జ్ఞాపకాల పందిరి-13

132
2

[box type=’note’ fontsize=’16’] “కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే…!!” అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్. [/box]

అలా కాకుంటే…

[dropcap]కొ[/dropcap]న్ని జీవితాలు ఎలావుండేవో! ఊహించలేని సందర్భాలవి. అలా కావడం వల్ల జరిగిన విషయాలు కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. మంచి జరిగితే గతం గుర్తుకు రాదు! జరగకూడనిది ఏమైనా జరిగితే అలా వుంటేనే బావుండేది అనిపిస్తుంది.

జీవితంలో కొన్ని సంఘటనలు తలరాతనే మార్చేస్తాయి. ఊహించని విధంగా, అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ఆ మార్పులు మంచివైతే భవిష్యత్తును మహత్తర దశకు చేర్చేది కావచ్చు, లేదా అధఃపాతాళానికి దించేది కావచ్చు. సాధారణంగా మంచి జరిగినప్పుడే పదే పదే గుర్తు చేసుకోవాలని అనిపిస్తుంది. ఇది సాధారరణ మనిషి యొక్క మనస్తత్వం. అలంటి సంఘటనలు ఎందరి జీవితాల్లోనో చోటుచేసుకుంటాయి. ఆ అనుభవాలు తెలుసుకుంటే, అవి కొందరి జీవితాలకైనా స్ఫూర్తినివ్వక మానవు. ఇబ్బందులు కలిగినప్పుడు, వాటినే తలచుకుంటూ, నిరాశాజనకంగా బ్రతకడం, మనిషిని మరింత కృంగదీస్తుందే తప్ప, ఎలాంటి మేలు చేయదు.

బాల్యంలో నేను
తల్లిదండ్రులు తాతయ్య, వెంకమ్మగార్లు

ఇలాంటి అనుభవాలు కొన్ని తెలుసుకొని ఉండడం నేటి యువతకు అవసరమే అనిపిస్తుంది. పాఠ్య గ్రంధాలు తప్ప సాధారణ గ్రంథాలు ఉదాహరణకి సాంఘిక నవలలు, కథల పుస్తకాలు, మహానుభావుల జీవిత చరిత్రలు, జీవితాన్ని కాచి వడబోసిన పెద్దల జీవిత అనుభవాలు మొదలైనవి చదవక పోవడంవల్ల, తల్లిదండ్రులు చదివించక పోవడం వల్ల జీవితం గురించిన మంచి చెడులు తెలుసుకునే అవకాశం లేకుండా పోతున్నది. దీనివల్ల వైవాహిక జీవితానికి, సామాజిక జీవితానికీ అర్థం తెలియక, అవగాహన చేసుకోలేక, లేత వయసులోనే తొందరపాటు నిర్ణయాలు తీసుకుని, బంగరు భవిష్యత్తును కాలదన్నుకుంటున్నారు. ఇది చాలా దురదృష్టకరమైన విషయం. పిల్లలే కాదు, తల్లిదండ్రులు కూడా బాధ్యతాయుతంగా ఆలోచించవలసిన విషయం ఇది.

నా బాల్యం చాలా క్లిష్ట దశలనుండి బయటపడింది. బాల్యాన్ని సరిగా అనుభవించలేని దౌర్భాగ్య స్థితి నాది. ఏ చిన్నపిల్లాడు అనుభవించకూడని వ్యథ నాది. దాని గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటే, ఈ రోజున నా జీవితం ఇలా వున్నత స్థాయిలో ఉండేవాడిని కాదు! ఎందుచేతనంటే నేను ఆర్థికంగా ఉన్నత స్థాయినుండి వచ్చినవాడిని కాదు! ఉన్నత విలువలు వున్న దిగువ మధ్యతరగతి నుండి వచ్చినవాడిని. కష్టాల కడలిని దాటి నేను ఒక స్థాయికి చేరుకొనేవాడిని కాదేమో! నా ఈ విషాద ప్రయాణం వెనుక ఎందరివో ఆపన్న హస్తాలు వున్నాయి. ప్రత్యక్షంగా కొందరు, పరోక్షంగా కొందరు నా అభ్యున్నతికి అండగా నిలిచారు. అందులో కుటుంబ సభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు ఉన్నారు!

