకులుగా పరిగణించేవారు. జనంలో వాళ్ళు ప్రత్యేకంగా కనిపించేవారు. కాస్త ఉన్నత కుటుంబీకులైన రైతు కుటుంబాలు తమ వ్యవసాయం కోసం ఉపయోగించే రెండెడ్ల బండ్లు ప్రయాణాలకు ఉపయోగించేవారు.

రెండెద్దుల బండి

గ్రామాలతో బస్సు రవాణా సౌకర్యాలు అనుసంధానం కాని రోజుల్లో గోదావరికి లేదా ఇతర నదులకు దగ్గరలో వున్న గ్రామాలకు లాంచీ (స్టీమర్) సౌకర్యం ఉండేది. అప్పట్లో ఉభయ గోదావరి జిల్లాలకు ఉత్తమ ప్రయాణ సాధనంగా లాంచీలు, నరసాపురం నుండి రాజోలు వరకూ సౌకర్యంగా ఉండేవి. నదికి ఇరువైపులా వుండే గ్రామ ప్రజలు ఈ సౌకర్యం అత్యధికంగా ఉపయోగించుకునేవారు.

లాంచి (స్టీమర్) ప్రయాణం

ఇలా కాకుండా ఒంటెద్దు బళ్ళు, గుర్రపు బళ్ళు బాడుగకు దొరికేవి. వీటిలో ప్రయాణించడం అందరికీ సాధ్యం అయ్యేది కాదు.

ఒంటెద్దు బండి

అందుచేత రవాణా సౌకర్యాలు లేక బడికి వెళ్లలేక గ్రామాలలో నిరక్షరాస్యులుగా మిగిలిపోయిన వాళ్ళు చాలామంది. ఒకరిద్దరు ఉద్యోగస్థులు వున్నా స్థానికంగానే ఉండిపోయేవారు. విద్యార్థులు వసతి గృహాల్లో ఉండేవారు. పండుగలకు పబ్బాలకు మాత్రమే కాలి నడకతో ఇళ్లకు చేరుకునేవారు. కొందరు నదిని దాటి మరి కొందరు కాలువలు దాటి, గమ్యస్థానాలకు చేరుకునేవారు. వానలు వచ్చినా, వరదలు వచ్చినా వారి బాధ వర్ణనాతీతం. మట్టిరోడ్ల మీద నడవడం కూడా చాలా ఇబ్బందిగా ఉండేది.

పడవ ప్రయాణం

వర్షాలు వచ్చినప్పుడు తాటాకు గొడుగులు ఉపయోగించి నడుచుకుంటూ వెళ్లేవారు. ఇలాంటి నేపథ్యంలో, అనారోగ్యం రీత్యా నేను పెద్దన్నయ్య (కె కె మీనన్) దగ్గరకు హైదరాబాద్‌కు వెళ్ళినప్పుడు అక్కడ ప్రాంతీయంగా అందుబాటులోవున్న రవాణా సౌకర్యాలను అతి దగ్గరగా చూసే అవకాశం నాకు కలిగింది. ఆ మహా పట్టణంలో అన్ని చోట్లకూ నడిచివెళ్లేలా తక్కువ దూరాలు వుండవు. ఐతే సైకిలు రిక్షా, లేకుంటే ఆటో రిక్షా, మరీ దూరమైతే బస్సు, ఇలా ఉండేది పరిస్థితి. లోకల్ బస్సులు పుష్కలంగా ఉండేవి.

