బాల్కనీ బ్రతుకులు..!!
[dropcap]తి[/dropcap]నడానికి వున్నా తినలేని జీవితాలు కొందరివి. తినడానికి లేకున్నా ఉన్నదానితో సంతృప్తిపడి సుఖ జీవనం పొందేవాళ్ళు మరికొంతమంది. సరిపడినంత సంపాదించుకుంటూ, ఆధునిక జీవితాన్ని తమకు అందుబాటులో ఉన్నంతవరకూ అనుభవిస్తూ, ఆనందమయ జీవితాన్ని ఆస్వాదించేవాళ్ళు ఇంకొందరు. వీళ్ళందరికీ భిన్నంగా సంపాదన తక్కువ వున్నా జల్సాలకు అధికవ్యయం వినియోగించి అప్పులు పాలై దుర్భర జీవితాన్ని గడిపేది ఎందరో! ఇన్ని రకాల కుటుంబాలు సమాజంలో మనకు ఎక్కడో ఒక చోట ఎదురౌతూనే ఉంటాయి. ఉండి కూడా వినియోగించుకోలేక అతిసాధారణ జీవితం గడపడానికి ప్రయత్నం చేయడం ఎంతో, దుబారా ఖర్చులతో జీవితాన్ని దుఃఖమయం చేసుకోవడం కూడా అంతే!
పొదుపు అనేది మనిషికి ముఖ్యమే, కానీ అతి పొదుపు అసలు మంచిది కాదు. పొదుపు అనేది కనీస జీవితానికి సరిపడా సొమ్ము వినియోగించుకుని మిగతా భవిష్యత్ జీవితానికి ఉపయోగపడేలా పొదుపు చేసుకోవడం సరైన పద్ధతి. అంతేగానీ పొదుపు అంటే సరిగా తినకుండా, సరైన బట్టలు వేసుకోకుండా, కనీస సరదాలు తీర్చుకోకుండా డబ్బు కూడబెట్టుకోవడం కాదు. కనీస అవసరాలను ప్రాధాన్యతా పరంగా సమకూర్చుకోగలగాలి. ఎవరో కారు కొనుక్కున్నారని, మన ప్రాధాన్యత లిస్టులో లేని కారు కొనుక్కుంటే, దాని నిర్వాహణ ఎలా? కారు కొనుక్కోవడానికి బ్యాంకులు రుణాలు ఇస్తాయి ఫరవాలేదు, కానీ పెట్రోలు ఎలా? అది ఆలోచించాలి.
అలాగే కారు కొనుక్కుని, దానిని నిర్వహించుకోగల స్తోమత వున్నవాళ్లు ఖచ్చితంగా కారు కొనుక్కోవచ్చు. దానివల్ల కలిగే సౌకర్యాన్ని ఆనందంగా అనుభవించవచ్చు. ఒకప్పుడు కారు హోదాకు సంకేతం, ఇప్పుడు అదనపు సౌకర్యానికి ఆధారం. కష్టపడి సంపాదించుకున్నవాడు, పొదుపు చేసుకోగా మిగిలిన సొమ్ముతో ఇలాంటి ఆనందాలు అనుభవిస్తేనే ఆ.. జీవితానికి పరమార్థం. డబ్బుండి కూడా అనుభవించడం చేతకానివాళ్ళు మన సమాజంలో కోకొల్లలు. అలాంటి వారి జీవితం నిస్సారంగానే ముగుస్తుంది. అది ఒక అర్థం పర్థం లేని జీవితంగా మిగిలిపోతుంది.
ఇలా కాకుండా, సంపాదన సంగతి ఆలోచించకుండా, అంతకుమించిన అనవసర ఖర్చులకు అలవాటు పడి, దుర్వ్యసనాల భారిన పడి, అప్పులు పాలై జీవితంలో మళ్ళీ కోలుకోలేనివారు కూడా వుంటారు. ఇది అసలు కరెక్ట్ కాదు. మన సంపదను బట్టి ఖర్చులను రూపొందించుకోవాలి. సరదాలు-షికార్ల మాయలో పడి కన్ను మిన్ను కానరాకుండా ఖర్చు చేస్తే కొండలు కూడా కరిగిపోవడం ఖాయం. మనిషి తన స్వంత జీవితం మొదలు పెట్టగానే అవగాహన చేసుకోవలసినవి, గుర్తుంచుకోవలసినవి – 1) సంపాదన 2) ఖర్చు [విలాసాలు, వినోదాలతో సహా] 3) భవిష్యత్ జీవితం కోసం దాచుకునే పొదుపు సొమ్ము. ఈ మూడు విషయాల పట్ల శ్రద్ధ చూపించిన వారి జీవితానికి తిరుగుండదు. ఇలాంటి వారు ఎలాంటి సమస్యనైనా త్వరితగతిన పరిష్కరించుకోగల సామర్థ్యం, దైర్యం ఉంటాయి.