అది 1967 అనుకుంటాను, స్వగ్రామం దిండిలో (తూర్పు గోదావరి) అయిదవ తరగతి పూర్తి చేసి, మా అప్పటి తాలూకా కేంద్రం అయిన ‘రాజోలు’ కు, హైస్కూల్‌లో చేరడానికి ప్రవేశ పరీక్ష రాయడానికి వెళ్లాను. నిజానికి మా నాయన ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి (చిట్టెయ్య మాష్టారు) చెప్పి ఐదో తరగతి ఫెయిల్ చేయించారు. ఉన్నత చదువుల కోసం మిగతా పిల్లలు వేరోచోటికి వెళ్లిపోవడం వల్ల నాకు ఆ సన్మానం ప్రాప్తించింది. భవిష్యత్తులో జరిగే నష్టాలను వాళ్ళు ఊహించలేదు. ఇకపోతే, ఆరో తరగతి ప్రవేశ పరీక్ష కోసం పెద్దన్నయ్య అనుచరుడు, మాకు దూరం చుట్టం నల్లి ప్రసాద్ గారు సైకిల్ మీద తీసుకెళ్లారు. ఈ ప్రవేశ పరీక్షను ‘ఇన్ టు ఫస్ట్ ఫామ్’ పరీక్ష అనేవారు.

ప్రవేశపరీక్ష గట్టెక్కి అర్హత సంపాదించాను. అప్పుడు మా స్కూల్ కోర్టుల దగ్గర ఉండేది. ఇప్పుడూ అక్కడే వుంది కానీ పూర్తిగా గర్ల్స్ స్కూల్ అయింది. అక్కడ రెండవ తెలుగు స్థానంలో సంస్కృతం తీసుకుని ఎనిమిదవ తరగతి వరకు చదివాను. సంస్కృతం సబ్జెక్టు తీసుకున్నవాళ్లంతా, ఆడపిల్లల ఏ -సెక్షన్‌లో ఉండేవాళ్ళం. నాటి మిత్రులు విన్నకోట లక్ష్మీపతి (రాజోలు కోర్టులో అడ్వకేట్), జి. బ్రహ్మానంద శర్మ(విశాఖ) ఇంకా నాకు టచ్ లోనే వున్నారు. వెంపరాల గోపాలకృష్ణ (హైకోర్టు లాయరు) మాత్రం కాలం చేసారు. ఎనిమిదవ తరగతి నా జీవిత మార్గాన్ని పూర్తిగా మార్చివేసింది. అంతులేని అయోమయంలో పడేసింది, ఊహించని మార్పును తీసుకు వచ్చింది. అదెలాగంటే…

నేను చదువు నిమిత్తం నా స్వగ్రామం వదిలి రాజోలు వెళ్లాను. సాంఘిక సంక్షేమ వసతి గృహంలో ఉండేవాడిని. అప్పుడు ఈ వసతి గృహాలు ప్రైవేట్ వ్యక్తులు నిర్వహించేవారు. అయితే ఒక నిబద్ధత ప్రకారం, క్రమశిక్షణతో నడిపేవారు. పిల్లలు కూడా అలాగే పట్టుదలతో చదివేవారు. నేను ఆశ్రయం పొందిన వసతి గృహాన్ని స్వర్గీయ గొల్ల చంద్రయ్య గారు నడిపేవారు. వారు నిష్కల్మషమైన స్వతంత్ర సమరయోధులు. అంత మాత్రమే కాదు, ప్రముఖ కవి, ‘పాలేరు’ నాటకం రచయిత, పద్మవిభూషణ్ బోయి భీమన్న గారికి ఈయన మామగారు.

గొల్ల చంద్రయ్య గారి హాస్టల్, రాజోలు

హాస్టల్‌లో వుండి చదువుకుంటున్న సమయంలో ఎనిమిదవ తరగతిలో నాకు అనారోగ్యం ఏర్పడింది. కుడికాలు తొడభాగం వాచి, నొప్పిపెట్టేది, జ్వరం వచ్చేది. వ్యాధి తీవ్రతను పసిగట్టే వైద్యసదుపాయాలు అప్పట్లో రాజోలులో లేవు. డా. మల్లికార్జున రావు గారు అనే ఎం.బి.బి.ఎస్. డాక్టరు ఒకాయన ఉండేవారు. మాకు తెలిసిన ఒక ఆర్. ఎం. పి,డాక్టరు గారు ఆయన దగ్గరకు తీసుకువెళ్లారు. ఆయనకున్న పరిజ్ఞానంతో నామీద రకరకాల ప్రయోగాలు చేసి, చివరికి సర్జరీ కూడా చేసి, ఇక తనవల్ల కాక, ఆఖరికి చేతులెత్తేశారు డాక్టర్ గారు. వేరే పెద్ద డాక్టర్‌కు చూపించమన్నారు.

