Site icon Sanchika

జ్ఞాపకాల పందిరి-127

వివాహ భోజనంబు..!!

[dropcap]సా[/dropcap]ధారణంగా వయసు వచ్చిన లేదా యవ్వన ప్రాంగణం లోనికి అడుగుపెట్టిన అమ్మాయిలను గానీ, అబ్బాయిలను గానీ, అతి సమీప బంధువర్గానికి చెందిన పెద్దలు గానీ, శ్రేయోభిలాషులైన పెద్దలు గానీ “పప్పన్నం ఎప్పుడు పెడుతున్నావ్?” అంటూ జోక్ చేస్తుంటారు, లేదా సరదాగా ఆట పట్టిస్తుంటారు. అంటే ‘పెళ్ళీడుకొచ్చేసావ్, పెళ్ళెప్పుడు చేసుకుంటావ్?’ అని వాళ్ళ అర్థం అన్నమాట! ఏ వయసులో చేయవలసింది, ఆ వయసులోనే చేయాలన్న పెద్దల వాక్కుకు అది నాందీ ప్రస్తావన అన్నమాట! అలాగే పెళ్లి భోజనానికి వున్న ప్రత్యేకతను, ప్రాధాన్యతను తెలియజేస్తుంది. పెళ్లి భోజనం అంటే రుచికరమైన భోజనం ఉంటుందన్నది అందరికీ తెలిసిన విషయమే! గతంలో మధ్యతరగతి కుటుంబాలలో జరిగే పెళ్లిళ్లు యెంత సాధారణ స్థాయిలో జరిగినా, ఆత్మీయంగా ఉండేవి. టెలీఫోన్లు, మొబైల్స్ లేని కాలంలో ఉత్తరాలు ప్రధాన సమాచార సాధనాలుగా ఒక వెలుగు వెలిగాయి. అందుకే ఈ పెళ్లిళ్ల సమాచారం కొద్దిరోజులు ముందుగానే తెలియజేసేవారు. అందుకే పెళ్ళికి వెళ్ళవలసినవారు అన్నిరకాలుగా సిద్ధపడడానికి తగినంత సమయం దొరికేది.

ఒకప్పుడు ఎవరి బియ్యం వారు తెచ్చుకోవాలని పెళ్లి పిలుపు లోనే రాసేవారట. కాస్త అతి సమీప బంధువులైతే, అరిటాకులు, గుమ్మడికాయలు, సొరకాయలు, ఇలా ఎవరికి అందుబాటులో వున్నవి వారు తెచ్చి, పెళ్లింటి వారికి కొద్దో గొప్పో సహాయపడేవారు. అప్పుడు ఎంతో ఆత్మీయమైన పంక్తి భోజనాలు (తర్వాత బఫే పద్ధతి అంటువ్యాధిలా వ్యాపించింది) ఉండేవి కనుక విస్తరాకుల (అరటి ఆకులు) అవసరం బాగా ఉండేది. అందుకే బంధువులు ఎవరో ఒకరు తప్పని సరిగా అరటి ఆకులు తెచ్చేవారు. పెళ్ళిళ్ళల్లో గుమ్మడికాయ దప్పళం తప్పనిసరి కనుక, దాని ప్రాధాన్యత కూడా బాగా వుండేది. చాలామంది స్వయంగా గుమ్మడికాయలు పండించేవారు కనుక, వాటి కొరత గానీ వాటిని కొనవలసిన అవసరం కానీ ఉండేది కాదు. ఈ పంక్తి భోజనాలు, ఏదో కొద్దిమందికి నిరుత్సాహాన్ని కలిగించినా, కావలసింది వడ్డించమని అడిగి తిని చాలా సంతృప్తి పడేవారు. కాలం మార్పుతో పద్ధతుల్లోనూ, అలవాట్లలోను ఎన్నో మార్పులు వచ్చాయి, దానికే ‘ఆధునికత’ అని నామకరణం చేశారు.

ఆ ఆధునికతలో రంగప్రవేశం చేసిందే ‘బఫే సిస్టం’. పంక్తి భోజనాలలో క్రింద కూర్చోవడం గానీ, ఎదురుగా వున్న బల్లముందు కుర్చీలో గానీ కూర్చుంటే, విస్తరాకులో భోజనం, కూరలు, కావలసినవి, ఆ పెళ్లికోసం తయారుచేసిన ఇతర పదార్ధాలూ ఒకదాని తర్వాత ఒకటి వడ్డించే వారు. అవి కూడా అరడజనుకు మించి వెరైటీలు ఉండేవి కాదు. తృప్తిగా భోజనం చేసి లేచేవారు. ఆహారపదార్థాలు ఎక్కువగా వృథా అయ్యేవి కాదు!

