Site icon Sanchika

జ్ఞాపకాల పందిరి-135

విహార యాత్ర-వినోదహేల..!!

[dropcap]చి[/dropcap]న్నప్పుడు స్కూల్ స్థాయిలోనూ, కళాశాల స్థాయిలోనూ, విశ్వవిద్యాలయ స్థాయిలోనూ విహార యాత్రలు నిర్వహించేవారు. చారిత్రిక ప్రదేశమో, కట్టడమో, బొటానికల్ గార్డెన్స్ వంటివి చూపించడానికి ఆయా యాజమాన్యాలు వీటిని ఏర్పాటు చేసేవారు. ఆర్థికపరమైన ఇబ్బందులతో కొందరు ఇష్టమున్న వెళ్లలేని పరిస్థితులు వున్నప్పుడు, తల్లిదండ్రులకు నచ్చజెప్పి ఏదో రకంగా, ఆ పిల్లలు నిరుత్సాహ పడకుండా, అందరూ వెళ్లేలా చూసేవారు. దీనివల్ల అవసరమైన ఎంతో విజ్ఞానాన్ని సముపార్జించడమేగాక, మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. పిల్లల్లో చెప్పలేని చైతన్యం వస్తుంది. కొత్త విషయాలు తెలుసుకోవాలనే తృష్ణ పెరుగుతుంది. నలుగురితోనూ కలిసిపోయే పరిసితులు ఏర్పడతాయి.

బోటు నుండి దూరంగా కనిపిస్తున్న గెస్ట్ హౌస్ లు

ప్రసిద్ధ కట్టడాలను, ప్రసిద్ధ నదులను, ప్రసిద్ధమైన ప్రాంతాల గురించి వాటి వెనుక వున్న చారిత్రాత్మక నేపథ్యం గురించి చాలా మంది చదువుకోవడమే గానీ చూసి ఎరుగరు. అలాంటి వారు ప్రసిద్ధ ప్రాంతాలను చూసినప్పుడు, అక్కడి గొప్పతనం తెలుసుకున్నప్పుడు జీవితాంతం అది మనసులో ముద్ర పడిపోతుంది. అందుకే, బాల్యంలో, యుక్త వయస్సులో విహార యాత్రలకు విజ్ఞాన యాత్రలకు ప్రాధాన్యత నివ్వాలి. ఇది ముఖ్యంగా ఆయా తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి.

గెస్ట్ హౌస్ దగ్గర

కొందరు ప్రతి సంవత్సరం ఒక కొత్త ప్రాంతాన్ని చూడడానికి కుటుంబ సమేతంగా, కార్యక్రమం రూపొందించుకుంటారు. తమ సంపాదనలో దీనికోసం కొంత తప్పక కేటాయిస్తారు. ఇది చాలా మంచి అలవాటు. ప్రతిదానిని డబ్బుతో లెక్క కట్టేవారికి ఇది వినడానికి, చదవడానికి చేదుగా ఉంటుంది. వారికి ఇలాంటివి అసలు ఇష్టం ఉండదు. ఇంట్లో కూర్చుని డబ్బులు లెక్క పెట్టుకోవడమే వారి లక్ష్యం. కూపస్థమండూకాల మాదిరిగా బయటి ప్రపంచం చూడడానికి వాళ్ళు అసలు ఇష్టపడరు.

రాష్ట్ర/కేంద్ర ప్రభుత్వాలు,ఈ విషయంలో తమ ఉద్యోగుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాయి. కొన్ని నిబంధనల మేరకు ప్రభుత్వం ఉద్యోగులకు విహారయాత్రలకు అనుమతి ఇస్తున్నది. ఇలా విహార యాత్రలకు వెళ్లేవారికి ముందు కొంత డబ్బు చెల్లించడం గానీ లేదా యాత్రలు ముగిసిన తర్వాత, బిల్లులు చెల్లించిన తర్వాత డబ్బులు చెల్లించడంగానీ చేస్తుంటారు. బ్యాంకులు, ఇతర కార్పొరేషన్ల సిబ్బందికి కూడా ఈ సదుపాయం ఉండడం ఆహ్వానించదగ్గ విషయం. కొన్ని ప్రాంతాలు, ప్రదేశాలు, కట్టడాలు, ఇతర నిర్మాణాలు జీవితంలో తప్పక చూడాలి. అయితే అది వారి వారి అభిరుచిపైన ఆధార పడివుంటుంది.

