Site icon Sanchika

జ్ఞాపకాల పందిరి-126

రేషన్ -పరేషాన్..!!

[dropcap]మం[/dropcap]చి వున్న చోట, చెడు తప్పక ఉంటుందని అనుభవజ్ఞులైన పెద్దలు ఎప్పుడూ చెబుతూనే వుంటారు. ఎవరైనా ఒక మంచి పనిని తలపెట్టినప్పుడు దానిని ఓర్వలేనివారు, సహించలేనివారు తప్పక వుంటారు. వాళ్ళు కష్టపడి పరిశోధనలైనా చేసి, దానిని నీరుగార్చే ప్రయత్నం చేస్తారు. కొన్ని ప్రభుత్వ పథకాలు ఇలాంటివే!

పూర్వం రేషన్ కార్డుల హవా చెప్పలేనంత రీతిలో చెల్లుబాటు అయింది. వ్యక్తి ఆదాయం ప్రాతిపదికగా, రెండు రకాల రేషన్ కార్డులు ఉండేవి. పేదలకు తెల్ల రేషన్ కార్డులు, ధనవంతులకు పసుపు (తర్వాత గులాబీ) రేషన్ కార్డు ఉండేది. వ్యక్తి, వ్యక్తిగత విషయాలను పరిగణలోనికి తీసుకునే విషయంలో రేషన్ కార్డు కీలకం. అందుచేత అందరికీ రేషన్ కార్డు అవసరం ఉండేది.

నెలసరి ముఖ్య అవసరాలు, బియ్యం, పంచదార, వంటనూనె, పప్పులుమొదలైనవి రేషన్ షాపులో సబ్సిడీ ధరల్లో లభించేవి. అంతమాత్రమే కాకుండా, ఉభయ తెలుగు రాష్ట్రాల ఒకప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు, నాటి ముఖ్యమంత్రి శ్రీ ఎన్.టి. రామారావు, పేద ప్రజల కోసం ప్రతిష్ఠాత్మకమైన ‘రెండు రూపాయలకు కిలో-బియ్యం పథకం’ ప్రవేశ పెట్టినప్పుడు, పేద ప్రజల నుండి మంచి స్పందన లభించింది. దీనితో తెల్ల రేషన్ కార్డుకు డిమాండు పెరిగింది. ప్రభుత్వం యెంత మంచి ఉద్దేశంతో ఆ పథకం ప్రవేశ పెట్టిందో, దానిని కొందరు స్వార్థపరులు అంతగా నీరుకార్చేసారు. పేదలకు చేరవలసిన తెల్లరేషన్ కార్డులు అధికశాతం బడా బాబులు హస్తగతం చేసుకున్నారు. తక్కువ రేటు వున్న బియ్యం ఎక్కువ రేటుకు అమ్ముకునేవారు. ఒక్కొక్కరి దగ్గరా ఎన్నెన్నో రేషన్ కార్డులు ఉండేవి. వాటిని అనేక రకాలుగా దుర్వినియోగం చేసేవారు. రాజకీయ నాయకుల హస్తం లేకుండా ఇలాంటి పనులు జరగడం అతి కష్టం.

ఆ విధంగా ప్రభుత్వం ఎక్కువ మొత్తంలో సబ్సీడీ చెల్లించ వలసిన పరిస్థితి ఏర్పడింది. పేద ప్రజలకు ఆహారంగా వెళ్ళవలసిన బియ్యం, వేరొక రహదారిలో, కుక్కలకు, ఇతర పెంపుడు జంతువులకు, పశు-పక్ష్యాదులకు ఆహారంగా వెళ్ళేవి. పేదల కోసం ప్రభుత్వం చేసిన ఒక మంచి పని కొంతకాలం మాత్రమే సజావుగా నడిచింది. తర్వాత క్రమంగా ప్రభుత్వం ఆ పథకం విరమించుకుని కిలో బియ్యం రేటు పెంచవలసి వచ్చింది. దొంగ ఓట్లు మాదిరిగానే, దొంగ-తెల్ల రేషన్ కార్డులు ఉండేవి. పాలకులకు ఇదొక పెద్ద సమస్యగా మారింది.

ఇలాంటిదే, వైద్య రంగంలో కూడా జరిగింది/జరుగుతోంది కూడా! అది ఏమిటంటే ‘ఆరోగ్య శ్రీ పథకం’. ఇది ఎంతో ప్రయోజనకరమైన పథకం. తెల్ల రేషన్ కార్డు/పసుపు లేదా గులాబీ రంగు రేషన్ కార్డు వున్నవారు ఎవరైనా దీనికి అర్హులే! లేదంటే సంవత్సర నికరాదాయము అయిదు లక్షలకు మించి ఉండరాదు. వీరికి కార్పొరేట్ స్థాయిలో వైద్యం ఉచితంగా లభిస్తుంది.

