Site icon Sanchika

జ్ఞాపకాల పందిరి-117

అది కూడా అవసరమే..!!

పని చేయడం అంటే కొందరికి మహా సరదా. లేని పనిని కల్పించుకుని మరీ చేస్తారు ఇలాంటివారు. పని అంటే ఇంటిపనో స్వంతపనో అని కూడా కాదు. ఆఫీసుల్లో కూడా ఇలాంటి లక్షణం వున్నవాళ్లు, వాళ్ళ పని సమర్థవంతంగా చేయడమే గాక, కల్పించుకుని, అవసరమైతే ప్రత్యేకంగా నేర్చుకుని ఇతరుల పని కూడా చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. నిజానికి మన సమాజంలో పని ఎగవేతగాళ్లకు లోటు లేదు. ఇలాంటి వాళ్ళు చేయవలసిన పనిలో ఎప్పుడూ సగం పైగా వాయిదాల మీద నడుస్తుంది. పని రాకున్నా వచ్చినట్టు నటిస్తూ, సాగినంత కాలం తాత్సారం చేసుకుంటూ పోతారు. అలాగే లంచాలు వసూలు చేయడానికి కూడా వెనుకాడరు. పని నేర్చుకునే ప్రయత్నమూ చేయరు. చాలా కార్యాలయాల్లో ఇదే తంతు.. పనిచేసేవాడిని సరిగా చెయ్యనియ్యక పోవడం వీరికి వుండే అదనపు అర్హత.

లంచాలకు అనుకూలంగా వుండే కొన్ని విభాగాలకు చెందిన ఉద్యోగులు వుంటారు. అక్కడ వారి పరిస్థితి అసలు వర్ణించలేము. ఆ దర్పము, దర్జా మరెవ్వరికీ ఉండదు. వాళ్ళ అవసరాన్ని బట్టి కార్యాలయం సమయాలలో పనిలేకుండా అవసరమైతే అర్ధరాత్రి వరకూ పని చేస్తారు. అక్రమ పద్దతిలో డబ్బు సంపాదించడంలోని ఆనందం ఇది. ఇక్కడ ఉద్యోగులు అంటే ప్రభుత్వ ఉద్యోగులందరి గురించి చెప్పడం కాదు. తరతరాలుగా పాతుకుపోయివున్న లంచగొండితనంతో సంబంధం ఉన్నవాళ్ళ గురించి.

అక్రమంగా సంపాదించిన దనం ఎవరి దగ్గరా నిల్వదంటారు. ఇది నిజమే, ఎలాంటి సందేహమూ లేదు. లంచగొండి అయిన వ్యక్తిని కష్టపడకుండా చేతిలోకి వచ్చిన సొమ్ము వ్యసనాలకు బానిసలను చేస్తుంది (ఎక్కువ శాతం). కన్ను మిన్ను కానకుండా ఇలాంటి వారు విచ్చలవిడిగా ఖర్చు చేస్తారు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడతారు. తాగుడు, జూదం, వ్యభిచారం వంటి వ్యసనాలకు బానిసలై సంసారాన్ని నిర్లక్ష్యం చేస్తారు. ఎప్పుడో ఒకచోట పట్టుబడి సర్వం కోల్పోతారు. హాయిగా ఆనందంగా సాగవలసిన జీవితాన్ని నరక ప్రాయం చేసుకుంటారు. కార్యాలయాలలో నిజాయితీగా పని చేసేవారిని ఇలాంటి లంచగొండులు ముప్పు తిప్పలు పెడతారు.

వాళ్ళను సజావుగా పని చేసుకోనివ్వరు, సుఖంగా బ్రతకనివ్వరు. నా దృష్టికి వచ్చిన ఒక ఉదంతం ఇప్పుడు ఇక్కడ మీ ముందుంచడం సబబుగా నాకు తోస్తున్నది. ఒక ప్రభుత్వ కార్యాలయంలో డిప్యూటీ డైరెక్టర్ పోస్ట్ వుంది. అది రెండు చేతులా లంచం సంపాదించగల సీటు. అందరూ ఆ సీటుకి ఎప్పుడు చేరుకుంటామా అని ఎదురుచూస్తారు. ఈ నేపథ్యంలో ఆ పోస్ట్‌కు ఖాళీ ఏర్పడింది. అయితే కొద్దికాలంలోనే పదవీ విరమణకు సిద్ధంగా వున్న ఒక పెద్దాయన అక్కడికి రావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఆయన అవినీతికి వ్యతిరేకి. నూరు శాతం నీతిమంతుడు. ఎవరికైనా ఇవ్వడమే గాని పుచ్చుకోవడం ఇష్టంలేని సజ్జనుడు. ఇది ఆ డిపార్ట్‌మెంట్ వాళ్ళు అందరికీ తెలుసు. ఆయన గనక వస్తే తమ ఆటలు చెల్లవని ముందే గ్రహించి క్రింది స్థాయి ఉద్యోగులు ఆయన రాకుండా అనేక సమస్యలు సృష్టించే ప్రయత్నం చేశారు. రాష్ట్ర స్థాయి పెద్దలతో కుమ్మక్కై ఆయనను రాకుండా చేయడానికి పెద్ద పన్నాగమే పన్నారు. ఆ పెద్దాయనకు ఎలాంటి రాజకీయ సహకారమూ లేదు. ముక్కు సూటిగా పోయే మనిషి.

