జ్ఞాపకాల పందిరి-140

18
2

మద్యపానమా.. వర్ధిల్లు..!!

[dropcap]మ[/dropcap]హాత్మా గాంధీని ఎన్నో రకాలుగా కొనియాడతాం, ఎన్నో సందర్భాలలో పూజిస్తాం, పండుగలు చేస్తాం. ఆయన జ్ఞాపకార్థం, గౌరవార్థం కరెన్సీ నోట్ల మీద ఆయన ఫోటో ముద్రిస్తాము. ఆఫీసుల్లో ఆయన ఫోటో తప్పని సరి అంటాం. ఆయన సత్యవాక్కుల కోసం గొప్పగా చెప్పుకుంటాం, పిల్లల పుస్తకాలలో ఆయన జీవితం ఒక ఆదర్శ జీవితంగా తీసుకుని, పాఠ్యాంశంగా చేరుస్తాం. కానీ ఆయన బోధించిన/పాటించిన కొన్ని జీవన సూత్రాలను మాత్రం మనం నిర్భయంగా పెడచెవిని పెట్టేస్తున్నాము. ఆయన బోధించిన కొన్ని జీవనసూత్రాలలో, మద్యపాన నిషేధం ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్న ముఖ్యమైన అంశం. దురదృష్టవశాత్తు గాంధీ బోధనలు వల్లించేవారు, గాంధీ టోపీ ధరించే వారు, ఖద్దరు ధరించేవారు చాలామంది సాయంత్రానికల్లా ‘మద్యం’ చూడకుండా, త్రాగకుండా ఉండలేని దురదృష్టకర పరిస్థితులు ఏర్పడ్డాయి. పాలకులే దానికి బానిసలైన పరిస్థితి. మద్యపానం నిషేధిస్తే ఆర్థిక పరిస్థితి క్షీణించి ప్రభుత్వాలే కూలిపోయే పరిస్థితులు ఏర్పడుతుంటాయి. సామాన్యుడికి ఆశ చూపిస్తూనే, బానిసను చేస్తూనే తాగి ప్రయాణిస్తే పన్నులు వడ్డిస్తున్నాయి.

ఇంకొక వైపు, ఎన్నికల రంగంలో వివిధ పార్టీలు సాధారణ ఓటర్లు నివసించే గ్రామాలలో మద్యం వరదలై పారేలా చేసి ప్రలోభాలతో వారి జీవితాలను సర్వనాశనం చేస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ త్రాగుడులో మనమే మొనగాళ్లమని చిన్న కితాబు కూడా ఇచ్చిందట. ఈ విషయంలో మాత్రం మనం ముందంజలో ఉండడం ఎంత గొప్ప విషయం! మనల్ని పరిపాలించే పాలక పెద్దలే స్వంత లిక్కర్ కంపెనీలు పెట్టి ప్రమోట్ చేసుకుంటుంటే, ఎవరు మాత్రం ఏమి చేయగలరు? ఇది మన తెలుగు రాష్ట్రాల ప్రస్తుత ముఖచిత్రం.

నా బాల్యంలో గ్రామాలలో, తాలూకా స్థాయిలో సైతం లిక్కర్ షాపులున్న దాఖలాలు లేవు. దొంగచాటున నాటుసారా కాచి అమ్మేవారు. ఈ తయారీ కూడా ప్రజలకు దూరంగా తెలియని ప్రదేశంలో జరిగేది. అమ్మకాలు కూడా రాత్రి పూట, జరిగేవి. రోజంతా కష్టపడి పనిచేసే రైతుకూలీలు రాత్రిపూట సారా సేవించి హాయిగా సేదదీరి మరుసటి రోజు పని చేసుకోవడానికి ఫిట్‍గా తయారయ్యేవారు. కొందరైతే శ్రమించి సంపాదించిన సొమ్ము అంతా, మద్యపానానికి వినియోగించి యావత్ కుటుంబం పస్తులతో గడిపిన సందర్భాలు కూడా ఉండేవి. చేతిలో డబ్బులు లేనివారు, పెద్ద రైతుల కొబ్బరి తోటల్లో, కొబ్బరి కాయలు దొంగిలించి, వాటిని అమ్మి సారా తాగేవారు. ఇదంతా బాహాటంగా జరిగేది కాదు, అంతా దొంగచాటు వ్యవహారమే. సారాబట్టీల మీద, అప్పుడప్పుడు, సంబంధిత పోలీసులు దాడులు జరిపేవారు, అవి కూడా నామమాత్రమే ఉండేవి. మామూళ్ల వరదల్లో ఆ కేసులన్నీ కొట్టుకుపోయేవి. అయితే ఇప్పటి మాదిరిగా మొత్తం (కొన్ని కుటుంబాల అలవాటు) కుటుంబ సభ్యులు కూర్చుని తాగేట్లుగా ఉండేది కాదు. సమాజం పట్ల భయం కలిగి ఉండేవారు. జరిగేవన్నీ చీకటి ముసుగుల్లో వెలుగు చూసేవి. ఇదంతా ఒకప్పటి మాట!