ఇది, డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో మొగ్గ తొడిగింది. దురదృష్టవశాత్తు, దొంగ ఆదాయపు ధ్రువీకరణ పత్రాల ద్వారా, ఈ స్కీము కూడా పేదలకు తక్కువగా, ఇతరులకు ఎక్కువగా ఉపయోగపడింది. రాజకీయ నాయకుల ప్రమేయం, లంచగొండి ఉద్యోగుల ద్వారా వెలుగు చూసిన దొంగ-ఆదాయపు ధ్రువీకరణ పత్రాల వల్ల ఈ పథకం చేరవలసిన వారికి చేరవలసినంత చేరలేదు. అధికారులు అప్రమత్తంగా లేకున్నా, నిరంతర పర్యవేక్షణలు, లేకున్నా యెంత ప్రతిష్ఠాత్మక పథకం అయినా ప్రయోజనం లేకుండా పోతుంది. నిర్దేశించిన జనావళికి అందకుండా పోతుంది. ప్రజలు, ప్రజా ప్రతినిధులు, సంబంధిత సిబ్బంది, ప్రభుత్వానికి సహకరించకపోతే, ఏ కార్యక్రమము జయప్రదం కాబోదు.

నా దృష్టికి వచ్చిన ఇలాంటి రెండు అంశాలను పాఠకులతో పాలు పంచుకునే ప్రయత్నం చేస్తాను. నాకు అతిదగ్గర బంధువు ఒకాయన వున్నాడు. నిజానికి ఈయన పేదరికంలోనుంచి వచ్చినవాడే! కానీ మంచిగా విద్యార్హతలు పొందడము వల్ల, మంచి ఉద్యోగంలోనే స్థిరపడినాడు. ఈ ఉద్యోగం ద్వారా ఇతను పేదవాడు కాదు. కానీ ఈయన ప్రాథమిక దశలో సంపాదించుకున్న తెల్ల రేషన్ కార్డు ఇప్పటికీ ఉపయోగిస్తున్నారు (ఈయన పదవీ విరమణ చేసి కూడా చాలా కాలం అయింది). ప్రతినెలా మర్చిపోకుండా రేషన్ బియ్యం తెచ్చుకుంటాడు. పోనీ ఆ బియ్యం, ఆ కుటుంబం ఉపయోగించుకుంటే కొంతవరకూ ఫరవాలేదు, కానీ కొన్న ధరకంటే బయట ఎక్కువ ధరకు అమ్ముకుంటారు. ఇది యెంత అన్యాయం, యెంత దుర్మార్గం! పేదవారికి చేరవలసినవి, ఇలా ఇతరులు అనుభవించడం ఎంతవరకూ న్యాయం? ఇప్పటి వరకూ చెప్పిన వ్యక్తి భార్య గృహిణి. ఆవిడకు కూడా తెల్ల రేషన్ కార్డు వుంది. దురదృష్టవశాత్తు రెండు సంవత్సరాల క్రితం ఆవిడ వ్యాధిగ్రస్థురాలై మరణించింది. కానీ ఆవిడ పేరుమీద వున్న రేషన్ కార్డు ఇప్పటికీ సజీవంగా వుంది. మరి, సమాజంలో ఇంకా ఇలాంటివారు ఎంతమంది వున్నారో?ఇప్పుడు చెప్పింది నా దృష్టికి వచ్చింది మాత్రమే, ఆయన నా దూరపు బంధువు కావడం మూలాన్నే నాకు తెలిసింది. ఇలాంటి వారిలో, సమాజంలో గొప్పలు చెప్పుకునే గొప్ప ఘరానా వ్యక్తులు, రాజకీయ నాయకులు, ఉద్యోగులు, వ్యాపారులు కూడా ఉండడం విశేషం, బాధాకరం. కేవలం స్వార్థపరులు, స్వార్థపూరిత ఆలోచనలుగల పెద్దమనుష్యులు, పేదల కోసం ప్రభుత్వం ఎన్ని మంచి పథకాలు ప్రవేశపెట్టినా పనిగట్టుకుని నిర్వీర్యం చేస్తున్నారు. పేదలకు అందవలసిన సౌకర్యాలు రూపాయిలో పావలా వంతు కూడా చేరడం లేదు (ఇది నేను చెబుతున్న మాట కాదు సుమండీ, మన మాజీ ప్రధాన మంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు,ఒకానొక సందర్భంలో అన్న మాటలు). పేదల బ్రతుకులు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా, ఎక్కడ వేసిన గొంగళి, అక్కడే వున్నట్టుగా వుంది. డబ్భై అయిదేళ్ల మన స్వతంత్ర భారత దేశంలో ఇంకా ఇలాంటి పరిస్థితులు కొనసాగడం బాధాకరం, దురదృష్టకరం!

