ఓటెవరికి..!?
[dropcap]ఐ[/dropcap]దు సంవత్సరాలకొకసారి ఎన్నికలు జరుపుకుని మనకు ఇష్టమైన నాయకులను మనం ఎన్నుకోవడం రాజ్యాంగం మనకు కలిగించిన ఒక సదవకాశం. ఎన్నికల సమయంలోనే ‘ఓటు’ (vote) అనే మాట అందరి నోళ్ళల్లోనూ నానుతుంది. నాయకుల నోళ్ళల్లో వింత వింతగా నాట్యం చేస్తుంది. వార్తాపత్రికలు, టెలివిజన్ ఛానళ్లు ఎన్నకలకు ముందు, తర్వాత అదే మాట పదే పదే వల్లె వేస్తుంటాయి. ఎన్నికలు పూర్తికాగానే నాయకుల నోరు పడిపోతుంది. మళ్ళీ అయిదు సంవత్సరాలవరకూ వారి నోరు, ఓటు అన్నమాట పలకదు.
ఓటు అనేది, ఓటు హక్కు వున్న ప్రతి పౌరుడి ప్రాథమిక హాక్కు. అది కూడా స్వేచ్ఛగా, తమకు ఇష్టమైనవారికి, ఎవరి ఒత్తిడి లేకుండా, ఎవరి ప్రభావం పడకుండా, ఏ పార్టీ ప్రమేయంతో సంబంధం లేకుండా ఓటు వేసి గెలిపించుకునే వెసులుబాటు మనకు భారత రాజ్యాంగం కల్పించింది. ఎవరి ప్రలోభానికీ లొంగకుండా జరిగిన భారతదేశ ఎన్నికల చరిత్రలో మొదటి ఎన్నికలు సజావుగానే సాగినట్టు నాటి ఎన్నికల ఫలితాలు స్పష్టం చేశాయి. తర్వాతి కాలంలో ‘ఓటరు’ క్రమంగా, తాను ఓటు వేసే స్వేచ్ఛను కోల్పోతూ వచ్చాడు.
దీనికి అనేక కారణాలు వున్నాయి. అధికారం రుచి మరిగిన పార్టీలు/నాయకుల నియంతృత్వ ధోరణి పెరిగింది. అమాయక/పేద ఓటరును, రకరకాల తాయిలాలూ ఎర చూపి వశపరచుకోవటం మొదలయింది. ప్రాంతాలవారీగా ఆ ప్రాంతనాయకులు ప్రజలను వశపరుచుకొని, ఎప్పటికీ తామే ఎన్నికలలో గెలిచే వ్యూహాలు మొదలయ్యాయి. క్రమంగా ఓటరు పరిస్థితి దిగజారుతూ వస్తున్నది. అలా అని, అందరినీ అదే జాబితాలో చేర్చవలసిన అవసరం లేదు, కొద్దిమంది మంచివారు, నీతిమంతులు అసలు లేకపోలేదు. కానీ వారంతా ఈనాడు సముద్రంలో నీటిబొట్టంత!
ప్రస్తుతం ఎన్నికలు ఒక ప్రహసనంగా మారిపోయాయి. కండబలం, ధనబలం రాజ్యమేలుతున్నాయనే చెప్పాలి. లేకుంటే, ఎన్నికల్లో గూండాయిజం అవసరం రాదు. ఎన్నికలప్పుడు అభ్యర్ధికి కోట్ల కొద్దీ డబ్బు ఖర్చు కాదు! రౌడీలు, గూండాలు, దోపిడీదారులు, రాజ్యాలు ఏలే పరిస్థితి రాదు. మన ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి ఎన్నికల దుస్థితిని ఎవరూ ఊహించి వుండరు.
ఎన్నికల సంస్కరణలలో గొప్ప సాహసిగా, క్రమశిక్షణ గల ఎన్నికల అధికారిగా శ్రీ శేషన్ భారత ప్రజల మనస్సుల్లో నిలిచిపోయారు. అది ఒక చరిత్ర. తర్వాత పరిస్థితి మరింత దిగజారిపోయింది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. పార్టీలకు, నాయకులకూ, పదవీ వ్యామోహకులకు ఒక కిటుకు అర్థమైంది. అది వారికి ఆయుధమైంది (ఓటును, ఆయుధంగా ఉపయోగించు కోవలసినవారు, నిర్వీర్యం అయిపోయారు).
ఆ కిటుకు ఏమిటంటే, అసలు ఓటును తప్పక ఉపయోగించుకునేవారెవరు? ఓటును ఒక సాధారణ అంశంగా తీసి పారేసేవారు ఎవరు? పల్లెల్లో ఓటింగ్ ఎక్కువ ఉంటుందా? పట్నాలలో ఎక్కువ ఉంటుందా? విద్యావంతులు, ఉద్యోగులు ఎక్కువమంది ఓటింగ్‌లో పాల్గొంటారా? నిరక్షరాస్యులు, కూలినాలి చేసుకునే పేదవారు ఎక్కువ పాల్గొంటారా? అన్నది విశ్లేషించి ఒక నిర్ణయానికి వచ్చేసారు.