ఒకప్పుడు మా గ్రామం కమ్యూనిస్టుల కంచుకోట. నియమనిబంధనలు ,క్రమశిక్షణ ఉండేది. చదువు సంధ్యల పట్ల అప్రమత్తంగా ఉండేవారు. ఎంతటి పెద్దవారైనా తమ పిల్లలు మంచిగా చదువుకుని ప్రయోజకులు కావాలని కోరుకొనేవారు. దీనికే ప్రాధాన్యతలు అధికంగా దక్కేయి. అందుకే ఎక్కువశాతం పిల్లలు చదువు పట్ల అధికంగా ఆసక్తి చూపేవారు. చదువుపట్ల ఆసక్తిలేనివారి శాతం ఎట్లాగూ అంతో ఇంతో శాతం ఉండక తప్పదు. వాళ్ళు కూలీలుగా మారిపోయేవారు.

ఇప్పటి గ్రామాల పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గ్రామాల నడిబొడ్డున అన్ని హంగులతో ఆకర్షణీయమైన ‘వైన్ షాపులు’ వెలిశాయి. ఎప్పుడంటే అప్పుడు సమయ నిబంధనలు లేకుండా కౌంటర్ అమ్మకాలు అందుబాటులోనికి వచ్చాయి. యువత క్యూ లో, నిలబడి మందు కొనుక్కుని, ముఖం కడుక్కునే పరిస్థితులు వచ్చాయి. దీనిని గ్రామీణాభివృద్ధి అందామా? ఊహిస్తే, భయంకరమైన భవిష్యత్తు మన కళ్ళ ముందు సాక్షాత్కరిస్తున్నది. రాజకీయం, ఆర్థికవనరులు, యువతను వక్రమార్గంలో నడిపిస్తున్నాయి. పెద్దలు వాళ్ళ అవసరాల దృష్ట్యా రాజకీయాలలో యువతను చొప్పించి మద్యం వంటి అలవాట్లు నేర్పించి వాళ్ళ భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. రాజకీయ బడాబాబుల వ్యాపారమే మద్యం అయినప్పుడు ఇక చెప్పేది ఏముంది?

మద్యానికి, ఇతర ఉచితాలకీ అలవాటుపడి బానిసలైన ప్రజానీకం, ఆ.. క్షణిక ప్రయోజనాలకు ఆశపడి, వారి భవిష్యత్తుని ఛిద్రం చేసుకుంటున్నారు. ప్రజలు, ముఖ్యంగా యువత ఇదంతా ఎప్పుడు గ్రహించాలి? ఈలోగా ఎన్ని సంసారాలు కూలిపోతాయి? ఎన్ని బ్రతుకులు రోడ్డున పడతాయి? ఇది ఎందుకు ఆలోచించరు? జరగవలసిన నష్టం జరిగేవరకూ అలా పిచ్చివాళ్ళల్లా ఎదురు చూడడమేనా? కాస్త ఆలోచించాలి.

ఇంత ఇలా రాసింది, నేనేదో పుణ్య పురుషుడినని నిరూపించుకోవడానికి కాదు. నేను అలా మడికట్టుకుని లేను కూడా. కళాశాల స్థాయికి వచ్చేవరకూ ఆల్కహాల్ పూర్వాపరాలు నాకు అంతగా తెలియవు. కానీ వైద్యకళాశాలలో చేరిన తర్వాత నాకూ అలవాటైంది. అలా అని ఎవరో నన్ను పాడు చేసారనే నింద ఎవరి మీదా వేయను, అది తప్పుకూడా. ఏదైనా మన చేతిలోనే ఉంటుందన్నది నా నమ్మకం. నాకు కొద్దిగా అలవాటు వున్నా నిబంధనలను ఎప్పుడూ అతిక్రమించలేదు. అలా అని నేను సమర్థించుకోవడం లేదు. సామాజిక ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఇది తప్పే! ఈ తప్పును భావితరాలు అందుకోకూడదనే ప్రయత్నమే ఈ వ్యాసానికి పునాది.

డబ్బున్నవాళ్ళు సమస్య వస్తే కనీసం పరిష్కరించుకునే మార్గాల వైపు వెతుకుతారు. కానీ పేద ప్రజల పరిస్థితి ఏమిటి? ఎంతమందికి దీనిమీద అవగాహన వుంది? ఎంతమందికి తెలుసు, మద్యపానానికి బానిసలైతే తమ భవిష్యత్తు బుగ్గి పాలు అవుతుందని?

తెలిసికూడా తెలియనట్టు ప్రవర్తిస్తున్నారు, కొందరు రాజకీయ పెద్దలు, వాళ్లకు సలహాలనిచ్చే మేధావులు. ఎంతమంది అనుభవజ్ఞులైన సలహాదారులను పెట్టుకుంటే మాత్రం ఉపయోగం ఏముంది, వారి సూచనలను ఖాతరు చేయలేనప్పుడు! అయితే, ఒకటి మాత్రం స్పష్టం ఇలాంటి వికృత చేష్టలు కలకాలం నిలిచివుండేవి కాదు. ఈవాళ కాకున్నా రేపటికైనా ప్రజలు తమకు జరుగుతున్న అన్యాయాన్ని గ్రహించి మేల్కొనక మానరు, తమ సత్తా చూపించి ఉప్పెనలా లేవక మానరు. ప్రజల జీవితాలతో ఆడుకునే రాజకీయ పెద్దలకు బుద్ధి చెప్పక మానరు. ఆరోగ్య సమాజానికి పట్టం కట్టక తప్పదు. ‘విడో–కాలనీల’ కు స్వస్తి పలుకక తప్పదు.

అప్పటి వరకూ, ఆ శుభదినం వచ్చేవరకూ, సంపూర్ణ ఆరోగ్య సమాజం ఏర్పడేవరకూ ‘మద్యపానమా..! వర్ధిల్లు..!!’.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here