నేను హైదరాబాద్‌లో వున్న ప్రాథమిక దశల్లో, తరచుగా నేను కుబ్ధిగూడా నుండి అఫ్జల్‌గంజ్ లోని ఉస్మానియా ఆసుపత్రికి వైద్యం కోసం వెళ్ళవలసి వచ్చేది. అప్పుడు సైకిల్ రిక్షానే ప్రధాన సౌకర్యం. ఆటోలో వెళ్లలేని పరిస్థితి. బస్సు ఇంటికి దూరం. అందుచేత బస్సులో చౌక ప్రయాణం అయినప్పటికీ వాటిని వినియోగించుకోలేని పరిస్థితి. అందుచేత సైకిల్ రిక్షాతో నాకు అవినాభావ సంబంధం ఏర్పడింది. హైదరాబాద్‌లో రిక్షాలు గమ్మత్తుగా ఉండేవి. రిక్షా గూడు (టాప్) ఎత్తు తక్కువగా ఉండేది. పొడుగైన వాళ్ళు తప్పక మెడలు వంచి కూర్చోవలసిందే! (ఆంద్ర ప్రాంతంలో గూడు ఎత్తుగా ఉండేది). భార్యాభర్తలకు, ప్రేమికులకు ఈ రిక్షా మంచి అనుకూలంగా ఉండేది. ఎండ, వర్షం లేకుంటే టాప్ తీసేయమనేవాళ్ళం. టాప్ ఉంటే తల్లి గర్భసంచిలో పిండం ఒదిగి కూర్చున్నట్లు ఉండేది. ఇప్పుడు ఆ రిక్షాలు హైదరాబాద్‌లో ఎక్కడా ఉన్నట్టు లేవు. ఈ రిక్షా గుర్తుకు వచ్చినప్పుడల్లా, డా. సి. నారాయణ రెడ్డిగారి ‘రింజిమ్.. రింజిమ్.. హైదరాబాద్ … రిక్షావాలా జిందాబాద్..’ అన్న పాట తప్పక గుర్తుకు వస్తుంది. ఒకప్పుడు ఆ రిక్షాల ప్రాధాన్యత అలాంటిది మరి!

అప్పటి సైకిల్ రిక్షా మోడల్

హైదరాబాద్‍లో విద్యార్థి దశలో అడుగు పెట్టిన తర్వాత, సైకిల్ రిక్షాలు, ఆటో రిక్షాలు వినియోగించుకున్నా, బస్సులకే ప్రాధాన్యత అధికంగా ఉండేది. వెళ్ళవలసిన ప్రాంతాలకు బస్సులే సౌకర్యంగా ఉండేవి. అత్యవసర పరిస్థితిలో ఆటోల వాడకం బాగానే ఉండేది. హైదరాబాద్ ఆటోలు ప్రయాణానికి సౌకర్యంగా ఉండేవి. ఆటో డ్రైవర్లు కొంతమంది ఎంతో నిజాయితీగా, మర్యాదగా ఉండేవారు. కొంతమంది (చాలా తక్కువమంది) గూండాలుగా ప్రవర్తించేవారు.

ఇప్పటికీ బ్రతికి ఉన్న ఆటో

ఒకసారి నేను మలక్‌పేట్ నుండి ఉస్మానియా మెడికల్ కళాశాల హాస్టల్‌కు ఆటో మాట్లాడుకున్నాను. ముప్పై రూపాయలకు ఒప్పందం కుదిరింది. ఆటోవాలా ఉమెన్స్ హాస్టల్ గేట్ దగ్గర ఆటో ఆపి దిగమన్నాడు. “నేను చెప్పింది ఉస్మానియా మెడికల్ కాలేజీ హాస్టల్ కదా!” అన్నాను.

“కాదు ఇక్కడే దిగు” అన్నాడు

“నేను హాస్టల్‌కు వెళ్ళాలి, దిగను” అన్నాను. సర్రున ఆటోలో నుండి తళ.. తళ.. మెరిసే కత్తి తీసి నా వైపు చూపించాడు.

“యాభై రూపాయలు ఇస్తాను, నన్ను హాస్టల్‌లో దించేయి” అని బ్రతిమాలను. “సరే” అని తీసుకువచ్చి హాస్టల్ దగ్గర దింపాడు

ఆటో దిగి “నీకు ఒక్క పైసా కూడా ఇవ్వను, ఏమి చేసుకుంటావో చేసుకో” అన్నాను. అప్పటికే నాకు తెలిసినవాళ్ళు, నా మిత్రులు, పదిమంది వరకు నా దగ్గరకు వచ్చేసారు. విషయం తెలిస్తే వాళ్ళు ఏమి చేస్తారో ఆటోవాలాకు అర్థమైపోయింది. అతను గభాలున పారిపోయే పరిస్థితి కూడా లేదు. అప్పుడు కాళ్లబేరానికి వచ్చాడు. “క్షమించండి.. తప్పైపోయింది” అన్నాడు. ముందుగా మాట్లాడుకున్నట్టు ముప్పై రూపాయలు ఇచ్చి పంపేసాను. ఇలాంటి వాళ్ళు కూడా వుండేవాళ్ళన్నమాట!