అన్నయ్యతో నేను చిన్నప్పుడు

అప్పటికి కొద్దిసంవత్సరాల క్రితమే మా అన్నయ్య కె. కె. మీనన్ (ప్రముఖ నవల-కథా రచయిత) హైద్రాబాద్‌లో ఉద్యోగంలో చేరాడు. ఏ.జి.ఆఫీసులో పనిచేసేవాడు. కూబ్దిగూడలో నివాసం ఉండేవాడు. నా విషయం తెలుసు కున్న అన్నయ్య, వెంటనే నన్ను హైదరాబాద్ తీసుకురమ్మని ఫోన్ చేసారు. అప్పటికింకా మా అన్నయ్యకు పిల్లలు లేరు. చిన్నన్నయ్య నన్ను వెంటబెట్టుకుని ముందు విజయవాడ తీసుకువెళ్లాడు. అక్కడ మా పెద్దన్నయ్య కానేటి కృష్ణమూర్తి (టికెట్ కలెక్టర్-రైల్వే) పనిచేసేవారు. ఆయన,నా విషయం విని చాలా బాధపడి కొత్తగా మొదటిసారి హైదరాబాద్ వెళుతున్న మాకు దైర్యం చెప్పి, అవసరమైతే సహాయం చేయమని నాంపల్లి రైల్వే స్టేషన్ మాష్టరుకు ఉత్తరం రాసిచ్చారు. మమ్మలిని రైల్ ఎక్కించి వీడ్కోలు పలికారు. మేము ఎక్కిన రైలు ఏదో గుర్తులేదుగానీ, విజయవాడనుండి నాంపల్లి వెళ్లేసరికి తెల్లవారి బాగా వెలుగు వచ్చేసింది. భయం.. భయంగానే రైలు దిగాము. ప్లాట్‌ఫామ్ మీదికి దిగి చూసేసరికి అన్నయ్య మీనన్, వదిన శిరోరత్నం, మావైపు వేగంగా రావడం చూసి,హమ్మయ్య.. బ్రతుకు జీవుడా అనుకున్నాం. పొట్టి గూడు రిక్షాల్లో అందరం చేరుకున్నాం.

కూబ్దిగూడలో అన్నయ్య ఉంటున్న పోర్షన్ చాలా చిన్నది. నాకు గుర్తు వున్నంతవరకు దానికి అద్దె నెలకు 40/-. రెండు గదుల్లో, ఒకటి డ్రాయింగ్ రూమ్ కం -బెడ్రూం, రెండవది వంటగది కం అటాచ్డ్ బాత్. అన్నయ్యతో పాటు ఇంకా జేసురత్నం కుటుంబం, విజయానందం, సామ్యూల్ గారి కుటుంబం, రంగయ్య, షన్నో దేవి, నారాయణమ్మ, తదితరులు నివాసం ఉండేవారు. అంతా ఒక కుటుంబం మాదిరిగా ఉండేవారు. కిష్టయ్య, యాదయ్యల ఇళ్ళు అవి.

వీలు చూసుకుని అన్నయ్య రిక్షాలో ఉస్మానియా ఆసుపత్రికి తీసుకు వెళ్ళాడు. నిజాము కట్టించిన అంత గొప్ప భవనం నేను చూస్తానని ఎన్నడూ అనుకోలేదు. అప్పటికి ఇంకా కుక్కగొడుగుల్లాంటి నేటి కార్పొరేట్ ఆసుపత్రులు లేవు. పక్క రాష్ట్రాలకు కూడా ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులే దిక్కు! అందుచేత జనం కిటకిటలాడుతుండేవారు. నేను వెళ్ళవలసిన ఆర్థోపెడిక్ ఔట్ పేషేంట్ విభాగం కూడా జనంతో క్రిక్కిరిసి వుంది. అన్నయ్య నా పేరుమీద ఓపీ చిట్టీ తీసుకుని లోపలికి పంపించాడు.

నా వంతు వచ్చాక నా పేరు పిలిచారు. భయంగానే లోపలికి వెళ్లాను. లోపల రోగులకంటే డాక్టర్లే ఎక్కువమంది వున్నారు. అసలు పెద్ద డాక్టర్లు కాక, పి.జి.లు, హౌస్ సర్జన్లు వున్నారు. వీళ్ళు పరీక్షించిన మీదటే పెద్దవాళ్లకు చూపించి వ్యాధి నిర్ధారణ నిర్ణయం తీసుకుంటారు. ఈ ఆర్థోపెడిక్ విభాగం అధిపతిగా డా. ధర్మరాయ్ ఉండేవారు. ఈయన ఒక ఆంగ్లేయుడు మాదిరిగా ఎప్పుడూ నోట్లో సిగార్/పైప్ పెట్టుకునిఉండేవారు.

