[box type=’note’ fontsize=’16’] “కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే…!!” అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్. [/box]
నాకు పెళ్లయింది…!!
[dropcap]ఆ[/dropcap]సుపత్రిలో పనిచేయడం అంటే ఎన్నో గమ్మత్తయిన అనుభవాలను మూట కట్టుకోవడమే. కొన్ని అనుభవాలు మరునాడు మరచిపోయేవిగా ఉంటాయి. కొన్ని అప్పుడప్పుడు గుర్తుతెచ్చుకునేలా ఉంటాయి. మరెన్నో జీవితాంతమూ గుర్తుండిపోయేలా ఉంటాయి. అయితే కొందరికి అనుభవాలు ఎప్పటికీ, జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. జీవితంలో కొందరు వీటిని పెద్ద సీరియస్‌గా తీసుకోరు. మరికొందరు అప్పటికప్పుడే దులిపేసుకుని ఆ జ్ఞాపకాలనుండి అప్పుడే బయట పడిపోతారు.
అయితే కొన్ని సందర్భాలలో జరిగే సంఘటనలు, ఎలాంటివారికైనా గొప్ప జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. అవి మనసును కదిలించే సంఘటనలు అయిఉంటాయి. వాటిని కాదనుకుని జీవనయానాన్ని ముందుకు కొనసాగించేట్టుగా అవి వుండవు. బ్రతికినంత కాలం వాటితో కలసి పయనించవలసిందే! సంఘటనలోని సారాంశపు విలువ అంత ప్రాధాన్యతను సంతరించుకుని ఉంటుంది.
వైద్యరంగంలో ముఖ్యంగా ఆసుపత్రులలో పనిచేసే సిబ్బందికి, ఒకరితో మరొకరికి వృత్తిరీత్యా సంబంధాలు కలిగి వుంటాయి. అన్నీ కాకపోయినా కొన్ని ముఖ్యమైన పనులు కలసికట్టుగా చేయవలసి ఉంటుంది. దానితో దగ్గరితనం ఎక్కువై చనువు స్థిరపడిపోతుంది. ఇక్కడ ఆడ -మగ తేడా లేదు. అలాగే స్థాయితో కూడా పని లేదు.
ఇక్కడ ముఖ్యంగా స్త్రీ ఉద్యోగులతో, ముఖ్యంగా సిస్టర్స్ (నర్సులు) ఇతర ఉద్యోగుల మధ్య సమస్యలు ఉత్పన్నమవుతుంటాయి. కొన్ని తాత్కాలికంగా సమసిపోతే, కొన్ని సర్దుబాటుతో సమసిపోతే, మరికొన్ని జీవితాంతం ఏదో రకంగా పీడిస్తూనే వుంటాయి.
ముఖ్యంగా ఆసుపత్రులలో పనిచేసే డాక్టర్లు -నర్సుల మధ్య అఫైర్స్ లేదా అక్రమ సంబంధాల గురించి ఎక్కువగా మాట్లాడుకుంటారు. అందరినీ ఇలా జమకట్టలేము గానీ, పూర్తిగా తీసివేయలేము. కారణం… అంతగా కలిసి పని చేయవలసిన అవసరం వుండడం. అవసరం స్వేచ్ఛగా మారడం. ఆ స్వేచ్ఛ స్నేహంగా మారడం, అది ప్రేమ అనే రూపం దాల్చడం చక చక జరిగిపోతుంటాయి. అందులో పెళ్లిళ్లు చేసుకుని సుఖపడినవారి శాతం బహు తక్కువ. దీనికి కూడా కారణం లేకపోలేదు. ఒకప్పుడు నర్సింగ్ వృత్తికి పేద కుటుంబాలనుండే అమ్మాయిలు, అబ్బాయిలు వెళ్లేవారు. మగవాళ్ళని ‘మేల్ నర్స్’ అనేవారు. పేద కుటుంబాలనుండి వచ్చిన ఆడ పిల్లలకు ఆ వృత్తి గొప్ప వరంగానే ఉండేది. చీకటి జీవితంలోనుంచి వెన్నెల వెలుగు లోనికి ప్రవేశించిన భావన కలిగేది. కొత్త జీవితంలో, కొత్తబ్రతుకు కోసం ఆరాట పడే వయస్సు అది. దానిని అలుసుగా తీసుకుని, అవసరాలు తీర్చుకుని, వదిలేసిన సంఘటనలే ఎక్కువగా ఉండేవి. ఇంట్లో సమయానికి పెళ్లిళ్లు చేసే స్తొమత కూడా ఉండేది కాదు. అందుకే ఆ వయస్సులో ఎటూ తేల్చుకోలేని ఆడపిల్లలు తప్పుడు మార్గాలు ఎంచుకునేవారు.
