పలకరింత-పులకరింత..!!
[dropcap]ప[/dropcap]ల్లెల్లో రైతులూ, రైతుకూలీలూ, ఇతర వ్యక్తులూ తాము పనికి పోయినప్పుడు, పని నుండి ఇంటికి తిరిగి వెళ్ళెప్పుడూ, దారిపొడవునా తెలిసిన వారినందరినీ పలకరించుకుంటూ పోతారు. అలా చివరివరకూ మాట్లాడుకుంటూ, సమాధానాలు చెప్పుకుంటూ, హాస్యమాడుతూ.. అలా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు, తమ పరిచయాలను పునరుద్ధరించుకుంటారు. ఆత్మీయతలు పంచుకుంటారు.
మనం తెలిసినవాళ్ళు కనపడితేనే పలకరిస్తాం, కానీ కొన్ని పాశ్చాత్యదేశాలలో ముఖ్యంగా అమెరికాలో (నేను గమనించిన దేశం) తెలిసిన వాళ్ళు ఎదురొచ్చిన తెలియని వాళ్ళు ఎదురొచ్చినా, చక్కగా నవ్వుతూ ‘హాయ్’ అని పలకరిస్తారు. అది ఆ దేశపు సంస్కృతి. అక్కడ సీరియస్ ముఖాలు తక్కువ కనిపిస్తాయి.
బస్సుల్లో, రైళ్లల్లో, విమానాల్లో ప్రయాణం చేసేటప్పుడు, మన పక్కన మనవాళ్లు కాకుండా ఇతరులు కూర్చుంటే, చాలామంది మాట్లాడకుండా బిగుసుకుపోయి కూర్చుంటారు. దీనికి అమ్మాయిలు అతీతం కాదు. కొందరు స్వయంగా తమను తాము పరిచయం చేసుకుని మాటల్లోకి దింపుతారు. కొందరు పుస్తకాల గురించి, మరికొందరు రాజకీయాల గురించి, విద్యావ్యవస్థ గురించి, వైద్యరంగం గురించి, పిల్లల పెళ్ళిళ్ళ గురించి, క్రీడారంగం గురించి చర్చలు చేస్తూ కాలం గడుపుతారు. ఇలాంటి పలకరింపులతో, అతికొద్ది సమయంలోనే గొప్ప స్నేహితులు అయినవారు వున్నారు, స్నేహం ప్రేమగా మారి పెళ్లిళ్లు చేసుకున్న వారూ వున్నారు. అంటే పలకరింపుకు అంత విలువ వుంది అన్న మాట!
తెలిసిన వారిని సైతం పలకరించడానికి వెనుకాముందు లాడేవారు వున్నారు. సంస్కారం అందని/నేర్పని ఇళ్లల్లో పెరిగేవారు ఈ జాబితాలోకి వస్తారు. తెలిసిన వ్యక్తి ఎదురుపడిన, చూడనట్లు నటిస్తూ, పలకరించకుండా వడి.. వడిగా నడిచిపోయేవారూ వున్నారు. కొంతమందైతే, తెలిసినవారు ఎదురు వస్తున్నట్లు, దూరం నుంచే గమనించి తమ మార్గం మార్చుకునేవాళ్లూ వుంటారు. ఒకసారి ఒక వ్యక్తి పరిచయం అయినప్పుడు, ఆ వ్యక్తిని అప్పుడప్పుడూ పలకరించడం ద్వారా స్నేహం పటిష్టం కావడమే కాకుండా మానసిక తృప్తి మిగులుతుంది. తరువాత, ఎప్పుడు ఏ వ్యక్తితో పనిపడుతుందో తెలియదు. అందుచేత మనకు ఇష్టమైన పరిచయస్థులను,ముఖ్యంగా స్నేహితులను పలకరిస్తూ, మన స్నేహాన్నీ, పరిచయాన్నీ పునరుద్ధరించుకోవాలి.