విద్యావంతుల వల్ల, ఉద్యోగుల వల్ల పెద్దగా ప్రయోజనం లేదని తేలిపోయింది. తాత్కాలిక తాయిలాలకు లొంగదీసుకునే వెసులుబాటు నాయకులకు కలిగింది. ఇక ప్రభుత్వాలు నడుపుతున్నవాళ్ళు, ‘ఉచితాల’కు శ్రీకారం చుట్టారు. పేదవారి నాడి తెలుసుకుని, చివరిక్షణంలో డబ్బు – మద్యం, చీరలు, ఇతర బహుమతులు ఓటర్లకు అందించే ప్రయత్నాలు మొదలయ్యాయి. ప్రజాధనంతో, ముఖ్యమంత్రుల పేరుతో (అది వారి సొంత జేబునుండి ఇస్తున్నట్టు) అనేక తాత్కాలిక స్కీమ్‌లు మొదలయ్యాయి. కూలీనాలీ చేసుకునేవాళ్ళు పని చేయడం మానేసి బద్ధకిస్టులుగా నిర్వీర్యులైనారు. ప్రజానాయకులను ప్రశ్నించే అర్హతను కోల్పోయారు. చౌకబారు స్కీములతో, రాష్ట్రాలు అప్పులు పాలుకావడం మొదలయింది. అభివృద్ధి కుంటుపడిపోతున్నది.
ఇకపోతే రెండవదిగా, ప్రతిపక్ష పార్టీలు ఆయా ప్రజల అండదండలతో ఎన్నికలలో గెలుపొంది, తర్వాత అధికారపార్టీ వారి ఆకర్షణకు లోనై, క్షణాల్లో కండువాలు మార్చేయడం ద్వారా, ప్రజలను మోసం చేయడమే కాదు, ప్రతిపక్షాలు అనేవి శాసనసభల్లో లేకుండా పోతున్నాయి. అందుచేత అవకతవక పరిపాలనలను ప్రశ్నించేవారు కరువైనారు. ఆ విధంగా ‘ఓటు’ తన విలువను కోల్పోయి క్రమంగా ప్రజలలో నిరాశ-నిస్పృహలకు కారణం అవుతున్నది. ఓటు విలువ సామాన్య ప్రజానీకానికి అర్థం అయ్యేవరకు పరిస్థితి మరింత దిగజారి రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు చిన్నాభిన్నం అయ్యే ప్రమాదం లేకపోలేదు. ఉచితాలు, ఎప్పటికీ తాత్కాలికమేనని, ఇవి పేద ప్రజలను మరింత పేదవారిగా మార్చడానికి పనికి వస్తాయని, ఆయా వర్గాలు తెలుసుకునేవరకు పరిస్థితులు ఇలా ప్రమాద ఘంటికలు మ్రోగిస్తూనే ఉంటాయి. అలాగే ఓటింగ్ యంత్రాల పనితీరు కూడా ఈ మధ్యకాలంలో ప్రశ్నార్థకమైంది. ప్రజలలో ఉత్పన్నమవుతున్న అనుమానానాలకు సరైన సమాధానం చెప్పగల అధికార గణం కరువైయింది.
ఇప్పుడు ఓటరు పరిస్థితి అయోమయంలో పడింది. ఎవరికి ఓటు వేయాలి?అని. ఎవరు సమర్థులు? ఎవరు అసమర్ధులు? అని. తాము ఓటు వేస్తున్న ఎలక్ట్రానిక్ యంత్రాలు సరిగా పని చేస్తున్నాయా? లేదా? అని. ప్రజాస్వామ్యబద్ధంగా తమ ఓటు ఎంతవరకూ ప్రయోజనకారిగా ఉంటుందన్నది? సమాజంలో త్వరలో ఒకమార్పు వచ్చి పై ప్రశ్న లన్నింటికీ సరైన సమాధానం దొరుకుతుందని ఆశించడంలో తప్పు లేదనుకుంటాను.
ఈ ఓటు గురించి నా అనుభవం ఒకటి చెప్పి ఈ వ్యాసానికి ముగింపు పలుకుతాను. నేను హైదరాబాద్‌లో విద్యార్థిగా వున్నప్పుడు మొదటిసారి నా పేరు ఓటరుగా నమోదు చేయించుకున్నాను. నేను అప్పుడు మా అన్నయ్య దగ్గర ఉండేవాడిని. అందుచేత కాకతీయనగర్ కాలనీ (నియోజకవర్గం పేరు గుర్తులేదు) చిరునామాతో నా ఓటు రికార్డుల్లో నమోదు అయింది. ఎన్నికల సమయంలో, నేను, మా అన్నయ్య, వదిన, ఓటు వేయడానికి వెళ్ళాము. చాలా సేపు క్యూలో నిలబడిన తర్వాత మాకు ఓటు వేసే చాన్సు వచ్చి లోపలికి వెళ్ళాము. మమ్ములను ఆశ్చర్య పరచిన విషయం ఏమిటంటే మా ఓట్లు మూడూ అప్పటికే ఎవరో వేసేసారు. తర్వాత వివిధ సందర్భాల్లో నా ఓటు హక్కు వినియోగించుకున్నాననుకోండి, అది వేరే విషయం!
అయితే నేటి ఓటరు మదిలో తలెత్తుతున్న సందేహాలు ఏమిటంటే, ఓటు ఎవరికి వేయాలి? ఓటు వేసి గెలిపించిన వ్యక్తి అదే పార్టీలో ఉంటాడనే గ్యారంటీ ఉంటుందా? తరచుగా కండువాలు మార్చే నాయకులకు క్రమశిక్షణ చర్యలు ఎందుకు ఉండడం లేదు?ఈ సందేహాలకు సమాధానం కాలమే చెప్పాలి. అయితే ఓటు వున్న ప్రతి పౌరుడు తన అమూల్యమైన ఓటు వేసేటప్పుడు పార్టీలకు, కులాలకు, మతాలకు, బంధుత్వాలకు స్వంత ప్రయోజనాలకు ప్రాధాన్యత నివ్వకుండా, ఆ వ్యక్తి వ్యక్తిత్వానికి, మంచితనానికి, సేవాగుణానికి ప్రాధాన్యతనిచ్చి, నియోజకవర్గ అభివృద్ధికి కంకణం కట్టుకోగల వ్యక్తికి ఓటు వేసే ప్రయత్నం చేయాలి.