మళ్ళీ ఎప్పుడూ అలంటి సంఘటన నాకు ఆటోవాళ్ళతో ఎదురుకాలేదు.

విద్యార్థిగా నేను ఎక్కువగా సద్వినియోగం చేసుకున్నది ఆర్టీసీ బస్సులే! బస్సుల్లో ప్రయాణం చేయడం సరదాగానూ తక్కువ ఖర్చుతోనూ గడిచిపోయేది. మాకు ఉస్మానియా మెడికల్ కళాశాలలో కూడా క్లాసులు ఉండేవి. డెంటల్ సబ్జెక్టులు అఫ్జల్‌గంజిలోని దంత వైద్య కళాశాలలో ఉండేవి. అందుచేత కోఠి – అఫ్జల్‌గంజ్ మధ్య బస్సులో ప్రయాణం చేసేవాళ్ళం. స్టూడెంట్ పాస్ ఉండేది. అప్పట్లో రెండంతస్తుల బస్సులు (డబుల్-డెక్కర్) ఉండేవి.

డబుల్ డెక్కర్ బస్సు

అందులో ప్రయాణం చేయడానికి బాగా ఇష్టపడేవాడిని. ఎక్కువగా పై భాగంలో కూర్చోవడానికి మనసు పడేవాడిని. ఆ బస్సుకు ఇద్దరు కండక్టర్లు ఉండేవారు. పై అంతస్తులోవున్న కండక్టర్ బెల్ కొట్టాక క్రింది కండక్టర్ బెల్ కొడితే బస్సు కదిలేది. అదొక వినోద భరితమైన ప్రయాణంలా ఉండేది. రోడ్డు మీద ఒక మేడ కదిలిపోతున్న భావన కలిగేది.

తర్వాత క్రమంగా ఈ మేడ బస్సులు కాల గర్భంలో కలిసిపోయాయి.

అప్పుడు ఒకదానికి మరొకటి గొలుసుతో అనుసంధానం చేసిన బస్సు ఉండేది. రెండు బస్సులు, ఇద్దరు కండక్టర్లు, ఒక డ్రైవర్ ఉండేవారు. దీనిని ట్రైలర్ బస్సు అనేవారు. అవసరాన్ని బట్టి లేదా కుర్రతనం చూపించడానికి, కదులుతున్న బస్సు ఎక్కడం వేగంగా పోతున్న బస్సు దిగడం వంటి చిలిపి చేష్టలు ఇప్పటికీ గుర్తున్నాయి. ట్రైలర్ బస్సులు కూడా ఇపుడు కనుమరుగైనాయి.

ఇప్పుడు క్యాబ్‌లు, మెట్రో రైళ్ల అవసరం ఏర్పడింది. ప్రయాణాలు సులభతరం అవుతున్నాయి. అయినా పెరుగుతున్న జనాభాకు సరిపడా ప్రయాణ సౌకర్యాలు అందుబాటులో లేనట్లుగానే భావించాలి. అయితే ఒక సాధారణ ఉద్యోగి సైతం మోటారు సైకిల్, లేదా కారు కొనుక్కొనే అవకాశం ఇప్పుడు బ్యాంకులు కల్పిస్తున్నాయి. అడిగి మరీ రుణ సదుపాయం అందించే బ్యాంకులు ఇప్పుడు మనకు అందుబాటులోనికి వచ్చాయి. అయితే తక్కువ ఖర్చులో సామాన్యుడికి రవాణా సౌకర్యం ఏర్పడే పరిస్థితి మనకు రావాలి. కదిలే కాలంతో పాటు సమాజంలో అనేక మార్పులు వస్తాయి. దానికి రవాణా సౌకర్యాలు అతీతం కాదు. రాబోయే కాలంలో మరిన్ని సామాన్యుడికి ఉపయోగపడే రవాణా సౌకర్యాలు ఆశించడంలో తప్పు లేదనుకుంటాను.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version