గెస్ట్ హౌస్ ముందు రచయిత శ్రీమతి

చార్మినార్, కుతుబ్ మినార్, తిరుపతి, నాగార్జున సాగర్, నాగార్జున కొండ, నాగార్జునసాగర్ లోని దక్షిణ విజయపురి-మాచర్ల మార్గ మధ్యంలో వుండే ‘ఎత్తిపోతల’, మెదక్ చర్చి, వేయిస్తంభాల గుడి, రామప్ప గుడి, లక్నవరం సరస్సు, సాలార్‌జంగ్ మ్యూజియం, తాజ్ మహల్, సమ్మక్క-సారక్క జాతర, బొర్రాగుహలు, రామోజీఫిల్మ్ సిటీ, అండమాన్ దీవులు, మైసూర్ ప్యాలెస్, చండీఘర్ లోని రోజ్ గార్డెన్ ఇటువంటివి ఎంతమంది చూసివుంటారు?

గెస్ట్ హౌస్ దగ్గర సుందర దృశ్యం, శ్యాం కుమార్, శ్రీమతి లీల, శ్రీమతి అరుణ

దక్షిణ రాష్ట్రాలైన కర్ణాటక, కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాలు ఆయా రాష్ట్రాలలో వున్న ముఖ్య ప్రదేశాలను చూడడానికి వెళ్లే దర్శకులను ఆకర్షించడానికి ఆయా రాష్ట్రాల ఉద్యానవన/పర్యాటక శాఖలు అనేక సదుపాయాలు కల్పిస్తున్నాయి. దురదృష్టావశాత్తు మన రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఇది లోపించిందని చెప్పక తప్పదు. ప్రచార లోపం, సదుపాయాల లోపం కొట్టవచ్చినట్టు కనిపిస్తుంది. దినపత్రికలలో పనికిరాని ప్రకటనలు పేజీలకొద్దీ ఇచ్చే ప్రభుత్వాలు, ఆయా రాష్ట్రాలలోని ముఖ్యమైన యాత్రాస్థలాల గురించి ప్రకటనలు ఇవ్వరు. ప్రజాధనంతో స్వార్ధ ప్రయోజనాలకోసం పోటీలుపడి మరీ వృథా చేస్తారు.

శ్యామ్ కుమార్ లీల దంపతులు

కేంద్ర ప్రభుత్వ అనుమతితో, రెండు తెలుగు రాష్ట్రాలలోవున్న రేడియో/దూరదర్శన్ కేంద్రాల ద్వారా, ఆయా రాష్ట్రాలలోని దర్శనీయ స్థలాల గురించి చెప్పడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు లాభం చేకూరే అవకాశాలు కూడా లేకపోలేదు. విషయం తెలిసినప్పుడు, సదుపాయాలూ మెండుగా వున్నప్పుడు దర్శకులకు లోటుండదు. విశ్రాంతి గృహాల (గెస్ట్ హౌసెస్) అద్దె అందరికి అందుబాటులో ఉండడం కూడా ప్రధానం. దర్శనీయ స్థలాలు మెరుగు పరచడం లోను, సదుపాయాలూ సమకూర్చడంలోనూ ప్రభుత్వాలు, ఆయా శాఖలు వెనుక బడి ఉన్నాయని చెప్పక తప్పదు.

గత అక్టోబర్ నెల 27వ తేదీన నా ఇంటెర్మీడియేట్ సహాధ్యాయులు, శ్యామకుమార్-లీల దంపతులు (నిజామాబాద్), నేనూ-నా శ్రీమతి ములుగు జిల్లాలోని లక్నవరం సరస్సు చూడడానికి వెళ్ళాము. నా మిత్రుడు మా అందరికి ముందుగానే రెండు గెస్ట్ హౌస్‌లు బుక్ చేసాడు. నేను ఒక పట్టాన ఎక్కడికీ కదలను కనుక మిత్రుడు నన్ను కదిలించే ప్రయత్నం చేస్తుంటాడు. ఆ ప్రయత్నంలో ఈసారి అతనే నెగ్గాడు.