నా జీవితం పూర్తిగా పొదుపులతోనే నిర్విఘ్నంగా కొనసాగుతూ వస్తున్నది. మొదటి నుండి ప్రాధాన్యతలను దృష్టిలో పెట్టుకుని అవసరాలు తీర్చుకోవడానికి ప్రయత్నం చేసాను. నా ఒత్తిడి లేకుండానే, నా భార్య, పిల్లలు నాకు సహకరించారు. వాళ్ళను ఇబ్బందులకు పాలు చేయకుండా కనీస వసతులు కల్పించాను, మంచి విద్యావంతులు కావడానికి నా శక్తి సామర్థ్యాలను వినియోగించాను. వారికి తృప్తికరంగా జీవితాన్ని అందించి ప్రయోజకులను చేసాను.
అయితే ఇక్కడ నా జీవితం, నా పిల్లల జీవితం ఒక మోడల్‌గా చెప్పడం ఈ వ్యాసం ఉద్దేశం కాదు! నేనెదో గొప్ప పనులు చేసానని చెప్పుకోవడమూ కాదూ. ఈ ఉపోద్ఘాతం అంతా ఒక భిన్నమైన వ్యక్తిత్వం గల వ్యక్తి గురించి ఆయన నాకు చాలా దగ్గర బంధువు కావడం మరో ప్రత్యేకత! ఐతే ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం ఏముంది? ఒక సాధారణ, సౌకర్యవంతమైన జీవితం గడపగలిగి ఉండి కూడా, అనవసర ‘పొదుపు’ చేయడం వల్ల, ఆ జీవితాలు ఎలా ఉంటాయన్నది నలుగురికీ తెలియాలన్నది ఈ వ్యాసం ముఖ్య ఉద్దేశం.
ఆయన (పేరు చెప్పడం భావ్యం కాదనుకుంటాను) నాకు అత్యంత సమీప బంధువు. నా విద్యార్థి జీవితం నుండి ఆయనను నేను గమనిస్తున్నాను. ఆయన జీవనశైలిని పూర్తిగా అవగాహన చేసుకున్నాను. జీవితంలో ప్రాథమిక దశల్లో ఆర్థిక వనరుల విషయంలోనూ, వినియోగం విషయంలోనూ, పొదుపు విషయంలోనూ ఆయన చాలా జాగ్రత్తలు పాటించేవాడు. దానికి ఆయన భార్య కూడా అమితంగా సహకరించేది. అనవసర ఖర్చులు అసలు చేసేవాడు కాదు. తర్వాత ఆయనకు ఇద్దరు పిల్లలు పుట్టడం, వాళ్ళు పెద్దవాళ్ళై పెళ్లిళ్లు చేసుకోవడం, పిల్లల్ని కనడం కూడా జరిగింది. ఇద్దరు పిల్లల్లో పెద్దతను తండ్రిని మించి అతి పొదుపు అతి జాగ్రత్తలతో సాధారణ జీవితం, సౌకర్యాలు, భార్యకు పిల్లలకు ఇవ్వకుండా తనకంటూ ఒక ప్రత్యేక జీవనశైలిని ఏర్పరచుకుని అదే అసలైన జీవితంగా భ్రమలో పడి జీవితం కొనసాగిస్తున్నాడు. ఉదాహరణకు ఇంట్లో టి.వి. ఉంటుంది గాని, పిల్లలను చూడనివ్వడు.