ఈ తంతు నడుస్తున్న సమయంలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ స్థాపకుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు వున్నారు. ఆయన హయాంలో ఎన్నో సంచలనాలు రికార్డు అయ్యాయి. నేను చెప్పబోయేది అందులో ఒకటి.

విశ్రాంత జీవితం గడుపుతున్న శ్రీ ఆలూరి హరనాథ్ రావు (శర్మ)

ఇప్పటివరకూ పెద్దాయనగా ప్రస్తావిస్తున్న వ్యక్తి పేరు శ్రీ హరనాథ్ రావు. ప్రజల, పేదల పక్షపాతి ఈయన. జీవితమంతా వంటరి పోరాటం చేస్తూ విజయుడైనవాడు. ఈయన తన బాధను, తాను ఎదుర్కొంటున్న సమస్యను చక్కగా తెలుగులో ఉత్తరం రాసి, ముఖ్యమంత్రి రామారావు గారికి పోస్ట్ చేశారు. ఆ ఉత్తరం వల్ల ఆయనకు ఏదో బ్రహ్మాండం జరిగిపోతుందని ఆయన ఆ పని చేయలేదు. మదిలో మెదిలిన ఒక ఆలోచనకు ఆయన కార్యరూపంలో పెట్టాడంతే! అయితే ముఖ్యమంత్రి గారినుండి స్పందన అంత త్వరగా వస్తుందని ఆయన అసలు ఊహించలేదు. ఆయనను ఆశ్చర్యపరుస్తూ ముఖ్యమంత్రి కార్యాలయం నుండి హరనాథ్ రావుగారికి పిలుపు వచ్చింది. వారి సూచన మేరకు ఒక ఆదివారం ఆయన అబిడ్స్ లోని ఎన్.టి.ఆర్. నివాస గృహానికి వెళ్లారు. ఆయనను ఆశ్చర్య పరుస్తూ అప్పటికే అక్కడ సంబంధిత మంత్రిగారు, డైరెక్టరు, ఇతర చిన్న పెద్ద అధికారులు అక్కడ వున్నారు. కేవలం హరనాథ్ రావు గారి కోసమే ఆదివారం ఆ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయబడింది. ఒక్క మంత్రిగారు తప్ప అక్కడవున్న అధికారగణం అంతా హరనాథ్ రావు గారి బదిలీకి (ఆయన కోరుకున్న చోటికి) వ్యతిరేకంగా వివరణలు ఇవ్వడం మొదలు పెట్టారు. అంతా గమనించిన ముఖ్యమంత్రి గారు కలగజేసుకుని, “ముఖ్యమంత్రిగా నేను చెబుతున్నాను, ఆయన కోరుకున్నచోట పోస్టింగ్ ఇచ్చి, అక్కడే పదవీ విరమణ చేసే అవకాశం ఆయనకు ఇవ్వండి” అనగానే, మరో మాట రాకుండా ఎవరి స్థాయిలో పనులు వాళ్ళు పూర్తి చేసి పోస్టింగ్ ఆర్డర్ హరనాథ్ రావుగారి చేతిలో పెట్టారు. బహుశః ఇలాంటి నిర్ణయాలు అరుదుగా వింటాం. సందర్భాన్ని ఈ విషయం ఎందుకు చెబుతున్నానంటే, ముఖ్యమంత్రిగా అవినీతి నిర్మూలనకు ప్రారంభ దశలో తారక రామారావు గారు తనదైన శైలిలో కృషి చేశారు.

యువకుడిగా శ్రీ హరనాథ్ రావు గారు

ఐతే ఇప్పుడు ఇక్కడ నేను చెప్పబోతున్నది ఒక నీతిమంతుడైన ఉద్యోగి గురించి.

ఇలాంటి ఉద్యోగులు బహు అరుదుగా మనకు కన్పిస్తారు. 2005లో నేను పదోన్నతి మీద జనగాం ప్రభుత్వ ఆస్పత్రినుండి కరీంనగర్ ఆసుపత్రికి బదిలీ అయ్యాను అక్కడ మా జీతాలు, ఇంక్రిమెంట్లు వగైరా చూసే సీనియర్ అసిస్టెంట్ నాగభూషణం నాకు పరిచయం అయ్యాడు. అతను కూడా సాహిత్యాభిలాషి కావడం మూలాన అనుకుంటాను అతి తొందరగా దగ్గరయ్యాడు. ఆఫీసు పని చాలా శ్రద్దగా చేసేవాడు. ముఖ్యంగా సంవత్సరానికొకసారి లభించే ఇంక్రిమెంట్ విషయంలో మనం గుర్తు చేయకుండానే ఆతను ఆ పని పూర్తిచేసి సమాచారం అందించేవాడు. ఏ పని పెండింగ్ పెట్టేవాడు కాదు. నా ఒక్కడి విషయంలో మాత్రమే కాదు, సిబ్బంది ఎవరికైనా ఆతను అలాంటి సేవలే అందించేవాడు. నేను గతంలో పనిచేసిన ఆసుపత్రులలో (మహబూబాబాద్ & జనగాం) ఇలాంటి సేవలు నాకు అందలేదు. ఆ రకంగా ఆతను అందరి ప్రశంసలు మూటగట్టుకున్నాడు. నా పెన్షన్ పేపర్లు కూడా నాగభూషణమే తయారుచేసి పెట్టాడు.

