జ్ఞాపకాల పందిరి-143

13
2

పొదుపు కోసం.. ‘పి.పి.ఎఫ్’..!!

[dropcap]ప్ర[/dropcap]తి మనిషికి సుఖంగా, ఆనందంగా, విలాసంగా బ్రతకాలని ఉంటుంది. ఈ కోరిక మానవ సహజం. కాదనలేము. కానీ ఇది ఎంత మందికి సాధ్యం? కోరిక ఉంటేనే సరిపోదు కదా! దానికి అవసరమైన వనరులు ఉండాలి. ధనవంతులు తమ దగ్గర వున్నడబ్బుతో ఏదైనా చేయగలరు. మరి మధ్యతరగతి వాళ్ళు అంతకంటే, క్రింది స్థాయి వాళ్ళు, ఈ కోర్కెను తీర్చుకునేది ఎలా? అయితే చాలామంది తమకు వున్నదానిలోనే సర్వ సౌఖ్యాలు అనుభవిస్తున్నామన్న భావనలో సర్దుకు పోతారు. అది కొంతవరకూ నయమే! కానీ అవకాశం వుండి సుఖ జీవనం పొందలేకపోవడం మన తప్పే అవుతుంది. తమ సంపాదన వచ్చింది వచ్చినట్టు ఖర్చు పెట్టేస్తే సాధించేది ఏముండదు. కానీ సంపాదన ఎంత తక్కువైనా మనం కొన్ని జాగ్రత్తలు పాటించగలిగితే, మనం అనుకున్నవి సాధించగలం. ఉదాహరణకు స్వంత ఇల్లు, కారు, టి.వి, వగైరా. ఇలాంటివి సామాన్యులు సైతం సాధించడానికి, అనుభవించడానికి, ముఖ్యంగా ఉద్యోగులకు ఏకైక మార్గం, ఏకైక జీవన సూత్రం ‘పొదుపు’!. పొదుపు అంటే తినడం మాని పొదుపు చేయమని కాదు. సంపాదించిన దానిలో ప్రతి నెల ఎంతో కొంత మిగిల్చి బ్యాంకులోనో, పోస్ట్ ఆఫీసులోనో, ఇతర సంస్థల లోనో దాచుకుని అది పెద్ద మొత్తం అయ్యాక, ఒక మంచి పనికి ఉపయోగించుకోవడం పొదుపు ద్వారా మనకు అంది వచ్చే మంచి సదుపాయం.

ఎంత ధనవంతులకైనా కూర్చుని తింటే, ధనం మంచులా కరిగి పోతుంది. అందుచేత ఎవరికైనా పొదుపు అనేది అవసరమే మరి! మనకు పొదుపు పథకాలు అనేకం వున్నాయి. అందులో కొన్ని వడ్డీ రేటు మీదనే కేంద్రీకృతం అయి ఉంటాయి. మరికొన్ని ఇటు వడ్డీరేటుతో పాటు, అటు ఆదాయపు పన్ను రాయితీలు అనువుగా వుండే పథకాలు ఉంటాయి. అందులో అన్ని వర్గాల వారికి అనుకూలంగా వుండే పథకాలు పొదుపును ఆశించేవారు ఎంచుకోవడం మంచిది. అలాంటి పథకాలలో అందరికీ ఉపయోగ పడేది, నేను మెచ్చినదీ ‘పి.పి.ఎఫ్’ పథకం.

‘పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్’ పథకం పెద్దలకూ, పిల్లలకూ వర్తిస్తుంది. వయసుతో పనిలేదు. లేదంటే మైనారిటీ తీరేవరకూ పిల్లల (నామినీ) అకౌంటును తల్లిదండ్రులుగాని, సంబంధిత సంరక్షకులు గాని నడిపించాలి. పిల్లలకు ఇది ఎంతో ఉపయోగకరమైన పథకం. దానికి కారణం దీని గడువు పదిహేను సంవత్సరాలు. పిల్లలు పుట్టిన వెంటనే పిల్లల పేరున ఈ పథకం రిజిస్టర్ చేయడం ద్వారా, వాళ్లకు పదిహేనేళ్ల వయసు వచ్చేనాటికి ఒక పెద్ద మొత్తాన్ని వాళ్ళకోసం కేటాయించిన తృప్తి మిగులుతుంది. వాళ్ళ అత్యవసరాలకు ఈ సొమ్ము తప్పక ఆదుకుంటుంది.

పి.పి.ఎఫ్. అకౌంట్ అన్ని చోట్ల తెరవడానికి వీలు ఉండదు. జాతీయం చేయబడ్డ అన్ని బ్యాంకుల్లోను, పెద్ద పోస్టాఫీసుల్లోను ఈ సదుపాయం అందుబాటులో వుంది. ఈ అకౌంట్ ప్రారంభంలో 500/-లతో ప్రారంభించవచ్చు. సంవత్సరంలో లక్షన్నర వరకూ డిపాజిట్ చేయవచ్చు. సంవత్సరంలో ఒక్కసారైనా ఖాతాలో కొంత డబ్బు వేయాలి.