లేదంటే అక్కడక్కడా, అప్పుడప్పుడూ వినిపించే ఫిర్యాదు ఏమంటే, తాము అడిగిన పదార్థాలు అడిగినంత వడ్డించలేదని. కొందరు కావాలని ఇలాంటి ఫిర్యాదులతో గొడవ పెట్టుకునేవారు. కొందరికి అదొక వినోదంలా ఉండేది. మరు క్షణమే అవి సమసిపోయేవి.

ఇక పెళ్లిళ్లు ఆధునికత్వంలోకి అడుగు పెట్టాక, భోజనాల వ్యవహారం కూడా మారిపోయింది. ఎవరికి వారు వడ్డించుకు తినే (బఫే) వెసులుబాటు వచ్చింది.

ఫలానా ఫుడ్ ఐటం అందలేదని ఫిర్యాదుకు తావులేదు. కావలసినవి ఎవరికీ వారు వడ్డించుకుని నిలబడి తినే ప్రక్రియ ఇది. మన సంస్కృతీ సంప్రదాయాలకు విరుద్ధమైనది. బహుశః పాశ్చాత్యుల నుండి దిగుమతి చేసుకున్న సంస్కృతీ కావచ్చు. తప్పు లేదు కానీ ఈ పద్ధతిలో ఆహార పదార్థాలు ఎక్కువ స్థాయిలో వృథా కావడానికి అవకాశాలు ఎక్కువగా వున్నాయి. తమ గొప్పలు ప్రదర్శించుకోవడానికి లెక్కలేనన్ని వంటకాలు విందు భోజనానికి సిద్ధం చేస్తారు. ఇక వాటి వినియోగం మాత్రం ఒక మంచి పద్ధతిలో జరగదు. ఎక్కడలేని ఆరాటంతో అన్ని రకాల పదార్థాలూ ప్లేట్లో పెట్టేసుకుంటారు. కానీ అన్నీ తినలేరు. సగం సగం వదిలేస్తారు. అది కాస్తా ఎటూ కాకుండా చెత్త గంపలోకి వెళ్ళిపోతుంది. అన్నం విలువ, ఆకలి విలువ తెలిసిన వారికి ఇది అత్యంత బాధాకరంగా అనిపిస్తుంది. సమాజంలో తిండిలేక అనేక మంది ఆకలి చావులకు బలి అయిపోతున్న నేపథ్యంలో, ఇలాంటి వృథా పనులు ఎంతవరకూ సమంజసం?

ఇది పెళ్ళిలో విందు ఏర్పాటు చేసిన పెద్దల తప్పా? లేక విందును సద్వినియోగం చేసుకోని అతిథులదా? అని ప్రశ్నించుకుంటే, ఇద్దరిలోనూ తప్పు కనిపించవచ్చు. విందులలో ఎక్కువ రకాల పదార్థాలు పెట్టడం మొదటి తప్పు. వారి ఉద్దేశం వచ్చిన అతిథులకు రుచికరమైన భిన్నమైన పదార్థాలను పెట్టి ఆనంద పరచాలనే తృప్తికరమైన ఆలోచన ఉంటే వుండవచ్చు, కానీ విందును సరైన పద్ధతిలో ఆస్వాదించలేని అతిథులు వున్నప్పుడు, యెంత సొమ్ము వృథా? ఎన్ని ఆహార పదార్ధాలు వృథా?

ఒకసారి ఎవరికివారు ఆలోచించుకోవలసిన అవసరం వుంది. విద్యావంతులు, మంచి హోదాలలో వున్నపెద్దలు సైతం అనాలోచితంగా ఇలాంటి పనులు చేయడం బాధాకరం. ఈ పెళ్లిళ్లలో యెంత వృథా అవుతుందో ఒకసారి ఆలోచించాలి, అవసరమైతే, క్షేత్రస్థాయిలో పరిశీలించాలి. ఈ పద్ధతికి ఏదో రూపంలో అడ్డుకట్ట వేయాలి. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా, ఒకరిని చూసి మరొకరు ఇలాంటి వృథా పనులకు ఆస్కారం ఇవ్వకూడదు. సంస్కారవంతులైన ప్రజలు ఆహార పదార్థాలు వృథా కాకుండా సద్వినియోగ పడేలా విందుల సందడిలో అప్రమత్తంగా ఉండాలి. నిజానికి పెళ్లి కోసం ఎన్ని లక్షలు ఖర్చుచేసినా, విందును బట్టే పెళ్లి గొప్పతనం చెప్పుకుంటారు. అందుకే మంచి రుచికరమైన భిన్నమైన రుచులను అందివ్వడానికి పెళ్ళివారు ప్రయత్నం చేస్తారు. మరి తినేవారికి ఉండాలి కదా, యెంత, ఎలా తినాలనేది? అందుకే ఎక్కువ ఆహార పదార్థాలు ఎవరికీ ఉపయోగం లేకుండా అయిపోతున్నాయి. ఆధునికత పేరుతో మనకు జరుగుతున్న నష్టం అది. ఆధునికతను (బఫే)ను, నేను ఆక్షేపించడం లేదు, దానిని సద్వినియోగం చేసుకోవాలని మాత్రమే నేను అభిప్రాయ పడుతున్నాను.