కానీ ఇప్పటి పరిస్థితి వేరు!
నర్సింగ్‌లో అన్నివర్గాల ఆడపిల్లలు చేరుతున్నారు. నర్సింగ్ వృత్తిలోని గొప్పదనం, సేవా భావం, లేడీ నైటింగేల్ వంటి గొప్ప మహిళల జీవిత చరిత్రలు వెలుగులోనికి రావడమే కాక, ఆకర్షణీయమైన జీతభత్యాలు ఉండడం వల్ల ఇప్పుడు ఈ వృత్తికి డిమాండు పెరిగింది. జనాభాకు అవసరమైన నర్సుల అవసరం పెరిగింది. అలాగే నర్సింగ్ వృత్తికి కూడా గౌరవం పెరిగింది. ఈ రోజున డాక్టరును వివాహమాడి, డాక్టరుతో సమానంగా వైద్యం/శస్త్రచికిత్సలు చేసే నర్సులు వున్నారు. ఒకనాటి వాతావరణానికి భిన్నంగా, జడ్జీలు, లెక్చరర్లు, ఇంజనీర్లు, టీచర్లు, నర్సింగ్ వృత్తిలో వున్న అమ్మాయిలను తమ భార్యలుగా ఎంచుకుంటున్నారు. ఆనందమయ జీవితాన్ని గడుపుతున్నారు.
అయితే ఆసుపత్రిలో పనిచేసే ప్రతి నర్స్‌కి, లేదా డాక్టర్‌కి తప్పని సరిగా ఏదో అఫైర్ ఉంటుందని చెప్పడం నా ఉద్దేశం కాదు. అలా ఎదురైనా వారి అనుభవాలు చెప్పడమే నా ఉద్దేశం. ఎవరి అనుభవాలో ఎందుకు? నా అనుభవమే మీకు విన్నవిస్తాను.
నా వృత్తి విద్యా కోర్సు బి.డి.ఎస్. పాస్ అయిన తర్వాత, ఆరు నెలలు సింగరేణికి సంబందించిన బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రిలో పనిచేసి 1982 జూన్ నెలలో సర్వీస్ కమీషన్ ద్వారా ఎంపిక అయి, నాటి వరంగల్ జిల్లా మహబూబాబాద్ తాలూకా ఆసుపత్రిలో (ఇప్పుడు మహబూబాబాద్ జిల్లా అయింది) డెంటల్ అసిస్టెంట్ సర్జన్‌గా జాయిన్ అయ్యాను. అప్పుడు ఆసుపత్రి డిప్యూటీ సివిల్ సర్జన్ ఇన్‌ఛార్జ్‌గా సహృదయ మూర్తి డా. జె. సురేందర్ రెడ్డి గారు ఉండేవారు. ఇంకా డా. వై.ఆర్. అప్పారావు గారు, డా. వకుళాదేవిగారు ఉండేవారు. సీనియర్ ఫార్మసిస్ట్ బుర్హనుద్దీన్ ఉండేవారు. క్లాస్ ఫోర్ యూనియన్ లీడర్‌గా శ్రీమతి హనుమాయమ్మ ఉండేవారు. రాములు అనే కుక్ (వంట మనిషి ) ఎక్కువగా కిచెన్‌లో కాకుండా, అవుట్ పేషేంట్ ఇంజక్షన్ రూమ్‍లో, ఇంజెక్షన్‌లు ఇస్తూ కనిపించేవాడు. ఇంకా చాలామంది స్టాఫ్ ఉండేవారు గాని, వారి గురించి ప్రస్తుతం ఇక్కడ వివరించడం అప్రస్తుతం అవుతుంది.