ఆయనకు అసిస్టెంట్లుగా డా.మధుసూదన్ రెడ్డి, డా.సి.ఎస్.రెడ్డి, డా.గోవర్ధన రెడ్డి గార్లు ఉండేవారు. అడ్మిషన్లు పూర్తిగా ధర్మరాయ్ గారి ఆధిపత్యంలోనే ఉండేవి. అందుచేత ఆయన ఆడింది ఆట, పాడింది పాటలా ఉండేది. అంటే హాస్పిటల్‌లో అడ్మిషన్ కావాలంటే ఇంటికి వెళ్లి సమర్పించుకోవలసిందే! ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ కల్చర్ అప్పటినుండీ వుంది. నా సమస్య మందులతో పరిష్కారం అయ్యేది కాదని, శస్త్ర చికిత్స తప్పనిసరని మొదటి రోజే తేలిపోయింది. కొందరు ఆసుపత్రి పెద్దల సలహా మేరకు అన్నయ్య, డా. ధర్మరాయ్ ఇంటికివెళ్ళి రెండు వందలు సమర్పించుకున్నాక నాకు ఆర్థోపెడిక్ వార్డులో అడ్మిషన్ సులభమైంది. అప్పట్లో ఒక సాధారణ ఉద్యోగి రెండువందలు లంచం ఇవ్వడం చిన్నవిషయం కాదు!

అన్నయ్య కూతురు డా.అపర్ణ.కానేటి

అలా మూడుసార్లు సర్జరీ జరగడం, డిశ్చార్జ్ చేసినప్పుడల్లా, అన్నయ్య వెళ్లి సమర్పించుకోవడం, ఇలా షుమారు మూడు సంవత్సరాలు గడిచిపోయాయి. బాధ వల్ల నేను ఏడవడం, నన్ను చూసి మా అన్నయ్య ఏడవడం మామూలు అయింది. డా. సి.ఎస్.రెడ్డి గారు ప్రొఫెసర్ అయిన తరువాత నన్ను చాలా బాగా చూసుకునేవారు. అందుచేతనే, అన్నయ్య రాసిన ఒక నవల డాక్టర్ గారికి అంకితం చేసి కొంతవరకూ డాక్టర్ రెడ్డి గారి ఋణం తీర్చుకున్నారు అన్నయ్య. ఎన్నో ఇబ్బందులను అధిగమించి మొత్తం మీద ఇంటికి చేరుకున్నాను. అప్పట్లో అన్నయ్య మాసాబ్ ట్యాంక్ దగ్గర అద్దెకు వుండేవారు. 1970 జనవరి అనుకుంటా, అన్నయ్యకు ప్రథమ సంతానం ఆడపిల్ల పుట్టడం (డా. అపర్ణ, ఐ -స్పెషలిస్ట్), నా జబ్బు తగ్గిపోవడం జరిగాయి. ఇప్పుడు ప్రథమ కర్తవ్యం ఆగిపోయిన చదువు మీద పడింది.

అన్నయ్య, కుటుంబ సభ్యుల సలహా మేరకు ‘ఉస్మానియా మెట్రిక్యులేషన్’ చదవాలని నిర్ణయం చేసారు. నాకు కూడా అదేమంచి మార్గం అనిపించింది కానీ, ఇన్ని సంవత్సరాల గేప్ తర్వాత చదవగలనా? అన్న సంశయం కూడా రాకపోలేదు. తప్పదు కష్టపడాలి, మనం చేయదగ్గ ప్రయత్నం చేయాలి, లేకుంటే భవిష్యత్తు లేదు! అందుకని చదవడానికి నిర్ణయం తీసుకున్నాను. పట్టుదల పెంచుకున్నాను. అన్నయ్య, చింతలబస్తీ దగ్గర, ఆనందనగర్‌లో వున్న ‘గుడ్ షెపర్డ్ ట్యుటోరియల్ కాలేజీ’ యాజమాన్యంతో మాట్లాడి అందులో చేర్చారు. రోజూ మాసాబ్ ట్యాంక్ నుండి ఆనంద్ నగర్ వరకు హాయిగా నడిచివెళ్లి వస్తుండేవాడిని. కొద్దిరోజులకు గాడిలో పడ్డాను. నాకే మంచి మార్కులు వచ్చేవి. అలా 1971లో పరీక్షా రాసి ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణుడినైనను. అప్పుడు నాగార్జున సాగర్లో వున్న పెద్దక్క ఆహ్వానంతో అక్కడికెళ్లి, హిల్ కాలనీలో వున్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్‌లో ప్రవేశం పొందాను. 1972-74లో ఇంటర్మీడియెట్ పూర్తిచేశాను. మళ్ళీ అన్నయ్య సలహా మేరకు హైదరాబాద్ పయనం అయ్యాను. అప్పుడే కొత్తగా ప్రారంభమైన ఆర్ట్స్ & డిగ్రీ కళాశాలలో అడ్మిషన్ పొంది బి.ఎస్.సి.లో జాయిన్ అయ్యాను.