ఇద్దరూ కలసి 26 సాయంత్రమే మా ఇంటికి (నిజామాబాద్/హైదరాబాద్ నుండి) వచ్చారు. 27 ఉదయం బయలు దేరి శ్యామ్‌కుమార్ కారులోనే ‘లక్నవరం లేక్’కు వెళ్ళాము. హన్మకొండ నుండి లక్నవరం 73 కి. మీ.(45. 4 మైళ్లు). ప్రయాణ సమయం గంటన్నర పట్టవచ్చు. కానీ మేము మధ్యలో ఆగుతూ పదిన్నరకు గమ్యస్థానం చేరుకున్నాము. చుట్టూరా కొండలు, కొండల మధ్యలో పెద్ద చెరువు, జల కళతో చూపరులను ఆకట్టుకొంటున్నది. చెరువు మధ్యలో గెస్ట్ హౌస్‌లు. బోట్‌లో ప్రయాణం. గోదావరి జిల్లాలో పుట్టి పెరిగిన వాడిని, గోదావరితో, బోట్లతో అనుబంధం ఉన్నవాడిని, లక్నవరం చెరువు చూడగానే ప్రాణం లేచివచ్చినట్లయింది.

బోట్ లో రచయిత, శ్రీమతి అరుణ

గెస్ట్ హౌస్‌కి బోట్‌లో వెళ్లాలనే ఆత్రుత మొదలయింది కానీ సమయం ఇంకా వుంది. అందుకే ఒక గంట ఎదురు చూడక తప్పలేదు. అక్కడ అడిగితే తప్ప సమాచారం అందించేవాళ్ళు లేరు. సమయానికి అవసరమైన సిబ్బంది అందుబాటులో లేకపోవడం, ఇతర ప్రాంతాలనుండి ఎంతో ఆశగా వచ్చిన వారికి నిరుత్సాహం తప్పడం లేదు. పబ్లిక్ మైక్ సిస్టంలో ప్రకటనలు చేస్తే కాస్త వెసులుబాటుగా ఉండేది. మొబైల్‌కి ఫోన్ చేస్తే తప్ప సిబ్బంది స్పందించక పోవడం పర్యాటకులకు కాస్త ఇబ్బంది గానే అనిపించక తప్పదు, వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఆత్రంగా వచ్చిన వారికి అక్కడి సదుపాయాలూ ఉసూరు మనిపిస్తాయి. చెరువు మధ్యలో ద్వీపకల్పంగా వున్న ఎత్తు ప్రదేశంలో గెస్ట్ హౌస్‌లు వున్నాయి (బయట కూడా వున్నాయి చెరువులోకి వెళ్లనక్కర లేకుండా). మంచి ఆహ్లాదకరమైన,ప్రశాంత మైన,పచ్చదనంతో కళకళ లాడుతున్న ప్రదేశం. ఆనందంగా గడపడానికి అనువైన ప్రదేశం.

కానీ అక్కడికి వెళితే తినడానికీ తాగడానికి ఏమీ వుండవు. ఏమి కావాలన్నా, చెరువు అవతల ప్రదేశానికి కాల్ చేసి ఆర్డర్ ఇవ్వాలి. రేట్లు ఆకాశాన్ని అంటేవిగా వున్నాయి. ఈ విషయంలో అక్కడికి వెళ్లిన వారికి తప్పక నిరుత్సాహం కలుగుతుంది. తెలంగాణా ప్రభుత్వ పర్యాటక శాఖ నిర్లక్ష్యానికి గుర్తులుగా, గెస్ట్ హౌస్‌లకు వెళ్ళడానికి కనీసం సరైన మట్టి దారి లేకపోవడం, పరిసరాల పరిశుభ్రత లేకపోవడం, గదులలో పగిలి పోయి గుంతలుగా మారిన టైల్స్‌ను రిపేర్ చేయకపోవడం, పనిచేయని పంకాలను బాగు చేయించకపోవడం, పని చేయని ఎగ్జాస్ట్ పంకాలు రిపేర్ చేయించకపోవడం మొదలైనవి కనిపిస్తాయి. వాటి అద్దెలు కూడా ఎక్కువగా వున్నాయి, సదుపాయాలు శూన్యం. ఇవన్నీ గెస్ట్ హౌస్‌లకు చేరుకున్నాక తెలిసాయి.