నా డెంటల్ ఒపి రూమ్ వేరుగా ఉండేది. మొదట్లో పెద్దగా పేషేంట్స్ వచ్చేవారు కాదు. మెల్లగా అక్కడి స్టాఫ్‌కు, జనానికి, వాతావరణానికి అలవాటు పడుతున్నాను. అప్పట్లో రాడికల్ కార్యక్రమాల ప్రభావం ఆసుపత్రి మీద బాగా ఉండేది. అందుకే చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా వుండేవాడిని.
కొద్దిరోజుల తర్వాత ఒక స్టాఫ్ నర్స్ మీద నా దృష్టి పడింది. ఎలా? ఆమె ఎప్పుడూ డల్‍గా ఉండేది. నర్సులందరిలోను చిన్నవయసు గలది. చామన ఛాయలో వుండి, శరీరం ఒక అనుభవజ్ఞుడైన శిల్పి చెక్కిన అందాల శిల్ప సుందరిలా వుండి, ఎప్పుడూ నవ్వుతూ తన పని తాను చేసుకుంటూ పోతుండేది. ఆమెను నేను ప్రత్యేకంగా గమనిస్తూ వుండేవాడిని. అందరిలోనూ అమెకొక ప్రత్యేకత ఉండేది. యూనిఫామ్ లోగానీ, మాట్లాడే విధానం లోగానీ, డ్యూటీ చేయడంలోగానీ, రోగులను పలకరించడంలో గానీ, వారికి సేవలు అందించే విషయంలోగానీ, క్రమశిక్షణలో గానీ, ఇతరులకు ఆమె భిన్నంగా ఉండేది. అలాంటి అమ్మాయి – ఏదో దిగులు ఆమెను నిరంతరం వెంటాడుతున్న భావన నాకు కలిగింది. అదేమిటో తెలుసుకుని ఆమెకు చాతనయినంత సహాయం చేయాలనుకున్నాను.
ప్రతిరోజూ డ్యూటీకి రాగానే, అందరితోపాటు నాకు కూడా విష్ చేసి తన వార్డుకు తాను పోతుండేది. అదే విధంగా నన్ను విష్ చేయడానికి నా ఓ.పి.కి వచ్చింది.
“గుడ్ మార్నింగ్ సార్…!!” అని విష్ చేసింది.
“గుడ్ మార్నింగ్ సీతా! (పేరు మార్చవలసి వచ్చింది), వార్డులో నీ పని పూర్తి అయిన తర్వాత, ఒకసారి ఇక్కడకు రాగలవా?” అన్నాను ఆమె ముఖంలోకి చూస్తూ.
వెళ్ళిపోతున్నదల్లా క్షణం ఆగి “అలాగే సార్. కానీ… ఎందుకు సార్ పని ఏమైనా ఉంటే ఇప్పుడు చెప్పండి సార్ చేసి పెడతాను” అంది తల దించుకునే!
“ఇప్పుడు కాదులే సీతా… నిజంగానే నీతో చిన్న పని వుంది. నేను హాస్పిటల్ నుండి వెళ్లిపోయేముందు ఒకసారి వస్తే చాలు” అన్నాను.
“సరే సార్… పని ముగించుకుని నేను పదకొండు గంటలకి వస్తాను సార్” అంది.
“అలాగే… తప్పకుండా రావాలి సుమా…” అన్నాను.
“వస్తాను సర్… ” అని ఒకసారి నా కళ్ళల్లోకి చూసి వడి వడిగా అక్కడినుండి వెళ్ళిపోయింది.