కానీ ఆ పిల్లలు ఇంకో ఇంటికి వెళ్లి హాయిగా టి.వి. తనివితీరా చూస్తారు. పిల్లలకు ఇష్టమైనవి తిననివ్వరు. వాళ్ళు పెట్టిందే పిల్లలు తినాలి. ఉదాహరణకి, చిన్నకొడుకు ఇంట్లో పుట్టినరోజు పండుగ జరిగిందనుకోండి అందరూ కేకు ముక్కలు తింటుంటే, పెద్దకొడుకు పిల్లలు వాళ్ళవంక చూస్తూ ఉండాలి. అక్కడ క్రమశిక్షణ పేరుతో ఆ చిన్న పిల్లల నోళ్లు బలవంతంగా కట్టేస్తారు. వాళ్ళ దృష్టిలో పొదుపు ఉద్యమంలో ఇది కూడా ఒక భాగం. ఇంట్లో కారు ఉంటుంది, కానీ పిల్లల్ని స్కూటర్ మీదే బయటికి తీసుకు వెళతారు. పిల్లలను నిరుత్సాహ పరుస్తారు. ఇంట్లో భోజనం విషయంలో కూడా నిబంధనలు. ఏదో ఆరోగ్య దృష్ట్యా మితాహారం పాటిస్తున్నారని మనం అనుకుంటాం, కానీ అదే వ్యక్తులు ఎక్కడైనా విందులకు, పార్టీలకూ వెళ్ళినప్పుడు వారు తిండి తినే సన్నివేశం కొంచం అసహ్యం కలిగిస్తుంది.
ఇక ఇంట్లో ఎక్కడ వుంటే అక్కడ మాత్రమే బల్బు వెలగాలి. మిగతా ఇల్లంతా అంధకారమే! వున్న బల్బులు కూడా గుడ్డి దీపాల్లా వెలుగుతుంటాయి. ఇలాంటి వాతావరణాన్ని ఎదుగుతున్న పిల్లలు ఎలా అర్థం చేసుకుంటారు?
మరొక ముఖ్యమైన అంశం వేసవికాలం. వేసవికాలంలో వీరి ప్రవర్తన గమ్మత్తుగా ఉంటుంది. పెద్దకొడుకు ఉదయం నుండి సాయంత్రం వరకూ ఆఫీసులో ఏసి-హాలులో గడిపి వస్తాడు. కోడలు చమటలు కక్కుతూ వంట పని, ఇంటి పని చేస్తుంటుంది. ఫ్యాన్ సదుపాయం వున్నా పెద్దాయన పిల్లల్ని పెట్టుకుని చమటలు కక్కుకుంటూ బాల్కనీలో కాలక్షేపం చేస్తుంటాడు. వాడిన ముఖాలతో పిల్లలు సాయంత్రానికి నీరసించిపోతారు. వాళ్ళ దృష్టిలో ఇది పెద్ద ‘పొదుపు’ కింద లెక్క అన్న మాట. ఇంతేకాదు ఎలాంటి అనారోగ్య సమస్య వచ్చినా స్వంత వైద్యం చేసుకోవడం, మెడికల్ షాపు వాళ్ళ మీద ఆధారపడడం వంటి పనులు వింతగా అనిపిస్తాయి. పేదవారి విషయం వేరు ఇలాంటి వాళ్ళు డబ్బుండి పొదుపు పేరుతో మరిన్ని సమస్యలు కొని తెచ్చుకోవడమే అవుతుంది కదా! ఇది సరైన పొదుపు కిందికి వస్తుందా?
పొదుపుకు నేను వ్యతిరేకం కాదు. కానీ ఆ పొదుపు కనీస జీవితాన్ని సైతం అడ్డుకునేలా వుండకూడదు. నిజానికి నా జీవితం పొదుపుతోనే కొనసాగుతూ వచ్చింది. చిన్నమొత్తాలైనా మెరుగైన జీవితాన్ని అందించింది. కనీస జీవితాన్ని అనుభవించగల స్థితి వున్నప్పుడే పొదుపు ప్రయోజనం ఉంటుంది, అంతేగాని పొడుపు కోసం జీవితాన్ని మాడ్చి మసిబొగ్గు చేసుకొనవసరం లేదు. అందుచేత ప్రయోజనకరమైన పొదుపు ఆహ్వానించదగ్గదే. కానీ కడుపు మాడ్చుకునేంత పొదుపు ఆరోగ్యప్రదం కాదు.
ఇందులో కొసమెరుపు ఏమిటంటే, నేను చెప్పిన పెద్దాయన చిన్నకొడుకు బాగా సంపాదిస్తాడు, తన స్థాయిలో జీవితాన్ని ఆనందంగా, హాయిగా అనుభవిస్తాడు, అదే స్థాయిలో పొదుపు కూడా చేసుకుంటాడు. అందుకే మనం ఏర్పాటు చేసుకునే మన జీవన శైలి, మనకు తృప్తిగా ఉండడమే గాక ఎదుటి వారి దృష్టికి ఒక మాదిరిగా అనిపించాలి.
పొదుపు నా జీవితాన్నే మార్చేసింది మరి!
(మళ్ళీ కలుద్దాం)