ఇక నా విషయానికొస్తే, మావి మధ్యతరగతి కుటుంబాలు కనుక మా చిన్నతనంలో మా బంధువుల ఇళ్ళల్లో పెళ్ళి భోజనాలు పంక్తి భోజనాలే! మా పెద్దన్నయ్య (మీనన్) పెళ్ళికి, చిన్నక్క (భారతి) పెళ్ళికి, పంక్తి భోజనాలే! నా పెళ్ళికి (విజయవాడ) పంక్తి భోజనాలు ఏర్పాటు చేసారు, కానీ నా రిసెప్షన్ (హైదరాబాద్ – ద్వారకా హోటల్లో) మాత్రం అన్నయ్య బఫే పద్దతిలో ఏర్పాటు చేసాడు. నా కూతురు (నీహార) పెళ్ళికి, కొడుకు (రాహుల్ ) పెళ్ళికి, బఫే పద్దతి తప్పలేదు. నా ఆలోచనలు అక్కడ కుదరలేదు. కానీ ఆహార పదార్థాలు వృథా కాకుండా చాలా జాగ్రత్త పడ్డాను, అయినా కొంత శాతం వృథా కాక తప్పలేదు.

ఇంట్లో కూడా ఆహార పదార్థాలు, ముఖ్యంగా అన్నం, కూరలు, పండ్లు వృథా చేయడం నేను ఇష్టపడను. నేనే కాదు ఎవరైనా ఈ విషయంలో జాగ్రత్త పాటించవలసిందే!

అలా అని మన ఇంట్లో ఒకలా, వేరే చోట మరోలా ప్రవర్తించకూడదు. మాయాబజార్ సినిమాలో, ‘వివాహ భోజనంబు..’ పాట సన్నివేశం కాస్త అతిశయోక్తితో కూడుకున్నదిగా ఉన్నప్పటికీ, ఒక్క పదార్థం కూడా వృథా కాకుండా తినడం అనే అంశాన్ని మాత్రమే సానుకూలంగా తీసుకోవాలి.

పెళ్లి భోజనం ఖచ్చితంగా ప్రత్యేకతను కలిగి ఉండి, రుచికరమైన పదార్థాలు అందుబాటులో ఉంటాయి. స్వంత వంటకాలైనా, కేటరింగ్ అయినా, తక్కువతో మొదలుపెట్టి, అవసరమైతే మళ్ళీ వడ్డించుకోవాలి తప్ప, ఎక్కువ వడ్డించుకుని తినలేక పారవేయడం అసలు మంచి పద్ధతి కాదు. చిన్నపిల్లల ప్లేట్లలో ఎక్కువగా వడ్డించి, వాళ్ళు తినకపోతే పారవేయడం ప్రతి చోటా మనం గమనిస్తున్న విషయమే!

ఇది కూడా కరెక్ట్ పద్ధతి కాదు. రుచికరమైన భోజనం తిని మనం యెంత ఆనందిస్తామో, అదే విధంగా మనల్ని ఆహ్వానించినవారు కూడా మన పద్ధతులు – ప్రవర్తన చూసి ఆనందించాలి, తృప్తిపడాలి. గొప్పలు చెప్పుకుంటున్నానని అనుకుంటారు గానీ, ఇప్పటికీ నా మిత్రులు ఎవరైనా కనపడితే, వాళ్ళు ముందుగా గుర్తు చేసే మాట “మీ పాప పెళ్లి విందు ఇప్పటికీ మరచిపోలేక పోతున్నాం సార్” అని. ఇలాంటి మాటలు విన్నప్పుడు చెప్పలేనంత ఆనందం కలుగుతుంది. ఈ సందర్భంగా ‘హర్ష కేటరింగ్’ యజమాని గోపి గారికి, సహకరించిన బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు నేను ఎప్పటికీ రుణపడి వుంటాను.

‘వివాహభోజనం – విలువైన జ్ఞాపకం..!!’.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version