Site icon Sanchika

జ్ఞాపకాల పందిరి-120

వారి అభిమానం అలాంటిది..!!

[dropcap]జీ[/dropcap]వితంలో అనుకోని రీతిలో కొందరు మహానుభావులు తారసపడతారు. అప్పటివరకూ ఒకరికొకరు తెలియకుండానే, పరిచయం అయిన తరువాత వారు ఎదుటి వారిని అభిమానించే తీరు అక్షరాల్లో సైతం చెప్పలేనంతగా ఉంటుంది. బహుశః వ్యక్తిత్వం, మాటతీరు, మనిషి తీరు, ఒకరికొకరివి కలిసినప్పుడు ఇటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి. ఇలాంటి పరిచయాలు ఏర్పడడానికి ముఖాముఖి కలవనవసరం లేదు. అసలు కలవకుండానే స్నేహితులై ఎంతోమంది సంవత్సరాలు తరబడి స్నేహం చేసి ఆ స్నేహంలోని మాధుర్యాన్ని ఆస్వాదించిన వారు వున్నారు. దీనికి ఆడ, మగ అన్న తేడా లేదు. అలాగే ఎన్నోసంవత్సరాల స్నేహం తర్వాత కలుసుకున్న వాళ్ళూ వున్నారు. కలుసుకుందాం అనుకుంటూనే సంవత్సరాలు గడిచిపోయి, చివరికి ఎప్పటికీ కలవలేక పోయినవారూ వున్నారు. స్నేహానికి ప్రత్యేకతను తెచ్చిపెట్టే స్నేహాలివి.

పత్రికల ద్వారా ఒక పెద్దాయన నాకు పరిచయం అయ్యారు. వయస్సులోనూ రచనా వ్యాసంగం (కథలు) లోనూ ఆయన నాకంటే చాలా పెద్ద అన్నమాట! ఆయన పేరు శ్రీ బి.పి. కరుణాకర్. రక్షణ శాఖలో పనిచేసి పదవీ విరమణ పొందిన వ్యక్తి సరస హృదయుడు. గంటలకొద్దీ మాట్లాడినా విసుగు రానివ్వని వ్యక్తిత్వం ఆయనది. ఆయన కథ రాయడంలోనూ, కథకు పేరు పెట్టడం లోనూ సిద్ధహస్తుడు. ఆయన కథలు ఎక్కడా రెండు మూడు పేజీలకు మించి వుండవు. కొసమెరుపు కథలు మెండుగా ఉంటాయి. కథ చదవడం ప్రారంభించిన పాఠకుడి తదుపరి వూహ దారిని మళ్లించి మరో రకంగా కథను పూర్తి చేసి పాఠకుడి చేత ‘ఔరా..’ అనిపిస్తాడు. అలాంటి గొప్ప రచయితతో సంభాషించడం గొప్ప ‘ఎడ్యుకేషన్’ అనిపించేది.

కథా రచయిత స్వర్గీయ శ్రీ బి.పి.కరుణాకర్

అలాంటి గొప్పవ్యక్తితో కేవలం ఫోను ద్వారా స్నేహం ఎనిమిది సంవత్సరాలపాటు నడిచింది. ఎప్పటికప్పుడు ‘కలుసుకుందాం’ అనుకునేవాళ్లం, కానీ అది నెరవేరలేదు. ఆయన ఉండేది సికింద్రాబాద్, నేను ఉండేది హన్మకొండ (జిల్లా). ఆయనకు హన్మకొండ రావాలంటే అవకాశాలు తక్కువ. కానీ నేను తరచుగా ఏదో పని మీద హైదరాబాద్‌కు ప్రయాణాలు చేస్తుండేవాడిని. అయినా ఆయనను కలవలేకపోయాను. మా ఈ చిన్న కోరిక తీరకుండానే ఆయన కీర్తిశేషులైనారు. అది నాకు ఇప్పటికీ ఎప్పటికీ నన్ను చెప్పలేని వ్యథకు గురి చేస్తూనే ఉంటుంది. ఇలాంటి స్వచ్ఛమైన స్నేహాలు ఎన్నో.

ఇక, అసలు విషయానికి వస్తే, ముఖ పరిచయం లేకుండానే, కేవలం ఆధునిక మాధ్యమం – ఫేస్‌బుక్ ద్వారానో, మరో రూపంలోనో స్నేహితులై తమ అభిమానాన్ని ఏదో రూపంలో నాకు అందిస్తున్న మహానుభావులెందరో  వున్నారు. అందులో కొందరి గురించి ఇక్కడ ప్రస్తావిస్తాను. వారికి నేను ఎంతగానో రుణపడివుంటాను.

