Site icon Sanchika

జ్ఞాపకాల పందిరి-122

సమయమా…! నీవెంత అమూల్యం…!!

[dropcap]‘స[/dropcap]మయం..!!’

అవును, సమయం ఎంత అమూల్యమైనది! కరిగిపోయేదే కాని తిరిగి దాచుకునేది కాదు సమయం. అందుకే సమయం అత్యంత విలువైనది. తెలిసి కొందరు, తెలిసీ తెలియక కొందరూ, అసలు తెలియక కొందరు సమయాన్ని అనవసరంగా వృథా పరుస్తుంటారు. చేయవలసిన పనులు వాయిదా వేస్తుంటారు. తగిన సమయములో చేయవలసిన పని అప్పుడే చేసేస్తే, తరువాత సమయంలో మరో ముఖ్యమైన పనికి ఆ.. సమయం అక్కరకు రావచ్చునన్న సంగతి తెలియని వారే, సమయం గురించి సరైన అవగాహన లేనివారే ఇలా సమయం వృథా పరుస్తుంటారు. వృథా అయిపోయిన తర్వాత మాత్రమే దాని విలువ తెలుస్తుంది.

పెళ్లిళ్లకు ముహూర్తం పెట్టుకుంటారు. ముహూర్తానికి పెళ్లి చేయడం మన సంప్రదాయం. అంటే ఫలానా ముహూర్తంలో పెళ్లి జరిగితే పెళ్లికొడుక్కి, పెళ్లి కూతురికి కూడా మంచి జరుగుతుందన్నది మన సాంప్రదాయ సిద్ద నమ్మకం. ఒక రకమైన క్రమశిక్షణ కూడా! కానీ, ఈ రోజుల్లో ఎంతమంది నిర్ణయించుకున్న ముహూర్తాలకు పెళ్లిళ్లు చేసుకోగలుగుతున్నారు? పురోహితుడు మైకులో మరీ గొంతు పెంచి “ముహూర్తం దాటిపోతుంది, పెళ్లి కూతురుని తీసుకురండి” అంటూ మొత్తుకుంటుంటాడు. ముహూర్తం దాటిపోయినా ఇదే తంతు. కానీ పెళ్లికూతురు ఓ పట్టాన రాదు. ఫోటోలు తీయాలి, వీడియోలు తీయాలి, జుట్టు చెరిగిపోతే సరిజేయాలి, మేకప్ పలుచబడితే మరో దఫా మేకప్ వేయాలి, ఇలా రకరకాల కారణాలతో సమయాన్ని వృథా చేయడంలో మనవాళ్ళు ముందువరుసలో తప్పక వుంటారు (అందరూ ఇలా చేస్తారని కాదుగాని, ఎక్కువ శాతం ఇలానే ప్రవర్తిస్తారు). ఎలా చూసినా ఇందులో స్త్రీమూర్తులదే అగ్రస్థానం.

ఒక మంచి సాహిత్య కార్యక్రమానికో, సాంస్కృతిక కార్యక్రమానికో, ముఖ్య అతిథిగా, మంత్రినో, ఒక ప్రభుత్వ అధికారినో, లేదా రాజకీయ నాయకుడినే కొన్ని సంస్థలు పిలుస్తుంటాయి. మర్యాదకు కొంత, సమావేశానికి గుర్తింపు వస్తుందని మరికొంత, వారిని పిలుస్తుంటారు. కానీ వారు మాత్రం నిర్వాహకుల సమయ విలువను గుర్తించరు. కావాలని చేస్తారో, నిజంగానే పనిపడి చేస్తారో తెలియదుగానీ, అలాంటి ముఖ్య అతిథులు ఎప్పుడూ సభలకు ఆలస్యంగానే వస్తారు. అతి తక్కువమంది సమయపాలన పాటిస్తారు. ఒక సాహిత్య సాంస్కృతిక సంస్థకు కొన్నేళ్లు అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవంతో చెబుతున్న మాటలివి. ఈ ముఖ్య అతిథులు ఆలస్యంగా రావడమే కాదు, త్వరగా వెళ్లిపోయే ప్రయత్నాలు కూడా చేస్తారు. వీరి వల్ల అమూల్యమైన సమయం వృథా కావడమే కాకుండా, కార్యక్రమ రూపురేఖలు మారిపోయి, నిర్వాహకులను నిరుత్సాహ పరుస్తాయి.

ఇక తెల్లవారిన నిద్రలేవని వారు మనలో కోకొల్లలు. ఇంట్లో ఎవరైనా సరే (వ్యాధిగ్రస్థులు తప్పించి) ఐదు గంటల తర్వాత మంచం మీద ఉండడం అంత శ్రేయస్కరం కాదు. అలాంటి ఇళ్లల్లో ఎప్పుడూ దరిద్రమే తాండవిస్తుంది. బద్ధకంతో ఆలస్యంగా లేచేవాళ్ళల్లో చురుకుదనం అసలు ఉండదు. ఎప్పుడూ ఉసూరుమంటూ వుంటారు. సమయం వృథా చేయడంలో వీరు అగ్రగణ్యులు. కొంతమంది వారి వారి వృత్తులను బట్టి, ఇతర జీవన సరళిని బట్టి, సెలవు రోజుల్లోనూ, ఆదివారం ఆలస్యంగా లేస్తారు. ఇది కూడా కరెక్ట్ కాదు. ఎప్పుడు ఉదయం లేవడానికి, రాత్రి పడుకోవడానికి ఒకే సమయం మెదడులో ఫిక్స్ చేసుకోవాలి. అలారంతో పనిలేకుండా ఆయా సమయాలు పాటించ గలగాలి.