అలాగే బంధువులనూ,శ్రేయోభిలాషులను, తప్పకుండా అప్పుడప్పుడూ పలకరించడం ద్వారా, వారితో మనకు గల బంధాలు బలపడతాయి. అవసరం అయినప్పుడే పలకరించడం, మిగతా సమయాల్లో స్తబ్దుగా ఉండిపోవడం సరైన పద్ధతి కానేకాదు. పలకరింపులో ఒక దగ్గరితనం, ఒక ఆత్మీయత, తెలియని బంధం ఏర్పడతాయి. పలకరింపుతో మనిషి మానసికంగా ఎంతో ఉత్సాహాన్ని పొందుతాడు. మన సమాజంలో చాలా మంది అవసరం అయితేనే పలకరింపులతో ముంచేస్తారు. లేకుంటే ముఖం చూడడానికి కూడా ఇష్టపడరు కొందరు.
ఇలా కాకుండా సుఖంలోనూ, దుఃఖం లోనూ పలకరింపు అనేది మనిషిని చైతన్యవంతుడిని చేయడానికీ, ఆరోగ్యంగా ఆనందంగా ఉంచడానికి ‘కేటలిస్ట్’ మాదిరిగా పనిచేస్తుంది. అది తెలియని చాలామంది ఈ పలకరింపులకు చాలా దూరంగా వుంటారు.
ఈరోజున మన ఆధునిక ప్రపంచంలో మన చుట్టూ ఉన్నవాళ్ళని మాత్రమే కాదు, ప్రపంచంలో నలుమూలలా వున్న బంధువులను, స్నేహితులనూ, శ్రేయోభిలాషులను, ఎప్పుడంటే అప్పుడు ఇష్టం వచ్చినన్ని సార్లు పలకరించుకునే వెసులుబాటు ‘మొబైల్ ఫోన్’ కలుగజేస్తున్నది. ఫేస్‌బుక్, వాట్సప్, టెలిగ్రామ్, ట్విట్టర్, వగైరా మనకు అందుబాటులోనికి వచ్చాయి. అయినా పలకరించుకునే వారు ఎందరు? ఆధునిక సదుపాయాలను సద్వినియోగం చేసుకునేదేందరు?
నా విషయం వచ్చేసరికి, నాకు ఒక్కసారి ఎవరైనా పరిచయం అయితే మరచిపోయే ప్రసక్తి లేదు. వాళ్ళని పలకరించకుండా వుండే ప్రసక్తి లేదు. అవతలివారు స్పందించినంత కాలం నేను వాళ్ళని పలకరిస్తూనే వుంటాను,వాళ్ళు ఒకవేళ స్పందించకపోతే, కొంతకాలం వరకూ నేను పలకరిస్తాను. అది నా ప్రవృత్తుల్లో ఒకటిగానే నేను భావిస్తాను.
మొబైల్ నాకు అందుబాటులోనికి వచ్చిన తర్వాత నా పలకరింపుల పర్వం విస్తృతం అయిపొయింది. వాట్సప్‌లో ‘బ్రాడ్కాస్ట్’ సహకారంతో, రోజూ మూడువందలకు పైగా ‘శుభోదయం’ పలకరింపులు వెళతాయి. అందులో – బంధువులు వుంటారు, స్నేహితులు/స్నేహితురాళ్ళు, శ్రేయోభిలాషులు, చదువు చెప్పిన గురువులు వుంటారు. ఆది నాకొక తృప్తి. ఉదయం లేవగానే నేను చేసే మొదటి పని ఇదే. అయితే నా పలకరింపులకు అందరూ స్పందించరు.