కార్టూన్లు అంటే నాకు చిన్నప్పటినుండి ఇష్టం. ఇవి చాలా పత్రికలలో వస్తుండేవి. మామూలు కార్టూన్ల కంటే పొలిటికల్ కార్టూన్లు భిన్నమైనవి. వాటిని సరైన పద్ధతిలో ఆస్వాదించాలంటే, రాజకీయం, రాజకీయ పరిస్థితులు, రాజకీయ నాయకుల గురించి కనీస అవగాహన ఉండితీరాలి. ఆ స్థాయికి నేను వచ్చిన తరువాత, రెండు ఆంగ్ల పత్రికలలో వచ్చే పొలిటికల్ కార్టూన్లకు నేను ఆకర్షితుడినైనాను. ఆ దిన పత్రికలు – ‘ది హిందూ’, ‘డెక్కన్ క్రానికల్’. మొదటి దానిలో శ్రీ సురేంద్ర కార్టూన్లు గీసేవారు. రెండవ దానిలో శ్రీ సుభాని, పొలిటికల్ కార్టూన్లు గీస్తున్నారు. సురేంద్ర గారితో పెద్దగా పరిచయం లేదు. బహుశః ఆయన ఫేస్‌బుక్‌లో అంతగా రాకపోవడమే దీనికి కారణం కావచ్చు.

కార్టూన్ ఎడిటర్ (డె.క్రా)శ్రీ సుభాని గారు (హైదరాబాదు)

అయితే సుభానీ గారి పొలిటికల్ కార్టూన్లు ప్రతిరోజూ ఫేస్‌బుక్‌లో దర్శనమిస్తాయి. రాజకీయ నాయకుడిని చిత్రించడంలో తిరుగులేని చిత్రకారుడాయన. రాజకీయాల ఆధారంగా వేసే శ్రీ సుభాని కార్టూన్లు, ఆలోచింప జేసేవిగాను, అర్థవంతంగానూ ఉంటాయి. అందుకే ఆయన కార్టూన్లకు నేను తరచుగా కామెంట్ పెట్టేవాడిని. అలా వారి పరిచయం జరిగి అది ఇప్పటివరకూ కొనసాగుతూనే వుంది. నా మనసులోని కోరికను ఆయన ఎలా పసిగట్టారోగానీ, ఒక శుభోదయాన వాట్సప్ ద్వారా ఆయన నా క్యారికేచర్ పంపించారు.

కార్టూనిష్ట్ సుభాని గారు(హైదరాబాద్) ప్రేమతో గీసిఇచ్చిన క్యారికేచర్.

అది నన్నే కాదు, నా స్నేహితులు చాలా మందిని ఆశ్చర్యంలో ముంచేసింది. చెప్పలేని ఆనందం కలిగించింది. అది ఇప్పటికీ ఎప్పటికీ ఇష్టమైన క్యారికేచర్. ఈ బహుమతిని నేను ఎప్పటికీ మరచిపోలేను, అలాగే శ్రీ సుభానీ గారిని కూడా!

ఒకరోజు నా వాట్సప్‌కు ఒక మెసేజ్ వచ్చింది. అప్పటివరకూ ఆయన ఎవరో నాకు తెలీదు. మెసేజ్ సారాంశం ఏమంటే “కె.కె. మీనన్ గారు మీకు ఏమౌతారు?” అని. ఆయన అలా అడగడానికి కారణం వుంది. అన్నయ్య మీనన్ స్వర్గస్థుడైనప్పుడు ఫేస్‌బుక్‌లో ఆయనకు నేను శ్రద్ధాంజలి ఘటించినపుడు,నా ఇంటి పేరు ‘కానేటి’ అని ఉండడంతో, అలా వారు నన్ను అడిగారు. అన్నయ్యకు ఆయన చాలాకాలంగా తెలుసును. లెక్కలు తీస్తే ఆయన మాకు దూరం చుట్టం కూడాను. ఆయనే ప్రముఖ చిత్రకారులు – శ్రీ బాపూజీ బత్తుల.

ప్రముఖ చిత్రకారులు శ్రీ బాపూజి.బత్తుల (హైదరాబాద్)