మరొక దురదృష్టకరమైన విషయం ‘ఆరోగ్య శ్రీ’ నిరుపేదలైన ప్రజల ఆరోగ్య పరిస్థితిని చక్కదిద్దెందుకు ప్రవేశ పెట్టిన ప్రతిష్ఠాకరమైన పథకం! ఈ పథకం కూడా పేదవాళ్లకు దూరమై ఉన్నవాళ్లకు క్రమంగా దగ్గరైంది. నాకు తెలిసిన ఒక వ్యాపారికి చిల్లరకొట్టు ఉండేది. అది క్రమంగా దిన దిన ప్రవర్ధమానమై, చిన్న సూపర్ బజార్‍గా మారింది, నెలసరి ఆదాయం లక్షల్లో ఉంటుంది. ప్రభుత్వ నియమాల ప్రకారం ఈ కుటుంబం, తెల్ల రేషన్ కార్డుకు గానీ, ఆరోగ్యశ్రీకి గానీ అర్హులు కారు. కానీ వాళ్ళు ఇప్పటికీ ఈ సదుపాయాలు స్వేచ్ఛగా అనుభవిస్తున్నారు. ఇలాంటివారు, వేలల్లో, లక్షల్లో వున్నారు. వీరిని అదుపు చేసేవారు, క్రమబద్దీకరించే వారు ఎవరు? వారిలోనే ఏదో లోపం వుంది. అలాంటి లోపాలు సరిదిద్దకపోతే, ఎలాంటి పథకమూ విజయం సాధించలేదు.

ఇక్కడ కేవలం పాలకులను మాత్రమే తప్పుపట్టడం సరికాదు. రాజకీయ నాయకులు, అధికారులు, ప్రజలు సహకరిస్తేనే, అనుకున్న రీతిలో పథకాలు అమలు అవుతాయి.

నాకు కూడా గులాబీ రేషన్ కార్డు ఉండేది. దానిని నేను ఎక్కువగా నా గుర్తింపు కోసమే వాడాను. కొద్ది సంవత్సరాలు మాత్రమే పంచదార సదుపాయాన్ని వినియోగించుకున్నాను. అలా అని నేనేదో గొప్ప పని చేసేసానని కాదు. ఎవరైనా సరే ప్రాధాన్యతలను దృష్టిలో పెట్టుకుని, బాధ్యతగల పౌరులుగా వ్యవహరించాలని చెప్పడమే నా ప్రధాన ఉద్దేశం. ప్రజల సహకారం లేకుండా ఏ ప్రభుత్వమూ సజావుగా పరిపాలించ్లేదు. ఇలాంటి వ్యవహారాలలో ప్రతిపక్షాలు సైతం సహకరించినప్పుడే ప్రజలకు పూర్తిగా మేలు జరుగుతుంది,

ముఖ్యంగా పేద ప్రజలకు, అవసరమైన జనాభాకు పూర్తి న్యాయం జరుగుతుంది. ప్రజా సంక్షేమ పథకాల కోసం అందరూ సహకరించ వలసిందే, స్వార్ధ పూరితమైన పథకాలు ప్రవేశపెట్టే ఏ ప్రభుత్వాన్నైనా ప్రజలు మూకుమ్మడిగా వ్యతిరేకించ వలసిందే! పేద ప్రజల కోసం ప్రవేశపెట్టిన పథకాలకు అనర్హులైన ప్రజలు, స్వయంగా ఆ అవినీతి కార్యక్రమాల నుండి బయటకు రావాలి. మనకోసమే కాదు, అందరి సంక్షేమం కోసం మనం ఆలోచించ గలగాలి.

ఓటు, రేషన్ కార్డు సదుపాయాలు, ఆరోగ్యశ్రీ వంటి సదుపాయాలూ సద్వినియోగం చేసుకోవడం, సద్వినియోగం అయ్యేలా వ్యవహరించడం మన ధ్యేయంగా భావించాలి.

నేను, నాది, నా కోసం

అన్నది పక్కన పెట్టు!

మనది, మనము, మన కోసం

అన్నది మదిలో రాసి పెట్టు!!

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version