అకౌంట్ మైనారిటీ తీరని పిల్లల పేరుమీద వున్నా ఆదాయపు పన్నుల శాఖ నిబంధనల ప్రకారము మినహాయింపు పొందగల సదుపాయాలను, పిల్లల తల్లిదండ్రులు గాని, పిల్లల సంరక్షకులు గానీ పొందవచ్చు. ఆదాయపు పన్ను కట్టవలసిన వారికి దీనివల్ల లభించే రాయితీలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.

నేను సర్వీసులో ఉన్నప్పుడు పోస్ట్ ఆఫీసులో నా పేరున ఈ అకౌంట్ తెరిచాను. ప్రతినెలా నాకు తోచినంత సొమ్ము డిపాజిట్ చేస్తుండేవాడిని. వడ్డీ రేటు 7% ఉండడం వల్ల పదిహేను సంవత్సరాలకు మంచి సొమ్ము కూడబెట్టుకోగలిగాను. అది పిల్లల కోసం ఒక మంచి పని చేయడానికి ఉపయోగపడింది.

ఇప్పుడు అంటే 2011లో పదవీ విరమణ చేసిన తర్వాత మళ్ళీ ఇదే అకౌంట్ స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (అప్పటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్) లో తెరిచాను. అదీ బాగానే నడుస్తున్నది. నా అనుకున్నవాళ్ళకి ఈ పథకం గురించి చెప్పి వాళ్ళు ఖాతా తెరిచేలా చేసాను. మా అమ్మాయి పేరు మీద ఖాతా తెరిచి ఇచ్చాను. ఇప్పుడు ఆమె తన అకౌంటును స్వంతంగా మేనేజ్ చేసుకుంటున్నది.

రచయిత నుండి పి.పి.ఎఫ్. అకౌంట్ బహుమతి పొందిన రచయిత అమ్మాయి (కుడి) నిహార కానేటి (ప్రోగ్రామ్ ఎగ్జిక్యుటివ్,ఆకాశవాణి,హైదరాబాద్)

నా సలహా మీదనే మా పెద్ద బావమరిది, మా మేన మామ కొడుకు రాజా బాబు చాలా కాలం క్రితమే ఈ అకౌంట్ తెరుచుకున్నారు.

రచయిత సూచనతో పి.పి.ఎఫ్. అకౌంట్ ఓపెన్ చేసిన రచయిత పెద్ద బావమరిది రాజబాబు పాండ్రాక (ఆఫీసర్,జీవిత భీమా సంస్థ,విజయవాడ)

ఇప్పుడు నా మనవరాలు, మనవడి కోసం ఈ ఎకౌంట్స్ తెరిచే ఆలోచనలో వున్నాను. ఇదే గొప్ప పొదుపు పథకం అని నేను బల్లగుద్ది చెప్పలేను, కానీ మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వారి కోసం, ముఖ్యంగా వారి పిల్లల కోసం ఇది తప్పకుండా మంచి పథకం అని చెప్పగలను. ఎందుచేయనంటే, ముందు కట్టవలసిన సొమ్ము అయిదు వందల రూపాయలు అయినప్పటికీ, తరువాత మన ఇష్టం వచ్చినంత జమ చేసుకోవచ్చును. అది సంవత్సరంలో ఒకటిన్నర లక్షల రూపాయలు జమ చేసుకోవచ్చును.

రచయిత వల్ల పి.పి.ఎఫ్. అకౌంట్ సభ్యుడైన బావమరిది (మేనమామ కొడుకు) రాజబాబు చొప్పల (ఆర్.టి.సి..డిపో సూపరింటెండెంట్,నర్సంపేట)

ముఖ్యంగా ఈ ఖాతా తెరవాలనుకున్నవారు, జమ చేయడం గురించి మాత్రమే ఆలోచించాలి తప్ప తీసుకోవాలనే ఆలోచన అసలు వుండకూడదు. అది గడువు పదిహేను సంవత్సరాలవరకూ కొనసాగాలి. అప్పుడే ఆ ఖాతాకు విలువ!

పొదుపు గురించి, అందులోనూ పి.పి.ఎఫ్ పథకం గురించి నేను ఇంత విపులంగా చెబుతుంటే, నా ప్రియమైన పాఠకులు నన్ను బ్రోకర్ గానో, పొదుపు పథకాల ఏజెంట్ గానో ఊహించునే ప్రమాదం ఉంది. ఒకవేళ ఎవరైనా అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే! నాకు తెలిసిన, నేను లబ్ధిపొందిన, నలుగురికీ ఉపయోగపడే పొదుపు పథకం గురించి నా అనుభవాన్ని పంచడమే ఈ వ్యాసం ముఖ్యోద్దేశం గాని మరోటి కాదు.

ధనవంతుడినని
గొప్పలు చెప్పుకోవడం
గొప్ప కాదు!
ఉన్న ఆస్తిపాస్తుల్ని కాపాడుకుని
నిలబెట్టుకున్నవాడు
అసలైన ఆస్తిపరుడు..!!

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here