ఆమె అన్నట్టు గానే, చెప్పిన సమయానికి వచ్చింది. ఆమె ముఖం ఉదయం కలసినప్పుడు యెంత ప్రశాంతంగా ఉందో ఇప్పుడూ అంతే ప్రశాంతంగా కనిపించింది నాకు. ఎదురుగుండా రాకుండా, పక్కన కాస్త దూరంగా నిలబడి —
“సార్… వచ్చాను సార్” అంది.
“హా… థాంక్ యు సీతా…!!” అంటూ, “అవును సీతా… మీ వూరు వరంగల్ కదా!” అన్నాను.
“కాదు సార్… విజయవాడ సర్” అంది.
“ఇక్కడ మీతో ఎవరు వుంటారు?” అన్నాను.
“నాతో తమ్ముళ్లు చెల్లెళ్లు వుంటారు సార్” అంది నేలను పరిశీలిస్తూ.
“పేరెంట్స్ లేరా?” అన్నాను. నా ప్రశ్నల వర్షానికి ఆమె నిండా తడిసిపోయింది. నేను ఇవన్నీ ఎందుకు అడుగుతున్నానో ఆమెకు అర్థం కాక కొద్దిగా కన్ఫ్యూషన్‌లో వున్నట్టుగా అనిపించింది. నా వైపు చూడకుండానే “విజయవాడలో వుంటారు సార్” అంది.
“ఇక్కడ ఎంతకాలం నుండి పనిచేస్తున్నారు?” అన్నాను కాస్త మృదువుగా.
“సార్… దయచేసి నన్ను ‘మీరు’ అని సంబోధించకండి సార్. ‘నువ్వు’ అనండి, లేకుంటే ‘సీతా’ అని పిలవండి” అంది నా వైపు చూస్తూ.
తర్వాత నేను అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ, “గత అయిదు సంవత్సరాలుగా పని చేస్తున్నా సార్” అంది.
ఆమె అందిస్తున్న కలుపుగోలు తనాన్ని ఆసరాగా తీసుకుని కొద్దిగా సాహసించి – “నీకు పెళ్లయిందా…?” అన్నాను. నా మాటకు ఒక్కసారి చురుక్కున పైకి చూసి, వెంటనే తలదించుకుని “కాలేదు సార్…!” అంది మెల్లగా.
“అయ్యో అదేంటి… చక్కగా వున్నావ్, మంచి ఉద్యోగం, నిరుత్సాహ పడలేనంత జీతం… నీకేమి తక్కువ…!!” అన్నాను కాస్త సానుభూతిగా.
“అందము, డబ్బు ఉంటే సరిపోతుందా సార్, దేనికైనా అదృష్టము కలిసిరావాలి సార్…!” అంది కాస్త దీనంగా.
“అవుననుకో… నిన్ను అందిపుచ్చుకోలేని అదృష్టవంతలే కరువైనారా? అయినా… సీతా, దేనికైనా ఒక సమయమంటూ ఉంటుంది. అది కలసి రావాలి… అంతే…!! ఆ రోజు త్వరలో వస్తుందని ఆశిద్దాం.” అని… “అప్పుడప్పుడూ… కలుస్తుండు…” అని చెప్పి పంపేసాను.
ఆమె దగ్గరితనాన్ని నేను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాను. ఆమె మాత్రం నాకు మరింత దగ్గర కావడానికి విశ్వప్రయత్నం చేస్తోందన్న విషయం నేను గమనించక పోలేదు.
ఒకరోజు నా శ్రీమతి ఇంట్లో లేని సమయం చూసి మా ఇంటికి వచ్చింది.
చెప్పొద్దూ… చెప్పలేనంత భయం వేసింది. చుట్టుపక్కల అందరూ తెలిసినవాళ్ళు. ఇంట్లో తెలిస్తే… అది పెద్ద సమస్యగా మారుతుంది. సంసారంలో చిక్కులు మొదలవుతాయి. అలా అని.. ఆ అమ్మాయిని బలవంతంగా అక్కడి నుండి వెళ్లిపొమ్మని చెప్పలేను. అందుకే కాస్త దైర్యం తెచ్చుకుని ముందు ఆమెను కుర్చీలో కూర్చోమన్నాను. ఆమె కూడా కాస్త బెరుగ్గానే కూర్చుంది.
