Site icon Sanchika

జ్ఞాపకాల పందిరి-132

మన పరిసరాలతో మనం..!!

[dropcap]నే[/dropcap]ను, నాది, నువ్వు, నీది, అతడు, అతడిది అనే అంశాలు మాత్రమే మనస్సులో పెట్టుకుని, మనము – మనది – అందరిదీ అన్న భావన సమాజంలోని వ్యక్తులలో కరువైనప్పుడు, ఏ విషయం అయినా స్వార్థంతో కూడుకుని, ఎంతసేపూ తమ గురించే ఆలోచిస్తారు తప్ప అందరి కోసం, అందరి సౌకర్యం కోసం, అందరి లాభనష్టాల గురించి ఆలోచించే ప్రసక్తి లేదు. అందువల్లనే మనం ఎన్నో కోల్పోతున్నాము. ఎంతో నష్టపోతున్నాం. అందరితో పాటు ఆ నష్టాన్ని మనమూ భుజాన వేసుకుంటున్నాము. అయితే అది గుర్తించకుండానే, మన పద్ధతుల్లో మనం నడుస్తున్నాము. అలా మనకు తెలియకుండానే, మనం చేస్తున్న పొరపాట్లలో, మనం మన పరిసరాలను కాపాడుకోలేక పోతున్నాము. పచ్చదనాన్ని నిలబెట్టుకోలేక పోతున్నాము. అవసరమైనంత వృక్ష సంపదను పెంచుకోలేకపోతున్నాం. వున్న వృక్షసంపదను సంరక్షించుకోలేక పోతున్నాం. స్వచ్ఛమైన గాలిని పీల్చుకోలేక పోతున్నాం. ఈ నష్టాలన్నీ మన వల్లనే మనం అనుభవిస్తున్నామని మనం ఆలోచించ లేకపోతున్నాము.

మనం మన పరిసరాలను పరిరక్షించుకోలేకపోవడం వల్ల వచ్చే అనర్థాలు సామాన్యమయినవి కాదు. సాధారణంగా, మనం మనవి కాదనుకునే ప్రదేశాల్లో మన ఇష్టం వచ్చినట్టు మనం ప్రవర్తించే ప్రదేశాల్లో ముఖ్యమైనవి, రైల్వే స్టేషన్లు, బస్సు స్టేషన్లు, పార్కులు, ఇతర బహిరంగ ప్రదేశాలూ వగైరా. ఈ ప్రదేశాల్లో, ఆధునిక జీవనం సాగిస్తున్న విద్యావంతులతో పాటు (అందరినీ అనలేము లెండి) అనాగరికులు సైతం, చెత్తా చెదారం ఎక్కడబడితే అక్కడ పారేస్తారు. ముఖ్యంగా అరటి పళ్ళు తిని, నడిచే దారిలో పారేస్తారు. అరటి తొక్క మీద కాలేస్తే ఏమౌతుందో అందరికీ తెలిసిందే! అంతమాత్రమే కాదు, అక్కడ ఈగలు, దోమలు, బొద్దింకలు, ఇతర పురుగులు చేరుకోవడమే కాక దుర్గంధం కూడా వెలువడుతుంది. శుభ్రం చేసేవాళ్ళు (స్వీపర్లు) వుంటారు అన్న ధీమాతో చాలా స్వేచ్ఛగా చెత్త పారేస్తారు. చెత్త వేసే డబ్బాలు కళ్ళకు కనిపిస్తున్నా వాటిని ఉపయోగించే సాహసం చేయరు. పరిసరాల పరిశుభ్రతలో మన బాధ్యత కూడా చాలా ఉందన్న విషయం విస్మరిస్తారు. పదిమందీ సంచరించే ప్రదేశంలో, ఇతరులకు ఇబ్బంది కలిగించే పనులు చేయకూడదన్న అవగాహన ఇంకా ప్రజల్లో రాకపోవడం బాధాకరమే! అలాగే బస్సుల్లో ప్రయాణించేవారు, చెత్త (అది ఏదైనా కావచ్చు) ఎంతో స్వేచ్ఛగా బయటికి విసిరేస్తారు. అది దూరంగా పడొచ్చు, జనసంచారం చేసే రోడ్డు మీద కూడా పడొచ్చు. అది తెలిసి చేస్తారో, తెలియక చేస్తారో తెలియదు. ఇక రైల్ కంపార్టుమెంట్లలో పరిస్థితి చెప్పనవసరం లేదు. ఎక్కువమంది కూర్చున్న చోటునే చెత్త పారేస్తారు. చిరుతిండ్లు కొనుక్కుని వాటికి సంబందించిన చెత్త అక్కడే పారేస్తారు. ప్రభుత్వ పక్షాన శుభ్రము చేసే పనివారు వున్నా, మనం సహకరించవలసిన బాధ్యత మనకుంది కదా!