కొందరు చంటి బిడ్డలతో దూరప్రాంతాలనుంచి వచ్చి ఇబ్బందులు పడ్డారు. మధ్యాహ్నం ఒంటిగంటకు గెస్ట్ హౌస్ చేరుకున్న మేము, గెస్ట్ హౌస్‌లో ఒక కప్ బోర్డు కూడా లేకపోవడం చూసి ఆశ్చర్య పోయాము. అంతంత అద్దెలు వసూలు చేసి, కనీస సదుపాయాలు కల్పించక పోవడం బాధాకరం. మన తెలుగు రాష్ట్రాల్లో పర్యాటక రంగం అంతగా ఆకర్షించ లేకపోవడానికి ఇదొక ముఖ్య కారణమే!

మేము గెస్ట్ హౌస్‌లో రాత్రి బాగానే గడిపాము. మరునాడు మధ్యాహ్నం వరకు మేము అక్కడ ఉండచ్చు, కానీ త్వరగా వచ్చేయడానికి నిశ్చయించుకున్నాము. దారిలో రామప్ప గుడి చూడవచ్చన్నది దానికి ఒక కారణం.

రామప్ప గుడి దగ్గర శ్యామ్ కుమార్

కొద్దీ సంవత్సరాల క్రితం రామప్ప గుడి మిత్రులతో కలిసి చూసినప్పటికీ, ‘వరల్డ్ హెరిటేజ్ కట్టడం’ గా గుర్తించినందువల్ల పర్యాటకశాఖ కొత్త హంగులు చేర్చిందేమోనన్న దురాశతో మళ్ళీ రామప్ప గుడికి వెళ్ళాము. కానీ అక్కడ మాకు ఎలాంటి ప్రత్యేక మార్పులు కనిపించలేదు. కొద్ది నిరాశగానే తిరిగి వచ్చాము. మాలా మరెందరో..!

రామప్ప శిల్ప కళా వైభవం
రామప్ప గుడిలో శ్యామ్ కుమార్, రచయిత
అరుణ-లీల, రామప్ప గుడి బయట

ఉభయ తెలుగు రాష్ట్రాలలో వున్న దర్శనీయస్థలాలలో, యాత్రికులకు అన్నిరకాల సదుపాయాలూ కల్పించాలి. ఆహారపదార్ధాల రేట్లు సామాన్యులకు సైతం అందుబాటులో ఉండేవిధంగా చూడాలి. అక్కడ వసతుల గురించి, అందుబాటులోవుండే రకరకాల సదుపాయాల గురించి వివిధ రూపాలలో ప్రకటనలు ఇవ్వాలి. పరిసరాలు పరిశుభ్రంగా వుండే విధంగా చర్యలు తీసుకోవాలి. మంచినీటి వసతి తప్పక కల్పించాలి. అప్పుడు యాత్రికుల సంఖ్య పెరగడమే కాదు, ప్రభుత్వ ఖజానాకు కాసుల వర్షం కూడా కురుస్తుందని చెప్పడం ఏమాత్రం అతిశయోక్తి కాదనుకుంటాను!

తిరుగు ప్రయాణంలో

మొత్తం మీద ఇంటి నాలుగు గోడల మధ్యనుంచి నన్ను – నా శ్రీమతిని బయట కు తీసుకొచ్చి, మాతో ఆనందంగా గడిపి, మాకూ ఎంతో ఆనందాన్నీ, మానసిక ప్రశాంతతను, తృప్తిని అందించిన ఘనత శ్యామ్ కుమార్ -లీల దంపతులకే దక్కుతుంది. వారి సహృదయతకు, స్నేహశీలతకు కృతజ్ఞతాంజలి ఘటిస్తూ ఈ వ్యాసం ప్రత్యేకంగా మిత్రుడు శ్యామకుమార్‌కు మిత్రమణి లీలకు అంకితం ఇస్తున్నాను.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version