సన్మానం అందుకుంటున్న శ్రీ నాగభూషణం (ప్రస్తుతం  సిరిసిల్లా ఆసుపత్రిలో అకౌంట్స్ – ఆఫీసరుగా పనిచేస్తున్నారు)

అలాంటి నాగభూషణం, ఒకరోజున వచ్చి నా దగ్గర కూర్చుని పిచ్చాపాటి కాసేపు మాట్లాడుకున్న తర్వాత “సార్, బాగా అలసిపోతున్నాను. ఆఫీసు పని, బయటి పని, ఇంటి పని – అసలు విశ్రాంతి దొరకడంలేదు సార్” అన్నాడు.

అప్పుడు నేను “నువ్వు కష్టపడుతున్నావ్, సంతోషం. డబ్బుబాగా సంపాదించుకుంటున్నావు, స్వాగతించ వలసిన విషయమే … అంతా బాగానే వుంది గానీ.. పిల్లలకు, నీ శ్రీమతికి రోజులో ఎంత సమయం కేటాయిస్తున్నావు?” అని అడిగాను. దానికి అతను నుదిటిమీద చేయి పెట్టుకుని “అయ్యో.. ఎక్కడిది సర్, అసలు వీలు కావడం లేదు” అన్నాడు.

అప్పుడు నేను మళ్ళీ కలుగజేసుకుని “ఎంత కష్టపడినా, ఎంత డబ్బు సంపాదించినా నువ్వు సుఖపడలేనప్పుడు, నీ పిల్లల్ని సుఖపెట్టలేనప్పుడు ప్రయోజనం ఏమిటీ?” అన్నాను.

“నిజమే సార్, ఇలా నేను ఎప్పుడూ ఆలోచించలేదు” అన్నాడు.

అప్పుడు నేను మళ్ళీ “చూడు నాగభూషణం, నువ్వు కష్టపడుతున్నావ్, సరే మరి నీతో గడపాలని నీ భార్య, పిల్లలూ ఆశించరా?” అన్నాను.

“నిజమే సర్ వాళ్లకు నేను అన్యాయం చేస్తున్నాను” అన్నాడు.

“అనుకుంటే సరిపోదు, ఇకనుండైనా వారానికి ఒక్కరోజైనా కుటుంబం కోసం కేటాయించు. ఆ రోజు కరీంనగర్‌లో వుండకు, వేరే ప్రాంతానికి పిల్లలిని తీసుకుపోయి అక్కడ ఆనందంగా గడుపు” అన్నాను. అప్పుడు ఆతను రెండు చేతులు జోడించి “మీరు చెప్పింది నూటికి నూరుశాతం కరెక్ట్. ఇక నుండి మీ సలహా పాటిస్తాను సర్” అని వెళ్ళిపోయాడు

తర్వాత నెల రోజులకు నాగభూషణం నవ్వుతూ ప్రవేశించి “మీ సలహా ఇప్పుడు తు.చ. తప్పకుండా పాటిస్తున్నాను సర్. ప్రతి ఆదివారం హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం అందరం ఆనందంగా వున్నాం” అన్నాడు.

“చాలా సంతోషం నాగభూషణం, మనిషికి కష్టంతో పాటు సుఖం కూడా కావాలి. లేకుంటే లేనిపోని సమస్యలు, చికాకులు మొదలవుతాయి. అలాగే స్త్రీ ఒక్కసారి నిరుత్సాహానికి లోనై మనసు మార్చుకుంటే, ఆమెను మళ్ళీ మామూలు మనిషిని చెయ్యడం ఎవరికీ సాధ్యం కాదు. అలా ఎన్నో సంసారాలు విచ్ఛిన్నం అయిపోవడం నేను చూసాను” అని ఒక పెద్ద ఉపన్యాసం దంచేసాను. ఒక మంచి వ్యక్తిని సన్మార్గం వైపు నడిపించానన్న తృప్తి నాకు మిగిలింది.

ఎప్పుడైనా అవినీతి గురించి చర్చ వచ్చినప్పుడు, నీతిపరులైన హరనాథ్ రావు గారి గురించి తప్పకుండా ఉదాహరించడం నాకు అలవాటైపోయింది. ఎక్కువశాతం అవినీతి పరులమధ్య బ్రతుకుతున్న మనం, నీతిపరులైన కొద్దీ మందిని తరచుగా స్మరించుకోవడం అవసరమే అనిపిస్తుంది నాకు. అలాగే నీతిగా కష్టపడేవాళ్ళని సుఖపడాలని కూడా చెప్పాలనిపిస్తుంది. అది కూడా అవసరమే కదా మరి…!

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version