ఇలా ఎందుకు ఆలోచించరో అసలు అర్థం కాదు. ఇక ప్రధాన రహదారులకు ఇరువైపులా, పాదచారులు నడవడానికి ఫుట్‌పాత్ (కాలిబాట)లు ఉంటాయి. కానీ అవి చాలా చోట్ల చిరు దుకాణదారుల కబ్జాలో ఉంటాయి. వారికి ఎవరో రాజకీయ నాయకుల అండదండలు పుష్కలంగా ఉంటాయి. అందుచేత వాళ్ళు నిర్భయంగా, వాళ్ళ బండ్లు వున్నచోట చెత్త వదిలేసి పోతారు. అరటిపళ్ళ బండ్లు వున్న చోటైతే, వినియోగదారులు కొందరు పండ్లు తిని తొక్కలు అక్కడే పారేసి పోతారు. ఈ పరిస్థితిని ఎవరూ నివారించలేకపోవడం దురదృష్టకరం.

చెత్తా చెదారం పేరుకుపోవడంతో, వాయుకాలుష్యం కూడా జరిగే పరిస్థితులు ఏర్పడతాయి. దోమల ఉత్పత్తి గణనీయంగా పెరిగి కేవలం మలేరియా జ్వరం వంటి సమస్యలే కాక ఒకరినుండి మరొకరికి అంటువ్యాధులు ప్రబలే అవకాశం వుంది. క్లీన్ సిటీలుగా అవార్డులు పొందిన కొన్ని పట్టణాల లోపలికి (కాలనీలు) వెళితే, మూత లేని మురికి కాల్వలు ప్రవహిస్తూ ఉంటాయి. అంతమాత్రమే కాదు, ఎవరి ఇంటి తిన్నగా వారు, వారి ఇంటి చెత్తను నిర్దాక్షిణ్యంగా మురికి కాల్వలలో పారవేయడం వల్ల, మురికి నీరు ప్రవాహం ఆగిపోయి, చెత్త నిల్వవుండడం వల్ల, దోమలు, ఇతర క్రిములు పెరిగి, ఆ ప్రాంతంలోని ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపించే అవకాశం వుంది. ఒకరు చేసిన పొరపాటుకు మరొకరు బలి అయ్యే అవకాశం వుంది. ఇలాంటి వాటికోసం ఎవరో వచ్చి బెత్తం పట్టుకుని నిలబడరు, ప్రజలలోనే అవగాహన రావాలి. మున్సిపాలిటీ/కార్పొరేషన్‌కు చెందిన ప్రజా ఆరోగ్య శాఖ నిత్యం ప్రజలలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. ప్రజల సహకారం లేనిదే, ఏ ప్రభుత్వ పథకమూ ఫలితాలను సాధించలేదు. భూగర్భ మురికి కాల్వల వల్ల ఈ విషయంలో ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది. మన పరిసరాలు మనమే చేతులారా పాడుచేసుకుంటున్నట్లు అవుతున్నది.

మా కాలనీలో ఓపెన్ డ్రైనేజ్ కాలువ వుంది. అది ఎప్పుడు చెత్తతో నిండి ఉంటుంది. ఎవరికీ చెంపపెట్టుగా ఉండదు. ఎవరికైనా పోరపాటున చెబితే, ‘నీకేం పని? నీ సంగతి నువ్వు చూసుకో’ అన్నట్టు చూస్తారు. పరిసరాల పరిశుభ్రత బాధ్యత ప్రజలందరిదీ అన్న విషయం అందరికీ తెలియాలి.

సాధ్యమయినంత వరకూ మా ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచే ప్రయత్నం చేస్తాను. ఇంటి చుట్టూరా తక్కువ ఖాళీ నేల ఉన్నప్పటికీ, రకరకాల మొక్కలు పెంచుతున్నాను. నా చుట్టూరా పచ్చదనాన్నీ తనివితీరా ఆస్వాదిస్తున్నాను.

రోడ్డు మీద అరటితొక్కల మీద కాలువేసి జారిపడ్డ అనుభవం నాకూ వుంది. అందుచేత ఆ విషయంలో జాగ్రత్తగా వుంటాను.

మనం ఆరోగ్యకరమైన జీవితం జీవించాలంటే, పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి. అలా ఉండడానికి మనమే బాధ్యత తీసుకోవాలన్నది తెలుసుకోవాలి. ప్రతి చిన్న విషయానికి, ఎవరో వచ్చి, ఏదో చేస్తారన్నది మరచిపోవాలి. మనకు కరోనా చూపించిన ఆరోగ్య మార్గదర్శక సూత్రాలు నిత్యమూ పాటించవలసిందే! ఈ అనుభవం భావి తరాలకు ఒక సందేశంగా మిగిలిపోవలసిందే!

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version