మెట్రిక్యులేషన్ బ్యాచ్

ఇక్కడినుండి జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభం అయిందని నాకు అనిపిస్తుంది. ఇక్కడ చదివిన మండలి బుద్ధ ప్రసాద్ (ఆర్ట్స్ గ్రూప్) తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసారు. నా సహాధ్యాయి డా. సత్యవోలు సుందర శాయి రేడియోలోనూ, దూరదర్శన్ లోను ప్రోగ్రాం ఎగ్జిక్యూయివ్‌గా పనిచేసారు. నేను ఆకాశవాణి లోనూ, దూరదర్శన్ లోను 1975 నుండి పాల్గొనే అవకాశం కల్పించింది శాయి గారే! ఇంకొక మిత్రుడు కృష్ణమోహన్ బ్యాంకు ఆఫీసర్‌గా పని చేసి రిటైర్ అయినాడు. మా స్నేహం ఇప్పటికీ కొనసాగుతూనే వుంది. రోజూ పలకరించుకుంటుంటాం.

చింతలబస్తీలో నెలకొల్పిన డిగ్రీ కళాశాలలో పేరున్న సీనియర్లు పని చేసారు. ప్రొఫెసర్ గంగప్ప (తెలుగు), డా. కోటేశ్వర రావ్ (ఆంగ్లం), డా. భవానీ శంకరం (బోటనీ) మొదలైనవారు. అయితే పూర్తి విద్యా సంవత్సరం పూర్తి కాకుండానే నాకు బి.డి.ఎస్ (దంతవైద్యం కోర్సు)లో అడ్మిషన్ దొరకడం, మధ్యలోనే కాలేజీ విడిచి వెళ్లిపోవడం జరిగింది.

నా జీవితానికి ఇది పెద్ద టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. ఆశాజనకమైన భవిష్యత్ సూచికలు అంకురించడం మొదలయింది. సరికొత్త జీవితం మొదలయింది. ఈ వృత్తి విద్యతో పాటు రచనా వ్యాసంగం కూడా ఎంతో పట్టుదలగా మెరుగుపెట్టుకోవడం జరిగింది. వ్యాసాలు రాయడం, యువవాణిలో రేడియో కార్యక్రమాలు ఊపందుకున్నాయి. 1980లో బి.డి.ఎస్. పాస్ కావడం, హౌస్ సర్జన్సీ తర్వాత, 1982లో ఆరునెలల పాటు బెల్లంపల్లిలోని సింగరేణి కాలరీస్ ఏరియా ఆసుపత్రిలో, ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వ వైద్య రంగంలో చేరి వివిధ స్థాయిల్లో దంత వైద్య విభాగాల్లో పని చేసి, 2011లో సివిల్ సర్జన్‌గా, కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో పదవీ విరమణ చేయడం జరిగింది. వైద్యుడిగానే కాక, సాహిత్యకారుడిగా కూడా మంచి పేరు తెచ్చుకోవడం జరిగింది.

ఆనాడు అలా జరిగి ఉండకపోతే, నేను ఏమయ్యి వుండేవాడినో ఆలోచిస్తే భయం పుడుతుంది. బహుశ.. ఏ సీనియర్ అసిస్టెంట్‌గా రిటైర్ అయ్యేవాడినేమో! సమస్య వల్ల కృంగిపోయి ఉంటే ఏమయ్యేవాడినో…!

అందుచేత జీవితంలో ఎన్ని బాధలు వ్యథలు ఎదురైనా, మనిషి ఆశాజీవిగా తాను చేయదగ్గ కృషి చేయాలి గాని, క్రుంగి కృశించిపోకూడదు, ఇది నాకు జీవితం నేర్పిన గొప్ప పాఠం. ఇలా నాకు గొప్ప పునర్జన్మ ఇచ్చిన వాడు ఖచ్చితంగా మా పెద్దన్నయ్య, స్వర్గీయ కె.కె.మీనన్ మాత్రమే అని చెప్పగలను!! ‘అంతయు మన మేలుకొరకే’ అన్న నానుడి ఈ నేపథ్యంలో పుట్టిందేనేమో!

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here