ముఖ్యంగా విద్యార్థి లోకంలో సమయపాలన, సమయ సద్వినియోగం చాలా అవసరం. ఇప్పుడు ఈ సమయంలో, ఈ రోజు చేయవలసిన పనిని బద్ధకించి మరో సమయంలో చేయొచ్చులే అనుకునేవాళ్ల సమయం చాలా వృథా అవుతుంది. అందుచేత అలాకాకుండా, ప్రతిదానికి ఒక సమయం నిర్ధారించుకోవాలి. చదువుసంధ్యలతో పాటు విందులు వినోదాలకు కూడా కొంత సమయాన్ని కేటాయించుకుని, ప్రతి నిముషాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

ప్రయాణాలలో సమయపాలన లేకపోవడం వల్ల రైళ్లుగానీ, బస్సులు గానీ తప్పిపోయే అవకాశాలు ఉంటాయి. విమాన ప్రయాణాల విషయంలో ఆ శాఖ నియమనిబంధనలను అనుసరించి కొన్ని గంటలముందే విమానాశ్రయంలో రిపోర్టు చేయవలసి ఉంటుంది కనుక, ఇక్కడ పెద్దగా సమస్యలు రావు. అలాగే కొందరి ఇళ్లకు వెళ్లాల్సివచ్చినప్పుడు, విందులకు హాజరు కావలసినప్పుడు, సమయ పాలన చేయకుంటే, ఎదుటివారిని ఇబ్బంది పెట్టినవారం అవుతాము. ఇలాంటి చోటికి రెండు నిముషాలు ముందైనా వెళ్ళొచ్చుగానీ ఆలస్యంగా మాత్రం పోకూడదు.

ఈ రోజుల్లో ప్రతిదానికి ప్రవేశపరీక్షలు ఆనవాయితీగా మారాయి. ఇలాంటి సందర్భాలలో కూడా సమయాన్ని దృష్టిలో ఉంచుకొనకపోతే, పరీక్షకు హాజరు కాలేక ఒక సంవత్సరం నష్టపోయే పరిస్థితులు కూడా ఎదురౌతాయి. అందుచేత సమయం విషయంలో ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండవలసిందే!

నేను నా విద్యార్థి దశలో ఉదయం అయిదు గంటలకే లేచేవాడిని. ముఖ్యంగా డిగ్రీ సమయంలో హాస్టల్‌లో వున్నప్పుడు, ఇతర మిత్రులు అంత త్వరగా నిద్రలేచేవారు కాదు! ఆ సమయంలో వాష్‌రూములు ఖాళీగా ఉండడం వల్ల అప్పుడు నా బట్టలు ఉతుక్కునేవాడిని. ఇది ఎందుకు చెబుతున్నానంటే ఏదైనా పనుల వల్ల రాత్రి ఆలస్యంగా పడుకున్నా ఉదయం మాత్రం నేను ఐదు గంటలకే లేవడం అలవాటు అయింది. ఇప్పటివరకూ అదే సమయం నాతో కలసి నడుస్తున్నది. అది నా అదృష్టంగానే నేను భావిస్తాను. నేనే కాదు, మా ఇంట్లో ఎవరు ఆలస్యంగా లేచినా నేను ఊరుకోను. ఈ విషయంలో మాత్రం నన్ను ఎవరైనా చండశాసనుడు అన్నా నేను బాధపడను.

ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరికీ అవసరమైనదీ, అందరికీ అందుబాటులో వున్న ఆధునిక పరికరం ‘మొబైల్’. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవన శైలిని మార్చివేసింది. సమాచార సాధనంగా, సమాచార ప్రక్రియను సులభతరం చేసింది. ఒకప్పుడు తప్పనిసరి సందేశాలు విదేశాలకు పంపవలసి నప్పుడు సమయాన్ని బట్టి వందలు/వేలు ఖర్చు అయ్యేది. మొబైల్ ఆవిష్కరణ జరిగిన తర్వాత సమాచారం నిముషాల్లో అందించే అవకాశం అందుబాటులోకి వచ్చింది, పైగా అది ఉచితం కావడం విశేషమూ, ఆశ్చర్య కారమూనూ! ఉత్తరాలతో పనిలేకుండా పోయింది. గడియారం, కేలెండర్, కాలిక్యులేటర్, రేడియో, వార్తాపత్రికలు, పుస్తకాలు ఒకటేమిటి?మొబైల్ ఉంటే మన చేతిలో అన్నీ వున్నట్టే. ముఖ్యంగా మనియార్డర్, టెలిగ్రామ్ వంటి ప్రక్రియలు, ప్రస్తుత తరానికి తెలియకుండా చేసింది మొబైల్. అందుచేత నేటి మనిషి, ముఖ్యంగా యువత, మొబైల్ మత్తులో పడిపోయింది. మొబైల్‌కు బానిసగా మారిపోయింది. ఏదైనా ‘అతి’ అనేది ప్రమాదకరమైనది. దీనికి మొబైల్ అతీతం కాదు. మంచికి ఉపయోగించుకున్నంత వరకు, మొబైల్ అనేది మనిషికి ఉపయుక్తమైన ఆధునిక పరికరం. కానీ గంటలకొలదీ మొబైల్‌తో కాలక్షేపం చేయడం మాత్రం అమూల్యమైన సమయాన్నీ, దుర్వినియోగం చేయడమే! అందుచేత నిర్ణిత సమయాలు మాత్రమే మొబైల్ కోసం వినియోగించాలి. ప్రస్తుత అవసరాల దృష్ట్యా ఇలా మొబైల్‌ను గంటల కొద్దీ వాడే జాబితాలో, నేను కూడా ఉండవచ్చు. అందు చేత నేను కూడా మొబైల్ కోసం వినియోగించే సమయాన్ని తగ్గించుకోవడమే మంచిది అని నా మనసు హెచ్చరిస్తూనే ఉంటుంది.

ఇక స్వవిషయానికొస్తే, సమయ పాలన విషయంలో నేను ఎప్పుడూ కఠినంగానే వుంటాను. పెళ్లిళ్లు, సాహిత్య సమావేశాలు గంటలకొద్దీ ఆలస్యంగా మొదలు పెడతారని తెలిసినా, ఆహ్వానంలో వారు ప్రచురించిన సమయానికే ఆ స్థలానికి వెళ్లడం నాకు ఇప్పటికీ అలవాటే. కుటుంబంతో విందులకు వినోదాలకు పోవలసి వచ్చినప్పుడు, రైలు ప్రయాణాలు చేయవలసినప్పుడు, నాకు టెన్షన్ రావడమే కాదు, బిపి కూడా పెరుగుతుంటుంది. ఒక పట్టాన తెమలరు, తయారుకారు. మా వయస్సులు పెరుగుతున్నా ఇందులో మార్పులు మాత్రం రావడం లేదు.

ఒక వింత అనుభవం మీ ముందుంచి, ఈ వ్యాసం ముగిస్తాను. నేను నాగార్జున సాగర్‌లో మా పెద్దక్క దగ్గర వుండి ఇంటర్మీడియెట్ (1972-74) చదువుకున్నాను. సెలవుల్లోనూ, అప్పుడప్పుడూ సాయంత్రాలు, అక్క అభిమానులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు వచ్చి కబుర్లు చెప్పుకునేవారు. అదొక చిన్న మహిళా సమాజం సమావేశంలా ఉండేది. అందరూ వంటా వార్పూ ముగించుకుని వచ్చేవారు. కబుర్లలో పడి, సమయం పట్టించుకునేవారు కాదు. రాత్రి అయిపోయేది, వాళ్ళు ఎంతకీ కదిలేవారు కాదు. నాకు ఆకలి మండి పోతుండేది. మా అక్క వచ్చి వంట చేస్తేగాని నేను డిన్నర్ చేసే అవకాశం లేదు మరి!

ఇలా చాలా సార్లు భరించాను, చివరికి ఒక ఆలోచన వచ్చి, ఇంటి వెనుక ఆవరణలో ఒక జామ చెట్టు ఉండేది, దానికి ఒక ఇనుప ముక్క బడి గంటలా కట్టి ఒకరోజు, వాళ్ళు ఎంతకీ కదలక పోవడంతో, వెనక్కి వెళ్లి గంటల మోగించాను. ఇది ఆ బృందంలో ఒకావిడ గ్రహించింది. “ఆమ్మో ప్రసాద్ బెల్లు కొట్టాడు పోదాం పదండి” అని నవ్వుకుంటూ అందరిని కదిలేటట్టు చేసింది. తర్వాతి కాలంలో వాళ్ళు మళ్ళీ ఎప్పుడూ అంతంత సమయం అక్క దగ్గర గడిపేవారు కాదు. సమయం చాలా విలువైనది. దానిని సద్వినియోగం చేసుకోవడమో, దుర్వినియోగం చేసుకోవడమో అనేది మన చేతిలోనే ఉంటుంది. అంత మాత్రమే కాదు, మనవల్ల ఎదుటి వారి సమయం కూడా దుర్వినియోగం కాకూడదు.

అమూల్యమైన సమయాన్ని ఎవరైనా సద్వినియోగం చేసుకోవడానికే ప్రయత్నం చేయాలి. మనకోసం అనవసరంగా ఇంకొకరి సమయాన్ని వృథా చేయడం నేరమే అవుతుంది.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version