ఆయన చిత్రాలు చూసిన వారు, వృత్తి రీత్యా చిత్రకారులు అనుకుంటారు. కానీ అది ఆయన ప్రవృత్తి మాత్రమే. కేంద్రప్రభుత్వ ఉన్నతాధికారిగా,దేశ రాజధానిలోనూ, రాష్ట్ర రాజధానిలోను సేవలందించి, పదవీవిరమణ చేసిన కోనసీమ ఆణిముత్యం (ఇప్పుడు హైదరాబాద్‌లో స్థిరపడినారు) శ్రీ బాపూజీ. పదవీ విరమణ చేసిన తరువాతనే ఆయన ప్రవృత్తి ఊపందుకుంది. ఆయన ఎన్నో వర్ణ చిత్రాలు వేసి బహుమతులు పొందారు. వందల సంఖ్యలో బాల్ పాయింట్ పెన్ చిత్రాలు వేశారు. ఒక శుభ ముహూర్తాన నాకు చెప్పకుండానే, మా అన్నయ్యది – నాది, బాల్ పాయింట్ పెన్ చిత్రాలు పంపించి నన్ను ఆశ్చర్య పరిచారు. అంతమాత్రమే కాదు, నా కోరిక మేరకు నా స్నేహితురాలి స్కెచ్ కూడా వేసి పంపించారు. వయసు పెరిగి నప్పటికీ చిత్రాల సృష్టిపై తృష్ణ ఆయనలో ఏమాత్రం తగ్గలేదు. అది ఆ కళ గొప్పతనం కావచ్చును.

శ్రీ బాపూజి బత్తుల గారు బాల్ పాయింట్ పెన్ను తో వేసిచ్చిన చిత్రాలు. (అన్నయ్య కె.కె.మీనన్)
శ్రీ బాపూజి బత్తుల గారు బాల్ పాయింట్ పెన్ను తో వేసిచ్చిన చిత్రాలు. (రచయిత)
బాపూజి బత్తుల గారి బాల్ పాయింట్ పెన్ను చిత్రం రచయిత మిత్రురాలు ఝాన్సీ కొప్పిశెట్టి (ఆస్ట్రేలియా)

ప్రముఖ చిత్రకారుడు అక్బర్ కూడా ఇలా పరిచయమై స్నేహితుడైనవాడే! కొంతకాలం ఒక వార పత్రికలో పనిచేసి, తర్వాత స్వంతంగా చిత్రకారుడిగా కొనసాగుతున్న అక్బర్, ఆధునిక చిత్రకళలో దిట్ట. ఈయన సినిమాలకు కూడా పనిచేస్తున్నారు. ‘అన్నా!’ అని ఆత్మీయంగా పిలిచే అక్బర్, నా ఫోటోలను పెయింటింగ్‌లుగా మర్చి,నాకు పంపించి ఆశ్చర్య పరిచాడు.

మిత్రచిత్ర కారుడు అక్బర్ మహమ్మద్. (చిత్రం: బాపూజీ. బత్తుల)

ఇప్పటివరకూ, అక్బర్‌ను గానీ, శ్రీ సుభానీ గారిని గాని ప్రత్యక్షంగా చూడలేదు. ఇలా ఎందరో ప్రముఖులు నా మీద వారి శైలిలో అభిమానం వ్యక్తం చేస్తుంటారు. వారందరికీ హృదయ పూర్వక కృతజ్ఞతలు..

మిత్రుడు అక్బర్ సృష్టి రచయిత చిత్రం.

అలాగే నా కోరిక మేరకు బొమ్మలువేసి నాతో సహకరించిన పెద్దలూ వున్నారు. శ్రీ బాపు (ముఖ చిత్రం, క్లినిక్ లోగో), శ్రీ సరసి (ముఖ చిత్రాలు, కార్టూన్), శ్రీ మాధవ్ (జ్ఞాపకాల పందిరి – ఇల్లస్ట్రేషన్), గంగాధర్ (జ్ఞాపకాల పందిరి – ఇల్లస్ట్రేషన్), శ్రీ రాజు -కార్టూనిస్ట్ (జ్ఞాపకాల పందిరి – ఇలస్ట్రేషన్). ఇందులో సరసిగారు తప్ప ముఖాముఖి పరిచయం ఎవరూ లేరు. బాగా పరిచయం వున్న శీలా వీర్రాజుగారు మాత్రం, ప్రభుత్వ దంతవైద్య కళాశాల కోసం నా ద్వారా ఉచితంగా లోగో వేసి ఇచ్చారు. ఇది కూడా నాకు ఎంతో తృప్తినిచ్చిన అంశం.

జీవితంలో ఇలా అనుకోని స్నేహాలు, ఊహించని అనుభూతులు, అందరికీ ఏదో రూపంలో ఎదురవుతూనే ఉంటాయి. ఉపయోగపడతాయి, ఒక్కోసారి అవి ఎదురు తిరుగుతాయి. అప్పుడు బాధపడకా తప్పదు. కానీ మంచి స్నేహాలలో సమస్యలకంటే, సంతోష కరమైన వాతావరణమే ఎక్కువగా ఉంటుంది. అలాంటి స్నేహాలే పటిష్టంగా కలకాలం నిలుస్తాయి. నన్ను అభిమానించే సహృదయ మిత్రులందరికీ మరోసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version