అలా అని నేను నిరుత్సాహపడను. కొందరు ‘గుడ్ మార్కింగ్/శుభోదయం’ చెబితే విసుక్కుంటారు. అలాంటి వారిని పలకరించడం మానేస్తుంటాను. వాళ్ళను ఎట్టి పరిస్థితిలోనూ ఇబ్బంది పెట్టను. వాళ్ళ సాంకేతిక ఇబ్బందులను కూడా నేను అర్థం చేసుకోగలను. ఈ నేపథ్యంలో, నాకంటే పెద్దవారూ, నాకు పాఠాలు బోధించిన ప్రొఫెసర్లు, విదేశాల్లో నివసిస్తున్న బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులూ ఫోన్ చేసి నన్ను పలకరించినప్పుడు, నా హృదయం ఆనందంతో పులకరిస్తుంది. చెప్పలేని అనుభూతిని మిగులుస్తుంది, అది అనుభవించినవారికి మాత్రమే తెలుస్తుంది. ఈ ఆధునిక సదుపాయాలు రాకముందు, దూర ప్రాంతాలలో ఉంటున్న వారిని పలకరించడానికి, యోగక్షేమాలు తెలుసుకోవడానికి, పోస్ట్-కార్డులు, ఇన్లాండ్ కవర్లు, ఎన్వలప్‌లు ఉండేవి. దూరప్రాంతాలకు టెలిఫోన్‌లో మాట్లాడడానికి సామాన్యుడికి సాధ్యం అయ్యేది కాదు. ఇప్పుడు కూడా అలవాటును బట్టి, ప్రత్యేక అభిరుచిని బట్టి కొందరు ఉత్తరాలు రాస్తున్నారు గానీ, ప్రస్తుత ఆధునిక సదుపాయాలతో క్షణాల్లో పలకరించుకునే అవకాశం ఉండడం వల్ల, వీటిముందు ఉత్తరాలు వెల వెల బోతున్నాయి. అందుకే ఇప్పుడు ఎవరూ ఉత్తరాల జోలికి పోవడం లేదు.
ఎవరు ఎక్కడ వున్నా, మాధ్యమం ఏదైనా ఒకరినొకరు పలకరించుకోవడం ముఖ్యం. చిన్న చిన్న ఘర్షణకు లోనైన భార్యాభర్తలు, లేదా స్నేహితులు పంతాలకు పోకుండా, ఎవరో ఒకరు పలకరిస్తే, గతం మర్చిపోయి ఏకమైపోయే అవకాశాలు మెండుగా ఉంటాయి. అలా కాకుండా, మొండిగా ప్రవర్తిస్తే, సయోధ్య అనేది దరిదాపుల్లోకి రాదు. పలకరించడం అంటే ఒక విధంగా దూరంగా వున్నవారికి ‘నేను బ్రతికే వున్నాను’ అని చెప్పడం. మిగతా వారికి మన ఉనికిని గుర్తు చేయడం. ఇది కొందరికి అర్థం కాదు. ఫోన్ మెసేజ్ లతో నిండిపోతుందని గగ్గోలు పెడతారుగాని, ఇతర ఎలాంటి మెసేజ్‌లు ఎన్నివచ్చినా వారికి బాధ ఉండదు. కొన్ని గమ్మత్తు మనస్తత్వాలు సమాజంలో ఉంటాయి. అలాంటివారిని పెద్దగా పట్టించుకోవలసిన అవసరం లేదేమో. ఎవరి నమ్మకాలు వారివి కదా!
నేను ఏదైనా ఒకటి రెండు రోజులు ప్రత్యేక కారణాల వల్ల పలకరించకపోతే కంగారు పడి ఫోన్ చేసే స్నేహితుల విషయంలో నాకెంత ఆనందం అనిపిస్తుందో చెప్పలేను. ఒకరినొకరు పలకరించుకోవడం కేవలం మర్యాద మాత్రమే కాదు, చెప్పలేనంత దగ్గరితనానికి మనలో మనం వేసుకునే పునాది కూడా. నన్ను నిత్యం పలకరిస్తూ, నా పలకరింపులకు ఆనందంగా స్పందిస్తున్న వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు.
పలకరింపు ఫ్యాషన్ కాదు!
పలకరింపు..
కనిపించని ఆత్మీయ కరచాలనం!!
(మళ్ళీ కలుద్దాం)