“చెప్పు సీతా… ఏమిటి ఇలా వచ్చావ్?” అన్నాను.
“మీ గురించే సార్…” అంది, నాకళ్ళల్లోకి సూటిగా చూస్తూ.
“…నా గురించా..? చెప్పు, ఏమి కావాలి?” అన్నాను, మామూలు ధోరణిలో.
“మీరు… కావాలి…” అంది ఏ మాత్రం తడుముకోకుండా. అంతే కాదు… “మీరంటే నాకు ఎంతో ఇష్టం, మిమ్మల్ని చూడలేకుండా ఉండలేకపోతున్నా. మిమ్మల్ని ప్రేమిస్తున్నా సార్.. నాకేం తక్కువ.. అని మీరే అన్నారు కదా! నన్ను పెళ్లి చేసుకోండి…” అంది, నేలకేసి చూస్తూ..
నా మెదడు ఒక్కసారి మొద్దుబారిపోయింది..ఆమె అలా అడుగుతుంది అని నేను కలలో పొరపాటున కూడా అనుకోలేదు. అంతలోనే కాస్త తేరుకుని – “తప్పు సీతా… అలాంటి ఆలోచనలు మనసులోనుంచి తీసేయ్! నాకు పెళ్లి అయిందని, పిల్లలున్నారనీ నీకు తెలుసు. అయినా నీకు ఇలాంటి ఆలోచన వచ్చిందంటే ఏమనుకోవాలి?” అన్నాను కాస్త, మందలింపుగా.
“అన్నీ తెలుసు సార్… ఎంతమంది రెండో పెళ్లి చేసుకోవడంలేదు?” అంది కాస్త మొండిగానే. నేను ఏమీ మాట్లాడకపోవడంతో- “పెళ్లి చేసుకోకపోయినా నన్ను ‘ఉంచుకోండి’. అలా ఎంతమంది సహజీవనం చేయడం లేదూ…” అంది.
ఆమె ధైర్యానికి ఆశ్చర్యపడకుండా ఉండలేకపోయాను.
విషయం ముదరకముందే, నాదైన శైలిలో కాస్త తిట్టి మెల్లగా బయటికి పంపించేసాను. కొద్దీ రోజుల వరకూ ఆమె నావైపు రాలేదు. కానీ ఊహించని రీతిలో ఆమె మెడలో మంగళ సూత్రం ధరించి పట్టుచీర కట్టుకుని వచ్చింది. రిజిస్టర్ మేరేజ్ చేసుకుందేమోనని సంతోషించాను.
కానీ నేను ఆమెను పెళ్లి చేసుకున్నట్టుగా ప్రచారం మొదలు పెట్టింది. వాళ్ళ యూనియన్‌కు చెప్పి ధర్నాలు చేయించింది, ఇలా ఒక్కటి కాదు, యెంత అల్లరి చేయాలో అంత అల్లరి చేసింది. పేపరు వాళ్ళు పతాక శీర్షికలు రాయడానికి సిద్దపడిపోయారు.
ఇక్కడ కేవలం ప్రజల్లో నాపట్ల స్థిరపడ్డ మంచితనమే నన్ను రక్షించింది.
ఈ ఘటనలో సీతను పూర్తిగా తప్పు పట్టలేము. ఆ పరిస్థితులు ఆమెను అలా మార్చాయి. నేను కాస్త చనువుగా మాట్లాడి ఆమె బాగోగులు తెలుసుకోవడం, జీవితంలో స్థిరపడమని చెప్పడం పొరపాటు అయిందా? ఇది పాఠకులే తేల్చాలి.
ఇలాంటి సంఘటనలు ఎదురైనప్పుడు తాత్కాలిక సుఖాలకు లొంగిపోతే జీవితాంతం ఎదురయ్యే సమస్యలు మానసికంగా కృంగదీయడం మాత్రం ఖాయం. సుఖ సంసారం దుఃఖమయం కావడం తధ్యం!!
(మళ్ళీ కలుద్దాం)